||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఏబది ఐదవ సర్గ||

||"దగ్ధేయం నగరీ సర్వా !"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచపంచాశస్సర్గః||

తత్త్వదీపిక
"దగ్ధేయం నగరీ సర్వా !"
ఏబది ఐదవ సర్గ


"దగ్ధేయం నగరీ సర్వా!"
అంటే "ఆ ( లంకా) నగరమంతా దగ్ధమైంది" అని
అంతే కాదు
"సాట్టప్రాకార తోరణాత్ "
అంటే ప్రాకారాలు తోరణాలతో సహా అని.

ఇది ఎవరు చెపుతున్నారు?
ఆకాశ మార్గములో పోయే చారణులు.
అయితే ఇక్కడ ఆశ్చర్యజనకమైన విశేషము ఏమిటి?
లంక అంతా దగ్ధమైనా సీతామ్మవారు క్షేమముగా ఉన్నారుట.

ఇది విన్న హనుమ కి మనస్సు కుదుటపడుతుంది.

ఇంతకు ముందు దగ్ధమౌతున్నలంకానగరము చూస్తూ
హనుమకు కంగారుపుడుతుంది.
సీతమ్మవారు ఈ అగ్నికి ఆహుతి అయిందేమో అని.
ఆ పనికి తనని తాను నిందించికొని
తనకోపమె తనశత్రువు అన్న మాట గుర్తు చేసికొని
"సవై పురుష ఉచ్యతే" అంటూ
ఒక జీవిత రహస్యము చెపుతాడు.

"సవై పురుష ఉచ్యతే" అంటే
"వాడే పురుషుడు" అని.
ఎవడు ?
'ఎవడైతే పాము తన కుబసము విడిచినట్లు,
తనలో లేచిన తన క్రోధమును క్షమతో విడవగలడో వాడే పురుషోత్తముడు'.
అదే మనము గీతలో వింటాము.

"క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః|
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో
బుద్ధి నాశాత్ ప్రణస్యతి ||" అని

అంటే అదే మాట హనుమ తన మాటలలో మనకి చెపుతాడు.
ఇదే ఇక్కడ జరిగిన కథ

ఇదంతా ఇక మనము ఈ సర్గలో విందాము.

'న వానరోsయం స్వయమేవ కాలః' అంటే
'వీడు వానరుడుకాదు స్వయముగా కాలుడే "
అని అనిపించుకున్న హనుమ
లంకానగరము అంతయూ అగ్నిజ్వాలలతో నింపి,
తన లాంగూలము చివరలోనున్న అగ్నిని సముద్రములో ముంచి చల్లార్చి,
ఆ అగ్నిజ్వాలలో మండుతున్న లంకానగరము చూచుచూ ఆలోచించ సాగెను.

అగ్ని జ్వాలలు చూచుచున్న ఆయనకి మహత్తరమైన భయము కలిగెను.
ఎందుకు?
ఆ అగ్నిజ్వాలలలో సీతమ్మకి ఆపద సంభవించినదేమో అని.
ఆ ఆలోచనతో తనపై తనకే ఏవగింపు కలుగుతుంది.
అప్పుడు ఇలా అనుకొన్నాడు.

'లంకను దహించి నేను ఏమి చేసితిని.
ఎవరైతే పైకి లేచిన అగ్నిని నీటితో చల్లార్చినట్లు,
పైకి లేచిన క్రోధమును తమ బుద్ధితో అదుపులోకి తీసుకు రాగలరో,
వారు మహత్ములు.
వారే పురుషులలో శ్రేష్టుಲು'.

'కోపముకలవాడు ఏమి చేయడు?
కృద్ధుడు గురువులను కూడా హతమార్చకలడు.
కృద్ధ నరుడు పరుషవాచములతో సాధువులను కూడా ఆక్షేపించును.
క్రోధముతో ప్రకోపించినవాడు మాట్లాడని మాట్లాడకూడని మాటల విచక్షణాజ్ఞానము కోల్పోతాడు.
వానికి మాట్లాడకూడని మాట వుండదు.
చేయతగని పని వుండదు.
పాము తన కుబసము విడిచినట్లు
ఎవరైతే తనలో లేచిన క్రోధమును క్షమతో విడవగలడో వాడే పురుషోత్తముడు'.

ఇది నిజము అని మనము చాలాచోట్ల వింటాము.
కాని ఇది అన్నిట్లోకి ఆదికావ్యమైన రామాయణములో ముందు వచ్చినదన్నమాట.

హనుమ ఆలోచన ఇంకా ముందుకు సాగుతుంది.

'ఆ సీతను గురించి ఆలోచించకుండా లంకను అగ్నికి ఆహుతి చేసి
సిగ్గులేకుండా దుర్బుద్ధి కలవాని లాగ స్వామి ఘాతకము చేసినవాడనైతిని.
ఈ లంకా పూర్తి గా దహనమైతే ఆర్యురాలగు జానకి కూడా దగ్ధమైపోయి ఉండును.
అనాలోచనతో స్వామి కార్యము భంగపరిచితిని'.

'దేని కోసమై ఈ కార్యము ఆరంభింపబడెనో
ఆ కార్యమును భంగపరిచితిని.
లంకను దహించితిని కాని సీతను రక్షింపలేదు.

ఏ కార్యముకొఱకై వచ్చితినో
ఆ కార్యము సఫలము అగు సమయములో
క్రోధముతో మూల కార్యమునకే ముప్పు తెచ్చితిని.

తప్పక సీత నాశనమై ఉండును.
లంకలో దగ్ధము కాని ప్రదేశము కనపడుట లేదు.
నగరమంతయూ దగ్దమై నది.'

'నా ప్రజ్ఞ విఫలమై అందువలన ప్రభు కార్యము చెడిపోయినచో
నేను ఇక్కడే ప్రాణత్యాగము చేయుట సముచితమని తోచుచున్నది.
నేను ఇప్పుడే అగ్నిలో దూకి ప్రాణత్యాగము చేయనా ఏమి?
ఈ బడబాగ్నిలో దూకనా?

ఈ శరీరమును సాగరవాసు లైన జలచరములకు ఆహారముగా సమర్పించెదను.
కార్యమునంతయూ నాశనము చేసిన నేను జీవిస్తూ హరీశ్వరుడగు సుగ్రీవుని చూచుట ఎట్లు?
పురుష శార్దూలురగు వారిద్దరిని ఎట్లు చూచెదను?
నా రోషదోషముతో మూడు లోకములలో ప్రసిద్ధమైన వానరుల చపలత్వమును ఋజువు చేశాను కదా ' !

'ఛీ ! ఈ రజోగుణము అదుపులేని చపలత్వమును కలిగించును.
నిగ్రహించుకోగలనప్పటికీ నేను నా క్రోధము వలన సీతను రక్షించుకో లేకపోయాను.
సీత నష్టపోయినచో రామలక్ష్మణులు ఇద్దరూ మరణించెదరు.
వారు ఇద్దరి మరణముతో బంధువులతో కలిసి సుగ్రీవుడు మరణించును.

ఈ మాటలను విని భ్రాతువత్సలుడగు భరతుడు
ధర్మాత్నుడైన శతృఘ్నునితో సహా ఎట్లు జీవించును?
ధర్మాచరణబద్ధులైన ఇక్ష్వాకు వంశము నశించితే,
అసంశయముగా ప్రజలందరూ శోకసంతాపములతో పీడింపబడుదురు.
భాగ్యరహితుడనై ధర్మార్థములను కోల్పోయి
నేను ఈ లోకనాశనమునకు కారణమైనవాడను'.

ఈ విధముగా ఆలోచించుచున్న ఆ హనుమకు
పూర్వములో జరిగినట్లు శుభసూచనలు మళ్ళీ కనపడతాయి.
అప్పుడు ఆ హనుమ మళ్ళీ ఆలోచనలో పడతాడు.

' బహుశ ఆ మంగళప్రదురాలైన ఆమె
తన తేజసముతో రక్షింపబడెనేమో?
ఆ కల్యాణి దహింపబడదు.
అగ్ని అగ్నిని దహించలేదు కదా'.

'తన పాతివ్రత్యముచే రక్షింపబడు సీతమ్మ,
ధర్మాత్ముడు అమిత తేజసము కలవాడు అగు వాని భార్య.
అట్టి సీతమ్మను దహించుటకు పావకుడు అర్హుడుకాడు".

'సర్వము దహించు ఈ హవ్యవాహనుడు నన్ను దహించలేదు.
అది తప్పక రామప్రభావము వలనే.
వైదేహి సుకృతము ( పుణ్యము ) వలనే.

లక్ష్మణ భరతశతృఘ్నులకు దేవత అయినట్టి
రామునికి ప్రియమైన సీత ఎట్లు దహింపబడును?

సమస్త దహనకర్మలకు ప్రభువు ,
నాశనము లేని వాడు అగు ఆ అగ్ని
నా తోకను కాల్చనిచో ఈ ఆర్యురాలగు సీతను ఎట్లు దహించును ?'

అప్పుడు విస్మయుడైన హనుమంతుడు
సాగరమధ్యములో బంగారు శిఖరములు గల పర్వత దర్శనమును
అప్పుడు మరల గుర్తు చేసుకొనెను.

' తన తపస్సుచేత , భర్త తప్ప వేరొక భావనలేని సీతమ్మ,
ఆ అగ్నినే దహించకలశక్తి కలది.
ఆమెను ఆ అగ్ని దహించదు".

అప్పుడు అలాగ ఆ దేవి యొక్క ధర్మాచరణమును గురించి
ఆలోచనలో ఉన్న హనుమంతుడు చారణులవాక్యములను వినెను.

" రాక్షస భనములలో దుస్సహము భయంకరము అయిన అగ్నిని రగిల్చి,
హనుమ దుష్కరమైన కార్యమును సాధించెను.
అహో ఎంత ఆశ్చర్యము.

అటూ ఇటూ పరుగెడుతున్న రాక్షసుల
బాలురు స్త్రీలు వృద్ధులతో కూడిన జనసమూహముల
కోలాహములు ఆక్రందనలు
పర్వత గుహలలో ప్రతిధ్వనిస్తున్నాయి.

ఈ నగరము ప్రాకార తోరణములతో సహా దగ్ధమైనది.
కాని జానకి దగ్ధముకాలేదు.
ఇది ఎంత ఆశ్చర్యకరము.
ఎంత అద్భుతము".

ఆ హనుమంతుడు కనపడిన శుభసూచనలతో,
రాముని మహాగుణములతో,
జరిగిన కార్యములతో ,
చారణుల వాక్యములతో ప్రీతిచెందిన మనస్సు కలవాడయ్యెను.

అప్పుడు ఆ వానరుడు సాధించిన మనోరథము కలవాడై
ఆ సీతమ్మ క్షేమముగా వున్నదని తెలిసికొని ,
ఆమెను ప్రత్యక్షముగా చూచి
తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను.

ఈ విధముగా ఆదికావ్యమైన శ్రీమద్రామాయణములో సుందరకాండలో ఏబది ఐదవ సర్గ సమాప్తము.


|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||