!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 198-199

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి  శ్లోకములు 198-199


భ్రాన్తిలో కలిగిన ఆలోచన లేక చూచిన  విషయము నిజము కాజాలదు అన్న మాటతో గురువు తన సమాధానము మొదలెడతాడు. జీవభావము ఆదిలేనిది కనక అంతము వుండదు అన్నది భ్రాన్తి మాత్రమే అని చెప్పిన గురువు, ఇంకో రెండు శ్లోకాలలో భ్రాన్తి గురించి చెపుతాడు.


వేదాంత పరిభాషలో భ్రాన్తికి ఒక ఉదాహరణ ఉపయోగిస్తారు. అది రజ్జు సర్ప న్యాయము అంటూ వుంటారు. ఒకరికి దూరము నుంచి చూచినప్పుడు తాడు సర్పము లా కనిపిస్తుంది. అది సర్మమేమో అనే భ్రాన్తిలో , రక్షణకి కావలసిన సామగ్రితీసుకొని , ఒక దీపము కూడా ముందుకు తీసుకు వెడితే,  దగ్గిరవచ్చేసరికి అది సర్పము కాదు  తాడు మాత్రమే అని తెలిసి వస్తుంది. దూరము నుంచి సర్పము అని భ్రాన్తి పడినా దగ్గరకు వచ్చేసరికి దాని అసలు స్వరూపము కనపడి ఆ భ్రాన్తి నాశనమౌతుంది. నిజము తేటతెల్లమౌతుంది.  ఆ ఉదాహరణ ఇక్కడ అనువుగా గురువు ఉపయోగిస్తాడు.

, 

శ్లోకము 198


స్వస్య ద్రష్టుర్నిర్గుణస్య అక్రియస్య

ప్రత్యగ్భోధనానన్దరూపస్య బుద్ధేః|

భ్రాన్త్యాప్రాప్తో జీవభావో న సత్యో

మోహాత్పాయే నాస్త్యవస్తుస్వభావాత్||198||


స్వస్య ద్రష్టుః నిర్గుణస్య అక్రియస్య-

సర్వసాక్షి అయిన, నిర్గుణమైన , క్రియలతో సంబంధము లేని


ప్రత్యగ్ భోధనానన్దరూపస్య-

పరిపూర్ణ ఆనంద స్వరూపము కలది ( అగు ఆత్మ)


బుద్ధేః భ్రాన్త్యా ప్రాప్తః జీవభావః న సత్యః -

బుద్ధి ( మనస్సు ) యొక్క భ్రాన్తి వలన కలిగిన జీవ భావము సత్యము కాదు. 


మోహాత్ అపాయే న అస్తి  అవస్తుస్వభావాత్ -

మోహము తొలగి పోగానే జీవభావము కూడా తొలగి పోతుంది.


సర్వసాక్షి అయిన, నిర్గుణమైన , క్రియలతో సంబంధము లేని, పరిపూర్ణ ఆనంద స్వరూపము కలదానికి ( అగు ఆత్మకి ), బుద్ధి ( మనస్సు ) యొక్క భ్రాన్తి వలన కలిగిన జీవ భావము సత్యము కాదు. మోహము తొలగిపోగానే , ఆత్మకి జీవభావము కలదు అన్న మిథ్య తొలగి పోతుంది.


విజ్ఞాన కోశములో జ్ఞానకోశానికి సంబంధించిన ఉపాధులవలన , అంటే చేసే పూజా పునస్కారములతో ,పూర్వ జన్మ పాపపుణ్యఫలములతో, జీవుడు తానే ఆత్మ అనుకోవచ్చు.  జీవుడికి, పూర్వజన్మ పాపపుణ్య ఫలములతో ఆది లేదు కనక అంతము కూడా లేదు అనే ఆలోచనరావచ్చు. ఆత్మకూడా ఇలాంటి నాశనము లేని జీవభావమే తను అనికోవచ్చు. ఇక్కడ జీవుడికి అంతములేదు అన్నది భ్రాన్తి వలన కలిగిన అలోచన.  బ్రాన్తి తొలగి పోతే జీవుడికి అంతము వున్నది అని గ్రహించిన ఆత్మ , తన స్వస్వరూపమును గ్రహిస్తుంది అన్నమాట.


శ్లోకము 199:


యావత్భ్రాన్తిస్తావదేవాస్య సత్తా

మిథ్యాజ్ఞానో జ్జృమ్భితస్య ప్రమాదాత్|

రజ్జ్వాం సర్పో భ్రాన్తికాలీన ఏవ 

భ్రాన్తేర్నాశే  నైవ సర్పోఽపి తద్వత్|| 199||


భ్రాన్తిగురించి గురువు ఇంకా చెపుతున్నాడు.


యావత్ భ్రాన్తిః తావత్ ఏవ అస్య సత్తా

భ్రాన్తి వున్నంతకాలమే దాని సత్తు !


మిథ్యాజ్ఞానః  జ్జృమ్భితః అస్య ప్రమాదాత్

దీని కారణమువలన మిథ్యాజ్ఞానము విజ్జృంభిస్తుంది


రజ్జ్వాం సర్పో భ్రాన్తికాలీన ఏవ 

తాడుని సర్పము అనుకున్న భ్రాన్తి లాగానే


భ్రాన్తేః నాశే  న ఏవ సర్పః అపి తద్వత్

భ్రాన్తి పోగానే ఆ సర్పము కూడా పోతుంది కదా. అలాగే. (జీవభావము యొక్క అనిత్యము)


తాత్పర్యము:


భ్రాన్తి వున్నంత కాలమే భ్రాన్తివలన కలిగిన అజ్ఞానానానికి సత్తు. భ్రాన్తిలో మిథ్యాజ్ఞానము విజ్జృంభిస్తుంది. భ్రాన్తిలో తాడుని సర్పము అనుకున్నబుద్ధి,  భ్రాన్తిపోగానే ఆ సర్పము కూడా పోయినట్లు  గ్రహిస్తుంది.( అలాగే భ్రాన్తి పోగానే జీవభావము యొక్క అనిత్యత్వము తెలిసి వస్తుంది.


||om tat sat||



||ఓమ్ తత్ సత్||










 






 






వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199

Om tat sat !

 

 

 

    •