డాక్టర్ ఏల్చూరి విజయ రాఘవరావు గారు
***
పండిట్ విజయ రాఘవరావు గారు గత అనేక దశాబ్దాలుగా తన సంగీతంతో భారతీయ సంస్కృతిని ప్రభావితం చేసి, తనదైన తీరులో ఒక ముద్ర వేశారు. ఆయన తన వేణుగాన కచేరీలతో ,రికార్డింగ్లతో ప్రపంచ ప్రేక్షకులకి ప్రాచీన సంగీతం, నవీనతతో అర్థవంతంగానూ, పవిత్రంగాను, మేధస్సును ప్రేరేపించేటట్లుగాను ఉండేట్లు అనుభూతం చేశారు. ఆయన సంగీతం చిన్నవారిని పెద్దవారిని కూడా ఒకే విధంగా అలరించేదిగా ఉండేది. ఆయన మేథ విమర్శకుల ప్రశంసలు అందుకున్న, నవీన వాద్య బృందాలలోను, బాలే బృందాలలోను ప్రదర్శితమవుతూ ఉండేది. ప్రసిద్ధి పొందిన జాతీయ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ఆయన ఫీచర్ ఫిలిమ్సు, షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన ప్రయోగాత్మక సంగీతానికి ఎన్నో అవార్డులు వచ్చాయి.
ఆంధ్రభూమి ఫిబ్రవరి 2001 సంచికలో శ్రీ ప్రసేన్ చేసిన ఇంటర్వ్యూలో, ఆయన అన్న మాటలు డాక్టర్ ఏల్చూరి విజయ రాఘవరావు గారి జీవితాన్ని సంక్షిప్తంగా వర్ణించాయి -
“ వేణుగానం ఆయన ఊపిరి,
నృత్యం ఆయన ఆరో ప్రాణం,
కథ కవిత ఆయన భుజకీర్తులు,
చిత్రలేఖనం ఆయన రసస్ఫూర్తి,
సంగీత దర్శకత్వం ఆయన ఆల్టర్ ఇగో,
కళలన్నీ ఆయనకు శంఖచక్రగదా పద్మాలు -
ఆయన, పండిట్ విజయ రాఘవరావు.
కళలతో సహా అన్ని రంగాలకు ప్రత్యేకికరణ రుగ్మత వ్యాపించిన నేపథ్యంలో, బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు సర్వజ్ఞతకు ప్రావీణ్యతకు జోడి కుదరటం లేదు. ఈ సంక్లిష్ట కాలంలో కూడా, అటువంటివారు ఉంటారని నిరూపించిన వ్యక్తి పండిట్ ఏల్చూరి విజయ రాఘవరావు గారు.”
విమర్శకులు రసికులు ఆయన గురించి చేసిన ప్రశంసలు -
"No substitute for his flute...the complete master" - The Hindustan Times
“A volcano of creative expression" - The Indian Express
“His flute is an unending fountain of myriad melodies, always fresh, always original” - The Patriot
"Creator of beautiful, wide and ethereal canvasses" - The Deccan Herald
"20th Century Renaissance Genius" - The Cleveland Plain Dealer
"Intensely romantic, lyrical, extremely serene" - Rave Magazine
“Innovator in the world of music, a versatile genius” - The JS Magazine
“Seeker of truth through music. One of the greatest flautists of this world” - The Times of India
“Reflective music, refreshing and genuinely haunting” - The New York Times
“Awe inspiring. Freshness and finesse in every note. Marked by gay abandon, innovativeness and imaginative vitality” - The Statesman
“Suave tonicity, lyricism, rich melodic beauty” - The Listening Post
ప్రఖ్యాతి పొందిన కెనడా చిత్ర దర్శకుడు జేమ్స్ బేవరేజ్ పండిట్జీ సంగీతంలో, సృజనాత్మకత ఆధారంగా తీసిన చిత్రం ఎన్నో ప్రశంసలు పొందింది. ఈ చిత్రం పండిట్జీ ,శాస్త్రీయ సంగీతం కొత్త తరానికి ఎలా వర్తిస్తుందో చూపిస్తుంది. ఈ చిత్రం అనేక విశ్వవిద్యాలయాలలో, సంగీత ప్రధానమైన కోర్సుల్లో బోధించబడుతోంది.
పండిట్జీకి వచ్చిన అవార్డులు, బిరుదులు, పత్రికా అభిప్రాయాలు, ప్రజాభిప్రాయము ఆయన మెప్పులకు బిరుదులకు ఎదురు చూడకుండా, పురాతన
సాంప్రదాయం నుండి నవీనతకు ద్వారాలు తెరిచిన తీరు, విస్మయంతో కూడిన గౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి.
పండిట్జీని వరించిన కొన్ని ప్రముఖ గౌరవాలు బిరుదులు -
ఇండియాలో యునైటెడ్ స్టేట్స్ లో, ఫార్మర్ సోవియట్ యూనియన్, చెక్వోస్లో వేకియా, యుగోస్లేవియా, కెనడా, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీలో ఆయన ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు.
ఇండియాలోనే ఆయన ఎన్నో సంగీత నాటక అకాడమీ అవార్డ్స్, సంగీత కళా శిరోమణి, గాన కళాప్రపూర్ణ, గౌరవ పురస్కార్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్, గౌరవ డాక్టరేట్స్,
ప్రపంచ తెలుగు మహాసభలలో సన్మానం, బొంబాయి సురసింగార్ సంసద్ వారి తంత్రి విలాస్ మొదలైనవి.
ఆయన యూఎస్ ఇండియా మధ్య సాంస్కృతిక సంబంధాలు మెరుగుపరిచి, బలపరిచినందుకు చేసిన కృషికి 2002లో మేరీ ల్యాండ్ గవర్నర్ అవార్డు. 2008లో
ఆయన గౌరవ ఆదిత్య బిర్లా కళా శిఖర అవార్డు మహారాష్ట్ర
గవర్నర్ నుండి అందుకున్నారు.
పండిట్జీ చేసిన సృజనాత్మకమైన కృషి, వేణు గానంలోనూ, నృత్య రంగంలోనూ, వాద్య బృంద సంచాలనంలోనూ, చిత్ర
సంగీతంలోనూ ఆయన చూపించిన శక్తివంతమైన స్వీయ ప్రతిభ, పరిధులు దాటిన కళగా గుర్తింపబడింది. ఆయన నృత్యంలోనూ, సంగీతంలోనూ సృష్టించిన, కూర్చిన సృజనాత్మక కొత్త రీతులు కళా ప్రపంచంలో, సినిమా బాలే రికార్డింగ్స్ లోను, ప్రపంచవ్యాప్తి చెందడం ప్రపంచమంతా గుర్తించింది.
పండిట్జి సంగీతం స్వరపరిచిన మృనాల్సేన్ BHUVAN SHOME (గోల్డెన్ పీకాక్ ఐఎఫ్ఎస్సి న్యూ ఢిల్లీ గౌరవ పురస్కారం), ఎం ఎఫ్ హుస్సేన్ THROUGH THE EYES OF A PAINTER (గోల్డెన్ బేర్ అవార్డ్ బర్లిన్ ఫిలిం ఫెస్టివల్) ఈ కళా ప్రతిభకి రెండు ఉదాహరణలు. కవిగా ఇంగ్లీషులోనూ
తెలుగులోనూ ప్రచురింపబడిన 6 కవిత, కధాసంకలనాలు చాలా ప్రజాభిమానం పొందాయి.
***
చలనమే జీవితం మరి ఆ చలనంలో ఆదుర్తాతో ఉరికిన, అలసటపడి నిద్రించిన, అణువణువును అతి తీక్షణంగా
అవలోకిస్తున్న గుండె కలం, మస్తిష్కపు రంగులు నింపుకొని
కళ్ళు మూసుకోకుండా రేఖాచిత్రాలు గీస్తుంటుంది. కథలైనా, కలలైనా అవే అన్న డాక్టర్ శ్రీ ఏల్చూరి విజయరాఘవరావు
గారి జీవన ప్రయాణం మెడ్రాస్ ఇప్పటి చెన్నైలో మూడు నవంబర్ 1925న మొదలైంది.
బాల్యమంతా గుంటూరు జిల్లా నరసరావుపేట లో గడిచింది. చిన్నతనం నుండే ఆయన చుట్టుపక్కల సాహిత్య వాతావరణం చాలా ఉండేది. ఆయన సోదరుడు నయాగరా కవులలో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. కవితలు రాయటం ఆయన హై స్కూల్ రోజుల్లోనే మొదలుపెట్టారు. శరత్చంద్ర కథలు తెలుగులో అనువదించడం, భారతి పత్రికలో అవి ప్రచురింపబడడం ఈ రోజుల్లోనే. తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో కవితా సంపుటులు( ANTARVANI, ABHYUTHANAM, NIRVANA) మరెన్నో కథలు ప్రచురింపబడడానికి బీజం ఆయన హై స్కూల్ రోజుల్లోనే పొందిన స్ఫూర్తి అని చెప్పవచ్చు.
తర్వాత మజిలీ కాకినాడ కాలేజీ నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశించటం. డిగ్రీ పూర్తి చేయకముందే ఆయనలోని కళా హృదయం ఆయనను మెడ్రాస్ రైలు ఎక్కించింది.
నృత్యంలో GURU CHOKKALINGAM PILLAI దగ్గర శిష్యరికం, దేశ విదేశాల్లో
నృత్య ప్రదర్శనలు, సంగీత కచేరీలు. భారత్ కి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో ఆగస్టు 15న, ఆయన భారత జాతీయ గీతాన్ని మొట్టమొదటిగా కండక్ట్ చేశారు రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీ నుంచి. ఆయన మహాత్మా గాంధీ ప్రేయర్ మీటింగ్స్ లోఫ్లూట్ మీద భజనలు వాయించేవారు. భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రయాణాలు అన్ని యూరోప్ నగరాల్లోనూ, యుఎస్ఏ , సోమేట్ యూనియన్ ఇత్యాది. భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా, కల్చరల్ అంబాసిడర్ గా కూడా మరెన్నో సార్లు అనేక దేశాలకు వెళ్లారు. స్థాపకులుగా నృత్య నిర్దేశకులుగా రాణింపజేసిన రెండు కళా సంస్థలు త్రివేణి కళా సంగమ్, సంగీత భారతి న్యూఢిల్లీ.
1945లో ఢిల్లీ ఆకాశవాణిలో వేణుగాన విద్వాంసులుగా, వాద్య బృంద సంచాలకులుగా ప్రవేశం. ఆకాశవాణిలో ఉంటూ శాస్త్రీయ సంగీతంలో ప్రయోగాలు చేసి ప్రామాణికతను నిలబెడుతూ ఎన్నో కొత్త వరవడులు సృష్టించారు. ఇవి శాస్త్రీయ సంగీతంలో నవీనతకు కొత్త ద్వారాలు తెరిచాయి. సోలో వాయిద్యాలైన భారతీయ వాయిద్యాలను ఆర్కెస్ట్రాలో పొందుపరచడం వంటివి ఆయన సృజనాత్మక ప్రతిభకు నిదర్శనాలు. ఆయన సంగీతం సమకూర్చిన మ్యూజిక్ రికార్డ్స్ బిబిసి, వాయిస్
ఆఫ్ అమెరికాలో తరచూ ప్రసారం అవుతూ ఉండేవి.
1958లో ఫిలిమ్స్ డివిజన్లో DIRECTOR OF MUSIC గా ఈయన ప్రవేశం ఒక ప్రభంజనం. వీరి సంగీత రచనలో రాష్ట్రపతి పారితోషికాలు జాతీయ అంతర్జాతీయ పారితోషకాలు స్వర్ణ పతకాలు పొందిన కొన్ని చలనచిత్రాలు : INTERVIEW, ANMOL TASVEER, ఒక ఊరి కథ, EK ADHURI KAHANI, BANSI BIRJU, BADNAM BASTI లైఫ్, మొదలైనవి. ప్రయోగాత్మకంగా యానిమేషన్ ట్రెండ్ సెట్టర్స్ గా పేరు తెచ్చుకున్న చిత్రాలు: TRIP, LIFE, TANDAVA, LEELA, ANANTA, AKBAR, ABID, WEAVE ME SOME FLOWERS, EXPLORER మొదలైనవి. వీటిలో
పండిట్జీ చేసిన సంగీతం తర్వాత తరాల వారికి చాలా స్ఫూర్తి ఇచ్చాయి.
ప్రపంచ ప్రఖ్యాత సితార విద్వాంసులు పండిట్ రవిశంకర్ గారి ప్రధమ శిష్యులు, ముఖ్య సహాయ సంగీత నిర్దేశకులు. SIR RICHARD ATTENBOROUGH గారి GANDHI సినిమాతో సహా ANURADHA, GODAAN ఇత్యాది ఎన్నో చలనచిత్రాల్లో అగణితమైన రంగభూమి కార్యక్రమాల్లో, రికార్డింగ్లో, దేశవిదేశాల్లో వీరికి తమ పూజ్య గురువర్యుల సంగీత కల్పనలో సహకరించే సౌభాగ్యం లభించింది.
గ్రామ ఫోన్ రికార్డులు, సీడీలు, మ్యూజిక్ ఆల్బమ్స్ కోకొల్లలు. చలనచిత్ర సంగీతంలో నూతన జీవం పోసిన వీరి కృతులు దేశ విదేశాల్లో పేరుపొందాయి. ఆకాశవాణి వాద్య బృందం నెహ్రూ ప్లానిటోరియం, సౌండ్ అండ్ లైట్ షో, టీవీ కార్యక్రమాలు, నృత్య నాటికలు ఇత్యాదులతో సహా అనేక సంగీత రచనలు చేశారు.
పండిట్జి స్వరపరిచిన ఇండియన్ నేషనల్ ఆర్కెస్ట్రా కంపోజిషన్స్ ODE TO PEACE: SYMPHONY FOR LARGE ORCHESTRA & VOICES, THROES OF FREEDOM ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాగే ప్రఖ్యాతి పొందిన సంగీత కారులతో చేసిన RAINBOW: A TONE POEM, RITU: SEASON, GREEN WORLD: AN ORCHESTRAL DREAM
ఎంతో జనాదరణ పొందాయి. ఆయన డాన్స్ ఔపరాస్ శ్రీరామ ప్రతిక్ష, శ్రీకృష్ణ వైజయంతి మరచిపోలేని కళా నిధులు. ఆయన చేసిన కొన్ని కాంపోజిషన్స్లలో STRINGS OF FRIENDSHIP - ASIA, DRUMS OF FREEDOM - INDIA, FANTASY OF INDIAN DRUMS మొదలైన వాటిలో జాతీయ అంతర్జాతీయ సమైక్యత ముఖ్య నేపథ్యంగా గుర్తించవచ్చు.
JUNGLE BOOK / OHIO BALLET తూర్పు పశ్చిమ ల సంగీతానికి మధురమైన కలయిక. ఈ బాలేకు యూఎస్, యూరప్, ఇండియాలోని అనేక నగరాల్లో, మీడియాలో ఎన్నో ప్రత్యేకమైన ప్రశంసలు, మంచి సానుకూల సమీక్షలు వచ్చాయి.
ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఆయన అనేక గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు. ప్రఖ్యాతి పొందిన చాలామంది కళాకారులు ఆయన లెక్చర్స్కు అటెండ్ అయిన వారే.
***
శ్రీ విజయ రాఘవరావు గారిది ఆరు దశాబ్దుల సంగీత ఉపాసన. సంగీత పట్ల ఎంత ఆరాధనో సాహిత్యం పట్ల కూడా అంతే మక్కువ. జీవనయానంలో ఆయన స్వభాషకు
స్వప్రాంతానికి చాలాకాలం దూరంగా ఉండవలసి వచ్చిన తెలుగు మీద మమకారం పెరిగిందే గాని, విస్మృతం కాలేదు. ఆయన కవిత మా ఊరు ఆయన అంతరంగాన్ని చక్కగా తెలియజేస్తుంది.
"ఏ ఊరైన
మా ఊరే అనుకుని
మజాగా ఉండే రోజులు
మళ్లీ వస్తాయా
ఈ ఊరు ఆ ఊరు
కాదంటే ఏ ఊరు అని చెప్పను
మా ఊరు మరి".
శ్రీ విజయ రాఘవరావు గారు ఫిలిమ్స్ డివిజన్లో బొంబాయిలో పని చేస్తూ ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తూ కూడా, ఆయన వేణునాదం, తెలుగు సాహిత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఆయన కథలు కవితలు ఎన్నో తెలుగు పత్రికల్లో ప్రచురింపబడి తర్వాత కధా సంకలనాలుగా కవితా సంకలనాలుగా కూడా వచ్చాయి. ఆయన రాసిన సుందరకాండ సంక్షిప్త సంస్తుతి సంగీత సాహిత్యాల మేళవింపు, ఒక ప్రత్యేక రచన.
Films Division డివిజన్ నుండి రిటైర్ అయిన తర్వాత ఆయన ఎక్కువకాలం అమెరికాలోనే గడిపినప్పటికీ ఆయన సంగీత సాహిత్య కృషి కొనసాగుతూనే ఉంది. అమెరికాలో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తూ, ఇంటికి వచ్చిన సంగీత ప్రియులతో చర్చిస్తూ వారి కళకి మెరుగులు దిద్దుకోవడానికి మార్గదర్శనం చేస్తూ ఉండేవారు. ఫ్లూట్ ప్రాక్టీస్ కూడా రోజు సాగుతూనే ఉండేది.
శ్రీ విజయ రాఘవరావు గారి సుదీర్ఘ కళా ప్రయాణంలో ఎన్నో గౌరవాలు బిరుదులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. శ్రీ విజయ రాఘవరావు గారు అనేక రంగాల్లో తన ప్రజ్ఞను ప్రదర్శించి అనేక కొత్త వరవడులు సృష్టించిన, ఆయన బిరుదులకు మెప్పుకు ఎప్పుడు ఎదురు చూడలేదు.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి నిర్వచనం అనవచ్చు.
మిత్రుడు మునిపల్లె రాజు గారి మాటల్లో - “అనురాగము లేనిది సుజ్ఞానము రాదు అన్నాడు త్యాగరాజస్వామి. శ్రీ విజయ రాఘవరావు గారు రాగసంలీన హృదయులే కాక అనురాగపూర్ణ హృదయుడు కూడాను. ఆయనలో కిశోరల్లాసం, శిశు మనోజ్ఞ ముగ్ధత్వమే కాక ఆయన సుజ్ఞాని అని కూడా మిత్రులకు వారి పట్ల ప్రేమాభిమానాలు పటుతరం చేస్తాయి. సంగీతం పట్ల శ్రీ విజయ రాఘవరావు గారికి ఎంత ఆరాధనో, సాహిత్యం పట్ల కూడా అంతటి
అధీతి. వారి ఇంగ్లీషు కవితల ఖండకావ్య సంపుటి పేరు నిర్వాణ. దీనిని బట్టే వారి సంగీత సాహిత్య జీవన తాత్విక చింతనం అర్థం చేసుకోవచ్చు. కథలు కవితలు అంటే వారికి ఎనలేని మక్కువ. ఆయన సంత్ పదానికి చెందినవారు కాబట్టి ఇది సహజమే. స్వస్థాన వేష భాషాభిమతః సంత: అని తెలుగువారి ఆదికవి నన్నయగారే అన్నారు. ఈ గ్రంథాలు ప్రచురించడంలో వారి అమాయక సరళతే కనపడుతుంది కానీ మెప్పులు బిరుదులు, పురస్కారాలు ఉద్దిష్టం కావు. అవేవో ఉంటాయని కూడా వారికి తెలియకపోవచ్చు. స్వాంత సుఖమే వారి అభీష్టం.
"కాలమానం
లోక గతుల
మార్పించునట
కాలమానమే మార్చ
కదలి వస్తున్నాను"
అనగలిగిన కవితా స్వాప్నికుడు శ్రీ విజయ రాఘవరావు గారు.”
పండిట్ విజయ రాఘవరావు గారి మాటల్లో సంగీతం గురించి ఆయన దృక్పథం -
“వేణుగాన విద్వాంసుడిగా, సంగీత దర్శకుడిగా, కవిగా నర్తకుడిగా, నృత్య దర్శకుడుగా నా జీవితంలో నేను వేసిన ప్రతి అడుగు, నన్ను ధ్వని సామ్రాజ్యానికి దగ్గర చేసింది. ఫ్లూట్ నా ఆత్మ. నేను అనంత కళాసాగరమైన ఈ సాంప్రదాయ సంగీతాన్ని మధించి ఆ జ్ఞానాన్ని జీర్ణించుకొని నేను నా కళ, వేరు కానటువంటి సృజనాత్మకతని అపరమితమైన కాలానికి, ఎత్తులకు, అంతరిక్షానికి అతీతంగా అభివృద్ధి చేసుకున్నాను. వ్యక్తి ప్రదర్శించే కళలో అతని వ్యక్తిత్వం ప్రదర్శితం అవుతూ ఉంటుంది. దానివల్ల ఆ కళకు ఒక ప్రత్యేకత అబ్బుతుంది.
అందుకే ఒక్కో రాగాన్ని ఒక్కో గాయకుడు ఒక్కో రకంగా పాడుతాడు. అవసరమైనప్పుడు నేను సంప్రదాయవాదిని అలాగే ప్రయోగం అవసరమైనప్పుడు నేను ప్రయోగాత్మకుడిని కూడా. సరైన చర్య సరైన సమయంలో అన్నదే నా పద్ధతి. శాస్త్రీయ సంగీతం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు సాంప్రదాయాన్ని పాటిస్తూనే, మార్పులు చేర్పులు చందస్సులో చేస్తే, సాంప్రదాయాన్ని దాటకుండానే సృజనాత్మకతను చూపించవచ్చు.”
సంగీతకారులది ఒక అరుదైన తెగ. వారు కట్టుబాట్ల మధ్య కూడా ఒక తనదైన శైలి వెతుకుతూనే ఉంటారు. వేల ఏళ్ళ నుంచి మారని స్వరాలని కొత్తతనంతో కొత్త ఆశలతో మానవజాతికి అనుభూతం చేయగలరు. గత 80 ఏళ్లుగా పండిట్ విజయ రాఘవరావు గారు ఒక మహోన్నతమైన సంగీత కారుడిగా, ఒక తరానికంటే ఎక్కువగా సంగీత కారులని , సంగీత విద్వాంసులను, కళా ప్రేమికుల్ని, రసికులని, అభిమానులను ప్రభావితం చేస్తూ వచ్చారు.
***
Written by Smt. Sailaja N. Rao
Special thanks to Smt. Lakshmi V. Rao & Dr. Vijay Vardhan Elchuri
Special thanks to speechtotext.com
Some material based on interviews with Pt. Vijay Raghav Rao available at https://theredandgreencompany.com/colloquy
Attachment: Pt. Vijay Raghav Rao - Recent, Salient Discography
Copyright 2024 by Sanjay K. Rao & The Red & Green Company
|| ఓమ్ తత్ సత్||