||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- అరువది రెండవ సర్గ||

||""మదాంధశ్చ న వేద""||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ద్విషష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
"మదాంధశ్చ న వేద"
అరువది రెండవ సర్గ

"మదాంధశ్చ న వేద"
మదముచే అంధులైన వాళ్ళకి తెలియదుట.
ఏమిటి తెలియదో ఈ సర్గలో వాల్మీకి ద్వారా వింటాము

సుందరకాండలో ఆచార్యుడిగా హనుమత్సౌందర్యము,
పరమాత్మనుంచి వేరైన జీవాత్మగా సీతమ్మనుచూశాము.
తత్త్వదీపికలో అది ముఖ్యమైన అంశము.
అదే కాకుండా వాల్మీకి ద్వారా
సుందరకాండలో మనకి చాలా సత్యాలు కనిపిస్తాయి.
అవి కూడా తత్త్వదీపికకు తగిన అంశాలే.

అందులో ఒకటి ఏబది ఐదవ సర్గలో హనుమ ద్వారా వాల్మీకి చెప్పినమాట.
క్రోధమును అదుపులో పెట్టక పోతే ఏమిటి అవుతుంది అని.
అది లంకా దహనమౌతూవుంటే హనుమంతుని ద్వారా వింటాము.

అలాగే ఇక్కడ మధువన ధ్వంశములో కూడా మనకి కొన్ని సత్యాలు కనిపిస్తాయి.
భగవంతుని దర్శనానికి పోతూ వున్న వానరులు మధువనము చూసి ఆగిపోవడము.
అది మన మనస్సు ఎంత చంచలమో నిరూపిస్తుంది.

అంతే కాదు ఈ సర్గలో మరింకో సంగతి వాల్మీకి ద్వారా చూస్తాము.
మదాంధులైన వానరులు ఆర్యుడు అన్న సంగతి మరచి పోయి,
దధిముఖుని క్రింద పడవేసి కొట్టడము.

సీతమ్మ అన్వేషణ జయప్రదము గా జరిగింది.
అది సీతారాముల ప్రభావము వలనేనని గ్రహించడము కూడా హనుమ ద్వారా విన్నాము.
మధువన ధ్వంశ ఘట్టములో అదంతా ఎంత సులభముగా మరచిపోతామో తెలుస్తుంది.

ముందు హనుమ ఆ వానరులకు ఆశ్వాసన ఇస్తాడు
'ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువును సేవించుడు'.
ఇంకాపైన "అహమావారయిష్యామి" -
మిమ్మలిని ఎవరైన ఆపితే వాళ్ళని నే చూస్తాను అని !

హనుమంతుని వాక్యములను వినిన అంగదుడు .
" ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు.
కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో
"అకార్యమపి కర్తవ్యం " అంటే "చేయతగని కార్యము కూడా చేయతగును".
అప్పుడు ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు". అని అంటాడు.

ఇలా అనడములో అంగదుడు, హనుమ "కృతకార్యుడు" అయినా ,
అది భగవత్కృప వలన అన్న మాట మరచిపోయాడని ధ్వని వస్తుంది.
ఆ మాట మరిచిన వాడికి అహం పైకి వస్తుంది.

దక్షిణ దిశనుంచి వస్తున్న వానరుల ద్వారా మధువన ధ్వంశము అవుతోంది అని విన్న,
సుగ్రీవుని మేన మామ దధిముఖుడు వాళ్ళని ఆపడానికి వస్తాడు.
వచ్చి కొంత మంది వానరులను తన బలముతో ఆపుతాడు.
అప్పుడు హనుమంతుడు అంగదుడు వచ్చి దధిముఖుని ఎదురుకుంటారు.

అప్పుడు అంగదుడు "అయం మమ ఆర్యకః"
అంటే "వీడు నాకు పెద్దవాడు" అన్న సంగతి మరిచిపోయి,
దధిముఖుని క్రంద పడవేసి కుమ్ముతాడు.
అక్కడ వాల్మీకి రాస్తాడు - "మదాంధశ్చ "
అంటే మదము తో అంధుడై అలాచేసాడని.

అంటే ఒక గొప్పకార్యము సాధించవలడము వలన,
ఇంకో దుష్కార్యము చేయడానికి అనుమతిలేదు.
ఆ గొప్పకార్యము భవత్కృపవలన జరిగిందని ఎవరు మరచి పోతారో
వాళ్లలో లేచే అహం , మదము గా మారి ,
"ఆకార్యము"ని గుర్తించలేనట్టి అంధులుగా వాళ్ళని మారుస్తుందన్నమాట.
అదే ఈ సర్గలో వాల్మీకి మనకు గుర్తుచేస్తున్న సత్యము.

హనుమదంగదులు స్వామి భక్తులే అయినా,
ఆ సంగతి మరచిపోయిన క్షణములో మదాంధకారములో పడతారన్నమాట.
అలా పడి దధిముఖుని ఎదురుకొని క్రింద పడవేస్తారు.
దధిముఖుడు ఎలాగో తప్పించుకొని పారిపోయి సుగ్రీవుని కాళ్ళ మీద పడతాడు.

ఇక జరిగిన కథ వాల్మీకి పదజాలములో వింటాము.

వానరులు మధువనము చూచి అక్కడ ఆగుతారు మధువు సేవించడానికి.
వాళ్ళకి హనుమ ఆశ్వాసన ఇస్తాడు.

'ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువును సేవించుడు.
మిమ్ములను ఆపువారిని నేను ఆపెదను'.

హనుమంతుని వాక్యములను విని
ప్రవరుడు అంగదుడు వానరులతో ఇట్లు పలికెను.
" ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు.
కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో చేయతగని కార్యము కూడా చేయతగును.
అప్పుడు ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు".

అప్పుడు వానరులలో శ్రేష్ఠుడు అగు హనుమంతుడు ఆ వానరుల తో ఇట్లు పలికెను.
'ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువ్హును సేవించుడు.
మిమ్ములను ఆపువారిని నేను ఆపెదను'.

హనుమంతుని వాక్యములను విని
ప్రవరుడు అంగదుడు వానరులతో ఇట్లు పలికెను.
" ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు.
కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో చేయతగని కార్యము కూడా చేయతగును.
అప్పుడు ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు".

వానర శ్రేష్ఠులు అంగదుని ఈ వచనములను విని
సంతోషపడినవారై మంచిది మంచిది అని అంగదుని పూజించిరి.
ఆ వానరులందరూ అంగదుని ఆ విధముగా పూజించి
నదీ ప్రవాహములో కొట్టుకు పోతున్న వృక్షముల వలె వారు మధువనములోకి దిగిరి.

'మైథిలిని చూచితిని' అన్న మాటవిని
కలిగిన అత్యంత సంతోషముతో వారు మధువనము ప్రవేశించిరి.
అక్కడి వనపాలకులను తమ బలముతో అధిగమించి మధువును సేవించిరి.
రసములుగల ఫలములని తినిరి.
అక్కడ వచ్చిన వానరులందరూ ఎగిరి అక్కడి వనపాలకులను అనేక సార్లు కొట్టిరి.

ఆ వానరులందరూ అనేకమైన దోసెడలతో మధువును సేవించిరి.
కొందరు వారిని వారించిరి కూడా.
వానరులు కొందరు మధువును సేవించి
ఆ మధువుతో మత్తుపోయి ఒకరినొకరు తోసుకొనుచుండిరి.

మరి కొందరు వృక్ష శాఖలను తీసుకొని వృక్షమూలములో విశ్రమించిరి.
కొందరు తాగిన మత్తుతో ఆకులను పరచి వాటిపై విశ్రమించిరి.
మధువుతో మత్తెక్కిన వానరులు ఉన్మత్తులై సంతోషముతో ఒకరినొకరు తోసుకొనుచుండిరి.
మరికొందరు మధుమత్తముతో తూలుచుండిరి.

కొందరు ఆనందముతో సింహనాదములు చేయుచుండిరి.
కొందరు పక్షులవలె కూతలు కూచుచుండిరి.
మధువుతో మత్తెక్కిన కొందరు నేలమీద పడుకొని నిద్రలోకి జారుకున్నారు.
కొందరు ఏదో చేసి నవ్వుచుండిరి.
ఇంకా కొందరు ఇంకేదో పని చేయుచుండిరి.
కొందరు ఏదో చేసి చెప్పుచుండిరి.
కొందరు ఇంకేదో ఆలోచనలో ఉండిరి.

అక్కడ దధిముఖునిచే పంపబడిన మధువన రక్షకులు
భీమబలముకల వానరులచేత ప్రతిఘటించబడి
వారు అన్ని దిక్కులలో పారి పోయిరి.
వారు మదాంధులైన వానరులచేత కాళ్ళతో లాగబడి
ఆకాశమార్గములో కి విసరబడిరి.
వారు అతి దుఃఖితులై దధిముఖునివద్దకు పోయి ఇట్లు పలికిరి.

"హనుమంతునిచేత అనుమతింపబడిన వానరులచేత
మేము హతులమైతిమి.
మధువనము ధ్వంసమయ్యెను.
మా కాళ్ళు పట్టుకొని ఆకాశములోకి విసరవేయబడిన వారము '.

అప్పుడు అక్కడ వానరుడగు దధిముఖుడు
మధువనము ధ్వంసమైనట్లు విని
ఆ వచ్చిన వానరులను ఓదార్చెను.
" రండు. మనము బలదర్పముతో విర్ర వీగుతున్న
మధుభక్షకులగు వానరులను బలప్రయోగముతో వారించుదము"అని.

ఆ దధిముఖుని వచనములను వినిన వానరులు
వెంటనే మళ్ళీ మధువనము వెళ్ళిరి.
వీరి మధ్యలో దధిముఖుడు ఒక వృక్షమును పెకలించి
తీసుకొని వేగముగా వెళ్ళెను.

అతని అనుచరులగు వానరులందరూ అతనిని అనుసరించిరి.
ఆ వనపాలకులు కుపితులై రాళ్లను చెట్లనూ తీసుకొని
ఆ దక్షిణ దిశనుంచి వచ్చిన కపికుంజరులు ఉన్నచోటికి పోయిరి.
వీరులైన వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని అనుసరిస్తూ
తాటి చెట్లను శిలలనూ ఆయుధములు గా పట్టుకొని అనుసరించిరి.

అప్పుడు ఆ వీరులైన వనపాలకులు
చెట్లమీద చెట్లకిందా బలదర్పముతో వీగుచున్న వానరులను ఎదుర్కొనిరి.

అప్పుడు క్రోధముతో వచ్చిన దధిముఖుని చూచి
హనుమదాది ప్రముఖులు వెంటనే పరుగెత్తుకొని వచ్చిరి.
వృక్షముచేత పట్టుకొని వచ్చిన మహాబలుడు
గౌరవించదగిన దధిముఖుని చూచి
అంగదుడు కోపముతో తన బాహువులతో అతనిని పట్టుకొనెను.

అంగదుడు మదాంధుడై 'ఇతడు తన నా పెద్దవాడు' అని తెలిసికొనలేకపోయెను .
ఆ కోపములో దధిముఖుని వేగముగా భూమిమీద పడవేసెను.
రక్తముతో తడిసిన విరిగిన బాహువులు భుజములు ఊరువులు కల ఆ వీరుడు
కపికుంజరుడు క్షణకాలము మూర్ఛపోయెను.

రాజుయొక్క మేన మామ అయిన దధిముఖుడు
వెంటనే తేరుకొని కోపముతో ఉగ్రుడై
తన దండముతో వానరులను చెదరగొట్టసాగెను.

పిమ్మట ఆ వానరులనుంచి ఎలాగో బయటపడి
ఆ వానర ముఖ్యుడు ఏకాంతప్రదేశములో తన అనుచరులతో ఇట్లు చెప్పెను.
'వాళ్ళను అక్కడే ఉండనిద్దాము.
మనము వానర మహరాజు సుగ్రీవుడు రామునితో సహా ఎక్కడవుండునో అచటికి వెళ్ళుదము'.

'అంగదుని అన్ని దోషములు మహరాజునకు వినిపించెదము.
ఆ మాటలు విని మహారాజు ఆ వానరులను దండించును.
పితృపైతామహుల దివ్యమైన మధువనము
దేవతలకు సైతము అందుబాటులో లేని ఆ మధువనము
మహాత్ముడైన మహరాజుది.

ఆ సుగ్రీవుడు, మధువుమీద దురాశకలిగిన,
ఆయుస్సు మూడిన వానరులకు
వారి మిత్రులకు అందరికి దండన విధించును.

ఈ దురాత్ములు నృపాజ్ఞని ఉల్లంఘించినవారు.
వధార్హులే.
సహించలేని మన రోషమునకు సఫలము కూరును' అని.

మహబలుడైన దధిముఖుడు వలపాలకులకు ఈ విధముగా చెప్పి
వెంటనే ఆ వనపాలకులతో కూడి ఆకాశములోకి ఎగిరి వెళ్ళెను.
ఒక నిమిషమాత్రములో ఆ సహస్రకిరణములు గల వాని పుత్రుడు ధీమంతుడు అగు సుగ్రీవుని వద్దకు చేరెను.

రాముని లక్ష్మణుని సుగ్రీవులను చూచి ఆకాశములో నుంచి దధిముఖుడు
తన అనుచరులతో కూడి భూమిలో సమతలప్రదేశములో దిగెను.

ఆ వనపాలకులు అందరితో కలిసి
ఆ వనపాలకుల అధిపతి మహాబలవంతుడు అయిన దధిముఖుడు
దీనవదనము తో శిరస్సు తో అంజలి ఘటించి
సుగ్రీవుని సమీపించి అతని శుభ చరణములపై తన తలను పెట్టెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది రెండవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||