||సుందరకాండ ||

||ముప్పది ఆరవ సర సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 36 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ షట్ర్త్రింశస్సర్గః'

విశ్వాసము కలిగించు హనుమంతుని మాటలు వినిన సీత, -"ముమోచ ఆనందజం జలమ్" అంటే ఆనందముతో కూడిన కళ్ళనీళ్ళను విడిచెను, అని ముప్పది ఐదవ సర్గలో వింటాము.

ఈ సర్గలో అదే విశ్వాసము పెంపొందించడము కోసము హనుమ రామనామాంకిత అంగుళీయకము సీతమ్మకి ఇవడమే ఈ సర్గలో ముఖ్యమైన ఘట్టము.

ఇక ముప్పదై ఆరవ సర్గలో శ్లోకాలు

||శ్లోకము 36.01||

భూయ ఏవ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః|
అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం సీతా ప్రత్యయకారణాత్||36.01||

స||మహాతేజా హనుమాన్ మారుతాత్మజః భూయః సీతా ప్రత్యయకారణాత్ ప్రశ్రితం వాక్యం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

మహాతేజా మారుతాత్మజః హనుమాన్ -
మహాతేజోవంతుడైన మారుతాత్మజుడగు హనుమంతుడు
భూయః సీతా ప్రత్యయకారణాత్ -
మరల సీతాదేవికి మరింత నమ్మకము కలిగించుటకు
ప్రశ్రితం వాక్యం అబ్రవీత్ -
వినయముగా ఈ వాక్యములను చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"మహాతేజోవంతుడైన మారుతాత్మజుడగు హనుమంతుడు సీతాదేవికి మరింత నమ్మకము కలిగించుటకు మరల చెప్పెను."||36.01||

||శ్లోకము 36.02||

వానరోఽహం మహభాగే దూతో రామస్య ధీమతః|
రామానామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకమ్||36.02||

స|| హే మహాభాగే ! అహం వానరః | ధీమతః రామస్య దూతః| దేవి పశ్య చ ఇదం రామనామాంకితం అంగుళీయకం||

||శ్లోకార్థములు||

హే మహాభాగే ! అహం వానరః-
ఓ మహాదేవి నేను వానరుడను
ధీమతః రామస్య దూతః-
ధీమంతుడైన రాముని దూతను
దేవి ఇదం రామనామాంకితం అంగుళీయకం-
ఓ దేవి ఈ రామనామాంకితమైన అంగుళీయకము
పశ్య చ - చూడుము కూడా

||శ్లోకతాత్పర్యము||

"ఓ మహాదేవి నేను వానరుడను. ధీమంతుడైన రాముని దూతను. ఓ దేవి చూడుము ఇది రామనామాంకితమైన అంగుళీయకము." ||36.02||

ఈ శ్లోకము చదివి, రామునకు అర్ఘ్యపాద్యములను హారతి ఇచ్చి తరువాత పారాయణ చేయవలెను అంటారు పెద్దలు. అంటే ఈ శ్లోకము సుందరకాండ పారాయణము ప్రారంభములో,
జరిగే పూజలో చదవ వలసిన శ్లోకము అన్నమాట.

ఈ శ్లోకములో హనుమ సీతమ్మకి రామనామాంకితమైన వుంగరము సమర్పిస్తాడు. అలా వుంగరము ఇవ్వడములో ముముక్షువునకు మార్గము చూపు ఆచార్యస్వరూపము గోచరిస్తుంది.

ముముక్షువు ముందుగా భగవత్ కథను వినవలెను. తరువాత భగవంతుని దివ్యమంగళ విగ్రహసౌందర్యమును గుణములను ఎఱుంగవలయును. వానిచే ఆకృష్టుడైనవానికి భగవంతుని పైన, ఆ అనుభవము కలిగించిన ఆచార్యులపైన ప్రీతికలుగును. ఆ విధముగా ముముక్షువు ప్రీతితో భగవంతుని అభిముఖమైన తరువాత, ముముక్షువునకు భగవంతునిపై ప్రీతి కలిగినదని గ్రహించిన ఆచార్యుడు, తన స్వరూపమును తన వృత్తాంతమును శిష్యునకు ఎఱింగించును. భగవదనుభూతి తనకెట్లు కలిగినది, భగవదనుగ్రహము తనకు ఎట్లు లభించినది అను విషయములను శిష్యునకు ఎఱింగించును. శిష్యునకు పరిపూర్ణమైన విశ్వాసము ఏర్పడిన తరువాత, భగవదనుగ్రహముచే లభించిన మంత్రము ఆచార్యుడు శిష్యునకు అందించును. మంత్రముచెప్పడము అంటే జ్ఞానోపదేశమే. ఇది ఆచార్య శిష్యుల జ్ఞానోపదేశ క్రమము.

సీతకు రామనామాంకిత అంగుళీయ ప్రదానాములో హనుమ ఈ క్రమమునే పాటించెను.

హనుమ చెట్టుపైనుండి చాలాసేపు సీతమ్మను పరీక్షించును. తరువాత సీతా రావణసంవాదమై ఆర్తితో సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడినప్పుడు, హనుమ రామకథను వినిపించెను. తరువాత సీతమ్మకి కనపడి, రాముని దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును ఆత్మగుణములను వర్ణించెను. తరువాత తమకు రామునితో కలిగిన పరిచయమువివరించెను. అప్పుడు సీతకు పూర్తిగా నమ్మకము కలిగినది. అప్పుడు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన శిష్యునకు, భగదనుగ్రహముచే లభించిన మంత్రమును ఆచార్యుడు ఒసంగినట్లు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన సీతకు హనుమ రామనామాంకితమైన ఉంగరము సమర్పించెను. అంటే ఆ రామనామాంకిత అంగుళీయకమే మంత్రము ఇక్కడ.

నమ్మకము కలిగించుటకు రామనామాంకిత ఉంగరము నీయవలసిన అవసరము లేదు. నమ్మకము కలిగించుటకు ఉంగరము ముందే ఇచ్చివుండవచ్చు కూడా. కాని హనుమ అలా చేయలేదు. ఇక్కడ శిష్యునకు జ్ఞానము ఉపదేశించుటలోని క్రమమునే హనుమ ప్రదర్శించెను.

ఈ శ్లోకము మొదటిలోనే "వానరోఽహం" అంటూ మొదలెడతాడు. అంటే 'నేను వానరుడను' అని. వానరః అనే మాటలో నరుడి వా ? అన్న ధ్వని వినిపిస్తుంది. భగవదనుగ్రహ పాత్రులగు మహాపురుషులే వానరులు. ముందుగా భగవదనుగ్రహముచే జ్ఞానము పొందిన హనుమ, తను ఈ శరీరమునందున్నవాడని చెప్పెను.

హనుమ సీతమ్మను మహాభాగే అని సంబోధించెను. అంటే భగవదనుగ్రహపాత్రురాలగుట అనెడి మహా అదృష్టము కలది సీత అని. భగవదనుగ్రహము ప్రసరించిన వానికే ఆచార్యుడు లభించును. కావున ఆచార్యుడు లభించిన శిష్యుడు మహాభాగ్యశాలి. అదే సీతమ్మను - 'మహాభాగే' అనడములో విశేషము.

ఆచార్యుడు భగవంతుని సందేశమును ముముక్షువు అగు శిష్యునకు - జీవునకు అందించును. ఇక్కడ ఆచార్యుడు దూత. హనుమ కూడా దూత . ఎవరి దూత? 'రామస్య ధీమతః'- ధీమంతు డైన రామునకు దూత. రామ అనుటచే ఆనంద స్వరూపుడని, ధీమాన్ అంటే జ్ఞానగుణకుడుఅని అంటే జ్ఞానానందస్వరూపుడగు వాని దూత అని. జ్ఞానానంద స్వరూపుడు అంటే పరమాత్మ. ఆంటే పరమాత్మ యొక్క దూత అని కూడా ధ్వని వస్తుంది.

భగవదనుగ్రహముచే పొందిన మంత్రమును, ఆచార్యుడు శిష్యునకు ఉపదేశానుసారముగా సమర్పించును. అదే క్రమము పాటించిన హనుమ, రామానుగ్రహముచే పొందిన రామానామాంకిత ఉంగరమును సీతా దేవికి సమర్పించును.

ఆచార్య శిష్య క్రమములో ఆచార్యుడొసగిన మంత్రమే భగవత్ సాక్షాత్కారము చేయు సాధనము. ఆ మంత్రమే భగవంతుడే రక్షకుడు అను జ్ఞానమును ప్రసాదించును. ఆ మంత్రమే భగవత్ అనుభూతిని కలిగించును. ఆ మంత్రము ద్వారా దుఃఖములు పోవును.

సీతకు ఆ రామనామాంకిత ఉంగరము చూచిన వెంటనే రాముడే సాక్షాత్కారముగా తన ఎదుట వున్నాడా అని అనిపించెను. ఉంగరము రామునిచే ఒసంగబడినది. హనుమంతుని చే తేబడినది. అది సీతమ్మకి ఒసంగబడినది. ముముక్షువునకు మంత్రము లభించగా దుఃఖములు పోవు రీతిన సీతమ్మకు ఉంగరము లభించినంతనే ఓదార్పు లభించును.

ఇదే ఆ శ్లోకము లో కూడా మనము వింటాము.

||శ్లోకము 36.03||

ప్రత్యయార్థం తవాఽఽనీతం తేన దత్తం మహాత్మనా|
సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి||36.03||

స|| మహాత్మనా తేన దత్తం తవ ప్రత్యయార్థం అనీతం సమాశ్వసి హి | (తవ) దుఃఖఫలా క్షీణం అసి | భద్రం తే||

||శ్లోకార్థములు||

మహాత్మనా తేన దత్తం -
మహాత్ముడగు అయనచేత ఇవ్వబడినది
తవ ప్రత్యయార్థం అనీతం -
నీకు విశ్వాసము కలిగించుటకు తీసుకు రాబడినది
సమాశ్వసి హి -
శాంత పడుము
(తవ) దుఃఖఫలా క్షీణం అసి-
నీ దుఃఖములన్నీ క్షీణించిపోగాక
భద్రం తే-
నీకు శుభము అగుగాక

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాత్ముడు నీకు విశ్వాసము కలిగించుటకు దీనిని ఇచ్చెను. నీ దుఃఖములన్నీ క్షీణించిపోగాక. నీకు శుభము అగుగాక". ||36.03||

||శ్లోకము 36.04||

ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై సీతాయై వానరోత్తమః|
గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుః కరవిభూషణమ్||
భర్తారమివ సంప్రాప్తా జానకీ ముదితాఽ భవత్||36.04||

స|| వానరః ఇతి ఉక్త్వా సీతాయై తస్యై భర్తుః కరవిభూషణం ప్రదదౌ |సా జానకీ తత్ గృహీత్వా ప్రేక్షమాణా భర్తారం సంప్రాప్తా ఇవ ముదితా భవత్||

||శ్లోకార్థములు||

వానరః ఇతి ఉక్త్వా -
వానరుడు ఈ విధముగా చెప్పి
సీతాయై తస్యై భర్తుః కరవిభూషణం ప్రదదౌ -
సీతాదేవికి తన భర్త చేతి ఆభరణమును ప్రసాదించెను
సా జానకీ తత్ గృహీత్వా -
ఆ జానకి ఆ అంగుళీయకము తీసుకొని
ప్రేక్షమాణా భర్తారం సంప్రాప్తా ఇవ -
భర్తనే పొందినట్లు
ముదితా భవత్ -
సంతోషపడెను

||శ్లోకతాత్పర్యము||

"వానరుడు ఈ విధముగా చెప్పి సీతాదేవికి తన భర్త చేతి ఆభరణమును ప్రసాదించెను. అప్పుడు ఆ జానకి ఆ అంగుళీయకము తీసుకొని భర్తనే పొందినట్లు సంతోషపడెను." ||36.04||

ఆ కరవిభూషణము అంటే వుంగరము. ఆ వుంగరము "గృహీత్వా" అంటే తీసుకొని , జానకి భర్తనే పొందినదా అనే అనుభూతి పొందినది.

కర విభూషణము అనడములో ధ్వని, కరము గురించి. కరము అంటే హస్తము, పనిచేయుటకు సాయపడునది. భగవంతుని కరము సూచించేది రక్షణ. అది జగద్రక్షణ. జగద్రక్షణ చేయునది పరమాత్మయే. కరవిభూషణము అనే మంత్రము ద్వారా పరమాత్మయే రక్షకుడను జ్ఞానము కలుగును.

సృష్టి స్ఠితి లయములు మూడును జగద్రక్షణయే. ఈ మూడు చేయు పరమాత్మయే జగద్రక్షకుడు అను జ్ఞానము కలుగుటకు సాధనము ఏమిటి? ఆచార్యుడు ఒసంగిన మంత్రమే ఇందుకు సాయపడును.

ఓమ్ నమో నారాయణాయ అనే మంత్రములోని ప్రణవము ఓం కారము. ప్రణవము జీవుడు పరమాత్మకే చెందిన వాడు అను అర్థమును సూచించును. దాని వివరణ "నమో నారాయణాయ" అను మిగిలిన మంత్రము. పరమాత్మ ఒసగే రక్షకత్వమును గ్రహించి, ఆ పరమాత్మమీదే భారము వేయుట మంత్రము లభించిననాడు లభించును. ఆ మంత్రము మననము చేయగా మానసికముగా భగవంతుడు కనపడినట్లే అగును. దాని వలన ఆనందము లభించును.

కరవిభూషణమైన ఆ అంగుళీయకము లభించగనే సీతమ్మ ఆనందభరితురాలయెను.

||శ్లోకము 36.05||

చారుతద్వదనం తస్యా స్తామ్రశుక్లాయ తేక్షణమ్|
అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడ్డురాట్||36.05||

స||తస్యాః విశాలాక్ష్యాః చారు వదనం తామ్రశుక్లాయతేక్షణం రాహుముక్త ఇవోడ్డురాట్ అశోభత ||

||శ్లోకార్థములు||

తస్యాః విశాలాక్ష్యాః చారు వదనం -
ఆ విశాలాక్షియొక్క అందమైన వదనము
తామ్రశుక్లాయతేక్షణం -
ఎఱ్ఱని కళ్ళతో
రాహుముక్త ఇవోడ్డురాట్ -
రాహుముఖమునుండి విడివడిన చంద్రుని వలె
అశోభత - శోభించెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ విశాలాక్షియొక్క ఎఱ్ఱని కళ్ళు గల అందమైన వదనము రాహుముఖమునుండి విడివడిన చంద్రుని వలె శోభించెను." ||36.05||

||శ్లోకము 36.06||

తతస్సా హ్రీమతీ బాలా భర్తృసందేశహర్షితా|
పరితుష్టా ప్రియం కృత్వా ప్రశశంస మహాకపిమ్||36.06||

స||తతః సా బాలా భర్తృసందేశ హర్షితా హ్రీమతీ పరితుష్టా ప్రియం కృత్వా మహాకపిం ప్రశశంస ||

||శ్లోకార్థములు||

తతః సా బాలా - అప్పుడు ఆమె
భర్తృసందేశ హర్షితా - భర్త సందేశముతో హర్షితురాలై
హ్రీమతీ పరితుష్టా- లజ్జాంకిత హర్షముతో
ప్రియం కృత్వా - ఆదరముతో
మహాకపిం ప్రశశంస - ఆ మహాకపిని ప్రశంశించెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆమె భర్త సందేశముతో హర్షితురాలై స్త్రీలకు సహజమైన లజ్జాంకిత హర్షములో ఆదరముగా ఆ మహాకపిని ప్రశంశించెను." ||36.06||

తిలక టీకాలో - విక్రాన్తః శూరః| సమర్థో దేశకాలోఽచితకృత్య చతురః| ప్రాజ్ఞో ధర్మార్థ విషయక సర్వ శాస్త్రార్థ తత్వజ్ఞః||

||శ్లోకము 36.07||

విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ|
యే నేదం రాక్షపదం త్వయైకేన ప్రధర్షితమ్||36.07||

స|| వానరోత్తమా ఏకేన యేన త్వయా ఇదం రాక్షస పదం ప్రదర్షితం త్వం విక్రాంతః | త్వం సమర్థః | త్వం ప్రాజ్ఞః ||

||శ్లోకార్థములు||

వానరోత్తమా ఏకేన యేన త్వయా - ఓ వానరోత్తమా నీవు ఒక్కడి చేతనే
ఇదం రాక్షస పదం ప్రదర్షితం - దుర్భేద్యమైన ఈ రాక్షసపదమునకు చెరితివి
త్వం విక్రాంతః - నీవు విక్రాంతుడవు
త్వం సమర్థః -నీవు సమర్థుడవు.
త్వం ప్రాజ్ఞః - నీవు ప్రాజ్ఞుడవు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరోత్తమా నీవు ఒక్కడివే దుర్భేద్యమైన ఈ రాక్షసపదమునకు చెరితివి. నీవు విక్రాంతుడవు. సమర్థుడవు. ప్రాజ్ఞుడవు." ||36.07||

రామనామాంకిత అంగుళీయకముతో అమిత సంతోషములో సీత హనుమంతుని మీద మూడు మాటలు చెపుతుంది.

"విక్రాంతః త్వం"
సమర్థః త్వం"
ప్రాజ్ఞః త్వం"

ఈ మూడు హనుమంతుని లక్షణములు. ఈ మూడింటిచేత హనుమ బలము శక్తి జ్ఞానము కలవాడని మళ్ళీతెలియుచున్నది. జ్ఞానము బలము శక్తి మూడూ గురువు నకు ఆవశ్యకము.
రాజస తామసములగు ప్రకోపములు గల శరీరమును వశపరచుకొనుటకు జ్ఞానము అవసరము.
తాను ఏకాకి గా ఉండియూ బలిష్ఠములగు మనస్సును బుద్ధినీ వశపరచుకొనుటకు సామర్థ్యము అవసరము. వాటిని అదిమిపెట్టి వుంచుకొనుటకు బలము అవసరము. ఇట్లు జ్ఞానము శక్తి బలములు కలవాడని సీతమ్మ హనుమంతుని ప్రశంసించెను.

||శ్లోకము 36.08||

శతయోజనవిస్తీర్ణః సాగరో మకరాలయః|
విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృతః||36.08||

స|| విక్రమశ్లాఘనీయేన సాగరః మకరాలయః శతయోజన విస్తీర్ణః క్రమతా గోష్పదీకృతః ||

||శ్లోకార్థములు||

విక్రమశ్లాఘనీయేన -
శ్లాఘనీయమైన పరాక్రమముతో
శతయోజన విస్తీర్ణః సాగరః మకరాలయః -
నూరుయోజనములు కల మకరాలయమైన సాగరమును
క్రమతా గోష్పదీకృతః -
అవలీలగా ఆవు పాదము మోపినంత మేరను చేసితివి

||శ్లోకతాత్పర్యము||

"మకరాలయమైన నూరుయోజనములు కల ఈ సాగరమును ఆవు పాదము మోపినంత మేరను దాటినట్లు అవలీలగా నీ శ్లాఘినీయమైన పరాక్రమముతో దాటితివి." ||36.08||

||శ్లోకము 36.09||

న హి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ|
యస్య తే నాస్తి సంత్రాసో రావణా న్నాపి సంభ్రమః||36.09||

స|| వానరర్షభః యస్య తే రావణాత్ సంత్రాసః నాస్తి సంభ్రమః అపి త్వాం ప్రాకృతం వానరం న మన్యే||

||శ్లోకార్థములు||

వానరర్షభః యస్య తే -
ఓ వానరర్షభ ! ఏ విధముగా నీకు
రావణాత్ సంత్రాసః నాస్తి -
రావణుని పై ఏమీ భయము లేకుండా
సంభ్రమః అపి -
సంభ్రమము లేకుండా వున్న
త్వాం ప్రాకృతం వానరం న మన్యే-
నీవు సామాన్యమైన వానరుడవు కావు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరర్షభ ! రావణునిపై ఏమీ భయము లేకుండా సంభ్రమము లేకుండా వున్న నీవు సామాన్యమైన వానరుడవు కావు". ||36.09||

||శ్లోకము 36.10||

అర్హసే చ కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుమ్|
యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా||36.10||

స|| రామేన విదితాత్మనా తేన ప్రేషితః అసి యది కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుం అర్హసే ||

||శ్లోకార్థములు||

రామేణ విదితాత్మనా -
విదితాత్ముడగు రామునిచేత
తేన ప్రేషితః అసి యది -
పంపబడిన వాడవు కనక
కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుం అర్హసే -
కపివరా నీవు మాట్లాడడానికి తగిన వాడివే

||శ్లోకతాత్పర్యము||

"విదితాత్ముడగు రామునిచేత పంపబడిన వాడవు కనక నీవు మాట్లాడడానికి తగిన వాడివే." ||36.10||

||శ్లోకము 36.11||

ప్రేషయిష్యతి దుర్దర్షో రామో న హ్య పరీక్షితమ్|
పరాక్రమ మవిజ్ఞాయ మత్సకాశం విశేషతః||36.11||

స|| దుర్దర్షః రామః పరాక్రమం అవిజ్ఞాయ అపరీక్షితమ్ న ప్రేక్ష్యతి విశేషతః మత్ సకాశమ్ ||

||శ్లోకార్థములు||

దుర్దర్షః రామః -
అజేయుడైన రాముడు
పరాక్రమం అవిజ్ఞాయ -
పరాక్రమము తెలిసికొనకుండా
అపరీక్షితమ్ న ప్రేక్ష్యతి -
పరీక్షించకుండా పంపించడు
విశేషతః మత్ సకాశమ్-
అందులోనూ నాకోసమై

||శ్లోకతాత్పర్యము||

"అజేయుడైన రాముడు పరాక్రమము తెలిసికొనకుండా పరీక్షించకుండా అందులోనూ నాకోసమై ఎవరినీ పంపడు."||36.11||

సుందరకాండలో హనుమంతునిది ముఖ్యపాత్ర. హనుమంతుడు ఎన్ని ఆటంకములు వచ్చిన ముందుకు పోతూ సంసార సాగరములో ఎలా పోవాలో నిరూపించి చూపిన వాడు. అట్టి వాడికి ముఖ్యలక్షణములు బలము జ్ఞానము శక్తి. అదే సీతా దేవి చెప్పిన మాట. అవే మనకి కావలసినవి కూడా.

ఇక మకరాలయమైన నూరుయోజనములు కల సాగరమును అవలీలగ దాటి, దుర్భేద్యమైన రాక్షస పదమునకు చేరిన హనుమ, సామాన్యుడైన వానరుడు కాడని సీతకి అర్థము అవుతుంది. రామనామాంకిత అంగుళీయకముతో, హనుమ రాముని చేత పంపబడిన వాడని తెలుస్తుంది.
రామునిచే పంపబడినవాడు కనక మాట్లాడడానికి తగినవాడని సీతకి విదితమౌతుంది.

ఇక అప్పటిదాకా మనస్సులో మసలుతున్న ప్రశ్నలన్నీ వెంటనే ఉప్పి పొంగిన నదీ ప్రవాహము లాగా వస్తాయి. ఆ ప్రశ్నలే వింటాము.

 

||శ్లోకము 36.12||

దిష్ట్యా చ కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగరః|
లక్ష్మణశ్చ మహాతేజా స్సుమిత్రానందవర్ధనః||36.12||

స|| దిష్ట్యా రామః ధర్మాత్మః సత్యసంగరః కుశలీ | మహాతేజా సుమిత్రానందవర్ధనః లక్ష్మణః చ||

||శ్లోకార్థములు||

రామః ధర్మాత్మః సత్యసంగరః -
ధర్మాత్ముడు సత్యసంగరుడు అయిన రాముడు
దిష్ట్యా కుశలీ -
నా అదృష్టము కొలదీ క్షేమముగా ఉన్నాడు
మహాతేజా సుమిత్రానందవర్ధనః -
మహాతేజోవంతుడైన సుమిత్రానందనుడు అగు
లక్ష్మణః చ -
అలాగే లక్ష్మణుడు కూడా

||శ్లోకతాత్పర్యము||

"నా అదృష్టము కొలదీ ధర్మాత్ముడు సత్యసంగరుడు అయిన రాముడు క్షేమముగా ఉన్నాడు. అలాగే మహాతేజోవంతుడైన సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు కూడా." ||36.12||

||శ్లోకము 36.13||

కుశలీ యది కాకుత్‍స్థః కిం ను సాగరమేఖలాం|
మహీం దహతి కోపేన యుగాంతాగ్ని రివోత్థితః||36.13||

స|| యది కాకుక్త్‍స్థః కుశలీ యుగాంతాగ్నిః ఇవ ఉత్థితం కోపేన సాగరమేఖలాం మహతీం కిం న దహతి||

||శ్లోకార్థములు||

యది కాకుక్త్‍స్థః కుశలీ -
మరి కుశలుడైన కాకుత్‍స్థుడు
యుగాంతాగ్నిః ఇవ ఉత్థితం కోపేన -
కాలాగ్నివలె మండుతున్న కోపముతో
సాగరమేఖలాం మహతీం -
సాగరముతో చుట్టబడిన ఈ భూమిని
కిం న దహతి -
ఎందుకు దహించివేయుటలేదు

||శ్లోకతాత్పర్యము||

"మరి కుశలుడైన కాకుత్‍స్థుడు కాలాగ్నివలె మండుతున్న కోపముతో సాగరముతో చుట్టబడిన ఈ భూమిని ఎందుకు దహించి వేయుటలేదు." ||36.13||

||శ్లోకము 36.14||

అథవా శక్తిమంతౌ తౌ సురాణా మపి విగ్రహే|
మమైవ తు న దుఃఖానాం అస్తి మన్యే విపర్యయః||36.14||

స|| అథవా తౌ సురాణాం అపి నిగ్రహే శక్తిమంతౌ తు మమ దుఃఖేనామేవ విపర్యయః నాస్తి మన్యే||

రామ టీకాలో - సురాణామపి నిగ్రహే శక్తిమన్తౌ తౌ రామలక్ష్మణౌ స్త ఏవ తథాపి మమ దుఃఖానాం విపర్యయో వినాశకాలో న ఏవ ఇతి అహం మన్యే।

||శ్లోకార్థములు||

అథవా తౌ సురాణాం అపి -
లేక సురులను కూడా
నిగ్రహే శక్తిమంతౌ తు -
నిగ్రహించకల శక్తిమంతులు
మమ దుఃఖేనామేవ -
కాని నా దుఖమునకు
విపర్యయః నాస్తి మన్యే -
అంతులేదని తలచుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"లేక సురులను కూడా నిగ్రహించకల శక్తిమంతులు. అయినా నా దుఖమునకు అంతులేదని తలచుచున్నాను?" ||36.14||

||శ్లోకము 36.15||

కచ్చిన్న వ్యధితో రామః కచ్చిన్న పరితప్యతే|
ఉత్తరాణి చ కార్యాణి కురుతే పురుషోత్తమః||36.15||

స|| రామః న వ్యధితః కచ్చిత్? నపరితప్యతే కచ్చిత్? (బహుశః) పురుషోత్తమః ఉత్తరాణి కార్యాణి కురుతే ||

||శ్లోకార్థములు||

రామః న వ్యధితః కచ్చిత్? -
రాముడు వ్యథలో నుండెనా?
నపరితప్యతే కచ్చిత్? -
పరితపించుటలేదు కదా ?
పురుషోత్తమః -
ఆ పురుషోత్తముడు
ఉత్తరాణి కార్యాణి కురుతే -
చేయవలసిన కార్యములు చేయుచున్నాడా?

||శ్లోకతాత్పర్యము||

"రాముడు వ్యథలో నుండెనా? పరితపించుటలేదు కదా ? ఆ పురుషోత్తముడు చేయవలసిన కార్యములు చేయుచున్నాడా?" ||36.15||

||శ్లోకము 36.16||

కచ్చిన్న దీనః సంభ్రాంతః కార్యేషు చ న ముహ్యతి|
కచ్చి త్పురుషకార్యాణి కురుతే నృపతేస్సుతః||36.16||

స|| నృపతేః సుతః దీనః సంభ్రాంతః న కచ్చిత్ | కార్యేషు నముహ్యతి | పురుషకార్యాణి కచ్చిత్ కురుతే ( ఇతి మన్యే)||

||శ్లోకార్థములు||

నృపతేః సుతః -
ఆ రాజకుమారుడు
దీనః సంభ్రాంతః న కచ్చిత్ -
దీనుడుగా భ్రాంతిలో లేడు కదా?
కార్యేషు నముహ్యతి -
కార్యములో విముఖతలేదు కదా?
పురుషకార్యాణి కచ్చిత్ కురుతే ( ఇతి మన్యే)-
పురుషకార్యములు నెఱవేర్చుచున్నాడు కదా?

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాజకుమారుడు దీనుడుగా భ్రాంతిలో లేడు కదా? కార్యములో విముఖతలేదు కదా? పురుషకార్యములు నెఱవేర్చుచున్నాడు కదా? " ||36.16||

||శ్లోకము 36.17||

ద్వివిధం త్రిపాధోపాయ ముపాయ మపి సేవతే|
విజిగీషు స్సుహృత్ కచ్చిన్ మిత్రేషు చ పరంతప||36.17||

స|| పరంతపః ద్వివిధం ఉపాయం త్రివిధోపాయం అపి సేవతే విజిగీషుః మిత్రేషు సుహృత్ కచ్చిత్ ||

తిలక టీకాలో - ద్వివిధం సౌమ్యాసౌమ్యరూప ప్రకారద్వయవత్ | త్రివిధం ధర్మార్థకామలక్షణ త్రివిధ పురుషార్థానాం ప్రాప్త ఉ ఉపాయం సేవతే కచ్చిత్| పాయభూత

||శ్లోకార్థములు||

పరంతపః విజిగీషుః - ఆ పరంతపుడు విజయకాంక్షతో
ద్వివిధం ఉపాయం -
రెండు ఉపాయములు అనబడు సామదానములను
త్రివిధోపాయం అపి సేవతే -
మూడు ఉపాయములు అనబడు దాన భేద దండో పాయములను పాటిస్తున్నాడు కదా
మిత్రేషు సుహృత్ కచ్చిత్ -
మిత్రులతో సహృదయులతో

||శ్లోకతాత్పర్యము||

"ఆ పరంతపుడు విజయకాంక్షతో మిత్రులతో సహృదయులతో రెండు ఉపాయములు అనబడు సామదానములను శత్రువులపై విజయకాంక్షతో మూడు ఉపాయములు అనబడు దాన భేద దండో పాయములను పాటిస్తున్నాడు కదా? "||36.17||

||శ్లోకము 36.18||

కచ్చి న్మిత్రాణి లభతే మిత్రైశ్చాప్యభిగమ్యతే|
కచ్చిత్ కల్యాణమిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః||36.18||

స|| మిత్రాణి కచ్చిత్ లభతే| మిత్రైః అపి అభిగమ్యతే | కల్యాణమిత్రశ్చ కచ్చిత్ |మిత్రైశ్చ అపి పురస్కృతః ||

గోవిన్దరాజ టీకాలో - అభిగమ్యతే లభ్యతే| మైత్రైశ్చకచ్చిదుపకారం కృత్వా స్వయం ఉపకారం మిత్రాదపేక్షతే కచ్చిత్ ఇత్యర్థః||

||శ్లోకార్థములు||

మిత్రాణి కచ్చిత్ లభతే -
మిత్రులను సంపాదించుచున్నాడా?
మిత్రైః అపి అభిగమ్యతే-
మిత్రులు కూడా అతనిపై కోరికగలవారై ఉన్నారా?
కల్యాణమిత్రశ్చ కచ్చిత్ -
మిత్రులు కల్యాణము కోరుకొనువారే కదా?
మిత్రైశ్చ అపి పురస్కృతః -
మిత్రులచేత గౌరవింపబడుతున్నాడా?

||శ్లోకతాత్పర్యము||

"మిత్రులను సంపాదించుచున్నాడా? మిత్రులు కూడా అతనిపై కోరికగలవారై ఉన్నారా? మిత్రులు కల్యాణము కోరుకొనువారే కదా? మిత్రులచేత గౌరవింపబడుతున్నాడా?"||36.18||

||శ్లోకము 36.19||

కచ్చి దాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజః|
కచ్చిత్ పురుషకారం చ దైవం చ ప్రతిపద్యతే||36.19||

స|| పార్థివాత్మజః దేవానాం ప్రసాదం ఆశాస్తి కచ్చిత్ | పురుషకారం చ దైవం చ ప్రతిపద్యతే||

||శ్లోకార్థములు||

పార్థివాత్మజః దేవానాం -
ఆ పార్థివాత్మజుడు దేవతలను
ప్రసాదం ఆశాస్తి కచ్చిత్ -
ప్రసాదించుచున్నాడా?
పురుషకారం చ దైవం చ -
పురుషకార్యములు దైవకార్యములు కూడా
ప్రతిపద్యతే -
చేయుచున్నాడా?

||శ్లోకతాత్పర్యము||

"ఆ పార్థివాత్మజుడు దేవతలను ప్రసాదించుచున్నాడా? పురుషకార్యములు దైవకార్యములు చేయుచున్నాడా? " ||36.19||

||శ్లోకము 36.20||

కచ్చి న్నవిగత స్నేహః ప్రవాసాన్మయి రాఘవః|
కచ్చి న్మాం వ్యసనాత్ అస్మాన్మోక్షయిష్యతి వానర||36.20||

స|| రాఘవః ప్రవాసాత్ మయి విగతస్నేహః న కచ్చిత్ |హే వానర ! మాం అస్మాత్ వ్యసనాత్ (రామః) మోక్షయిష్యతి కచ్చిత్ ||

||శ్లోకార్థములు||

రాఘవః ప్రవాసాత్ -
రాఘవుడు ఏడబాటులో
మయి విగతస్నేహః న కచ్చిత్ -
నా పై స్నేహము లేనివాడు కాదు గదా
హే వానర ! మాం అస్మాత్ - ఓ వానరా నన్ను
వ్యసనాత్ (రామః) మోక్షయిష్యతి కచ్చిత్ -
కష్టములనుంచి విముక్తి కలిగిస్తాడు కదా ?

||శ్లోకతాత్పర్యము||

"రాఘవుడు ఏడబాటులో నా పై స్నేహము లేనివాడు కాదు గదా? ఓ వానరా నన్ను ఈ కష్టములనుంచి విముక్తి కలిగిస్తాడు కదా ?" ||36.20||

||శ్లోకము 36.21||

సుఖానాముచితో నిత్యం అసుఖానాం అనూచితః|
దుఃఖముత్తరమాసాద్య కచ్చ్ ద్రామో న సీదతి||36.21||

స|| నిత్యం సుఖానాం ఉచితః అసుఖానాం అనౌచితః రాఘవః దుఃఖం ఆసాద్య న సీదతి కచ్చిత్ ||

||శ్లోకార్థములు||

నిత్యం సుఖానాం ఉచితః-
ఎల్లప్పుడు సుఖములకు అలవాటుపడిన
అసుఖానాం అనౌచితః -
అసుఖములను ఎఱగని
రాఘవః దుఃఖం ఆసాద్య -
రాఘవుడు దుఖములలో
న సీదతి కచ్చిత్ -
మునిగిపోలేదు కదా?

||శ్లోకతాత్పర్యము||

"ఎల్లప్పుడు సుఖములు పొందదగిన వాడు, అసుఖములను ఎఱగని రాఘవుడు దుఖములలో మునిగిపోలేదు కదా?" ||36.21||

||శ్లోకము 36.22||

కౌసల్యాయా స్తథా కచ్చిత్ సుమిత్రాయాః తథైవ చ|
అభీక్ష్ణం శ్రూయతే కచ్చిత్ కుశలం భరతస్య చ||36.22||

స|| కౌసల్యాయాః తథా సుమిత్రాయాః తథైవ చ భరతస్య కుశలం అభీక్షణం శ్రూయతే కచ్చిత్ ||

||శ్లోకార్థములు||

కౌసల్యాయాః తథా సుమిత్రాయాః -
కౌసల్యయొక్క సుమిత్ర యొక్క
తథైవ చ భరతస్య చ -
అలాగే భరతుని
కుశలం అభీక్షణం -
కుశలక్షేమముల గురించి ప్రతిక్షణము
శ్రూయతే కచ్చిత్ -
వింటున్నాడు కదా?

||శ్లోకతాత్పర్యము||

"కౌసల్యయొక్క సుమిత్ర యొక్క అలాగే భరతుని కుశలక్షేమముల గురించి ప్రతిక్షణము వింటున్నాడు కదా?" ||36.22||

||శ్లోకము 36.23||

మన్నిమిత్తేన మానార్హః కచ్చి చ్ఛోకేన రాఘవః|
కచ్చి న్నాన్యమనా రామః కచ్చి న్మాం తారయిష్యతి||36.23||

స||మానార్హః రామః మన్నిమిత్తేన శోకేన కచ్చిత్ న అన్యమానః న కచ్చిత్ | మామ్ కచ్చిత్ తారయిష్యతి ||

||శ్లోకార్థములు||

మానార్హః రామః -
మానార్హుడైన రాముడు
మన్నిమిత్తేన శోకేన కచ్చిత్ న -
నాకోసమైన దుఖములో
అన్యమానః న కచ్చిత్ -
అన్యమనస్కుడు కాలేదు కదా?
మామ్ కచ్చిత్ తారయిష్యతి-
నన్ను ఎప్పుడు రక్షించును?

||శ్లోకతాత్పర్యము||

"మానార్హుడైన రాముడు నాకోసమైన దుఖములో అన్యమనస్కుడు కాలేదు కదా? నన్ను ఎప్పుడు రక్షించును? "||36.23||

||శ్లోకము 36.24||

కచ్చి దక్షౌహిణీం భీమాం భరతో భాతృవత్సలః|
ధ్వజినీం మంత్రిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే||36.24||

స|| భాత్రువత్సలః భరతః మంత్రిభిః గుప్తాం భీమాం అక్షౌహిణీం మత్కృతే కచ్చిత్ ప్రేషయిష్యతి ||

రామ తిలక లో - మత్కృతే మన్ మోచనార్థమ్

||శ్లోకార్థములు||

భాత్రువత్సలః భరతః - భాత్రువత్సలుడైన భరతుడు
మంత్రిభిః గుప్తాం భీమాం అక్షౌహిణీం -
మంత్రులచేత రక్షింపబడు శత్రుభయంకరమైన అక్షహౌణి సైన్యములను
మత్కృతే కచ్చిత్ ప్రేషయిష్యతి -
నా కొఱకై పంపును కదా

||శ్లోకతాత్పర్యము||

"భాత్రువత్సలుడైన భరతుడు మంత్రులచేత రక్షింపబడు శత్రుభయంకరమైన అక్షహౌణి సైన్యములను నాకొఱకై పంపునుకదా?"||36.24||

||శ్లోకము 36.25||

వానరాధిపతిః శ్రీమాన్ సుగ్రీవః కచ్చిదేష్యతి|
మత్కృతే హరిభిర్వీరై ర్వృతో దంతానఖాయుధః||36.25||

స|| వానరాధిపః శ్రీమాన్ సుగ్రీవః మత్కృతే దంతానఖాయుధః హరిభీః వృతః కచ్చిత్ ఏష్యతి ||

||శ్లోకార్థములు||

వానరాధిపః శ్రీమాన్ సుగ్రీవః -
వానరాధిపతి అయిన సుగ్రీవుడు
మత్కృతే దంతానఖాయుధః హరిభీః వృతః -
నఖములు ఆయుధముగా గల వానరసైన్యములతో కలిసి
కచ్చిత్ ఏష్యతి - ఎప్పుడు వచ్చును?

||శ్లోకతాత్పర్యము||

"వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధముగా గల వానరసైన్యములతో కలిసి ఎప్పుడు వచ్చును." ||36.25||

||శ్లోకము 36.26||

కచ్చి చ్చ లక్ష్మణ శ్శూరః సుమిత్రానందవర్ధనః|
అస్త్రవిచ్చరజాలేన రాక్షసాన్ విధమిష్యతి||36.26||

స|| శూరః సుమిత్రానందవర్ధనః లక్ష్మణః అస్త్రవిచ్చరజాలేన కచ్చిత్ రాక్షసాన్ విధమిష్యతి ||

||శ్లోకార్థములు||

శూరః సుమిత్రానందవర్ధనః -
శూరుడు సుమిత్రానందవర్ధనుడు
లక్ష్మణః అస్త్రవిచ్చరజాలేన -
లక్ష్మణుడు తన అస్త్రజాలముతో
కచ్చిత్ రాక్షసాన్ విధమిష్యతి -
రాక్షసులను ఎప్పుడు వధించును

||శ్లోకతాత్పర్యము||

"శూరుడు సుమిత్రానందవర్ధనుడు అగు లక్ష్మణుడు తన అస్త్రజాలముతో రాక్షసులను ఎప్పుడు వధించును." ||36.26||

||శ్లోకము 36.27||

రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలతా నిహతం రణే|
ద్రక్ష్యాం అల్పేన కాలేన రావణం ససుహృజ్జనమ్||36.27||

స|| జ్వలతా రౌద్రేణ అస్త్రేణ రణే ససుహృత్ జనం నిహతం రావణం అల్పేన కాలేన ద్రక్ష్యామి కచ్చిత్ ||

||శ్లోకార్థములు||

జ్వలతా రౌద్రేణ అస్త్రేణ -
జ్వలించుచున్న రౌద్రశస్త్రములతో
రణే ససుహృత్ జనం నిహతం రావణం -
రణములో మిత్రబాంధవులతో హతమార్చబడిన రావణుని
అల్పేన కాలేన ద్రక్ష్యామి కచ్చిత్-
అచిరకాలములో చూడకలను కదా?

||శ్లోకతాత్పర్యము||

"జ్వలించుచున్న రౌద్రశస్త్రములతో రణములో మిత్రబాంధవులతో హతమార్చబడిన రావణుని అచిరకాలములో చూడకలను కదా?" ||36.27||

||శ్లోకము 36.28||

కచ్చిన్న తద్దేమ సమానవర్ణం తస్యాననం పద్మసమానగంధి|
మయా వినా శుష్యతి శోకదీనం జలక్షయే పద్మ మివాతపేన||36.28||

స||తస్య హేమ సమానవర్ణం పద్మసమానగంధి తత్ ఆననమ్ మయా వినా శోకదీనం జలక్షయే ఆతపేన పద్మం ఇవ న శుష్యతి కచ్చిత్ ||

||శ్లోకార్థములు||

తస్య హేమ సమానవర్ణం -
ఆయన యొక్క బంగారు వన్నెకల
పద్మసమానగంధి తత్ ఆననమ్ -
పద్మసమానగంధము కల వదనము
మయా వినా - నా వియోగములో
శోకదీనం జలక్షయే ఆతపేన పద్మం ఇవ -
జలక్షయముతో వాడగొట్టబడిన పద్మము వలె
న శుష్యతి కచ్చిత్ -
వాడిపోలేదు కదా?

||శ్లోకతాత్పర్యము||

"బంగారు వన్నెకల పద్మసమానగంధము కల ఆయన వదనము నా వియోగ శోకముతో జలక్షయముతో వాడగొట్టబడిన పద్మము వలె వాడిపోలేదు కదా?" ||36.28||

||శ్లోకము 36.29||

ధర్మాపదేశాత్ త్యజతశ్చ రాజ్యం
మాంచాప్యరణ్యం నయతః పదాతిమ్|
నాసీద్వ్యధా యస్య న భీర్నశోకః
కచ్చిచ్చ ధైర్యం హృదయే కరోతి ||36.29||

స||ధర్మాపదేశాత్ రాజ్యం త్యజతః మాం చాపి పదాతిమ్ అరణ్యం నయతః యస్య వ్యథా నాసీత్ న భీః న శోకః సః హృదయే ధైర్యం కరోతి కచ్చిత్ ||

||శ్లోకార్థములు||

ధర్మాపదేశాత్ రాజ్యం త్యజతః -
ధర్మపాలనకై రాజ్యమును త్యజించినపుడు
మాం చాపి పదాతిమ్ అరణ్యం నయతః-
కాలినడకన అరణ్యములో ప్రవేశించినఫుడుగాని
యస్య వ్యథా నాసీత్ న భీః న శోకః -
వ్యధచెందక భయము లేక శోకములేక వున్న వాడు,
సః హృదయే ధైర్యం కరోతి కచ్చిత్ -
ఇప్పుడు ఇంకా హృదయములో ధైర్యము కలవాడై ఉన్నాడు కదా?

||శ్లోకతాత్పర్యము||

'"ధర్మపాలనకై రాజ్యమును త్యజించినపుడు, కాలినడకన అరణ్యములో ప్రవేశించినఫుడుగాని వ్యధచెందక భయము లేక శోకములేక వున్న వాడు, ఇప్పుడు ఇంకా హృదయములో ధైర్యము కలవాడై ఉన్నాడు కదా?" ||36.29||

||శ్లోకము 36.30||

న చాస్య మాత న పితా నాన్యః స్నేహా ద్విశిష్ఠోఽస్తి మయా సమో వా|
తావ త్త్వహం దూత జిజీవిషేయం యావత్ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య||36.30||

స||అస్య స్నేహాత్ మయా సమో వా విశిష్ఠః మాతా న పితా న అన్యః నాస్తి | దూతః ప్రియస్య ప్రవృతిమ్ యావత్ శృణుయం తావత్తు అహం జిజీవిశేషయం ||

||శ్లోకార్థములు||

అస్య మయా స్నేహాత్ -
ఆయన నాపై అనురాగముతో
సమో వా విశిష్ఠః -
సమానమైన లేక విశిష్ఠమైన
మాతా న పితా న అన్యః నాస్తి -
తల్లిది కాని తండ్రి ది కాని అన్యులది కాని లేదు
ప్రియస్య ప్రవృతిమ్ -
ప్రియుని వృత్తాంతము
యావత్ శృణుయం -
వినునంత వఱకు
తావత్తు అహం జిజీవిశేషయం -
నేను జీవించుటకు కోరుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"నా తండ్రి అనురాగముకాని, నా తల్లి అనురాగముకాని, విశిష్ఠమైన ఆయన అనురాగముతో సమానము కాదు. ఓ దూతా ! నా ప్రియుని వృత్తాంతము వినుటవఱకై నేను జీవించుటకు కోరుచున్నాను". ||36.30||

||శ్లోకము 36.31||

ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థ ముక్త్వా|
శ్రోతుం పునస్తస్య వచోఽభి రామం రామార్థయుక్తం విరరామ రామా||36.31||

స|| దేవీ తం వానరేంద్రం మహార్థం మధురార్థం వచనమ్ ఉక్త్వా తస్య అభిరామం రామార్థయుక్తం వచః పునః శ్రోతుం విరరామ||

||శ్లోకార్థములు||

దేవీ తం వానరేంద్రం -
సీతాదేవి ఆ వానరేంద్రునకు
మహార్థం మధురార్థం వచనమ్ ఉక్త్వా -
మధురమైన మహత్తరమైన అర్ధము కల ఈ వచనములను చెప్పి
తస్య అభిరామం రామార్థయుక్తం వచః -
ఆ రాముని గురించి మనోహరమైన మాటలు
పునః శ్రోతుం విరరామ -
మరల వినగోరి విరమించెను

||శ్లోకతాత్పర్యము||

"సీతాదేవి ఆ వానరేంద్రునకు మధురమైన మహత్తరమైన అర్ధము కల ఈ వచనములను చెప్పి ఆ రాముని గురించి మనోహరమైన మాటలు మరల వినగోరి విరమించెను." ||36.31||

హనుమంతుని వానరేంద్రం అనడములో ధ్వని , సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైన వానర రాజైనా , పారతంత్ర్యములో భగవదారాధనలో పట్టాభిషిక్తుడైన వానరుడు హనుమ అని అంటారు గోవిన్దరాజులవారు తమ టీకాలో.

||శ్లోకము 36.32||

సీతాయా వచనం శ్రుత్వా మారుతి ర్భీమవిక్రమః|
శిరస్యంజలి మాధాయ వాక్యముత్తరమబ్రవీత్||36.32||

స||మారుతిః భీమవిక్రమః సీతాయాః వచనం శ్రుత్వా శిరస్యంజలిం ఆధాయ ఉత్తరం వాక్యం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

మారుతిః భీమవిక్రమః -
భయంకరమైన పరాక్రమము కల మారుతి
సీతాయాః వచనం శ్రుత్వా -
సీతయొక్క వచనములను విని
శిరస్యంజలిం ఆధాయ -
శిరస్సు తో అంజలి ఘటించి
ఉత్తరం వాక్యం అబ్రవీత్ -
ప్రత్యుత్తరముగా ఇట్లు చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"భయంకరమైన పరాక్రమము కల మారుతి కూడా సీతయొక్క వచనములను విని శిరస్సు తో అంజలి ఘటించి ప్రత్యుత్తరముగా ఇట్లు చెప్పెను."||36.32||

||శ్లోకము 36.33||

న త్వా మిహస్థాం జానీతే రామః కమల లోచనే|
తేన త్వాం నానయ త్యాశు శచీమివ పురందరః||36.33||

స|| కమలలోచనే త్వాం ఇహస్థాం రామః న జానీతే | తేన పురందరః శచీమివ త్వాం ఆశు న ఆనయతి ||

||శ్లోకార్థములు||

కమలలోచనే -
ఓ కమలలోచనా
త్వాం ఇహస్థాం -
నీవు ఇక్కడ ఉన్నావు అని
రామః న జానీతే -
రామునికి తెలియదు
తేన పురందరః శచీమివ -
ఇంద్రుడు శచీదేవిని తీసుకుపోయినట్లు
త్వాం తేన ఆశు న ఆనయతి -
నువ్వు ఆయన చేత తీసుకుపోబడలేదు

||శ్లోకతాత్పర్యము||

"ఓ కమలలోచనా నీవు ఇక్కడ ఉన్నావు అని రామునికి తెలియదు. అందువలనే ఇంద్రుడు శచీదేవిని తీసుకుపోయినట్లు ఆయన్ చేత నువ్వు తీసుకుపోబడలేదు." ||36.33||

||శ్లోకము 36.34||

శ్రుత్వైవ తు వచో మహ్యం క్షిప్ర మేష్యతి రాఘవః|
చమూం ప్రకర్షన్ మహతీం హర్యృక్షగణసంకులామ్||36.34||

స|| మహ్యం వచః శ్రుత్వైవ తు రాఘవః హర్యక్షుగణసంకులాం మహతీం చమూం ప్రకర్షన్ క్షిప్రం ఏష్యతి||

||శ్లోకార్థములు||

మహ్యం వచః శ్రుత్వైవ తు -
నా మాటలు వినిన వెంటనే
రాఘవః హర్యక్షుగణసంకులాం -
రాఘవుడు వానర గణములతో నిండిన
మహతీం చమూం ప్రకర్షన్ క్షిప్రం ఏష్యతి -
మహత్తర సైన్యముతో ఇక్కడికి వచ్చును.

||శ్లోకతాత్పర్యము||

"నా మాటలు వినిన వెంటనే వానర గణములతో నిండిన మహత్తర సైన్యముతో ఇక్కడికి వచ్చును." ||36.34||

||శ్లోకము 36.35||

విష్టంభయిత్వా బాణౌఘై రక్షోభ్యం వరుణాలయమ్|
కరిష్యతి పురీం లంకాం కాకుత్‍స్థః శాంతరాక్షసామ్||36.35||

స|| కాకుత్‍స్థః అక్షోభ్యం వరుణాలయం బాణౌఘైః విష్టంభయిత్వా లంకాం పురీం శాంతరాక్షసాం కరిష్యతి ||

గోవిన్దరాజ టీకాలో - విష్టంభయిత్వా స్తబ్ధం కృత్వే ఇతి అర్థః।
||శ్లోకార్థములు||

కాకుత్‍స్థః - కాకుత్‍స్థుడు
అక్షోభ్యం వరుణాలయం -
క్షోభింపచేయబడలేని సాగరమును
బాణౌఘైః విష్టంభయిత్వా -
బాణములతో స్థంబింపచేసి
లంకాం పురీం శాంతరాక్షసాం కరిష్యతి-
ఈ లంకాపురమును రాక్షసరహితము చేయును

||శ్లోకతాత్పర్యము||

"కాకుత్‍స్థుడు క్షోభింపచేయబడలేని సాగరమును బాణములతో స్థంబింపచేసి, ఈ లంకాపురమును రాక్షసరహితము చేయును." ||36.35||

||శ్లోకము 36.36||

తత్ర యద్యంతరా మృత్యు ర్యది దేవా స్సహాసురాః|
స్థాస్యంతి పథి రామస్య స తానపి వధిష్యతి||36.36||

స|| తత్ర రామస్య పథి అంతరా మృత్యుః సహాసురాః దేవాః స్థాస్యంతి యది సః తాన్ అపి వధిష్యతి ||

||శ్లోకార్థములు||

తత్ర రామస్య పథి అంతరా -
ఆ రాముని మార్గములో
మృత్యుః సహాసురాః దేవాః -
యముడితో సహా సురలు దేవతలు
స్థాస్యంతి యది -
నిలబడి వుంటే
సః తాన్ అపి వధిష్యతి -
అతడు వాళ్ళను కూడా వధించును

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాముని మార్గములో యముడితోసహా సురలు దేవతలు ఉన్నా వాళ్ళను కూడా వధించును." ||36.36||

||శ్లోకము 36.37||

తవాదర్శనజే నార్యే శోకేన స పరిప్లుతః|
న శర్మ లభతే రామ స్సింహార్దిత ఇవ ద్విపః||36.37||

స|| ఆర్య సః రాఘవః తవ అదర్శనజేన శోకేన పరిప్లుతః సింహార్దితః ద్విపః ఇవ శర్మ న లభతే||

||శ్లోకార్థములు||

ఆర్య సః రాఘవః -
ఆర్యుడైన ఆ రాముడు
తవ అదర్శనజేన శోకేన పరిప్లుతః -
నీ వియోగముతో శోకములో మునిగి
సింహార్దితః ద్విపః ఇవ -
సింహము ముందు పడిన ఏనుగు లాగ
శర్మ న లభతే -
అశాంతిలో ఉన్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఆర్యుడైన రాముడు నీ వియోగముతో శోకములో మునిగి సింహము ముందు పడిన ఏనుగు లాగ అశాంతిలో ఉన్నాడు". ||36.37||

||శ్లోకము 36.38, 39||

మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ|
దర్దురేణ చ తే దేవి శపే మూలఫలేన చ||36.38||

యథా సు నయనం వల్గు బింబోష్ఠం చారుకుండలమ్|
ముఖం ద్రక్ష్యసి రామస్య పూర్ణచంద్ర మివోదితమ్||36.39||

స|| దేవి మలయేన చ వింధ్యేన మేరుణా దర్దురేణ మూలఫలేన తే శపే | యథా సునయనం వల్గు బింబోష్ఠం చారుకుణ్డలం ఉదితం పూర్ణచంద్రం ఇవ రామస్య ముఖం ద్రక్ష్యసి||

||శ్లోకార్థములు||

దేవి మలయేన చ వింధ్యేన మేరుణా -
మలయ వింధ్యా మేరు పర్వతముల పై
దర్దురేణ మూలఫలేన తే శపే -
దర్దుర పర్వతముమీద మీద మూలఫలముల మీద
ప్రమాణము చేసి చెప్పుచున్నాను
యథా సునయనం వల్గు బింబోష్ఠం చారుకుణ్డలం -
అందమైన నయనములతో పెదవులతో మంచి కుండలములను దాల్చి
ఉదితం పూర్ణచంద్రం ఇవ రామస్య ముఖం -
ఉదయించిన పూర్ణచంద్రుని ముఖము బోలియున్న రాముని ముఖము
ద్రక్ష్యసి - చూచెదవు.

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ మలయ వింధ్యా మేరు పర్వతముల పై భుజింపతగు మూలఫలములపై ప్రమాణము చేసి చెప్పుచున్నాను. అందమైన నయనములతో పెదవులతో మంచి కుండలములను దాల్చి ఉదయించిన పూర్ణచంద్రుని ముఖము బోలియున్న రాముని ముఖము త్వరలో నే చూచెదవు". ||36.38,39||

||శ్లోకము 36.40||

క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రస్రవణే గిరౌ|
శతక్రతు మివాసీనం నాగరాజస్య మూర్థని||36.40||

స||వైదేహి ప్రస్రవేణ గిరౌ రామం నాగరాజస్య మూర్ధని ఆసీనం శతక్రతుం వ క్షిప్రం ద్రక్ష్యసి||

||శ్లోకార్థములు||

వైదేహి - ఓ వైదేహీ
నాగరాజస్య మూర్ధని ఆసీనం శతక్రతుం ఇవ -
ఐరావతము మీదకూర్చుని వున్న ఇంద్రునివలె
రామం ప్రస్రవేణ గిరౌ శక్షిప్రం ద్రక్ష్యసి -
ప్రస్రవణ పర్వతము మీద రాముని త్వరలోనే చూచెదవు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వైదేహీ ఐరావతము మీదకూర్చుని వున్న ఇంద్రునివలె ప్రస్రవణ పర్వతము మీద రాముని త్వరలోనే చూచెదవు." ||36.40||

||శ్లోకము 36.41||

న మాంసం రాఘవోభుజ్ఞ్కే నచాఽపి మధుసేవతే|
వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమమ్||36.41||

స||| రాఘవః మాంసం న భుజ్ఞ్కే । మధు అపి న సేవతే | నిత్యం పంచమం సువిహితం వన్యం భుక్తం అశ్నాతి ||

||శ్లోకార్థములు||

రాఘవః మాంసం న భుజ్ఞ్కే -
రాఘవుడు మాంసము తినుటలేదు
మధు అపి న సేవతే -
మధు సేవనము కూడా చేయుటలేదు
నిత్యం వన్యం భుక్తం పంచమం సువిహితం -
నిత్యము వనములో దొరికిన భుక్తిలో
పంచమం సువిహితం అశ్నాతి -
విధి ప్రకారమి ఐదవ వంతు మాత్రమే

రాఘవః మాంసం న భుజ్ఞ్కే -
రాఘవుడు మాంసము తినుటలేదు
మధు అపి న సేవతే -
మధు సేవనము కూడా చేయుటలేదు
నిత్యం వన్యం భుక్తం పంచమం సువిహితం -
నిత్యము వనములో దొరికిన భుక్తిలో
పంచమం సువిహితం అశ్నాతి -
విధి ప్రకారమి ఐదవ వంతు మాత్రమే

||శ్లోకతాత్పర్యము||

"రాఘవుడు మాంసము తినుటలేదు. మధు సేవనము కూడా చేయుటలేదు. నిత్యము వనములో దొరికిన భుక్తిలో ఇదవభాగమే తినుచున్నాడు." ||36.41||

||శ్లోకము 36.42||

నైవదంశాన్న మశకాన్నకీటాన్ నసరీసృపాన్|
రాఘవోఽపనయేత్ గాత్రాత్ త్వద్గతే నాంతరాత్మనా||36.42||

స||రాఘవః త్వద్గతేన అంతరాత్మనా గాత్రాత్ దంశాన్ నైవ అపనయేత్ అసకాన్ న కీటాన్ న సరీసృపాన్ న ||

||శ్లోకార్థములు||

రాఘవః త్వద్గతేన అంతరాత్మనా -
రాఘవుడు నీ విడబాటుతో మనస్సులో మునిగి
గాత్రాత్ దంశాన్ నైవ -
శరీరమునుండి ఈగలను కాని
మశకాన్ న కీటాన్ న సరీసృపాన్ -
దోమలను గాని కీటకములను గాని పాములను గాని
న అపనయేత్ - తోలుట లేదు

||శ్లోకతాత్పర్యము||

"రాఘవుడు నీ విడబాటుతో మనస్సులో మునిగి శరీరమునుండి ఈగలను కాని దోమలను గాని కీటకములను గాని పాములను గాని తోలుటలేదు". ||36.42||

||శ్లోకము 36.43||

నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణః|
నాన్య చ్చింతయతే కించి త్స తు కామవశం గతః||36.43||

స||రామః నిత్యం ధ్యానపరః నిత్యం శోకపరాయణః కామవశం గతః అన్యత్ న చింతయతే ||

||శ్లోకార్థములు||

రామః నిత్యం శోకపరాయణః -
రాముడు నిత్యము శోకములో మునిగియుండి
నిత్యం కామవశం గతః ధ్యానపరః-
నిత్యము కామ వశుడై నీ పై ధ్యానపరుడై
అన్యత్ న చింతయతే -
ఇంక దేనిగురించి అలోచించుటలేదు

రామః నిత్యం శోకపరాయణః -
రాముడు నిత్యము శోకములో మునిగియుండి
నిత్యం కామవశం గతః ధ్యానపరః-
నిత్యము కామ వశుడై నీ పై ధ్యానపరుడై
అన్యత్ న చింతయతే -
ఇంక దేనిగురించి అలోచించుటలేదు

||శ్లోకతాత్పర్యము||

"రాముడు నిత్యము శోకములో మునిగియుండి కామవశములో నీ పై ధ్యానపరుడై ఇంక దేని గురించి అలోచించుటలేదు." ||36.43||

||శ్లోకము 36.44||

అనిద్ర స్సతతం రామ స్సుప్తోఽపి చ నరోత్తమః|
సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే||36.44||

స|| రామః సతతం అనిద్రః నరోత్తమః సుప్తో అపి సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే ||

||శ్లోకార్థములు||

రామః సతతం అనిద్రః -
రాముడు ఎల్లపుడు నిద్రలేనివాడై
నరోత్తమః సుప్తో అపి -
నరోత్తముడు నిద్రిస్తున్నాగాని
సీతేతి మధురాం వాణీం -
సీతా అని మధురమైన వాణితో
వ్యాహరన్ ప్రతిబుధ్యతే -
పలుకుతూ లేచినవాడగును

||శ్లోకతాత్పర్యము||

"రాముడు ఎల్లపుడు నిద్రలేనివాడై, నిద్రిస్తున్నాగాని సీతా అని మధురమైన వాణితో పలుకుతూ మళ్ళీ లేచినవాడగును."||36.44||

||శ్లోకము 36.45||

దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వాsన్య త్సుమనోహరమ్|
బహుశో హా ప్రియే త్యేవం శ్వసం స్త్వాం అభిభాషతే||36.45||

స|| ఫలం వా పుష్పం వా యత్ వా సుమనోహరం అన్యత్ దృష్ట్వా శ్వసన్ హా ప్త్రియేత్యేవం త్వాం బహుశః అభిభాషతే||

||శ్లోకార్థములు||

ఫలం వా పుష్పం వా -
ఫలము పుష్పము లేక
యత్ వా సుమనోహరం అన్యత్ దృష్ట్వా-
ఎదైన మనోహరమైనది చూచినా
శ్వసన్ హా ప్త్రియే ఇతి -
'హా ప్రియా' అంటూ నిట్టూర్పులు
ఏవం త్వాం బహుశః అభిభాషతే -
ఈ విధముగా నిన్నే తలుచుకుంటాడు

||శ్లోకతాత్పర్యము||

"ఫలము పుష్పము లేక ఎదైన మనోహరమైనది చూచినా 'హా ప్రియా' అంటూ నిట్టూర్పులు విడుచును". ||36.45||

||శ్లోకము 36.46||

స దేవి నిత్యం పరితప్యమాన స్త్వాం ఏవ సీతే త్యభిభాషమాణః|
ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృతప్రయత్నః||36.46||

స|| దేవీ మహాత్మా సః రాజసుతః నిత్యం పరితప్యమానః సీతేతి త్వామేవ అభిభాషమానః ధృతవర్తః తవ లాభాయ కృతప్రయత్నః |

||శ్లోకార్థములు||

దేవీ మహాత్మా సః రాజసుతః -
ఓదేవీ మహాత్ముడైన ఆ రాజకుమారుడు
నిత్యం పరితప్యమానః -
నిత్యము పరితాపములో నుండి
సీతేతి త్వామేవ అభిభాషమానః-
"సీతా" అని తలచుకుంటూ నీతోనే మాట్లాడతలచి
ధృతవ్రతః - ధృఢవ్రతుడై
తవ లాభాయ కృతప్రయత్నః-
నిన్ను పొందుటకు అన్నివిధములుగా ప్రయత్నిసున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ మహాత్ముడైన ఆ రాజకుమారుడు నిత్యము పరితాపములో నుండి "సీతా" అని తలచుకుంటూ నీతోనే మాట్లాడతలచి ధృఢవ్రతుడై నిన్ను పొందుటకు అన్నివిధములుగా ప్రయత్నిసున్నాడు". ||36.46||

||శ్లోకము 36.47||

సా రామసంకీర్తనవీతశోకా రామస్య శోకేన సమానశోకా|
శరమ్మఖే సాంబుదశేష చంద్రా నిశేవ వైదేహసుతా బభూవ||36.47||

స|| రామస్య శోకేన సమానశోకా రామసంకీర్తన వీత శోకా సా వైదేహ సుతా శరన్ ముఖే సామ్బుదశేషచంద్రా నిశేవ బభూవ||

||శ్లోకార్థములు||

రామస్య శోకేన సమానశోకా -
రాముని శోకముతో సమానమైన శోకముగల
రామసంకీర్తన వీత శోకా -
రామసంకీర్తనతో ఉపశమించిన శోకము గల
సా వైదేహ సుతా - ఆ వైదేహి
శరన్ముఖే నిశేవ - శరత్కాల రాత్రిలో
సామ్బుదశేష చంద్రా బభూవ-
మేఘములతో కప్పబడి ప్రకాశించీ ప్రకాశించని చంద్రుని వలె కనపడెను

||శ్లోకతాత్పర్యము||

" రాముని శోకముతో సమానమైన శోకముగల ఆ వైదేహి హనుమంతుని రామసంకీర్తనతో మేఘములతో కప్పబడి ప్రకాశించీ ప్రకాశించని శరత్ కాల చంద్రునివలె కనపడెను." ||36.47||

రాముడు నిత్యము తనకోసమే శోకములో వున్నాడు అన్నమాటవిని, రాముని శోకముతో సమానమైన శోకముగల ఆ వైదేహి హనుమంతుని రామసంకీర్తనతో, మేఘములతో కప్పబడి ప్రకాశించీ ప్రకాశించని శరత్ కాల చంద్రునివలె ప్రకాశించెను.

"దూతో రామస్య ధీమతః" అంటూ తన పరిచయము చేసుకున్న హనుమ , రాముని శోకము కూడా వివరించి సీత మనస్సులో రాముడు సుఖముగా ఉన్నాడన్నమాటతో ఆనందము, తనకోసము అత్యంత శోకములో ఉన్నాడన్న మాటతో దుఃఖము కలిగిస్తాడు. ఆ విధముగా ఒకే సమయములో సుఖదుఃఖాలతో కలత పడిన సీత , మేఘాలలో కనపడీ కనపడకపోయిన చంద్రుని వలె ప్రకాశించుచున్నది అంటాడు కవి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షట్ర్త్రింశస్సర్గః ||

||ఓమ్ తత్ సత్||