||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పదితొమ్మిదవ సర్గ ||

||" త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ
అథ ఏకోనచత్వారింశస్సర్గః

తత్త్వదీపిక
ముప్పదితొమ్మిదవ సర్గ
'త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం"

"త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ"
అంటే ఈ కార్యము సమకూర్చుటలో నీవే వ్యవస్థాపకుడవు"
అంటూ రాముడు తనను రక్షించే విధానము చూడుము అని నిర్దేశించిన సీత,
తన వస్త్రములో దాచి వుంచుకున్న మణిని రాముని జ్ఞాపకార్థం ఇస్తుంది హనుమంతుడికి .

ఆ మణిని తీసుకున్న హనుమ,
తను ఇంకా సీత సమక్షములో వున్నా,
మహదానంద భరితుడై తన మనస్సులో రాముడిని చేరిపోతాడుట.

సీత ఆ మణిని ఇచ్చి, ఆ మణి ప్రాధాన్యత చెపుతుంది.

"ఆనవాలుగా ఇచ్చిన ఈ అభిజ్ఞానము రామునికి బాగా తెలుసు.
రాముడు మణిని చూచి ముగ్గురను సంస్మరించును.
నన్ను, నా తల్లిని, దశరథ మహారాజుని."

ఆ మణి ప్రాధాన్యత చెప్పి,
మళ్ళీ సీత మనస్సు ముందున్న కార్యము పైకి పోతుంది.
హనుమంతుడుకి మళ్ళీ అదే మాట చెపుతుంది.

'త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం', అంటే,
'ఓ హరిసత్తమా ఈ కార్యము సమకూర్చుటలో నీవే ప్రమాణము.
నీవే ప్రయత్నించి నా దుఃఖము పోవునట్లు చేయుము.'

అంటే ఏ ప్రయత్నములు నా దుఃఖమును పోగొట్టునో,
ఆ ప్రయత్నములు నీవే ఆలోచించి చేయుము అని.
ఇక్కడ ఏ రాముని ప్రయత్నములు నా దుఃఖమును క్షీణింప చేయునో,
అవి కూడా నీవే ఆలోచించుము అని కూడా అర్థము.
అంటే ఇక్కడ సీతాదేవికి హనుమంతుడే ఈ కార్యము సాధించగలడు అనే నమ్మకము గట్టిదైపోయింది.
అందుకనే తన శోకము క్షయమొనర్చుటకు హనుమంతుడేమి చేయాలో,
అలాగే రాముడు ఏమి చేయాలోకూడా హనుమంతుడినే ఆలోచించి
రాముడి చేత చేయించ మంటుంది.
ఈ మాట మళ్ళీ మళ్ళీ చెపుతుంది.

ఈ శ్లోకము ఒక మంత్రము.
"త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమన్ యత్న మాస్థాయ దుఃఖక్షయకరో భవ"

ఈ శ్లోకము మనము గొంతెత్తి చదివితే కూడా అదే అర్థము.
అంటే " ఓ హరిసత్తమా ఈ కార్యము సమకూర్చుటలో నీవే ప్రమాణము
నీవే ప్రయత్నించి నా దుఃఖము పోవునట్లు చేయుము"
ఇది శ్లోకము గొంతెత్తి చదివినవారు,
తమ దుఃఖములను పోవునట్లు చేయుమా అని హనుమ ని ప్రార్తిస్తున్నట్లు అర్థము వస్తుంది.

అందుకని ఈ శ్లోకము మంత్రములాగా,
హనుమత్ప్రార్థన లాగ నిత్యము చదవ తగినది అంటారు పెద్దలు.
అలాగ ఈ మంత్ర ప్రార్థనతో హనుమదనుగ్రహము వలన దుఃఖములు క్షయమగును.

అలాగ సీత చెప్పిన మాట విని,
'తథేతి' అంటే అలాగే అని హనుమ ప్రతిజ్ఞ చేసి,
శిరస్సుతో వైదేహికి వందనము చేసి వెళ్ళుటకు సంక్రమించెను.

వెళ్ళుటకు సిద్ధముగానున్న మారుతాత్మజుడగు హనుమంతునితో
మైథిలి గద్గద స్వరముతో మరల ఇట్లు పలికెను.

' హనుమాన్ రామలక్ష్మణులతో కూడిన సుగ్రీవుని కుశలములు అడుగుము.
అతని మంత్రులు, వృద్ధులైన వానరులు అందరిని
ధర్మసహితమైన కుశలములను అడుగుము.
ఓ వానరశ్రేష్ఠ మహాబాహువులు కల రాఘవుడు
నన్ను ఈ దుఃఖ సంకటమునుంచి ఎట్లు రక్షించునో అట్లు నీవు చూడుము.
హనుమాన్, కీర్తిమంతుడైన రాముడు నేను జీవించియుండగనే ఎట్లు తీసుకుపోవునో
అట్టి మాటలను చెప్పి ధర్మము సాధించుము'.

'నీచే చెప్పబడిన ఉత్సాహముతో కూడిన మాటలు విని
నన్ను పొందుటకు రాఘవుని పౌరుషము వర్ధిల్లును.
వీరుడైన రాముడు నీద్వారా నా సందేశముతో కూడిన మాటలను విని
విధివత్ తన పరాక్రమముతో చేయవలసిన కార్యములను మొదలెట్టును'.

ఈ మాటలతో సీతమ్మ భారము అంతా నీదేసుమా అని చెపుతుంది హనుమకి.
సీత చెప్పిన మాటలలో సీతకి హనుమంతునిపై ఎంత విశ్వాసము వుందో అది మనకి తెలుస్తుంది.

సీతయొక్క మాటలను విని మారుతాత్మజుడగు హనుమంతుడు
శిరస్సుతో అంజలి ఘటించి జవాబుగా ఇట్లు పలికెను.

' కాకుత్‍స్థుడు వానరభల్లూక ప్రవరులతో సమేతుడై త్వరలోనే వచ్చును.
యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తొలగించును.
రాముని బాణముల ధాటికి ముందు నిలబడగల వాడు
మనుష్యులలోగాని సురాసురులలో గాని నాకు కానరావడము లేదు.
నీ కొరకై యుద్ధములో సూర్యుని పర్జన్యుని వైవస్వతుని యముని సహితము అందరిని జయించ గలడు.
ఆయన సాగరములతో చుట్టబడిన ఈ భూమి యావత్తును శాసించ గలవాడు.
ఓ జనకనందిని రాముని జయము నీకొఱకే గదా.'

జానకి హనుమంతుడు స్నేహపూర్వకముగా,
గౌరవభావముతో చెప్పిన మాటలు విని అత్యంత ఆనందము పొందెను.
అలాంటి ఆనందముతోనే వెళ్ళుటకు సిద్ధముగానున్న హనుమంతుని చూస్తూ,
మళ్ళీ మళ్ళీ ఇలా చెపుతుంది.

' ఓ వీరుడా ఒకవేళ తగును అనుకుంటే
ఒక క్షేమమైన ప్రదేశములో ఒకరోజు గడుపుము.
విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళుము.
ఓ వానరా నీ సాన్నిధ్యముతో అల్పభాగ్యముకల నాకు మహత్తరమైన ఈ శోకమునుంచి
ఒక క్షణమైనా ఉపశమనము లభించకలదు.
ఓ హరిశార్దూల నీ పునరాగమనము వఱకూ
నాప్రాణములు సంకటములో నుండును.
అందులో సందేహము లేదు'.

మాట మాటలో సీత మనస్సు ముందున్న కార్యము మీదకి పోతుంది.
ఆ ఆలోచనలలో సీతమ్మకి ఇంకో సందేహము వస్తుంది.

"ఓ వీర హరీశ్వర నీ సహాయకులు అగు వానర భల్లుక గణముల పై
నాకు మహత్తరమైన సందేహము కలుగుచున్నది.
ఆ వానరభల్లూక సైన్యములు ఆ నరవరులిద్దరూ దుష్కరమైన ఆ సాగరమును ఎట్లు దాటగలరు.
ఈ సాగరము దాటుటలో నీకు గరుత్మంతునికి వాయుదేవునకు మాత్రమే సాధ్యము కదా.
ఓ వీరుడా ఈ కష్ఠమైన పని సాధించుటకు ఏమి ఉపాయము చూస్తున్నావు.
నీవు కార్యములు సాధించుటలో దక్షత కలవాడవు.
ఓ వీరా ఈ కార్యము సాధించుటకు నీవు ఒక్కడివే చాలు,
అప్పుడు ఈ కార్యసాధనయొక్క కీర్తి నీదే అగును'.

ఈ పని ( తన దుఃఖము పోగొట్టు కార్యము)
హనుమంతుడికి సాధ్యము అని తెలుసు సీతమ్మకి.
అప్పుడు కార్య సాధన కీర్తి హనుమ కు చెల్లును.
కాని రాముడు కీర్తికి తగిన పని, రాముడే వచ్చి రావణ వధ చేసి తనను తీసుకు పోవుట.
అది ముందు చెప్పినమాటే.
అదే సీతమ్మ మనస్సులో ఉన్న మాట.
మళ్ళీ అదే మాట అంటుంది.

' యుద్ధములో రావణుని తన బలములతో సహా జయించి,
ఆ విజయముతో నన్ను తన పురమునకు తీసుకుపోయినచో అది ఆయనకు తగినపని.
శత్రువులను తపించు కాకుత్‍స్థుడు
లంకానగరమును తన శరపరంపరతో సంకులము చేసి నన్ను తీసుకుపోయినచో
అది ఆయనకు తగును.
ఆ శూరుడు అగు మహాత్ముని పరాక్రమమునికి తగునట్లు
కార్యాచరణము అగుటకు నీవు చేయుము'.

ఇక్కడ 'హనుమా రాముడు చేయవలసిన పని నీవే చేయించాలి" అనే ధ్వని గట్టిగా వినిపిస్తుంది.

హనుమంతుడు సీత మాటలను విని,
ముందు వానర భల్లుక సైన్యముల మీద కల సీత సందేహము తీరుస్తాడు.

' ఓ దేవీ ! వానర భల్లూక సైన్యములకు అధిపతి వానరశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు.
సుగ్రీవుడు నిన్ను ఆదుకోవలననే నిశ్చయములో ఉన్నవాడు.
ఓ వైదేహీ ! అతడు వేలకొలదీ వానర సైన్యములతో కలిసి
రాక్షసులను తుదముట్టించుటకు త్వరలో ఇక్కడికి వచ్చును.
పరాక్రమమే సంపదగా గల, శ్రమ ఎఱగని మహాబలులు
మనస్సులో తలచిన విధముగా పోగలవారు ఆయన ఆదేశమునకు తయారుగా వున్నారు.
వారి ఊర్ధ్వ అధో తిర్యక్ గమనములకు అడ్దులేదు.
వారు అమిత తేజస్సుగల వారు.
వారు ఎంతకష్ట మైన పని అయినా సాధించగలరు.'
వారు మహోత్సాహము కల వారు.
వారు వాయుమార్గానుసారులై సాగరములతో కూడిన భూమిని పలుసార్లు ప్రదక్షిణము చేసినవారు.
అక్కడ సుగ్రీవుని సన్నిధిలో
నా కన్నా విశిష్ఠమైనవారు సమానులూ అయిన వనవాసులు కలరు.
నా కన్న తక్కువ వారు లేనే లేరు.
నేనే ఇక్కడికి రాగలిగితే మహాబలము కల వారి సంగతి చెప్పనేల ?
విశిష్ఠమైనవారిని గాక సామాన్యులనే ఇట్టిపనులకు పంపెదరు కదా'.

ఈ సంభాషణ మొదలులో ( ముప్పది ఐదవ సర్గలో) హనుమ
రాముని గుణములు, రామ సుగ్రీవుల మైత్రి చెప్పి ,
సీతాన్వేషణలో తను నూరు యోజనముల సముద్రము దాటిన విషయము కూడా చెప్పి ,
తనపై నమ్మకము కలిగించడముకోసము తన పుట్టు పూర్వోతరాలు చెప్పి,
తను వాయుదేవునితో సమానమైన ప్రభావము కలిగినవాడని చెపుతాడు.

ఇప్పుడు వానరభల్లూక సైన్యములమీద సీతమ్మ కలిగిన సందేహము తొలగించడానికి,
సుగ్రీవుని సైన్యములో - "మత్తః ప్రత్యవరః నాస్తి" అంటే
తన కన్నా తక్కువ వారులేరని అంటాడు హనుమంతుడు.

' ఓ దేవీ అందువలన ఈ పరితాపము చాలును.
నీ శోకము నశించుగాక.
ఆ వానర సేనలు ఒక్కగంతులో లంకను చేరెదరు.
నరసింహులు మహా సత్త్వము గల రామలక్ష్మణులు ఇద్దరూ
నా పృష్ఠము పై ఎక్కి ఉదయించిన సూర్యచంద్రులవలె నీ దగ్గరకు వచ్చెదరు.
ఆ నరవరులైన వీరులు రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి
ఈ లంకానగరమును శరపరంపరలతో నాశనము చేసెదరు.'

' రఘునందనుడగు రాఘవుడు రావణుని తన గణములతో సహా హతమార్చి
నిన్ను తీసుకొని తన పురమునకు పోవును.
అది నా నమ్మకము.
నీకు భద్రము అగు గాక.
నీవు మంచి కాలముకోసము వేచియుండుము.
ప్రజ్వలిస్తున్న అగ్ని వలె ఉన్న రాముని త్వరలో చూడగలవు.
ఈ రాక్షసుడు తన బంధువర్గముతో హతమార్చబడిన పిమ్మట
రోహిణి చంద్రుని చేరినట్లు నీవు రామునితో కలిసెదవు.
అచిరకాలములో రామునిచేత రావణుడు హతమార్చబడడము చూచెదవు'.

మారుతాత్మజుడైన హనుమంతుడు వైదేహి కి ఇలా ఆశ్వాసము ఇచ్చి
వెళ్ళుటకు నిశ్చయించుకొనిన వాడై వైదేహితో మరల ఇట్లు పలికెను.

' కృతనిశ్చయులై లంకాద్వారము దగ్గర
ధనుర్ధారులై ఉపస్థితులైన శత్రుమర్దనులు అగు రామ లక్ష్మణులను త్వరలో చూచెదవు.
నఖములు దంతములు ఆయుధములుగా గల వీరులను,
సింహ శార్దూలములతో సమానమైన పరాక్రమము గల వానరేంద్రులను,
తండోప తండములుగా వున్న వానరులను త్వరలో చూసెదవు.
ఓ పూజనీయురాలా మేఘములతో కూడిన పర్వత సమానులు అగు
అనేక మంది కపిముఖ్యులను త్వరలోనే లంకా మలయ పర్వతములలో చూచెదవు'.

'రాముడు మన్మధుని బాణములచే కొట్టబడిన హృదయాంగములు కలవాడై,
సింహముచే అడ్డగింపబడిన ఏనుగవలె శాంతి లేనివాడు.
ఓ దేవి శోకముతో దుఃఖించకు.
నీ మనస్సు అప్రియము కాకుండు గాక.
శక్రుని శచీదేవి వలె నీవు కూడా అట్టి నాథుడు గలదానవు.
ఓ దేవి రాముని కంటె విశిష్ఠుడు ఎవరు?
లక్ష్మణునితో సమానుడు ఎవరు?
అగ్ని వాయువు వలెనున్న అన్నతమ్ములిద్దరూ నీకు అండగా వుండగా నీకు సందేహము వద్దు.'

' ఓ దేవి రాక్షసగణముల నివాసస్థానమైన భయంకరమైన ఈ ప్రదేశములో
నువ్వు ఎక్కువ కాలము ఉండవు.
నీ ప్రియుడు త్వరలోనే వచ్చును.
నేను వెళ్ళి సందేశము ఇచ్చువఱకు ఓర్చుకొనుము.'

ఈ మాటలతో , ప్రత్యేకముగా
" నేను వెళ్ళి సందేశము ఇచ్చువఱకు ఓర్చుకో",
అంటే ఇంక ఎక్కువ కాలము ఎదురు చూడనక్కరలేదు అని,
తను వెళ్ళి చెప్పిన వెంటనే రాముడు బయలు దేరును అని,
అలా చెపుతూ సీతమ్మ కి ఊరట కలిగిస్తాడు హనుమ.
క్షణికమైనా తన మాటలతో సీతకి శాంతి కలిగిస్తాడు.

అదే సుందరకాండ మహిమ.
సుందరకాండ చదివిన వారి మనస్సుకి శాంతి లభిస్తుంది అంటారు పెద్దలు.

సుందరకాండ ఆఖరి శ్లోకములో కూడా హనుమ ఇదే చెపుతాడు.
'జగామ శాంతిం మమమైథిలాత్మజ',
అంటే"నీ వియోగ శోకములో వున్న సీతమ్మ కి శాంతి కలిగించాను" అని.

ఈ సర్గలో జరిగినది అదే.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||