||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- నలభైనాలుగొవ సర్గ. ||

||"పపాతనిహతౌభూమౌజంబుమాలీ మహాబలః|"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుశ్చత్వారింశస్సర్గః||

తత్త్వదీపిక
'పపాత నిహతౌ భూమౌ జంబుమాలీ మహాబలః"

"పపాత నిహతౌ భూమౌ" అంటే
'హతమార్చబడి భూమి మీద పడ్డాడు" అని.
అది మహాబలుడైన జంబుమాలి కథ.
ఈ సర్గలో వినేది ఆ జంబుమాలి కథ.

కింకరులు చంపబడడము గురించి,
చైత్యప్రాసాద ధ్వంసము గురించి వినిన రావణుడు,
ప్రహస్తుని పుత్రుడు అయిన జంబుమాలిని ఆదేశిస్తాడు.

ఆ జంబుమాలి ఎఱ్ఱనిపూల మాలలూ వస్త్రములు ధరించినవాడు.
చెవులకు మంచి కుండలములు ధరించినవాడు.
పెద్దగా కళ్ళు గిరగిరా తిప్పుతున్నవాడు.
సమరములో దుర్జయుడు.

అతడు శక్తిమంతమైన బాణములను ప్రయోగించు, ఇంద్రధనస్సుతో పోలిన ధనస్సుతో ,
వజ్రాయుధము లాగ భయంకరమైన ధనుష్టంకారములు చేయుచూ,
వేగముగా యుద్ధమునకు బయలుదేరుతాడు.
అతని ధనస్సుయొక్క భీషణ నాదములు
అన్ని దిశలనూ ఆకాశమునూ పూర్తిగా నింపుతాయి.

యుద్ధమునకు సిద్ధముగా వుండి
వేగమే సంపదగా గల హనుమంతుడు,
గాడిదలు పూన్చిన రథముపై ఎక్కి వచ్చుచున్న
జంబుమాలిని చూచి సంతోషముతో గొప్ప నాదము చేసెను.

మహాబాహువులు కల జంబుమాలి, నిశితమైన బాణములతో
ఆ తోరణము ఎక్కి కూర్చునివున్న మహాకపిపై ప్రయోగించెను.
అర్థ చంద్రాకారము కల బాణమును ముఖము మీద ఒకటి,
వంకరములికి వున్న బాణమును శిరస్సుపై,
పది బాణములు బాహువులపై ప్రయోగించి ఆ వానరుని బాధించెను.

రాక్షస బాణములచే కొట్టబడిన హనుమంతుడు ఉద్రేకుడు అయ్యెను.
అప్పుడు తనపక్కన అతివిపులమైన శిలను చూచెను.
హనుమంతుడు ఆ శిలను పైకి ఎత్తి బలముతో విసిరెను.
ఆ రాక్షసుడు దానిని పది బాణములతో ఛిన్నాభిన్నము చేసెను.

చండవిక్రముడు వీరుడు అగు హనుమంతుడు
తన పని విఫలము కావడము చూచి,
ఒక పెద్ద సాలవృక్షమును పెకిలి దానిని గిరగిరా తిప్పసాగెను.

ఆ సాలవృక్షమును గిర గిరా తిప్పుతున్న ఆ వానరుని చూచి
మహాబలుడైన జంబుమాలి అనేక మైన బాణములను ప్రయోగించెను.
నాలుగు బాణములతో సాల వృక్షమును,
వానరుని భుజముల మీద ఐదు బాణములతో,
ఉదరముపై ఒకబాణముతో వక్షస్థలముపై పది బాణములతో బాధించెను.

శరములతో నిండిన తనువు గల హనుమంతుడు
మహత్తరమైన క్రోధముతో వేగముగా ఆపరిఘనే తీసుకొని గిర గిరా తిప్పసాగెను.

సాటిలేని పరాక్రమము గల వాడు
అతివేగము గలవాడు అగు హనుమంతుడు
పరిఘను అతివేగముగా తిప్పుచూ జంబుమాలి వక్షస్థలముపై కొట్టసాగెను.

అప్పుడు ఆ దెబ్బతో
అక్కడ జంబుమాలి శిరస్సులేదు.
బాహువులు లేవు.
జానువులు లేవు.
ధనస్సు లేదు.
రథములేదు.
అశ్వములు కూడా కనపడుటలేవు.
ఆ మహాబలవంతుడైన జంబుమాలి వానరునిచేత హతమార్చబడి,
అంగములన్నీ చూర్ణము చేయబడినవాడై భూమి మీద పడెను.

రావణుడు మహాబలవంతులైన కింకరులలాగే
జంబుమాలి కూడా హతమార్చబడడము విని
కోపముతోఎఱ్ఱబడిన కళ్ళు కలవాడు అయ్యెను.

ఆ నిశాచరేశ్వరుడు రోషముతో ఎఱ్ఱని కళ్ళు కలవాడై
మహావీరులు అగు అమాత్యపుత్రులకు వెంటనే ఆదేశము ఇస్తాడు.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో జంబుమాలి హతమార్చబడడము తో సుందరకాండలో నలభైనాలుగొవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||