||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పది ఏడవ సర్గ ||

||"తత్ తస్య్ సదృశం భవేత్ !"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తత్రింశస్సర్గః

తత్త్వదీపిక
ముప్పది ఏడవ సర్గ
తత్ తస్య్ సదృశం భవేత్ !

'తత్ తస్య సదృశం భవేత్",
అంటే అది ఆయన గౌరవానికి తగినది.
అది సందర్బానుసారముగా తగినపని లేక తగిన మాట తగిన కార్యక్రమము అవవచ్చు.
అది చాలామంది తమ హృదాయస్పదులైనవారి విషయాలలో అనుకునే మాట.
ఉదాహరణకి భార్యలు భర్తలవిషయములో ,
శిష్యులు తమ గురువుల విషయములో అనుకునే మాట.
అలాగే భర్తలు భార్యవిషయములో గురువులు తమ శిష్యుల విషయములో కూడా
అలాగే ఆలోచించే మాట, అనుకునే మాట కూడా.
ఇదే మాట ఈ సర్గలో సీతమ్మ ద్వారా వింటాము.

ఉంగర ప్రదానము తరువాత వాల్మీకి సీతను
'రామ సంకీర్తన వీత శోకా' అని వర్ణిస్తాడు.
రామ సంకీర్తన వీత శోకా ! అంటే రామసంకీర్తనతో శోకము వీడిన దేవి అని.
రాముడు తను లేకపోవడముతో కష్టాలలో వున్నాడు అన్నమాటతో,
ఆనందము దుఃఖము కలిగినా ,
రాముని సంకీర్తనతో శోకము పోయినదై,
సీత మనస్సు ముందు చేయవలసిన కార్యక్రమముపైకి మళ్ళింది.

ఆ కార్యక్రమము సీతా రాముల కలయికే.
అయితే అది రాముని కీర్తికి "సదృశముగా" అంటే అనుగుణముగా జరగాలి.
అదే 'సహ ధర్మచారిణి' సీత మనస్సులో ఎల్లప్పుడూ ఉండే మాట.
ఈ సర్గలోని సీతాహనుమంతుల సంవాదములో
హనుమంతుని నిరహంకార స్వరూపము,
సహధర్మచారిణి సీత యొక్క మనస్తత్త్వము వింటాము.

ఇక సీతా హనుమంతుల సంవాదము విందాము.

ఆ హనుమంతుని వచనములను వినిన సీత మరల హనుమంతునితో ఇట్లు పలికెను.

' ఓ వానరా ! నీవు చెప్పినట్లు రాముడు ఇంకొక ఆలోచనలేకుండా శోకములో మునిగి యున్నాడు
అన్నమాట విషముతో కూడిన అమృతములా ఉన్నది.
విధి పురుషుని తాడుతో కట్టి అత్యంత ఐశ్వర్యమునకో
దారుణమైన వ్యసనములకో తీసుకుపోవును.
ఓ ప్లవగోత్తమా ! విధి నిజముగనే బలీయము.
వ్యసనపరంపరలలో పడిన లక్ష్మణుని రాముని నన్నూ చూడుము'.

ఇక్కడ 'విధి నిజముగనే బలీయము' అన్న సీతమాటతో,
సామాన్య మానవులకు దానిని అధిగమించడము కానే కాదా అనిపించవచ్చు.
మనకి సుందరకాండలో తెలిసివచ్చేది,
హనుమంతుడి లాంటి ఆచార్యుడు సాన్నిధ్యములో ఉంటే అన్ని కష్టాలు అధిగమించవచ్చు అని.

ఇంకో మాట.
అంతరార్ధములో రాముడు పరమేశ్వర అవతారమని
సీత అయోనిజ లక్ష్మియే అని వింటాము.
అలాంటి వారుకూడా విధివశాత్తు కష్టాలలో పడ్డారు అంటే
అదే రామాయణ మూలరహస్యము.
రాముడు అవతారపురుషుడైనాకాని ,
అన్ని సుఖదుఃఖాలు సామాన్య మానవుడి రీతి ఎదుర్కొని ముందుకు ఎలాపోవాలో చూపిస్తాడు.

సీతా ఇంకా చెప్పిన మాటలు విందాము.

'సాగరములో నౌకాభంగమువలన సాగరములో నున్నవానివలే శోకసాగరములో నున్న రాముడు
ఆ సాగరపు అవతలి తీరము ఎప్పుడు చేరును?
ఎప్పుడు రాక్షసులను వధించి, రావణుని హతమార్చి,
లంకను నాశనము చేసి నన్ను నా పతిదేవుడు చూచును?

' రాముడు ఈ సంవత్సరకాలము పూర్తి కాకుండా త్వరగా రావలెను అని ఆయనకి చెప్పవలయును.
నా జీవితము అంతవరకే.
ఓ ప్లవంగమా ! దురాత్ముడగు రావణుని చేత పెట్టబడిన గడువులో ఇది పదవ మాసము గడుచుచున్నది.
మిగిలినవి రెండే మాసములు.
తమ్ముడగు విభీషణుడు నన్ను రామునకు అప్పగించవలనను ప్రయత్నములో ఉన్నవాడు.
అది రావణుని బుద్ధిలోకి రాలేదు.
నన్నుతిరిగి అప్పగించుట రావణునికి ఇష్టము లేదు.
కాలవశమైన రావణుడు యుద్ధములో మృత్యువు కోరుకొనుచున్నాడు.
ఓ వానరా అనలా అను పేరుగల విభీషణుని కుమార్తె
తల్లి ప్రోత్సాహముతో స్వయముగా నాకు ఇది చెప్పెను'.

' ఓ వానరశ్రేష్ఠుడా ! నాపతి తప్పక నన్ను చేరుకొనును.
నా పవిత్రమైన అంతరాత్మ రామునిలోని అనేకమైన గుణములను ఎరుగును.
ఓ వానరా ! రాఘవునిలో ఉత్సాహము పౌరుషము సత్త్వము ధైర్యసాహసములు,
అలాగే కృతజ్ఞత పరాక్రమము సౌజన్యము కలవు.
ఎవరు జనస్థానములో తమ్ముని సహాయము లేకుండా
పదునాలుగువేల రాక్షసులను హతమార్చెనో అట్టి వాడు ఇంక ఎవరిని జయించలేడు?
ఆ పురుషర్షభుడు వ్యధలతో కలత చెందడు.
పులోమజ ఇంద్రుని ప్రభావముఎరిగి నట్లు నాకు ఆయన ప్రభావము తెలుసు.
ఓ వానరా ! శూరుడైన రాముడు సూర్యునికిరణమువంటి శర జాలముతో
శత్రువులైన రాక్షస సమూహములనే జలరాశిని ఎండింపచేస్తాడు'.

ఈ మాటలను వినిన హనుమ ఆ సీతతో ఇట్లు పలికెను.

' రాఘవుడు నా మాటలు వినినవెంటనే వానర భల్లూక గణములతో కూడిన
మహత్తరమైన సైన్యముతో ఇచటికి వచ్చును.
ఓ వరాననా ! లేకపోతే ఇప్పుడే ఈ దుఃఖమునుంచి నిన్ను విడిపింపగలను.
ఓ దోషములేనిదానా నీవు నా వీపుని అధిరోహించుము.
నిన్ను నా వీపు మీద కూర్చొన బెట్టుకుని సాగరమును దాటెదను.
నాకు రావణునితో సహా లంకను మోసుకుపోగల శక్తి వున్నది.
ఓ మైథిలీ అగ్ని ఇంద్రునకు హవ్యము తీసుకుపోవునట్లు
నేను నిన్ను ప్రశ్రవణ పర్వతముపై నున్నవాని వద్దకు ఈ దినమే చేర్చగలను.
ఓ వైదేహీ దైత్యులవధకు సంసిద్ధుడైన విష్ణువు వలె
లక్ష్మణునితో కూడిన రాముని ఈ దినమే చూచెదవు.
ఐరావతము పై నున్న పురందరుని వలె
నీదర్శనముకై ఉత్సాహముతో వారు ఆశ్రమములో నున్న వారు'.

' ఓ దేవీ నా పృష్ఠము ఆరోహించుము.
ఓ శోభనే ! సంకోచము వలదు.
రోహిణి శశాంకుని పొందినట్లు నీవు రామునిపొందుటకు కృతనిశ్చయురాలివి కమ్ము.
నీవు నా పృష్ఠము ఆరోహించి చంద్రుడు సూర్యులతో సంభాషించునట్లు
ఆకాశమార్గములో పయనిస్తూ మహాసముద్రమును దాటుము.
ఓ దేవీ నిన్ను ఇచటి నుంచి తీసుకుపోవునప్పుడు
నన్ను అనుసరించి రాగల శక్తి కలవారు ఈ లంకానగరములో లేరు.
ఓ వైదేహీ నేను ఇక్కడికి వచ్చిన విధముగనే
నిన్ను సునాయాసముగా తోడ్కొని పోవగలను'.

వానరశ్రేష్ఠుని ఆ అద్భుత వచనములను వినిన సీత
సంతోషముతో పులకితురాలై హనుమంతునితో ఇట్లు పలికెను.
' ఓ హనుమా నన్ను అంత దూరము ఎట్లు తీసుకుపోగలవు.
ఓ వానర సేనానీ ఇదే నీ వానర లక్షణమునకు నిదర్శనము.
ఓ వానరర్షభ ఇంత చిన్న శరీరము కల నీవు
నన్ను ఇక్కడినుంచి నా భర్త మానవేంద్రుడు అగు రాముని వద్దకు ఎట్లు తీసుకుపోయెదవు?'

అపరిమిత బలసంపన్నుడూ మారుతాత్మజుడూ అగు హనుమంతుడు
సీతాదేవి చెప్పిన మాట, అంటే
'ఇదే నీ వానర లక్షణమునకు నిదర్శనము' అన్నమాట విని,
తనకు ఇది కొత్త పరాభవమని చింతించెను.

' ఈ అసితేక్షణకి నా ప్రభావము శక్తి తెలియదు.
అందువలన నేను పోందగల రూపము ఈ వైదేహికి చూపెదను'.
ఈ విధముగా అలోచించి అప్పుడు శత్రువులను మర్దించగల ప్లవగోత్తముడు
వైదేహికి తన నిజ స్వరూపము చూపసాగెను.

ఇక్కడ సీతమ్మకి హనుమంతుడు తన నిజస్వరూపము చూపిస్తున్నప్పుడు
మనము కూడా హనుమంతుని నిజస్వరూపము చూస్తాము.
సీతమాటలతో హనుమ పరాభవించబడినట్లు అనుకుంటాడు.
ఆ మాటలకి హనుమ అహంకారపూరితుడై క్రోధావేశముతో అనేక మాటలు చెప్పివుండవచ్చు.
కాని మనము చూచినది హనుమంతుని నిరహంకార స్వరూపము.
అది ఆచార్య స్వరూపము.
ఆచార్యుడి గుణములలో నిరహంకార స్వరూపము ఒక ముఖ్య గుణము.

అప్పుడు ధీమంతుడైన వానరుడు ఆ వృక్షమునుండి పక్కకు జరిగి
సీత యొక్క నమ్మకము పెంపొందించుటకై తన శరీర ప్రమాణము పెంచసాగెను.
ఆవానరుడు మేరు మందరపర్వత సమానముగా
ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్సు కలవాడయ్యెను.
అప్పుడు సీతా దేవి ముందర నిలచెను.
అప్పుడు పర్వతముతో సమానమైన రూపముగల ఎర్రని ముఖముకల,
వజ్రమువంటి దంతములు నఖములు కల
భయము కలగించు రూపము గల
మహాబలుడు అగు ఆ హనుమానుడు వైదేహి తో ఇట్లు పలికెను.

' ఓ దేవీ ! ఈ పర్వతములు వనములు కల,
కోటబురుజులు ప్రాకారములు గల,
ఈ లంకను దాని ప్రభువుతో సహా పెకలించి తీసుకు పోవు శక్తి నాలో కలదు.
ఓ దేవీ! నీ శంకలను వీడుము.
నీ మనస్సును కుదుటపరచుకొనుము.
ఓ వైదేహీ! లక్ష్మణుని తో కూడిన రాముని శోకములేని వాడిగా చేయుము'.

పద్మపత్రములవంటి విశాలమైన కన్నులు గల జనకాత్మజ సీత
ఆ భయంకరమైన రూపము గల మారుతియొక్క ఔరసపుత్రుని చూచి ఇట్లు పలికెను.

' ఓ మహాకపి నీ బలము సత్త్వము వాయువు వలె కల నీ వేగము
అగ్నివలె కల నీ అద్భుత తేజము తెలిసికొనుచున్నాను.
ఓ వానరపుంగవ !ఈ ఊహకు అందని అప్రమేయమైన సాగరమును దాటి
ఈ భూమికి రాగల శక్తి ఎవరికి ఉండును ?
నన్ను తీసుకు వెళ్ళగల శక్తి నీకు వున్నదని తెలిసికొనుచున్నాను.

మహాత్ములు ఆలోచించి తప్పక కార్యసిద్ధిని పొందెదరు.
ఓ కపిశ్రేష్ఠా అనఘా! కాని నీతో వెళ్ళుట యుక్తము కాదు.
వాయువేగము కల నీ వేగముతో నాకు స్పృహ పోవచ్చును.
సాగరము పై ఆకాశములో వేగముగా పోవుచూ నీ పృష్ఠమునుంచి భయముతో పడిపోవచ్చును.
తిమిరములు మొసళ్ళతో నుండు సాగరములోపడి ఆ జలచరములకు ఉత్తమమైన అన్నము అయిపోదును'.

'ఓ శత్రువులను వినాశనము చేయువాడా!
నీతో వచ్చుట మంచిది కాదు.
కళత్రవతిని అగు నన్నుతీసుకుపోవుటలో నీకు మొప్పు కలగవచ్చు.
తీసుకుపోబడుతున్న నన్ను చూచి భయంకరమైన పరాక్రమము కల రాక్షసులు
దురాత్ముడైన రావణునిచేత ఆజ్ఞాపింపబడిన వారై నిన్ను అనుసరించెదరు.
ఓ వీరుడా శూలములు ముద్గరములు చేతిలో పట్టుకొని వున్న ఆశూరులచేత చుట్టబడి
నువ్వు నా రక్షణలో సంశయములో పడెదెవు.
ఆ ఆకాశములో సాయుధులైన అనేకమంది రాక్షసులతో
నువ్వు నిరాయుధవుడుగా వారితో పోరాడుతూ నన్ను రక్షించడము ఎట్లు చేయగలవు?

ఓ కపిసత్తమ కౄరకర్మలు చేయు రాక్షసులు
నీతో యుద్ధము చేయునపుడు భయముతో నేను నీ పృష్ఠమునుంచి పడిపోవచ్చును.
ఓ కపిసత్తమ ! భయంకరులు మహత్తరమైన బలముకల రాక్షసులు
ఏదోవిధముగా నిన్ను జయించవచ్చు'.

' లేక యుద్ధములో మునిగియున్న నీకు తెలియకుండా పడిపోయిన
నన్ను పాపులైన రాక్షసులు తీసుకొని పోవచ్చు.
నీ హస్తములనుంచి నన్నుతీసుకొనిపొవచ్చు లేక నన్ను హతమార్చవచ్చు.
యుద్ధములో జయాపజయములు పరాధీనము కదా .
ఓ హరిశ్రేష్ఠ! రాక్షసులచేత అవమానమునకు గురి అయి
నేను ప్రాణత్యాగము చేసినచో నీ ప్రయత్నము విఫలము అగును'.

' నీవు రాక్షసులనందరినీ హతమార్చుటకు శక్తి కలవాడివి.
అయిననూ రాక్షసులు నీచే హతమార్చబడినచో రాముని కీర్తికి భంగము కలుగును.
లేక రాక్షసులు నన్ను మరల తీసుకొనిపోయి
వానరులు రామలక్ష్మణు లకు తెలియని ప్రదేశములో దాచిఉంచవచ్చు.
అప్పుడు నా కోసమై మొదలిడిన కార్యక్రమము భంగపడును.

నీతో కలిసి రాముడు ఇక్కడికి వచ్చుటయే మహత్తరమైన గుణములు కల పని.
ఓ మహాబలుడా ! మహాత్ముడైన రాముడు ఆయన సోదరులు నీ రాజుల జీవితము
నా జీవితముపై నిలబడి వున్నవి.
నా కోసము శోకసంతాపములలో నున్న రామలక్ష్మణులు,
అలాగే వానరగణములు నిరాశపడి ప్రాణములు త్యజించవచ్చు'.

' ఓ వానరపుంగవా! భర్తపై భక్తితో రాముని తప్ప వేరొకని శరీరము స్పృశించను.
నేను బలాత్కారముగా తీసుకురాబడి వివశురాలైనప్పుడు
నా అవయవములు తాకబడినవి.
అప్పుడు నాధుడులేని నేను ఏమి చేయగలను.

రాముడు దశగ్రీవుని బాంధవులతో సహా హతమార్చి
నన్ను ఇక్కడనుంచి తీసుకొని పోవుటయే
రాముని కీర్తికి సముచితముగా నుండును'.

ఇక్కడ సీత అన్న మాట - 'తత్ తస్య సదృశం భవేత్'.
ఏ విధముగా చూచినా ఈ మాట సీతకే చెల్లు.
ఎందుకు ?
సీతను రాముడితో క్షణములో హనుమంతుడు చేర్చవచ్చు.
కాని భర్తగా రాముడే రావణసంహారము చేసి
సీతను బంధములనుంచి విముక్తురాలను చేసి
తీసుకుపోవడమే ఆయనకి తగినపని.
అది సీత భావన.

రాముడే తీసుకుపోవడము ఉచితమనే భావనలో,
తన కష్టకాలము రాముడు వచ్చేదాకా పెరుగుతుంది అనేది చిన్న మాట.
సీత భావనలో రాముని కీర్తి ముందర తన కష్టము చిన్నదే .

రామాయణము సీతా చరితము అనడములో
ఇలాంటి మాటలే సీత యొక్క గొప్పతనమును చాటుతాయి.
తరతరాలుగా వస్తున్న సాంప్రదాయములో
భార్య భర్త యొక్క గౌరవము నిలబెట్టాలి అన్న మాట సీతమ్మ వలనే వచ్చిందనుకోవచ్చు
అదే భావనతో చాలమంది స్త్రీలు ,
తమ జీవితాంతము భర్త కోసము ఎన్నో సార్లు ఏదో చేస్తోనే వుంటారు.
'తత్ తస్య సదృశం భవేత్' అని చాలామంది స్త్రీలు
ఇప్పటికి కూడా వారి భర్త గురించి అనుకునే మాటే.
భర్తలు కూడా తమ భార్యల గురించి
'తత్ తస్య సదృశం భవేత్' అనుకొతగిన మాట.

అదే భావనతో సీతమ్మ మళ్ళీ ఇంకోసారి హనుమకి చెపుతుంది
' ఓ వానరోత్తమా ! లక్ష్మణునితో కూడి వానరసమూహముల సమేతముగా రాముని ఇక్కడ తీసుకు రమ్ము.
ఓ వానర ముఖ్యుడా ! రాముని చూచుటకై శోకములో నున్న నాకు ఆనందము కూర్చుము'.

ఈ విధముగా సీత తన మనో భావమును హనుమంతుడికి వెల్లడి చేసెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఏడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||