||సుందరకాండ. ||

||తత్త్వదీపిక-నలుబదియవ సర్గ ||

||"కృతార్థః మనసా జగామ"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చత్వారింశస్సర్గః

తత్త్వదీపిక
నలుబదియవ సర్గ
'కృతార్థః మనసా జగామ'

మనము ముప్పది ఎనిమిదవ సర్గలో వింటాము
'చూడామణిని తీసుకున్న హనుమంతుడు మనసా రాముని చేరెను" అని.
హనుమంతుడు వెళ్ళడానికి సన్నద్ధుడవుతున్నా
సీత మనస్సులో చెప్పవలసిన మాటలు ఇంకామెదలుతున్నాయి .
అందుకని ముప్పది తొమ్మిదవ సర్గ లో సీత మాటలుఇంకా విన్నాము.
హనుమంతుడు సీతమ్మ యొక్క అన్ని సందేహాలు తీర్చి,
'తల్లీ రామచంద్రుడు నీకోసము పరితపిస్తున్నాడు.
నా మాట వినగానే తప్పక బయలుదేరి నిన్ను విడిపిస్తాడు'
అని చెప్పి సీతమ్మకి ఊరట కలిగిస్తాడు.
అది ముప్పది తొమ్మిదవ సర్గలో విన్నాము.

ఇప్పుడు నలభైయ్యవ సర్గ మళ్ళీసీత మాటలతో మొదలవుతుంది.
అప్పుడు వాయుపుత్రుడు తన హితము కోసమై చెప్పిన వచనములు వినిన సీత
ఆనందముతో ఇలా అటుంది.

" ఓ వానరా ప్రియమైన మాటలు చెప్పగల నిన్ను చూచినతరువాత
సగము మొలకెత్తిన విత్తనము వర్షము పొందినట్లు నేను ఆనందించుచున్నాను".

సస్యము మనపూర్వీకుల జీవితముతో ఇమిడిపోయిన సత్యము.
జీవన మరణాలు జీవన సత్యము అని చెప్పడానికి
సస్యములాగా జీవిస్తాడు సస్యములాగ మరణిస్తాడు అని చెపుతాడు నాచికేతుడు కథోపనిషత్తులో.
ఇక్కడ సీతమ్మ సగము మొలకెత్తిన సస్యము తో తన స్థితికి ఉపమానము తీసుకువస్తుంది.

సగము మొలకెత్తిన సస్యము నీళ్ళు లేక ఎండిపోయే స్థితిలో వున్నప్పుడు,
వర్షము పడినంతనే ఆ ఎండిపోబోతున్న విత్తనాలు
పూర్తిగా మొలిచిన సస్యము వలె పునర్జీవనము పోందినట్లవుతాయి.
అలాగే సీతమ్మ కూడా దైవసంపన్నమైన కష్టాలలో ప్రాణ సంకట స్థితి పొంది ,
హనుమత్ దర్శనముతో పునర్జీవనము పోందినట్లు ఆనందపడుతున్నాను అంటుంది.
ఆ పునర్జీవనముతో మళ్ళీ ఆశలు కూడా పెరుగుతాయి.

సీతమ్మ తన పెరుగుతున్న ఆశలు గురించి మళ్ళీ చెపుతుంది

'శోకముతో కృశించిపోయిన నా గాత్రములు
ఆ పురుషవ్యాఘ్రముని స్పర్శానందము పొందునట్లు,
ఆయనకి నాపై దయ కలుగునట్లు చేయుము'.

'ఓ హరిగణోత్తమా ! కోపములో ఒక దర్భతో వాయసముయొక్క కంటిని హరించిన
అభిజ్ఞానమును అనవాలుగా ఇవ్వుము'.
' నా తిలకము చెదిరిపోగా "నీ చేత మణిశిలతో చెక్కిలిపై దిద్దబడిన విషయము",
నువ్వు అతనికి గుర్తు చేయుము'.

'ఓ వీరుడా "అపహరింపబడి రాక్షసులమధ్యలో నున్నసీతను ఏట్లు ఉపేక్షించుచున్నావు?"
అని నేను అడిగానని చెప్పుము'.

తనమాటలు గా ఇంకా ఇలాచెప్పమంటుంది.

'ఓ అనఘ దివ్యమైన ఈ చూడామణి నాచేత రక్షింపబడినది.
కష్టములలో దీనిని చూచి నిన్ను చూచినట్లే సంతోషపడుచున్నాను.
ఓ శ్రీమాన్ జలనిధిలో పుట్టిన దీనిని ఆనవాలుగా పంపిస్తున్నాను.
ఇంక ముందు జీవించడము కష్టము.
నేను అసహ్యమైన దుఃఖములను, ఘోరమైన రాక్షసుల వచనములను నీరాక కొరకై సహిస్తున్నాను.
ఓ నృపాత్మజ శత్రుసూదనా ఈ జీవితము ఒక మాసము ధరించెదను.
నీవు లేకుండా మాసము గడినచిన పిమ్మట జీవించను.
రాక్షసరాజు ఘోరమైన వాడు.
నాకు అతని దృష్టి సుఖము కలిగించదు.
నీ రాకలో జాప్యత విని ఒక క్షణము జీవించను'.

ఇలా కరుణారసభరమైన మాటలు విని హనుమంతుడు మళ్ళీ సీతమ్మకి చెపుతాడు..

' ఓ దేవీ నీ శోకముతో రాముడు అన్నివిషయములలో విముఖుడై ఉన్నాడు.
నిజము చెప్పుచున్నాను వినుము.
రాముడు దుఃఖములో ఉండుటవలన లక్ష్మణుడు పరితపిస్తున్నాడు.
ఓ భామినీ , అదృష్టము కొలదీ నీవు చూడబడినావు.
ఇప్పుడు పరితపించుటకు కాలము కాదు.
ఈ ముహూర్తమే నీ శోకముల అంతము కనిపించుచున్నది.
శత్రువులను మర్దించునట్టి ఆ పురుషవ్యాఘ్రములవంటి ఆ రాజపుత్రులిద్దరూ
నీ దర్శనమునకై గల ఉత్సాహముతో లంకానగరమును భస్మము చేసెదరు.
ఓ విశాలాక్షీ రావణుని బంధువర్గముతో కలిపి సమరములో హతమార్చి
నిన్ను రాఘవుడు తన నగరమునకు కొనిపోవును.
ఓ దోషరహితురాలా ! రామునకు ప్రీతి కలిగించు మరి ఒక అభిజ్ఞానమును ఇమ్ము'.

అప్పుడు సీతమ్మ 'నాచేత ఇవ్వబడిన అభిజ్ఞానము శ్రేష్ఠమైనది .
ఆ కేశ భూషణము చూచిన వెంటనే నీ మాటలు రాముడు శ్రద్ధగా వినును" అని చెపుతుంది..

ఆ ప్లవగసత్తముడు ఆ మణివరము ను స్వీకరించి
దేవికి శిరసా అభివాదము చేసి వెళ్ళుటకు తయారు అయ్యెను.

అప్పుడు జనకాత్మజ వెళ్ళుటకు ఉత్సాహముతో పెరిగిన ,
మహావేగము కల ఆ హరిపుంగవుని చూచి,
కన్నీళ్లతో నిండిన కళ్లతో గద్గద స్వరముతో మళ్ళీ చెపుతుంది.

' ఓ హనుమా మహాబలుడు అయిన ఆ రాఘవుడు
నన్ను ఎట్లు ఈ దుఃఖసాగరమునుంచి రక్షించునో అది నీవు చూడుము.
ఓ హరిప్రవీర! రాముని వద్దకు పోయి,
నా తీవ్రమైన శోకమును, రాక్షసుల బెదిరింపులు చెప్పుము.
నీ ప్రయాణము శుభప్రదము అగుగాక' అని.

అప్పుడు ఆ వానరుడు రాజపుత్రికయొక్క సందేశము తీసుకొని కృతార్థుడై,
మిగిలిన కార్యము గురించి ఆలోచించుచూ తాను ఉత్తరదిక్కు చేరినట్లే భావించెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలుబదియవ సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||