||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- అరువది ఒకటవ సర్గ||

||"మహావనం నిర్విషయం చ చక్రుః"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకషష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
అరువది ఒకటవ సర్గ
" మహావనం నిర్విషయం చ చక్రుః"

"నిర్విషయం చ చక్రుః" అంటే
"ఇంకోవిషయము లేకుండా చేసేశారు" అని.
అంటే ధ్వంసము చేసారన్నమాట.
దేన్ని అంటే - మహావనం
ఆ మహావనాన్ని.

మహావనం అంటే ఇక్కడ సన్నివేశం లో "మధువనము".
ఎందుకు ఎలా ఆ మహావనము విధ్వంశమైందో
ఈ సర్గలో మనము వింటాము.

అరవయ్యవ సర్గలో జాంబవంతుని మాట,
అంటే "రాముని మనస్సులో ఎలావుందో అలా చేద్దాము " అన్నమాట,
ప్రకారము రాముని దగ్గరకు వెళదాము అని
హనుమదంగద జాంబవదాదులు ఆకాశమార్గములో పడతారు.
కాని కార్యము సాధించి ఆకాశములో ఎగురుతున్న
ఆ వానరుల మనస్సు కూడా ఎగురుతూ
మధువనము చూచి చేయవలసిన కార్యక్రమము మరచి పోతుంది.

భగవానుని దర్శనానికి పోయే మనస్సు దారితప్పడము
ఎంత సులభమో ఈ వృత్తాంతము ద్వారా మనకి తెలుస్తుంది.
భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు
ఈ చంచలమైన మనస్సుని ఎలా అదుపులో పెట్టాలి అని.
కృష్ణుడి సమాధానము ?
"అసంశయం మహాబాహో"
అసంశయముగా మనస్సుని అదుపులో పెట్టడము "దుష్కరము" అంటే కష్టము.
అయితే అది అసాధ్యముకాదు.
"అభ్యాసేన తు కౌన్తేయా"
కుంతీపుత్రుడా అది అభ్యాసముతో వస్తుంది అని.

ఇక్కడ వానరుల మధువన ఘట్టములో
హనుమ అంగదాదులు కూడా చేరడముతో
మనకి తెలిసేది మనస్సు ఎంత చంచలమో అని.
దానిని అదుపులో పెట్టడము ఎంత "దుష్కరమో" కష్టమో అని.

ఇక వాల్మీకి చెప్పిన కథ విందాము

అప్పుడు అంగదుడు మహాకపి హనుమంతుడు తదితర వానర ప్రముఖులు
రాముని వద్దకు పోయి రాముని ఆజ్ఞ ప్రకారము పోయెదము అన్న
జాంబవంతుని మాటలను అంగీకరించిరి.

అప్పుడు వానరులందరూ సంతుష్ఠ హృదయులై
మహేంద్ర పర్వతము వదిలి
వాయుపుత్రుని ముందుగా వుంచుకోని ఆకాశములోకి ఎగిరిరి.
వారు మేరు మందర పర్వతముల వలెనున్నవారు,
మహాకాయము గలవారు.
మదించిన ఏనుగులవలె నున్నవారు
మహాబలురు ఆకాశమునంతా కప్పివేయుచున్నట్లు ఉన్నవారు.

వారు సకల భూతములచే గౌరవంపబడి
మహావేగముతో పోవుచున్న ,
ఆత్మబలముకల హనుమంతుని
అతి గౌరవముతో రెప్పవేయకుండా చూస్తూ పోసాగిరి.
వారు కృతార్థులై,
రామకార్యనిరతులై,
పరమ యశస్సు పొందుటకు కోరిక కలవారై ముందుకు పోసాగిరి.

అందరూ రామునికి వార్త తెలియచేయుటకు తహ తహలాడుతున్నవారు.
అందరూ రణోత్సాహముతో ఉన్నవారు.
అందరూ మనస్సులో రామకార్యసిద్ధికి కట్టబడి యున్నవారు.

ఆ వానరులు ఆకాశములో ఎగురుతూ
అనేక చెట్లతో లతలతో కూడియున్న
నందనవనము లాగ వున్న వనము చూచిరి.
అందరికీ ప్రవేశింప సాధ్యము కాని,
అందరినుంచి రక్షింపబడిన,
అందరికి ఆహ్లాదకరమైన
ఆ సుగ్రీవుని వనము మధువనము అని పేరు గలది.

మహాత్ముడు వానరాధిపతి సుగ్రీవునియొక్క మామ ,
మహావీరుడు దధిముఖుడను వానరునిచే
ఆ మధువనము ఎల్లవేళలా రక్షింప బడుతూవున్నది.
ఆ వానరులు అందరూ ఆ వానరాధిపతికి మనసోల్లాసము కలిగించు
ఆ మహత్తరమైన వనము సమీపించి,
మధువును త్రాగవలెనని కటకటలాడిపోయారు.

అప్పుడు ఆ మధువు బోలిన పింగళ వర్ణము కల ఆ వానరులు
ఆ మహత్తరమైన మధువనము చూచి సంతోషపడి
ఆ మధువు కోసము అంగదకుమారుని అభ్యర్థించిరి.
అప్పుడు అంగదకుమారుడు జంబవదాది ప్రముఖులను సంప్రదించి,
మధుభక్షణకై వానరులకు అనుమతి ఇచ్చెను.

అప్పుడు ఆ వానరులందరూ
ఆ విధముగా అనుమతింపబడినవారై ,
అత్యధిక సంతోషముతో ప్రేరేపింపబడిన వారై
సంతోషముతో నృత్యము చేయ సాగిరి.

కొందరు గానము చేయుచుండిరి .
కొందరు వంగి నమస్కారములు పెట్టుచుండిరి.
కొందరు నృత్యము చేయుచుండిరి .
కొందరు నవ్వుచుండిరి,
కొందరు క్రింద పడుచుండిరి.
కొందరు అటూ ఇటూ పచార్లు చేయుచుండిరి.
కొందరు ఎగిరి గంతులు వేయుచుండిరి.
కొందరు ప్రలాపనలు చేయుచుండిరి.
కొందరు ఒకరినొకరితో కలిసి తిరుగుచుండిరి.
కొందరు ఒకరినొకరిపై ఎక్కుచుండిరి.
కొందరు ఒకరితోనొకరు మాట్లాడుచుండిరి.

అందులో కొందరు ఒక చెట్టునుంచి ఇంకొక చెట్టుపైకి ఎగురుచున్నవారు.
కొందరూ విరిగిన కొమ్మలమీదనుంచి దూకుచూ ఉన్నారు.
కొందరు మహవేగముతో మహీతలము నుండి మహా వృక్షముల చివరి కొమ్మలపై ఎగురుచున్నవారు.
మరికొందరు గానము చేయుచున్నవారు.
మరికొందరు నవ్వుతూ వారివద్దకు పోవుచున్నవారు.
ఆ నవ్వుతున్నవాని వద్దకు ఏడుస్తూ వున్న ఇంకొకడు వెళ్ళుతున్నాడు.
ఏడుస్తూ వున్నవాడిని ఇంకొకడు తోస్తున్నాడు.
తోసేస్తున్నవాడి దగ్గరకు ఇంకొకడు అరుస్తూ పోతున్నాడు.

మధుపానముతో వూగిపోతూ
అనేక విధమురకము లైన చేష్టలు చేయుచున్నవారితో
ఆ వానర సైన్యము నిండిపోయినది.

అచట మధువు తో మత్తెక్కని వాడుగాని,
మధువుతో తృప్తి చెందని వాడుగాని ఒక్కడు లేడు.
అప్పుడు దధి ముఖుడని పేరుగల వానరుడు,
ఆ ధ్వంసము చేయబడిన వృక్షములను పత్రపుష్పములను చూచి,
ఆ మధువును తాగుచున్న వానరులని నివారింపసాగెను.

మితిమీరి ప్రవర్తిస్తున్న వారిచేత నిర్లక్ష్యము చేయబడిన
ఆ వనరక్షకుడు అగు వృద్ధవానరుడు,
ఆ ఉగ్రతేజములో ఉన్న వానరులనుంచి ఆ వనము రక్షించుటకు,
ఇతర మార్గములగురించి ఆలోచించసాగెను.

కొందరికి పురుషవాక్యములతో చెప్పెను.
కొందరిని ఏమీ అనలేదు.
కొందరిని అరచేతులతో కొట్టెను.
కొందరితో తగువులాడెను.
కొందరితో సామోపాయము ఉపయోగించెను.

ఆ వానరులు మదముతో,
ప్రతిఘటించు వాక్యములతోనూ తమ బలము ప్రకటించుచూ
భయము లేని వారై అతని పై అనుచితముగా ప్రవర్తించిరి .

తమ తప్పును చూడకుండా ఆ వానరులందరూ అతనిని ప్రతిఘటించిరి,
ఆ వానరులందరూ గోళ్లతో రక్కిరి.
దంతములతో కొరికిరి.
చేతులతోనూ కాళ్ళతోనూ ఆ వానరును ఎదురుకొనిరి.
ఈ విధముగా వానరులందరూ ఆ వనమును ధ్వంసము చేసిరి.

ఈ విధముగా శ్రీమ ద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఒకటవ సర్గ సమాప్తము

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||