||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- అరువది ఎనిమిదవ సర్గ||

||"జగామ శాంతిం మమ మైథిలాత్మజ !"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టషష్టితమస్సర్గః||

తత్త్వదీపిక
అరువది ఎనిమిదవ సర్గ
"జగామ శాంతిం మమ మైథిలాత్మజా"

"జగామ శాంతిం" అంటే "శాంతిపొందినది" అని.
అంటే హనుమ మాటలచేత ,
మనో వ్యథలో వున్న సీతమ్మశాంతి పొందినది అని.

"తతో రావణ నీతాయాః" అంటూ రావణునిచేత తీసుకుపోబడిన,
సీతమ్మ అన్వేషణ కొఱకు బయలుదేరిన హనుమ,
సీతాన్వేషణ జయప్రదముగా సాగించి,
రాములవారికి సీతమ్మకనబడినది అని చెప్పితే
మొదలు పెట్టిన పని పూర్తి అయినట్లే.

కాని ఇక్కడ హనుమ తన చాక చక్యముతో
ఆచార్య రూపములో
సీతాన్వేషణే కాకుండా,
సీత మనస్థితిని గ్రహించి సీతమ్మకి
తన మాటలతో మనోశాంతి కలిగించాడు.

రాములవారికి అదే మాట
సుందరకాండలో చివరి మాటగా
సీతమ్మ శాంతిపొందినది అని హనుమ చెపుతాడు.
అదే ఈ సర్గయొక్క ఈ కాండయొక్క ముఖ్యమైన మాట.

మధురమైన మధురమగు మాటలుచెప్పగల
సీతాదేవి చెప్పిన ప్రతిమాట వినడానికి కోరిన రాములవారికి
హనుమ సీతమ్మ తనకి చెప్పిన మాటలు అన్నీ మళ్ళీ వినిపిస్తాడు.

ఇక హనుమ శ్రీరాములవారికి చెప్పిన మాటలు విందాము.
ఇప్పుడు హనుమ చెపుతున్నాడు.

' ఓ రామా నీ పై ప్రేమానురాగములతో బయలుదేరుతున్ననాతో
సీతా దేవి తన మాటలు మళ్ళీ చెప్పెను'.

"ఓ హనుమా! దాశరథికి
శీఘ్రముగా రావణుని హతమార్చి
ఏ విధముగా నన్ను పొందునో ఆ విధమును
దాశరథి కి బహువిధములుగా చెప్పుము".

"ఓ అరిందమ! వీరుడా ! అది తగును అనుకొనినట్లయితే
ఎక్కడో ఒక నిరాటంకమైన చోట విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళుము.
నీ సాన్నిధ్యముతో అల్పభాగ్యముకల నాకు
ఈ శోకసముద్రమునుంచి ఒక క్షణము విముక్తి కలిగినది".

"ఓ విక్రాంతుడా నీవు వెళ్ళిన పిమ్మట
మళ్ళీ వచ్చువరకు నాప్రాణములు ఉండునో లేదో సందేహమే.
దానిలో ఏమీ సంశయము లేదు.
దుఃఖములో వున్నఈ దురదృష్ఠవంతురాలగు నాకు
నీవు కనపడక మళ్ళీ శోకము కలుగును."

ఇవి సీతమ్మ చెప్పిన మాటలు.
హనుమంతుడు సీత చెప్పిన మాటలు ఇంకా చెప్పుతాడు.

"ఓ వీరుడా ! వానరేశ్వరుడా !
నీతోటి వారైన వానరులపై నాకు ఒక సందేహము కలదు.
దుష్కరమైన ఈ మహోదధిని ఆ వానరసైన్యములు ఎలా దాటెదరు?
ఆ సాఘర లంఘనము నకు తగిన శక్తి భూతములలో ముగ్గురికే కలదు.
వారు వైనతేయుడు, మారుతీ మరియు నీవు మాత్రమే".

"ఓ వీరుడా ! కార్యము సాధించువారిలో శ్రేష్ఠుడా !
అలాంటి ఈ దుష్కరమైన కార్యము సాధించుటకు
సమాధానము కనపడు చున్నదా చెప్పుము".

"శత్రువులను క్షితించువాడా !
ఈ కార్యము సాధించుటకు నీవొక్కడివే తగినవాడివి.
ఈ కార్యము సాధించినచో నీవు యశస్సు పొందెదవు."

"ఆ రాముడు రావణుని
సమస్త బలములతో యుద్ధములో జయించి
తనపురమునకు నన్ను తీసుకొనిపోయినచో
అది ఆయనకు యశస్కరముగా వుండును".

"నేను రాక్షసవీరుని చే ఏవిధముగా అపహరింపబడితినో
ఆ విధముగా రహస్యముగా రాఘవుడు తీసుకొనిపోవుట తగదు".

"శత్రువులను మర్దించు కాకుత్‍స్థుడు
లంకానగరమును తన శరములతో సంకులము చేసి
నన్ను తీసుకు పోయినచో అది ఆయనకు తగును.
ఆ మహాత్ముడు యుద్దవీరుని యొక్క శక్తి కి అనుగుణముగా
ఏది తగునో అది నీవు ప్రతిపాదించుము".
ఈ విధముగా నీతో చెప్పమని సీతమ్మ నాతో చెప్పెను'.

'ఓ రామా ఆ అర్థసహితమైన హేతువులతో కూడిన
సీతా దేవి వాక్యములను విని నేను ఈ విధముగా మాట్లాడితిని'.

"ఓ దేవీ వానర సైన్యములకు అధిపతి ,
ఆకాశములో ఎగురువారిలో శ్రేష్ఠుడు,
సత్వ సంపన్నుడు అగు సుగ్రీవుడు
నిన్ను రక్షించుటకు కృత నిశ్చయుడై ఉన్నాడు".

"అమితమైన పరాక్రమము కలవారు,
వీరులు, మనోనిశ్చయము కలవారు
ఆయన పాలనలో ఉన్నారు.
వారు పైకి ఎగరకలరు.
క్రిందకి పోగలరు.
వారు ఏదిశలో నైన పోగలరు.
వారు ఎట్టి కార్యమైన సాధించ కల శక్తి కలవారు.
ఆ మహాభాగులు బలదర్పము కలవారు
వారు వాయుమార్గములో భూమి ని ప్రదక్షణము చేయగలవారు".

"సుగ్రీవుని సన్నిధిలో నాకన్నా విశిష్ఠులు ,
నాతో సమానులు ఉన్నారు.
కాని నాకన్నా తక్కువ వారు లేరు.
నేనే ఇక్కడి కి రాగలిగితిని.
మహాబలురైన వారి సంగతి చెప్ప నేల?"

"మహాబలవంతులను ఇట్టి కార్యమునకు పంపరు.
ఇతర జనులనే పంపెదరు.
ఓ దేవీ ఆ విషయము గురించి చింతించ వద్దు.
నీ శోకము చాలును.
ఆ వానర యోధులు ఒక్క గంతులో ఇచటికి చేరెదరు".

ఇలా సీతమ్మకి హనుమ చెప్పినప్పుడు
సీతమ్మకి విశ్వాసము కలిగించడానికి
హనుమ తనని తాను చిన్నవాడిగా చేసుకొని చెప్పాడు.

ఇలా చెప్పాను అని రాముడికి చెపుతూ వుంటే
రాముడికి ఎవరు ఎంత గొప్పో నిజా నిజాలు తెలుసు.

సీతమ్మ స్థితి మీద శోకములో వున్న రాముడు వెంటనే స్పందించకపోయినా,
తరువాత హనుమే ఈ కార్యము చేయగలవాడు,
ఈ కార్యము చేసిన వాడు అని గుర్తించి
హనుమను పురుషోత్తముడు అని చెప్పి
తన కానుకగా కౌగలించుకుంటాడు అని తరువాత వింటాము.

హనుమంతుడు తను సీతతో సమాధానముగా చెప్పిన మాటలు ఇంకావున్నాయి.
అదే హనుమ రామునికి చెప్పసాగెను.

"ఓ పూజ్యురాలా ! నరసింహులగు రామలక్ష్మణులు
ఇద్దరూ నా పృష్ఠము మీద కూర్చుని
ఉదయించిన చంద్ర సూర్యులవలె త్వరలో ఇచటికి వచ్చెదరు.
లంకాద్వారము దగ్గర ధనస్సు చేతిలో పట్టుకొని నిలబడిన
సింహస్వరూపులైన రాముని లక్ష్మణుని త్వరలో చూచెదవు".

"నఖములు దంతములు ఆయుధములుగా గల,
సింహ శార్దులములతో సమానమైన పరాక్రమము గల,
వానరులను వానరేంద్రులను త్వరలో చూచెదవు".

"లంకా మలయ పర్వతములపై తిరుగుచున్న
మేఘములతో కొండలతో సమానులైన వానరులను
నీవు త్వరలో చూచెదవు".

"వనవాసమునుంచి తిరిగివచ్చిన శత్రుమర్దనుడు,
అయోధ్యలో అభిషిక్తుడు అగు రాఘవుని నీవు త్వరలో చూచెదవు".

అవి సీతమ్మకి హనుమ చెప్పిన మాటలు.
అవి చెప్పి , హనుమంతుడు రామునికి తన తుది మాటలాగ,
ఈ మాట చెప్పుతాడు.

"తతో మయావాగ్బిరదీనభాషిణా
శివాభిరిష్టాభిరభిప్రసాదితా|
జగామ శాంతిం మమమైథిలాత్మజా
తవాపి శోకేన తదాsభిపీడితా"||29||

అంటే,

'ఓ రామా అప్పుడు నీయొక్క వియోగశోకముతో పీడించబడి
దుఃఖములో నున్న మిథిలాకుమారి
నా సంప్రీతికరమైన శుభకరమైన
సముచితమైన మాటలతో ఊరడిల్లి శాంతిని పొందెను'

అంటే ఈ విధముగా సీతమ్మ తన మనోవ్యథలనుంచి శాంతిపొందెను
అన్న శ్లోకముతో సుందరకాండ సమాప్తము అవుతుంది.

హనుమ పలికిన మంగళకరమగు వాక్కులచే
సీతమ్మకు మనః ప్రసాదము శాంతి లభించి నట్లే
ఈ సుందరకాండను చదివినవారికి కూడా
మనశ్శాంతి హనుమదనుగ్రహము లభించును.
ఇది మనపూర్వీకులు చెప్పినమాట.

కిష్కింధ కాండ లో మనము విన్నది,
సీతాన్వేషణలో సముద్రతీరము చేరి ఎలా దాటాలి
అనే సమస్యలో వున్న వానరుల గురించి.

అలాగే రాజ్యము కోల్పోయి,
వనవాసములో సీతమ్మను కోల్పోయి,
మిత్రుడు జటాయువును కోల్పోయి
ఇంతకన్న విషమము ఏమిటి అని వాపోయిన రాములవారి గురించి వింటాము.

ఈ కథ వింటున్న వారందరి మనస్థితి కూడా అలాగే వుంటుంది.
అంటే కిష్కింధ కాండలో రామాయణ గాధలో
పరిస్థితి విషమముగా వున్నదన్నమాట.

అటువంటి సమయములో హనుమ ముందుకు వచ్చి
సుందరకాండలో సాగరలంఘనానికి ఉద్యమించి ఆకాశములో ఎగరడముతో
అందరి మనస్సులో వున్న బరువు అకస్మాత్తుగా తగ్గి
అందరి మనస్సు హనుమతో కలిసి ఆకాశములో ఎగురుతుంది.

హనుమ విజయము సాధించి వచ్చినప్పుడు
వానరులందరికి కూడా మనస్తాపము పోతుంది.

సీతాన్వేషణకి ప్రతిజ్ఞాబద్ధుడైన సుగ్రీవుడికి కూడా
తను చేసిన ప్రతిజ్ఞ తీర్చుకొనగలిగితిని అనే శాంతి లభిస్తుంది.

నియమబద్ధురాలైన సీతమ్మ కుశలముగా వున్నదన్న మాటతో,
హనుమద్వారా తీసుకురాబడిన చూడామణిలో సీతమ్మని చూచిన,
రామలక్ష్మణుల మనస్తాపము తగ్గుతుంది.

అంటే రామాయణ కథలో ముఖ్యులందరికీ మనస్తాపము తగ్గుతుంది.

అలాగే ఈ సుందరమైన సుందరకాండ కథనములో లీనమై
సుందరకాండను చదివే వారికి కూడా
మనస్తాపము తగ్గి శాంతి లభించును.
ఇది వేలకొద్దీ సంవత్సరాలనుంచి వచ్చిన నమ్మకము.

ఇంకొక మాట.

హనుమ వానరులకు లంకా వృత్తాంతము చెపుతూ
ఒక ముఖ్యమైన మాట చెపుతాడు.
సీతమ్మ తన పాతివ్రత్యముతో రావణుని హతమార్చగల శక్తి కలది.
తన పాతివ్రత్య ధర్మముతో రావణుని సీతమ్మ హతమార్చకపోయునా,
రావణుడు హతమార్చబడినట్లే అని,
రాముడు రావణుని చంపుటకు నిమిత్తమాత్రుడే అని కూడా హనుమ చెప్పాడు.

అంటే రావణ వధ అయినట్లే.

రాముని తో అయోధ్యలో పట్టాభిషేకమునొందెదవని కూడా సీతమ్మతో హనుమ చెప్పెను.
అంటే సుందరకాండ చివరికి రావణ వధ అయినట్లే భావించి
సీతారాముల పట్టాభిషేకము కూడా చేయవలెను ( చదవవలెను).

ఇది కూడా పూర్వీకుల సంప్రదాయము.
అందువలన సుందరకాండ సమాప్తముతో
రామపట్టాభిషేక సర్గలేక ఘట్టము కూడా వింటాము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||