||సుందరకాండ ||
|| ఇరువది రెండవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||
|| Sarga 22 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ ద్వావింశస్సర్గః
ఇరవైయొకటవ సర్గలో సీత లో వున్న మాతృమూర్తిని చూస్తాము. కాని సీత దయాస్వభావముతో మాట్లాడినా, చివరిలో రాముని తో మైత్రి చేసికొనబోతే,
ఎక్కడున్నాగాని రాముని బాణములను తప్పించుకు పోలేవు అన్నమాట,
రావణుని అహంకారానికి ఒక పెద్దదెబ్బ.
ఇప్పుడు ఇరవరెండవ సర్గలో మనము వినేది రావణుని బెదిరింపులు,
దానికి సీత సమాధానము.
ఇక ఇరువది రెండవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.
||శ్లోకము 22.01||
సీతాయావచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః|
ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనామ్||22.01||
స|| సీతాయాః తత్ పరుషం వచనం శ్రుత్వా తం ప్రియదర్శనాం సీతాం రాక్షసాధిపః విప్రియం ప్రత్యువాచ||
||శ్లోకార్థములు||
సీతాయాః తత్ పరుషం వచనం శ్రుత్వా -
సీతాదేవి యొక్క ఆ పరుషవచనములను విని
తం ప్రియదర్శనాం సీతాం -
ఆ ప్రియదర్శనస్వరూపము గల సీతకు
రాక్షసాధిపః విప్రియం ప్రత్యువాచ -
ఆ రాక్షసాధిపుడు ప్రత్యుత్తరము ఇచ్చెను
||శ్లోకతాత్పర్యము||
"సీతాదేవి యొక్క ఆ పరుషవచనములను విని ప్రియదర్శనస్వరూపము గల సీతకు అప్రియవచనములతో ఆ రాక్షసాధిపుడు ప్రత్యుత్తరము ఇచ్చెను." ||22.01||
||శ్లోకము 22.02||
యథా యథా సాన్త్వయితా వశ్యః స్త్రీణాం తథా తథా|
యథా యథా ప్రియం వక్తా పరిభూత స్తథా తథా||22.02||
స|| స్త్రీణాం యథా యథా సాన్త్వయితా తథా తథా వశ్యః యథా యథా ప్రియం వక్తా తథా తథా పరిభూతః భవిష్యతి||
తిలక టీకాలో- లోకే స్త్రీణాం సాన్త్వయితా పుమాన్ యథా యథా సాన్త్వయితి తథా తథా తత్ సాన్త్వానుసారేణ స స్త్రీణాం వశ్య ఇష్టో భవతి, త్వత్యి తు యథాఽహం ప్రియం వక్తాఽభూవం తథా తథా త్వయి పరిభూత ఏవాస్మి ఇతి శేషః||
||శ్లోకార్థములు||
స్త్రీణాం యథా యథా సాన్త్వయితా -
స్త్రీలకు సాంత్వ వచనములను చెప్పినకొలదీ
తథా తథా వశ్యః -
సాంత్వ వచనములు చెప్పిన వారికి వశుడు అగును
యథా యథా ప్రియం వక్తా -
ప్రియ వచనములు చెప్పిన కొలదీ
తథా తథా పరిభూతః -
ఆ స్త్రీ చేత పరాభవింపబడినవాడు
భవిష్యతి - అగును
||శ్లోకతాత్పర్యము||
"స్త్రీలకు సాంత్వ వచనములను చెప్పినకొలదీ, సాంత్వ వచనములు చెప్పిన వారికి వశుడు అగును. - ప్రియ వచనములు చెప్పిన కొలదీ ఆ స్త్రీ చేత పరాభవింపబడినవాడు అగును." ||22.02||
||శ్లోకము 22.03||
సన్నియమేచ్ఛతి మే క్రోథం త్వయి కామః సముత్థితః|
ద్రవతఽమార్గ మాసాద్య హయా నివ సుసారథిః ||22.03||
స|| త్వయి సముత్థిథా కామః సుసారథిః అమార్గం ఆసాద్య ద్రవతః హయానివ మే క్రోధం సన్నియమేచ్ఛతి ||
||శ్లోకార్థములు||
త్వయి సముత్థిథా కామః -
నీపై రేగిన కామము
మే క్రోధం సన్నియమేచ్ఛతి -
నా క్రోధమును అదుపులోపెట్టినది
(యథా) సుసారథిః అమార్గం ఆసాద్య -
మంచి సారధి తప్పుడు మార్గములో చెరి
ద్రవతః హయానివ -
పరుగెడుతున్న గుఱ్ఱములను ( అదుపులో పెట్టినట్లు) వలె
||శ్లోకతాత్పర్యము||
"నీపై రేగిన కామము నా క్రోధమును మంచి సారథి తప్పుడు మార్గములో చెరి
పరుగెడుతున్న గుఱ్ఱములను అదుపులో పెట్టినట్లు అదుపులోపెట్టినది." ||22.03||
అంటే " ప్రేమికుడు ప్రియమైన మాటలు చెప్పినకొలదీ, స్త్రీ చేత ఆ ప్రియుడు ఇంకా ఇంకా పరాభింపబడతాడు " అని. అలా చెపుతూ, తన కోరికలే తన కోపాన్ని అదుపులో ఉంచడమువలన సీత రక్షింప బడుతూ వున్నది అని కూడా అంటాడు.
అలా సీత చెప్పిన మాటలకి సీత వధించ తగినది అయినా ,"ఏతస్మాత్ కారణాన్న త్వాం ఘాతయామి " అంటే ఈ కారణాలవలన అంటే కామజనిత కోరికల వలన నిన్నువధించుటలేదు అని.
మనము చాలాసార్లు కామము క్రోధము ఒకే తోవలో పోవడము చూస్తాము.
ఇక్కడ ఆ కామమే క్రోధాన్ని అదుపులో ఉంచి సీత వధింపబడటల్లేదు అంటాడు రావణుడు.
"ఓ సీతా ! నీ పై రేగిన కామము, నా క్రోధమును, మంచి సారథి అడ్దదిడ్డముగా పయనిస్తున్న గుఱ్ఱములను అదుపులో పెట్టినట్లు అదుపులోపెట్టినది. మనుష్యులలో కామము, ఏ జనులపై ఉండునో వారు శిక్షింపతగిననూ వారిపై స్నేహము జాలి కలగచేయును. అందువలన ఓ వరాననా ! వధింపతగిన దానవైననూ అవమానింపతగిన దానవైననూ మిధ్యాప్రేమలో మునిగియున్న నిన్నుచంపుట లేదు".
||శ్లోకము 22.04||
వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే|
జనే తస్మిన్ స్త్వనుక్రోశ స్నేహశ్చ కిల జాయతే ||22.04||
స|| మనుష్యాణాం కామః వామః యస్మిన్జనే నిబధ్యతే తస్మిన్ అనుక్రోశః స్నేహః చ జాయతే కిల||
||శ్లోకార్థములు||
మనుష్యాణాం కామః వామః -
మనుష్యులలో కామము
వామః యస్మిన్జనే నిబధ్యతే -
ఏ జనులపై ఉండునో
తస్మిన్ అనుక్రోశః స్నేహః చ -
వారిపై స్నేహము జాలి
జాయతే కిల - కలగచేయును కదా
||శ్లోకతాత్పర్యము||
"మనుష్యులలో కామము ఏ జనులపై ఉండునో వారిపై స్నేహము జాలి కలగ చేయును కదా (వారు శిక్షింపతగినవారైననూ) ". ||22.04||
||శ్లోకము 22.05||
ఏతస్మాత్ కారాణాన్ న త్వాం ఘాతయామి వరాననే|
వధార్హాం అవమానార్హాం మిథ్యా ప్రవ్రజితే రతామ్||22.05||
స|| వరాననే ఏతస్మాత్ కారణాత్ వధార్హం అవమానార్హం మిథ్యా ప్రవ్రజితే రతామ్ త్వాం న ఘాతయామి ||
||శ్లోకార్థములు||
వరాననే ఏతస్మాత్ కారణాత్ -
అందువలన ఓ వరాననా
వధార్హం అవమానార్హం -
వధింపతగిన దానవైననూ అవమానింపతగిన దానవైననూ
మిథ్యా ప్రవ్రజితే రతామ్ త్వాం -
మిధ్యాప్రేమలో మునిగియున్న నిన్ను
న ఘాతయామి - చంపుట లేదు
||శ్లోకతాత్పర్యము||
"అందువలన ఓ వరాననా ! వధింపతగిన దానవైననూ అవమానింపతగిన దానవైననూ మిధ్యాప్రేమలో మునిగియున్న నిన్నుచంపుట లేదు. ."
||శ్లోకము 22.06||
పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మామ్|
తేషు తేషు వధోయుక్తః తవ మైథిలి దారుణః||22.06||
స|| మైథిలి యాని యాని పరుషాణీహ వాక్యాని మామ్ బ్రవీషి తేషు తేషు తవ దారుణః వధః యుక్తః ||
||శ్లోకార్థములు||
మైథిలి యాని యాని - ఓ మైథిలీ ఏ ఏ
పరుషాణీహ వాక్యాని మామ్ బ్రవీషి -
పరుషవాక్యాలు నాకు చెప్పావో
తేషు తేషు తవ దారుణః వధః యుక్తః -
అవన్నీ నిన్ను దారుణముగా వధింప తగిన మాటలే.
||శ్లోకతాత్పర్యము||
" ఓ మైథిలీ ఏ ఏ పరుషవాక్యాలు నాకు చెప్పావో అవన్నీ నిన్ను వధింప తగిన మాటలే."
||శ్లోకము 22.07||
ఏవముక్త్వాతు వైదేహీం రావణో రాక్షసాధిపః|
క్రోధసంరమ్భ సంయుక్తః సీతాం ఉత్తరమబ్రవీత్ ||22.07||
స|| వైదేహీం సీతాం ఏవమ్ ఉక్త్వాతు రాక్షసాధిపః క్రోధసంరంభ సంయుక్తః రావణః ఉత్తరం అబ్రవీత్ ||
||శ్లోకార్థములు||
వైదేహీం సీతాం ఏవమ్ ఉక్త్వాతు -
వైదేహి అయిన సీతతో ఇట్లు చెప్పి
రాక్షసాధిపః రావణః -
రాక్షసాధిపుడు అగు రావణుడు
క్రోధసంరంభ సంయుక్తః -
క్రోధముతో కూడిన మాటలతో
ఉత్తరం అబ్రవీత్ - మరల ఇట్లు పలికెను
||శ్లోకతాత్పర్యము||
"వైదేహి అయిన సీతతో ఇట్లు చెప్పి ఆ రాక్షసాధిపుడు క్రోధముతో కూడిన మాటలతో మరల ఇట్లు పలికెను."||22.07||
||శ్లోకము 22.08||
ద్వౌమాసౌ రక్షితవ్యౌ మే యోఽవధిస్తే మయా కృతః|
తత శ్శయనమారోహ మమత్వం వరవర్ణినీ ||22.08||
స|| మయా తే యః అవధిః కృతః | ద్వౌ మాసౌ మే రక్షితవ్యౌ వరవర్ణినీ తతః మమ శయనం ఆరోహ ||
తిలకటీకాలో - అవధిః 'మాసాన్ ద్వాదశ భామిని', ఇత్యాఅరణ్యకాణ్డోక్తః తన్మధ్యే
ద్వౌ మాసః అవశిష్టౌ తౌ మయా రక్షిణీయౌ| యద్యపి ' వర్తతే దశమో మాసో ద్వౌ తు శేషో ప్లవఙ్గమ' ఇతి సీతా అపి వక్ష్యతి |
్
||శ్లోకార్థములు||
మయా తే యః అవధిః కృతః-
నాచేత నీకు ఏ అవధి ఇవ్వబడినదో
ద్వౌ మాసౌ మే రక్షితవ్యౌ-
రెండు మాసములు నాచేత రక్షింపబడెదవు
వరవర్ణినీ తతః మమ శయనం ఆరోహ -
ఓ సుందరాంగీ ఆ తరువాత నా శయనము ఎక్కెదవు
||శ్లోకతాత్పర్యము||
"నా చేత నీకు ఈ అవధి ఇవ్వబడుచున్నది. రెండు మాసములు నాచేత రక్షింపబడెదవు. ఓ సుందరాంగీ ఆ తరువాత నా శయనము ఎక్కెదవు."||22.08||
ఇక్కడ అవధి పన్నెండు మాసములు అని అరణ్యకాండలో చెప్పబడినది. రావణుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇంక రెండు మాసములే మిగిలాయి అని.
||శ్లోకము 22.09||
ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మా మనిచ్ఛతీమ్|
మమ త్వాం ప్రాతరాశార్థం ఆలభన్తే మహానసే ||22.09||
స|| ద్వాభ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం మాం భర్తారమ్ అనిచ్ఛతీం త్వాం మమ ప్రాతరాశార్థం మహనసే ఆలభంతే||
||శ్లోకార్థములు||
ద్వాభ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం -
రెండు నెలలు దాటిన తరువాత
మాం భర్తారమ్ అనిచ్ఛతీం త్వాం -
నన్ను భర్తగా కోరకపోతే నిన్ను
మమ ప్రాతరాశార్థం మహనసే ఆలభంతే -
నా ప్రాతఃకాలపు ఆహారముగా వంటశాలలో ఉపయోగింతురు
||శ్లోకతాత్పర్యము||
"రెండు నెలలు దాటిన తరువాత నన్ను భర్తగా కోరకపోతే నిన్ను ప్రాతఃకాలపు ఆహారముగా వంటశాలలో ఉపయోగింతురు." ||22.09||
||శ్లోకము 22.10||
తాం తర్జ్యమానాం సంప్రేక్ష్య రాక్షసేన్ద్రేణ జానకీం|
దేవగన్ధర్వకన్యాః విషేదుర్వికృతేక్షణాః||22.10||
స|| రాక్షసేంద్రేణ తర్జ్యమానం తాం జానకీం సంప్రేక్ష్య దేవగంధర్వకన్యాః వికృతేక్షణాః విషేదుః ||
||శ్లోకార్థములు||
రాక్షసేంద్రేణ తర్జ్యమానం -
రాక్షసేంద్రుని చేత ఆవిధముగా భయపెట్ట బడుతున్న
తాం జానకీం సంప్రేక్ష్య - ఆ జానకిని చూచి
దేవగంధర్వకన్యాః - దేవ గంధర్వ కన్యలు
వికృతేక్షణాః విషేదుః - దుఃఖము కలిగిన కళ్ళతో విలపించసాగిరి
||శ్లోకతాత్పర్యము||
"రాక్షసేంద్రుని చేత ఆవిధముగా భయపెట్ట బడుతున్న ఆ జానకిని చూచి దేవ గంధర్వ కన్యలు దుఃఖము కలిగిన కళ్ళతో విలపించసాగిరి."
||శ్లోకము 22.11||
ఓష్ఠప్రకారైః అపరా వక్త్రనేత్రై స్తథాఽపరే |
సీతాం ఆశ్వాసయామాసుస్తర్జితాం తేన రక్షసా||22.11||
స|| తేన రక్షసా తర్జితాం తాం సీతాం అపరాం ఔష్టప్రకారైః తథా అపరాః వక్త్రనేత్రైః ఆశ్వాసయామాసుః ||
||శ్లోకార్థములు||
తేన రక్షసా తర్జితాం తాం సీతాం -
ఆ రాక్షసునిచేత భయపెట్టబడిన సీతను
అపరాం ఔష్టప్రకారైః - కొందరు పెదవులతో
తథా అపరాః వక్త్రనేత్రైః - మరికొందరు కనుసైగలతో
ఆశ్వాసయామాసుః - ఊరడించిరి
||శ్లోకతాత్పర్యము||
"ఆ సీతాదేవిని కొందరు పెదవులతో మరికొందరు కనుసైగలతో ఊరడించిరి. ||22.11||
||శ్లోకము 22.12||
తాభిరాశ్వాసితా సీతా రావణమ్ రాక్షసాధిపమ్|
ఉవాచాత్మహితం వాక్యం వృత్త శౌణ్డీర్య గర్వితమ్|| 22.12||
స|| తాభిః ఆశ్వాసితా సీతా వృత్తశౌండీర్య గర్వితం ఆత్మహితం వాక్యం రాక్షసాధిపం రావణమ్ ఉవాచ||
||శ్లోకార్థములు||
తాభిః ఆశ్వాసితా సీతా -
వారిచేత ఆవిధముగా ఊరడింపబడిన సీత
వృత్తశౌండీర్య గర్వితం -
తనపాతివ్రత్యబలముతో గర్వముగల
ఆత్మహితం వాక్యం - హితకరమైన మాటలతో
రాక్షసాధిపం రావణమ్ ఉవాచ -
రాక్షసాధిపుడగు రావణుని తో ఇట్లు పలికెను
||శ్లోకతాత్పర్యము||
"వారిచేత ఆవిధముగా ఊరడింపబడిన సీత తనపాతివ్రత్యబలముతో గర్వముగల హితకరమైన మాటలతో ఆ రాక్షసాధిపుడగు రావణుని తో ఇట్లు పలికెను."
||శ్లోకము 22.13||
నూనం నతే జనః కశ్చిత్ అస్తి నిశ్శ్రేయసే స్థితః|
నివారయతి యో న త్వామ్ కర్మణోఽస్మాత్ విగర్హితాత్ ||22.13||
స|| నిశ్రేయసే స్థితః కశ్చిత్ జనః యో త్వాం అస్మాత్ విగర్హితాత్ కర్మణః నివారయతి న అస్తి నూనం ||
||శ్లోకార్థములు||
నిశ్రేయసే స్థితః -
నీ శ్రేయస్సులో నిలబడి
త్వాం అస్మాత్ విగర్హితాత్ కర్మణః నివారయతి -
నిన్ను ఈ గర్హించతగిన కార్యము నుంచి నివారింపగల
కశ్చిత్ జనః యో న అస్తి నూనం -
జనులు ఎవరూ ఇక్కడ తప్పకుండా లేరు
||శ్లోకతాత్పర్యము||
"నీ శ్రేయస్సులో నిలబడి నిన్ను ఈ గర్హించతగిన కార్యము నుంచి నివారింపగల వారు ఎవరూ ఇక్కడ తప్పకుండా లేరు." ||22.13||
||శ్లోకము 22.14||
మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతేః|
త్వదన్యః త్రిషు లోకేషు ప్రార్థయే న్మనసాఽపి కః||22.14||
స|| శచీపతేః శచీమివ ధర్మాత్మనః పత్నీం మాం త్రిషు లోకేషు త్వదన్యః కః మనసాదపి ప్రార్థయేత్ ||
||శ్లోకార్థములు||
శచీపతేః శచీమివ -
శచీపతి యొక్క శచిదేవి లాగా
ధర్మాత్మనః పత్నీం మాం -
ధర్మాత్ముడైన రామునకు భార్యనైన నన్ను
త్రిషు లోకేషు త్వదన్యః -
ముల్లోకములో నీవు తప్ప
కః మనసాదపి ప్రార్థయేత్ -
ఇంకెవరూ మనస్సులో కూడా వాంఛించరు
||శ్లోకతాత్పర్యము||
"శచీపతి యొక్క శచిదేవి లాగా ధర్మాత్ముడైన రామునకు భార్యనైన నన్ను ముల్లోకములో నీవు తప్ప ఇంకెవరూ మనస్సులో కూడా వాంఛించరు."
||శ్లోకము 22.15||
రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజసః|
ఉక్తవానపి యత్పాపం క్వ గత స్తస్య మోక్ష్యసే||22.15||
స|| రాక్షసాధమ అమిత తేజసః రామస్య భార్యాం యత్ పాపం ఉక్తవాన్ అసి తస్య క్వ గతః మోక్ష్యసే ||
||శ్లోకార్థములు||
రాక్షసాధమ - ఓ రాక్షసాధమ
అమిత తేజసః రామస్య భార్యాం -
అమిత తేజసుడైన రాముని భార్యకి
యత్ పాపం ఉక్తవాన్ అసి -
ఇట్టి పాపపు మాటలు చెప్పిన
తస్య క్వ గతః మోక్ష్యసే -
నీవు ఏటువంటి గతి పొందెదవో
||శ్లోకతాత్పర్యము||
".ఓ రాక్షసాధమ ! అమిత తేజసుడైన రాముని భార్యకి ఇట్టి పాపపు మాటలు చెప్పిన నీవు ఏటువంటి గతి పొందెదవో." ||22.15||
||శ్లోకము 22.16||
యథా దృప్తశ్చ మాతఙ్గః శశ శ్చ సహితో వనే|
తథా ద్విరదవద్రామస్త్వం నీచ శశవత్ స్మృతః||22.16||
స|| యుధి సదృశః దృప్తః మాతంగః శశః చ యథా , తథా రామః ద్విరవత్ త్వం నీచః శశవత్ స్మృతః ||
||శ్లోకార్థములు||
దృప్తః మాతంగఃయుధి -
మదించిన ఏనుగును యుద్ధములో
శశః చ యథా సదృశః -
ఎదిరించిన కుందేలు లాగా
తథా రామః ద్విరదవత్ -
ఏనుగువంటి రాముని
త్వం నీచః శశవత్ స్మృతః -
నిన్ను కుందేలు వలె తలచెదరు
||శ్లోకతాత్పర్యము||
" మదించిన ఏనుగును యుద్ధములో ఎదిరించిన కుందేలు లాగా, ఏనుగువంటి రాముని ఎదిరిస్తున్న నీవు చిన్న కుందేలు వని తలచెదరు." ||22.16||
||శ్లోకము 22.17||
స త్వం ఇక్ష్వాకునాథం వై క్షిపన్నిహన లజ్జసే|
చక్షుషోర్విషయం తస్య న తావ దుపగచ్ఛసి ||22.17||
స|| సః త్వం ఇక్ష్వాకునాథం క్షిపన్ న లజ్జసే తస్య చక్షోర్విషయం తావత్ న ఉపగచ్ఛసి ||
||శ్లోకార్థములు||
సః త్వం ఇక్ష్వాకునాథం -
నీవు ఇక్ష్వాకువంశ రాజైన రాముని
క్షిపన్ న లజ్జసే -
నిందించుటకు సిగ్గులేదా
తస్య చక్షోర్విషయం -
ఆయన కళ్ళ ముందరకూడా
తావత్ న ఉపగచ్ఛసి -
పోగల శక్తిలేని వాడవు
||శ్లోకతాత్పర్యము||
" నీవు ఇక్ష్వాకువంశ రాజైన రాముని నిందించుటకు సిగ్గులేదా? ఆయన కళ్ళముందర పోగల శక్తిలేని వాడవు. " ||22.17||
||శ్లోకము 22.18||
ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణపిఙ్గళే |
క్షితౌ న పతితే కస్మాన్మామనార్య నిరీక్షితః||22.18||
స|| అనార్య మామ్ నిరీక్షతః తే కౄరే విరూపే కృష్ణపింగాక్షే ఇమే నయనే కస్మాత్ న పతితే క్షితౌ||
||శ్లోకార్థములు||
అనార్య మామ్ నిరీక్షతః -
ఓ దుర్మార్గుడా నన్ను చూస్తూవున్న
తే కౄరే విరూపే ఇమే -
నీ కౄరమైన వికృతమైన ఈ
కృష్ణపింగాక్షే నయనే - ఎఱ్ఱని కళ్ళు
కస్మాత్ న పతితే క్షితౌ -
ఎందుకు భూమిపై పడుటలేదు
||శ్లోకతాత్పర్యము||
"ఓ దుర్మార్గుడా నన్ను చూస్తూవున్న నీ కౄరమైన వికృతమైన ఈ ఎఱ్ఱని కళ్ళు ఎందుకు భూమిపై పడుటలేదు?"
||శ్లోకము 22.19||
తస్య ధర్మాత్మనః పత్నీం స్నుషాం దశరథస్య చ|
కథం వ్యాహరతో మాం తేన జిహ్వా వ్యవసీర్యతే ||22.19||
స|| తస్య ( రామస్య) ధర్మాత్మనః పత్నీం దశరథస్య స్నుషా చ మాం వ్యాహరతో తేన జిహ్వా కథం న వ్యవసీర్యతే |
||శ్లోకార్థములు||
తస్య ( రామస్య) ధర్మాత్మనః పత్నీం -
ఆ ధర్మాత్ముడైన రాముని యొక్క పత్నిని
దశరథస్య స్నుషా చ - దశరథుని కోడలిని అగు
మాం వ్యాహరతో - నన్ను దుర్భాషలాడుతో
తేన జిహ్వా కథం న వ్యవసీర్యతే -
నీ నాలుక ఎందుకు తెగి క్రిందపడకున్నది
||శ్లోకతాత్పర్యము||
"ఆ ధర్మాత్ముడైన రాముని యొక్క పత్నిని, దశరథుని కోడలిని అగు నన్ను దుర్భాషలాడుతున్న నీ నాలుక ఎందుకు తెగి క్రిందపడకున్నది? ||22.19||
||శ్లోకము 22.20||
అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్|
న త్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా ||22.20||
స|| భస్మార్హ దశగ్రీవ రామస్య అసందేశాత్ తపసః అనుపాలనాత్ తేజసా త్వాం భస్మ నకుర్మి||
||శ్లోకార్థములు||
దశగ్రీవ రామస్య అసందేశాత్ -
దశకంఠుడా ! రాముని ఆనతి గల సందేశములేక
తపసః అనుపాలనాత్ -
తాపస ధర్మములను అనుసరించుటవలన
భస్మార్హ త్వాం - భస్మార్హుడవైన నిన్ను
తేజసా భస్మ నకుర్మి -
తేజస్సుతో భస్మము చేయటలేదు
||శ్లోకతాత్పర్యము||
"భస్మార్హుడవైన దశకంఠుడా ! రాముని ఆనతి గల సందేశములేక నిన్ను నా తేజస్సుతో భస్మము చేయటలేదు." ||22.20||
అంత కోపముతో మాట్లాడిన సీత ఒక మహాపతివ్రత. ఆమె తాపస్విని కూడా.
హనుమంతుని తోక అగ్నితో అంటించబడినది అని విని,"శీతోభవతు హనుమతః" అంటూ అగ్నిని అదుపులో పెట్టిన సీత. మరి అలాంటి సీత, "దగ్ధోభవ దశాననా" అంటూ రావణుని ఎందుకు దహించలేదు అని అనిపించవచ్చు. దానికి సీత చెప్పిన మాట ఇది.
"అసన్దేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ "
రెండు కారణాలు చెపుతుంది . ఒకటి తాపస ధర్మము అనుసరించి. అంటే తపస్సు చేసి సంపాదించిన శక్తి ఆ అధ్యాత్మ మార్గములో ముందు పోవడానికే. అది ఇంకో దిశలో ఉపయోగించడానికి కాదు. అలా పుపయోగిస్తే ఆ తపశ్శక్తి క్షీణించుతుంది. చేసిన తపస్సు వృథా అవుతుంది. అదే 'తపసశ్చ అనుపాలనాత్' !
రెండవకారణము - రాముని అనుమతి లేకపోవడము. రాముడు చేయవలసిన పని ఇంకొకరు చేస్తే అది రాముని కీర్తికి భంగము అని సీత ద్వారానే వింటాము. సముద్ర లంఘనము చేయగలిగిన హనుమంతుడు, రామలక్ష్మణులను తన భుజములపై వుంచుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుపోయిన హనుమంతుడు, ఒక్క క్షణములో సీతని రాముని వద్దకు చేర్చుతాననిన చెప్పిన హనుమంతునికి, సీత చెప్పిన మాట కూడా అదే. రాముని కీర్తికి అది భంగము అని. రాముని అనుమతిలేకుండా రాముడు చేయవలసిన పని తనుచేస్తే అది రాముని కీర్తికి భంగము అని.
సీత ఇంకోమాట చెపుతుంది. రావణుని వధకోసమే తన అపహరణము జరిగినది అని , లేకపోతే రాముని అంతటి వానిదగ్గరనుంచి అపహరించబడడము అనేది కాని పని ,ఇదంతా విధి అని. అందుకే రామలక్ష్మణులు లేనప్పుడు దొంగలాగ అపహరించాడు అని రావణుని నిందిస్తుంది.
||శ్లోకము 22.21||
నాపహర్తు మహం శక్యా త్వయా రామస్య ధీమతః|
విధిస్తవ వధార్ధాయ విహితో నాత్ర సంశయః ||22.21||
స|| ధీమతః రామస్య అహం త్వయా అపహర్తుం న శక్యా | తవ వధార్ధాయ విధిః అత్ర విహితః న సంశయః|||
తిలకటీకాలో - నేతి| తస్య రామస్య భార్యా త్వయా అపహర్తుం న శక్యా| అథాపి అయం విధిః అపహరణ రూప విధిః తవ వధార్థాయ దేవేన విహితః అత్ర న సంశయః||
||శ్లోకార్థములు||
ధీమతః రామస్య అహం -
ధీమంతుడైన రాముని యొక్క నేను
త్వయా అపహర్తుం న శక్యా -
నీ చేత అపహరించ బడుటకు శక్యము కాదు
తవ వధార్ధాయ - నీ చావుకు
విధిః అత్ర విహితః న సంశయః-
విధి నిర్ణయమైనది సందేహము లేకుండా
||శ్లోకతాత్పర్యము||
"ధీమంతుడైన రాముని దగ్గరనుంచి నన్ను అపహరించుటకు శక్యము కాదు. నీ వధకోసమే ఈ విధముగా జరిగినది సందేహము లేదు" ||22.21||
||శ్లోకము 22.22||
శూరేణ ధనదభ్రాత్రా బలై స్సముదితేన చ|
అపోహ్యా రామం కస్మాద్ధి దారచౌర్యం త్వయా కృతమ్||22.22||
స|| శూరేణ ధనదభ్రాత్రా బలైః సముదితేన చ త్వయా రామం అపోహ్య కస్మాత్ దారచౌర్యం కృతం |
||శ్లోకార్థములు||
శూరేణ ధనదభ్రాత్రా -
శూరుడు కుబేరుని సోదరుడు
బలైః సముదితేన చ -
బలముగలవాడిని అని చెప్పకోగల
త్వయా రామం అపోహ్య -
నీవు రాముని మోసగిచ్చి
కస్మాత్ దారచౌర్యం కృతం -
దొంగలుచేయు పని చేశావు
||శ్లోకతాత్పర్యము||
"శూరుడు కుబేరుని సోదరుడు, బలముగలవాడిని అని చెప్పకోగల నీవు రాముని మోసగిచ్చి దొంగలుచేయు పని చేశావు".
||శ్లోకము 22.23||
సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిపః|
వివృత్య నయనే క్రూరే జానకీ మన్వవైక్షత ||22.23||
స|| రావణః రాక్షసాధిపః సీతాయాః వచనమ్ శ్రుత్వా జానకీం కౄరే వివృత్యనయనే అన్వవైక్షత||
||శ్లోకార్థములు||
రావణః రాక్షసాధిపః -
రాక్షసాధిపుడైన రావణుడు
సీతాయాః వచనమ్ శ్రుత్వా -
సీతయొక్క ఆ మాటలను విని
జానకీం కౄరే వివృత్యనయనే అన్వవైక్షత -
జానకిని తన క్రూర నయనములతో చూడ సాగెను.
||శ్లోకతాత్పర్యము||
"రాక్షసాధిపుడైన రావణుడు సీతయొక్క ఆ మాటలను విని జానకిని తన క్రూర నయనములతో చూడ సాగెను." ||22.23||
||శ్లోకము 22.24||
నీలజీమూత సంకాశో మహాభుజశిరోధరః|
సింహసత్వగతిః శ్రీమాన్ దీప్తజిహ్వాగ్రలోచనః ||22.24||
స|| నీలజీమూత సంకాశః మహాభుజశిరోధరః సింహసత్వగతిః శ్రీమాన్ దీప్త జిహ్వాగ్రలోచనః |
||శ్లోకార్థములు||
నీలజీమూత సంకాశః -
నల్లని మేఘముల వలె ఉన్నాడు
మహాభుజ శిరోధరః -
మహోత్తరమైన భుజములపై తల గలవాడు
సింహసత్వగతిః -
సింహము యొక్క గతి కలవాడు
శ్రీమాన్ దీప్త జిహ్వాగ్రలోచనః -
అతని జిహ్వాగ్రము కళ్ళూ ఎఱ్ఱగావున్నాయి.
||శ్లోకతాత్పర్యము||
"ఆ రావణుడు నల్లని మేఘముల వలె ఉన్నాడు. మహోత్తరమైన భుజములపై తల గలవాడు. సింహము యొక్క గతి కలవాడు. అతని జిహ్వాగ్రము కళ్ళూ ఎఱ్ఱగావున్నాయి." ||22.24||
||శ్లోకము 22.25||
చలాగ్రమకుటప్రాంశుః చిత్రమాల్యానులేపనః|
రక్తమాల్యామ్బరధరః తప్తాంగద విభూషణః||22.25||
స|| చలాగ్రమకుటప్రాంశుః చిత్రమాల్యానులేపనః రక్తమాల్యాంబరధరః తత్సంగదవిభూషణః ||
||శ్లోకార్థములు||
చలాగ్రమకుటప్రాంశుః -
ఎత్తైన తలపై చలిస్తున్న కిరీటము గల
చిత్రమాల్యానులేపనః -
చిత్రమైనలేపములతో వున్న
రక్తమాల్యాంబరధరః -
ఎఱ్ఱని పూలమాలలతో వస్త్రములతో
తత్సంగదవిభూషణః -
అంగములపై ఆభరణములతో ఉన్నవాడు
||శ్లోకతాత్పర్యము||
"ఎత్తైన తలపైగల కిరీటము చలిస్తున్నది. చిత్రమైనలేపములతో ఎఱ్ఱని పూలమాలలతో వస్త్రములతో అంగములపై ఆభరణములతో ఉన్నాడు." ||22.25||
||శ్లోకము 22.26||
శ్రోణి సూత్రేణ మహతా మేచకేన సుసంవృతః|
అమృతోత్పాదనద్దేన భుజగేనైవ మన్దరః||22.26||
స|| అమృతోత్పాదనద్ధేన భుజగేన మన్దరః ఇవ మహతా మేచకేన శ్రోణిసూత్రేణ సుసంవృతః||
||శ్లోకార్థములు||
అమృతోత్పాదనద్ధేన -
అమృతోత్పాదనసమయములో
భుజగేన మన్దరః ఇవ -
భుజంగముతో చుట్టబడిన మందరపర్వతము వలె
మహతా మేచకేన - పెద్ద నల్లని
శ్రోణిసూత్రేణ సుసంవృతః -
మొలత్రాడుతో కట్టబడి వున్నాడు
||శ్లోకతాత్పర్యము||
"అమృతోత్పాదనసమయములో భుజంగముతో చుట్టబడిన మందరపర్వతము వలె నల్లని మొలత్రాడుతో వున్నాడు."||22.26||
||శ్లోకము 22.27||
తాభ్యాం పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః|
శుశుభేఽచలసంకాశః శృఙ్గాభ్యామివ మందరః||22.27||
స|| తాభ్యాం పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం శృంగాభ్యాం మందర ఇవ సః అచలసంకాసః రాక్షసేశ్వరః శుశుభే|| ||
||శ్లోకార్థములు||
తాభ్యాం పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం -
ఆ పరిపూర్ణమైన భుజములతో
శృంగాభ్యాం మందర ఇవ -
మందరపర్వతపు శిఖరములవలె
సః అచలసంకాసః -
అతడు పర్వతముతో సమానమైన రూపుతో
రాక్షసేశ్వరః శుశుభే -
రాక్షసేశ్వరుడు శోభించుచుండెను
||శ్లోకతాత్పర్యము||
"మందరపర్వతపు శిఖరములవలె నున్న ఆ పరిపూర్ణమైన భుజములతో పర్వతముతో సమానమైన రూపుతో ఆ రాక్షసాధిపుడు శోభించెను." ||22.27||
||శ్లోకము 22.28||
తరుణాదిత్యవర్ణాభ్యాం కుణ్డలాభ్యాం విభూషితః|
రక్తపల్లవపుష్పాభ్యాం అశోకాభ్యాం ఇవాచలః||22.28||
స|| తరుణాదిత్య వర్ణాభ్యాం కుణ్డలాభ్యాం విభూషితః రక్తపల్లవపుష్పాభ్యం అశోకాభ్యాం అచలః ఇవ||
||శ్లోకార్థములు||
తరుణాదిత్య వర్ణాభ్యాం -
ఉదయభాను వర్ణముగల
కుణ్డలాభ్యాం విభూషితః -
కుండలములములను ధరించిన
రక్తపల్లవపుష్పాభ్యం -
ఎర్రని చిగుళ్ళు పుష్పముల తో
అశోకాభ్యాం చ అచలః ఇవ -
అశోకవృక్షములతో నిండిన పర్వతము వలె
(శోభించు చున్నాడు.)
||శ్లోకతాత్పర్యము||
"ఉదయభాను వర్ణముగల కుండలములములను ధరించిన ఆ రావణుడు ఎర్రని చిగుళ్ళు కల అశోకవృక్షములతో నిండిన పర్వతము వలె శోభించు చున్నాడు" ||22.28||
||శ్లోకము 22.29||
సకల్పవృక్షప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్|
శ్మశానచైత్యప్రతిమో భూషితఽపి భయంకరః ||22.29||
స|| కల్పవృక్షప్రతిమః సః మూర్తిమాన్ వసంతః ఇవ శ్మశానచైత్యప్రతిమః భూషితః అపి భయంకరః ||
||శ్లోకార్థములు||
కల్పవృక్షప్రతిమః -
కల్పవృక్షములా వున్న
సః మూర్తిమాన్ వసంతః ఇవ -
వసంతఋతువులా శోభిల్లుతున్న ఆ రావణుడు
శ్మశానచైత్యప్రతిమః -
శ్మశాన మండపములో ని ప్రతిమ వలె
భూషితః అపి భయంకరః -
అలంకరింపబడిననూ భయంకరముగా ఉండెను
||శ్లోకతాత్పర్యము||
"కల్పవృక్షములా వున్న వసంతఋతువులా శోభిల్లుతున్న ఆ రావణుడు శ్మశాన మండపములో ని ప్రతిమ వలె భయంకరముగా ఉండెను." ||22.29||
||శ్లోకము 22.30||
అవేక్షమాణో వైదేహీం కోపసంరక్త లోచనః|
ఉవాచ రావణః సీతాం భుజఙ్గ ఇవ నిశ్శ్వసన్ ||22.30||
స|| కోపసంరక్త లోచనః రావణః వైదేహీం అవేక్షమాణః భుజంగ ఇవ నిఃశ్వసన్ సీతాం ఉవాచ||
||శ్లోకార్థములు||
కోపసంరక్త లోచనః -
కోపముతో నిండిన కనులతో
రావణః వైదేహీం అవేక్షమాణః -
రావణుడు సీతాదేవిని చూస్తూ
భుజంగ ఇవ నిఃశ్వసన్ -
పాముబుసలుకొడుతున్నట్లు ఉచ్చ్వాసనిశ్వాసములు చేస్తూ
సీతాం ఉవాచ - సీతతో ఇట్లు చెప్పెను
||శ్లోకతాత్పర్యము||
"కోపముతో నిండిన కనులతో రావణుడు సీతాదేవిని చూస్తూ పాము బుసలు కొడుతున్నట్లు ఉచ్చ్వాసనిశ్వాసములు చేస్తూ ఆ సీతాదేవి తో ఇట్లు పలికెను." ||22.30||
||శ్లోకము 22.31||
అనయేనాభిసంపన్నమ్ అర్థహీనం అనువ్రతే|
నాశయా మ్యహమద్య త్వాం సూర్యః సన్ధ్యా మివౌజసా||22.31||
స|| అనయేన అభిసంపన్నం అర్థ హీనం అనువ్రతే అద్య అహం త్వాం సూర్య ఔజసాసన్ధ్యామివ నాశయామి ||
||శ్లోకార్థములు||
అనయేన అభిసంపన్నం -
అవినీతితో కూడిన
అర్థ హీనం అనువ్రతే -
నిర్ధనుడు అయిన వానినే అనుసరించే
అద్య అహం త్వాం -
ఇప్పుడు నేను నిన్ను
సూర్య ఔజసా సన్ధ్యామివ నాశయామి -
సూర్యుడు తన తేజస్సుతో సంధ్యని రూపుమాపిన రీతి రూపుమాపెదను
||శ్లోకతాత్పర్యము||
"ఓ సీతా నీతిమాలినవాడు నిర్ధనుడు అయిన ఆ రామునే అనుసరించే నిన్ను ఇప్పుడు సూర్యుడు తన తేజస్సుతో సంధ్యని రూపుమాపిన రీతి రూపుమాపెదను." ||22.31||
||శ్లోకము 22.32||
ఇత్యుక్త్వా మైథిలీం రాజ రావణః శత్రు రావణః|
సందిదేశ తతః సర్వా రాక్షసీర్ఘోరదర్శనాః||22.32||
స|| రావణః రాజా శత్రురావణః మైథిలీం ఇతి ఉక్త్వా తతః ఘోరదర్శనాః రాక్షసీః సందిదేశ||
||శ్లోకార్థములు||
రావణః రాజా శత్రురావణః -
శత్రువులను పీడించు రాజగు రావణుడు
మైథిలీం ఇతి ఉక్త్వా - మైథిలికి ఇట్లు చెప్పి
తతః ఘోరదర్శనాః రాక్షసీః -
అప్పుడు ఘోరమైన రూపముగల ఆ రాక్షస స్త్రీలకు
సందిదేశ - ఇలా అదేశించెను
||శ్లోకతాత్పర్యము||
"శత్రువులను పీడించు రావణుడు మైథిలికి ఇట్లు చెప్పి అప్పుడు ఘోరమైన రూపముగల ఆ రాక్షస స్త్రీలకు ఇలా అదేశించెను." ||22.32||
||శ్లోకము 22.33||
ఏకాక్షీం ఏకకర్ణాం చ కర్ణప్రావరణం తథా|
గోకర్ణీం హస్తికర్ణీం చ లమ్బకర్ణీం అకర్ణికామ్ ||22.33||
స|| ఏకాక్షీం ఏకకర్ణాం తథా కర్ణప్రావరణం చ గోకర్ణీం హస్తికర్ణీం లంబకర్ణీం అకర్ణికామ్ చ||
||శ్లోకార్థములు||
ఏకాక్షీం ఏకకర్ణాం -
ఒకే కన్ను, ఒకే చెవు
తథా కర్ణప్రావరణం చ -
అలాగే విస్తరించిన చెవి గలవారు
గోకర్ణీం హస్తికర్ణీం -
అవు ఏనుగల చెవులవంటి చెవులు గలవారు
లంబకర్ణీం అకర్ణికామ్ చ -
పొడుగాటి చెవులు కలవారు, చెవులు లేనివారు
||శ్లోకతాత్పర్యము||
"ఆ రాక్షస స్త్రీలు ఓకే కన్ను, ఒకే చెవు, అలాగే విస్తరించిన చెవి గలవారు. అవు ఏనుగల చెవులవంటి చెవులు గలవారు. పొడుగాటి చెవులు కలవారు". ||22.33||
||శ్లోకము 22.34||
హస్తి పాద్యశ్వపాద్యౌ చ గోపాదీం పాదచూళికమ్|
ఏకాక్షీం ఏకపాదీం చ పృథుపాదీం అపాదికామ్ ||22.34||
స|| హస్తిపాద్యః అశ్వపాద్యః గోపాదీం పాదచూళీకాం చ ఏకాక్షీం ఏకపాదీం పృథుపాదీం అపాదికాం చ||
||శ్లోకార్థములు||
హస్తిపాద్యః అశ్వపాద్యః -
ఏనుగ పాదములు అశ్వపు పాదములు కలవారు
గోపాదీం పాదచూళీకాం చ -
గోపాదములు , పాదములపై వెంట్రుకలు కలవారు
ఏకాక్షీం ఏకపాదీం -
ఒకే కన్ను, ఒకే పాదము కలవారు
పృథుపాదీం అపాదికాం చ -
అనేక పాదములు , పాదములు లేని వారు కలరు
||శ్లోకతాత్పర్యము||
"ఆ రాక్షస స్త్రీలు ఏనుగ పాదములు అశ్వపు పాదములు గోపాదములు , పాదములపై వెంట్రుకలు కలవారు. వారిలో ఒకే కన్ను, ఒకే పాదము , అనేక పాదములు , పాదములు లేని వారు కలరు. " ||22.34||
||శ్లోకము 22.35||
అతిమాత్ర శిరో గ్రీవాం అతిమాత్ర కుచోదరీమ్|
అతిమాత్రస్య నేత్రాం చ దీర్ఘజిహ్వాం అజిహ్వికామ్ ||22.35||
అనాశికాం సింహముఖీం గోముఖీం సూకరీముఖీమ్|
స|| అతిమాత్ర శిరోగ్రీవాం అతిమాత్ర కుచోదరీం అతిమాత్రస్య నేత్రాం చ దీర్ఘజిహ్వాం అజిహ్వికాం చ అనాసికాం సింహముఖీం గోముఖీం సూకరీముఖీం చ|
||శ్లోకార్థములు||
అతిమాత్ర శిరోగ్రీవాం -
పెద్దతలవున్నవారు
అతిమాత్ర కుచోదరీం -
పెద్ద కుచములు పొట్ట కల వారు
అతిమాత్రస్య నేత్రాం చ -
పెద్దకళ్ళు కలవారు
దీర్ఘజిహ్వాం అజిహ్వికాం చ -
పొడువైన నాలుక ,నాలుక లేనివారు
అనాసికాం సింహముఖీం -
ముక్కు లేనివారు, సింహపు ముఖము కలవారు
గోముఖీం సూకరీముఖీం చ -
గోముఖము సూకరీ ముఖము గలవారు
||శ్లోకతాత్పర్యము||
"వారిలో పెద్దతలవున్నవారు, పెద్దస్తనములు గలవారు. పెద్దకళ్ళు పొడువైన నాలుక నలుక లేనివారు గలరు. వారిలో ముక్కు లేనివారు, సింహపు ముఖము గోముఖము సూకరీ ముఖము గలవారు కలరు." ||22.35||
||శ్లోకము 22.36||
యథా మద్వశగా సీతా క్షిప్రం భవతి జానకీ ||22.36||
తథా కురుత రాక్షస్యః సర్వాం క్షిప్రం సమేత్య చ|
స|| రాక్షస్యః సర్వాః క్షిప్రం సమేత్య జానకీ సీతా క్షిప్రం యథా మద్వశగా భవతి తథా కురుత||
||శ్లోకార్థములు||
రాక్షస్యః సర్వాః క్షిప్రం సమేత్య -
ఓ రాక్షస్త్రీలారా ! వెంటనే మీరందరూ కలిసి
జానకీ సీతా క్షిప్రం యథా -
జానకీ తొందరగా సీత ఎలాగా
మద్వశగా భవతి తథా కురుత -
నా వశము అగునో ఆ విధముగా చేయుడు
||శ్లోకతాత్పర్యము||
"ఓ రాక్షస్త్రీలారా ! వేంటనే మీరందరూ కలిసి ఈ జానకీ సీత తొందరగా ఎలాగా నా వశము అగునో ఆ విధముగా చేయుడు." ||22.36||
||శ్లోకము 22.37||
ప్రతిలోమాను లోమైశ్చ సామదానాది భేదనైః ||22.37||
అవర్జయత వైదేహీం దణ్డస్యోద్యమనేనచ|
స|| ప్రతిలోమానులోమైశ్చ సామదానాదిభేదనైః దణ్డస్య ఉద్యమానేన వైదేహీం అవర్జయత||
గోవిన్దరాజులవారి టీకాలో - ప్రతిలోమానులోమైః ప్రతికూల అనుకూల చరణైః|
||శ్లోకార్థములు||
ప్రతిలోమానులోమైశ్చ -
మంచిమాటలతో గాని దానికి విరుద్ధముగా కాని
సామదానాదిభేదనైః -
సామదాన భేదములతో గాని
దణ్డస్య ఉద్యమానేన -
దండముతో గాని
వైదేహీం అవర్జయత -
వైదేహిని జయించుడు
||శ్లోకతాత్పర్యము||
"మంచిమాటలతో గాని దానికి విరుద్ధముగా కాని, సామదాన భేదములతో గాని, దండముతో గాని, ఈ వైదేహిని జయించుడు." ||22.37||
||శ్లోకము 22.38||
ఇతి ప్రతిసమాదిశ్య రాక్షసేన్ద్రః పునః పునః||22.38||
కామమన్యుపరీతాత్మా జానకీం పర్యతర్జయత్|
స|| రాక్షసేంద్రః పునః పునః ఇతి ప్రతిసమాసాద్య కామమన్యుపరీతాత్మా జానకీం పర్యతర్జయత్ ||
||శ్లోకార్థములు||
రాక్షసేంద్రః పునః పునః -
ఆ రాక్షసరాజు ఇలా మరల మరల
ఇతి ప్రతిసమాసాద్య - మరల ఆదేశము ఇచ్చి
కామమన్యుపరీతాత్మా -
కామక్రోధములతో మండిపోతూ
జానకీం పర్యతర్జయత్ -
జానకిని మళ్ళీ భయపెట్టెను
||శ్లోకతాత్పర్యము||
" ఆ రాక్షసరాజు ఇలా మరల మరల ఆదేశము ఇచ్చి కామక్రోధములతో మండిపోతూ జానకిని మళ్ళీ భయపెట్టెను.||22.38||
||శ్లోకము 22.39||
ఉపగమ్య తతః క్షిప్రం రాక్షసీ ధాన్యమాలినీ||22.39||
పరిష్వజ్య దశగ్రీవం ఇదం వచనమబ్రవీత్|
స|| తతః ధాన్యమాలినీ రాక్షసీ శీఘ్రం ఉపగమ్య దశగ్రీవం పరిష్వజ్య ఇదం వచనం అబ్రవీత్||
||శ్లోకార్థములు||
తతః ధాన్యమాలినీ రాక్షసీ -
అప్పుడు ధ్యానమాలినీ అనబడు రాక్షసి
శీఘ్రం ఉపగమ్య - త్వరగా ముందుకువచ్చి
దశగ్రీవం పరిష్వజ్య - ఆ దశగ్రీవుని కౌగలించుకొని
ఇదం వచనం అబ్రవీత్ - ఈ మాటలు చెప్పెను
||శ్లోకతాత్పర్యము||
"అప్పుడు ధ్యానమాలినీ అనబడు రాక్షసి త్వరగా ముందుకువచ్చి ఆ దశగ్రీవుని కౌగలించుకొని ఈ మాటలు చెప్పెను."||22.39||
||శ్లోకము 22.40||
మయాక్రీడ మహారాజ సీతయా కిం తవానయా ||22.40||
వివర్ణయా కృపణయా మానుష్యా రాక్షసేశ్వర|
స|| మహారాజ మయా క్రీడ| రాక్షసేశ్వర వివర్ణయా కృపణయా మానుష్యా అనయా సీతయా తవ కిం ||
||శ్లోకార్థములు||
మహారాజ మయా క్రీడ -
ఓ మహారాజా నాతో క్రీడించుము
రాక్షసేశ్వర వివర్ణయా -
ఓ రాక్షసేశ్వరా! శోభనుకోల్పోయి
కృపణయా మానుష్యా -
దీనస్థితిలో వున్న మానవకాంత అయిన
అనయా సీతయా తవ కిం - ఈ సీతతో నీకేమి పని
||శ్లోకతాత్పర్యము||
" ఓ మహారాజా నాతో క్రీడించుము. ఓ రాక్షసేశ్వరా! శోభనుకోల్పోయి దీనస్థితిలోవున్న మానవకాంత అయిన ఈ సీతతో నీకేమి పని." ||22.40||
||శ్లోకము 22.41||
నూనం అస్యా మహారాజ న దివ్యాన్ భోగసత్తమాన్ ||22.41||
విదదధాత్యమరశ్రేష్ఠః తవ బాహుబలార్జితాన్|
స|| మహారాజ అమరశ్రేష్ఠః తవ బాహుబలార్జితాన్ దివ్యాన్ భోగసత్తమాన్ అస్యాః నూనం న విదధాతి ||
||శ్లోకార్థములు||
మహారాజ అమరశ్రేష్ఠః -
ఓ మహారాజా అమరశ్రేష్ఠమైన
తవ బాహుబలార్జితాన్ -
నీ బాహు బలములతో సంపాదింప బడిన
దివ్యాన్ భోగసత్తమాన్ -
ఈ దివ్యమైన భోగములు
అస్యాః నూనం న విదధాతి -
ఈమెకు తప్పక రాసిపెట్టి లేవు
||శ్లోకతాత్పర్యము||
" ఓ మహారాజా అమరశ్రేష్ఠమైన నీ బాహు బలములతో సంపాదింప బడిన ఈ దివ్యమైన భోగములు ఈమెకు తప్పక రాసిపెట్టి లేవు". ||22.41||
||శ్లోకము 22.42||
అకామం కామయానస్య శరీరముపతప్యతే||22.42||
ఇచ్ఛన్తీం కామయానస్య ప్రీతిర్భవతి శోభనా|
స|| అకామాం కామయానస్య శరీరం ఉపతప్యతే ఇచ్ఛంతీం కామయానస్య శోభనా ప్రీతిః భవతి ||
||శ్లోకార్థములు||
అకామాం కామయానస్య -
ప్రేమించని దానిని ప్రేమించినచో
శరీరం ఉపతప్యతే -
శరీరతాపమే మిగులును
ఇచ్ఛంతీం కామయానస్య -
కోరినదానిని ప్రేమించినచో
శోభనా ప్రీతిః భవతి -
శోభనముగా ప్రీతి లభించును."
||శ్లోకతాత్పర్యము||
"ప్రేమించని దానిని ప్రేమించినచో శరీరతాపమే మిగులును. కోరినదానిని ప్రేమించినచో శోభనముగా ప్రీతి లభించును." ||22.42||
||శ్లోకము 22.43||
ఏవముక్తస్తు రాక్షస్యా సముత్‍క్షిప్త స్తతో బలీ ||22.43||
ప్రహసన్మేఘ సఙ్కాశో రాక్షసః స న్యవర్తత|
స|| రాక్షస్యా ఏవముక్తః బలీ మేఘసంకాశః సః రాక్షసః తతః సముత్‍క్షిప్తః ప్రహసన్ న్యవర్తత||
||శ్లోకార్థములు||
రాక్షస్యా ఏవముక్తః -
ఆ రాక్షసిచేత ఈ విధముగా చెప్పబడిన
బలీ మేఘసంకాశః -
బలవంతుడు మేఘము వలెనున్న
సః రాక్షసః సముత్‍క్షిప్తః -
ఆ రాక్షసుడు అప్పుడు వెనుకకి తిరిగి
తతః ప్రహసన్ న్యవర్తత -
అచటినుండి నవ్వుకొనుచూ వెళ్ళిపోయెను
||శ్లోకతాత్పర్యము||
"ఆ రాక్షసిచేత ఈ విధముగా చెప్పబడిన బలవంతుడు మేఘము వలెనున్న ఆ రాక్షసుడు అప్పుడు నవ్వుకొనుచూ అచటినుండి వెళ్ళిపోయెను." ||22.43||
||శ్లోకము 22.44||
ప్రస్థితః స దశగ్రీవః కంపయన్నివ మేదినీమ్||22.44||
జ్వలద్భాస్కరవర్ణాభాం ప్రవివేశ నివేశనమ్|
స|| సః దశగ్రీవః మేదినీం కంపయన్నివ ప్రస్థితః జ్వలదభాస్కరవర్ణాభమ్ నివేశనమ్ ప్రవివేశ||
||శ్లోకార్థములు||
సః దశగ్రీవః - ఆ దశగ్రీవుడు
మేదినీం కంపయన్నివ ప్రస్థితః -
భూమిని కంపిస్తున్నట్లు నడుస్తూ
జ్వలదభాస్కరవర్ణాభమ్ -
మధ్యాహ్నపు సూర్యుని భాతి ప్రకాశిస్తున్న
నివేశనమ్ ప్రవివేశ - భవనమును ప్రవేశించెను
||శ్లోకతాత్పర్యము||
"ఆ దశగ్రీవుడు భూమిని కంపిస్తున్నట్లు నడుస్తూ మధ్యాహ్నపు సూర్యుని భాతి ప్రకాశిస్తున్న తన భవనమును ప్రవేశించెను." ||22.44||
||శ్లోకము 22.45||
దేవగన్ధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః|
పరివార్య దశగ్రీవం వివిశు స్తం గృహోత్తమమ్ ||22.45||
స|| దేవగంధర్వకన్యాః చ నాగకన్యాః చ సర్వతః దశగ్రీవం పరివార్య తం గృహోత్తమం వివిశుః||
||శ్లోకార్థములు||
దేవగంధర్వకన్యాః చ నాగకన్యాః చ -
దేవ గంధర్వ కన్యలు నాగ కన్యలు కూడా
సర్వతః దశగ్రీవం పరివార్య -
ఆ దశగ్రీవునితో కూడి
తం గృహోత్తమం వివిశుః -
ఆ ఉత్తమమైన గృహములో ప్రవేశించిరి.
||శ్లోకతాత్పర్యము||
"దేవ గంధర్వ కన్యలు నాగ కన్యలు కూడా ఆ దశగ్రీవునితో కూడి ఆ ఉత్తమమైన గృహములో ప్రవేశించిరి."||22.45||
||శ్లోకము 22.46||
స మైథిలీం ధర్మపరాం అవస్థితామ్
ప్రవేపమానాం పరిభర్త్స్య రావణః|
విహాయసీతాం మదనేన మోహితః
స్వమేవ వేశ్మ ప్రవివేశ భాస్వరమ్||22.46||
స|| సః రావణః ధర్మపరాం అవస్థితాం ప్రవేపమానాం మైథిలీం పరిభర్త్స్య సీతాం విహాయ మదనేన మోహితః భాస్వరం స్వం వేశ్మేవప్రవివేశ||
||శ్లోకార్థములు||
ధర్మపరాం అవస్థితాం -
ధర్మపరాయణ అయిన
ప్రవేపమానాం మైథిలీం పరిభర్త్స్య-
భయముతో వణికి పోతున్న మైథిలిని భయపెట్టి
మదనేన మోహితః సః రావణః -
మదనకామముతో మోహితుడైన ఆ రావణుడు
సీతాం విహాయ - సీతను వదిలి
భాస్వరం స్వం వేశ్మేవప్రవివేశ -
తన శోభాయమైన భవనమును ప్రవేశించెను
||శ్లోకతాత్పర్యము||
"ధర్మపరాయణ అయిన భయముతో వణికి పోతున్న మైథిలిని భయపెట్టి మదనకామముతో మోహితుడైన ఆ రావణుడు సీతను వదిలి తన శోభాయమైన భవనమును ప్రవేశించెను." ||22.46||
ఈ శ్లోకముతో ఇరువది రెండవ సర్గ సమాప్తము.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్వావింశస్సర్గః||
|| ఓమ్ తత్ సత్||