||సుందరకాండ||

|| ప్రథమస్సర్గః || తెలుగు అర్థ తాత్పర్యములతో ||

||Om tat sat||

హరిః ఓమ్
ఓమ్ శ్రీరామాయ నమః
శ్రీమద్వాల్మీకి రామాయణే
సుందరకాండే
ప్రథమస్సర్గః
( శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో)

రామాయణ కథానుక్రమములో సుందరకాండ కీలకమైన స్థానములో వుంది. అయోధ్య అరణ్య కిష్కింధ కాండలలో ముఖ్యఘట్టాలు, సీతా రాముల వనవాసానికి వెళ్ళడము, మారీచ కపటము తో రావణుడు చేసిన సీతాపహరణం, జటాయు మరణం, రాముని సీతా వియోగ దుఃఖము, మున్నగునవి. వీటన్నిటికి నేపథ్యములో కనపడేది వినపడేది దుఃఖము. ఆ నేపథ్యాన్ని రాములవారే తనమాటలలో చెపుతారు.

' రాజ్యాద్భ్రంశో వనేవాసః
నష్టో సీతా హతో ద్విజః |
ఈదృశీయం మమాలక్ష్మిః
నిర్దహేదపి పావకమ్'||

అంటే "రాజ్యము కోల్పోయాను, అడవులలో తిరుగుచున్నవాడను. సీతను కోల్పోయాను, ఈ పక్షి (జటాయువు)చనిపోయినది. నా దురదృష్టము ఎలాంటిది అంటే అది అగ్నిని కూడా దహించివేయగలదు" అని. ఈ దురదృష్టముతో దుఃఖముతో కూడిన స్థితి, సీతాన్వేషణలో కూడా సాగుతుంది. సీతాన్వేషణలో సీతమ్మ జాడ తెలియక, అంగదుని నాయకత్వములో దక్షిణ దిశగాపోయిన వానరులు నిరాశతో ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నము దాకా వస్తారు. సంపాతి ద్వారా సీత లంకలో వున్నదని విని, లంకామార్గములో వున్నశతయోజనముల సాగరము చూచి, మళ్ళీ ఈ మహా సాగరము ఎవరు దాటగలరు అని మళ్ళీ నిరాశా పరులు అవుతారు. దురదృష్టానికి దుఃఖానికి అంతులేదా అని అనిపించే సమయములో, జాంబవంతుడు హనుమంతునికి తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పి, సముద్ర లంఘనమునకు ప్రేరేపిస్తాడు. జాంబవంతుని ప్రేరేపణతో హనుమంతుడు, తన శక్తిని గుర్తుచేసికొని, శత యోజనముల సాగర లంఘనమునకు ముందుకు వస్తాడు. కిష్కింధ కాండలో చివరి శ్లోకములో హనుమంతుడు ,'జగామ లంకాం మనసా మనస్వి', మనస్సులో హనుమ లంక చేరిపోయాడు అని వింటాము. ఆ ఘట్టముతో అప్పటిదాకా నిరాశ దుఃఖభరితమైన వాతావరణములో మొట్టమొదటిగా ఆనందాతిశయముల ఆశాంకురాలు జనిస్తాయి.

అట్టి ఆశాంకురాలతో , అరవై ఎనిమిది సర్గల సుందరకాండలో, మొదటి సర్గ హనుమంతుని సముద్ర లంఘన ఘట్టముతో మొదలౌతుంది.

మొదటి సర్గలో, సీతాన్వేషణకై హనుమంతుడు లంక చేరే సంకల్పముతో మహేంద్ర పర్వతమునుంచి ఎగిరి, సాగర లంఘనము చేస్తూ, ఎదురుగా వచ్చిన అడ్డంకులను అవలీలగా దాటి, లంకచేరడము మనము వినే కథ. సాగర లంఘనములో , సాగరుడు మైనాకుల ఆతిథ్యము తీసుకోకుండా తన కార్యముపై సాగిపోడము, సురసను జయించడము, సింహికని హతమార్చడము చేస్తాడు. ఇవన్నీ హనుమంతుడు చేసిన మూడు దుష్కరమైన కార్యములు. వీటన్నిటిని చూసి ఋషులు దేవతలు గంధర్వులు అందరు హనుమంతుని ప్రశంసిస్తారు. అలాగ అన్ని అడ్డంకులు దాటి లంక తీరములో హనుమంతుడు చేరి, త్రికూట పర్వతము మీద వున్న, అమరావతిలాంటి లంకను చూస్తాడు. ఈ బాహ్యముగా వినే కథలో అంతరార్థము కూడా వున్నది అన్న మాట చాలా ప్రవచనములలో వింటాము. ఆ అంతరార్థము కూడా అక్కడక్కడ కలుపుతూ ఆర్థతాత్పర్యాలతో పాటుముందుకు సాగుతాము.

ఇక అర్థ తాత్పర్యాలతో సుందరకాండ ప్రారంభము.

||శ్లోకము 1.01||

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః |
ఇయేషపదమన్వేష్టుం చారణాచరితే పథే ||1.01||

స|| తతః రావణ నీతాయాః సీతాయాః పదం అన్వేష్టుం (హనుమాన్) శత్రుకర్షణః చారణాచరితే పథి (చరితుం)ఇయేష ||

||శ్లోకార్థములు||

తతః రావణ నీతాయాః సీతాయాః -
అప్పుడు రావణునిచే తీసుకు పోబడిన సీతయొక్క
పదం అన్వేష్టుం -
వున్న ప్రదేశమును వెదుకుటకై
శత్రుకర్షణః -
శత్రువులను నాశనము చేయగలవాడు
చారణాచరితే పథి -
చారణులు వెళ్ళు మార్గములో ( పయనించుటకు)
ఇయేష -
నిశ్చయించుకొనెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు రావణునిచే తీసుకోబడిన సీత వున్న ప్రదేశమును వెదుకుటకై శత్రువులను నాశనము చేయగల హనుమంతుడు చారణులు వెళ్ళు మార్గములో పయనించుటకు నిశ్చయించుకొనెను. ||1.01||

శతృవులను నాశనము చేయగలవాడు హనుమంతుడు. ఆ హనుమంతుడు రావణునిచే తీసుకుపోబడిన సీతను వెదుకుటకై చారణులు పయనించు అంటే గగనమార్గమున పోవుటకు నిశ్చయించుకొనెను.

సుందరకాండలో మొదటి శ్లోకానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

మొదటి శ్లోకములో వాల్మీకి చెప్పినమాట హనుమంతుడు అన్వేషణకై బయలు దేరుతాడు అని.

ఎలాంటి హనుమంతుడు బయలు దేరాడు?

ఆ హనుమంతుడు రాముని అనుజ్ఞను పొంది , రామునిచే ఇవ్వబడిన అంగుళీయకమును తీసుకొని బయలు దేరినవాడు. అంటే భగవదనుజ్ఞను పొంది భగవద్దత్తమైన అంగుళీయకముతో సీతాన్వేషణకు బయలుదేరినవాడు అన్నమాట.

సీత అంటే నాగటిచే దువ్వబడుతున్న క్షేత్రములో, నాగటి చాలులో దొరికినది అని.
సీతమ్మ జనకునకు అలాగే దొరికినది. అందుకే సీత అనబడినది. అలాగే శరీరమనబడు కర్మక్షేత్రములో సూక్ష్మణమగు బుద్ధిచేత త్రవ్వబడితే దొరికేది ఆత్మ. అదే సీత, అదే ఆత్మ.

అంటే హనుమంతుడు, భగవంతుని నుంచి వేరుపడిన జీవుని ( సీత ) అన్వేషణకై బయలుదేరాడు. అన్వేషణ ఎందుకు? అన్వేషించి ఆ జీవుని పరమాత్మతో కలపడానికే. అంటే సీతాన్వేషణలో అంతర్గతముగా వున్నది ఆత్మాన్వేషణయే.

అత్మాన్వేషణకి ముఖ్యము గురువు. ఆ గురువే హనుమంతుడు.

గోవిందరాజుల వారి సంస్కృత టీకా లో గురువు అన్నమాటకి సంస్కృతములో విశ్లేషము వుంది ."గు శబ్దస్త్వత్ అంధకారః స్యాత్ రు శబ్దత్వాత్ తన్ నిరోధకః | అంధకారనిరోధిత్వాత్ గురుః ఇత్యభిధీయతే|" అంటే గు శబ్దము అంధకారమును సూచిస్తుంది. రు శబ్దము దానిని నిరోధించుట సూచిస్తుంది. అంధకారము అజ్ఞానము నిరోధించువాడు కనక గురువు ఆనబడతాడు. అలా సంస్కృతములో ప్రతి శబ్దానికి అర్థము, ఆ శబ్దము ఎలా ఉత్పత్తి అయినదో ఉంటుంది.

ఇక్కడ హనుమంతుడుని శత్రుకర్షనుడు అని పిలుస్తారు. అంటే శతృవులను అణగదొక్కగలవాడు అని.

హనుమంతుడు సీతమ్మను బాధపెట్టు రాక్షస మూకలను అణగదొక్కగలవాడు అన్నమాట.

ఇంకో మాట.

సీత ఎవరిచే తీసుకు పోబడినది?
రావణునిచేత.

రావణుడు అంటే అర్థము - "రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి ఇతి రావణః". అసత్యమైన ప్రలాపములు కలిగించువాడు కనుక రావణుడు అని. అంటే "నేను" "నాది" అనబడు అసత్ అంటే అసత్యమైన ప్రలాపములను కలిగించువాడు కనక రావణుడు అని. వాడు అవివేకుడు.

"నేను" నాది" ఆనబడు అసత్ ప్రలాపములు కలిగించేది ఏమిటి? అదే మన మనస్సు.

అంటే రావణుడు అంటే మనస్సు అన్నమాట. అంటే రావణుడు అనబడే మనస్సుచేత అపహరించి తీసుకో పోబడిన సీత లేక ఆత్మను వెదకడానికి హనుమంతుడు బయలు దేరాడు అన్నమాట.

అంటే మొదటి శ్లోకములో భగవదనుజ్ఞనుపొంది భగవద్దత్తమైన అంగుళీయకము తీసుకొని రావణుడు అనబడు మనస్సుచేత అపహరింపబడిన సీత అనబడు ఆత్మాన్వేషణకు బయలుదేరాడు అన్నమాట.

మన అధ్యాత్మిక చింతనలో ఆత్మను పరమాత్మతో చేర్చడమే లక్ష్యము. సుందరకాండలో కూడా అదే లక్ష్యము.

చాలామందికి ఈ శ్లోకము పఠిస్తే బంధనము నుండి విముక్తి కలుగుతుంది అని నిలకడ.
చాలామందికి ఈ శ్లోకము చదివితే చికిత్సకు వీలుగాని రోగములు కూడా నయమగును అని భావము , అని రాస్తారు భాష్యం అప్పలాచార్యులు గారు.

అంటే ఈ ఒక్క శ్లోకము చదివితే చాలు ధ్యానరూపముగా అని.

ధ్యానములో నిమగ్నమౌటానికి ఒక మంత్రము కావాలి. అనేక మందికి ఈ శ్లోకమే ఒక మంత్రము.

మొదటి శ్లోకము మీద గోవిందరాజులవారు ఇలా రాస్తారు.- 'అత్ర ఏకాదశ సహస్ర శ్లోకా గతాః| ద్వాదస సహస్రస్యాదిమోఽయం శ్లోకః'; అంటే ఇక్కడిదాకా పదకొండు వేల శ్లోకములు చెప్పబడినవి. ఈ శ్లోకము పన్నెండవ సహస్రములో మొదటి శ్లోకము అని. ఇరువది నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణములో , గాయత్రి మంత్రములోని ఇరువది నాలుగు అక్షరములు ఇమిడివున్నాయి అని చెప్పబడినది. ప్రతి సహస్రములోనూ మొదటి శ్లోకములో ఆ గాయత్రీ బీజాక్షరము ఉంటుంది అన్నమాట. అదే మాట గురించి గోవిందరాజులవారు ఇలా రాస్తారు."అత్ర గాయత్ర్యాః ద్వాదశమక్షరం ప్రయుక్తమ్ తత్ అవలోకనీయం విద్వద్భిః"| ఇక్కడ గాయత్రి మంత్రములోని పన్నెండవ అక్షరము ఉపయోగించబడినది. అది పండితులు గమనించవలసినమాట అని. ఒక ముఖ్యమైన అక్షరము - గాయత్రీ మంత్రములోని పన్నెండవ అక్షరము " వ" అన్నది, తతోరావణనీతాయాః అన్న పాదములోని 'రావణ' అన్న పదములో వుంది. రామాయణములో మధ్యభాగములో వచ్చు సుందరకాండలో ఇరువది నాలుగు అక్షరముల గాయత్రీ మంత్రములోని పన్నెండవ అక్షరము "వ" బీజాక్షరము లాగా వుంది అన్నమాట. అలాగ బీజాక్షరము కల ఈ మొదటి శ్లోకము ఒక మంత్రము కూడా.

మొదటి శ్లోకములో ఇంకా ఒక రహస్యము వుంది.

మనము విన్నది - హనుమ భగవదనుగ్రహముతో భగవద్దత్తమైన అంగుళీయకముతో సీతాన్వేషణకు అంటే భగవంతుని నుంచి దూరమైన జీవాత్మను అన్వేషించడానికి బయలు దేరు తాడు అని.

ఎలా బయలుదేరుతాడు? అది కూడా ఈ శ్లోకములో వింటాము.

'చారణా చరితే పథిః" - అంటే ఆకాశమార్గమున పయనించు చారణులు పోవు మార్గములో అని . చారణా అంటే ఋషులు అని కూడా అనవచ్చు. అప్పుడు చారణా చరితే పథిః అంటే ఋషులు వెళ్ళిన మార్గములో అని కూడా అర్థము.

అంటే హనుమంతుడు పూర్వము పెద్దలు అగు ఋషులు వెళ్ళిన మార్గముననే వెళ్ళెను అని. దీనిలో మనకి వచ్చే అర్థము, శాస్త్రములను చదివినా గాని అనుమానం ఉంటే పెద్దల నడవడి యే అనుసరింపతగినది అని. ఇదే ఉపనిషత్తులలో కూడా చెప్పబడినది.

"అథ యది తే కర్మవిచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ యే తత్ర బ్రాహ్మణాః సమదర్శినః అలూక్షా ధర్మకాస్స్యుః | యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః |"

ఈ ఉపనిషత్తు వాక్యము చదువుతున్నపుడే చాలాభాగము మనకు సులభముగా అర్థమవుతుంది. "ఎక్కడైన కర్మ ఆచరణలో సందేహము వున్నా, లేక విషయానుసరణలోకాని సందేహము వున్నా, అక్కడ ధర్మమార్గమున నడచు బ్రాహ్మణులు ఏ విధముగా ప్రవర్తిస్తారో ఆవిధముగా ప్రవర్తింపవలెను అని".

"చారణా చరితే పథిః"" అన్న మాటలో మనకి వినిపించేది ఆ ఉపనిషత్తులమాటే !

ఇక్కడ ఇంకో మాట కూడా వుంది.

చారణా చరితే పథి అంటే ఆకాశమార్గమున అని. 'ఆకాశ్' అంటే అంతటా సంపూర్ణముగా ప్రకాశించువాడు, అంటే పరమాత్మ. ఆకాశమార్గమున వెళ్ళుట అంటే- సతతముగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట అని. అలా బ్రహ్మనిష్ఠ కలిగిన వాడే జీవులను తరింపచేయగలడు. అట్టివాడే ఆత్మ అన్వేషణలో విజయము సాధిస్తాడు.

ఇలాగ సీతాన్వేషణకు బయలు దేరిన హనుమంతుడు సుందరకాండలో భవదనుగ్రహము కలవానిగా, సాధకునిగా , రామదూత లాగా కనిపిస్తాడు.

ఇక రెండవ శ్లోకము.

||శ్లోకము 1.02||

దుష్కర్షం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః |
సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ||1.02 ||

స|| వానరః దుష్కరం కర్మ నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ సముదగ్ర శిరో గ్రీవః (సః వానరః) గవాంపతి ఇవ బభౌ||1.02||

||శ్లోకార్థములు||

దుష్కరం కర్మ నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ -
దుష్కరమైన ఇతరులకు సాధ్యముకాని పనిని సాధించుటకై ;
సముదగ్ర శిరో గ్రీవః -
మెడను చాచి తలపైకెత్తి ;
గవాంపతి ఇవ బభౌ-
గోవులకు పతి వలె విరాజిల్లెను ;

||శ్లోకతాత్పర్యము||

ఆ వానరుడు దుష్కరమైన ఇతరులకు సాధ్యముకాని పనిని సాధించుటకై, మెడను చాచి తలను పైకెత్తి గోవులకుపతి అయిన ఆంబోతు వలె విరాజిల్లాడు. ||1.02||

సీతాన్వేషణకి బయలుదేరిన హనుమ, - దుష్కరం నిష్ప్రతిద్వంద్వం - దుష్కరమైన, సాటిలేని కార్యము చేయుటకు నిశ్చయించుకొనెను.

ఆ కార్యము నూరు యోజనముల సముద్రము దాటడమే. నూరుయోజనముల సముద్రమును ఒక్కగంతులో దాటడము అన్నది ఒక దుష్కరమైన పని. సంసార సముద్రమును ఏ ప్రతిబంధముబంధకములు లేకుండా దాటడము కూడా ఒక దుష్కరమైన పనియే.

అలాంటి సముద్రము దాటుటకు "గవాం పతిః ఇవాబభౌ" వృషభరాజము వలె మెడ నిక్క నిటారుగా పెట్టి హనుమంతుడు నిలబడ్డాడుట.

వృషభము ఏది అడ్డొచ్చినా గాని ఆగక ముందుకు దూసుకుపోతుంది. అలాగే హనుమంతుడు కూడా ముందుకు పోవును అని వాల్మీకి మాటలలో ఇంకోధ్వని.

||శ్లోకము 1.03||

అథ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః |
ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖమ్ ||1.03||

స||అథ హనుమాన్ ధీరః మహాబలః వైడూర్య వర్ణేషు సలిల కల్పేషు శాద్వలేషు యథా సుఖం విచచార ||

||శ్లోకార్థములు||

అథ హనుమాన్ ధీరః మహాబలః -
అప్పుడు మహాబలుడైన ధీరుడైన హనుమ ;
వైడూర్య వర్ణేషు సలిల కల్పేషు శాద్వలేషు -
వైఢూర్యమణులవలె ఆకుపచ్చని రంగుకల ;
సలిల కల్పేషు శాద్వలేషు -
నీటి వలె కనపడు పచ్చిక బీళ్ళమీద ;
యథా సుఖం విచచార -
సుఖముగా పచార్లు చేసెను ;

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు మహాబలవంతుడు ధీరుడు అయిన హనుమంతుడు వైఢూర్యమణులలా ఆకుపచ్చని రంగుతో నీటివలె కనపడు పచ్చిక బీళ్ళమీద సుఖముగా పచార్లు చేశాడు.||1.03||

అలా తయారుగా వున్న హనుమ (ధీరుడు), కొండపై సమతల ప్రదేశములో వైడూర్యము వంటి రంగుగల పచ్చికబయళ్ళలో ముందుకు వెనకకు నడుస్తున్నాడుట. ఇక్కడ ధీరుడుఆన్న పదము హనుమంతునికి వాడబడినది.

పచ్చిక బయళ్ళు అంటే విషయ భోగములు. సంతోషము కలిగించు స్థానములు. కార్యాచరణలో నిమగ్నులైనవారు వాటిలో విహరించున్నప్పటికీ తనమనస్సును ఆ విషయభోగములపై రమించక తన గమ్యస్థానముపై ఉంచవలెను.

ఇక్కడ హనుమంతుని దృష్టి ఆకాశముపై , అంటే ఆకాశమనే పరబ్రహ్మముపై దృష్ఠి కలవాడై ఉండెను.

పచ్చికబయళ్ళపై తిరుగుతున్న హనుమంతుడిని ధీరుడు అనడములో ఇంకో మాట వుంది. పచ్చికబయళ్ళపై తిరుగుతున్న వాడిని ధీరుడు అనవలసిన విషయము లేదు. కాని ఇక్కడ ధీరుడు అన్న మాట ప్రయోగించబడినది. ధీరుడు అంటే, "ధీ" బ్రహ్మజ్ఞానమున, "ర" రమించువాడు అంటే బ్రహ్మజ్ఞానమున రమించు హనుమ కి ఈ పచ్చిక బయళ్లపై నడిచినా అతని నిష్ఠకు భంగము కలగదు అన్నమాట. అంటే హనుమంతుడు అంత నిష్ఠ గలవాడన్నమాట.

||శ్లోకము 1.04||

ద్విజాన్ విత్రాశయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ |
మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ వ కేశరీ ||1.04 ||

||శ్లోకార్థములు||

ధీమాన్ (హనుమతః) కేశరీ ఇవ -
అ ధీమంతుడు ( హనుమ) సింహము వలె;
ద్విజాన్ విత్రాశయన్ -
పక్షులను భయపెట్టుచు ;
సుబహూన్ మృగాంశ్చ నిఘ్నన్ -
మృగసముదాయములకు అలజడి కలిగించుచూ ;
ప్రవృద్ధః పాదపాన్ ఉరసా హరన్ -
పెద్ద వృక్షములను తన ఛాతితో కూలద్రొక్కుచు ;

||శ్లోకతాత్పర్యము||

అ ధీమంతుడు ( హనుమ) పక్షులను భయపెట్టుచూ, మృగసముదాయములకు అలజడి కలిగించుచూ, పెద్ద వృక్షములను తన ఛాతితో కూలద్రొక్కుచూ, సింహము వలె (తిరగసాగెను).||1.4||

||శ్లోకము 1.05||

నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణైః సితాసితైః |
స్వభావ విహితైశ్చితైః ధాతుభిః సమలంకృతమ్ ||1.05 ||

స||( సః గిరివర్యః ) స్వభావ విహితైః నీల లోహిత మాంజిష్ట పత్రవర్ణైః సితాసితైః (చ) చిత్రైః ధాతుభిః సమలంకృతం ||

||శ్లోకార్థములు||

నీల లోహిత మాంజిష్ట పత్రవర్ణైః -
నీలిమ ఎఱుపు పసుపు ఆకుపచ్చని ;
సితాసితైః (చ)
- తెలుపు నలుపు రంగులు కల ;
స్వభావ విహితైః చిత్రైః ధాతుభిః
- సహజ సిద్ధమైన చిత్రమైన ధాతువులతో ;
సమలంకృతం
- అలంకరింపబడినట్లు వుండెను ;

||శ్లోకతాత్పర్యము||

నీలిమ ఎఱుపు పసుపు ఆకుపచ్చని అలాగే తెలుపు నలుపు రంగులు కల సహజ సిద్ధమైన చిత్రమైన ధాతువులతో ఆ పర్వతరాజము అలంకరింపబడినట్లు వుండెను. ||1.5||

||శ్లోకము 1.06||

కామరూపిభిరావిష్టమ్ అభీక్ష్ణం సపరిఛ్ఛదైః |
యక్షకిన్నర గంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః ||1.06||

స|| (సః గిరివర్యః) కామరూపిభిః యక్ష కిన్నర గంధర్వైః పన్నగైః సపరిచ్ఛదైః దైవకల్పైశ్చ అభీక్షణమ్ ఆవిష్ఠం ||

||శ్లోకార్థములు||

కామరూపిభిః యక్ష కిన్నర గంధర్వైః
- ఇఛ్చానుసారము రూపము ధరించగల యక్ష కిన్నర గంధర్వులచేత ;
దైవకల్పైశ్చ పన్నగైః సపరిచ్ఛదైః
- దేవతలతో సమానులైన పన్నగములచేత వారి వారి పరివారములచేత ;
అభీక్షణమ్ ఆవిష్ఠం
- తరచుగా అనుభవించబడుచున్నది ;

||శ్లోకతాత్పర్యము||

ఆ పర్వతము తమ ఇఛ్చానుసారము రూపము ధరించగల యక్ష కిన్నర గంధర్వులచేత, దేవతలతో సమానులైన పన్నగులచేత, తమ పరివార సమేతముగా వారిచే తరచుగా అనుభవించబడుచున్నది. ||1.07||

||శ్లోకము 1.07||

స తస్య గిరివరస్య తలే నాగవరాయుతే |
తిష్ఠన్ కపివరః తత్ర హ్రదే నాగ ఇవాబభౌ || 1.07 ||

స|| నాగవరాయుతే తస్య గిరివరస్య హృదే తలే తిష్ఠన్ స కపివరః నాగః ఇవ అబభౌ||

||శ్లోకార్థములు ||

తలే నాగవరాయుతే
- దిగువ శ్రేష్ఠమైన గజములతో సంచరింపబడుచున్న ;
తస్య గిరివర్యస్య హృదే తిష్ఠన్
- ఆ పర్వతరాజముయొక్క మధ్యలో నిలబడి ;
స కపివరః నాగః ఇవ అబభౌ
- ఆ కపివరుడు గజమువలె కనిపించెను ;

||శ్లోకతాత్పర్యము||

దిగువ శ్రేష్టమైన ఏనుగులతో సంచరింపబడుచున్న ఆ పర్వతరాజముయొక్క మధ్యలో నిలబడి ఆ కపివరుడు గజమువలె కనిపించెను ||1.07||

||శ్లోకము 1.08||

స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే |
భూతేశ్చాభ్యాంజలిం కృత్వా చకార గమనే మతిమ్ ||1.08 ||

స|| సః సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యః అంజలిం కృత్వా గమనే మతిం చకార ||

||శ్లోకార్థములు ||

సూర్యాయ మహేంద్రాయ పవనాయ
- సూర్యునకు మహేంద్రునకు వాయుదేవునకు;
స్వయంభువే భూతేభ్యః
- బ్రహ్మదేవునకు సమస్త భూతములకు ;
అంజలిం కృత్వా - అంజలిఘటించి;
సః గమనే మతిం చకార - ఆతడు వెళ్ళుటకు సంకల్పించుకొనెను;

||శ్లోకతాత్పర్యము||

సూర్యునకు మహేంద్రునకు వాయుదేవునకు బ్రహ్మదేవునకు సమస్త భూతములకు అంజలిఘటించి అ హనుమంతుడు వెళ్ళుటకు సంకల్పించుకొనెను. ||1.08||

ఇక్కడ టీకా త్రయములో ఇలా రాస్తారు. "ఏతేన సకలవిఘ్న నివారణాయ ఇష్ఠ దేవతా ప్రార్థనాపూర్వం యాత్రా కర్తవ్యేతి సదాచారో బోధితః".

ఇలా హనుమ అంజలి ఘటించాడు అని చెప్పడములో యాత్రకి వేళ్ళేముందర సకలవిఘ్నములు నివారించడము కోసము ప్రార్థనాపుర్వకముగా పూజచేయాలని సదాచారము చెప్పబడినది అని. అంటే ఏ కార్యము మొదలెట్టినా ప్రార్థనలతో మొదలెట్టాలి అని భావము.

||శ్లోకము 1.09 ||

అంజలిం ప్రాజ్ఞ్ముఖం కృత్వా పవనాయాత్మ యోనయే |
తతోఽభివవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్ ||1.09||

స||ప్రాజ్ఙ్ముఖః ఆత్మయోనయే పవనాయ అంజలిం కృత్వా దక్షిణః హనుమాన్ తతః దక్షిణ దిశం గంతుం వవృధే హి||

గోవిన్దరాజటీకాలో - అంజలిమితి | ఆత్మయోనయే స్వకారణ భూతాయ దక్షిణః సమర్థః హనుమాన్ ప్రాజ్ఞ్ముఖఃసన్ ఆత్మయోనయే పవనాయ అంజలిం కృత్వా తతో దక్షిణాం దిశం గన్తుం వవృధే ఇత్యన్వయః |

||శ్లోకార్థములు ||

ప్రాజ్ఙ్ముఖః ఆత్మయోనయే పవనాయ
- తూర్పు దిశగా తిరిగి తన తండ్రి అయిన వాయువునకు ;
అంజలిం కృత్వా
- అంజలి ఘటించి;
దక్షిణః హనుమాన్
- దక్షతగల హనుమంతుడు ;
దక్షిణ దిశం గంతుం తతః వవృధే హి
- దక్షిణ దిశగా వెళ్ళుటకు అప్పుడు తన దేహముపెంచెను ;

||శ్లోకతాత్పర్యము||

తూర్పు దిశగా తిరిగి, తన తండ్రి అయిన వాయువుకు అంజలిఘటించి , దక్షుడగు హనుమంతుడు, అప్పుడు దక్షిణ దిశగా వెళ్ళుటకు తన దేహమును పెంచెను.||1.09||

అలా దుష్కరమైన కార్యము చేపట్టబోతూ తలచి ఎగరబోయే ముందర హనుమంతుడు ఇష్ఠదేవతలకు నమస్కరిస్తాడు.

ఏ కార్యము మొదలెట్టబోతున్నా ముందు సంధ్యావందనము చేయవలెను. అది మన శాస్త్రములలో చెప్పిన మాట. "సంధ్యాహీనః అశుచిః నిత్యం అనర్హః సర్వకర్మసు";
"శుచిలేని వాడు సంధ్యా హీనుడు అన్ని కార్యములకు అనర్హుడు" అని.

అదే మాటను పాటిస్తూ ఇక్కడ హనుమ సూర్యునకు మహేంద్రునికి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి తన కార్యము మొదలెడతాడు.

తన కార్యము మొదలెట్టడానికి వాల్మీకి చే వర్ణింపబడిన హనుమ చేసిన పనులలో బాహువులను నిశ్చలముగా నిలుపుట, కటిని ( పొట్టను ) సంకోచింపచేయుట, భుజములను వంచుట, చెవులు తిన్నగా నిలుపుట ఇవన్ని మహేంద్ర పర్వతము మీదనుంచి ఎగరడానికి ముందు తయారవడానికి చేసిన పనులు .

ఈ పనులు కూడా ఇంద్రియముల యొక్క ప్రవృత్తిని నియమము లో ఉంచుటకు చేయబడు సాధనలు, కార్యములు. ఇవి అన్నీ యోగాభ్యాసము చేయువిధానములు. ఇలా యోగాభ్యాసనము చేసినపుడు శరీరములో స్వేదనము కంపనము కలుగును. ఇక్కడ హనుమ చేసిన క్రియలతో కొండ కదిలెను. నీరు స్రవించెను. లోపలనున్న రాజస తామస గుణములు అంటే స్వభావములు వెలికి పోయి సాత్విక స్వభావము ఏర్పడును.

||శ్లోకము 1.10 ||

ప్లవంగప్రవరైర్దృష్టః ప్లవనే కృత నిశ్చయః |
వవృధే రామవృధ్యర్థం సముద్ర ఇవ పర్వసు || 1.10 ||

స|| (యదా) ప్లవంగ ప్రవరైః దృష్టః - (తదా) ప్లవనే కృత నిశ్చయః హనుమాన్ రామవృధ్యర్థమ్ పర్వసు ( పర్వదినేషు) సముద్ర ఇవ వవృధే (యథా) ||

తిలక టీకాలో- రామవృధ్యర్థమ్ రామాభ్యుదయాయ|

||శ్లోకార్థములు||

ప్లవంగ ప్రవరైః దృష్టః
- ప్లవంగ ప్రవరులు చూస్తూ వుండగా ;
ప్లవనే కృత నిశ్చయః
- ఎగురడానికి కృతనిశ్చయుడై ;
రామవృధ్యర్థమ్
- రాముని అభ్యుదయము కోరినవాడై ;
పర్వసు ( పర్వదినేషు) సముద్ర ఇవ వవృధే (యథా)
- పర్వదినములలో సముద్రము వలె తన శరీరము పెంచెను ;

||శ్లోకతాత్పర్యము||

ప్లవంగ ప్రవరులు ( వానర వీరులు) చూస్తూ వుండగా , రామ అభ్యుదయముకోరినవాడై ఎగరడానికి కృతనిశ్చయుడై , పర్వదినములలో సముద్రము పొంగిన రీతిని తన శరీరమును పెంచెను. ||1.10||

||శ్లోకము 1.11||

నిష్ప్రమాణశరీరస్సన్ లిలింఘయిషురర్ణవమ్ |
బాహుభ్యాం పీడయామాస చరాణాభ్యాం చ పర్వతమ్ || 1.11 ||

స|| నిష్ప్రమాణ శరీరః సన్ అర్ణవమ్ (సాగరం) లిలింఘయిషు బాహుభ్యాం చరణాభ్యాం చ పర్వతమ్ పీడయామాస||

||శ్లోకార్థములు||

అర్ణవమ్ (సాగరం) లిలింఘయిషు
- సముద్రము లంఘించుటకై ;
నిష్ప్రమాణశరీరస్సన్
- ప్రమాణములేనట్లు శరీరము పెంచి ;
బాహుభ్యాం చరణాభ్యాం చ
- బాహువులచేతనూ పాదములతోనూ;
పర్వతమ్ పీడయామాస
- ఆ పర్వతమును నొక్కిపెట్టెను ;

||శ్లోకతాత్పర్యము||

సముద్రము లంఘించుటకై ప్రమాణములేనట్లు శరీరము పెంచి, ఆ పర్వతమును తన చేతులతో పాదములతోను నొక్కిపట్టెను. ||1.11||

ప్రమాణము లేనట్లు అంటే కొలవడానికి సాధ్యముకానట్లుగా, శరీరము పెంచెను అన్నమాట.

||శ్లోకము 1.12 ||

స చచాలచలశ్చాపి ముహూర్తం కపి పీడితః |
తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్ ||1.12 ||

స|| అచలశ్చాపి కపి పీడితః ముహూర్తమ్ చచాల | (తదా) పుష్పితాగ్రాణాం తరూణాం సర్వం పుష్పం అశాతయత్||

రామ టీకాలో- కపిపీడితః అచలః స మహేన్ద్రః చచాల, అతయేవ పుష్పితాగ్రాణాం తరూణాం పుష్పం అశాతయత్|

||శ్లోకార్థములు||

అచలశ్చాపి కపి పీడితః
- అచలుడైనప్పటికి ఆ వానరునిచేత నొక్కబడినవాడై ;
ముహూర్తమ్ చచాల
- ఒక క్షణకాలము చలించెను ;
పుష్పితాగ్రాణాం తరూణాం
- పుష్పములతోనిండిన వృక్షములు ;
సర్వం పుష్పం అశాతయత్
- సమస్త పుష్పములను విడిచినవి ;

||శ్లోకతాత్పర్యము||

అచలుడైనప్పటికి ఆ వానరుని చే నొక్కబడిన వాడై, (ఆ పర్వతము) ఒక క్షణము చలించెను. అప్పుడు పుష్పములతో నిండిన వృక్షములు సమస్త పుష్పములను విడిచినవి.||1.12||

అచలమైన పర్వతము చలించడముతో, చెట్లనుంచి పుష్పములు రాలు తాయి. ఆ రాలిన పుష్పములతో, పర్వతము మరింత శోభిస్తుందిట.

||శ్లోకము 1.13||

తేన పాదపముక్తేన పుష్పౌఘేణ సుగంధినా |
పర్వతః సంవృతశ్శైలో బభౌ పుష్పమయో యథా ||1.13 ||

స|| శైలః పాదపముక్తేన సుగంధినా పుష్పౌఘేణ సంవృతః పర్వతః పుష్పమయో యథా బభౌ||

||శ్లోకార్థములు||

శైలః పాదపముక్తేన
- ఆ పర్వతము వృక్షములనుండి పడిన
సుగంధినా పుష్పౌఘేణ సంవృతః
- సుగంధముతో నిండిన పుష్పములతో కప్పివేయబడి
పర్వతః పుష్పమయో యథా బభౌ
- పుష్పములతో నిండిన పర్వతము వలె ఒప్పా రెను

||శ్లోకతాత్పర్యము||

ఆ పర్వతము వృక్షములనుండి పడిన సుగంధముతో నిండిన పుష్పములతో కప్పివేయబడి, పుష్పములతో నిండిన పర్వతము వలె ఒప్పా రెను. ||1.13||

||శ్లోకము 1.14||

తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వతః |
సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః ||1.14 ||

స|| తేన ఉత్తమవీర్యేణ పీడితః సః పర్వతః మత్తః ద్విపః మదం ఇవ సలిలం సుశ్రావ||

||శ్లోకార్థములు||

తేన ఉత్తమవీర్యేణ పీడితః
- ఆ ఉత్తమవీరుడగు వానిచేత నొక్కబడిన
సః పర్వతః - ఆ పర్వతము
మత్తః ద్విపః మదం ఇవ
- మదించిన గజము వదిలిన మదములాగ
సలిలం సుశ్రావ- నీళ్ళని వదిలెను

||శ్లోకతాత్పర్యము||

ఆ ఉత్తమవీరుడగు హనుమంతునిచే నొక్కబడి ఆ పర్వతము, మత్త గజము వదిలిన మదములాగ నీళ్ళని స్రవించెను. ||1.14||

||శ్లోకము 1.15||

పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః |
రీతిః నిర్వవర్తయామాస కాంచనాంజనరాజతీః ||1.15 ||

స|| మహేంద్ర పర్వతః తేన బలినా పీడ్యమానః కాంచనాంచన రాజతీః రీతిః నిర్వర్తయామాస||

||శ్లోకార్థములు||

మహేంద్ర పర్వతః తేన బలినా పీడ్యమానః
- అ మహేంద్ర పర్వతము అతనిచేత బలముగా నొక్కబడి
కాంచనాంజన రాజతీః
- కాంచనము అంజనము మున్నగువాటి
రీతిః నిర్వర్తయామాస
- శోభలతో మెరిసెను

||శ్లోకతాత్పర్యము||

ఆ మహేంద్ర పర్వతము ఆ హనుమంతుని బలముతో నొక్కబడి కాంచనము అంజనము మున్నగువాటి శోభలతో ప్రకాశించెను. ||1.15||

||శ్లోకము 1.16||

ముమోచ చ శిలాశ్శైలో విశాలాసమనశ్శిలాః |
మధ్యమేనార్చిషా జుష్ఠో ధూమరాజీః ఇవానలః|| 1.16||

స|| శైలః విశాలాః శిలాః సమనః శిలాః ముమోచ (యథా) మధ్యమేన అర్చిషా ధూమరాజీరివ అనలః జుష్టాః||

గోవిన్దరాజ టీకాలో - సమనశ్శిలాః ధాతువిశేషసహితాః శిలాః|

||శ్లోకార్థములు||

శైలః - ఆ పర్వతము
విశాలాః శిలాః - మహా శిలలను
సమనః శిలాః ముమోచ
- ధాతువులతో కూడిన శిలలను విడిచెను
మధ్యమేన అర్చిషా ధూమరాజీరివ
- అగ్నిజ్వాలలో మధ్యది అయిన ధూమ్రవర్ణమనబడె జ్వాలతో
అనలః జుష్టాః
- వున్న జ్వాలవలె

||శ్లోకతాత్పర్యము||

ఆ పర్వతము ధాతువులతో కూడిన శిలలను విశాలమైన శిలలను, ధూమ్రవర్ణముగల జ్వాలతో అగ్ని విరజిమ్మినట్లు విరజిమ్మెను. ||1.16||

||శ్లోకము1.17 ||

గిరిణాపీడ్యమానేన పీడ్యమానాని సర్వతః |
గుహావిష్ఠాని భూతాని వినేదుర్వికృతైః స్వరైః ||1.17||

స|| గిరిణా సర్వతః పీడ్యమానాని గుహావిష్టాని భూతాని పీడ్యమానేన వికృతైః స్వరైః వినేదుః ||

||శ్లోకార్థములు||

గిరిణా సర్వతః పీడ్యమానాని
- ఆ పర్వతము చేత అన్నివైపులా పీడింపబడుతూ
గుహావిష్టాని భూతాని
- పర్వత గుహలలో వున్న ప్రాణిచరములు
పీడ్యమానేన - పీడింపబడుటచేత
వికృతైః స్వరైః వినేదుః
- వికృతమైన స్వరములతో ఆక్రందించినవి.

||శ్లోకతాత్పర్యము||

ఆ పర్వతము చేత పీడింపబడిన గుహలలోనున్న జీవ జాలము అంతా భయముతో వికృతమైన స్వరములతో ఆక్రందించినవి. |1.17||

||శ్లోకము 1.18||

స మహాసత్వ సన్నాదః శైలపీడానిమిత్తజః |
పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ ||1.18||

స||శైలపీడా నిమిత్తజః సః మహాసత్త్వ సన్నాదః పృథివీన్ దిశశ్చ ఉపవనాని చ పూరయామాస||

||శ్లోకార్థములు||

శైలపీడా నిమిత్తజః
- పర్వతముచేత నొక్కబడిన
సః మహాసత్త్వ సన్నాదః
- ఆ మహాసత్త్వముల సన్నాదములు
పృథివీన్ దిశశ్చ
- భూమిని అన్ని దిశలను
ఉపవనాని చ పూరయామాస
- ఉపవనములను పూర్తిగా నింపినవి

పర్వతముచేత నొక్కబడిన ఆ మహాసత్త్వముల సన్నాదములు, భూమిని, అన్ని దిశలను, ఉపవనములను పూర్తిగా నింపినవి. ||1.18||

ఆ విధముగా, నొక్కబడిన పర్వతరాజముచే నొక్కబడిన పెద్దపెద్ద జంతువులచేత, చేయబడిన ధ్వనులు, భూమిలో అన్ని దిక్కులలో సమీప అరణ్యములలో ప్రతిధ్వనించాయి.

||శ్లోకము 1.19||

శిరోభిః పృథిభిః సర్పా వ్యక్త స్వస్తికలక్షణైః |
వమంతః పావకం ఘోరం దదంశుః దశనైశ్శిలాః ||1.19||

స|| వ్యక్త స్వస్తిక లక్షణైః పృథుభిః శిరోభిః ఘోరం పావకం వమన్తః సర్పాః దశనైః శిలాః దదంశుః ||

||శ్లోకార్థములు||

వ్యక్త స్వస్తిక లక్షణైః
- స్వస్థిక చిహ్నములు కనపడుచున్న
పృథుభిః శిరోభిః
- పడగలు కల తలలతో
ఘోరం పావకం వమన్తః
- ఘోరమైన అగ్నిని కక్కుతూ
సర్పాః దశనైః శిలాః దదంశుః
- సర్పములు కోరలతో శిలములను కరిచెను

||శ్లోకతాత్పర్యము||

స్వస్థిక చిహ్నములు గల పడగలుగల తలలతో కూడిన సర్పములు, ఘోరమైన విషమును కక్కుచూ, తమ కోరలతో శిలలను కరిచెను.||1.19||

||శ్లోకము 20 ||

తాస్తదా సవిషైః దష్టాః కుపితైః తైః మహాశిలాః |
జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రథా ||20||

స|| తదా కుపితైః సవిషైః ( సర్పైః) దష్టా మహాశిలాః పావకోదదీప్తాః జజ్వలుః సహస్రధా బిబిధుః చ||

||శ్లోకార్థములు||

తదా కుపితైః సవిషైః ( సర్పైః) దష్టా
- అప్పుడు కోపించి విషములుగలవానిచే కరవబడి
మహాశిలాః పావకోదదీప్తాః
- ఆ మహాశిలలు ఆ ఆగ్నిలో దహింపబడి
సహస్రధా బిబిధుః చ
- వెయ్యి ముక్కలుగా అయినవి.

||శ్లోకతాత్పర్యము||

ఆ విధముగా క్రోధముతో, విషముగల కోరలతో కొరకబడిన ఆ శిలలు, అగ్నిచే జ్వలించి వెయిముక్కలు అయినవి. ||1.20||

||శ్లోకము 1.21 ||

యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే |
విషఘ్నాన్యపి నాగానాం న శేకుః శమితం విషం||1.21||

స|| తస్మిన్ పర్వతే జాతాని ఔషధజలాని నాగానాం శమితం విషం విషఘ్నాన్యపి న శేకుః ||

||శ్లోకార్థములు||

తస్మిన్ పర్వతే జాతాని ఔషధజలాని
- ఆ పర్వతములో పెరిగిన ఔషధములు
నాగానాం శమితం విషం
- ఆ సర్పములచేత విడువబడిన విషములను
విషఘ్నాన్యపి న శేకుః
- విషసంహారకాలైనప్పటికి ఆ విషములను శమింపచేయలేకపోయాయి.

||శ్లోకతాత్పర్యము||

ఆ సర్పములచేత విడువబడిన విషములను, ఆ పర్వతములో పెరిగిన ఔషధములు విషసంహారకాలైనప్పటికి, (ఆ విషములను) శమింపచేయలేకపోయాయి. || 21||

||శ్లోకము 1.22 ||

భిద్యతేఽయం గిరిర్భూ తైరితి మత్వా తపస్వినః |
త్రస్తా విధ్యాధరః తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైసహ||1.22||

స|| అయం గిరిః భూతైః భిద్యతే ఇతి మత్వా త్రస్తా తపస్వినః (తథైవ) స్త్రీగణైః సహ విధ్యాధరః తస్మాత్ ఉత్పేతుః||

||శ్లోకార్థములు||

అయం గిరిః భూతైః భిద్యతే
- ఈ పర్వతము భూతములచేత ముక్కలు చేయబడుతున్నది
ఇతి మత్వా త్రస్తా తపస్వినః
- అని తలిచి భయపడిన తపస్వినులు
(తథైవ) స్త్రీగణైః సహ విధ్యాధరః
- ( అలాగే) స్త్రీగణములతో విద్యాధరులు
తస్మాత్ ఉత్పేతుః
- దానినుంచి పైకి ఎగిరిపోయిరి

||శ్లోకతాత్పర్యము||

ఈ పర్వతము భూతములచే ముక్కలు చేయబడుతున్నదని తలంచి, తపస్వీకులు అదే విధముగా తమ స్త్రీగణములతో విద్యాధరులు, ఆ పర్వతమునుంచి పైకి ఎగిరిపోయిరి. ||1.22||

||శ్లోకము 1.23||

పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనమ్|
పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ ||1.23||

స|| మహార్హాణి పాత్రాణి హైమ మాసవ భాజనం హిరన్మయాన్ కరకాంశ్చ హిత్వా ||

||శ్లోకార్థములు||

హైమమాసవభాజనమ్ - బంగారు మద్యపాత్రలు
మహర్హాణి పాత్రాణి చ - అమూల్యమైన పాత్రలను
కరకాంశ్చ హిరన్మయాన్ - పొడవైన బంగారు పాత్రలను
పానభూమిగతం హిత్వా - త్రాగుచున్నప్రదేశముపై వదిలి వేసి

||శ్లోకతాత్పర్యము||

( ఆ విద్యాధరులు) బంగారు మద్యపాత్రలు, అమూల్యమైన భోజనపాత్రలను, పొడవైన బంగారు పాత్రలను, త్రాగుచున్నప్రదేశముపై వదిలివేసి పైకి ఎగిరిపోయిరి. ||1.23||

||శ్లోకము 1.24||

లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ|
ఆర్షభాణీ చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ ||1.24||

స|| (విధ్యాధరాః) లేహ్యాన్ ఉచ్చావచాన్ భక్ష్యాన్ వివిధాని మాంసాని చ అర్షభాణి చర్మాణి కనకత్సరూన్ ఖడ్గాం చ హిత్వా (ఉత్పేతుః)||

||శ్లోకార్థములు||

లేహ్యాన్ ఉచ్చావచాన్ భక్ష్యాన్
- లేహ్యములు చిన్నవి పెద్దవి అగు భక్ష్యములు
వివిధాని మాంసాని చ
- వివిధరకములైన మాంసములు
అర్షభాణి చర్మాణి కనకత్సరూన్ ఖడ్గాం చ
- ఎద్దు చర్మములు బంగారు తొడుగు కల ఖడ్గములు
హిత్వా (ఉత్పేతుః)
- వదిలేసి పైకి ఎగిరి పోయిరి.

||శ్లోకతాత్పర్యము||

వారు లేహ్యములు, చిన్నవి పెద్దవి అగు భక్ష్యములు, వివిధరకములైన మాంసములు, ఎద్దు చర్మములు, బంగారు తొడుగు కల ఖడ్గములు వదిలేసి పైకి ఎగిరి పోయిరి. ||1.24||

||శ్లోకము 1.25||

కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనః |
రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే ||1.25||

స|| విధ్యాధరాః క్షీబాః కృతకంఠగణాః రక్తాక్షాః పుష్కరాక్షః చ రక్తమాల్యాను లేపనః గగనం ప్రతిపేదిరే||

||శ్లోకార్థములు||

కృతకంఠగణాః రక్తాక్షాః పుష్కరాక్షః
- మెడలో హారములు వేసికొనిన, ఎఱ్ఱటి కళ్ళు గల, పుష్పమువంటి కళ్ళు గలవారు,
రక్తమాల్యాను లేపనః
- ఎఱ్ఱటి పువ్వులమాలలు ధరించి దేహమునకు చందనము అలదినవారు,
క్షీబాః - మద్యపానముతో మదించినవారు
విధ్యాధరాః గగనం ప్రతిపేదిరే
- విద్యాధరులు ఆకాశములోకి ఎగిరిరి

||శ్లోకతాత్పర్యము||

మెడలో హారములు వేసికొనిన, ఎఱ్ఱటి కళ్ళు గలవారు, పుష్పమువంటి కళ్ళు గలవారు,ఎఱ్ఱటి పువ్వులమాలలు ధరించి దేహమునకు చందనము అలదినవారు, మద్యపానముతో మదించినవారు, అగు విద్యాధరులు ఆకాశములోకి ఎగిరిరి. ||1.25||

|| శ్లోకము 1.26||

హారనూపూర కేయూర పారిహార్యధరాః స్త్రియః |
విస్మితాః సస్మితాస్తస్థురాకాశే రమణైః సహ ||1.26||

స|| విస్మితాః సస్మితాః హారనూపూర కేయూర పారిహార్య ధరాః స్త్రియః రమణైః సహ ఆకాశే తస్థుః||

||శ్లోకార్థములు||

విస్మితాః సస్మితాః
- విస్మితులు సస్మితులు అయిన
హారనూపూర కేయూర పారిహార్య ధరాః
- హారములు నూపురములు, బాహుపురువులు అందియలు ధరించిన
స్త్రియః రమణైః సహ ఆకాశే తస్థుః
- స్త్రీలు తమప్రియులతో కూడి ఆకాశములో నిలబడిరి

||శ్లోకతాత్పర్యము||

విస్మితులు సస్మితులు అయిన, హారములు, నూపురములు, బాహుపురువులు, అందియలు ధరించిన స్త్రీలు, తమప్రియులతో కూడి ఆకాశములో నిలబడిరి. ||1.26||

||శ్లోకము 1.27||

దర్శయన్తో మహావిద్యాం విద్యాధరమహర్షయః |
సహితాస్తస్థురాకాశే వీక్షాంచక్రుశ్చ పర్వతమ్ ||1.27||

స|| విధ్యాధర మహర్షయః సహితాః మహావిద్యాం దర్శయన్తః ఆకాశే తస్థుః వీక్షాంచక్రుశ్చ పర్వతమ్||

||శ్లోకార్థములు||

విధ్యాధర మహర్షయః
- ఆ విద్యాధరులు మహర్షులు
మహావిద్యాం దర్శయన్తః
- తమ విద్యాప్రవీణతలు చూపిస్తూ
ఆకాశే తస్థుః పర్వతమ్వీక్షాంచక్రుశ్చ
- ఆకాశములో నిలబడి పర్వతమును చూచుచుండిరి

||శ్లోకతాత్పర్యము||

ఆ విద్యాధరులు మహర్షులు, తమ విద్యాప్రవీణతలు చూపిస్తూ, ఆకాశములో నిలబడి పర్వతమును చూచుచుండిరి.||1.27||

'దర్శయన్తః' అన్న పదమును విశ్లేషిస్తూ, రామ టీకా లో ఇలా చెప్పబడినది. 'మహావిద్యాం మహావిద్యాజనిత నిరవలమ్బన స్థితిరూపాం స్వశక్తిం దర్శయన్తః సహితా మిలితా విద్యాధర మహర్షయః అకాశే తస్థుః'. మహావిద్య, మహావిద్య వలన పుట్టిన ఆధారము లేకుండా ఆకాశములో నిలబడు శక్తిని ప్రదర్శిస్తూ అని భావము.

|| శ్లోకము 1.28||

శుశ్రువుశ్చ తదాశబ్దం ఋషీణాం భావితాత్మనాం|
చారణానాంశ్చ సిద్ధానాం స్థితానాం విమలేఽమ్బరే||28||

స|| తదా విమలే అమ్బరే స్థితానాం ఋషీణాం భావితాత్మనాం చారణానాం సిద్ధానాం చ ||

||శ్లోకార్థములు||

తదా విమలే అమ్బరే స్థితానాం
- అప్పుడు నిర్మలాకాశములో నిలబడినవారికి
ఋషీణాం భావితాత్మనాం
- పరిశుద్ధమనస్కులైన ఋషుల
చారణానాం సిద్ధానాం
- చారణుల సిద్ధుల
శబ్దం శుశ్రువుః
- మాటలు వినబడినవి

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు నిర్మలాకాశములో నిలబడినవారికి, పరిశుద్ధమనస్కులైన ఋషుల, చారణుల, సిద్ధుల మాటలు వినబడినవి. ||1.28||

||శ్లోకము 1.29||

ఏషపర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః |
తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయమ్ ||1.29||

స|| ఏషః పర్వత సంకాశః మారుతాత్మజః మహావేగః హనుమాన్ మకరాలయం సముద్రం తితీర్షతి ||

||శ్లోకార్థములు||

ఏషః పర్వత సంకాశః మారుతాత్మజః
- ఈ పర్వతముతో సమానుడు, వాయుపుత్రుడు
మహావేగః హనుమాన్
- మహావేగము కలవాడు అగు హనుమ
మకరాలయం సముద్రం తితీర్షతి
- మకరాలయమైన సముద్రమును దాటగోరుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

'ఈ పర్వతముతో సమానమైన వాడు, మహావేగము కలవాడు, వాయుపుత్రుడు అయిన హనుమంతుడు, మకరాలయమైన సముద్రమును దాటగోరుచున్నాడు'.||1.29||

||శ్లోకము 1.30||

రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరమ్ |
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి ||1.30||

స|| రామార్థం వానరార్థం చ దుష్కరం కర్మ చికీర్షన్ సముద్రస్య దుష్ప్రాపం పరం పారం ప్రాప్తుం ఇచ్ఛతి||

||శ్లోకార్థములు||

రామార్థం వానరార్థం చ
- రామునికొఱకు వానరులకొఱకు
దుష్కరం కర్మ చికీర్షన్
- దుష్కరమైన కార్యమును సాధించుటకు
సముద్రస్య దుష్ప్రాపం పరం పారం
- దాటశక్యముకాని సముద్రముయొక్క ఆవలి వడ్డు
ప్రాప్తుం ఇచ్ఛతి
- చేరగోరుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

'రామకార్యముకొఱకు, వానరుల కోసము, అన్యులకు శక్యము కాని, దుష్కరమైన కార్యమును సాధించుటకు, సముద్రమునకు ఆవలి వడ్దు చేరగోరచున్నాడు అని'. ||1.30||

ఇది చారణుల మాట. హనుమ ఈ పని చేస్తున్నది అంతా ఎవరికోసము? హనుమ చేస్తున్న ఈ పని, " రామార్థమ్" "వానరార్థమ్ చ". రామునికొరకు, వానరులకొరకు అని. అలాచెపుతూ కవి చేత హనుమయొక్క నిష్కామ కర్మ చెప్పబడినది.

ఆత్మజ్ఞానముకోసము భగవత్ప్రాప్తి కొరకు ప్రయత్నము చేసేవారు చేసే ప్రతి పని భగవదర్పణము చేసే చేస్తారు. ఏ పని తమ స్వలాభము కోసము చేయరు.

ఇదే మాట మనము అనేక విధములుగా అనేక సందర్భాలలో వింటాము.

మహాపురుషులు భగవత్ప్రీతి కొరకో, లోకక్షేమము కొరకో కర్మ చేస్తారు అని గీత లో చెప్పబడినది. అలాగే రాముని కొరకు వానరుల కొరకు హనుమ చేస్తున్న పనిని చూసినవారందరూ అదే నిష్కామ కర్మ అని భావిస్తారు.

||శ్లోకము 1.31||

ఇతి విద్యాధరాః శ్రుత్వా వచస్తేషాం తపస్వినామ్ |
తమప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభమ్ ||1.31||

స|| విధ్యాధరః తేషాం తపస్వినాం వచః శ్రుత్వా పర్వతే అప్రమేయం తం వానరరర్షభం దద్రుశుః ||

||శ్లోకార్థములు||

విధ్యాధరః తేషాం తపస్వినాం వచః శ్రుత్వా
- విద్యాధరులు ఆ తపస్వీకుల వచనములు విని
పర్వతే అప్రమేయం
- పర్వతము మీద అప్రమేయుడగు
తం వానరరర్షభం దద్రుశుః
- ఆ వానరలలో వృషభరాజమగు వానిని చూచిరి

||శ్లోకతాత్పర్యము||

ఆ తపస్వీకుల మాటలు విన్న విద్యాధరులు, అప్పుడు వానరులలో వృషభరాజమైన, అప్రమేయుడగు హనుమంతుని ఆ పర్వతము పై చూచిరి. ||1.31||

||శ్లోకము 1.32||

దుధువేచ స రోమాణి చకంపే చాచ లోపమః|
ననాద సు మహానాదం సుమహానివ తోయదః||1.32||

స|| సుమహాన్ సః అచలోపమః రోమాణి దుధువే చకంపే (తతః) తోయదః ఇవ సుమహానాదం ననాద ||

||శ్లోకార్థములు||

సః అచలోపమః రోమాణి దుధువే
- పర్వతముతో సమానమైన అతడు తన రోమములను విదిల్చెను,
కంపేచ
- శరీరమును కంపింపచేసెను
తోయదః ఇవ సుమహానాదం ననాద
- మహా మేఘమువలె గర్జించెను

||శ్లోకతాత్పర్యము||

పర్వతము వంటి శరీరము కల ఆ హనుమంతుడు తన రోమములను విదిల్చెను. శరీరమును కంపింపచేసెను. మహామేఘమువలె గర్జించెను. ||1.32||

||శ్లోకము 1.33||

ఆనుపూర్వేణ వృత్తస్య లాంగూలం లోమభిశ్చితమ్ |
ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగమ్ ||33||

స|| పక్షిరాజః ఉరగం ఇవ లోమభిః వృతం చితం లాంగూలం ఆనుపూర్యేణ ఉత్పతిష్యన్ విచిక్షేప ||

||శ్లోకార్థములు||

ఉత్పతిష్యన్ - ఎగురటకు సిద్ధముగా వున్న (హనుమ)
లోమభిః వృతం చితం లాంగూలం
- వెంట్రుకలతో పూర్తిగా నిండివున్నతోకను
పక్షిరాజః ఉరగం ఇవ
- పక్షిరాజు పన్నగమును (త్రిప్పినట్లు)
ఆనుపూర్యేణ విచిక్షేప
- గిరగిరా త్రిప్పెను

||శ్లోకతాత్పర్యము||

ఎగురటకు సిద్ధముగా వున్న హనుమ, వెంట్రుకలతో పూర్తిగా నిండివున్నతోకను, పక్షిరాజు పన్నగమును త్రిప్పినట్లు, గిరగిరా త్రిప్పెను. ||1.33||

|| శ్లోకము 1.34||

"తస్య లాంగూలమావిద్ధ మాత్త వేగస్య పృష్ఠతః|
దదృశే గరుడే నేవ హ్రియమాణో మహోరగః ||34||

స|| ఆత్తవేగస్య తస్య పృష్ఠతః గరుడేన హ్రియమాణః మహోరగః ఇవ లాంగూలం అవిద్ధం||

||శ్లోకార్థములు||

ఆత్తవేగస్య తస్య పృష్ఠతః
- మహావేగముతో పోబోతున్న అతని వెనకభాగమున
లాంగూలం అవిద్ధం
- చుట్టబడిన లాంగూలము
గరుడేన హ్రియమాణః మహోరగః ఇవ
- గరుత్మంతునిచే తీసుకొనిపోబడుతున్న సర్పము వలె (ఉండెను)

||శ్లోకతాత్పర్యము||

మహావేగముతో పోతుబోన్న, అతని వెనకభాగమున చుట్టబడిన లాంగూలము, గరుత్మంతునిచే తీసుకొనిపోబడుతున్న సర్పము వలె ఉండెను. ||1.34||

||శ్లోకము 1.35||

బాహూసంస్తంభయామాస మహా పరిఘ సన్నిభౌ |
ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ||1.35||

స|| కపిః మహాపరిఘసన్నిభౌ బాహుః సంస్తంభయామాస కట్యాం ససాద చరణౌ సంచుకోచ చ ||

||శ్లోకార్థములు||

కపిః మహాపరిఘసన్నిభౌ బాహుః
- ఆ వానరుడు గొప్ప పరిఘలాంటి బాహువులను
సంస్తంభయామాస
- గట్టిగా పర్వతముపై బిగపట్టి
కట్యాం ససాద
- నడుము బిగించి
చరణౌ సంచుకోచ చ
- పాదములను ఎగురటకు సిద్ధముగా మడిచిపెట్టెను

||శ్లోకతాత్పర్యము||

ఆ వానరుడు గొప్ప పరిఘలాంటి బాహువులను, గట్టిగా పర్వతముపై బిగపట్టి, నడుము బిగించి, పాదములను ఎగురటకు సిద్ధముగా మడిచిపెట్టెను. ||1.35||

తిలక టీకా లో 'సంస్తంభయామాస' అన్న మాటకి ఇలారాస్తారు. 'బాహోః సంస్తంభనం నామ పర్వతోపరి ధృఢప్రతిష్టాపనమ్ ;

గోవిన్దరాజులవారు ఇక్కడ సముద్రలంఘనమునకు తయారు అవడము వర్ణించబడుతున్నది అంటారు; 'లఙ్ఘనోద్యోగకాలికావస్థాం వర్ణయతి' అని.

||శ్లోకము 1.36||

సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరామ్|
తేజః సత్త్వం తథా వీర్య మావివేశ స వీర్యవాన్ ||36||

స|| వీర్యవాన్ శ్రీమాన్ హనుమాన్ భుజౌ తథైవ శిరోధరామ్ సంహృత్య సత్త్వం తేజః తథా వీర్యమ్ ఆవివేశ|| 1.36||

||శ్లోకార్థములు||

వీర్యవాన్ శ్రీమాన్ హనుమాన్
- అతి పరాక్రమవంతుడు, శ్రీమంతుడు అయిన హనుమ
భుజౌ తథైవ శిరోధరామ్ సంహృత్య
- భుజములను అదేవిధముగా శిరస్సును వంచి
సత్త్వం తథా తేజః ఆవివేశ
- బలమును తేజస్సును పెంపొందించెను

||శ్లోకతాత్పర్యము||

అతి పరాక్రమవంతుడు, శ్రీమంతుడు అయిన హనుమ, తన భుజములను అదేవిధముగా శిరస్సును వంచి, తనలో బలమును తేజస్సును పెంపొందించెను. ||1.36||

||శ్లోకము 1.37||

మార్గమాలోకయన్ దూరా దూర్ధ్వం ప్రణిహితేక్షణః|
రురోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ ||1.37||

స|| ఊర్ధ్వం ప్రణిహితేక్షణః దూరాత్ ఆకాశం మార్గం అవలోకయన్ ప్రాణాన్ హృదయే రురోద||

||శ్లోకార్థములు||

ఊర్ధ్వం ప్రణిహితేక్షణః
- కళ్ళను పైకెత్తి
దూరాత్ ఆకాశం మార్గం అవలోకయన్
- దూరములో ఆకాశమార్గమును చూచుచు
ప్రాణాన్ హృదయే రురోద
- ప్రాణవాయువును హృదయములో నిరోధించెను.

||శ్లోకాతాత్పర్యము||

తన కళ్ళను పైకెత్తి, దూరములో ఆకాశమార్గమును చూచుచు, తన ప్రాణవాయువును హృదయములో నిరోధించెను. ||1.37||.

||శ్లోకము 1.38||

పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః |
నికుంచ్య కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః |
వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచన మబ్రవీత్ ||1.38||

స|| కపికుంజరః మహాబలః పద్భ్యాం దృఢం అవస్థానమ్ కర్ణౌ నికుంచ్య ఉత్పతిష్యన్ (కిం కరోతి?) వానరాన్ వానరశ్రేష్ఠం ఇదం వచనం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

కపికుంజరః మహాబలః
- వానరులలో గజము వంటివాడు, మహాబలవంతుడు
ఉత్పతిష్యన్ పద్భ్యాం దృఢం అవస్థానమ్
- ఎగురుటకు సిద్ధముగా పాదములను ధృఢముగా అదిమిపెట్టి
కర్ణౌ నికుంచ్య
- చెవులను వంచి,
వానరాన్ వానరశ్రేష్ఠం ఇదం వచనం అబ్రవీత్
- వానరశ్రేష్ఠుడు వానరులతో ఈ మాటలు చెప్పెను.

||శ్లోకాతాత్పర్యము||

వానరులలో గజము వంటివాడు, మహాబలవంతుడు అగు హనుమ ఎగురుటకు సిద్ధముగా పాదములను ధృఢముగా అదిమిపెట్టి చెవులను వంచి , వానరులతో ఈ మాటలు చెప్పెను.

||శ్లోకము 1.39||

యథా రాఘవ నిర్ముక్తః శ్శరశ్శ్వసన విక్రమః |
గచ్ఛేత్తద్వద్గమిష్యామి లఙ్కాం రావణపాలితామ్||1.39||

స|| యథా రాఘవ నిర్ముక్తః శరః గచ్ఛేత్ తద్వత్ శ్వసన విక్రమః రావణపాలితామ్ లఙ్కాం గమిష్యామి||

||శ్లోకార్థములు||

యథా రాఘవ నిర్ముక్తః శరః గచ్ఛేత్
- ఏ విధముగా రామునిచే వదలబడిన బాణము పోవునో
తద్వత్ శ్వసన విక్రమః
- ఆవిధముగా వాయు వేగముతో
రావణపాలితామ్ లఙ్కాం గమిష్యామి
- రావణుడు పాలించి లంకకు వెళ్ళెదను

||శ్లోకాతాత్పర్యము||

'ఏ విధముగా రామునిచే వదిలినబాణము పోవునో, ఆ విధముగా వాయు వేగముతో రావణునిచే పాలించబడు లంకకు వెళ్ళెదను'.||1.39||

అలా అకాశములో ఎగరడానికి తయారు అయిన హనుమంతుడు సూర్యుడు మహేంద్రుడు తదితర దేవులకు నమస్కరించి- తనతో వున్న వానరులతో ఇలా చెపుతాడు.

"రాముడు వదిలిన బాణము ఎట్లు వాయువేగముతోపోవునో అట్లే నేను రావణుడు పాలించు లంకకు పోయెదను. ఏది ఏమైన సరే పనిపూర్తిచేసికొనియె వచ్చెదను" అని.

అలా వదిలిన బాణానికి స్వతహా శక్తి వుండదు. ఆ బాణము సంధించి ప్రయోగించిన వాని శక్తియే ఆ బాణమునకు వచ్చును.

రాముడు వేగముతో బాణము లాగి వదలగా, రాముడు కల్పించిన వేగమే ఆ బాణమునకు కలుగును. ఆ రామ బాణము మధ్యలో ఆగదు. ఆ రామ బాణము లక్ష్యము చేరును.

హనుమ తనను ఆ రామ బాణముతో పోల్చుకుంటాడు. "రాముని వేగమే తన వేగముగా,
రాముని శక్తియే తనశక్తిగా భావించుకుంటాడు". ఆ శక్తి అంతా భవంతునిదే కాని తన శక్తి కాదు అని అనుకుంటాడు.

కర్మసాధనకు, నిష్కామ కర్మకు ఇదే ముఖ్యము. చేసిన పని తనకోరకై కాక ఇతరులకొరకై చేయవలెను. చేసిన పని భగవంతునిచే చేయబడినది అనుకోవలెను.
ఆ పని తనే చేసెను, తన చేత చేయబడెను అనే అహం భావము ఉండకూడదు.

హనుమ తను సీతాన్వేషణలో ఏమి చేయతలుచుచున్నాడో ఇంకాచెపుతాడు.

||శ్లోకము 1.40||

న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకాత్మజామ్ ||
అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయమ్ ||1.40||

స|| యది లఙ్కాయాం తాం జనకాత్మజం న ద్రక్ష్యామి అనేన వేగేనైవ హి సురాలయం గమిష్యామి ||

||శ్లోకార్థములు||

యది లఙ్కాయాం తాం జనకాత్మజం న ద్రక్ష్యామి
- ఒకవేళ లంకలో ఆ జనకాత్మజను చూడకపోయినచో
అనేన వేగేనైవ హి సురాలయం గమిష్యామి
- అదే వేగముతో సురాలయమునకు పోయెదను

||శ్లోకాతాత్పర్యము||

'ఒక వేళ లంకలో జనకాత్మజ కనిపించనిచో అదే వేగముతో సురాలయమునకు వెళ్ళెదను'. ||1.40||

||శ్లోకము 1.41||

యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా మ్యకృత శ్రమః |
బద్ద్వా రాక్షస రాజానం ఆనయిష్యామి సరావణమ్ ||1.41||

స|| యది త్రిదివే సీతాం నద్రక్ష్యామి (తదా) అకృత శ్రమః రాక్షస రాజానం స రాక్షసం బద్ధ్వా ఆనయిష్యామి||

||శ్లోకార్థములు||

యది త్రిదివే సీతాం నద్రక్ష్యామి
- ఒకవేళ దేవలోకములో సీతను చూడలేక పోతే
అకృత శ్రమః రాక్షస రాజానం
- శ్రమలేకుండా రాక్షస రాజు అయిన
స రాక్షసం బద్ధ్వా ఆనయిష్యామి
- ఆ రాక్షసును బంధించి తీసుకువచ్చెదను

||శ్లోకతాత్పర్యము||

'ఒకవేళ దేవలోకములో సీతను చూడలేకపోతే శ్రమలేకుండా రాక్షస రాజు అయిన ఆ రాక్షసుని బంధించి తీసుకు వచ్చెదను'. ||1.41||

||శ్లోకము 1.42||

సర్వథా కృతకార్యోఽహం ఏష్యామి సహ సీతయా |
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య స రావణమ్ ||1.42||

స|| సర్వథా కృత కార్యః సహ సీతయా అహం ఏష్యామి | వా లఙ్కాం స రావణమ్ సముత్పాట్య ఆనయిష్యామి ||

||శ్లోకార్థములు||

సర్వథా కృత కార్యః
- అన్నివిధములుగాకృత కృత్యుడనై
సహ సీతయా అహం ఏష్యామి
- సీతతో సహా వచ్చెదను.
వా లఙ్కాం స రావణమ్ సముత్పాట్య
- లేక రావణునితో సహా లంకను పెకలించి
ఆనయిష్యామి
- తీసుకు వచ్చెదను.

||శ్లోకాతాత్పర్యము||

'అన్నివిధములుగా కృత కృత్యుడనై సీతతో సహా వచ్చెదను. లేక రావణునితో సహా లంకను పెకలించి తీసుకు వచ్చెదను'. ||1.42||

"సర్వథా కృత కార్యః" అంటే తను అన్ని విధములుగా సాధించి తీరుతాను అని వానరులందరికి ప్రతిజ్ఞా పూర్వకముగా చెపుతాడు.

||శ్లోకము 1.43 - 44||

ఏవముక్త్వాతు హనుమాన్ వానరాన్ వానరోత్తమః |
ఉత్పపాథ వేగేన వేగవాన్ అవిచారయన్ ||1.43||
సుపర్ణమివ చ ఆత్మానం మేనే స కపికుంజరః ||1.44||

స|| ఏవం ఉక్త్వా వానరాన్ వానరోత్తమః హనుమాన్ వేగవాన్ వేగేన అవిచారయన్ ఉత్పపాథ|| సః కపికుంజరః ఆత్మానం సుపర్ణమివ మేనే||

||శ్లోకార్థములు||

ఏవం ఉక్త్వా వానరాన్ వానరోత్తమః హనుమాన్
- ఈ విధముగా వానరులకు చెప్పి వానరోత్తముడైన హనుమ
వేగవాన్ వేగేన
- అతి వేగముకల వాడు వేగముగా
అవిచారయన్ ఉత్పపాథ
- ఇంకేమి అలోచనలేకుండా పైకి ఎగిరెను.
సః కపికుంజరః - ఆ కపికుంజరుడు
ఆత్మానం సుపర్ణమివ మేనే
- తనను తానే గరుత్మంతునిగా భావించుకొనెను

||శ్లోకాతాత్పర్యము||

వానరులతో వానరోత్తముడైన హనుమంతుడు ఈ విధముగా చెప్పి, మంచి వేగముకల ఆ హనుమంతుడు వేగముతో, మరి ఒక ఆలోచనలేకుండా ఆకాశములో కి ఎగిరెను. ఆ కపికుంజరుడు అగు హనుమ, తనను తానే గరుత్మంతునిగా భావించుకొనెను. ||1.43-44||

|| శ్లోకము 1.45||

సముత్పతి తస్మింస్తు వేగాత్తే నగ రోహిణః |
సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతుః సమంతతః ||1.45||

స|| (యదా) తస్మిన్ వేగాత్ సముత్పతతి (తదా) నగరోహిణః సర్వాన్ విటపాన్ సంహృత్య సమంతతః సముత్పేతుః||

||శ్లోకార్థములు||

తస్మిన్ వేగాత్ సముత్పతతి
- అలా వేగముతో ఎగరగా
నగరోహిణః సర్వాన్ విటపాన్ సంహృత్య
- ఆ పర్వతముపైనున్న వృక్షములు కొమ్మలను ముడుచుకొని
సమంతతః సముత్పేతుః
- అన్ని చోటలనుండి పైకి ఎగిరెను.

||శ్లోకాతాత్పర్యము||

(హనుమంతుడు) అలా వేగముతో ఎగరగా, ఆ పర్వతము పై నున్న వృక్షములు తమ కొమ్మలను ముడుచుకొని, అన్ని చోటలనుంచి (హనుమతో పాటు) పైకి ఎగిరెను. ||1.45||

||శ్లోకము 1.46||

స మత్తకోయష్టిమకాన్ పాదపాన్ పుష్పశాలినః |
ఉద్వహన్నూరువేగేన జగామ విమలేంబరే ||1.46||

స|| పుష్పశాలినః పాదపాన్ మత్తకోయష్టిభకాన్ ఊరు వేగేన ఉద్వహన్ సః విమలే అంబరే జగామ||

||శ్లోకార్థములు||

పుష్పశాలినః
- పుష్పములతో నిండిన
మత్తకోయష్టిభకాన్ పాదపాన్
- మదించిన పక్షులు వశిస్తున్నవృక్షములను
ఊరు వేగేన ఉద్వహన్
- తన తొడల వేగముతో పెకలించి
విమలే అంబరే జగామ
- ఆ విమలాకాశములో పయనించెను

||శ్లోకాతాత్పర్యము||

పుష్పములతో విరబూచియున్న, మదించిన పక్షులు వసిస్తున్న వృక్షములను, ఆ హనుమ తన తొడలవేగముతో పెకలించి నిర్మలాకాశములో పయనించెను. ||1.46||

||శ్లోకము 1.47||

ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపి మన్వయుః|
ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవః||1.47||

స|| ఊరువేగోథ్థితాః వృక్షాః దీర్ఘమధ్వానం స్వబంధుం ప్రస్థితం బాంధవః ఇవ ముహూర్తమ్ అన్వయుః||

||శ్లోకార్థములు||

ఊరువేగోథ్థితాః వృక్షాః
- తొడల వేగముతో పెకలింపబడిన వృక్షములు
దీర్ఘమధ్వానం స్వబంధుం ప్రస్థితం
- దీర్ఘయాత్రలకు పోవుచున్న దగ్గరబంధువును
బాంధవః ఇవ ముహూర్తమ్ అన్వయుః
- బంధువులవలె క్షణకాలము అనుసరించెను

||శ్లోకతాత్పర్యము||

ఆ తోడలవేగముతో పెకలించబడిన వృక్షములు , దూరదేశయాత్రకు పోవుటకు బయలుదేరిన దగ్గిర బంధువును అనుసరించినట్లు , హనుమంతుని అనుసరించెను. ||1.47||

||శ్లోకము 1.48||

త మూరు వేగోన్మథితా స్సాలాశ్చాన్యే నగోత్తమాః|
అనుజగ్ముర్హనూమంతం సైన్యా ఇవ మహీపతిమ్||1.48||

స|| ఊరువేగోన్మథితాః సాలాః అన్యే నగోత్తమాః మహీపతిం సైన్యా ఇవ తం హనూమంతం అనుజగ్ముః||

||శ్లోకార్థము||

ఊరువేగోన్మథితాః సాలాః
- తోడలవేగముతో పెకలింపబడిన సాల వృక్షములు
అన్యే నగోత్తమాః
- తదితర మహావృక్షములు
మహీపతిం సైన్యా ఇవ
- రాజును సైన్యము అనుసరించినట్లు
తం హనూమంతం అనుజగ్ముః
- ఆ హనుమంతుని అనుసరించినవి

||శ్లోకతాత్పర్యము||

ఆ తొడలవేగముతో పెకలింపబడిన సాల వృక్షములు తదితర మహా వృక్షములు, రాజుని సైన్యము అనుసరించినట్లు, హనుమంతుని అనుసరించినవి. ||1.48||

హనుమ అలా ఎగిరినప్పుడు ఆ కొండ మీద వున్న చెట్లూ చేమలూ ఆయనతో పాటు ఎగురుతాయి. బరువైన చెట్లు సముద్రములో పడి మునిగి పోతాయి. ఆ చెట్లనుండి రాలిన పుష్పములు సముద్రములో తేరతాయి.

అలా వెంటబడి ఎగిరిన వృక్షములను బంధువుల వెంట అనురాగముతో వెళ్ళిన బంధువులుతో, రాజు వెంట నిర్బంధము చేత వెళ్ళిన సైనికులతో, పోల్చడమైనది.

మహాపురుషులు అధ్యాత్మిక మార్గములో పోవునప్పుడు, వారి దర్శనము చేసి ప్రజలు తమంతట తామే భక్తితో వారిమార్గములో నడవవలెనని ప్రయత్నము చేస్తారు. కొందరు వారి బలగముతో సహా ఫలాపేక్షతో నడుస్తారు.

అలా ఫలాపేక్షతో నడిచేవారు ఆ సముద్రములో పడిన పెద్దవృక్షములు లాంటి వారు.
వృక్షము అనే పదము శరీరమును సూచించును. పుష్పములు జ్ఞానమును సూచించును.

మహాపురుషుల సాంగత్యములో మనకు విషయ సాంగత్యము అంటే ఫలాపేక్ష విడి పోయినట్లుండును. పూలు రాలిపోయినట్లు అజ్ఞానము రాలిపోవును..

||శ్లోకము 1.49||

సుపుషితాగ్రైర్భహుభిః పాదపైరన్వితః కపిః |
హనుమాన్ పర్వతాకారో భభూవాద్భుత దర్శనః ||1.49||

స|| బహుభిః సుపుష్పితాగ్రైః పాదపైః అన్వితః కపిః హనుమాన్ పర్వతాకారః అద్భుత దర్శనః బభూవ ||

||శ్లోకార్థములు||

బహుభిః సుపుష్పితాగ్రైః పాదపైః అన్వితః -
మంచిపుష్పములతోనిండిన అనేక వృక్షములచేత చుట్టబడి
కపిః హనుమాన్ పర్వతాకారః -
పర్వతాకారములో నున్న హనుమంతుడు
అద్భుత దర్శనః బభూవ -
అద్భుతమైన రూపముతో కనపడెను.

||శ్లోకతాత్పర్యము||

పర్వతాకారములో నున్న హనుమంతుడు, మంచిపుష్పములతో నిండిన అనేక వృక్షములచేత చుట్టబడి, అద్భుతమైన రూపములో కనపడెను. ||1.49||

|| శ్లోకము 50||

సారవన్తోఽధయే వృక్షాన్యమజ్జన్ లవణాంభసి|
భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే ||50||

స|| అథ సారవన్తః యే వృక్షాః వరుణాలయే పర్వతాః మహేన్ద్రస్య భయాత్ ఇవ లవణాంభసి న్యమజ్జన్ ||

||శ్లోకార్థములు||

అథ సారవన్తః యే వృక్షాః -
అప్పుడు పెద్ద పెద్ద వృక్షములు
మహేన్ద్రస్య భయాత్ వరుణాలయే పర్వతాః -
మహేంద్రుని భయముతో సముద్రములో మునిగిన పర్వతముల వలె
లవణాంభసి న్యమజ్జన్ -
ఆ సముద్రములో పడి మునిగిపోయినవి.

||శ్లోకతాత్పర్యము||

అప్పుడుపెద్దపెద్దవృక్షములు, మహేంద్రునికి భయపడి సాగరములో మునిగిన పర్వతములవలే, ఆ సముద్రములో పడి మునిగిపోయినవి. ||1.50||

రామాయణ తిలకలో, 'మహేన్ద్రస్య భయాత్ పక్షచ్ఛేద భయాత్ పర్వతా ఇవ' , అంటే ఇంద్రుడు తమ రెక్కలు కొట్టేస్తాడు అనే భయముతో సాగరములో మునిగిన పర్వతములవలె', అని రాస్తారు. ఇది పూర్వములో రెక్కలువున్న పర్వతములతో జరిగిన కథ గురించి ధ్వని. ఇది ముందు రాబోయే మైనక వృత్తాంతముకు సూచనకూడా.

|| శ్లోకము 1.51||

స నానా కుసుమైః కీర్ణః కపిః సాంకుర కోరకైః|
శుశుభే మేఘ సంకాశః ఖద్యోతైరివ పర్వతః ||1.51||

స|| నానా కుసుమైః సాంకుర కోరకైః కీర్ణః సః మేఘ సంకాశః కపిః ఖద్యోతైః పర్వతః ఇవ శుశుభే||

||శ్లోకార్థములు||

నానా కుసుమైః సాంకుర కోరకైః కీర్ణః -
అనేకపుష్పములు మొలకలు మొగ్గల చేత కప్పబడిన
సః మేఘ సంకాశః కపిః -
ఆ మేఘముతో వలె నున్న ఆ హనుమంతుడు
ఖద్యోతైః పర్వతః ఇవ శుశుభే -
మిణుగురుపురుగుకు ఆవరించిన పర్వతమువలె భాసించెను

||శ్లోకతాత్పర్యము||

అనేకరకములైన పుష్పములు మొగ్గలు చే కప్పబడిన, మేఘమువలెనున్న, హనుమంతుడు మిణుగురు పురుగులు చే ఆవరింపబడిన పర్వతము వలే శోభించెను. ||1.51||

||శ్లోకము 1.52||

విముక్తాః తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః |
అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా ||1.52||

స|| తస్య వేగేన విముక్తాః తే ద్రుమాః పుష్పాణి చ ముక్త్వా సలిలే అవశీర్యన్త యథా నివృత్తాః సుహృదా (ఇవ)||

||శ్లోకార్థము||

తస్య వేగేన విముక్తాః తే ద్రుమాః
- అతని వేగమునుంచి విముక్తులైన వృక్షములు
పుష్పాణి చ ముక్త్వా సలిలే
- పుష్పములను వదిలి సముద్రములో
యథా నివృత్తాః సుహృదా (ఇవ) అవశీర్యన్త
- వెనకకు తిరిగిన స్నేహితులవలె పడినవి

||శ్లోకతాత్పర్యము||

ఆ హనుమంతుని వేగము నుంచి విముక్తులైన వృక్షములు కూడా పుష్పములను వదులుచూ, తమ స్నేహితులను వదిలి వెనకి తిరిగిన వారివలె, ఆ సాగరములో పడినవి. ||1.52||

||శ్లోకము 1.53||

లఘుత్వే నోపపన్నం తద్విచిత్రం సాగరేఽపతత్ |
ద్రుమాణాం వివిథమ్ పుష్పం కపివాయు సమీరితమ్ ||1.53||
తారాశత మివాకాశం ప్రభభౌ స మహార్ణవః |

స|| కపివాయుసమీరితం ద్రుమాణాం వివిధం విచిత్రం పుష్పం లఘుత్వే ఉపపన్నమ్ తత్ సాగరే అపతత్ || లఘుత్వేన ఉపపన్నం (పుష్పేణ) తత్ మహర్ణవః తారాచితం ఆకాశమివ ప్రభబౌ ||

||శ్లోకార్థము||

కపివాయుసమీరితం ఉపపన్నం
- హనుమంతుని వాయు వేగము వలన పైకి లేచిన
వివిధం విచిత్రం పుష్పం
- వివిధరకములైన విచిత్రమైన పుష్పములు
తత్ సాగరే అపతత్
- ఆ సాగరము లో పడినవి
లఘుత్వేన ఉపపన్నం (పుష్పేణ) తత్ మహర్ణవః
- భారములేని కారణము వలన పైకి తేరిన పుష్పములతో సముద్రము
తారాచితం ఆకాశమివ ప్రభబౌ
- నక్షత్రములతో నిండిన ఆకాశము వలె శోభించెను

||శ్లోకతాత్పర్యము||

హనుమంతుని వేగము వలన పైకి లేచిన, అనేకరకములైన విచిత్రమైన పుష్పములు, సాగరములో పడినవి. భారములేని కారణము వలన సముద్రములో పైకి తేరిన పుష్పములతో, ఆ సముద్రము నక్షత్రములతో నిండిన ఆకాశము వలె శోభించెను. ||1.53||

||శ్లోకము 1.54||

పుష్పౌఘే నానుబద్ధేన నానావర్ణేన వానరః |
బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః||1.54||

స|| నానావర్ణేన (పుష్పేణ) పుష్పౌఘేణ అనుబద్ధేన సః వానరః ఆకాశే విద్యుత్‍గణ విభూషితః మేఘ ఇవ బభౌ||

||శ్లోకార్థము||

నానావర్ణేన (పుష్పేణ) పుష్పౌఘేణ అనుబద్ధేన
- అనేకవర్ణములుగల పుష్పసముదాయముతో కప్పబడిన
సః వానరః ఆకాశే
- ఆ వానరుడు ఆకాశములో
విద్యుత్‍గణ విభూషితః మేఘ ఇవ బభౌ
- విద్యుత్కాంతితో ఒప్పారే మేఘము వలె ప్రకశించెను

||శ్లోకతాత్పర్యము||

అనేక మైన వర్ణములు గల, పుష్పము సముదాయములతో కప్పిబడిన, ఆ వానరుడు ఆకాశములో మెరుపుల విద్యుత్కాంతితో ఒప్పారే మేఘము వలె ప్రకాశించెను. ||1.54||

||శ్లోకము 1.55||

తస్య వేగ సమాధూతైః పుష్పైః తోయమదృశ్యత ||1.55||
తారాభి రభిరామాభి రుదితాభి రివాంబరమ్ |

స|| తస్య వేగ సమాధూతైః పుష్పైః తోయః అదృశ్యత (యథా..) ఉదితాభిః అభిరామాభిః తారాభిః అంబరం ఇవ||

||శ్లోకార్థములు||

తస్య వేగ సమాధూతైః పుష్పైః -
హనుమంతుని వేగము వలన పైకి ఎగిసి పడిన పుష్పములతో
తోయః - ఆ సముద్రము
ఉదితాభిః అభిరామాభిః తారాభిః అంబరం ఇవ -
ఉదయించిన నక్షత్రములతో కూడి సుందరమైన ఆకాశము వలె
అదృశ్యత - కనపడినది.

||శ్లోకతాత్పర్యము||

హనుమంతుని వేగము వలన పైకి ఎగిసి పడిన పుష్పములు సముద్రములో పడి ఆ సముద్రము ఉదయించిన సుందరమైన నక్షత్రములతో కూడిన ఆకాశమువలె శోభించెను. ||1.55||

||శ్లోకము 1.56||

తస్యాంబర గతౌ బాహూ దదృశాతే ప్రసారితౌ ||1.56||
పర్వతాగ్రాత్ విష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ ||

స|| తస్య ప్రశారితౌ అంబర గతౌ బాహుః పర్వతాగ్రాత్ వినిష్క్రాన్తౌ పంచాస్యః పన్నగః ఇవ దద్రుశాతే ||

||శ్లోకార్థము||

తస్య ప్రశారితౌ అంబర గతౌ బాహుః -
ఆకాశములోకి చాచబడిన ఆ బాహువులు
పర్వతాగ్రాత్ వినిష్క్రాన్తౌ -
పర్వతాగ్రమునుండి బయటకు వస్తున్న
పంచాస్యః పన్నగః ఇవ దద్రుశాతే -
ఐదు తలలు కల పాములవలె కనిపించినవి

||శ్లోకతాత్పర్యము||

ఆకాశములోకి చాచబడిన ఆ రెండు బాహువులు, పర్వతమునుంచి బయటకు వస్తున్న రెండు ఐదుతలల పాములవలె కనిపించినవి. ||1.56||

||శ్లోకము 1.57||

పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవమ్||1.57||
పిపాసు రివ చాకాశం దదృశే స మహాకపిః |

స|| స మహాకపిః సోర్మిమాలం మహార్ణవమ్ పిబన్నివ బభౌ అకాశం అపి పిపాసు రివ దదృశే ||

||శ్లోకార్థము||

స మహాకపిః
- అ మహా వానరుడు
సోర్మిమాలం మహార్ణవమ్ అకాశం అపి పిబన్నివ బభౌ
- తరంగములతో కూడిన సాగరమును త్రాగి వేస్తున్నాడా అన్నట్లు భాసించెను
అకాశం అపి దదృశే
- అకాశముకూడాకబళించివేస్తున్నట్లు కన్పడెను
పిపాసు రివ
- దాహము కలవాని వలె

||శ్లోకతాత్పర్యము||

తరంగములతో కూడిన సాగరమును అలాగే ఆకాశమును దాహముకలవాని వలె త్రాగుచున్నాడా అన్నట్లు ఆ మహాకపి కనపడెను. ||1.57||

ఇదేమాటని రామ టీకాలో ఇలా రాశారు. 'మాహాకపిః హనుమాన్ సోర్మిజాలమ్ ఉర్మీసమూహ సహితం మహార్ణవమ్ ఆకాశం చ పిపాసుః పాతుమిచ్ఛరివదదృశే, ఊర్ధ్వముఖత్వే ఆకాశం పిపాశురివ అధో ముఖత్వే మహార్ణవం పిపాసురివ ప్రతీయత ఇత్యర్థః'

గోవిందరాజులవారు హనుమంతుని దాహము ముందు జరగబోయే వాటికి సూచన అంటారు. "ఆర్ణవం పిబన్నివ ఆకాశం పిపాశురివేత్యాభ్యామ్ అస్య మహానుద్యోగః సూచ్యతే| లఙ్ఘనవేగేన సహసా క్షీయమాణే సాగర విస్తారే స పీయమాన ఇవ భవతి| ఏవం అమ్బరం చ| తత్ర అతివేగేన గఛ్ఛన్ స మహార్ణవం పిబన్నివ బభౌ తథా ఆకాశమపి ఇత్యాహుః|

||శ్లోకము 1.58||

తస్య విద్యుత్ప్రభాకారే వాయు మార్గాను సారిణః ||58||
నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ|

స|| వాయుమార్గానుసారిణః తస్య విద్యుత్ప్రభాకారే నయనే పర్వతస్థౌ అనలౌ ఇవ విప్రకాశేతే||

||శ్లోకార్థములు||

వాయుమార్గానుసారిణః తస్య -
వాయు మార్గములో అనుసరించుచున్న ఆతని ( ఆ వానరుని)
తస్య విద్యుత్ప్రభాకారే నయనే -
విద్యుత్కాంతులతో ప్రకాశించుచున్న నేత్రములు
పర్వతస్థౌ అనలౌ ఇవ విప్రకాశేతే -
పర్వతము మీద రెండు నిప్పుమంటలలాగ ప్రకాశించుచుండెను.

||శ్లోకతాత్పర్యము||

వాయుమార్గమును అనుసరించుచున్న ఆ వానరుని నేత్రములు మెఱుపులవిద్యుత్కాంతితో ఒప్పారుచూ పర్వతముమీద వున్న రెండు నిప్పుమంటలలాగ ప్రకాశించుచుండెను. ||1.58||

విద్యుత్ప్రభాకారే అన్నమాటని ఇలా విశ్లేషిస్తారు. 'విద్యుత్ప్రభా సదృశ ప్రభోత్పాదకే నయనే' అని. నేత్రములే విద్యుత్కాన్తిని వెదజల్లుతూ రెండు నిప్పుమంటలా వున్నాయి అన్నమాట.

||శ్లోకము 1.59||

పిఙ్గే పిఙ్గాక్షముఖ్యస్య బృహతీ పరిమండలే ||1.59||
చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్యావివోదితౌ |

స|| పిఙ్గాక్షముఖ్యస్య పిఙ్గే బృహతీ పరిమండలే చక్షుషీ ఉదితౌ చంద్ర సూర్యావివ సంప్రకాశేతే||

||శ్లోకార్థములు||

పిఙ్గాక్షముఖ్యస్య -
పింగాక్షములుకలవారి లో ముఖ్యుడగు హనుమంతుని
పిఙ్గే బృహతీ పరిమండలే చక్షుషీ -
గుండ్రముగావున్న పెద్ద పింగాక్షములు
ఉదితౌ చంద్ర సూర్యావివ సంప్రకాశేతే -
ఉదయించిన చంద్ర సూర్యులవలె ప్రకాశించుచుండెను

||శ్లోకతాత్పర్యము||

పింగాక్షములుకలవారి లో ముఖ్యుడగు హనుమంతుని గుండ్రముగా వున్న పెద్ద పింగాక్షములు ( కళ్ళు) ఉదయిస్తున్న సూర్య చంద్రునివలె ప్రకాశించుచుండెను. ||1.59||

||శ్లోకము 1.60||

ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్ర మాబభౌ ||1.60||
సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలమ్ ||

స|| తస్య తామ్రం ముఖం తామ్రయా నాశికయా సంధ్యయా సమభిస్పృష్టం తత్ సూర్యమండలం యథా ఆబభౌ ||

||శ్లోకార్థములు||

తస్య తామ్రం ముఖం
- అతని తామ్రవర్ణపు ముఖము
తామ్రయా నాశికయా
- తామ్రవర్ణపు నాశికము
సంధ్యయా సమభిస్పృష్టం
- సంధ్యారాగముతో ఆవరించిన
తత్ సూర్యమండలం యథా ఆబభౌ
- ఆ సూర్యమండలము వలె ప్రకాశించెను

||శ్లోకతాత్పర్యము||

తామ్రవర్ణపు నాశికము, అతని తామ్రవర్ణపు ముఖము, సంధ్యాసమయములో ని సూర్యమండలము లాగా ప్రకాశించెను. ||1.60||

||శ్లోకము 1.61||

లాంగూలం చ సమావిద్ధమ్ ప్లవమానస్య శోభతే ||1.61||
అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితమ్|

స|| అంబరే ప్లవమానస్య వాయుపుత్రస్య ఉచ్ఛ్రితం లాంగూలమ్ సమావిద్ధమ్ శక్రధ్వజ ఇవశోభతే||

||శ్లోకార్థములు||

అంబరే ప్లవమానస్య వాయుపుత్రస్య
- ఆకాశములో ఎగురుచున్న వాయుపుత్రుని
ఉచ్ఛ్రితం లాంగూలమ్
- పైకి ఎత్తిన లాంగూలము
సమావిద్ధమ్ శక్రధ్వజ ఇవశోభతే
- నిలచినదై ఇంద్రుని ధ్వజము వలె శోభించెను

||శ్లోకతాత్పర్యము||

ఆకాశములో ఎగురుతున్న హనుమంతుని లాంగులము మహోన్నతముగా నిలచినదై, ఇంద్రధ్వజము లాగ శోభించెను. ||1.61||

||శ్లోకము 1.62||

లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రోఽనిలాత్మజః||1.62||
వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేషీవ భాస్కరః|

స|| శుక్లదంష్ట్రః మహాప్రాజ్ఞః మహాన్ అనిలాత్మజః లాంగూల చక్రేణా పరివేషీవ భాస్కరః ఇవ వ్యరోచత||

||శ్లోకార్థములు||

శుక్లదంష్ట్రః మహాప్రాజ్ఞః మహాన్ అనిలాత్మజః
- తెల్లని దంతములు కల గొప్పవాడు మహాబుద్ధిశాలి వాయుపుత్రుడు
లాంగూల చక్రేణా
- లాంగూలము చక్రాకారములో వుండి
భాస్కరః ఇవ వ్యరోచత
- గూడుకట్టిన సూర్యునిలా శోభిల్లుచుండెను.

||శ్లోకతాత్పర్యము||

తెల్లని దంతములు కల గొప్పవాడు మహాబుద్ధిశాలి వాయుపుత్రుడు అగు హనుమ, లాంగూలము చక్రాకారములో వుండి, గూడుకట్టిన సూర్యునిలా శోభిల్లుచుండెను. ||1.62||

||శ్లోకము 1.63||

స్ఫిగ్దేశే నాభితామ్రేణ రరాజ స మహాకపిః||1.63||
మహతా దారితేనేవ గిరిః గైరిక ధాతునా |

స|| సః మహాకపి అభితామ్రేణ స్ఫిగ్దేశేన దారితేన ఇవ మహతా గైరిక ధాతునా గిరిః ఇవ రరాజ||

||శ్లోకార్థములు||

సః మహాకపి అభితామ్రేణ స్ఫిగ్దేశేన
- అ మహావానరుడు ఎఱ్ఱని పిరుదులతో
దారితేన
- రెండు ఖండములుగా చేయబడి
మహతా గైరిక ధాతునా
- గైరిక ధాతువుతో కూడిన
గిరిః ఇవ రరాజ
- పర్వతము వలె ఒప్పారెను

||శ్లోకతాత్పర్యము||

ఆ మహవానరుడు ఎఱ్ఱని పిరుదులతో, రెండు ఖండములుగా చేయబడి గైరికధాతువుతో కూడిన పర్వతము వలె ఒప్పారెను. ||1.63||

||శ్లోకము 1.64||

తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరమ్ ||1.64||
కక్షాంతరగతో వాయుర్జీమూత ఇవ గర్జతి ||

స|| సాగరమ్ ప్లవమానస్య వానరసింహస్య కక్షాంతరగతః వాయుః జీమూతః ఇవ గర్జతి||

||శ్లోకార్థములు||

తస్య ప్లవమానస్య వానరసింహస్య
- ఆ విధముగా ఎగురుతున్న వానరసింహముయొక్క
కక్షాంతరగతః వాయుః
- చంకల మధ్యలో ప్రసిరిస్తున్న వాయువు
జీమూతః ఇవ గర్జతి
- మేఘముల ఉరుముల గర్జనవలె నుండెను

||శ్లోకతాత్పర్యము||

ఆ విధముగా ఎగురుతున్న వానరసింహముయొక్క చంకల మధ్యలో ప్రసిరిస్తున్న వాయువు మేఘముల ఉరుముల గర్జనవలె నుండెను. ||1.64||

|| శ్లోకము 1.65||

ఖే యథా నిపతన్త్యుల్కా హ్యుత్తరాన్తాత్ వినిస్సృతాః||1.65||
దృశ్యతే సానుబన్ధా చ తథా స కపికుంజరః |

స||ఉత్తరాన్తాత్ వినిఃస్రుతా ఖే సానుబన్ధాచ ఉల్కా యథా నిపతతి తథా స కపికుంజరః దృశ్యతే ||

||శ్లోకార్థములు||

ఉత్తరాన్తాత్ వినిఃస్రుతా
- ఉత్తరదిశలో విడువబడి
ఖే సానుబన్ధాచ ఉల్కా యథా నిపతతి
- ఆకాశమార్గమును అనుసరించుచు పడుచున్నఉల్కలాగ
తథా స కపికుంజరః దృశ్యతే
- ఆ కపికుంజరుడు కానవచ్చెను

||శ్లోకతాత్పర్యము||

ఉత్తరదిశలో విడువబడి ఆకాశమార్గమును అనుసరించుచు పడుచున్నఉల్కలాగ, (ఉత్తరదిశనుంచి దక్షిణ దిశ పోవుచున్న) ఆ కపికుంజరుడు కానవచ్చెను .||1.65||


||శ్లోకము 1.66||

పతత్పతంగ సంకాశో వ్యాయత శ్శుశుభే కపిః||1.66||
ప్రవృద్ధ ఇవ మాతంగః కక్ష్యయా బధ్యమానయా|

స||పతత్పతంగ సంకాశః కపిః వ్యాయతః బధ్యమానయా కక్ష్యయా ప్రవృద్ధః మాతంగః ఇవ శుశుభే||

||శ్లోకార్థములు||

పతత్పతంగ సంకాశః వ్యాయతః కపిః
- అస్తమించుచున్న సూర్యునివలె నున్న
వ్యాయతః కపిః
- బలము గల వానరుడు
బధ్యమానయా కక్ష్యయా
- నడుముచుట్టూ కట్టబడి
ప్రవృద్ధః మాతంగః ఇవ శుశుభే
- పెద్ద మాతంగము వలె శోభించెను

||శ్లోకతాత్పర్యము||

అస్తమించుచున్న సూర్యునివలె నున్న బలము గల వానరుడు నడుముచుట్టూ కట్టబడి పెద్ద మాతంగము వలె శోభించెను. ||1.66||

||శ్లోకము 1.67||

ఉపరిస్టాత్ శరీరేణ ఛాయయా చావ గాఢయా ||1.67||
సాగరే మారుతావిష్టౌ నౌ రివాఽఽసీత్తదా కపిః |

స||తదా కపిః ఉపరిష్టాత్ శరీరేణ సాగరే అవగాఢయా ఛాయయా చ మారుతావిష్ట నౌరి ఇవ ఆసీత్||

||శ్లోకార్థములు||

తదా ఉపరిష్టాత్ శరీరేణ
- అప్పుడు పైన ( ఆకాశములో) వున్నశరీరముతో
సాగరే అవగాఢయా ఛాయయా
- సముద్రము మీద పడిన ఛాయతో
కపిః మారుతావిష్ట నౌరి ఇవ ఆసీత్
- హనుమంతుడు వాయువుచే కదలింపబడుతున్న నావ వలె వుండేను

||శ్లోకతాత్పర్యము||

ఆ ఆకాశములో వున్న శరీరముతో సాగరములో పడిన హనుమంతుని ఛాయ, గాలికి కదిలిపోతున్న నౌక వలె కనిపించెను. ||1.67||

||శ్లోకము 1.68||

యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః ||1.68||
స స తస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే|

స|| సః మహాకపిః సముద్రస్య యం యం దేశం జగామ స స తస్య ఊరువేగేన సోన్మాదః ఇవ లక్ష్యతే||

||శ్లోకార్థములు||

సః మహాకపిః సముద్రస్య
- ఆ మహకపి సముద్రముయొక్క
యం యం దేశం జగామ
- ఏ ఏ ప్రదేశములకు వెళ్ళెనో
స స తస్య ఊరువేగేన
- ఆ ఆ ప్రదేశములు అతని యొక్క తొడల వేగముతో
సోన్మాదః ఇవ లక్ష్యతే
- ఉన్మాదము చెందినట్లు కనపడుచున్నవి

||శ్లోకతాత్పర్యము||

ఆ మహకపి సముద్రముయొక్క ఏ ఏ ప్రదేశములకు వెళ్ళెనో, ఆ ఆ ప్రదేశములు అతని యొక్క తొడల వేగముతో, ఉన్మాదము చెందినట్లు కనపడుచున్నవి. ||1.69||

||శ్లోకము 1.69||

సాగరస్యోర్మిజాలానాం ఉరసా శైలవర్ష్మణామ్||1.69||
అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకపిః|

స|| స మహావేగః మహాకపిః సాగరస్య ఊర్మిజాలానాం శైలవర్షణామ్ ఉరసా అభిఘ్నంస్తు పుప్లువే||

||శ్లోకార్థములు||

స మహావేగః కపిః
- ఆ మహావేగముకల వానరుడు
ఊర్మిజాలానాం శైలవర్షణామ్
- శైల సమానమైన సాగరతరంగములను
ఉరసా అభిఘ్నంస్తు పుప్లువే
- తన వక్షస్థలముతో ఢీకొనుచు ఎగరెను.

||శ్లోకతాత్పర్యము||

ఆ మహావేగముకల వానరుడు, శైల సమానమైన సాగర తరంగములను తన వక్షస్థలముతో ఢీకొనుచు ఎగరెను. ||1.69||

||శ్లోకము 1.70||

కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః ||1.70||
సాగరం భీమ నిర్ఘోషం కమ్పయామాసతు ర్భృశమ్ |

స|| బలవాన్ కపివాతస్య నిఃసృతః మేఘవాతః చ భీమ నిర్ఘోషం (చ) సాగరం భృశం కమ్పయామాసతుః ||

||శ్లోకార్థములు||

బలవాన్ కపివాతస్య
- బలవంతుడగు హనుమ వలన జనించిన గాలి
మేఘవాతః చ
- మేఘములచే జనించిన గాలి
నిఃసృతః
- ఒకదానితోనొకటి కలిసి
భీమ నిర్ఘోషం
- భయంకరమైన ధ్వనికలిగిస్తూ
సాగరం భృశం కమ్పయామాసతుః
- సాగరమును తీవ్రముగా కంపింపచేశాయి.

||శ్లోకతాత్పర్యము||

బలవంతుడగు హనుమ వలన జనించిన గాలి, మేఘములచే జనించిన గాలి, ఒకదానితోనొకటి కలిసి, భయంకరమైన ధ్వని చేస్తూ సాగరమును తీవ్రముగా కంపింపచేశాయి. ||1.70||

||శ్లోకము 1.71||

వికర్షన్నూర్మి జాలాని బృహంతి లవణాంభసి ||1.71||
పుప్లువే కపిశార్దూలో వికరన్నివ రోదసీ |

స|| (యదా) కపిశార్దూలః పుప్లువే (తదా) లవణాంభసి బృహంతి ఊర్మిజాలాని వికర్షన్ వికరన్నివ రోదసీ ||

||శ్లోకార్థములు||

కపిశార్దూలః పుప్లువే
- ఆ కపిశార్దూలము ఎగురుచూ
లవణాంభసి ఊర్మిజాలాని వికర్షన్
- సాగరములోని తరంగములను లాగుచూ
వికరన్నివ రోదసీ
- భూమి ఆకాశముల మధ్యభాగమును విరజిమ్ముచున్నట్లు ఉండెను

||శ్లోకతాత్పర్యము||

ఆ కపిశార్దూలము ఎగురుచూ, సాగరములోని తరంగములను లాగుచూ భూమి ఆకాశముల మధ్యభాగమును విరజిమ్ముచున్నట్లు ఉండెను. ||1.71||

||శ్లోకము 1.72||

మేరుమందర సంకాశా నుద్ధతాన్ స మహార్ణవే ||1.72||
అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ |

స||మహావేగః మహార్ణవే ఉద్ధతాన్ మేరుమందర సంకాశాన్ తరంగాన్ గణయన్ ఇవ సః అత్యక్రామత్ ||

||శ్లోకార్థములు||

మహావేగః
- మహావేగముతో పోవుచున్న ఆ హనుమంతుడు
మహార్ణవే ఉద్ధతాన్
- మహాసముద్రములో లేచిన
మేరుమందర సంకాశాన్ తరంగాన్
- మేరు మందర పర్వతములతో సమానమైన తరంగములను
గణయన్ ఇవ సః అత్యక్రామత్
- లెక్కిస్తున్నవాడివలె వాటిని గమించి పోసాగెను

||శ్లోకతాత్పర్యము||

మహావేగముతో పోవుచున్న ఆ హనుమంతుడు, ఆ మహాసముద్రములో లేచిన, మేరు మందర పర్వతములతో సమానమైన తరంగములను లెక్కిస్తున్నవాడివలె వాటిని గమించి పోసాగెను. ||1.72||

||శ్లోకము 1.73||

తస్యవేగ సముద్ధూతం జలం సజలం యథా ||1.73||
అంబరస్థం విబభ్రాజ శారదాభ్ర మివాతతమ్ |

స|| తస్య వేగ సముద్ధూతం సజలదమ్ జలం అంబరస్థమ్ ఆతతమ్ శారదాభ్రమివ విబభ్రాజ ||

||శ్లోకార్థములు||

తస్య వేగ సముద్ధూతం
- ఆ హనుమంతుని వేగముతో పైకి లేచిన
సజలదమ్ జలం అంబరస్థమ్
- నీటి తుంపరతో కలిసిన మేఘములు ఆకాశములో
ఆతతమ్ - వ్యాపించి
శారదాభ్రమివ విబభ్రాజ
- శరత్కాలపు మేఘములవలె భాసించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాకపి వేగమువలన పైకి లేచిన తుంపర మేఘములతో కలిసి శరత్కాలపు మేఘములవలె భాసిల్లెను." ||1.73||

||శ్లోకము 1.74||

తిమినక్ర ఝుషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా ||1.74||
వస్త్రాపకర్షణే నేవ శరీరాణి శరీరిణామ్ |

స|| తదా తిమినక్రఝుషాః కూర్మాః వస్త్రాపకర్షణేన శరీరిణాం శరీరాణీవ వివృతాః దృశ్యన్తే||

||శ్లోకార్థములు||

తదా - అప్పుడు ( సముద్రజలము పైకి లేవడము వలన )
తిమినక్రఝుషాః కూర్మాః
- తిమింగళములు మొసళ్ళు,చేపలు తాబేళ్ళు
వస్త్రాపకర్షణేన వివృతాః
- వస్త్రములు తొలగించగా స్పష్టముగా ( కనిపించు)
శరీరిణాం శరీరాణీవ
- శరీరముకలవాని అంగములవలె
దృశ్యన్తే- కనపడెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు ( సముద్రజలము పైకి లేవడము వలన సాగరములోని ) తిమింగళములు మొసళ్ళు,చేపలు, తాబేళ్ళు, వస్త్రములు తొలగించగా స్పష్టముగా ( అంగములు కనిపించు) శరీరముకలవాని వలె కనపడెను. ||1.74||

తిలకటీకాలో - వివృతా అన్నపదము ఇలా విశ్లేషిస్తారు: 'వివృతా వేగాజ్జలోత్సారణేన వ్యక్త దేహాః'- వేగముగా జలములు పైకిలేవడము వలన వ్యక్త మైన దేహములవలె అని.

||శ్లోకము 1.75||

ప్లవమానం సమీక్ష్యాథ భుజంగాస్సాగరాలయాః ||1.75||
వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే |

స|| అథ వ్యోమ్ని ప్లవమానం తం సమీక్ష్య సాగరాలయాః భుజంగాః (తం) కపిశార్దూలం సుపర్ణః ఇతి మేనిరే ||

||శ్లోకార్థములు||

అథ వ్యోమ్ని ప్లవమానం తం సమీక్ష్య
- అప్పుడు ఆకాశములో ఎగురుచున్న ఆ హనుమంతుని చూచి
సాగరాలయాః భుజంగాః (తం) కపిశార్దూలం
- సాగరములోని పాములు ఆ కపి వర్యుని
సుపర్ణః ఇతి మేనిరే
- గరుత్మంతుడే అని భ్రమించిరి

||శ్లోకతాత్పర్యము||

ఆ ఆకాశములో ఎగురుచున్న హనుమంతుని చూచి సాగరములో ని భుజంగములు ఆ హనుమంతుని గరుత్మంతుడేనని భ్రమించాయి. ||1.75||

||శ్లోకము 1.76||

దశయోజన విస్తీర్ణా త్రింశత్ యోజనమాయతా||1.76||
ఛాయా వానరసింహస్య జలే చారుతరా‍ఽభవత్||

స|| దశయోజన విస్తీర్ణా త్రింశత్ యోజనమ్ ఆయతా వానరసింహస్య ఛాయా జలే చారుతరా అభవత్||

||శ్లోకార్థములు||

దశయోజన విస్తీర్ణా
- పది యోజనములుపొడవూ
త్రింశత్ యోజనమ్ ఆయతా
- ముప్పది యోజనముల వెడల్పూ గల
వానరసింహస్య ఛాయా
- ఆ వానరసింహుని ఛాయ
జలే చారుతరా అభవత్
- జలములో మనోహరముగా కనపడెను

||శ్లోకతాత్పర్యము||

పది యోజనములు పొడవు ముప్పది యోజనముల వెడల్పు గల ఆ వానరసింహుని నీడ జలములో మనోహరముగా కనపడెను. ||1.76||

వందయోజనముల సముద్రము దాటడములో ముప్పది యోజనముల నీడ అసందర్భముగా వుంటుందేమో అన్నమాటకి , గోవిందరాజులవారు సముద్ర లంఘనము సూర్యోదయ కాలములో మొదలైంది కాబట్టి అప్పటి నీడ ఆ ప్రమాణములో వుండును అని అంటారు.

||శ్లోకము 1.77||

శ్వేతాభ్ర ఘనరాజీవ వాయుపుత్త్రానుగామినీ ||1.77||
తస్య సా శుశుభే ఛాయా వితతా లవణాంభసి |

స|| వాయుపుత్రానుగామినీ లవణాంభసి వితతా తస్య సా ఛాయా శ్వేతాభ్రఘనరాజీవ శుశుభే ||

||శ్లోకార్థములు||

వాయుపుత్రానుగామినీ
- వాయుపుత్రుని అనుసరించి
లవణాంభసి వితతా తస్య సా ఛాయా
- సముద్రములో విస్తరించిన ఆతనిఛాయ
శ్వేతాభ్రఘనరాజీవ శుశుభే
- దట్టమైన తెల్లని మేఘములవలె ప్రకాశించుచుండెను.

||శ్లోకతాత్పర్యము||

ఆ వాయుపుత్రుని అనుసరించి సాగరములో విస్తరించిన అతని ఛాయ దట్టమైన తెల్లని మేఘసముదాయము వలే ప్రకాశించుచుండెను. ||1.77||

||శ్లోకము 78||

శుశుభే స మహాతేజా మహాకాయో మహాకపిః||78||
వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః|

స|| మహాతేజః మహాకాయః సః మహాకపిః నిరాలంబే వాయుమార్గే పక్షవాన్ పర్వత ఇవ శుశుభే ||

||శ్లోకార్థములు||

మహాతేజః మహాకాయః సః మహాకపిః
- మహాతేజోవంతుడు మహాకాయము గలవాడు, ఆ మహావానరుడు
నిరాలంబే వాయుమార్గే
- ఏమీ ఆధారము లేకుండా వాయుమార్గములో( ఎగురుతూ)
పక్షవాన్ పర్వత ఇవ శుశుభే
- రెక్కలు గల పర్వతము వలె శోభించెను

||శ్లోకతాత్పర్యము||

మహాతేజోవంతుడు మహాకాయముగలవాడు అగు హనుమంతుడు ఆకాశములో ఏ అధారము లేకుండా ఎగురుతూ , రెక్కలు ఉన్న పర్వతము లాగ భాసించెను. ||1.78||

||శ్లోకము 1.79||

యేనాఽసౌ యాతి బలవాన్ వేగేన స కపికుంజరః ||1.79||
తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః |

స|| బలవాన్ అసౌ కపికుంజరః వేగేన యేన మార్గేణ యాతి తేన సహసా అర్ణవః ద్రోణీకృత ఇవ ( అదృశ్యత్)

||శ్లోకార్థములు||

బలవాన్ అసౌ కపికుంజరః వేగేన
- బలవంతుడగు ఆ హనుమంతుడు వేగముతో
యేన మార్గేణ యాతి
- యే మార్గములో పయనించునో
తేన సహసా అర్ణవః ద్రోణీకృత ఇవ
- అచట క్షణములో లోయ వలె అగుపడుచుండెను

||శ్లోకతాత్పర్యము||

బలవంతుడగు ఆ హనుమంతుడు వేగముతో, యే మార్గములో పయనించుచుండెనో అచట క్షణములో లోయ వలె అగుపడుచుండెను. ||1.79||

|| శ్లోకము 1.80||

అపాతే పక్షిసంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ ||1.80||
హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా||

స|| హనుమాన్ మారుతో యథా మేఘజాలాని ప్రకర్షన్ పక్షి సంఘానామ్ ఆపాతే వ్రజన్ పక్షిరాజ ఇవ||

||శ్లోకార్థములు||

పక్షి సంఘానామ్ ఆపాతే వ్రజన్ పక్షిరాజ ఇవ
- పక్షిసంఘములమార్గములో పక్షిరాజువలె పయనించుచున్న
హనుమాన్ - హనుమంతుడు
మేఘజాలాని మారుతో యథా ప్రకర్షన్
- మేఘజాలములను వాయువు వలె లాగుచుండెను

||శ్లోకతాత్పర్యము||

పక్షిసంఘములమార్గములో పక్షిరాజువలె పయనించుచున్న హనుమంతుడు, మేఘజాలములను వాయువు వలె లాగుచుండెను. ||1.80||

||శ్లోకము 1.81||

పాణ్డురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని చ ||1.81||
కపినాఽఽకృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే |

స|| కపినా అకృష్యమాణాని పాణ్డురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని మహాభ్రాణి చకాశిరే||

||శ్లోకార్థములు||

కపినా అకృష్యమాణాని
- కపి చేత లాగబడుచున్న
పాణ్డురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని
- తెలుపు ఎఱుపు రంగులు కల, నీలము పసుపు రంగుల మేఘములు
చకాశిరే
- అద్భుతముగా నున్నవి ( కనపడుచున్నవి)

||శ్లోకతాత్పర్యము||

కపి చేత లాగబడుచున్నతెలుపు ఎఱుపు రంగుల, నీలము పసుపు రంగుల మేఘములు అతి సుందరముగా కనపడుచున్నవి. ||1.81||

రామ తిలకలో రాసిన మాట: 'కపినా ఆకృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే', అంటే కపి చే లాగబడుతున్న మేఘములు అని.

||శ్లోకము 1.82||

ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ||1.82||
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే |

స|| అభ్రజాలాని పునః ప్రవిశన్ పునః నిష్పతంశ్చ ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చన్ద్రమాఇవ లక్ష్యతే||

||శ్లోకార్థములు||

అభ్రజాలాని పునః ప్రవిశన్ పునః నిష్పతంశ్చ
- మేఘములలో మళ్ళీప్రవేశించుచూ మళ్ళీబయటకు వస్తూ
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ
- దాగుచూ ప్రకాశించుచూ వున్న
చన్ద్రమాఇవ లక్ష్యతే
- చంద్రుని వలె కనపడుచుండెను

||శ్లోకతాత్పర్యము||

మేఘములలో మళ్ళీప్రవేశించుచూ, మళ్ళీబయటకు వస్తూ వున్న (హనుమంతుడు), (మేఘములలో) దాగుచూ ప్రకాశించుచూ వున్నచంద్రుని వలె కనపడుచుండెను. ||1.82||

||శ్లోకము 1.83||

ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా ||1.83||
వవర్షుః పుష్పవర్షాణి దేవ గంధర్వ దానవాః |

స|| తదా త్వరితం ప్లవమానం తం ప్లవంగం దృష్ట్వా దేవగంధర్వ దానవాః పుష్పవర్షాణి వవర్షుః||

||శ్లోకార్థములు||

తదా త్వరితం ప్లవమానం తం ప్లవంగం దృష్ట్వా
- అప్పుడు వేగముగా ఎగురుచున్న హనుమంతుని చూచి
దేవగంధర్వ దానవాః
- దేవగంధర్వ దానవులు
పుష్పవర్షాణి వవర్షుః
- పుష్ప వర్షములు కురిపించిరి

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు వేగముగా ఎగురుచున్న హనుమంతుని చూచి, దేవగంధర్వ దానవులు పుష్ప వర్షములు కురిపించిరి. ||1.83||

||శ్లోకము 1.84||

తతాప న హి తం సూర్యం ప్లవంతం వానరోత్తమమ్||1.84||
సిషేవే చ తదా వాయూ రామకార్యార్థ సిద్ధయే|

స|| తదా రామకార్యార్థం ప్లవంతం తం వానరోత్తమం సూర్యః న తతాప వాయుః చ శిషేవే ||

||శ్లోకార్థములు||

తదా రామకార్యార్థం ప్లవంతం
- అప్పుడు రామకార్యము సాధించుటకై ఎగురుచున్న
తం వానరోత్తమం
- ఆ వానరోత్తముని
సూర్యః న తతాప వాయుః చ శిషేవే చ
- సూర్యుడు తపింప చేయలేదు. వాయువు సేద తీర్చెను.

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు రామకార్యము సాధించుటకై ఎగురుచున్నఆ వానరోత్తముని, సూర్యుడు తపింప చేయలేదు. వాయువు సేద తీర్చెను. ||1.84||

గోవిందరాజులవారు వారి టీకాలో ఇలా రాస్తారు. - 'తతాపేతి || రామకార్యం సీతాన్వేషణం తదేవ అర్థః ప్రయోజనం తస్య సిద్ధయే లాభాయ, తద్ హేతుభూతహనుమత్ శ్రమనివర్తనాయేత్ ఇతి అర్థః'; సీతాన్వేషణలో హనుమంతుని శ్రమ తగ్గించడము కోసము హనుమను తపింప చేయలేదు అని. రామకార్యానికి అందరూ తోడ్పడతారు అన్నమాట. నిజానికి నిష్కామ కర్మ మార్గములో వున్నవారికి అందరి సహాయము వుంటుంది అని విదితమే.

నిష్కామ కర్మ చేసేవారికి కష్టము అనిపించదు. సూర్యుడి ఎండ తగలదు. ఇంకాపైగా సహకారము చేసేవారు కొల్లలుగా పెరుగుతారు, వాయుదేవుని చల్లని వాయువుల లాగా. అదే నిష్కామకర్మ మహిమ.

భగవద్గీతలో కూడా అదే వింటాము ( గీత 3-40)

శ్రీభగవానువాచ
నేహాభి క్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||40 ||

ఈ కర్మయోగములో
అభిక్రమనాశః - ప్రారంభించినది నాశనమగుట , నిష్ఫలమగుట లేదు
ప్రత్యవాయోన విద్యతే - దోషము లేదు
అంటే నిష్కామ కర్మ మొదలేట్టితే నిష్ఫలమవ్వడము లేదు.
అస్య ధర్మస్య స్వల్పమపి - ఈ నిష్కామ కర్మ కొంచెము చేసిననూ
త్రాయతే భయాత్ - భయము నుంచి రక్షించును.

ఎంత చిన్నపని నిష్కామము గా చెసినా అది జీవుని సంసార భయమునుంచి రక్షించును. అంటే నిష్కామ కర్మ చేయునివానికి సంసార బంధనముల గురించి భయము తొలగుట ఒక మహత్తర భాగ్యము.

ఈ కర్మయోగానుష్ఠానమునకు, అంటే కర్మయోగము అనుసరించడానికి నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటే కావాలి. ఇదే వాల్మీకి హనుమంతుని కార్యముల ద్వారా మనకి చెప్పుచున్నమాట.

||శ్లోకము 1.85||

ఋషయః తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయసా ||1.85||
జగుశ్చ దేవ గంధర్వాః ప్రశంసంతో మహోజసమ్ |

స|| విహాయసా ప్లవమానం మహౌజసం ఋషయః ఏనం తుష్టువుః చ దేవ గంధర్వాః ప్రశంసంతో జగుః చ||

||శ్లోకార్థములు||

విహాయసా ప్లవమానం మహౌజసం ఏనం
- ఆకాశములో పయనిస్తున్న మహాతేజస్సుగల అతనిని
ఋషయః తుష్టువుః చ
- ఋషలు స్తుతించిరి
దేవ గంధర్వాః ప్రశంసంతో జగుః చ
- దేవ గంధర్వులు ప్రశంసిస్తూ గానము చేసిరి

||శ్లోకతాత్పర్యము||

ఆకాశములో పయనిస్తున్న మహాతేజస్సు గల హనుమంతుని ఋషులు స్తుతించిరి. దేవతలు గంధర్వులు ప్రశంసిస్తూ గానము చేసిరి. ||1.85||

||శ్లోకము 1.86||

నాగాశ్చ తుష్టువు ర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ||1.86||
ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగత క్లమమ్ |

స|| విగతక్లమమ్ కపివరమ్ ప్రేక్ష్య సహసా సర్వే నాగాః యక్షాః రక్షాంసి విబుధాః ఖగాః చ తుష్టువుః||

||శ్లోకార్థములు||

విగతక్లమమ్ కపివరమ్ ప్రేక్ష్య
- శ్రమలేకుండా వున్న కపివరుని చూచి
సహసా సర్వే నాగాః యక్షాః
- వెంటనే నాగులు యక్షులు అందరూ
రక్షాంసి విబుధాః ఖగాః చ
- రాక్షసులు, పండితులు, పక్షులు కూడా
తుష్టువుః - స్తుతించిరి

||శ్లోకతాత్పర్యము||

శ్రమలేకుండా వున్న కపివరుని చూచి, వెంటనే నాగులు యక్షులు అందరూ, రాక్షసులు, పండితులు, పక్షులు కూడా స్తుతించిరి. ||1.86||

||శ్లోకము 1.87||

తస్మిన్ ప్లవగ శార్దూలే ప్లవమానే హనూమతి ||1.87||
ఇక్ష్వాకుకుల మానార్థీ చిన్తయామాస సాగరః |

స|| ప్లవగశార్దూలే తస్మిన్ హనూమతి ప్లవమానే సాగరః ఇక్ష్వాకుకులమానార్థీ చిన్తయామాస||

||శ్లోకార్థములు||

ప్లవగశార్దూలే తస్మిన్ హనూమతి ప్లవమానే
- ప్లవంగములలో శార్దూలము వంటి హనుమంతుడు ఎగురుచుండగా
సాగరః ఇక్ష్వాకుకులమానార్థీ
- ఇక్ష్వాకుకుల గౌరవముకోరు సాగరుడు
చిన్తయామాస - ఆలోచించసాగెను

||శ్లోకతాత్పర్యము||

ప్లవంగములలో శార్దూలము వంటి హనుమంతుడు ఎగురుచుండగా, ఇక్ష్వాకుకుల గౌరవముకోరు సాగరుడు ఆలోచించసాగెను. ||1.87||

రామాయణ తిలకలో, "స్వజన్మకారణీ భూతస్య ఇక్ష్వాకు కులస్య మానం సత్కారమర్థయతే సాగరః చిన్తయామాస" అంటారు. అంటే తన జన్మ కి కారకులైన ఇక్ష్వాకుకులము వారి గౌరవము కోరు సాగరుడు ఆలోచించసాగాడు అని. ఇది బాలకాండలో విశ్వామిత్రునిచేత రామలక్ష్మణులకు చెప్పబడిన సాగర వృత్తాంతానికి ధ్వని.

||శ్లోకము 1.88||

సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనూమతః ||1.88||
కరిష్యామి భవిష్యామి సర్వ వాచ్యో వివక్షతామ్ |

స|| యది అహం వానరేన్ద్రస్య హనూమతః సహాయ్యం న కరిష్యామి (తది) వివక్షతామ్ సర్వవాచ్యః భవిష్యామి||

||శ్లోకార్థములు||

యది అహం వానరేన్ద్రస్య హనూమతః
- ఇప్పుడు నేను వానరేంద్రుడు అయిన హనుమంతుని
సహాయ్యం న కరిష్యామి
- సహాయము చేయకపోయినచో
వివక్షతామ్ సర్వవాచ్యః భవిష్యామి
- (అప్పుడు) తెలిసినవారి దృష్టిలో నిందింప తగిన వాడను అగుదును

||శ్లోకతాత్పర్యములు||

'ఇప్పుడు నేను వానరేంద్రుడు అయిన హనుమంతునికి సహాయము చేయకపోనిచో, అప్పుడు తెలిసినవారి దృష్టి లో నిందింప తగినవాడను అగుదును.' ||1.88||

చేయవలసిన కార్యము చేయకపొతే , నిందింపబడుదురు అన్నది లోకనీతి.

||శ్లోకము 1.89||

అహమిక్ష్వాకు నాథేన సగరేణ వివర్థితః ||1.89||
ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితు మర్హతి |

స|| అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః | అయం ఇక్ష్వాకు సచివః చ అవసీదితుం న అర్హతి ||

||శ్లోకార్థములు||

అహం ఇక్ష్వాకునాథేన
- నేను ఇక్ష్వాకునాధుడగు
సగరేణ వివర్ధితః
- సగరునిచే పెంపోదింపబడితిని
అయం ఇక్ష్వాకు సచివః చ
- ఈ ఇక్ష్వాకు సచివుడు కూడా
అవసీదితుం న అర్హతి
- అలసట పొందకూడదు

||శ్లోకతాత్పర్యములు||

'నేను ఇక్ష్వాకునాధుడగు సగరునిచే పెంపోదింపబడితిని. ఈ ఇక్ష్వాకు సచివుడు అలసట పొందకూడదు'. ||1.89||

రామాయణ తిలకలో ఇలా రాస్తారు; ' ఇక్ష్వాకు నాథేన సగరేణ అహం వివర్థితః తస్మాత్ హేతోః అవసాదితుం శ్రమం ప్రాప్తుం అయమ్ ఇక్ష్వాకు సచివః న అర్హతి'.

|| శ్లోకము 1.90||

తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః||1.90||
శేషం చ మయి విశ్రాంత స్సుఖేనాతి పతిష్యతి |

స|| యథా కపిః విశ్రమేత తథా మయా విధాతవ్యమ్| మయి విశ్రాన్తః సుఖేన అతిపతిష్యతి ||

||శ్లోకార్థములు||

యథా కపిః విశ్రమేత
- ఏవిధముగా వానరుడు విశ్రమించగలడో
తథా మయా విధాతవ్యమ్
- ఆ విధముగా నాచేత చేయబడతగినది
మయి విశ్రాన్తః
- నాపై విశ్రమించి
సుఖేన అతిపతిష్యతి
- సుఖముగా దాటగలడు

||శ్లోకతాత్పర్యము||

'ఏ విధముగా వానరుడు విశ్రమించగలడో, ఆ విధముగా నా చేత చేయబడతగినది.
నా (శృంగముల) పై విశ్రమించి సుఖముగా దాటగలడు'. ||1.90||

రామయణ తిలకలో - 'యథా కపిః విశ్రమేత తథా మయా విధాతవ్యమ్' - అది సాగరుని ఆలోచన

||శ్లోకము 1.91||

ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి ||1.91||
హిరణ్య నాభం మైనాకం ఉవాచ గిరిసత్తమమ్ |

స|| సముద్రః ఇతి సాధ్వీం మతిం కృత్వా అంభసి చ్ఛన్నం హిరణ్యనాభం గిరిసత్తమమ్ మైనాకం ఉవాచ ||

||శ్లోకార్థములు||

సముద్రః ఇతి సాధ్వీం మతిం కృత్వా
- సముద్రుడు ఈవిధముగా చక్కగా ఆలోచించి
అంభసి చ్ఛన్నం
- సాగరములో దాగివున్న
హిరణ్యనాభం గిరిసత్తమమ్
- బంగారముతో నిండిన గిరిసత్తముడైన
మైనాకం ఉవాచ
- మైనాకునితో ఇట్లు చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

సముద్రుడు ఈవిధముగా చక్కగా అలోచించి, సాగరములో దాగివున్న, బంగారముతో నిండిన గిరిసత్తముడైన మైనాకుని తో ఇట్లు పలికెను.||1.91||

||శ్లోకము 1.92||

త్వమిహాసురసంఘానాం పాతాళతలవాసినామ్ ||1.92||
దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిఘస్సన్నివేశితః |

స|| గిరిశ్రేష్ఠ త్వం ఇహ పాతాళతల వాసినాం అసుర సంఘానామ్ పరిఘః ఇవ దేవరాజ్ఞా సన్నివేశితః ||

||శ్లోకార్థములు||

గిరిశ్రేష్ఠ త్వం ఇహ పాతాళతలవాసినాం
- ఓ గిరిశ్రేష్ఠుడా నీవు ఇక్కడ పాతాళతలములో నివశించు
అసుర సంఘానామ్
- అసురసంఘములకు
పరిఘః ఇవ దేవరాజ్ఞా సన్నివేశితః
- అడ్డుగా దేవేంద్రుని ఆజ్ఞతో నియమించబడినవాడవు

||శ్లోకతాత్పర్యము||

'ఓ గిరి శ్రేష్ఠుడా! నీవు ఇచట పాతాళములో నివశించు అసుర సంఘములకు అడ్డుగా దేవేంద్రుని ఆజ్ఞతో నియమించబడినవాడవు.' ||1.92||

||శ్లోకము 1.93||

త్వ మేషాం జాత వీర్యాణాం పునరేవోత్పతిష్యతామ్ ||1.93||
పాతాళ స్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి |

స|| జాత వీర్యాణాం ఏషామ్ పునరేవ ఉత్పతిష్యతాం త్వం అప్రమేయస్య పాతాళస్య ద్వారం ఆవృత్య తిష్ఠసి ||

||శ్లోకార్థములు||

జాత వీర్యాణాం
- పరాక్రమము పెంపొందించకో గల
పునరేవ ఉత్పతిష్యతాం ఏషామ్
- మళ్ళీ పైకి రాగల వారి
అప్రమేయస్య పాతాళస్య
- కొలవలేని పాతాళము యొక్క
ద్వారం ఆవృత్య తిష్ఠసి
- ద్వారము అడ్డగిస్తూ నిలబడ్డావు

||శ్లోకతాత్పర్యము||

'పరాక్రమము పెంపొందించకోగల, మళ్ళీ పైకి రాగల వారి, కొలవలేని పాతాళము యొక్క ద్వారము అడ్డగిస్తూ నిలబడ్డావు.' ||1.93||

||శ్లోకము 1.94||

తిర్యగ్ ఊర్ధ్వం అధశ్చైవ శక్తిః తే శైలవర్థితుమ్ ||1.94||
తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమ |

స|| శైల తే తిర్యక్ ఊర్ధ్వం అధశ్చైవ వర్ధితుం శక్తిః (అస్తి) | తస్మాత్ గిరిసత్తమ త్వాం సంచోదయామి ఉత్తిష్ఠ ||

||శ్లోకార్థములు||

శైల తే తిర్యక్ ఊర్ధ్వం అధశ్చైవ
- పర్వతమా నీకు పైకి క్రిందకి కూడా
వర్ధితుం శక్తిః (అస్తి)
- పెరుగుటకు శక్తి కలదు
తస్మాత్ గిరిసత్తమ
- అందువలన ఓ గిరిసత్తమ
త్వాం సంచోదయామి ఉత్తిష్ఠ
- నిన్ను ప్రోత్సహిస్తున్నాను. లెమ్ము.

||శ్లోకతాత్పర్యము||

'పర్వతమా నీకు పైకి క్రిందకి కూడాపెరుగుటకు శక్తి కలదు. అందువలన ఓ గిరిసత్తమ, నిన్ను ప్రోత్సహిస్తున్నాను. లెమ్ము'. ||1.94||

||శ్లోకము 1.95||

స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ ||1.95||
హనుమాన్ రామకార్యార్థం భీమకర్మా ఖమాప్లుతః |

స|| కపిశార్దూలః వీర్యవాన్ భీమకర్మా స రామకార్యార్థం త్వాం ఉపరి ఏతి ఖమ్ ఆప్లుతః ||

||శ్లోకార్థములు||

ఏషః హనుమాన్ - ఈ హనుమంతుడు
కపిశార్దూలః - వానరులలో శార్దూలము వంటి వాడు ,
వీర్యవాన్ భీమకర్మా -
పరాక్రమముగలవాడు, భీతిగొల్పేకార్యములు చేయువాడు
స రామకార్యార్థం -
అతడు రామకార్యార్థము
ఖమ్ ఆప్లుతః త్వాం ఉపరి ఏతి -
అకాశములో ఎగురుచూ నీ పైన వచ్చుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

'ఈ హనుమంతుడు వానరులలో శార్దూలము వంటి వాడు, పరాక్రమముగలవాడు, భీతిగొల్పేకార్యములు చేయువాడు. అతడు రామకార్యార్థము అకాశములో ఎగురుచూ నీ పైన వచ్చుచున్నాడు'. ||1.95||

||శ్లోకము 1.96||

అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః ||1.96||
మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ |

స|| ఇక్ష్వాకుకులవర్తినః అస్య సాహ్యం మయా కార్యం | ఇక్ష్వాకవః మమపూజ్యాః హి | తవ పూజ్యతమాః ||

||శ్లోకార్థములు||

ఇక్ష్వాకుకులవర్తినః అస్య సాహ్యం
- ఇక్ష్వాకుకులము వారిని సేవించు వానికి సహాయము
మయా కార్యం - నా ధర్మము
ఇక్ష్వాకవః మమపూజ్యాః హి
- ఇక్ష్వాకులు నాకు పూజ్యనీయులు.
తవ పూజ్యతమాః
- నీకు కూడాపూజనీయులు

||శ్లోకతాత్పర్యము||

'ఇక్ష్వాకుకులము వారిని సేవించు వానికి సహాయము చేయుట నా ధర్మము. ఇక్ష్వాకులు నాకు పూజ్యనీయులు. నీకు కూడాపూజనీయులు'. ||1.96||

||శ్లోకము 1.97||

కురుసాచివ్య మస్మాకం న నః కార్య మతిక్రమేత్ ||1.97||
కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ |

స|| అస్మాకం సాచివ్యం కురు | నః కార్యం కర్తవ్యం న అతిక్రమేత్| అకృతం కార్యం సతామ్ మన్యుమ్ ఉదీరయేత్||

||శ్లోకార్థములు||

అస్మాకం సాచివ్యం కురు
- మాకు తోడుగా వుండుము
నః కార్యం కర్తవ్యం న అతిక్రమేత్
- మనము చేయతగిన కార్యము అవధి అతిక్రమించకుండా చేయవలెను
అకృతం కార్యం
- చేయతగి చేయబడని కార్యము
సతామ్ మన్యుమ్ ఉదీరయేత్
- సత్పురుషుల కోపమును పెంచును

||శ్లోకతాత్పర్యము||

'మాకు తోడుగా వుండుము. మనము చేయతగిన కార్యము అవధి అతిక్రమించకుండా చేయవలెను. చేయతగి చేయబడని కార్యము సత్పురుషుల కోపమున కు దారితీయును'. ||1.97||

ఇవి సాగరుని మాటలు. సాగరుడు, ఇక్ష్వాకుకుల సగర మహారాజు అగు సగరునిచే పోషించబడి వృద్ధిచెందిన వాడు. అందుకే సాగరుడు అనబడ్డాడు. సాగరునికి ఇక్ష్వాకుకులము వారికి సహాయము చేయాలనిపిస్తుంది. దానికి కారణము చెపుతాడు.

"కర్తవ్యం అకృతం కార్యం
సతాం మన్యుముదీరయేత్"|

"చేయతగిన చేయవలసిన కార్యము చేయకపోతే, అది పెద్దలకి నిందనీయముగా కనపడును లేక ఆగ్రహము కలుగును". అదికూడా చేయవలసిన సమయములో వెంటనే చేయవలెను.

ఉపకారికి ప్రత్యుపకారము చేయాలి అన్నది లోక నీతి. అలాగ ఇక్ష్వాకుకులము వారికి సాగరుడు ఉపకారము చేయాలి. అలా చేయాలి అని, అలా చేయకపోతే తప్పు అని కూడా అనిపిస్తుంది సాగరుడికి

అంటే ఇప్పుడు ఆకాశములో రామునికొరకు, అంటే ఇక్ష్వాకుకుల తిలకుని కార్యార్థమై వెళ్ళుతున్న వానికి, అంటే హనుమంతునకు సహాయము చేయాలి. అలా చేస్తే ఇక్ష్వాకుకులము వారికి సహాయము చేసినట్లే.

అప్పుడు అలా సహాయము చేయడానికి సాగరుడు తనలో దాగి వున్న మైనాకునకు చెపుతాడు. మైనాకుడు పైకి లేచి నిలబడితే, దానిపై హనుమంతుడు కోంచెము విశ్రాంతి తీసుకొని మరీ వెళ్ళవచ్చును అనే తన ఆలోచన. అది మైనాకునికి చెపుతాడు.

||శ్లోకము 1.98||

సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి ||1.98||
అస్మాకం అతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః |

స|| సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ఠ | ప్లవతామ్ వరః అస్మాకమ్ అతిథిశ్చైవ పూజ్యశ్చ| ఏషః కపిః త్వయి తిష్ఠన్తు ||

||శ్లోకార్థములు||

సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ఠ
- నీటినుండి పైకి లెమ్ము
ప్లవతామ్ వరః అస్మాకమ్ అతిథిశ్చైవ పూజ్యశ్చ
- ఎగరిగేవారిలో శ్రేష్ఠుడు మనకు అతిథిగా కూడా పూజ్యుడు
ఏషః కపిః త్వయి తిష్ఠన్తు
- ఈ వానరుడు నీపై విశ్రమించుగాక

||శ్లోకతాత్పర్యము||

'నీటినుండి పైకి లెమ్ము. హనుమంతుడు ఎగరిగేవారిలో శ్రేష్ఠుడు మనకు అతిథిగా కూడా పూజ్యుడు. ఈ వానరుడు నీపై విశ్రమించుగాక'. ||1.98||

||శ్లోకము 1.99||

చామీకర మహానాభ దేవ గంధర్వ సేవిత||1.99||
హనుమాంస్త్వయి విశ్రాంతః తతః శేషం గమిష్యతి |
స ఏష కపిశార్దూల స్త్వాముపర్యేతి వీర్యవాన్ ||

స|| చామీకర మహానాభ (త్వం) దేవగన్ధర్వ సేవితః | హనుమాన్ త్వయి విశ్రాన్తః తతః శేషం గమిష్యతి||

||శ్లోకార్థములు||

చామీకర మహానాభ
- బంగారు శిఖరములు కలవాడా
దేవగన్ధర్వ సేవితః
- దేవగన్ధర్వాదులచే సేవింపబడిన వాడవు.
హనుమాన్ త్వయి విశ్రాన్తః
- హనుమంతుడు నీపై విశ్రమించి
తతః శేషం గమిష్యతి
- పిమ్మట మిగిలిన ప్రయాణము చేయగలడు

||శ్లోకతాత్పర్యము||

'ఓ బంగారు శిఖరములు కలవాడా ! నీవు దేవ గంధర్వులచే సేవింపబడినవాడవు. హనుమంతుడు నీపై విశ్రమించి, పిమ్మట మిగిలిన ప్రయాణము చేయగలడు'. ||1.99||

||శ్లోకము 1.100||

కాకుత్స్థస్యానృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనమ్ ||1.100||
శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి |

స|| కాకుత్స్థస్య అనృశంస్యం చ మైథిల్యాః వివాసనం చ ప్లవగేన్ద్రస్య శ్రమం చ సమీక్ష్య ఉత్థాతుం అర్హసి||

||శ్లోకార్థములు||

కాకుత్స్థస్య అనృశంస్యం
-కాకుత్‍స్థుని ఉత్తమ స్వభావము
మైథిల్యాః వివాసనం
- సీత అపహరణము
ప్లవగేన్ద్రస్య శ్రమం చ సమీక్ష్య
- వానరుని శ్రమ కూడా గమనించి
ఉత్థాతుం అర్హసి
- పైకి వచ్చుట సబబు

||శ్లోకతాత్పర్యము||

'కాకుత్‍స్థుని ఉత్తమ స్వభావము, సీత అపహరణము, వానరుని శ్రమ కూడా గమనించి నీవు పైకి వచ్చుట సబబు'. ||1.100||

||శ్లోకము 1.101||

హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ||1.101||
ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమ లతా యుతః ||

స|| హిరణ్యనాభః మహాద్రుమలతాయుతః లవణాంభసః మైనాకః (ఏతత్) నిశమ్య జలాత్ తూర్ణమ్ ఉత్పపాత||

||శ్లోకార్థములు||

హిరణ్యనాభః - బంగారు శిఖరములు కలవాడు,
మహాద్రుమలతాయుతః - మహావృక్షములు లతలతో కూడినవాడు,
లవణాంభసః - సముద్రములో వున్నవాడు అగు,
మైనాకః (ఏతత్) నిశమ్య - మైనాకుడు ఈ మాటలు విని
జలాత్ తూర్ణమ్ ఉత్పపాత - సాగరజలముల నుండి వెంటనే పైకి వచ్చెను.

||శ్లోకతాత్పర్యము||

బంగారు శిఖరములు కలవాడు, మహావృక్షములు లతలతో కూడినవాడు, సముద్రములో వున్నవాడు అగు మైనాకుడు, ఈ మాటలు విని, సాగరజలములనుండి వెంటనే పైకి వచ్చెను. ||1.101||

సాగరుని మాటలను విని, ఆ మాటలను అంగీకరించి మైనాకుడు వెంటనే సముద్రములోనుంచి పైకి వస్తాడు.

||శ్లోకము 1.102||

ససాగరజలం భిత్వా బభూవాభ్యుత్థితః తదా ||1.102||
యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః |

స|| తదా సః సాగరజలం భిత్వా యథా దీప్తరశ్మిః దివాకరః జలధరం భిత్వా (ఇవ) తదా సః సాగరజలం భిత్వా అభ్యుద్ధితః బభూవ||

||శ్లోకార్థములు||

తదా సః సాగరజలం భిత్వా
- అప్పుడు సాగరజలములను వదిలి
దీప్తరశ్మిః దివాకరః జలధరం భిత్వా (ఇవ)
- ప్రకాశించు కిరణములు గల సూర్యుడు నీటితో నిండిన మేఘములను ఛేదించి వచ్చినట్లు
తదా సః సాగరజలం భిత్వా
- అప్పుడు ఆ మైనకుడు సాగరజలములను వదిలి
అభ్యుద్ధితః బభూవ
- పైకి లేచినవాడయ్యెను.

||శ్లోకతాత్పర్యము||

ప్రకాశించు కిరణములు గల సూర్యుడు నీటితో నిండిన మేఘములను ఛేదించి వచ్చినట్లు, అప్పుడు ఆ మైనాకుడు సాగరజలములను వదిలి పైకి లేచినవాడయ్యెను. ||1.102||

ఇక్కడ మైనాకుడు సాగరుల కథనము మననం చేయతగినది.

"రామార్థం వానరార్థం చ" రామునికొరకు వానరులకొరకు నిష్కామ కర్మతో ఆకాశంలో పయనిస్తున్న హనుమంతుని సాగరుడు చూస్తాడు.

సాగరుడు ఇక్ష్వాకుకుల సగర మహారాజు అగు సగరునిచే పోషించబడి వృద్ధిచెందిన వాడు.
అందుకే సాగరుడు అనబడ్డాడు.

సాగరునికి ఇక్ష్వాకుకులము వారికి సహాయము చేయాలనిపిస్తుంది.

దానికి కారణము చెపుతాడు.

"కర్తవ్యం అకృతం కార్యం
సతాం మన్యుముదీరయేత్"|

"చేయతగిన చేయవలసిన కార్యము చేయకపోతే, అది పెద్దలకి నిందనీయముగా కనపడును లేక ఆగ్రహము కలుగును".

ఉపకారికి ప్రత్యుపకారము చేయాలి అన్నది లోక నీతి. అలాగ ఇక్ష్వాకుకులము వారికి సాగరుడు ఉపకారము చేయాలి.అలా చేయకపోతే తప్పు అని కూడా అనిపిస్తుంది సాగరుడికి

అంటే ఇప్పుడు ఆకాశములో రామునికొరకు, అంటే ఇక్ష్వాకుకుల తిలకుని కార్యార్థమై వెళ్ళుతున్న వానికి, అంటే హనుమంతునకు సహాయము చేయాలి. అలా చేస్తే ఇక్ష్వాకుకులము వారికి సహాయము చేసినట్లే.

అప్పుడు అలా సహాయము చేయడానికి సాగరుడు తనలో దాగి వున్న మైనాకునకు చెపుతాడు. మైనాకుడు పైకి లేచి నిలబడితే, దానిపై హనుమంతుడు కోంచెము విశ్రాంతి తీసుకొని మరీ వెళ్ళవచ్చును అనే తన ఆలోచన. అది మైనాకునికి చెపుతాడు.

ఇక్కడ ఇంకోమాట కూడా వాల్మీకి చెపుతాడు. "అతిథిః పూజార్హః" అతిథులు పూజనీయులు.
అది ధర్మము. అతిథిని మించినవాడు జ్ఞానుడు. అతిథి పూజార్హుడైతే, లోకములో జ్ఞానులు వస్తే ఇంక చెప్పనేల. అట్టివారు పూజనీయులు అన్నమాట లో సందేహమే లేదు అని

అలాచెప్పగానే పైకి కిందకి పెరగగల మైనాకుడు, వెంటనే సూర్యకాంతిలో మెరుస్తున్న బంగారు శిఖరాలతో, పైకి పెరిగి నిలబడతాడు సాగరములో.

||శ్లోకము 1.103||

స మహాత్మ ముహూర్తేన సర్వతః సలిలావృతః ||1.103||
దర్శయామాస శృఙ్గాణి సాగరేణ నియోజితః |

స|| ముహూర్తేన సాగరేణ నియోజితః సర్వతః సలిలావృతః సః మహాత్మ శృంగాణి దర్శయామాస||

||శ్లోకార్థములు||

సర్వతః సలిలావృతః మహాత్మ
- అన్నివైపుల జలములతో చుట్టబడిన మైనాకుడు
ముహూర్తేన సాగరేణ నియోజితః
- క్షణకాలములో సాగరునిచేత నియోజింపబడి,
సః శృంగాణి దర్శయామాస
- తన శృంగములను చూపించసాగెను.

||శ్లోకతాత్పర్యము||

అన్నివైపుల జలములతో చుట్టబడిన మైనాకుడు, క్షణకాలములో సాగరునిచేత నియోజింపబడి, తన శృంగములను చూపించసాగెను. ||1.103||

||శ్లోకము 1.104||

ఆదిత్యోదియ సంకాశైరాలిఖిద్భిరివాంబరమ్|
శాతకుంభమయైః శృఙ్గైః సకిన్నరమహోరగైః ||1.104||

స|| సః కిన్నరమహోరగైః అదిత్యోదియ సంకాశైః శాతకుంభమయైః శృంగైః అమ్బరం ఆలిఖద్భిః (దర్శయామాస) ||

||శ్లోకార్థములు||

కిన్నరమహోరగైః
- కిన్నరులు ఉరగములు తో
అమ్బరం ఆలిఖద్భిః
- ఆకాశమును అంటుకుంటున్నట్లు వున్న
శాతకుంభమయైః శృంగైః
- బంగారు శిఖరములతో
అదిత్యోదియ సంకాశైః
- ఉదయకాలపు సూర్యునివలె

||శ్లోకతాత్పర్యము||

ఆ మైనాక పర్వతము కిన్నరులు ఉరగములుతో, ఆకాశమును అంటుకుంటున్నట్లు వున్న బంగారు శిఖరములతో ఉదయకాలపు సూర్యునివలె ( ప్రకాశించు చుండెను). ||1.104||

||శ్లోకము 1.105||

తప్తజాంబూనదైః శృఙ్గైః పర్వతస్య సముత్థితైః ||1.105||
ఆకాశం శస్త్ర సంకాశం అభవత్కాంచనప్రభమ్|

స|| పర్వతస్య సముత్థితైః శృఙ్గైః తప్తజామ్బూనదైః ఆకాశమ్ శస్త్ర సంకాశం కాంచన ప్రభం అభవత్||

||శ్లోకార్థములు||

సముత్థితైః పర్వతస్య తప్తజామ్బూనదైః శృఙ్గైః
- పైకి వచ్చిన పర్వతము యొక్క కరిగించిన బంగారము కల శిఖరములతో
ఆకాశమ్ శస్త్ర సంకాశం అభవత్
- ఆకాశము బంగారు కాంతిని పొందెను

||శ్లోకతాత్పర్యము||

ఆ పర్వతము యొక్క పైకివచ్చిన శిఖరములు, కరిగించిన బంగారములా ఉండడము వలన శస్త్రముల రంగు కల ఆకాశము అంతా బంగారు కాంతిని పొందినది. ||1.105||

||శ్లోకము1.106||

జాతరూపమయైః శృఙ్గైః భ్రాజమానైః స్వయం ప్రభైః ||1.106||
ఆదిత్య శత సంకాశ స్సోఽభవత్ గిరిసత్తమః|

స|| స్వయంప్రభైః భ్రాజమానైః జాతరూపమయైః శృఙ్గైః సః గిరిసత్తమః శత ఆదిత్య సంకాశః అభవత్||

||శ్లోకార్థములు||

జాతరూపమయైః శృఙ్గైః
- కనకమయమైన శృంగములతో
స్వయంప్రభైః భ్రాజమానైః
- సహజమైన కాంతితో విరాజిల్లుచున్న
సః గిరిసత్తమః - ఆ గిరి సత్తముడు
శత ఆదిత్య సంకాశః అభవత్
- నూరు అదిత్యులతో సమానమైన కాంతి తో విరాజిల్లెను

||శ్లోకతాత్పర్యము||

కనకమయమైన శృంగములతో, సహజమైన కాంతితో విరాజిల్లుచున్న ఆ గిరి సత్తముడు, నూరు అదిత్యులతో సమానమైన కాంతితో విరాజిల్లెను. ||1.106||

||శ్లోకము 1.107||

తముత్థిత మసంగేన హనుమానగ్రతస్థితమ్ ||1.107||
మధ్యే లవణతోయస్య విఘ్నోఽయమితి నిశ్చితః |

స|| లవణతోయస్య మధ్యే అసంగేన ఉత్థితం అగ్రః స్థితం తం అయం విఘ్నః ఇతి నిశ్చితః ( తతః కింకుర్వన్?)||

||శ్లోకార్థములు||

లవణతోయస్య మధ్యే అసంగేన ఉత్థితం
- సముద్రము మధ్యలో హఠాత్తుగా పైకి లేచి
అగ్రః స్థితం తం
- ముందు నిలబడి వున్నఆ పర్వతమును
అయం విఘ్నః ఇతి నిశ్చితః
- ఇది విఘ్నము అని తలచి

||శ్లోకతాత్పర్యము||

సముద్రము మధ్యలో హఠాత్తుగా పైకి లేచి, ముందు నిలబడి వున్నఆ పర్వతమును, ఇది విఘ్నము అని తలచెను. ||1.107||

అలా తలచి ఏమి చేసెనో ముందు శ్లోకములో వింటాము.

||శ్లోకము 1.108||

స తముచ్ఛ్రిత మత్యర్థం మహావేగో మహాకపిః ||1.108||
ఉరసా పాతయామాస జీమూత మివ మారుతః |

స|| స కపిః మహావేగః అత్యర్థమ్ ఉచ్ఛ్రితం తం ఉరసా మారుతః జీమూతమివ పాతయామాస ||

||శ్లోకార్థములు||

సః కపిః మహావేగః
- ఆ మహావేగము కల హనుమంతుడు
అత్యర్థమ్ ఉచ్ఛ్రితం తం
- హఠాత్తుగా లేచిన ఆ పర్వతమును
ఉరసా మారుతః జీమూతమివ పాతయామాస
- వక్షస్థలముతో వాయువు మేఘములను చెదరగొట్టినట్లు పడవేసెను.

||శ్లోకతాత్పర్యము||

ఆ మహావేగము కల హనుమంతుడు హఠాత్తుగా లేచిన ఆ పర్వతమును వక్షస్థలముతో వాయువు మేఘములను చెదరగొట్టినట్లు పడవేసెను. ||1.108||

అంటే సాగరుని చేత ప్రేరేపింపబడిన మైనాకుడు ,సాగరుని మాటలు విని వెంటనే సూర్యకాంతిలో మెరుస్తున్న బంగారు శిఖరాలతో పైకి పెరిగి నిలబడతాడు సాగరములో.
అలా హఠాత్తుగా కనబడిన మైనాకుడు హనుమంతునికి ఒక అడ్డంకి లాగా కనిపిస్తాడు.
వెంటనే హనుమంతుడు తన రొమ్ముతో ఢీకొని మైనాకుని శిఖరాలని, వాయువు మేఘములను చెదరగొట్టినట్లు, మైనాకుని శిఖరములను నుగ్గు నుగ్గు చేస్తాడు.

||శ్లోకము 1.109||

స తథా పాతితః తేన కపినా పర్వతోత్తమః ||1.109||
బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ |

స|| తేన కపినా తథా పాతితః స పర్వతోత్తమః తస్య కపేః వేగం బుద్ధ్వా జహర్ష చ ననంద చ ||

||శ్లోకార్థములు||

తేన కపినా తథా పాతితః
- ఆ కపివర్యునిచేత ఆవిధముగా పడగొట్టబడిన
స పర్వతోత్తమః
- ఆ పర్వతోత్తముడు
తస్య కపేః వేగం బుద్ధ్వా
- ఆ కపి వేగమును తెలిసికొని
జహర్ష చ ననంద చ- సంతోషపడెను

||శ్లోకతాత్పర్యము||

ఆ కపివర్యునిచేత ఆవిధముగా పడగొట్టబడిన ఆ పర్వతోత్తముడు, ఆ కపి వేగమును తెలిసికొని సంతోషపడెను. ||1.109||

తిలక టీకాలో 'జహర్ష చ ననంద చ' అనకుండా , జహర్ష చ ననాద చ' అంటారు. దానికి ఇలా రాస్తారు: 'జహర్ష చ ననాద చ' ఇతి ప్రాచీన పాఠః| ( హనుమత్) బలవైభవం దృష్ట్వా జహర్ష, స్వ ఉత్థాన ప్రయోజన అవేదనాయ ననాద శబ్దం కృతవాన్ | ననన్ద ఇతి ఆధునిక కల్పిత పాఠః|

||శ్లోకము 1.110,111||

త మాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ||110||
ప్రీతో హృష్ఠమనా వాక్యం అబ్రవీత్ పర్వతః కపిమ్ |
మానుషం ధారయన్ రూపం ఆత్మనః శిఖరే స్థితః ||111||

స|| పర్వతః ప్రీతః హృష్టమానః మానుషం రూపం ధారయన్ ఆత్మనః శిఖరే సముపస్థితః ఆకాశే ఆకాశగతం తం వీరం కపిం వాక్యం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

పర్వతః ప్రీతః హృష్టమానః
- మైనాకుడు ఎంతో ప్రీతికలవాడై సంతోషముతో
మానుషం రూపం ధారయన్
- మానుష రూపము దాల్చి
ఆత్మనః శిఖరే సముపస్థితః
- తన శిఖరముల మీద నిలబడి
ఆకాశే ఆకాశగతం
- ఆకాశములో పోవుచున్న
తం వీరం కపిం వాక్యం అబ్రవీత్
- ఆ వీరుడైన వానరునితో ఈ మాటలు పలికెను

||శ్లోకతాత్పర్యము||

మైనాకుడు ఎంతో ప్రీతికలవాడై సంతోషముతో మానుష రూపము దాల్చి, తన శిఖరముల మీద నిలబడి, ఆకాశములో పోవుచున్నఆ వీరుడైన వానరునితో ఈ మాటలు పలికెను. ||1.111||

||శ్లోకము 1.112||

దుష్కరం కృతవాన్కర్మ త్వమిదం వానరోత్తమః |
నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం||1.112||

స|| వానరోత్తమః త్వం దుష్కరం కర్మ కృతవాన్ | మమశృంగేషు నిపత్య విశ్రమస్వ యథాసుఖమ్||

||శ్లోకార్థములు||

వానరోత్తమః త్వం
- వానరోత్తమా నీవు
దుష్కరం కర్మ కృతవాన్
- దుష్కరమైన పని చేయుచున్నావు
మమశృంగేషు నిపత్య
- నా శిఖరములలో దిగి
విశ్రమస్వ యథాసుఖమ్
- సుఖముగా విశ్రమింపుము

||శ్లోకతాత్పర్యము||

'ఓ వానరోత్తమా, నీవు దుష్కరమైన పని చేయుచున్నావు. నా శిఖరములలో దిగి సుఖముగా విశ్రమించుము'. ||1.112||

అప్పుడు మైనాకుడు తన మానుషరూపము ధరించి , తన శిఖరములలోనే నిలిచి, ఇక్ష్వాకుకులానికి సహాయము చేయాలి అనే సాగరుని కోరిక, అదే కాక తనకు (మైనాకునికి) హనుమంతుని తండ్రి అగు వాయుదేవుడు రక్షించి చేసిన ఉపకారము, దానికి ప్రత్యుపకారము చేయవలసిన తన కర్తవ్యము చెప్పి, హనుమంతుని తన శృంగములలో విశ్రమించమని కోరుతాడు. ఈ వినతగిన సంభాషణ ముందు శ్లోకములలో వింటాము.

||శ్లోకము 1.113||

రాఘవస్య కులే జాతే రుదధిః పరివర్థితః |
స త్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః ||1.113||

స|| ఉదధిః రాఘవస్య కులే జాతైః పరివర్థితః | సః సాగరః రామహితే యుక్తం త్వాం ప్రత్యయర్చతి||

||శ్లోకార్థములు||

ఉదధిః రాఘవస్య కులే జాతైః పరివర్థితః
- ఈ సాగరము రాఘవుని కులములో పుట్టి పెరిగిన వారిచే పెంపబడినది
సః సాగరః రామహితే యుక్తం
- ఆ సాగరుడు రాముని హితము కొఅకై నియోగింపబడిన
త్వాం ప్రత్యయర్చతి
- నిన్నుపూజచేయకోరుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

'ఈ సాగరము, రాఘవుని కులములో పుట్టి పెరిగిన వారిచే పెంపబడినది. ఆ సాగరుడు రాముని హితము కొఱకై నియోగింపబడిన నిన్ను పూజచేయకోరుచున్నాడు'. ||1.113||

రామాయణ తిలకలో: ' రాఘవస్య కులే జాతైః సాగరైరుదధిః పరివర్ధితః, అతః సాగరః సగర పరివర్ధితః ఉదధిః రామహితే యుక్తం త్వాం ప్రత్యర్చయతి| తత్ర హేతుః - కృతే ఉపకృతే ప్రత్యుపకారః కర్తవ్యం ఏషసనాతనో ధర్మః |

||శ్లోకము 1.114||

కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః |
సోఽయం త్వత్ప్రతీకారార్థీ త్వత్తస్సమ్మాన మర్హతి ||1.114||

స|| కృతే ప్రతి కర్తవ్యం ఏషః సనాతనః ధర్మః | తత్ ప్రతికారార్థీ సః ( సాగరః) అయం త్వత్తః సమ్మానం అర్హతి||

||శ్లోకార్థములు||

కృతే ప్రతి కర్తవ్యం
- ఉపకారము చేసినవారికి ప్రత్యుపకారము చేయవలెను
ఏషః సనాతనః ధర్మః
- ఇది సనాతన ధర్మము
తత్ ప్రతికారార్థీ సః ( సాగరః)
- ఆ ప్రత్యుపకారము చేయగోరువాడగు ఆ సాగరుడు
త్వత్తః అయం సమ్మానం అర్హతి
- నీకు ఈ సమ్మానము చేయుటకు అర్హుడు

||శ్లోకతాత్పర్యము||

'ఉపకారము చేసినవారికి ప్రత్యుపకారము చేయవలెను. ఇది సనాతన ధర్మము. ఆ విధముగా ప్రత్యుపకారము చేయగోరువాడగు ఆ సాగరుడు, నీకు ఈ సమ్మానము చేయుటకు అర్హుడు'. ||1.114||

||శ్లోకము 1.115||

త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః |
తిష్ఠత్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతామ్||1.115||

స|| అనేన ( సాగరేణ) త్వత్ నిమిత్తం బహుమానాత్ అహం ప్రచోదితః | కపిశార్దూల త్వం తిష్ఠ | మయి (శృంగేషు) విశ్రమ్య గమ్యతామ్||

||శ్లోకార్థములు||

అనేన ( సాగరేణ) త్వత్ నిమిత్తం
- ఆ సాగరునిచేత నీ కోసము
బహుమానాత్ అహం ప్రచోదితః
- గౌరవముతో నేను ప్రేరేపింపబడితిని
కపిశార్దూల త్వం తిష్ఠ
- ఓ కపిశార్దూలమా నీవు నిలబడుము.
మయి (శృంగేషు) విశ్రమ్య గమ్యతామ్
- నా శిఖరములలో విశ్రమించి వెళ్ళుదువు గాక

||శ్లోకతాత్పర్యము||

'ఆ సాగరునిచేత నీ కోసము గౌరవముతో నేను ప్రేరేపింపబడితిని. ఓ కపిశార్దూలమా! నీవు నిలబడుము. నా శిఖరములలో విశ్రమించి వెళ్ళుదువు గాక.' ||1.115||

||శ్లోకము 1.116||

యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః |
తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతాం ఇతి ||1.116||

స|| శతం యోజనానాం సమాప్లుతః ఏష కపిః తవ సానుషు విశ్రాన్తః ప్రక్రమతామ్ ఇతి (సాగరేణ ప్రచోదితః)||

||శ్లోకార్థములు||

శతం యోజనానాం సమాప్లుతః
- నూరు యోజనములు లంఘించుచున్న
ఏష కపిః తవ సానుషు విశ్రాన్తః
- ఈ వానరుడు నీ శిఖరములలో విశ్రామించి
ప్రక్రమతామ్ ఇతి
- ముందుకు పోవును అని ( సాగరుడు నన్ను ప్రేరేపించెను)

||శ్లోకతాత్పర్యము||

'నూరు యోజనములు లంఘించుచున్నఈ వానరుడు నీ శిఖరములలో విశ్రామించి, ముందుకు పోవును అని సాగరుడు నన్ను ప్రేరేపించెను.' ||1.116||

|| శ్లోకము 1.117||

తదిదం గంధవత్ స్వాదు కందమూలఫలమ్ బహు |
తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోఽనుగమిష్యసి ||1.117||

స|| హరిశ్రేష్ఠ తత్ ఇదం గంధవత్ స్వాదు బహు కందమూలం ఆసాద్య విశ్రాన్తః అనుగమిష్యసి ||

||శ్లోకార్థములు||

హరిశ్రేష్ఠ తత్ ఇదం
- ఓ హరిశ్రేష్ఠ అందువలన ఈ
గంధవత్ స్వాదు బహు కందమూలం ఆసాద్య
- రుచీ సువాసనకల కందమూల ఫలములను ఆరగించి
విశ్రాన్తః అనుగమిష్యసి
- విశ్రాంతి గైకొని ( ప్రయాణము) కొనసాగించుము

||శ్లోకతాత్పర్యము||

'ఓ వానరోత్తమ, అందువలన ఈ రుచి సువాసనలు గల కందమూలఫలాదులు ఆరగించి విశ్రమించి ప్రయాణము కొనసాగించుము.' ||1.117||

||శ్లోకము 1.118||

అస్మాకమపి సంబంధః కపిముఖ్య త్వయాఽస్తివై |
ప్రఖ్యాతః త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః ||1.118||

స|| కపిముఖ్య త్రిషు లోకేషు ప్రఖ్యాతః మహాగుణపరిగ్రహః సంబంధః త్వయా అస్మాకమపి అస్తివై ||

||శ్లోకార్థములు||

కపిముఖ్య త్రిషు లోకేషు ప్రఖ్యాతః
- ఓ కపిశ్రేష్ఠా, ముల్లోకములలో ప్రసిద్ధమైన
మహాగుణపరిగ్రహః సంబంధః
- సద్గుణముల కారణముగా కలిగిన సంబంధము
త్వయా అస్మాకమపి అస్తివై
- నీకును మాకును కలదు

||శ్లోకతాత్పర్యము||

'ఓ కపిముఖ్యుడా !మూడు లోకములలో ప్రసిద్ధమైన, సద్గుణముల కారణముగా కలిగిన సంబంధము , నీకును మాకును కలదు.' ||1.118||

||శ్లోకము 1.119||

వేగవంతః ప్లవంతో యే ప్లవగామారుతాత్మజః |
తేషాం ముఖ్యతమః మన్యే త్వామహం కపికుంజర||1.119||

స|| మారుతాత్మజ కపికుంజరః వేగవన్తః ప్లవన్తః యే ప్లవగాః తేషామ్ ముఖ్యతమం త్వామ్ అహం మన్యే||

||శ్లోకార్థములు||

మారుతాత్మజ కపికుంజరః యే ప్లవగాః వేగవన్తః ప్లవన్తః
- ఓ హనుమా, వానరులు వేగముగా ఎగర గలవారు
కపికుంజరః తేషామ్ ముఖ్యతమం త్వామ్
- ఓ కపికుంజర వారిలో నీవు శ్రేష్ఠుడవు
అహం మన్యే
- నాకు తెలుసును

||శ్లోకతాత్పర్యము||

'ఓ హనుమా, వానరులు వేగముగా ఎగర గలవారు. ఓ కపికుంజర, వారిలో నీవు శ్రేష్ఠుడవు అని నాకు తెలుసును.' ||1.119||

||శ్లోకము 1.120||

అతిథిః కిల పూజార్హః ప్రాకృతోఽపి విజానత|
ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ ||1.120||

స|| ధర్మం జిజ్ఞాసమానేన విజానతా ప్రాకృతః అపి అతిథిః పూజార్హః | త్వాదృశః మహాన్ కిం పునః కిల||

||శ్లోకార్థములు||

ధర్మం జిజ్ఞాసమానేన విజానతా
- ధర్మము తెలిసినవారికి తెలిసినదే.
ప్రాకృతః అపి అతిథిః పూజార్హః
- సామాన్యుడైనను అతిథి పూజనీయుడు
త్వాదృశః మహాన్ కిం పునః కిల
- నీ లాంటి మహత్ముల గురించి చెప్పనేల?

||శ్లోకతాత్పర్యము||

'ధర్మము తెలిసినవారికి తెలిసినదే. సామాన్యుడైననూ అతిథి పూజార్హుడు. ఇక నీ లాంటి మహాపురుషుని గురించి చెప్పనవసరము లేదు.' ||1.120||

||శ్లోకము 1.121||

త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః |
పుత్రః తస్యైవ వేగేన సదృశః కపికుంజరః ||1.121||

స|| కపికుంజర త్వం దేవవరిష్ఠస్య మహాత్మనః మారుతస్య పుత్రః హి | వేగేన తస్యైవ సాదృశః ||

||శ్లోకార్థములు||

కపికుంజర త్వం దేవవరిష్ఠస్య మహాత్మనః
- ఓ కపికుంజరా, నీవు దేవతలోశ్రేష్ఠుడు, మహాత్ముడు అయిన
మారుతస్య పుత్రః హి
- మారుతి యొక్క పుత్రుడవు.
వేగేన తస్యైవ సాదృశః
- వేగములో అతనికి సమానుడవు

||శ్లోకతాత్పర్యము||

'ఓ కపికుంజరా దేవతలలో శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన వాయుదేవుని కుమారుడవు. వేగములో ఆ వాయుదేవునతో సమానుడవు.' ||1.121||

||శ్లోకము 1.122||

పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః |
తస్మాత్ త్వం పూజనీయో మే శృణుచాప్యత్ర కారణమ్ ||1.122||

స||ధర్మజ్ఞ త్వయి పూజితే మారుతః పూజాం ప్రాప్నోతి | తస్మాత్ త్వం అపి మే పూజనీయః | అత్రకారణం చ శృణు||

||శ్లోకార్థములు||

ధర్మజ్ఞ త్వయి పూజితే
- ఓ ధర్మజ్ఞుడా, నిన్ను పూజించినచో
మారుతః పూజాం ప్రాప్నోతి
- వాయుదేవుడు ఆ పూజలను పొందును.
తస్మాత్ త్వం అపి మే పూజనీయః
- అందువలన కూడా నీవు నాకు పూజనీయుడవు.
అత్రకారణం చ శృణు
- ఇక కారణము చెప్పెదను వినుము

||శ్లోకతాత్పర్యము||

'ఓ ధర్మము తెలిసిన వాడా ! నిన్ను పూజించినచో వాయుదేవుడు ఆ పూజలను పొందును. అందువలన నీవు కూడా నాకు పూజనీయుడవు. ఇక కారణము చెప్పెదను వినుము.' ||1.122||

రామాయణ తిలకలో: 'త్వయి పూజితే సతి మారుతః పూజాం ప్రాప్నోతి, తస్మాత్ త్వం పూజనీయ ఏవ| నను మారుతపూజయా తవ కిమిత్యత ఆహ- అత్ర మారుత పూజాయాం కారణ శృణు|

||శ్లోకము 1.123||

పూర్వం కృత యుగే తాత పర్వతాః పక్షిణోఽభవన్|
తే హి జగ్ముర్దిశస్సర్వా గరుడానిల వేగినః||1.123||

స|| తాత ! పూర్వం కృతయుగే పర్వతాః పక్షిణః అభవన్ | తే గరుడానిలవేగః సర్వాః దిశాః జగ్ముః||

||శ్లోకార్థములు||

తాత ! పూర్వం కృతయుగే
- నాయనా పూర్వము కృతయుగములో
పర్వతాః పక్షిణః అభవన్
- పర్వతములకు రెక్కలు ఉండెడివి
తే గరుడానిలవేగః సర్వాః దిశాః జగ్ముః
- అవి గరుత్మంతుని వేగముతో అన్ని దిశలలో పోవుచుండెడివి

||శ్లోకతాత్పర్యము||

'నాయనా పూర్వము కృతయుగములో, పర్వతములకు రెక్కలు ఉండెడివి. అవి గరుత్మంతుని వేగముతో అన్ని దిశలలో పోవుచుండెడివి.' ||1.123||

||శ్లోకము 1.124||

తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాస్సహర్షిభిః |
భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయా ||1.124||

స|| తతః తేషు ప్రయాతేషు సహర్షిభిః దేవ సంఘాః భూతాని చ తేషాం పతన శంకయా భయం జగ్ముః ||

||శ్లోకార్థములు||

తతః తేషు ప్రయాతేషు
- అప్పుడు వాని ప్రయాణములవలన
సహర్షిభిః దేవ సంఘాః భూతాని చ
- ఋషులతో కలిసి దేవ సంఘములు అన్ని భూతములుకూడా
తేషాం పతన శంకయా
- అవి పడునేమో అని శంకతో
భయం జగ్ముః
- భయము పొందిరి.

||శ్లోకతాత్పర్యము||

'అప్పుడు వాని ప్రయాణములవలన ఋషులతో కలిసి దేవ సంఘములు అన్ని భూతములుకూడా, అవి పడునేమో అని శంకతో భయము పొందిరి.' ||1.114||

||శ్లోకము 1.125||

తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః |
పక్షాన్ చిఛ్చేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః ||1.125||

స|| తతః క్రుద్ధః శతక్రతుః సహస్రాక్షః తత్ర తత్ర సహశ్రసః పర్వతానాం పక్షాన్ వజ్రేణ చిఛ్చేద||

||శ్లోకార్థములు||

తతః క్రుద్ధః శతక్రతుః సహస్రాక్షః
- అప్పుడు కృద్ధుడైన సహస్రాక్షుడు
తత్ర తత్ర సహశ్రసః పర్వతానాం
-అక్కడక్కడ వేలకొలదీ పర్వతముల
పక్షాన్ వజ్రేణ చిఛ్చేద
- రెక్కలను వజ్రాయుధముతో చేదించెను

||శ్లోకతాత్పర్యము||

'అప్పుడు కృద్ధుడైన సహస్రాక్షుడు అక్కడక్కడ వేలకొలదీ పర్వతముల రెక్కలను వజ్రాయుధముతో ఛేదించెను'. ||1.125||

||శ్లోకము 1.126||

సమాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ దేవరాట్ |
తతోఽహం సహసా క్షిప్త శ్వసనేన మహాత్మనా ||1.126||

స|| సః దేవరాట్ క్రుద్ధః వజ్రం ఉద్యమ్య మామ్ ఉపాగతః| తతః అహం మహాత్మనా శ్వసనేన సహసా క్షిప్తః||

||శ్లోకార్థములు||

సః దేవరాట్ క్రుద్ధః
- ఆ దేవేంద్రుడు కోపముతో
వజ్రం ఉద్యమ్య మామ్ ఉపాగతః
- వజ్రాయుధముతో నాపైకి వచ్చెను
తతః అహం మహాత్మనా
- అప్పుడు నేను మహాత్ముడైన
శ్వసనేన సహసా క్షిప్తః
- వాయుదేవునిచే వెంటనే పడవేయబడితిని

||శ్లోకతాత్పర్యము||

'ఆ దేవేంద్రుడు కోపముతో వజ్రాయుధముతో నాపైకి వచ్చెను. అప్పుడు నేను మహాత్ముడైన వాయుదేవునిచే వెంటనే పడవేయబడితిని.' ||1.126||

||శ్లోకము 1.127||

అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమః |
గుప్తపక్ష సమగ్రశ్చ తవపిత్రాఽభి రక్షితః ||1.127||

స|| ప్లవగోత్తమ గుప్తపక్షసమగ్రశ్చ అస్మిన్ లవణతోయే ప్రక్షిప్తః తవపిత్రా అభిరక్షితః ||

||శ్లోకార్థములు||

ప్లవగోత్తమ గుప్తపక్షసమగ్రశ్చ
- ఓ వానరశ్రేష్ఠా, రెక్కలు సురక్షితముగా వున్నవాడు
అస్మిన్ లవణతోయే ప్రక్షిప్తః
- ఈ లవణ సముద్రములో పడవేయబడి
తవపిత్రా అభిరక్షితః
- నీ తండ్రి చే రక్షింపబడితిని.

||శ్లోకతాత్పర్యము||

'ఓ వానరశ్రేష్ఠా, రెక్కలు సురక్షితముగా వున్నవాడు, ఈ లవణ సముద్రములో పడవేయబడి, నీ తండ్రి చే రక్షింపబడితిని.' ||1.127||

|| శ్లోకము 1.128||

తతోఽహం మానయామి త్వాం మాన్యోహి మమ మారుతః |
త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్య మహాగుణః||1.128||

స|| కపిముఖ్య తతః మారుతః మమ మాన్యః హి | తతః అహం మానయామి | మే త్వయా సంబంధః మహాగుణః ||

||శ్లోకార్థములు||

కపిముఖ్య తతః
- అందువలన కపివరుడా,
మారుతః మమ మాన్యః హి
- వాయుదేవుడు నాకు గౌరవనీయుడు
తతః అహం మానయామి
- అందువలన నేను (నిన్ను) గౌరవించుచున్నాను
మే త్వయా సంబంధః మహాగుణః
- నాకు నీతో సంబంధము ఉత్తమైన గుణముల వలన కలిగినది

||శ్లోకతాత్పర్యము||

'ఓ కపిముఖ్యుడా ! అందువలన వాయుదేవుడు నాకు గౌరవనీయుడు. అందువలన నేను నిన్ను గౌరవించుచున్నాను. నీతో నా సంబంధము ఉత్తమైన గుణముల వలన కలిగినది.' ||1.128||

||శ్లోకము 129||

అస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ|
ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే ||129||

స|| మహాకపిః అస్మిన్ కార్యే ఏవం గతే త్వం ప్రీతమనాః సాగరస్యచ మమైవ చ ప్రీతిం కర్తుం అర్హసి ||

||శ్లోకార్థములు||

మహాకపిః అస్మిన్ కార్యే
- ఓ మహాకపి, ఈ కార్యములో
ఏవం గతే త్వం ప్రీతమనాః
- ఈ విధముగా పోవుచూ సంతోషమైన మనస్సుతో
సాగరస్యచ మమైవ చ ప్రీతిం
- సాగరుని నా యొక్కప్రీతిని
కర్తుం అర్హసి - పొందుటకు తగినవాడివి.

||శ్లోకతాత్పర్యము||

'ఓ మహాకపి ! ఈ కార్యములో ఈ విధముగా పోవుచూ సంతోషమైన మనస్సుతో నా యొక్క సాగరునియొక్క ప్రీతిని పొందతగిన వాడివి.' ||1.129||

|| శ్లోకము 1.130||

శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ |
ప్రీతిం చ బహు మన్యస్వ ప్రీతోఽస్మి తవ దర్శనాత్ ||1.130||

స|| కపిసత్తమ శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ ప్రీతిం బహుమన్యస్వ| తవ దర్శనాత్ ప్రీతః అస్మి||

||శ్లోకార్థములు||

కపిసత్తమ శ్రమం మోక్షయ
- ఓ కపిసత్తమ శ్రమ తీర్చుకొనుము్
పూజాం చ గృహాణ
- పూజలు అందుకొనుము
ప్రీతిం బహుమన్యస్వ
- మా ప్రేమను గౌరవించుము
తవ దర్శనాత్ ప్రీతః అస్మి
- నీ దర్శనముతో ప్రీతి పొందినవాడను.

||శ్లోకతాత్పర్యము||

'ఓ కపిసత్తమ శ్రమతీర్చుకొనుము. పూజలను అందుకొనుము. మా ప్రేమని గౌరవించుము. నీ దర్శనముతో నేను ప్రీతి పొందినవాడను.' ||1.130||

||శ్లోకము 1.131||

ఏవముక్తః కపిశ్రేష్ఠః తం నగోత్తమమ్ అబ్రవీత్ |
ప్రీతోఽస్మి కృతామాతిథ్యం మన్యురేషోఽపనీయతామ్ ||1.131||

స|| ఏవం ఉక్తః కపిశ్రేష్ఠః తం నగోత్తమం అబ్రవీత్ | ఆతిథ్యం కృతం ప్రీతః అస్మి | ఏషః మన్యుః అపనీయతామ్ ||

||శ్లోకార్థములు||

ఏవం ఉక్తః కపిశ్రేష్ఠః -
ఈ విధముగా చెప్పబడిన ఆ వానరోత్తముడు
తం నగోత్తమం అబ్రవీత్ -
ఆ నగోత్తముడగు మైనాకునితో ఇట్లనెను
ఆతిథ్యం కృతం ప్రీతః అస్మి -
ఇవ్వబడిన ఆతిథ్యముతో ప్రీతిపొందితిని
ఏషః మన్యుః అపనీయతామ్ -
తీసికొనబడలేదనే అసంతృప్తి ని వదిలివేయుడు

||శ్లోకతాత్పర్యము||

ఈ విధముగా చెప్పబడిన ఆ వానరోత్తముడు ఆ నగోత్తముడగు మైనాకునితో ఇట్లనెను. 'ఇవ్వబడిన ఆతిథ్యముతో ప్రీతిపొందితిని. తీసికొనబడలేదనే అసంతృప్తి ని వదిలివేయుడు'.||1.131||

||శ్లోకము 1.132||

త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతివర్తతే |
ప్రతిజ్ఞా చ మయాదత్తా న స్థాతవ్య మిహాన్తరే ||1.132||

స|| మే కార్యకాలః త్వరతే | అహః చ అతివర్తతే | అన్తరే ఇహ న స్థాతవ్యం (ఇతి) మయా ప్రతిజ్ఞా దత్తాచ ||

||శ్లోకార్థములు||

మే కార్యకాలః త్వరతే - నా కార్యకాలము సమీపించుచున్నది
అహః చ అతివర్తతే - పగలు గడిచిపోతున్నది
అన్తరే ఇహ న స్థాతవ్యం - మధ్యలో ఆగ కూడదని
మయా ప్రతిజ్ఞా దత్తాచ - నా చేత ప్రతిజ్ఞ చేయబడినది

||శ్లోకతాత్పర్యము||

'నా కార్యకాలము సమీపించుచున్నది. పగలు గడిచిపోతున్నది. మధ్యలో ఆగకూడదని నా చేత ప్రతిజ్ఞ చేయబడినది కూడా.' ||1.132||

రామాయణ తిలకలో ఇలా రాయబడినది. " మే కాలః త్వరతే మాం త్వరయతి యతః అహో దినమతివర్తతే ఏతేన దిన ఏవ గన్తవ్యేతి సూచితమ్| హేత్వన్తరమాహ - ఇహ అస్మిన్ అన్తరా సాగరతరణ మధ్యే మయా న స్థాతవ్యమ్ ఇతి ప్రతిజ్ఞా దత్తా కృతా, వానర సమీపే ఇతి శేషః|| అంటే " తొందరగా పోవుచున్న కాలము నన్ను తొందరపెట్టుచున్నది. ఎందుకు ? దినము గడిచిపోవుచున్నది. అంటే ఇక్కడ ఈ దినము లోనే లంక చేరడము సూచింపబడినది అన్నమాట" అని.

అంటే ఈ దినమే లంకచేరి, రాత్రి అంతా సీతాన్వేషణ చేయడము అవుతుందన్నమాట. లంక చేరిన తర్వాత సీతాన్వేషణలో ఉదయిస్తున్న చంద్రుడు, ఆకాశ మధ్యములో వున్నచంద్రుని చూస్తాము చాలాచోట్ల కాలము సూచించడము అవుతుంది.

||శ్లోకము 1.133||

ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః |
జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ ||1.133||

స|| వీర్యవాన్ హరిపుంగవః ఇతి ఉక్త్వా శైలం పాణినా ఆలభ్య ఆకాశమ్ ఆవిశ్య ప్రహసన్నివ జగామ ||

||శ్లోకార్థములు||

వీర్యవాన్ హరిపుంగవః ఇతి ఉక్త్వా
- వీరుడైన హనుమంతుడు ఈ విధముగా చెప్పి
శైలం పాణినా ఆలభ్య
- పర్వతమున్య్ చేతితో తాకి
ఆకాశమ్ ఆవిశ్య ప్రహసన్నివ జగామ
- ఆకాశము లో ప్రవేశించి చిరునవ్వుతో వెళ్ళెను.

||శ్లోకతాత్పర్యము||

వీరుడైన హనుమంతుడు ఈ విధముగా చెప్పి ఆ పర్బతములు చేతి తో తాకి ఆకాశము లో ప్రవేశించి చిరునవ్వుతో వెళ్ళెను. ||1.133||

ఇక్కడ హనుమంతుడు మైనాకునికి ఇచ్చిన సమాధానము మననము చేయతగినది. హనుమంతుడు చెప్పిన మాట: || ప్రీతోస్మి | కృతం ఆతిథ్యం| మన్యురేషోపనీయతామ్ | త్వరతే కార్యకాలో మే | అహః చ అపి అతివర్తతే | ప్రతిజ్ఞాచ మయా దత్తా| నస్థాతవ్యం ఇహ అంతరే||"

"సంతోషించితిని | అతిథ్యము నిచ్చితివి | పట్టుదలవదలుము | పనితొందరలో ఉన్నవాడను | ప్రతిజ్ఞ చేసిన వాడను | మధ్యలో ఆగరాదు ||

ఇది చిన్నచిన్న మాటలలో , అధిక ప్రసంగము లేకుండా జరిగిన సంభాషణ.

అంటే, 'బయలు దేరేముందు ప్రతిజ్ఞ ఇచ్చితిని కనక ఆగకూడదు', అని. అది రామబాణము తో తనను పోల్చుకున్న విషయముతో కలిపిన మాట. రామబాణము ఆగదు. తను కూడా ఆగకూడదు.

ఇందులో కవి మనకు లోకనీతి గురించి చెపుతున్నాడు. మొదలు పెట్టిన కార్యము వదలి ఇంకో పనిలోకి దూరకూడదు. ఇంకెవరి ఆహ్వానము వున్నా,హనుమంతుని లాగా దానినుంచి గౌరవప్రదముగా తొలగవలెను.

||శ్లోకము 1.134||

స పర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షితః |
పూజితశ్చోపపనాభిః ఆశీర్భిః అనిలాత్మజః ||1.134||

స|| సః అనిలాత్మజః పర్వత సముద్రాభ్యాం బహుమానాత్ ఆవేక్షితః ఉపపన్నాభిః ఆశీర్భిః పూజితః చ ||

||శ్లోకార్థములు||

సః అనిలాత్మజః పర్వత సముద్రాభ్యాం
- ఆ అనిలాత్మజుడు ఆ మైనాకునిచేత సాగరునిచేత
బహుమానాత్ ఆవేక్షితః
- గౌరవభావముతో చూడబడి
ఉపపన్నాభిః ఆశీర్భిః పూజితః చ
- సందర్భోచితముగా ఆశీర్వాదములతో పూజింపబడెను

||శ్లోకతాత్పర్యము||

ఆ అనిలాత్మజుడు ఆ మైనాకునిచేత సాగరునిచేత గౌరవింపబడి, గౌరవభావముతో చూడబడి, సందర్భోచితముగా ఆశీర్వాదములతో పూజింపబడెను కూడా. ||1.134||

||శ్లోకము 1.135||

అథోర్థ్వం దూరముత్పత్య హిత్వా శైలమహార్ణవౌ |
పితుః పంథాన మాస్థాయ జగామ విమలేఽమ్బరే ||1.135||

స|| అథ శైలమహార్ణవౌ హిత్వా ( హనూమతః) ఊర్ధ్వం దూరం ఉత్పత్య విమలే అమ్బరే పితుః పన్థానం అస్థాయ జగామ||

||శ్లోకార్థములు||

అథ శైలమహార్ణవౌ హిత్వా
- ఆ మైనాకుని, సాగరమును వదిలి
ఊర్ధ్వం దూరం ఉత్పత్య
- దూరముగా పైకి ఎగిరి
విమలే అమ్బరే
- విమలాకాశములో
పితుః పన్థానం అస్థాయ జగామ
- తండ్రియొక్క ( ఆకాశ) మార్గమును అనుసరిస్తూ వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

ఆ మైనాకుని, సాగరమును వదిలి హనుమంతుడు దూరముగా పైకి ఆకాశములోకి ఎగిరి తండ్రియొక్క ( ఆకాశ) మార్గమును అనుసరిస్తూ వెళ్ళెను. ||1.135||

||శ్లోకము 1.136||

భూయశ్చోర్ధ్వగతిం ప్రాప్య గిరిం తం అవలోకయన్ |
వాయుసూనునిరాలంబే జగామ విమలేఽమ్బరే ||1.136||

స|| వాయుసూనుః భూయశ్చ ఊర్ధ్వం గతిం ప్రాప్య తం గిరిం అవలోకయన్ నిరాలమ్బే విమలే అమ్బరే జగామ ||

||శ్లోకార్థములు||

వాయుసూనుః భూయశ్చ ఊర్ధ్వం గతిం ప్రాప్య
- ఆ వాయుసూనుడు మళ్ళీ ఏత్తైన మార్గము పొంది
తం గిరిం అవలోకయన్
- ఆ పర్వతము చూస్తూ
నిరాలమ్బే విమలే అమ్బరే జగామ
- ఇంకో ఆధారము లేకుండా నిర్మలాకాశములో వెళ్ళెను.

||శ్లోకతాత్పర్యము||

ఆ వాయుసూనుడు మళ్ళీ ఏత్తైన మార్గము పొంది ఆ పర్వతము చూస్తూ ఇంకో అధారము లేకుండా నిర్మలాకాశములో వెళ్ళెను. ||1.136||

||శ్లోకము 1.137||

తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసుదుష్కరమ్ |
ప్రశశంసు స్సురాస్సర్వే సిద్ధాశ్చ పరమర్షయః ||1.137||

స|| హనుమతః తత్ ద్వితీయం సుదుష్కరం కర్మ దృష్ట్వా సర్వే సురాః సిద్ధాశ్చ పరమర్షయః ప్రశంసుః||

||శ్లోకార్థములు||

హనుమతః తత్ ద్వితీయం
- హనుమంతుడు ఆవిధముగా చేసిన రెండవ
సుదుష్కరం కర్మ దృష్ట్వా
- దుష్కరమైన కార్యముచూచి
సురాః సిద్ధాశ్చ పరమర్షయః ప్రశంసుః
- సురలు సిద్ధులు ఋషులు అందరూ హనుమంతుని ప్రశంసించిరి.

||శ్లోకతాత్పర్యము||

హనుమంతుడు ఆవిధముగా చేసిన రెండవ దుష్కరమైన కార్యముచూచి సురలు సిద్ధులు ఋషులు అందరూ హనుమంతుని ప్రశంసించిరి. ||1.137||

ఈ మైనాకుని ఉపాఖ్యానములో అపాలాచార్యులవారు తమ తత్త్వబోధలో, సంసారమనే సముద్రమును దాటుటకు ఉపక్రమించిన సాధకుడు ఎటువంటి అధ్యవసానము లో ఉండాలో అది అంతా హనుమ వర్ణనలో కవి చెప్పాడు అని అంటారు.

అధ్యాత్మికపథములో పయనించువాడు ఇంకేమి ఆధారము లేకుండా భగవంతుడే ఆధారముగా, ఆత్మజ్ఞానమునకు భగవత్ప్రాప్తికి ఉద్యమించి సాగడమే ఒక దుష్కరమైన పని.
అదే హనుమంతుడు చేసిన మొదటి దుష్కర కర్మ.

ఆ పథములో ఉండాలి. ఆ పథములో ఉన్నప్పుడు సత్కారములు పూజలు లభించ వచ్చు.
కాని తన దృష్టి మార్చుకోకుండా అదే పథములో పోవుట రెండవ దుష్కర కర్మ. అదే మైనాకుని పూజలు అందుకొని ఆగకుండా ముందుకు పోవడములో హనుమంతుడు చేసిన రెండవ దుష్కర కర్మ. సంసారికి కూడా అదే పథములో పోవగలుగుట రెండవ దుష్కర కర్మ

అలా ఒక పనిలో ఎక్కడా ఆగకుండా సాగుచున్నప్పుడు విసుగు పొందకుండా ఇంకా ముందుకు పోగలుగుట ఒక ఐశ్వర్యము.

మనము ఎదో ఒక మంత్రము తీసుకొని ధ్యానము చేస్తూ ఉంటాము. ఆ మంత్రము నూటఎనిమిది సార్లు చేసేసరికి ఇక చాలు అయిపొయింది అని ఆగి పోవచ్చు. అలా కాక అలా ధ్యానములో నిమగ్నుడై ఇంకా ధ్యానము చేయవచ్చు. అలా ధ్యానములో ఎక్కడా ఆగకుండా ముందుకు సాగగలడమే ఐశ్వర్యము. అలా రామకార్యార్థమై, హనుమంతుడు ఆగకుండా పోగలుగుతున్నాడు కనక, హనుమంతుడు ఐశ్వర్యవంతుడు.

అందుకనే దేవతలు (కవి) హనుమంతుని కార్యాచరణ విధానము కొనియాడుతూ, శ్రీమాన్ అంటే శీమంతుడా అని సంబోధిస్తారు హనుమంతుని.

ఇక సుందరకాండలో ముందు శ్లోకాలు.

||శ్లోకము 138||

దేవతాశ్చాభవన్ హృష్టాః తత్రస్థాస్తస్య కర్మణా |
కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః ||138||

స|| తత్రస్థాః దేవతాశ్చ సహస్రాక్షః వాసవశ్చ కాంచనస్య తస్య సునాభస్య కర్మణా హృష్ఠాః అభవన్ ||

||శ్లోకార్థములు||

తత్రస్థాః దేవతాశ్చ సహస్రాక్షః వాసవశ్చ
- అక్కడవున్న దేవతలు అలాగే సహస్రాక్షుడైన వాసవుడు కూడా
కాంచనస్య తస్య సునాభస్య కర్మణా
- బంగారు శిఖరములు గల మైనాకుని పనితో
హృష్ఠాః అభవన్
- సంతోషము కలవారు అయిరి

||శ్లోకతాత్పర్యము||

అక్కడవున్న దేవతలు అలాగే సహస్రాక్షుడైన వాసవుడు కూడా బంగారు శిఖరములు గల మైనాకుని పనితో సంతోషము కలవారు అయిరి. ||1.138||

||శ్లోకము 1.139||

ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదమ్ |
సునాభం పర్వత శ్రేష్ఠం స్వయమేవ శచీపతిః ||1.139||

స|| ధీమాన్ శచీపతిః పర్వతశ్రేష్ఠం సునాభం పరితోషాత్ సగద్గదమ్ స్వయమేవ వచనమ్ ఉవాచ||

||శ్లోకార్థములు||

ధీమాన్ శచీపతిః పర్వతశ్రేష్ఠం సునాభం
- ధీమంతుడైన శచీపతి పర్వతములలో శ్రేష్ఠుడైన మైనాకునితో
పరితోషాత్ సగద్గదమ్
- సంతోషముతో గద్గద స్వరముతో
స్వయమేవ వచనమ్ ఉవాచ
- స్వయముగా ఈ వచనములు పలికెను

||శ్లోకతాత్పర్యము||

ధీమంతుడైన శచీపతి సంతోషముతో పర్వతములలో శ్రేష్ఠుడైన మైనాకునితో గద్గదమైన స్వరముతో స్వయముగా ఈ వచనములు పలికెను. ||1.139||

||శ్లోకము 1.140||

హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోఽస్మి తే భృశమ్ |
అభయం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య యథా సుఖమ్ ||1.140||

స|| హిరణ్యనాభ శైలేంద్ర తే భృశమ్ పరితుష్ఠః అస్మి | సౌమ్య తే అభయం ప్రయచ్ఛామి| యథాసుఖం తిష్ఠ||

రామటీకాలో - హిరణ్యేతి| హే శైలేన్ద్ర అహం పరితుష్టోఽస్మి అతః తే తుభ్యం మత్ కర్తృకపక్షఛేధ శఙ్కాహేతుకభయాభావం ప్రయచ్చామి దదామి అతః యథా సుఖం గఛ్చ విచచార|

||శ్లోకార్థములు||

హిరణ్యనాభ శైలేంద్ర
- ఓ బంగారు శిఖరములు కల శైలేంద్రా
తే భృశమ్ పరితుష్ఠః అస్మి
- నీవు చేసిన పనికి నేను సంతోషపడిన వాడను
సౌమ్య తే అభయం ప్రయచ్ఛామి
- ఓ సౌమ్యుడా ! నీకు అభయము ఇచ్చుచున్నాను
యథాసుఖం తిష్ఠ
- (భయము విడచి) సుఖముగా వుండుము

||శ్లోకతాత్పర్యము||

'ఓ బంగారు శిఖరములు కల శైలేంద్రా! నీవు చేసిన పనికి నేను సంతోషపడిన వాడను. ఓ సౌమ్యుడా ! నీకు అభయము ఇచ్చుచున్నాను. (భయము విడచి) సుఖముగా వుండుము'. ||1.140||

అభయము గురించి తిలక టీకా ఇలా వివరిస్తుంది: అభయం - 'స్వకృత పక్షఛ్చేద శఙ్కా జనిత భయాభావమ్' అని.

అభయము , పూర్వ వృత్తాంతముకి సంబంధించిన మాట. దేవేంద్రుడు తన వజ్రాయుధముతో పర్వతముల రెక్కలు కోట్టివేసినవాడు. మైనాకుడు వాయుదేవుని సహాయముతో పక్షచ్ఛేధనము నుంచి తప్పుకు పోయి సాగరములో వున్నవాడు. ఇప్పుడు రామాకార్యార్థము వెడుతున్న హనుమంతునికి విశ్రాంతి ఇవ్వడానికి పైకి వచ్చినవాడు. రామదూతకి సహాయము చేశాడు కాబట్టి దేవేంద్రుడు మైనాకునకు పక్షచ్చేధనముగురించి భయపడనక్కరలేదని అభయము ఇస్తాడన్నమాట.

||శ్లోకము 1.141||

సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనూమతః |
క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి ||1.141||

స|| శతయోజనమ్ క్రమతః భయే సతి నిర్భయస్య విక్రాన్తస్య తే హనుమతః సుమహత్ సాహ్యం కృతం||

||శ్లోకార్థములు||

శతయోజనమ్ క్రమతః భయే సతి
- శతయోజనముల లంఘనము భయపడతగినదైననూ
నిర్భయస్య హనుమతః విక్రాన్తస్య
- భయములేని విక్రాంతుడగు హనుమంతునికి
తే సుమహత్ సాహ్యం కృతం
- నీచేత గొప్ప సహాయము చేయబడినది

||శ్లోకతాత్పర్యము||

'నీవు సుఖముగా వుండుము. శతయోజనముల లంఘనము భయపడ తగినదైననూ భయములేని విక్రాంతుడగు హనుమంతునికి, నీచేత గొప్ప సహాయము చేయబడినది.' ||1.141||

గోవిందరాజులవారు 'భయే సతి' అన్నమాటని ఇలా విశ్లేషిస్తారు: 'భయేసతి సముద్ర లఙ్ఘనే అస్య కిం భవిష్యతీత్యస్మాకం భయే సతీత్యర్థః'; సముద్ర లంఘనములో హనుమకి ఏమిటవుతుంది అని మన భయము అని అర్థము. హనుమకి భయము లేదు.

'సాహ్యం' అన్నమాటకి తిలక టీకా ఇలా విశ్లేషిస్తారు; 'సాహ్యం'; నిర్భయస్య సుగ్రీవాదన్యతో భయరహితస్య వానరసమూహస్య భయే సుగ్రీవాద్భీతౌ ప్రాప్తే సతి, యోజనశతం క్రమతో గచ్ఛతో విక్రాన్తస్య శ్రమ అభావవతో హనుమతః సాహ్యం త్వయా కృతమ్ ఇతి"|

|| శ్లోకము 1.142||

రామస్యైష హి దూత్యేన యాతి దాశరథేర్హరిః |
సత్ క్రియాం కుర్వతా తస్య తోషితోఽస్మి దృఢం త్వయా ||1.142||

స|| ఏష హరిః దాశరథేః రామస్య దూత్యేన యాతి తస్య త్వయా కుర్వతా సత్ క్రియామ్ దృఢః తోషితః అస్మి||

రామ టీకాలో - యః కపిః రామస్య హితాయైవ యాతి తస్య సత్క్రియాం శక్త్యా కుర్వతా త్వయా దృఢం అత్యన్తం తోషితోఽస్మి|

||శ్లోకార్థములు||

ఏష హరిః దాశరథేః
- ఈ వానరుడు దాశరథి
రామస్య దూత్యేన యాతి
- రామునియొక్క హితముకోఱకే పోవుచున్నాడు
తస్య త్వయా కుర్వతా సత్ క్రియామ్
- అతనికి నీచేత చేయబడిన సత్కార్యముతో
దృఢః తోషితః అస్మి
- అత్యంత సంతోషపడితిని".

||శ్లోకతాత్పర్యము||

'ఈ వానరుడు దాశరథి రామునియొక్క హితముకోఱకే పోవుచున్నాడు. అట్టివానికి నీ చేత చేయబడిన సత్కారముతో అత్యంత సంతోషపడితిని'. ||1.142||

||శ్లోకము 1.143||

తతః ప్రహర్షమగమ ద్విపులం పర్వతోత్తమః |
దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్ఠం శతక్రతుమ్ ||1.143||

స|| తతః పర్వతోత్తమః దేవతానాం పతిం శతక్రతుం పరితుష్ఠం దృష్ట్వా విపులం ప్రహర్షం ఆగమత్||

||శ్లోకార్థములు||

తతః పర్వతోత్తమః
- అప్పుడు ఆ పర్వతోత్తముడు
దేవతానాం పతిం శతక్రతుం పరితుష్ఠం దృష్ట్వా
- దేవతల అధిపతి అయిన శతక్రతుని సంతోషము చూచి
విపులం ప్రహర్షం ఆగమత్
- ఎంతో సంతోషపడెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు దేవతల అధిపతి అయిన శతక్రతుని సంతోషము చూచి, ఆ పర్వతోత్తముడు ఎంతో సంతోషపడెను. ||1.143||

||శ్లోకము 1.144||

సవై దత్తవరశైలో బభూవాస్థితః తదా |
హనుమాంశ్చ ముహుర్తేన వ్యతిచక్రామ సాగరమ్ ||1.144||

స|| తదా దత్తవరః సః శైలః అస్థితః బభూవ| హనుమాంశ్చ ముహూర్తేన సాగరం వ్యతిచక్రామ||

||శ్లోకార్థములు||

తదా దత్తవరః సః శైలః
- ఆ విధముగా వరములు ఇవ్వబడినవాడై ఆపర్వతము
అస్థితః బభూవ- అచటే నిలబడి పోయెను
హనుమాంశ్చ ముహూర్తేన
- హనుమంతుడు కూడా క్షణకాలములో
వ్యతిచక్రామ సాగరమ్
- సాగరములో పోవుచుండెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు వరములు ఇవ్వబడినవాడై, ఆ పర్వతము అచటే నిలబడి పోయెను. హనుమంతుడు కూడా క్షణకాలములో సాగరములో పోవుచుండెను. ||1.144||

ఇక్కడ మైనాకునికి ఇచ్చినవరము దేవేంద్రుని పక్షఛ్ఛేధనము గురించి ఇచ్చిన అభయమే.

||శ్లోకము 1.145||

తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
అబ్రువన్ సూర్యసఙ్కాశాం సురసాం నాగమాతరమ్ ||1.145||

స|| తతః దేవాః గంధర్వాః సహ సిద్ధాః పరమర్ష్యయః చ సూర్యసంకాశం నాగమాతరం సురసాం అబ్రువన్ ||

||శ్లోకార్థములు||

తతః దేవాః గంధర్వాః సహ సిద్ధాః పరమర్ష్యయః
- అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు ఋషులతో కూడి
సూర్యసంకాశం నాగమాతరం
- సూర్యునితో సమానమైన ప్రకాశము కల నాగమాతయగు
సురసాం అబ్రువన్
- సురసతో ఇట్లు పలికిరి

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు ఋషులతో కూడి సూర్యునితో సమానమైన ప్రకాశము కల నాగమాతయగు సురసతో ఇట్లు పలికిరి. ||1.145||

సురస అంటే నాగమాత అని ఇక్కడ చెప్పబడినది. ముందుశ్లోకములలో సురసని దాక్షాయణి, అంటే దక్షపుత్రికా అని కుడా సంభోధించబడుతుంది. అంటే సురస దక్షప్రజాపతి కుమార్తె అన్నమాట.

||శ్లోకము 1.146||

అయం వాతాత్మజ శ్శ్రీమాన్ ప్లవతే సాగరోపరి |
హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర ||1.146||

స|| అయం శ్రీమాన్ హనుమాన్ నామ వాతాత్మజః సాగరోపరి ప్లవతే | తస్య త్వం ముహూర్తం విఘ్నం ఆచర ||

||శ్లోకార్థములు||

అయం శ్రీమాన్ హనుమాన్ నామ
- ఈ శ్రీమంతుడైన హనుమంతుడను పేరుగల
వాతాత్మజః సాగరోపరి ప్లవతే
- వాయుపుత్రుడు సాగరముపై ఎగురుచున్నాడు.
తస్య త్వం ముహూర్తం విఘ్నం ఆచర
- అతనికి నీవు విఘ్నము కల్పించుము

||శ్లోకతాత్పర్యము||

'ఈ శ్రీమంతుడైన హనుమంతుడను పేరుగల వాయుపుత్రుడు సాగరముపై ఎగురుచున్నాడు. అతనికి నీవు విఘ్నము కల్పించుము.' ||1.146||

||శ్లోకము 1.147||

రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమమ్ |
దంష్ట్రా కరాళం పిఙ్గాక్షం వక్త్రం కృత్వా నభస్సమమ్ ||1.147||

స|| సుఘోరం పర్వత ఉపమమ్ రాక్షస రూపం ఆస్థాయ దంష్త్రాకరాళం పింగాక్షం వక్త్రం నభః సమం కృత్వా ( విఘ్నం ఆచర) ||

||శ్లోకార్థములు||

సుఘోరం పర్వత ఉపమమ్
- ఘోరమైన పర్వతముతో సమానమైన
రాక్షస రూపం ఆస్థాయ
- రాక్షస రూపము పొంది
వక్త్రం నభః సమం కృత్వా
- నోటిని ఆకాశముతో సమానము గా చేసి
దంష్త్రాకరాళం పింగాక్షం
- భయంకరమైన కోరలతో, గోరోచనవర్ణము గల కళ్ళతో

||శ్లోకతాత్పర్యము||

'ఘోరమైన పర్వతముతో సమానమైన రూపము పొంది భయంకరమైన కోరలతో గోరోచనవర్ణము కల కళ్ళతో ఆకాశమంతటి నోటిని తెఱిచి (విఘ్నము కల్పించుము)'. ||1.147||

||శ్లోకము 1.148||

బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమమ్ |
త్వాం విజేష్యత్ ఉపాయేన విషాదం వా గమిష్యతి ||1.148||

స|| అస్య బలం భూయః పరాక్రమః చ జ్ఞాతుం ఇచ్ఛామహే | ఉపాయేన త్వాం విజేష్యతి వా విషాదం గమిష్యతి (జ్ఞాతుం ఇచ్ఛామహే)||

||శ్లోకార్థములు||

భూయః అస్య బలం పరాక్రమః చ
- మళ్ళీ అతని బలము పరాక్రమము
జ్ఞాతుం ఇచ్ఛామహే
- తెలిసికొనుటకు కోరిక గలవారము
ఉపాయేన త్వాం విజేష్యతి
- ఉపాయముతో నిన్ను జయించునా
వా విషాదం గమిష్యతి
- విషాదము పొందునా అని

||శ్లోకతాత్పర్యము||

'మళ్ళీ అతని బలము పరాక్రమము తెలిసికొనుటకు కోరిక గలవారము. ఉపాయముతో నిన్ను జయించునా లేక విషాదము పొందునా' అని.||1.148||

ఇక్కడ రామ తిలకలో ఇలా రాస్తారు. " .. అస్య బలం జ్ఞానేన్ద్రియోః సామర్థ్యం జ్ఞాతుమిచ్ఛామహే| నను విఘ్నాచరణేనతత్ జ్ఞానం కథం భవిష్యతీత్యత ఆహ - ఉపాయేన త్వాం విజయిష్యతి విషాదం గమిష్యతి వా ఏతేన విజయ విషాదాభ్యాం క్రమేణ బలాబలయోర్జ్ఞానం భవిష్యత్యేవేతి సూచితమ్.."|

అంటే, సురలు సురసకి చెప్పిన మాట, "ఇతని జ్ఞానేన్ద్రియముల సామర్థ్యము తెలిసిగొనకోరుచున్నాము" అని. మరి విఘ్నము కల్పించి ఆ జ్ఞానము ఎలాతెలిసి కుంటారు అని అనుమానం వస్తుంది ఏమో అని ఇంకో మాట కూడా సురలు చెప్పారు. "ఉపాయముతో నిన్ను జయించునో లేక విషాదము పొందునో అని". ఈ విజయ విషాదాలలో హనుమంతుని బలాబలముల జ్ఞానము తెలిసిపోతుంది అని.

||శ్లోకము 1.149||

ఏవముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృతా |
సముద్ర మధ్యే సురసా భిభ్రతీ రాక్షసం వపుః ||1.149||

స|| ఏవం దైవతైః అభిసత్కృతా ఉక్తా తు సా దేవీ సముద్ర మధ్యే రాక్షసం వపుః భిభ్రతీ ||

||శ్లోకార్థములు||

ఏవం దైవతైః అభిసత్కృతా ఉక్తా తు
- ఈవిధముగా దేవతలచేత గౌరవింపబడి చెప్పబడిన
సా దేవీ సముద్ర మధ్యే
- ఆ దేవి సముద్ర మధ్యములో
రాక్షసం వపుః భిభ్రతీ
- రాక్షస రూపము ధరించెను

||శ్లోకతాత్పర్యము||

ఈ విధముగా దేవతలచేత చెప్పబడిన గౌరవింపబడిన ఆ సురసా దేవి సముద్రమధ్యము లో రాక్షస రూపము ధరించెను. ||1.149||

||శ్లోకము 1.150||

వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహమ్ |
ప్లవమానం హనూమంతం ఆవృత్యేదమువాచహ ||1.150||

స|| (తదా) ప్లవమానం హనూమంతం ఆవృత్య (తత్) సర్వస్య చ భయావహం వికృతం చ విరూపం ఇదం ఆహ||

||శ్లోకార్థములు||

సర్వస్య చ భయావహం వికృతం చ విరూపం
- అందరికీ భయము కలిగించు అసహజమైన వికృతమైన రూపముతో
ప్లవమానం హనూమంతం ఆవృత్య
- ఎగురుతున్న హనుమంతుని చుట్టుముట్టి
ఇదం ఆహ - ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

అందరికీ భయము కలిగించు అసహజమైన వికృతమైన రూపముతో, ఎగురుతున్న హనుమంతుని చుట్టుముట్టి, ఇట్లు పలికెను. ||1.150||

||శ్లోకము 1.151||

మమభక్షః ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ |
అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమాననమ్ ||1.151||

స|| (హే) వానరర్షభ ఈశ్వరైః త్వం మమభక్షః ప్రదిష్టః | అహం త్వాం భక్షయిష్యామి | ఇదం మమ ఆననమ్ ప్రవిశ ||

||శ్లోకార్థములు||

వానరర్షభ ఈశ్వరైః త్వం మమభక్షః ప్రదిష్టః
- వానరశ్రేష్ఠా, ఈశ్వరుని చేత నువ్వు ఆహారముగా ఇవ్వబడితివి
అహం త్వాం భక్షయిష్యామి
- నేను నిన్ను భక్షించెదను
ఇదం మమ ఆననమ్ ప్రవిశ
- నా ఈ నోటిలో ప్రవేశించుము

||శ్లోకతాత్పర్యము||

'ఓ వానరోత్తమ ! ఈశ్వరుని చేత నువ్వు ఆహారముగా ఇవ్వబడితివి. నేను నిన్ను భక్షించెదను. నా ఈ నోటిలో ప్రవేశించుము'. ||1.151||

||శ్లోకము 1.152||

ఏవముక్తః సురసయా ప్రాఙ్జలిర్వానరర్షభ |
ప్రహృష్టవదనః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ||1.152||

స|| సురసయా ఏవం ఉక్తః వానరర్షభః ప్రహృష్టవదనః ప్రాఙ్జలిః శ్రీమాన్ ఇదం వచనం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

సురసయా ఏవం ఉక్తః
- సురసచేత ఈ విధముగా చెప్పబడిన
వానరర్షభః ప్రహృష్టవదనః ప్రాఙ్జలిః
- వానరోత్తముడు సంతోషముగల వదనము తో అంజలి ఘటించి
శ్రీమాన్ ఇదం వచనం అబ్రవీత్
- ఆ శ్రీమంతుడు ఈ వచనములను పలికెను

||శ్లోకతాత్పర్యము||

సురస చే ఈ విధముగా చెప్పబడినవాడైన ఆ వానరుడు , సంతోషముగల వదనము తో అంజలి ఘటించి, ఆ శ్రీమంతుడు ఈ వచనములను పలికెను. ||1.152||

||శ్లోకము 1.153||

రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకావనమ్ |
లక్ష్మణేన సహ భ్రాతా వైదేహ్యాచాపి భార్యయా ||1.153||

స|| రామః నామ దాశరథిః భ్రాతా లక్ష్మణేన సహ భార్యయా వైదేహ్యా చాపి దండకావనమ్ ప్రవిష్ఠః ||

||శ్లోకార్థములు||

రామః నామ దాశరథిః
- రాముడు అని పేరుగలవాడు , దశరథుని పుత్రుడు
భ్రాతా లక్ష్మణేన సహ భార్యయా వైదేహ్యా చాపి
- భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణుని తో కలిసి
దండకావనమ్ ప్రవిష్ఠః
- దండకావనము ప్రవేశించెను.

||శ్లోకతాత్పర్యము||

'రాముడు అని పేరుగలవాడు , దశరథుని పుత్రుడు, భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణుని తో కలిసి దండకావనము ప్రవేశించెను'. ||1.153||

హనుమంతుడు తనను తానే రామబాణముతో పోల్చుకోడమే కాక, అవకాశము వచ్చినప్పుడు రామనామము రామ కథ కూడ అయుధములాగ ఉపయోగించుతాడు. ఇక్కడ ముందుకు పోవడానికి సురస అనుమతి కోసము, సురసకి రామకథ వివరిస్తాడు.

||శ్లోకము 1.154||

అన్యకార్యవిషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః |
తస్య సీతా హృతా భార్యా రావణేన యశస్వినీ ||1.154||

స|| రాక్షసైః బద్ధవైరస్య తస్య అన్యకార్యవిషక్తస్య భార్యా యశస్వినీ సీతా రావణేన అపహృతా ||

||శ్లోకార్థములు||

రాక్షసైః బద్ధవైరస్య తస్య
- రాక్షసులకి బద్ధవైరుడు అగు రాముడు
అన్యకార్యవిషక్తస్య
- అన్యకార్యములలో నిమగ్నుడై వుండగా
భార్యా యశస్వినీ సీతా రావణేన అపహృతా
- ఆయన భార్య యశస్విని సీతా రావణునిచే అపహరింపబడినది

||శ్లోకతాత్పర్యము||

'రాక్షసులకి బద్ధవైరుడు అగు రాముడు , అన్యకార్యములలో నిమగ్నుడై వుండగా , ఆయన భార్య యశస్విని సీతా రావణునిచే అపహరింపబడినది'. ||1.154||

గోవిందరాజులవారు అన్యకార్యావిషక్తస్య అంటే, మారీచ మృగ గ్రహణవ్యాసక్తస్య అని విశదీకరిస్తారు, అంటే మారీచుని , మృగము అనే ఆసక్తిలోమునిగి వున్నప్పుడు అని.

||శ్లోకము 1.155||

తస్యాః సకాశం దూతోఽహం గమిష్యే రామ శాసనాత్ |
కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని ||1.155||

స|| అహం దూతః తస్యాః (సీతాయాః) సకాశమ్ రామశాసనాత్ గమిష్యే | (హే) విషయవాసిని రామస్య సాహ్యం కర్తుం అర్హసి||

||శ్లోకార్థములు||

అహం దూతః - నేను ఆయన దూతను
తస్యాఃసకాశమ్ రామశాసనాత్ గమిష్యే
- ఆమె కొరకు రామ శాసనము తో పోవుచున్నవాడను
విషయవాసిని
- ఓ (రామ) రాజ్యములో వశించు దేవి
రామస్య సాహ్యం కర్తుం అర్హసి
- నువ్వు రామునకు సహయము చేయుట ధర్మము.

||శ్లోకతాత్పర్యము||

'నేను ఆయన దూతను. ఆమె కొరకు రామ శాసనము తో పోవుచున్నవాడను. ఓ రామరాజ్యములో వశించు దేవి, నువ్వు రామునకు సహయము చేయుట ధర్మము.' ||1.155||

గోవిందరాజుల వారు విషయవాసిని అంటే రామ రాజ్య వాసినీ అనిరాశారు.

||శ్లోకము 1.156||

అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్ఠకారిణమ్ |
ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశ్రుణోమి తే ||1.156||

స|| అథవా మైథిలీం దృష్ట్వా అక్లిష్టకారిణం రామం చ తే వక్త్రం ఆగమిష్యామి | సత్యం తే ప్రతిశ్రుణోమి ||

||శ్లోకార్థములు||

అథవా మైథిలీం దృష్ట్వా
- లేనిచో మైథిలిని చూచి
అక్లిష్టకారిణం రామం చ
- క్లిష్టమైన కార్యములు సాధింపగల రామునిని చూచి
తే వక్త్రం ఆగమిష్యామి
- నీ నోటిలోకి వచ్చెదను
సత్యం తే ప్రతిశ్రుణోమి
- నీకు సత్యముగా చెప్పుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

'లేనిచో మైథిలిని చూచి, కార్యములు అక్లిష్టముగా చేయు రామునిని చూచి, నీ నోటిలోకి వచ్చెదను. నీకు సత్యముగా చెప్పుచున్నాను'. ||1.156||

అంటే రామకార్యము మీద పోతున్న తనని అలా అడ్డగించిన సురసకి హనుమంతుడు దోసిలి వగ్గి సగౌరవముగా తను నిమగ్నమై ఉన్న రామకార్యము గురించి చెప్పి, తన కర్తవ్యము పూర్తిచేసి, తప్పక సురసనోటిలోకి వస్తాను అని ప్రమాణము చేసి చెపుతున్నాడు హనుమ. అంతే కాదు సురసను కూడా, రామకార్యములో సహాయము చేయమని చెపుతాడు.

||శ్లోకము 1.157||

ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణీ |
అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేషవరో మమ ||1.157||

స|| హనుమతా ఏవం ఉక్తా కామరూపిణి సురసా అబ్రవీత్ కశ్చిత్ నాతివర్తేత ఏషః మమ వరః ||

||శ్లోకార్థములు||

హనుమతా ఏవం ఉక్తా
- హనుమంతుని చే ఇట్లు చెప్పబడిన
కామరూపిణి సురసా అబ్రవీత్
- ఇచ్ఛానుసారము రూపము ధరించగల సురస ఇట్లు చెప్పెను
కశ్చిత్ నాతివర్తేత
- ఎవరు నన్ను దాటి పోలేరు
ఏషః మమ వరః
- ఇది నాకివ్వ బడిన వరము

||శ్లోకతాత్పర్యము||

ఈ విధముగా హనుమంతుని చేత చెప్పబడిన, ఇచ్ఛానుసారము రూపము ధరించగల సురస ఇట్లు చెప్పెను. 'ఎవరు నన్ను దాటి పోలేరు. ఇది నాకివ్వ బడిన వరము', అని. ||1.157||

||శ్లోకము 157-1||

తం ప్రయాంతం సముద్వీక్ష్య సురసా వాక్య మబ్రవీత్ |
బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనూమతః ||157-1||

స|| హనూమతః బలం జిజ్ఞాసమానా వై నాగమాతా సురసా ప్రయాన్తం తం సముద్వీక్ష్య (ఇదమ్) వాక్యం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

హనూమతః బలం జిజ్ఞాసమానా వై
- హనుమంతుని బలము తెలిసికొనగోరి
నాగమాతా సురసా
- నాగమాత సురస
ప్రయాన్తం తం సముద్వీక్ష్య
- పోగోరుచున్న అతనిని చూచి
వాక్యం అబ్రవీత్
- ఈ మాటలు చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

తనమాటను లక్ష్యము చేయక పోగోరుచున్న హనుమంతుని తో, హనుమంతుని బలము తెలిసికొనగోరి, ఆ నాగమాత సురస ఈ మాటలను చెప్పెను. ||1.157-1||

తిలక టీకా లో, ప్రయాన్తం అన్నమాటకి విశదీకరణ; 'పునరాగచ్ఛామి ఇత్యుక్తస్యా వరదానం శృత్వాఽపి ప్రయాణోన్ముఖం తం"; వరదానముగురించి విన్నా మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళబోతున్న హనుమ ని - ప్రయాన్తం తం అని అంటాడు కవి.

||శ్లోకములు 1.157 -2,3||

ప్రవిశ్య వదనం మేఽద్య గంతవ్యమ్ వానరోత్తమ |
వర ఏషా పురా దత్తో మమధాత్రేతి సత్వరా ||1.157-2||
వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతేః పురః |
ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః ||1.157-3||

స|| వానరోత్తమ అద్య మే వదనం సత్వరా ప్రవిశ్య గంతవ్యమ్ | ఏషః వరః పురా మే ధాత్రే దత్తః ఇతి|| వ్యాదాయ విపులం వక్త్రం సా మారుతేః పురఃస్థితా|| ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః ఇతి||

||శ్లోకార్థములు||

వానరోత్తమ అద్య మే వదనం
- ఓ వారోత్తమ ఇప్పుడు నా నోటిలో
సత్వరా ప్రవిశ్య గంతవ్యమ్
- సత్వరముగా ప్రవేశించి వెళ్ళుము
ఏషః వరః పురా మే
- ఈ వరము పూర్వము నాకు
ధాత్రే దత్తః ఇతి
- బ్రహ్మదేవుడు ఇచ్చెను అని
వ్యాదాయ విపులం వక్త్రం
- నోరును బాగుగా తెరిచి
సా మారుతేః పురఃస్థితా
- ఆ వానరుని ముందర నిలచెను

||శ్లోకతాత్పర్యము||

'ఓ వానరోత్తమ ఇప్పుడు నా నోటిలో సత్వరముగా ప్రవేశించి వెళ్ళుము. పూర్వము ఈ విధముగా బ్రహ్మదేవుడు వరము ఇచ్చెను'. అప్పుడు ఆమె తన నోటిని బాగా తెఱిచి మారుతి ఎదురుగా నిలబడెను. ||1.157-2,3||

||శ్లోకము 1.157-3||

ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః ||1.157-3||
అబ్రవీత్కురువై వక్త్రం యేన మాం విషహిష్యసే |

స|| సురసయా ఏవముక్తః క్రుద్ధో వానరపుంగవః అబ్రవీత్| వై వక్త్రం యేన మామ్ విషహిష్యసే (తత్) కురు (ఇతి) ||

||శ్లోకార్థములు||

సురసయా ఏవముక్తః
- సురసచేత ఈ విధముగా చెప్పబడిన
క్రుద్ధో వానరపుంగవః అబ్రవీత్
- వానరపుంగవుడు కోపముతో ఇట్లు పలికెను
వై వక్త్రం యేన మామ్ విషహిష్యసే
- నీ నోరు నన్నుఎలా భరించగలదో
(తత్) కురు (ఇతి) - అలాగ చేయుము

||శ్లోకతాత్పర్యము||

సురసచేత ఈ విధముగా చెప్పబడిన వానరపుంగవుడు, కోపముతో ఇట్లు పలికెను. 'నీ నోరు నన్నుఎలా భరించగలదో అలాగ చేయుము' అని. ||1.157-3||

||శ్లోకములు 1.157-4,5||

ఇత్యుక్త్వా సురసా క్రుద్ధా దశయోజనమాయతా ||1.157-4||
దశయోజనవిస్తారో బభూవ హనుమాంస్తదా |
తం దృష్ట్వా మేఘసంకాశం దశయోజనమాయతమ్ ||1.157-5||
చకార సురసా చాస్యం వింశద్యోజన మాయతమ్ |

స|| ఇత్యుక్త్వా క్రుద్ధా సురసా దశయోజనమాయతా | తదా హనుమాన్ దశయోజనవిస్తారో బభూవ || మేఘసంకాశం దశయోజనమాయతం తం దృష్ట్వా సురసా చ ఆస్యం వింశద్యోజనం ఆయతమ్ చకార ||

||శ్లోకార్థములు||

ఇత్యుక్త్వా క్రుద్ధా సురసా
- ఈ విధముగా చెప్పబడిన సురస కోపముతో
దశయోజనమాయతా
- పదియోజనములు వెడల్పుగా అయ్యెను
తదా హనుమాన్ దశయోజనవిస్తారో బభూవ
- అప్పుడు హనుమ పది యోజనములు విస్తారముగాపెరిగెను
మేఘసంకాశం దశయోజనమాయతం
- మేఘములతో సమానముగా పది యోజనములు పెరిగిన
తం దృష్ట్వా సురసా చ
- వానిని ( హనుమంతుని) చూచి సురస కూడా
ఆస్యం వింశద్యోజనం ఆయతమ్ చకార
- తన నోటిని ఇరువది యోజనములు విస్తీర్ణము చేసెను

||శ్లోక తాత్పర్యము||

ఈ విధముగా చెప్పబడిన సురస, కోపముతో పదియోజనములు వెడల్పుగా అయ్యెను. అప్పుడు హనుమ పది యోజనములు విస్తారముగాపెరిగెను. మేఘములతో సమానముగా పది యోజనములు పెరిగిన ఆ హనుమంతుని చూచి, సురస తన నోటిని ఇరవై యోజనముల విస్తీర్ణము చేసెను. ||1.157-4,5||

చాలా మంది 1.157-2 నుంచి 1.157-9 వున్న శ్లోకాలు సుందరకాండలో లెక్కించరు. దానిమీద గోవిన్దరాజులవారి వ్యాఖ్య ఇలా రాశారు. "అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేష వరో మమేత్యస్యానన్తరం తద్ దృష్ట్వావ్యాదితం వక్త్రం సుబుద్ధిమాన్ ఇత్యాది శ్లోకా ద్రష్టవ్యాః| అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేష వరో మమ అన్న శ్లోకమునుంచి 'తద్ దృష్ట్వావ్యాదితం వక్త్రం సుబుద్ధిమాన" అన్న శ్లోకము వఱకు వున్న శ్లోకములు చూడ వలసినవి; "మధ్యే తం ప్రయాన్తమ్ ఇత్యాది శ్లోకాః ప్రక్షిప్తాః అసజ్ఙతాశ్చ శతయోజనాయతత్వే వానరైః లంకావాసిభిశ్చ జ్ఞాతః"| మధ్యలో హనుమంతుడు పెరగడము గురించి వచ్చిన శ్లోకములు, ఎవరో దూర్చిన శ్లోకములు, అసంగతములు. అసంగతములు ఎందుకు అంటే, నూరుయోజనములు పెరిగిన హనుమ, మహేన్ద్ర పర్వతము వద్దనున్న వానరులచేత, లంకలో వున్న రాక్షసులచేత కూడా చూడబడును కనుక.

||శ్లోకములు 1.157- 6,9||

హనుమాంస్తు తదా క్రుద్ధః త్రింశద్యోజన మాయతః ||1.157-6||
చకార సురసా వక్త్రం చత్వారింశత్తథోచ్ఛ్రితమ్ |
బభూవ హనుమాన్వీరః పంచాశద్యోజనోచ్ఛ్రితః ||1.157-7||
చకార సురసా వక్త్రం షష్టియోజన మాయతమ్|
తథైవ హనుమాన్వీరః సప్తతీ యోజనోచ్ఛ్రితః ||1.157-8||
చకార సురసా వక్త్రం అశీతీ యోజనాయతమ్ |
హనుమాన్ అచలప్రఖ్యో నవతీ యోజనోచ్ఛ్రితః ||1.157-9||
చకార సురసా వక్త్రం శతయోజన మాయతమ్ |

స|| తదా హనుమాంస్తు ( హనుమాన్ అపి) క్రుద్ధః త్రింశద్యోజనం ఆయతః(అభవత్) | సురసా తథావక్త్రం చత్వారింశం ఉచ్ఛ్రితమ్ చకార || హనుమాన్ వీరః పంచాశద్యోజన ఉచ్ఛ్రితః బభూవ | (తదా) సురసా వక్త్రం షష్టియోజనం ఆయతం చకార || తథైవ వీరః హనుమాన్ తథైవ సప్తతీ యోజనమ్ ఉచ్ఛ్రితః | సురసా వక్త్రం అశీతీ యోజనం ఆయతమ్ || అచలప్రఖ్యో హనుమాన్ నవతీ యోజనం ఉఛ్ఛ్రితః| (తదా) సురసా వక్త్రం శతయోజనం ఆయతమ్ ||

||శ్లోకార్థములు||

తదా హనుమాంస్తు ( హనుమాన్ అపి)- అప్పుడు హనుమంతుడు కూడా
క్రుద్ధః త్రింశద్యోజనం ఆయతః(అభవత్)
- కోపముతో ముప్పది యోజనములు విస్తీర్ణముగా పెరిగెను;
సురసా తథావక్త్రం చత్వారింశం ఉచ్ఛ్రితమ్ చకార -
అప్పుడు సురస తన నోటిని నలభై యోజనముల విస్తీర్ణముగా చేసెను;
హనుమాన్ వీరః పంచాశద్యోజన ఉచ్ఛ్రితః బభూవ -
అప్పుడు హనుమంతుడు ఏభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను;
సురసా వక్త్రం షష్టియోజనం ఆయతం చకార -
సురస తన నోటిని అరవై యోజనముల విస్తీర్ణముగా పెంచెను;
తథైవ వీరః హనుమాన్ తథైవ సప్తతీ యోజనమ్ ఉచ్ఛ్రితః-
అలాగే హనుమంతుడు డెబ్బై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను:
సురసా వక్త్రం అశీతీ యోజనం ఆయతమ్-
అప్పుడు సురస తన నోటిని ఎనభై యోజనముల విస్తీర్ణము చేసెను;
అచలప్రఖ్యో హనుమాన్ నవతీ యోజనం ఉఛ్ఛ్రితః-
అప్పుడు పర్వతాకారముగల హనుమంతుడు తొంభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను.
(తదా) సురసా వక్త్రం శతయోజనం ఆయతమ్-
అప్పుడు సురస తన నోటిని నూరు యోజనముల విస్తీర్ణము చేసెను.

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు హనుమంతుడు కూడా కోపముతో ముప్పది యోజనములు విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని నలభై యోజనముల విస్తీర్ణముగా చేసెను. అప్పుడు హనుమంతుడు ఏభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని అరవై యోజనముల విస్తీర్ణముగా పెంచెను. అలాగే హనుమంతుడు డెబ్బై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని ఎనభై యొజనముల విస్తీర్ణము చేసెను. అప్పుడు పర్వతాకారముగల హనుమంతుడు తొంభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని నూరు యోజనముల విస్తీర్ణము చేసెను. ||1.156-9||

||శ్లోకములు 1.157-10,1.158||

తం దృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్త్రః సుబుద్ధిమాన్ ||1.157-10||
దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమమ్ |
సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః ||1.158||
సోఽభిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాబలః |
అన్తరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ||1.159||

స|| సుబుద్ధిమాన్ వాయుపుత్త్రః సురసయా వ్యాదితం తం సుఘోరం దీర్ఘజిహ్వం నరకోపమమ్ఆస్యం దృష్ట్వా ఆత్మనః కాయం సుసంక్షిప్య అంగుష్టమాత్రకః బభూవ || శ్రీమాన్ మహాబలః సః ఆశు తద్వక్రం అభిపత్య నిపత్య చ అన్తరిక్షే స్థితః ఇదం వచనమ్ అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

సుబుద్ధిమాన్ వాయుపుత్త్రః సురసయా వ్యాదితం
- మహావివేకము గల వాయుపుత్రుడు సురస చేత తెరవబడిన
తం సుఘోరం దీర్ఘజిహ్వం
- ఆ భయంకరమైన సుదీర్ఘమైన నాలుకగల
నరకోపమమ్ ఆస్యం దృష్ట్వా
- నరకముతో సమానమైన నోటిని చూచి
ఆత్మనః కాయం సుసంక్షిప్య అంగుష్టమాత్రకః బభూవ
- తన కాయమును చాలా చిన్నదిగా అంగుష్ఠమాత్రము చేసెను.

||శ్లోకతాత్పర్యము||

మహావివేకము గల వాయుపుత్రుడు సురస చేత తెరవబడి, ఆ భయంకరమైన సుదీర్ఘమైన నాలుకగల, నరకముతో సమానమైన నోటిని చూచి, తన కాయమును చాలా చిన్నదిగా అంగుష్ఠమాత్రము చేసెను. ||1.157-10,1.158||

||శ్లోకము 1.159||

సోఽభిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాబలః |
అన్తరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ||1.159||

స|| శ్రీమాన్ మహాబలః సః ఆశు తద్వక్త్రం అభిపత్య నిపత్య చ అన్తరిక్షే స్థితః ఇదం వచనమ్ అబ్రవీత్||

||శ్లోకార్థములు||

శ్రీమాన్ మహాబలః - శ్రీమంతుడు మహాబలుడు అగు
సః ఆశు తద్వక్త్రం అభిపత్య నిపత్య చ
- ఆ హనుమంతుడు క్షణములో ఆమె నోటిలోకి వెళ్ళి బయటికి కూడా వచ్చి
అన్తరిక్షే స్థితః
- ఆకాశములో నిలుచుని
ఇదం వచనమ్ అబ్రవీత్
- ఈ మాటలు చెప్పెను

||శ్లోక తాత్పర్యము||

శ్రీమంతుడు మహాబలుడు అగు ఆ హనుమంతుడు క్షణములో ఆమె నోటిలోకి వెళ్ళి బయటికి కూడా వచ్చి ఆకాశములో నిలుచుని ఈ మాటలు చెప్పెను. ||1.159||

||శ్లోకము 1.160||

ప్రవిష్టోఽస్మి హి తే వక్త్రం దాక్షాయనీ నమోస్తుతే |
గమిష్యే యత్ర వైదేహీ సత్యం చాసీద్వరస్తవ ||1.160||

స|| దాక్షాయణి తే వక్త్రం ప్రవిష్టః అస్మి హి | తే వరః సత్యం ఆసీత్ | తే నమః అస్తు | (అహం) యత్రవైదేహీ (తత్ర) గమిష్యే ||

||శ్లోకార్థములు||

దాక్షాయణి తే వక్త్రం ప్రవిష్టః అస్మి హి
- ఓ దాక్షాయణి ! నీ నోటిలో ప్రవేశించితిని
తే వరః సత్యం ఆసీత్
- నీ వరము సత్యము అయినది
తే నమః అస్తు - నీకు నమస్కారము
(అహం) యత్రవైదేహీ (తత్ర) గమిష్యే
- ఇక వైదేహి ఎచటవున్నదో అచటికి వెళ్ళెదను

||శ్లోకతాత్పర్యము||

'ఓ దాక్షాయణి ! నీ నోటిలో ప్రవేశించితిని. నీ వరము సత్యము అయినది. నీకు నమస్కారము. ఇక వైదేహి ఎచటవున్నదో అచటికి వెళ్ళెదను'. ||1.160||

||శ్లోకము 1.161||

తం దృష్ట్వా వదానాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ |
అబ్రవీత్సురసా దేవీ స్వేన రూపేణ వానరమ్ ||1.161||

స|| రాహుముఖాత్ చంద్రం ఇవ వదనాత్ ముక్తం తం వానరం దృష్ట్వా సురసా దేవీ స్వేన రూపేణ అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

రాహుముఖాత్ చంద్రం ఇవ
- రాహుముఖములోనుంచి వెలువడిన చంద్రునివలె నున్న
వదనాత్ ముక్తం తం వానరం దృష్ట్వా
- నోటి నుంచి బయటపడిన హనుమంతుని చూచి
సురసా దేవీ స్వేన రూపేణ అబ్రవీత్
- సురస తన నిజమైన రూపముతో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

రాహుముఖములోనుంచి వెలువడిన చంద్రునివలె నున్న నోటి నుంచి బయటపడిన హనుమంతుని చూచి సురస తన నిజమైన రూపముతో ఇట్లు పలికెను. ||1.161||

||శ్లోకము 1.162||

అర్థసిధ్యై హరిశ్రేష్ఠ గచ్ఛసౌమ్య యథాసుఖమ్ |
సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా ||1.162||

స|| హరిశ్రేష్ఠ సౌమ్య యథాసుఖం అర్థ్యసిద్ధ్యై గచ్ఛ | వైదేహీం మహాత్మనా రాఘవేణ సమానయ||

||శ్లోకార్థములు||

హరిశ్రేష్ఠ సౌమ్య యథాసుఖం
- ఓ సౌమ్యుడా ! వానరులలో శ్రేష్టుడా ! సుఖముగా
యథాసుఖం అర్థ్యసిద్ధ్యై గచ్ఛ
- సుఖముగా నీ కార్యసిద్ధికి పొమ్ము
వైదేహీం మహాత్మనా రాఘవేణ సమానయ
- వైదేహిని మహాత్ముడైన రామునితో చేర్చుము

||శ్లోకతాత్పర్యము||

'ఓ సౌమ్యుడా, వానరులలో శ్రేష్టుడా, సుఖముగా నీ కార్యసిద్ధికి పొమ్ము. వైదేహిని రామునితో చేర్చుము', అని.||1.162||

||శ్లోకము 1.163||

తతృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరమ్ |
సాధు సాధ్వితి భూతాని ప్రశశంసుః తదా హరిమ్ ||1.163||

స|| సుదుష్కరమ్ హనుమతః తత్ తృతీయం కర్మ దృష్ట్వా తదా సాధు సాధు ఇతి ( సర్వాణి) భూతాని హనుమతః ప్రశశంసుః||

||శ్లోకార్థములు||

సుదుష్కరమ్ హనుమతః
- సుదుష్కరమైన హనుమంతుని యొక్క
తత్ తృతీయం కర్మ దృష్ట్వా
- ఆ మూడవ కార్యమును చూచి
తదా సాధు సాధు ఇతి
- అప్పుడు బాగు బాగు అని
భూతాని హనుమతః ప్రశశంసుః
- సమస్త భూతములు హనుమంతుని ప్రశంసించినవి

||శ్లోకతాత్పర్యము||

సుదుష్కరమైన హనుమంతుని యొక్క ఆ మూడవ కార్యమును చూచి అప్పుడు బాగు బాగు అని సమస్త భూతములు హనుమంతుని ప్రశంసించినవి. ||1.163||

సురస వృత్తాంతములో అంతరార్థము మననము చేయతగినది.

అధ్యాత్మిక పథములో పోతున్నా, శాస్త్రానుసారమైన చేయతగినవి చేయవలసినకర్మలు అనేకము ఎదురు వస్తాయి. శాస్త్రములో చెప్పబడిన చేయవలసిన చేయతగిన కర్మలు చెడ్డవి కావు. అవి చేయతగినవే. కాని ఆ కర్మలు ఆచరించడములో, 'నేనే నాకోసము' చేస్తున్నాను అనే భావనలేకుండా, భగవదర్పణము చేసి భగవంతుడే చేయిస్తున్నాడనే భావనతో చేయవలెను. అలా కోరిక లేకుండా చేసినపుడే ఆ కర్మలు బంధనములు కావు. ఎప్పుడూ కూడా భగవత్పరముగా చేయు కర్మలు బంధములు కావు.

అలా ఆకాశములో పోతున్న హనుమంతుని అడ్డగించడానికి సురలు సురసని ప్రతిబంధకముగా పంపిస్తారు దేవతలు. హనుమంతుడు ఎలా జయిస్తాడో తెలుసుకోవడానికి. అలా అడ్డగించిన సురసకి హనుమంతుడు దోసిలి వగ్గి సగౌరవముగా శ్రీమంతుడిగా తను నిమగ్నమై ఉన్న రామకార్యము గురించి చెప్పి, సురసను కూడా సహాయము చేయమని చెపుతాడు.

దానికి సురస ఒప్పక తన నోరు తెరిచి హనుమంతుని ముందర నిలబడుతుంది.
హనుమంతుడు తన శరీరము పెంచుతాడు. సురస తన నోరు పెంచుతుంది. ఇలా పెరుగుతూ పోతే అంతు లేదని గ్రహించిన హనుమంతుడు, తన శరీరము అంగుష్ఠ మాత్రము చేసి సురస నోటిలో ప్రవేశించి బయటికి వచ్చి, 'దాక్షాయణీ నీ నోటిలో ప్రవేశించితిని. నమస్కారము. ఇక వైదేహి ఉన్నచోటుకి పోయెదను', అని చెప్పును.

ఇక్కడ కర్మాచరణలో, 'నేనూ, నాది', అన్నది హనుమ పెరగడము ద్వారా సూచింపబడినది. పెరుగుటమాని బుద్ధి ఉపయోగించి తగ్గుట, ఆత్మ జ్ఞానము ఎరిగినవాడు ఫలసంగ కర్తృత్వము వీడి కర్మనాచరించుట. అట్టి కర్మ బంధము కలిగించదు.

అదే భగవద్గీతలో చెప్పిన మాట.

"యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః"

ఈ విధముగా అధ్యాత్మిక మార్గములో ఉన్న మానవుడు అవలంబింపవలసిన విధానము
సురస వృత్తాంతము ద్వారా మనకి వాల్మీకి చెప్పుచున్నాడు అని చాలామంది అభిప్రాయము..

||శ్లోకము 1.164||

స సాగర మనాధృష్య మభ్యేత్య వరుణాలయమ్ |
జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః ||1.164||

స|| వేగేన గరుడోపమః సః అనాధృష్యమ్ వరుణాలయం సాగరం అభ్యేత్య ఆకాశం ఆవిశ్య జగామ ||

||శ్లోకార్థములు||

వేగేన గరుడోపమః సః
- వేగములో గరుత్మంతునితో సమానమైన ఆ హనుమంతుడు
అనాధృష్యమ్ వరుణాలయం సాగరం
- ప్రతిఘటింప శక్యము కాని వరుణాలయమైన సాగరము మీద
ఆకాశం అభ్యేత్య ఆవిశ్య జగామ
- ఆకాశమార్గములో దూసుకుంటూ వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

వేగములో గరుత్మంతుని తో సమానమైన ఆ హనుమంతుడు ప్రతిఘటింప శక్యము కాని ఆ వరుణాలయమైన సాగరము మీద దూసుకుంటూ ఆకాశముమార్గములో దూసుకుంటూ వెళ్ళెను. ||1.164||

||శ్లోకము 1.165||

సేవితే వారిదారాభిః పతగైశ్చ నిషేవితే |
చరితే కైశికాచార్యైః ఐరావతనిషేవితే ||1.165||

స|| వారిదారాభిః సేవితే పతగైశ్చ నిషేవితే కైశికాచార్యైః చరితే ఐరావత నిషేవితే (వాయుమార్గే హనుమాన్ జగామ)||

||శ్లోకార్థములు||

వారిదారాభిః సేవితే
- ధారళమైన వర్షములు కురిపించె మేఘముల మార్గము
సేవితే పతగైశ్చ
- పక్షులు సేవించె మార్గము
నిషేవితే కైశికాచార్యైః
- కైశికరాగము అలాపించు విద్యాధరుల సేవించు మార్గము
ఐరావతనిషేవితే- ఇంద్రుని ఐరావతము విహరించు మార్గము

||శ్లోకతాత్పర్యము||

ధారళమైన వర్షములు కురిపించె మేఘముల మార్గము, పక్షులు సేవించె మార్గము, కైశికరాగము అలాపించు విద్యాధరుల సేవించు మార్గము,ఇంద్రుని ఐరావతము విహరించు మార్గము. ||1.165||

ఇవన్నీ హనుమంతుడు పోవుచున్న ఆకాశమార్గము వర్ణించే శ్లోకాలు

ఆ వర్ణన వినతగినది. అందుకని ఇక్కడ ముందుగా మననము చేస్తున్నాము - ఆ ఆకాశమార్గము ధారళమైన వర్షములు కురిపించె మేఘముల కు దారి. పక్షులు ఎగురు మార్గము. కైశికాచార్యులు వెళ్ళు మార్గము, ఐరావతము పయనించు మార్గము ; ఆ ఆకాశమార్గము సింహములు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పములు గల అందముగా అలంకరించబడిన వాహనములు వెళ్ళుమార్గము; హవ్యముతీసుకుపోవు అగ్నుల , వజ్రాయుధముతో సమానమైన శస్త్రములు కల దేవతల మార్గము, పుణ్యకర్మలు చేసి స్వర్గముపొందిన మహానుభావులు ఏతెంచే మార్గము; ఇది చాలా బాగా అలంకరింపబడిన హవ్యము తీసుకొని చిత్రభానుడు పోవు మార్గము. గ్రహములు నక్షత్రములు తారాగణములు సేవించు మార్గము; మహర్షి గంధర్వ నాగ యక్ష గణములు విహరించు మార్గము, గంధర్వరాజగు విశ్వావసుడు సేవించుమార్గము: దేవేంద్రుని గజము పోవు మార్గము. చంద్రుడు సూర్యుడు పయనించు మార్గము. జీవలోకము పైన విశాలముగా బ్రహ్మచేత నిర్మింపబడిన మార్గము. శ్రేష్ఠులు వీరులు అగు విద్యధరులు సేవించు మార్గము. ఆ మార్గములో గరుత్మంతుని లాగా హనుమంతుడు ఎగురుచూ వెళ్ళుతున్నాడన్నమాట.

గోవిందరాజులవారు, ఈ శ్లోకాలలో (165-172 )ఆకాశగమనం ఎంత దుష్కరమో వర్ణించడమైనది అంటారు. అన్నిపదాలకి విశ్లేషిస్తారు కూడా; "కౌశికాచార్యైః కౌశికే రాగవిశేషే ఆచార్యైః విద్యాధర విశేషైః ఇత్యర్థః| ఇక్కడ తాత్పర్యము దీనికి అనుగుణముగా చెప్పబడినది.

||శ్లోకము 1.166||

సింహకుంజర శార్దూల పతగోరగవాహనైః |
విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే ||1.166||

స|| సింహకుంజర శార్దూల పతగ ఉరగ వాహనైః సంపత్భిః విమలైః సమలంకృతే విమానైః (చరితే మార్గే హనుమాన్ జగామ)||

||శ్లోకార్థములు||

సింహకుంజర శార్దూల పతగ ఉరగ వాహనైః
- సింహము కుంజరము శార్దూలము ఉరగముల చే లాగబడిన వాహనములచేత
విమలైః సమలంకృతే విమానైః
- అందముగా అలంకరింపబడిన విమానములచేత ( సేవించబడిన మార్గము)

||శ్లోకతాత్పర్యము||

సింహము కుంజరము శార్దూలము ఉరగముల చే లాగబడిన వాహనములచేత, అందముగా అలంకరింపబడిన విమానములచేత (సేవించబడిన మార్గము). ||1.166||

||శ్లోకము 1.167||

వజ్రాశనిసమహాఘాతైః పావకైరుపశోభితే |
కృతపుణ్యై ర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే ||1.167||

స|| వజ్రాశనిసమాఘాతైః పావకైః కృతపుణ్యైః స్వర్గజిద్భిః మహాభాగైః ఉపశోభితే (చరితే మార్గే హనుమాన్ జగామ)||

||శ్లోకార్థములు||

వజ్రాశనిసమాఘాతైః పావకైః
- వజ్రాయుధము పిడుగుల ఒరపిడిచే ఉత్పన్నమైన అగ్నుల మార్గము,
కృతపుణ్యైః స్వర్గజిద్భిః మహాభాగైః ఉపశోభితే
-పుణ్యకర్మలు చేసి స్వర్గముపొందిన మహానుభావులు ఏతెంచే మార్గము

||శ్లోకతాత్పర్యము||

వజ్రాయుధము పిడుగుల ఒరపిడిచే ఉత్పన్నమైన అగ్నుల మార్గము, పుణ్యకర్మలు చేసి స్వర్గముపొందిన మహానుభావులు ఏతెంచే మార్గము. ||1.167||

||శ్లోకము 1.168||

వహతా హవ్య మత్యర్థం సేవితే చిత్రభానునా |
గ్రహనక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే ||1.168||

స|| హవ్యం వహతా చిత్రభానునా అత్యర్థం సేవితే, గ్రహనక్షత్ర చన్ద్రార్కతారాగణవిభూషితే ( ఆకాశ మార్గే హనుమాన్ జగామ)||

||శ్లోకార్థములు||

హవ్యం వహతా చిత్రభానునా అత్యర్థం సేవితే
- అత్యర్థము హవ్యమును తీసుకొని వెళ్ళు అగ్ని చేత సేవింపబడిన మార్గము.
గ్రహనక్షత్ర చన్ద్రార్కతారాగణవిభూషితే
- గ్రహములతోనూ నక్షత్రములతోనూ చంద్రుడు తారలు మున్నగు వాటితో అలంకరింపబడిన మార్గము

||శ్లోకతాత్పర్యము||

అత్యర్థము హవ్యమును తీసుకొని వెళ్ళు అగ్ని చేత సేవింపబడిన మార్గము. గ్రహములతోనూ నక్షత్రములతోనూ చంద్రుడు తారలు మున్నగు వాటితో అలంకరింపబడిన మార్గము. ||1.168||

||శ్లోకము 1.169||

మహర్షి గణ గంధర్వ నాగయక్ష సమాకులే |
వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే ||1.169||

స|| మహర్షి గణ గన్ధర్వ నాగ యక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే (మార్గే హనుమాన్ జగామ) ||

||శ్లోకార్థములు||

మహర్షి గణ గన్ధర్వ నాగ యక్ష సమాకులే
- మహర్షిగణములు నాగయక్ష గణములతో నిండిన మార్గము,
వివిక్తే విమలే విశ్వే
- విమలముగా ఏకాంతముగా వుండు ప్రదేశములు కలమార్గము
విశ్వావసు నిషేవితే
- విశ్వావసుని చే సేవించబడిన మార్గము

||శ్లోకతాత్పర్యము||

మహర్షిగణములు నాగయక్ష గణములతో నిండిన మార్గము, విమలముగా ఏకాంతముగా వుండు ప్రదేశములు కలమార్గము, గంధర్వరాజగు విశ్వావసుని చే సేవించబడిన మార్గము. ||1.169||

||శ్లోకము 1.170||

దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్య పథే శివే |
వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే ||1.170||

స|| దేవరాజ గజాక్రాన్తే చంద్రసూర్యపథే శివే జీవలోకస్య బ్రహ్మ నిర్మితే వితతే వితానే (మార్గే హనుమాన్ జగామ) ||

||శ్లోకార్థములు||

దేవరాజ గజాక్రాన్తే
- దేవేంద్రుని గజము పోవు మార్గము
చంద్రసూర్యపథే శివే
- మంగళకరమైన చంద్రుడు సూర్యుడు పయనించు మార్గము
జీవలోకస్య బ్రహ్మ నిర్మితే వితతే వితానే
- జీవలోకము పైన విశాలముగా బ్రహ్మచేత నిర్మింపబడిన మార్గము

||శ్లోకతాత్పర్యము||

దేవేంద్రుని గజము పోవు మార్గము. మంగళకరమైన చంద్రుడు సూర్యుడు పయనించు మార్గము. జీవలోకము పైన విశాలముగా బ్రహ్మచేత నిర్మింపబడిన మార్గము. ||1.170||

||శ్లోకము 1.171||

బహుశస్సేవితే వీరై ర్విద్యాధరగణైర్వరైః|
జగామ వాయుమార్గేతు గరుత్మానివ మారుతః||1.171||

స|| వరైః వీరైః విద్యాధరగణైః బహుశః సేవితే వాయుమార్గే మారుతిః గరుత్మానివ జగామ||

||శ్లోకార్థములు||

బహుశః వరైః వీరైః విద్యాధరగణైః సేవితే
- అనేకమైన శ్రేష్ఠులు వీరులు అగు విధ్యాధర గణములు సేవించు
వాయుమార్గే మారుతిః గరుత్మానివ జగామ
- వాయుమార్గములో హనుమంతుడు గరుత్మంతునివలె పయనించెను.

||శ్లోకతాత్పర్యము||

అనేకమైన శ్రేష్ఠులు వీరులు అగు విధ్యాధర గణములు సేవించు వాయుమార్గములో హనుమంతుడు గరుత్మంతునివలె పయనించెను. ||1.171||

అలా ( గత ఏడు శ్లోకాలలో) వర్ణింపబడిన ఆకాశమార్గములో హనుమ గరుత్మంతునివలె పయనించెను.

||శ్లోకము 1.172||

ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః|
భేజేఽమ్‍బరమ్ నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్||1.172||

స|| హనుమాన్ మారుతాత్మజః సర్వత్ర ప్రదృశ్యమానః నిరాలంబం లంబపక్షః అద్రిరాట్ ఇవ అంబరమ్ భేజే||

||శ్లోకార్థములు||

హనుమాన్ మారుతాత్మజః సర్వత్ర ప్రదృశ్యమానః
- మారుతాత్మజుడైన హనుమంతుడు అన్నివైపుల కనపడుతూ
నిరాలంబం లంబపక్షః
- ఏమీ ఆధారము లేకుండా, పెద్దరెక్కలతోవున్న
అద్రిరాట్ ఇవ అంబరమ్ భేజే
- పర్వతరాజము వలె అకాశమును ఆక్రమించెను

||శ్లోకతాత్పర్యము||

మారుతాత్మజుడైన హనుమంతుడు అన్నివైపుల కనపడుతూ, ఏమీ ఆధారము లేకుండా, పెద్దరెక్కలతోవున్న, పర్వతరాజము వలె అకాశమును ఆక్రమించెను. ||1.172||

అలాగ హనుమంతుడు , "రామార్థమ్ వానరార్థమ్ చ", రామకార్యానికి వానరులకోసము ముందుకు పోతాడు.

ఇప్పుడు మనము చూసేది సింహికా వృత్తాంతము. అది సింహిక అనే రాక్షసి, హనుమంతునికి తెలియకుండా, హనుమంతుని నీడ పట్టుకొని, హనుమంతుని కి ప్రయాణములో నిర్బంధము కలిగించడము. ఈ కథ ముందు శ్లోకాలలో వస్తుంది.

||శ్లోకము 1.173||

ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ |
మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణీ ||1.173||

స|| ప్లవమానం తం దృష్ట్వా సింహికా నామా రాక్షసీ ప్రవృద్ధా కామరూపిణీ చిన్తయామాస||

||శ్లోకార్థములు||

ప్లవమానం తం దృష్ట్వా
- ( ఆకాశములో)ఎగురుచున్న అతనిని చూచి
సింహికా నామా కామరూపిణీ రాక్షసీ
- సింహిక అను పేరుగల కామరూపిణి అయిన రాక్షసి
ప్రవృద్ధా చిన్తయామాస
- తన శరీరము పెంచుచూ ఇట్లు అనుకొనెను

||శ్లోకతాత్పర్యము||

అలా ఎగురుచున్న హనుమంతుని చూచి సింహిక అను కామరూపిణీ అగు రాక్షసి , తన శరీరము పెంచుచూ ఇట్లు అనుకొనెను. ||1.173||

||శ్లోకము 1.174||

అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశితా |
ఇదం హి మే మహత్ సత్వం చిరస్య వశమాగతమ్ ||1.174||

స|| చిరస్య ఇదం మహత్ సత్త్వమ్ మే వశమ్ ఆగతమ్ | దీర్ఘస్య కాలస్య అద్య అహమ్ ఆశితా భవిష్యామి||

||శ్లోకార్థములు||

చిరస్య ఇదం మహత్ సత్త్వమ్
- చాలాకాలము తరువాత ఈ ఒక పెద్ద జంతువు
మే వశమ్ ఆగతమ్
- నా వశములోకి వచ్చినది
దీర్ఘస్య కాలస్య అద్య
- దీర్ఘకాలము తరువాత నేడు
అహమ్ ఆశితా భవిష్యామి
- నేను తృప్తిచెందినదానను అగుదును

||శ్లోకతాత్పర్యములు||

'చాలాకాలము తరువాత ఒక పెద్ద జంతువు ఆహారముగా నా వశములోకి వచ్చినది. దీర్ఘకాలము తరువాత నేడు, నేను తృప్తిచెందినదానను అగుదును'. ||1.174||

||శ్లోకము 1.175||

ఇతి సంచిత్య మనసా ఛాయమస్య సమాక్షిపత్ |
ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః||1.175||

స|| (సింహికా) ఇతి మనసా సంచిత్య అస్య (కపిస్య) ఛాయామ్ సమాక్షిపత్ | ఛాయాయామ్ గృహ్యమాణాయామ్ వానరః చింతయామాస||

||శ్లోకార్థములు||

ఇతి మనసా సంచిత్య
- ఈవిధముగా మనస్సులో అలోచించి
అస్య (కపిస్య) ఛాయామ్ సమాక్షిపత్
- ఆ వానరుని నీడ పట్టు కొనెను
ఛాయాయామ్ గృహ్యమాణాయామ్
- నీడద్వారా పట్టుకొనబడగానే
వానరః చింతయామాస
- హనుమంతుడు ఆలోచించ సాగెను

||శ్లోకతాత్పర్యము||

ఈ విధముగా మనస్సులో అలోచించి ఆ సింహిక వానరుని నీడ పట్టు కొనెను. ఆ నీడద్వారా పట్టుకోనబడగానే హనుమంతుడు ఆలోచించ సాగెను. ||1.175||

||శ్లోకము 1.176||

సమాక్షిప్తోఽస్మి సహసా పంగూకృత పరాక్రమః|
ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే||1.176||

స|| సాగరే ప్రతిలోమేన వాతేన మహానౌరివ సహసా పంగూకృత పరాక్రమః సమాక్షిప్తః అస్మి ||

||శ్లోకార్థములు||

సాగరే ప్రతిలోమేన వాతేన
- సాగరములో ఎదురుగాలివలన
మహానౌరివ - పెద్ద నౌక లాగ
సహసా పంగూకృత పరాక్రమః
- అకస్మాత్తుగా పరాక్రమములేక
సమాక్షిప్తః అస్మి
- నిరోధింపబడిన వానివలె వున్నాను

||శ్లోకతాత్పర్యము||

'సాగరములో ఎదురుగాలివలన నిరోధింపబడిన పెద్ద నౌక లాగా అకస్మాత్తుగా పరాక్రమములేక నిరోధింపబడిన వానివలె వున్నాను'. ||1.176||

||శ్లోకము 1.177||

తిర్యగూర్ధ్వమథశ్చైవ వీక్షమాణస్తతః కపిః|
దదర్శ స మహత్ సత్త్వం ఉత్థితం లవణాంభసి||1.177||

స|| తతః (హనుమాన్) తిర్యక్ ఊర్ధ్వమ్ అథశ్చైవ వీక్షమాణః లవణాంభసి ఉత్థితమ్ మహత్ సత్త్వం దదర్శ ||

||శ్లోకార్థములు||

తతః (హనుమాన్) తిర్యక్ ఊర్ధ్వమ్ అథశ్చైవ
- అప్పుడు హనుమంతుడు అన్నివేపుల, పైన, క్రింద కూడా
వీక్షమాణః లవణాంభసి ఉత్థితమ్
- చూచుచుండగా సముద్రములోనుంచి పైకి లేచిన
మహత్ సత్త్వం దదర్శ
- మహత్తరమైన జంతువు ను చూచెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు హనుమంతుడు అన్నివేపుల, పైన, క్రింద కూడా చూచుచుండగా, సముద్రములోనుంచి పైకి లేచిన మహత్తరమైన జంతువు ను చూచెను. ||1.177||

||శ్లోకము 1.178||

తదృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననః |
కపిరాజేన కథితం సత్త్వమద్భుత దర్శనమ్ ||1.178||
ఛాయాగ్రాహీ మహావీర్యం తదిదం నాత్ర సంశయః |

స|| తత్ వికృతాననమ్ దృష్ట్వా మారుతిః చింతయామాస | కపిరాజేన కథితమ్ అద్భుతదర్శనం ఛాయాగ్రాహీ మహావీర్యం తత్ సత్త్వం ఇదం అత్ర న సంశయః ||

||శ్లోకార్థములు||

తత్ వికృతాననమ్ దృష్ట్వా
- ఆ వికృతమైన రూపము గలదానిని చూచి
మారుతిః చింతయామాస
- మారుతి ఆలోచించసాగెను.
కపిరాజేన కథితమ్ అద్భుతదర్శనం
- కపిరాజగు సుగ్రీవునిచేత చెప్పబడిన చూచుటకు అద్భుతముగాగల
ఛాయాగ్రాహీ మహావీర్యం
- నీడను పట్టుకొనగల మహా బలము కల
తత్ సత్త్వం ఇదం
- ఆ జంతువు ఇదే
అత్ర న సంశయః
- దీనిలో సంశయము లేదు

||శ్లోకతాత్పర్యము||

మారుతి ఆ వికృతరూపమైన జంతువు చూచి అలోచించసాగెను. 'కపిరాజగు సుగ్రీవునిచేత చెప్పబడిన చూచుటకు అద్భుతముగాగల, నీడను పట్టుకొనగల, మహా బలము కల జంతువు ఇదే. దానికి సందేహము లేదు'. ||1.178||

|| శ్లోకము 1.179||

స తాం బుద్వార్థతత్వేన సింహికాం మతిమాన్కపిః ||1.179||
వ్యవర్థత మహాకాయః పావృషీవ వలాహకః |

స||మతిమాన్ స కపిః తామ్ అర్థతత్త్వేన సింహికామ్ బుద్ధ్వా మహాకాయః ప్రావృషి వలాహకః ఇవ వ్యవర్థత ||

||శ్లోకార్థములు||

మతిమాన్ స కపిః
- బుద్ధిమంతుడైన హనుమంతుడు
తామ్ అర్థతత్త్వేన సింహికామ్ బుద్ధ్వా
- దానిని తన ప్రకృతిని బట్టి సింహిక అని అర్థముచేసి కొని
ప్రావృషి వలాహకః ఇవ
- వర్షాకాలపు మేఘము వలె
మహాకాయః వ్యవర్థత
- మహాకాయముగలవాడు పెరిగెను

||శ్లోకతాత్పర్యము||

బుద్ధిమంతుడైన హనుమంతుడు, దానిని తన ప్రకృతిని బట్టి సింహిక అని అర్థముచేసి కొని, వర్షకాలపు మేఘమువలె, ఆ మహాకాయముగలవాడు తన శరీరమును పెంచెను. ||1.179||

|| శ్లోకము 1.180||

తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః ||1.180||
వక్త్రం ప్రసారమాయాస పాతాళాంతర సన్నిభమ్ |

స|| వర్ధమానం మహాకపేః కాయముద్వీక్ష్య సా (సింహికా) తస్య పాతాళాంతర సన్నిభం వక్త్రం ప్రసారయామాస |

||శ్లోకార్థములు||

వర్ధమానం మహాకపేః కాయముద్వీక్ష్య
- అలా పెరుగుతున్న మహాకపియొక్క శరీరము చూచి
సా (సింహికా) తస్య పాతాళాంతర సన్నిభం
- ఆ సింహిక తన పాతాళబిలంలాంటి
వక్త్రం ప్రసారయామాస
- నోటిని తెరచెను

||శ్లోకతాత్పర్యము||

అలాగ పెరుగుతున్న మహాకపి యొక్క శరీరము చూచి, ఆ సింహిక పాతాళబిలం లాంటి తన నోటిని తెరచెను. ||1.180||

రామ టీకా లో 'పాతాళామ్బరసంనిభమ్' అంటే 'పాతాళ ఆకాశ మధ్యభాగ సదృశమ్ అని
సింహిక తన నోరు అంత పెద్దదిగా చేసి తెరిచిందన్నమాట.

||శ్లోకములు 1.181,182||

ఘనరాజీవ గర్జంతీ వానరం సమభిద్రవత్ ||1.181||
స దదర్శ తతస్తస్యా వివృతం సుమహాన్ముఖమ్ |
కాయమాత్రం చ మేధావీ మర్మాణి చ మహాకపిః ||1.182||

స|| ఘనరాజీవ గర్జన్తీ వానరం సమభిద్రవత్ ||తతః మేధావీ మహాకపిః తస్యాః వివృతమ్ కాయమాత్రం సుమహత్ ముఖమ్ మర్మాణి చ సః దదర్శ ||

||శ్లోకార్థములు||

ఘనరాజీవ గర్జన్తీ వానరం సమభిద్రవత్
- మేఘములవలె గర్జిస్తూ వానరుని వెంటబడెను.
తతః మేధావీ మహాకపిః
- అప్పుడు మేధావి అయిన మహాకపి
తస్యాః వివృతమ్ కాయమాత్రం
- దానియొక్క శరీరప్రమాణముగా తెరవబడిన
సుమహత్ ముఖమ్ మర్మాణి చ
- అపారమైన ముఖము ముఖ్యమైన అవయవములు కూడా
సః దదర్శ- అతడు చూచెను.

||శ్లోకతాత్పర్యము||

మేఘములవలె గర్జిస్తూ వానరుని వెంటబడెను. అప్పుడు మేధావి అయిన హనుమంతుడు, శరీరప్రమాణముగా తెరవబడిన దానియొక్క అపారమైన ముఖము ముఖ్యమైన అవయవములు కూడా చూచెను'. ||1.181,2||

||శ్లోకము 1.183||

స తస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః |
సంక్షిప్త్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః ||1.183||

స|| మహాబలః వజ్రసంహననః సః కపిః ఆత్మానమ్ ముహుః సంక్షిప్త్య తస్యాః వివృతే వక్త్రే నిష్పపాత||

||శ్లోకార్థములు||

మహాబలః వజ్రసంహననః
- మహాబలుడు వజ్రము వంటి దేహము కలవాడు అగు
సః కపిః ఆత్మానమ్ ముహుః సంక్షిప్త్య
- ఆ వానరుడు తనదేహమును మళ్ళీ చిన్నదిగా చేసి
తస్యాః వివృతే వక్త్రే నిష్పపాత
- దానియొక్క తెరవబడిన నోటిలో దూకెను

||శ్లోకతాత్పర్యము||

మహాబలుడు వజ్రము వంటి దేహము కలవాడు అగు ఆ వానరుడు మళ్ళీ తన దేహము చిన్నదిగా చేసి దాని నోటిలో దూకెను. ||1.183||

||శ్లోకము 1.184||

అస్యే తస్యా నిమజ్జంతం దదృశు సిద్ధచారణాః |
గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా ||1.184||

స|| సిద్ధ చారణాః తస్యాః ఆస్యే నిమజ్జంతం రాహునా పర్వణి గ్రస్యమానం పూర్ణం చంద్ర యథా దదృశు||

||శ్లోకార్థములు||

సిద్ధ చారణాః తస్యాః ఆస్యే నిమజ్జంతం
- సిద్ధులు చారణులు దానియొక్క నోటిలో మునుగుచున్న( అ హనుమంతుని)
రాహునా పర్వణి గ్రస్యమానం
- పౌర్ణమినాడు రాహువు చేత కబళింపబడుతున్న
పూర్ణం చంద్ర యథా దదృశు
- పూర్ణ చంద్రుని వలె చూచిరి

||శ్లోకతాత్పర్యము||

సిద్ధులు చారణులు దానియొక్క నోటిలో మునుగుచున్న అ హనుమంతుని, పౌర్ణమినాడు రాహువు చేత కబళింపబడుతున్నపూర్ణ చంద్రుని వలె చూచిరి. ||1.184||

||శ్లోకము 1.185||

తతస్తస్యా నఖైస్తీక్ష్ణైర్మర్మాణ్యుత్కృత్య వానరః |
ఉత్పపాథ వేగేన మనః సంపాతవిక్రమః ||1.185||

స|| తతః వానరః తీక్ష్ణైః నఖైః తస్యాః మర్మాణి ఉత్కృత్య మనః సంపాతవిక్రమః వేగేన ఉత్పపాత ||

||శ్లోకార్థములు||

తతః వానరః తీక్ష్ణైః నఖైః
- అప్పుడు వానరుడు వాడిగోళ్ళతో
తస్యాః మర్మాణి ఉత్కృత్య
- దాని ఆయువు పట్లను చీల్చి
మనః సంపాత విక్రమః
- కార్యములో మనోవేగము కల విక్రముడు
వేగేన ఉత్పపాత
- వేగముగా బయటకు వచ్చెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు వానరుడు వాడిగోళ్ళతో దాని ఆయువు పట్లను చీల్చి, కార్యములో మనోవేగము కల విక్రముడు వేగముగా బయటకు వచ్చెను. ||1.185||

||శ్లోకము 1.186||

తాం తు దృష్ట్యా చ ధృత్యాచ దాక్షిణ్యేన నిపాత్య చ |
స కపిప్రవరో వేగాద్వవృధే పునరాత్మవాన్ ||1.186||

స|| సః కపి ప్రవరః తామ్ దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య పునః వేగాత్ ఆత్మవాన్ వవృధే ||

||శ్లోకార్థములు||

సః కపి ప్రవరః
- ఆ కపి ప్రవరుడు
ధృత్యా చ దాక్షిణ్యేన దృష్ట్వా చ నిపాత్య చ
- ధైర్యముతో దక్షతతో దానిని చూచి పడగొట్టి
పునః వేగాత్ ఆత్మవాన్ వవృధే
- మళ్ళీ వేగముగా తన శరీరమును పెద్దదిగా చేసెను.

||శ్లోకతాత్పర్యము||

ఆ కపి ప్రవరుడు ధైర్యముతో దక్షతతో దానిని చూచి పడగొట్టి, మళ్ళీ వేగముగా తన శరీరమును పెద్దదిగా చేసెను. ||1.186||

||శ్లోకము 1.187||

హృతహృత్సా హనుమాత పపాత విధురాఽమ్భసి |
తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష్య సింహికామ్ ||1.187||
భూతాన్యాకాశచారీణి తమూచుః ప్లవగోత్తమమ్ |

స|| సా హనుమతా హ్రుతహ్రుత్ విధురా అమ్బసి పపాత| వానరేణ ఆశు హతాం పతితామ్ తాం వీక్ష్య ఆకాశచారీణి భూతాని ప్లవగోత్తమమ్ ఊచుః |

||శ్లోకార్థములు||

సా హనుమతా హ్రుతహ్రుత్
- హనుమంతునిచేత ఆమె గుండె చీల్చబడగా
విధురా అమ్బసి పపాత
- దయనీయమైన స్థితిలో సముద్రములో పడిపోయెను
వానరేణ ఆశు హతాం
- వానరునిచేత క్షణములో చంపబడి
పతితామ్ తాం వీక్ష్య
- (సముద్రములో) పడిన దానిని చూచి
ఆకాశచారీణి భూతాని ప్లవగోత్తమమ్ ఊచుః
- ఆకాశములో చరించు భూతములు వానరోత్తమునితో ఇట్లు పలికిరి

||శ్లోకతాత్పర్యము||

హనుమంతునిచేత ఆమె గుండె చీల్చబడగా దయనీయమైన స్థితిలో ఆ సింహిక సముద్రములో పడిపోయెను. వానరునిచేత క్షణములో చంపబడి (సముద్రములో) పడిన దానిని చూచి, ఆకాశములో చరించు భూతములు వానరోత్తమునితో ఇట్లు పలికిరి. ||1.187||

||శ్లోకము 1.188||

భీమమద్యకృతం కర్మ మహత్ సత్వం త్వయా హతమ్ ||1.188||
సాధయార్థమభిప్రేతం అరిష్టం ప్లవతాం వర |

స|| ప్లవతాం వరః అద్య త్వయా మహత్ సత్త్వం హతమ్| భీమమ్ కర్మ కృతమ్| (తవ) అభిప్రేతమ్ అర్థమ్ అరిష్టమ్ సాధయ |

||శ్లోకార్థములు||

ప్లవతాం వరః
- ఎగరగలవారిలో శ్రేష్ఠుడా ( వానరశ్రేష్ఠుడా)
అద్య త్వయా మహత్ సత్త్వం హతమ్
- నేడు నీచేత మహత్తరమైన జంతువు చంపబడినది.
భీమమ్ కర్మ కృతమ్
- భయంకరమైన కార్యము చేయబడినది
అభిప్రేతమ్ అర్థమ్ అరిష్టమ్ సాధయ
- అభీష్ఠ కార్యమును అడ్డులేకుండా సాధించుకొనుము

||శ్లోకతాత్పర్యము||

'ఓ వానరశ్రేష్ఠా! నేడు నీచేత మహత్తరమైన జంతువు చంపబడినది. భయంకరమైన కార్యము చేయబడినది. నీ అభీష్ఠ కార్యమును అడ్డులేకుండా సాధించుకొనుము'. ||1.188||

||శ్లోకము 1.189||

యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ||1.189||
ధృతిర్దృష్టిర్మతి దాక్ష్యం స్వకర్మసు సీదతి ||

స|| వానరేంద్ర యస్య ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం ఏతాని చత్వారి తవ యథా సః కర్మసు న సీదతి||

||శ్లోకార్థములు||

వానరేంద్ర యస్య ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం
- ఓ వానరేంద్ర ఎవరిలో ధైర్యము, దృష్ఠి, బుద్ది , దక్షత
ఏతాని చత్వారి తవ యథా
- ఈ నాలుగు నీలో ఉన్నట్లు గల
సః కర్మసు న సీదతి
- అతడు కర్మలలో అపజయము పొందడు ( సిద్ధి పొందును)

||శ్లోకతాత్పర్యము||

'ఓ వానరేంద్ర ! ఎవరిలో ధైర్యము, సూక్ష్మ దృష్టి, సునిశితబుద్ధి, దక్షత , ఈ నాలుగూ నీలో ఉన్నట్లు కలవో అట్టివాడు కర్మాచరణములో సిద్ధిపొందును'. ||1.189||

|| శ్లోకము 1.190||

సతైః సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః ||1.190||
జగామాకాశమావిశ్య పన్నగాశనవత్కపిః |

స||పూజ్యః సః కపిః తైః సమ్భావితః ప్రతిపన్నప్రయోజనః ఆకాశం ఆవిశ్య పన్నగాశనవత్ జగామ||

||శ్లోకార్థములు||

పూజ్యః సః కపిః తైః సమ్భావితః - పూజ్యుడైన ఆ వానరుడు వారిచేత సమ్మానింపబడి
ప్రతిపన్నప్రయోజనః - తన

||శ్లోకతాత్పర్యము||

వారిచేత స్తుతింపబడి పూజనీయుడైన హనుమంతుడు తన కార్యము నిశ్చయించుకొని గరుత్మంతునిలాగా ఆకాశమార్గమున ఎగురుతూ పోయెను. ||1.190||

సింహికా వృత్తాంతములో కూడా అంతారార్థము మననము చేయతగినది.

అధ్యాత్మిక మార్గములో పోవువాడు శాస్త్రములో విహిత కర్మలను ఎలాగ ఆచరించ వలేనో
అలాగే నిషిద్ధ కర్మలను అలాగే పరిత్యజించ వలెను. అది సింహికా వృత్తాంతములో కనపడుతుంది.

నిషిద్ధకర్మలు మనను హింసించు కర్మలు. సింహిక అనగా హింసించునది.

ఆ నీడ పట్టుకొని లాగిన సింహికా వృత్తాంతము మనకు నిషిద్ధ కర్మలను ఎలా త్యజించ వలెనో చెప్పును. సింహిక హనుమంతుని అతని నీడ పట్టుకొని లాగినట్లు, నిషిద్ధ కర్మలు మనకు తెలియకుండానే మనని ఆక్రమిస్తాయి. హనుమంతుడు తన జ్ఞానమును ఉపయోగించి సింహిక గుణములను ఎరిగి ఆ సింహికను హతమార్చెను.

ఇక్కడ సురస, సింహిక ఇద్దరూ స్త్రీలే అయినా, సురస విషయములో ఆమె నోటిలో ప్రవేశించి, బయట పడి, ఆమె ఆశీర్వాదము పొంది ముందుకు పోతాడు. సింహిక విషయములో ఆమె తన నీడను పట్టుకోని లాగుతున్న విషయము గ్రహించి ఆమెను హతమార్చి ముందుకు పోతాడు.

||శ్లోకము 1.191||

ప్రాప్తభూయిష్ట పారస్తు పర్వతః ప్రతిలోకయన్ ||1.191||
యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ సః |

స|| ( హనుమాన్) శతస్య యోజనానామ్ అన్తే ప్రాపభూయిష్ఠ పారః సర్వతః ప్రతిలోకయన్ వనరాజిమ్ దదర్శ ||

||శ్లోకార్థములు||

శతస్య యోజనానామ్ అన్తే - వంద యోజనముల తరువాత
ప్రాపభూయిష్ఠ పారః - సముద్రముయొక్క అవతల తీరము చేరి
సర్వతః ప్రతిలోకయన్ - అన్ని వేపుల పరికించుచూ
వనరాజిమ్ దదర్శ - వృక్షములతో రాజించు వనము చూసెను

||శ్లోకతాత్పర్యము||

వంద యోజనముల తరువాత సముద్రముయొక్క అవతల తీరము చేరి, అన్ని వేపుల పరికింపగా వృక్షములతో రాజించు వనము చూసెను. ||1.191||

||శ్లోకము 1.192||

దదర్శ చ పతన్నేవ వివిధ ద్రుమభూషితమ్ ||1.192||
ద్వీపం శాఖామృగశ్రేష్ఠో మలయోపవనాని చ |

స|| ( హనుమాన్) శతస్య యోజనానామ్ అన్తే ప్రాపభూయిష్ఠ పారః సర్వతః ప్రతిలోకయన్ వనరాజిమ్ దదర్శ || శాఖామృగ శ్రేష్ఠః పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం మలయోపవనాని చ దదర్శ ||

||శ్లోకార్థములు||

శతస్య యోజనానామ్ అన్తే - వంద యోజనముల తరువాత
ప్రాపభూయిష్ఠ పారః - సముద్రముయొక్క అవతల తీరము చెరి
సర్వతః ప్రతిలోకయన్ - అన్ని వేపుల పరికించి
వనరాజిమ్ దదర్శ - వృక్షములతో రాజించు వనము చూచెను
శాఖామృగ శ్రేష్ఠః పతన్నేవ - శాఖామృగశ్రేష్ఠుడగు హనుమంతుడు దిగినవెంటనే
వివిధద్రుమభూషితం ద్వీపం - వివిధరకములైన చెట్లతో నిండిన ద్వీపమును
మలయోపవనాని చ దదర్శ - మలయ పర్వత సమీపములోని ఉపవనములను చూచెను

||శ్లోకతాత్పర్యము||

వంద యోజనముల తరువాత సముద్రముయొక్క అవతల తీరము చెరి, అన్ని వేపుల పరికించి, వృక్షములతో రాజించు వనము చూచెను. శాఖామృగశ్రేష్ఠుడగు హనుమంతుడు దిగినవెంటనే వివిధరకములైన చెట్లతో నిండిన ద్వీపమును, మలయ పర్వత సమీపములోని ఉపవనములను చూచెను. ||1.192||

||శ్లోకము 1.193,194||

సాగరం సాగరానూపం సాగరా నూపజాన్ద్రుమాన్ ||1.193||
సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ |
స మహామేఘసంకాశం సమీక్ష్యాత్మాన మాత్మవాన్ ||1.194||
నిరుంధత మివాకాశం చకార మతిమాన్మతిమ్ |

స|| సాగరం సాగరానూపం సాగరానూపజాన్ ద్రుమాన్ సాగరస్య పత్నీనాం (నదీనాం) ముఖాన్యపి విలోకయన్ సః మహామేఘసంకాశం ఆకాశం నిరుంధత మివ ఆత్మవాన్ సమీక్ష్య (హనుమాన్) మతిం చకార ||

||శ్లోకార్థములు||

సాగరం సాగరానూపం
- సముద్రమును, సముద్ర తీర ప్రాంతములను
సాగరానూపజాన్ ద్రుమాన్
- సముద్రప్రాంతములోని వృక్షములను
సాగరస్య పత్నీనాం (నదీనాం) ముఖాన్యపి విలోకయన్
- సాగరతో కలియు నదీ ముఖములను చూచి
సః మహామేఘసంకాశం ఆకాశం నిరుంధత మివ ఆత్మవాన్
- మేఘములతో సమానమైన
ఆకాశం నిరుంధత మివ ఆత్మవాన్ సమీక్ష్య
- ఆకాశమును అడ్డగించునటుల వున్న తన శరీరము చూచి
మతిం చకార
- అలోచించసాగెను

||శ్లోకతాత్పర్యము||

సముద్రమును, సముద్ర తీర ప్రాంతములను, సముద్రప్రాంతములోని వృక్షములను, సాగరముతో కలియు నదీ ముఖములను చూచి, ఆకాశమును అడ్డగించునటుల వున్న మేఘములతో సమానమైన తన శరీరము చూచి అలోచించ సాగెను. ||1.193,4||

||శ్లోకము 1.195||

కాయవృద్ధిం ప్రవేగం చ మమదృష్ట్వైవ రాక్షసాః ||1.195||
మయి కౌతూహలం కుర్యురితి మేనే మహాకపిః |

స|| మమ కాయవృద్ధిం ప్రవేగం చ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలమ్ కుర్యుః ఇతి మహాకపిః మేనే || తతః తత్ మహీధర సన్నిభమ్ తత్ శరీరం సంక్షిప్య వీతమోహః ఆత్మవానివ పునః ప్రకృతిం ఆపేదే ||

||శ్లోకార్థములు||

మమ కాయవృద్ధిం ప్రవేగం చ దృష్ట్వైవ
- నా యొక్క పెరిగిన శరీరమును , వేగమును కూడా చూచి
రాక్షసాః మయి కౌతూహలమ్ కుర్యుః
- రాక్షసులకు నాపై కుతూహలము కలుగును
ఇతి మహాకపిః మేనే
- అని ఆ కపివరుడు తలచెను

||శ్లోకతాత్పర్యము||

'నా పెరిగిన శరీరమును, వేగమును చూచి రాక్షసులకు నాపై కుతూహలము కలుగును', అని ఆ మహావానరుడు అనుకొనెను. ||1.195|| .

||శ్లోకము 1.196||

తతః శరీరం సంక్షిప్య తన్మహీధరసన్నిభమ్ ||1.196||
పునః ప్రకృతి మాపేదే వీతమోహా ఇవాత్మవాన్ |

స||తతః తత్ మహీధర సన్నిభమ్ తత్ శరీరం సంక్షిప్య వీతమోహః ఆత్మవానివ పునః ప్రకృతిం ఆపేదే||

రామటీకాలో - తతః విచారానన్తరం మహీధరసన్నిభం శరీరం సంక్షిప్య అల్పవన్తం ప్రాప్య ప్రకృతిం స్వాకృతిం పునరాపేదే| తత్ర దృష్టాన్తః - వీతమోహః వీతరాగః ఆత్మవాన్ యోగీ శరీరం సంక్షిప్య తిరస్కృత్య ప్రకృతిం నిత్యానన్దస్వభావం ఇవ|

||శ్లోకార్థములు||

తతః తత్ మహీధర సన్నిభమ్
- అప్పుడు ఆ పర్వత సమానమైన
తత్ శరీరం సంక్షిప్య
- ఆ శరీరమును చిన్నదిగా చేసి
వీతమోహః ఆత్మవానివ
- మోహము పోయిన ఆత్మజ్ఞాని వలె
పునః ప్రకృతిం ఆపేదే
- మళ్ళీ సహజమైన రూపమును దాల్చెను

||శ్లోకతాత్పర్యము||

పిమ్మట పర్వత సమానమైన తన శరీరమును చిన్నదిగా చేసి, అజ్ఞానము పోయిన ఆత్మజ్ఞాని, స్వరూపము పొందినట్లు, మళ్ళీ సహజమైన రూపమును దాల్చెను. ||1.196||

||శ్లోకము 1.197||

తద్రూప మతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః |
త్రీన్క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిః ||1.197||

స|| హనుమాన్ తత్ రూపం అతిసంక్షిప్య బలివీర్యహరః హరిః త్రీన్ క్రమాన్ విక్రమ్య ఇవ ప్రకృతౌ స్థితః ||

రామ టీకాలో- తదితి| తత్ ప్రవృద్ధం రూపం అతిసంక్షిప్య త్రీన్ క్రమాన్ లోకాన్ విక్రమ్య పరిమాయ బలి వీర్యహరః బలే వీర్యస్య ధ్వంసకః హరిః వామన్ ఇవ ప్రకృతౌ స్థితః||

||శ్లోకార్థములు||

హనుమాన్ తత్ రూపం అతిసంక్షిప్య
- హనుమంతుడు ఆ రూపమును చిన్నదిగా చేసి
త్రీన్ క్రమాన్ విక్రమ్య బలివీర్యహరః హరిః ఇవ
- మూడు అడుగులతో విజముపొంది బలిని హరించిన శ్రీహరి వలె
ప్రకృతౌ స్థితః
- తన స్వాభావిక రూపము పొందెను

||శ్లోకతాత్పర్యము||

మూడు అడుగులతో విజముపొంది బలిని హరించిన శ్రీహరి వలె , హనుమంతుడు తన రూపమును చిన్నదిగా చేసి, స్వాభావిక రూపము పొందెను. ||1.197||

||శ్లోకము 1.198||

స చారునానావిధరూపధారీ
పరం సమాసాద్య సముద్ర తీరమ్ |
పరైరశక్యః ప్రతిపన్నరూపః
సమీక్షితాత్మా సమవేక్షితార్థః ||1.198||

స|| చారునానావిధరూపధారీ పరైః అశక్యః సః పరం సముద్రతీరమ్ సమాసాద్య సమీక్షితాత్మా ప్రతిపన్నరూపః సమవేక్షితార్థః||

||శ్లోకార్థములు||

చారునానావిధరూపధారీ
- సుందరమైన నానావిధములైన రూపము ధరించగలవాడు
పరైః అశక్యః సః
- శత్రువులకు అశక్య మైనవాడు
పరం సముద్రతీరమ్ సమాసాద్య
- సముద్రము యొక్క అవతలి తీరము చేరి
సమీక్షితాత్మా ప్రతిపన్నరూపః
- తన శరీరాన్ని చూచుకొని
సమవేక్షితార్థః
- సూక్ష్మ రూపము ధరించి తన కార్యము గురించి సమీక్షించెను

||శ్లోకతాత్పర్యము||

సుందరమైన నానావిధములైన రూపము ధరించగలవాడు, శత్రువులకు అశక్య మైనవాడు, సముద్రము యొక్క అవతలి తీరము చేరి, తన శరీరాన్ని చూచుకొని, సూక్ష్మ రూపము ధరించి తన కార్యము గురించి సమీక్షించెను. ||1.198||

ఇక్కడ తనను తాను సమీక్షించుకోవడములో , అత్మాన్వేషణలో వున్నవాడు కనుకనే తనను తాను సమీక్షించు చుకోగలిగాడు అని ధ్వని .

||శ్లోకము 1.199||

తతస్సలంబస్య గిరేః సమృద్ధే
విచిత్ర కూటే నిపపాత కూటే |
సకేత కోద్దాలకనాళికేరే
మహాద్రి కూట ప్రతిమో మహాత్మా ||1.199||

స|| తతః మహాద్రికూటప్రతిమః సః మహాత్మా లమ్బస్య గిరేః విచిత్రకూటే సమృద్ధే సకేతకోద్దాలకనాళికేరే ప్రతిమౌ నిపపాత కూటే ||

||శ్లోకార్థములు||

తతః మహాద్రికూటప్రతిమః సః మహాత్మా
- అప్పుడు మహామేఘములతో సమానమైన ఆ మహాత్ముడు
సమృద్ధే సకేతకోద్దాలకనాళికేరే
- కేతక ఉద్దాలక నారికేళ వృక్షములతో నిండినది
విచిత్రకూటే
- విచిత్రమైన శిఖరములుకల
లమ్బస్య గిరేః
- లంబపర్వతము యొక్క
ప్రతిమౌ నిపపాత కూటే
- ప్రధాన శిఖరముపై దిగెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు మహామేఘములతో సమానమైన ఆ మహాత్ముడు కేతక ఉద్దాలక నారికేళ వృక్షములతో నిండినది, విచిత్రమైన శిఖరములు కల లంబపర్వతము యొక్క ప్రధాన శిఖరముపై దిగెను. ||1.199||

ఈ శ్లోకాన్ని విడమరుస్తూ రామాయణశిరోమణి టీకాలో ఇలారాస్తారు: "మహాభ్రకూటప్రతిమః మహామేఘసమూహ సదృశో మహాత్మా హనుమాన్ పరైరశక్యమ్ తరితుం ఇతి శేషః. పరం సముద్ర తీరం సమాసాద్యతతః సముద్ర తీరాత్ లమ్బస్య లమ్బాభిదస్య గిరేః సమృద్ధేఫలపుష్పాదిభీ ప్రవృద్ధే సకేతకోద్దాలికనారికేళే, విచిత్ర కూటే విచిత్రాణి కూటాని యస్మిన్ తస్మిన్ కూటే ప్రధాన శిఖరే నిపపాత |

||శ్లోకము 1.200||

తతస్తు సంప్రాప్య సముద్ర తీరం
సమీక్ష్య లఙ్కాం గిరివర్యమూర్ధ్ని |
కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే
విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్ ||1.200||

స|| తతః సముద్రతీరం సంప్రాప్య కపిః తు తస్మిన్ పర్వతే నిపపాత మృగద్విజాన్ వ్యధయన్ రూపం విధూయ గిరివర్యమూర్ధ్ని (సః) లంకాం సమీక్ష్య ||

రామటీకాలో - సముద్ర తీరం సముద్రతీరవర్తినీం గిరివర్య మూర్ధ్ని విద్యమానాం లంకాం సమీక్ష్య అవలోక్య సంప్రాప్య మనసా గత్వా రూపం స్వదేహం విధూయ తిరోధాయకపిః హనుమన్ తస్మిన్ గిరివర్యాభిధే పర్వతే మృగద్విజాన్ మృగపక్షిణః వ్యథయన్ సన్ లమ్బగిరి పర్వతాత్ నిపపాత|

||శ్లోకార్థములు||

తతః సముద్రతీరం సంప్రాప్య
- అప్పుడు సముద్ర తీరము చేరి
మృగద్విజాన్ వ్యధయన్
- మృగములు పక్షులకు భీతికొలుపుతూ
రూపం విధూయ - రూపమును విడనాడి
గిరివర్యమూర్ధ్ని (సః) లంకాం సమీక్ష్య
- పర్వత శిఖరాగ్రమున వున్న లంకను చూచి
కపిః తు తస్మిన్ పర్వతే నిపపాత
- కపి ఆ పర్వతము మీద దిగెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు సముద్ర తీరము చేరి, మృగములు పక్షులకు భీతికొలుపుతూ, రూపమును విడనాడి, పర్వత శిఖరాగ్రమున వున్న లంకను చూచి - కపి ఆ పర్వతము మీద దిగెను. ||1.200||

||శ్లోకము 1.201||

స సాగరం దానవపన్నగాయుతమ్
బలేన విక్రమ్య మహోర్మిమాలినమ్ |
నిపత్య తీరే చ మహోదధే స్తదా
దదర్శ లఙ్కాం అమరావతీమ్ ఇవ ||1. 201||

స|| దానపపన్నగాయుతమ్ మహోర్మిమాలినీమ్ స సాగరం బలేన విక్రమ్య మహోదధేః తీరే నిపత్య తదా అమరావతీం ఇవ లంకాం దదర్శ ||

రామటీకాలో - దానవపన్నగైః ఆయుతం వ్యాప్తం సాగరం నిష్క్రమ్య ఉల్లంఘ్య మహోదధేస్తీరే నిపత్య సంప్రాప్య, అమరావతీం ఇవ విద్యమానాం లంకాం దదర్శ ||

||శ్లోకార్థములు||

దానవపన్నగాయుతమ్
- దానవులకు పన్నగములకు ఆస్థానమైన
మహోర్మిమాలినమ్
- మహత్తరమైన అలలతో కూడిన
స సాగరం బలేన విక్రమ్య
- ఆ సాగరమును బలముతో జయించి
మహోదధే తీరే నిపత్య
- అ మహాసాగరము యొక్క తీరములో దిగి
తదా అమరావతీమ్ ఇవ లఙ్కాం దదర్శ
- అప్పుడు అమరావతి వలె నున్న లంకను చూచెను.

||శ్లోకతాత్పర్యము||

దానవులకు పన్నగములకు ఆస్థానమైన, మహత్తరమైన అలలతో కూడిన, ఆ సాగరమును బలముతో జయించి, అ మహాసాగరము యొక్క తీరములో దిగి అప్పుడు అమరావతి వలె నున్న లంకను చూచెను. ||1.201||

ఇక్కడ లంకను అమరావతితో పోల్చడములో , ముఖ్యము లంక ఒక భోగస్థానము అని.

ఈ శ్లోకముతో మొదటి సర్గ సమాప్తము అవుతుంది

అంటే మొదటి శ్లోకములో రావణునిచే తీసుకుపోబడిన సీతను వెదకడానికి చారణులు వెళ్ళు అకాశ మార్గములో బయలు దేరిన హనుమ, సముద్రముదాటి, అవతలి తీరములో దిగి అమరావతి లాంటి లంకను చూసెను అని ఆఖరి శ్లోకములో వింటాము.

అందుకని, ఈ సర్గని సముద్రలంఘనము అంటారు ఇది ఒక ముఖ్యమైన ఘట్టము..

ఈ సముద్రలంఘనములో హనుమంతుడు చేసిన దుష్కరమైన కార్యములు నాలుగు

1 నిరాలంబముగా ఆకాశములో పయనించి లంకను చేరుటకు పూనుకొని ఎగురుట.
2 మైనాకుడు సగౌరవముగా విశ్రాంతికొరకు మార్గము చేసిననూ దానిని అనుభవించక రామబాణమువలే తన పనిలో పోవుట
3 సురసను ఉపాయముతో జయించుట
4 సింహికను తన బలముతో చంపుట.

ఈ నాలుగు చేయడానికి వాల్మీకి మానవునకు నాలుగు లక్షణములు ఉండవలెను అని చెపుతాడు. అ నాలుగు లక్షణాలు:

ధృతి, దృష్ఠి, మతి, దాక్ష్యము.

తన బుద్ధిని ఆత్మ జ్ఞానము వేపే మళ్ళించి, ఫలములపై కోరికలు లేకుండా చేయడానికి
ముఖ్యముగా కావలసినది మనో ధైర్యము. అదే ధృతి; అంటే ఫలములు లేకపోయినా పరవాలేదు అనే ధైర్యము ఉండాలి. అప్పుడే నిష్కామకర్మ చేయగలుగుతారు. ఒకప్పుడు దార్లో, ఇంకో వేపు మళ్ళగలిగితే మనకు కావలసిన ధనరాశి అందుబాటులో ఉండవచ్చు. అది అక్కరలేదు అనుకొని, మనము చేయగల నిష్కామ కర్మ ముఖ్యము అని ముందుకు పోవడానికి చాలా ధృఢమైన మనస్సు కల ధైర్యము కావాలి. అదే ధృతి.

దుష్కరమైన అసాధ్యమైన కార్యముల చేయవలసినప్పుడు కూడా, అది చేయగలను అనే ధైర్యముతో వుండడము ధృతి. జాంబవంతుని చే ప్రేరేపింపబడిన హనుమ , తను చేయగలను అనే నిశ్చయానికి వచ్చి , 'జగామ లంకాం మనసా మనస్వీ" అంటారు వాల్మీకి కిషిన్ధకాండ చివరి వాక్యములో. వెళ్ళగలను అనే నిశ్చయానికి వచ్చిన హనుమ మనస్సులోనే లంకను చేరాడుట. అదే ధృతి అంటే

దృష్టి అంటే దూరదృష్టి. చేయవలసిన కార్యము చేస్తూ, దారిలో వచ్చే సత్కారపూజలకు వశపడకుండా, లాభాలాభములను సమముగా చూడగలిగి ఉండాలి. సత్కారపూజలే కాదు మనకి సుఖము కలిగించే పనులలో మునిగిపోకుండా, ఇతరులకు సహాయపడు పనులు చేయడానికి దూర దృష్ఠి కావాలి. అదే దృష్టి కలిగి ఉండడము. రామకార్యము మీద రామ బాణములా పోతూ, తనకు విశ్రాంతికలిగించే మైనాకుని ఆతిధ్యము తీసుకోకుండా , మైనాకునికి నొప్పించకుండా ముడుకు పోవడమే ఆ దృష్టి కలిగివుండడము.

విహిత కర్మలను భగవదర్పణము చేసి , భగవంతునికోరకే చేయుటకు కావలసినది బుద్ధి. అదే మతి. అంటే మనము చేయవలసిన చేయతగిన పనులు చేయడము ఏ విధముగా ఆలోచించినా అది మంచిదే. కాని అది మంచిదే అని అనుకోడానికి , అలా ఆలోచించ డానికి కావలసింది, అలాంటి ఆలోచనలు చేయగల బుద్ధి. అదే మతి. సురసవృత్తాంతములో సురస నాగమాత అని గ్రహించి, ఆమె అనుమతితో ముందుకుపోవడము శ్రేయస్కరము అని గ్రహించిన హనుమ, దానికి అనుగుణముగానే ప్రవర్తించి, దాక్షాయణి ఆశీర్వాదములు సంపాదించి ముందుకు పోతాడు. అందుకనే హనుమంతుని బుద్ధిమతాం వరిష్ఠం అని కూడా అంటారు.

దాక్ష్యము అంటే దక్షత కలిగి వుండడము. నిషిద్ధకర్మలనుత్యజించడానికి సామర్థ్యత ఉండాలి అదే దాక్ష్యము. ఈ సర్గలో సముద్ర లంఘనం ముందర , 'తతో హి వవృధే గన్తుం దక్షిణః దక్షిణాం దిశమ్' - అంటారు కవి ; అంటే దక్షత గలహనుమ దక్షిణ దిశలో వెళ్ళడానికి పెరుగుతున్నాడు అని. సింహిక వధలో, తన నీడని పట్టుకొని ఆపగలిగిన శక్తి గల సింహిక మర్మము గ్రహించి, దాని గుండెలని పెకలించి , నిర్వీర్యము చేసి ముందుకు పోవడములో హనుమంతుని దక్షత గ్రహిస్తాము.

ఈ నాలుగు లక్షణములు కల హనుమ సముద్రము ను లంఘించి లంకను చేరినట్లే, అధ్యాత్మిక మార్గములో పోవువాడు, ఈ నాలుగు లక్షణములు కలవాడైతే, నిరాటంకము గా తన గమ్యస్థానము చేరును అని వాల్మీకి ఈ సర్గలో మనకి చెపుతున్నాడు.

అంటే మనము కూడా ఆ నాలుగు లక్షణములు కూడపెట్టడము మంచిది.
హనుమంతుని ముందుకు తీసుకు పోయినట్లు, అవి మనని అధ్యాత్మిక మార్గములోకి గమ్యస్థానము చేర్చ గల శక్తి కలవి.

ఈ విధముగా వాల్మీకియొక్క ఆదికావ్యమైన రామాయణములో సుందరకాండలో ప్రథమసర్గ సమాప్తము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ప్రథమస్సర్గః||

||ఓమ్ తత్ సత్||