||సుందరకాండ ||

||నలభై ఏడవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 47 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తచత్త్వారింశస్సర్గః||

" చకార రక్షోధిపతేర్మహత్ భయమ్" అంటే ఆ రాక్షసాధిపతి మనస్సులో మహత్తరమైన భయము కలిగినదట. నలభై ఆరవ సర్గలో రాక్షాధిపతి మనస్సులో సందేహాలు రేకెత్తిన మాట విన్నాము.
ఇప్పుడు సందేహాలు కాదు , భయము పుట్టినదట.
భయము ఎలాగ పుట్టినదో ఈ సర్గలో వింటాము.

పంచ సేనాపతులు వారి అనుచరులతో వాహనములతో హతమార్చబడిరని వినిన రావణుడు, తన దృష్టిని సమరమునకు సుముఖుడైన తన కుమారుడు అక్షునివైపు సారిస్తాడు. రావణుని చూపునే ఆదేశముగా గ్రహించిన అక్షుడు, మహాప్రతాపము కలవాడు. అప్పుడు అక్షుడు బంగారు ధనస్సును ధరించినవాడై, సదస్సులో వెలిగించబడిన హవిస్సులాగా లేచి నిలబడతాడు.

తండ్రి ఆజ్ఞ తో ఆ వీరుడు, అక్షకుమారుడు, బంగారపు జాలలతో విలసిల్లుతున్న రథమును ఎక్కి, మహావానరుని ప్రతి యుద్ధమునకు బయలు దేరుతాడు.

అంటే ఈ సర్గ లో అక్ష కుమారునితో హనుమంతుడి యుద్ధము వింటాము

ఇక నలభై ఏడవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.

||శ్లోకము 47.01||

సేనాపతీన్ పంచ స తు ప్రమాపితాన్
హనుమతా సానుచరాన్ సవాహనాన్|
సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం
కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః||47.01||

స||పంచ సేనాపతీన్ స అనుచరాన్ స వాహనాన్ ప్రమాపితాన్ సమీక్ష్య రాజా సమరోద్ధతః ఉన్ముఖం కుమారం అక్షం అగ్రతః ప్రసమైక్షత||

గోవిన్దరాజ టీకాలో- సమీక్ష్య విజ్ఞాయ ( తెలిసికొని)

|| శ్లోకార్థములు||

స అనుచరాన్ స వాహనాన్ -
అనుచరులలతో వాహనములతో
ప్రమాపితాన్ పంచ సేనాపతీన్ సమీక్ష్య -
హతమార్చబడిన పంచ సేనాపతులు గురించి తెలిసికొని
సమరోద్ధతః ఉన్ముఖం -
సమరమునకు సుముఖుడైన
రాజా అగ్రతః కుమారం అక్షం ప్రసమైక్షత -
రాజు ముందున్నతన కుమారుడు అక్షునివైపు తన దృష్టిని సారించెను

||శ్లోకతాత్పర్యము||

"పంచ సేనాపతులు వారి అనుచరులలతో వాహనములతో హతమార్చబడిరని తెలిసికొనిన రాజు ఆ తన దృష్టిని సమరమునకు సుముఖుడైన తన కుమారుడు అక్షునివైపు సారించెను." ||47.01||

||శ్లోకము 47.02||

స తస్య దృష్ట్యర్పణసంప్రచోదితః
ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః|
సముత్పపాతాథ సదస్యుదీరితో
ద్విజాతిముఖ్యైర్హవిషేవ పావకః||47.02||

స|| అథ తస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముఖః సదసి ద్విజాతి ముఖ్యైః హవిషాఉదీరితః పావకః ఇవ సముత్పపాత||

రామ టీకాలో- తస్య రావణస్య దృష్ట్యర్పణేన దృష్టి ప్రచాలనే ఏవ సంప్రచోదితః ప్రేరితః పావక ఇవ సముత్పపాత।

|| శ్లోకార్థములు||

అథ తస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః-
అప్పుడు అతని చూపునే ఆదేశముగా గ్రహించిన
ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముఖః -
ప్రతాపము గల వాడు బంగారు ధనస్సును ధరించినవాడు
ద్విజాతి ముఖ్యైః - బ్రాహ్మణోత్తములచేత
హవిషాఉదీరితః పావకః ఇవ హవిస్సులో పెంపబడిన అగ్ని వలె
సదసి సముత్పపాత - సభలో లేచెను.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు అతని చూపునే ఆదేశముగా గ్రహించిన ప్రతాపము గల వాడు బంగారు ధనస్సును ధరించినవాడై సదస్సులో వెలిగించబడిన హవిస్సులాగా లేచి నిలబడెను." ||47.02||

||శ్లోకము 47.03||

తతో మహద్బాలదివాకరప్రభమ్
ప్రతప్త జాంబూనదజాలసంతతమ్|
రథం సమాస్థాయ యయౌ స వీర్యవాన్
మహాహరిం తం ప్రతి నైరృతర్షభః||47.03||

స|| తతః వీర్యవాన్ నైరృతర్షభః మహత్ బాలదివాకరప్రభం ప్రతప్త జాంబూనద జాలసంతతం రథం సమాస్థాయ స మహహరిం ప్రతి యయౌ ||

|| శ్లోకార్థములు||

తతః మహత్ వీర్యవాన్ నైరృతర్షభః -
అప్పుడు మహా వీరుడు రాక్షసోత్తముడు
బాలదివాకరప్రభం -
బాలదివాకురునివలె తేజము కల
ప్రతప్త జాంబూనద జాలసంతతం -
మేలిమి బంగారపు జాలలతో విలసిల్లుతున్న
రథం సమాస్థాయ స -
రథమును ఎక్కి అతడు
మహహరిం ప్రతి యయౌ -
ఆ మహావానరుని ప్రతి యుద్ధమునకు బయలు దేరెను.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు బాలదివాకురునివలె తేజము కల వీరుడు, మేలిమి బంగారపు జాలలతో విలసిల్లుతున్న రథమును ఎక్కి ఆ మహావానరుని ప్రతి యుద్ధమునకు బయలు దేరెను."||47.03||

||శ్లోకము 47.04||

తతస్తపః సంగ్రహ సంచయార్జితమ్
ప్రతప్త జాంబూనదజాల శోభితమ్|
పతాకినం రత్నవిభూషిత ధ్వజమ్
మనోజవాష్టాశ్వవరైః సుయోజితమ్||47.04||

స|| తతః తపఃసంగ్రహః సంచయార్జితం ప్రతప్త జాంబూనదజాలశోభితం పతాకినం రత్నవిభూషిత ధ్వజమ్ మనోజవా అష్ట వరైః అశ్వైః సుయోజితం ||

|| శ్లోకార్థములు||

తతః తపఃసంగ్రహః సంచయార్జితం -
అప్పుడు తపస్సుతో ఆర్జించబడిన
ప్రతప్త జాంబూనదజాలశోభితం -
మేలిమి బంగారపు జాలలతో శోభించుచున్న
పతాకినం రత్నవిభూషిత ధ్వజమ్ -
పతాకములతో రత్నములతో పొదగబడిన ధ్వజముతో గల
మనోజవా అష్ట వరైః అశ్వైః సుయోజితం -
మనోవేగముతో పోగల ఎనిమిది అశ్వములచేత లాగబడిన

||శ్లోకా తాత్పర్యము||

"తపస్సుతో ఆర్జించబడిన మేలిమి బంగారపు జాలలతో శోభించుచున్న ఆ రథము , పతాకములతో రత్నములతో పొదగబడిన ధ్వజముతో గలది. మనోవేగముతో పోగల ఎనిమిది అశ్వములచేత లాగబడినది." ||47.04||

||శ్లోకము 47.05||

సురాసురాధృష్య మసంగచారిణం
రవిప్రభం వ్యోమచరం సమాహితమ్|
సతూణమష్టాసినిబద్ధబంధురమ్
యథాక్రమావేశిత శక్తితోమరమ్||47.05||

స|| సురాసురాధృష్యం అసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సతూణం సమాహితం అష్టాసి నిబద్ధబంధురం యథాక్రమావేశితశక్తితోమరం||

రామ టీకాలో - అసంగచారిణం నిరాలమ్బగమనశీలమ్

|| శ్లోకార్థములు||

సురాసురాధృష్యం -
సురాసురులకు దుష్కరమైనది
అసంగచారిణం -
నిరాటంకముగా పోగలగినది
రవిప్రభం వ్యోమచరం -
రవితేజముతో ఆకాశమార్గమున పోగలగినది
సతూణం సమాహితం -
బాణములుపెట్టుకొనే తూర్ణము తో కూడిన
అష్టాసి నిబద్ధబంధురం -
ఎనిమిది ఖడ్గములతో అమర్చబడిన
యథాక్రమావేశితశక్తితోమరం -
యథా క్రమముగా అమర్చబడిన శక్తులు తోమరములతో కూడిన

||శ్లోకతాత్పర్యము||

"ఆ రథము సురాసురులకు దుష్కరమైనది. నిరాటంకముగా పోగలగినది. రవితేజముతో ఆకాశమార్గమున పోగలగినది. బాణములుపెట్టుకొనే తూర్ణము, ఎనిమిది ఖడ్గములు, శక్తులు మున్నగునవి సముచిత స్థానములలో అ రథములో అమరించబడినవి." ||47.05||

||శ్లోకము 47.06||

విరాజమానం ప్రతిపూర్ణ వస్తునా
సహేమదామ్నా శశిసూర్యవర్చసా|
దివాకరాభం రథమాస్థితః తతః
స నిర్జగామామరతుల్యవిక్రమః||47.06||

స||తతః అమరతుల్యవిక్రమః విరాజమానం సః సహేమదామ్నా శశిసూర్య వర్చసా ప్రతిపూర్ణవస్తునా విరాజమానం దివాకరాభం రథం ఆస్థితః నిర్జగామ||

|| శ్లోకార్థములు||

తతః అమరతుల్యవిక్రమః -
అప్పుడు పరాక్రమములో అమరులతో సమానమైన
సహేమదామ్నా విరాజమానం సః -
బంగారుమాలలచే విరాజిల్లుచున్న అతడు
శశిసూర్య వర్చసా -
చంద్ర సూర్యుల తేజస్సుగల
ప్రతిపూర్ణవస్తునా -
అన్నిరకముల ఆయుధములతో నిండివున్న
దివాకరాభం -
సూర్యుని వలె తేజోమయమైన
రథం ఆస్థితః నిర్జగామ -
దివ్యరథమును ఎక్కి బయలు దేరెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు పరాక్రమములో అమరులతో సమానమైన అ అక్షకుమారుడు బంగారుమాలలచే విరాజిల్లుచున్న, చంద్ర సూర్యుల తేజస్సుగల , అన్నిరకముల ఆయుధములతో నిండివున్న , దివ్యరథమును ఎక్కి బయలు దేరెను." ||47.06||

||శ్లోకము 47.07||

స పూరయన్ ఖం మహీం చ సాచలామ్
తురంగమాతంగ మహారథస్వనైః|
బలైః సమేతైః స హి తోరణస్థితమ్
సమర్థ మాసీనముపాగమత్ కపిమ్||47.07||

స||సః తురంగ మాతంగ మహారథస్వనైః ఖం మహీం చ స అచలాం పూరయన్ సమేతైః బలైః సహ తోరణస్థం సమర్థం ఆసీనం కపిం ఉపాగమత్||

|| శ్లోకార్థములు||

సః తురంగ మాతంగ మహారథస్వనైః -
తురంగముల మాతంగముల మహారథముల ఘోషతో
ఖం మహీం చ స అచలాం పూరయన్ -
భూమిని ఆకాశమును పర్వతరాజములను నింపుతో్
సమేతైః బలైః సహ తోరణస్థం ఆసీనం -
మహాసైన్యముతో కూడి తోరణముపై ఆసీనుడైన
సమర్థం కపిం ఉపాగమత్ -
సమర్థుడైన వానరుని సమీపించెను

||శ్లోకతాత్పర్యము||

" తురంగముల మాతంగముల మహారథముల ఘోషతో భూమిని ఆకాశమును పర్వతరాజములను నింపుతో. మహాసైన్యముతో ఆ రాక్షసుడు, సమర్థుడు తోరణముపై ఉపశ్థితుడైన అయిన వానరుని సమీపించెను." ||47.07||

||శ్లోకము 47.08||

స తం సమాసాద్య హరిం హరీక్షణో
యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే|
అవస్థితం విస్మితజాతసంభ్రమః
సమైక్షతాక్షో బహుమానచక్షుసా||47.08||

స|| సః హరీక్షణః అక్షః ప్రజాక్షయే యుగాంతకాలగ్నిం ఇవ అవస్థితం తం హరిం సమాసాద్య విస్మితజాత సంభ్రమః బహుమాన చక్షుసా సమైక్షత ||

|| శ్లోకార్థములు||

సః హరీక్షణః అక్షః - ఆ సింహపు దృష్టి గల అక్షుడు
ప్రజాక్షయే యుగాంతకాలగ్నిం ఇవ అవస్థితం -
యుగాంతములో ప్రజలను నశింపచేయు ప్రళయాగ్నివలె వున్న
తం హరిం సమాసాద్య -
ఆ వానరుని సమీపించి
విస్మితజాత సంభ్రమః -
అశ్చర్య జనిత సంభ్రమముతో
బహుమాన చక్షుసా సమైక్షత -
గౌరవభావముకల దృష్టి తో చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ సింహపు దృష్టి గల అక్షుడు, యుగాంతములో ప్రజలను నశింపచేయు ప్రళయాగ్నివలె వున్న ఆ వానరుని సమీపించి, గౌరవభావముతో అశ్చర్యసంతోష జనిత దృష్టితో హనుమంతుని చూడసాగెను." ||47.08||

||శ్లోకము 47.09||

స తస్యవేగం చ కపేర్మహాత్మనః
పరాక్రమం చారిషు పార్థివాత్మజః|
విచారయన్ స్వం చ బలం మహాబలో
హిమక్షయే సూర్య ఇవాఽభివర్ధతే||47.09||

స|| మహాబలః పార్థివాత్మజః మహాత్మనః తస్య కపేః వేగం చ అరిషు పరాక్రమం చ స్వం బలం చ విచారయన్ హిమక్షయే సూర్య ఇవ అభివర్ధతే||

|| శ్లోకార్థములు||

మహాబలః పార్థివాత్మజః -
మహాబలుడు రాజకుమారుడు
మహాత్మనః తస్య కపేః వేగం చ -
మహాత్ముడు అగు ఆ వానరుని వేగమును
అరిషు పరాక్రమం చ -
శత్రువులమీద చూపగల బలమును
స్వం బలం చ విచారయన్ -
తన బలమును గురించి విచారించి,
హిమక్షయే సూర్య ఇవ అభివర్ధతే -
మంచును నశింపచేయు సూర్యుని వలె భాసించెను

||శ్లోకతాత్పర్యము||

"మహాబలుడు రాజకుమారుడు మహాత్ముడు అగు అక్షుడు ఆ వానరుని వేగమును , శత్రువులమీద చూపగల బలమును, తన బలమును గురించి విచారించి, మంచును నశింపచేయు సూర్యుని వలె భాసించెను." ||47.09||

||శ్లోకము 47.10||

స జాతమన్యుః ప్రసమీక్ష్య విక్రమం
స్థిరం స్థితః సంయతి దుర్నివారణమ్|
సమాహితాత్మా హనుమంతమాహవే
ప్రచోదయామాస శరైస్త్రిభిశ్శితైః||47.10||

స|| సంయతి దుర్నివారణం స్థిరం విక్రమం ప్రసమీక్ష్య సః( అక్షుః) జాతమన్యుః స్థిరః సమాహితాత్మా హనుమంతం శితైః త్రిభిః శరైః ఆహవే ప్రచోదయామాస||

|| శ్లోకార్థములు||

సంయతి దుర్నివారణం -
యుద్ధములో ఎదుర్కొనబడలేని
స్థిరం విక్రమం ప్రసమీక్ష్య -
స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని చూచి
సః( అక్షుః) జాతమన్యుః -
అతడు కోపము గలవాడై
స్థిరః సమాహితాత్మా -
మనస్సును స్థిరపరచుకొని
హనుమంతం శితైః త్రిభిః శరైః -
హనుమంతునిపై సునిశితమైన మూడు బాణములతో
ఆహవే ప్రచోదయామాస -
యుద్ధములో ప్రయోగించెను

||శ్లోకతాత్పర్యము||

"యుద్ధములో ఎదుర్కొనబడలేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని చూచి కోపము గలవాడై మనస్సును స్థిరపరచుకొని హనుమంతునిపై సునిశితమైన మూడు బాణములతో ఆహ్వానరూపముగా ప్రయోగించెను."

||శ్లోకము 47.11||

తతః కపిం తం ప్రసమీక్ష్య గర్వితమ్
జితశ్రమం శత్రుపరాజయోర్జితమ్|
అవైక్షతాక్షః సముదీర్ణమానసః
స బాణపాణిః ప్రగృహీతకార్ముకః||47.11||

స|| తతః సః అక్షః గర్వితం శత్రుపరాజయోర్జితమ్ తం కపిం జితశ్రమం ప్రసమీక్ష్య బాణపాణిః ప్రగృహీతకార్ముకః సముదీర్ణమానసః అవైక్షత||

|| శ్లోకార్థములు||

తతః సః అక్షః - అప్పుడు ఆ అక్షుడు
గర్వితం శత్రుపరాజయోర్జితమ్ -
శత్రుపరాజయములను ఆర్జించిన గర్వము గల
జితశ్రమం తం కపిం ప్రసమీక్ష్య -
శ్రమలేని ఆ వానరుని చూచి
బాణపాణిః ప్రగృహీతకార్ముకః -
ధనస్సు తీసుకొని బాణములను చేతబట్టి
సముదీర్ణమానసః అవైక్షత -
రణోత్సాహముతో చూచెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ అక్షుడు శత్రుపరాజయములను ఆర్జించిన గర్వము గల, శ్రమలేని ఆ వానరుని చూచి ధనస్సును బాణములను చేతబట్టి రణోత్సాహముతో తనమనస్సులో అలోచించెను." ||47.11||

||శ్లోకము 47.12||

స హేమ నిష్కాంగద చారుకుండలః
సమాససాదాశు పరాక్రమః కపిమ్|
తయోర్బభూవాప్రతిమః సమాగమః
సురాసురాణామపి సంభ్రమప్రదః||47.12||

స|| అశు పరాక్రమః హేమనిష్కాంగద చారుకుండలః సః కపిం సమాససాద | తయోః అప్రతిమః సంగమః సురః అసురాణాం అపి సంభ్రమప్రదః అభూత్ ||

రామటీకాలో - హేమనిష్కాంగదాభ్యాం సహితం చారు కుణ్డలం యస్య సః ఆశుపరాక్రమః స కుమారః సమాససాద|

|| శ్లోకార్థములు||

అశు పరాక్రమః - ప్రచండ పరాక్రమము గల
హేమనిష్కాంగద చారుకుండలః -
బంగారు బాహుపురులు కుండలములను దాల్చిన
సః కపిం సమాససాద -
ఆ రాజకుమారుడు ఆ కపిని (యుద్ధమునకై) సమీపించెను
తయోః అప్రతిమః సంగమః -
వారి అప్రతిమ సంగ్రామము
సురః అసురాణాం అపి సంభ్రమప్రదః అభూత్ -
సురులకు అసురులకు కూడా సంభ్రమము కలిగించెను

||శ్లోకతాత్పర్యము||

"ప్రచండ పరాక్రమము గల బంగారు బాహుపురులు కుండలములను దాల్చిన ఆ రాజకుమారుడు ఆ కపిని (యుద్ధమునకై) సమీపించెను. వారి అప్రతిమ సంగమము సురులకు అసురులకు కూడా సంభ్రమము కలిగించెను."

||శ్లోకము 47.13||

రరాస భూమిర్నతతాప భానుమాన్
వవౌ న వాయుః ప్రచచాల చాచలః|
కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగమ్
ననాద చ ద్యౌరుదధిశ్చ చుక్షుభే||47.13||

స|| కపేః కుమారస్య చ సంయుగం వీక్ష్య భూమిః రరాస | భానుమాన్ నతతాప| వాయుః న వవౌ| అచలః చ ప్రచచాల | ద్యౌః ఉదధిశ్చ చుక్షుభే||

|| శ్లోకార్థములు||

కపేః కుమారస్య చ సంయుగం వీక్ష్య -
ఆ వానరుని రాజకుమారుని సమరము చూచి
భూమిః రరాస - భూమి దద్దరిల్లెను
భానుమాన్ నతతాప -
సూర్యుడు తపించుటలేదు
వాయుః న వవౌ -
వాయువు వీచుటలేదు
అచలః చ ప్రచచాల -
అచలములు చలించినవి
ద్యౌః ఉదధిశ్చ చుక్షుభే -
ఆకాశము సముద్రము క్షోభించినవి

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుని రాజకుమారుని సమరము చూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడు తపించుటలేదు. వాయువు వీచుటలేదు. అచలములు చలించినవి. ఆకాశము సముద్రము క్షోభించినవి." ||47.13||

||శ్లోకము 47.14||

తతః సవీరః సుముఖాన్ పతత్రిణః
సువర్ణపుంఖాన్ సవిషా నివోరగాన్|
సమాధిసంయోగ విమోక్షతత్త్వవిత్
శరానథత్రీన్ కపిమూర్ధ్నపాతయత్||47.14||

స|| తతః అథ వీరః సమాధిసంయోగవిమోక్షతత్త్వవిత్ సః సుముఖాన్ సువర్ణపుంఖాన్ పతత్రిణః సవిషాన్ ఉరగాన్ ఇవ త్రీన్ శరాన్ కపిమూర్ధ్ని అపాతయత్ ||

|| శ్లోకార్థములు||

తతః అథ వీరః - అప్పుడు ఆ వీరుడు
సమాధిసంయోగవిమోక్షతత్త్వవిత్ -
బాణములను సంధించి గురిచూచి లక్ష్యములకు మోక్షము కలిగించు వాడు,
సుముఖాన్ సువర్ణపుంఖాన్ సః -
సుముఖమైన బంగారు పిడులుకలవాడు అగు ఆతడు
పతత్రిణః సవిషాన్ ఉరగాన్ ఇవ -
పాములవలె విషపూరితమైన
త్రీన్ శరాన్ కపిమూర్ధ్ని అపాతయత్ -
మూడు బాణములను కపి శిరస్సు పై ప్రయోగించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆప్పుడు బాణములను సంధించి గురిచూచి లక్ష్యములకు మోక్షము కలిగించు వాడు, సుముఖమైన బంగారు పిడులుకలవాడు అగు ఆ అక్షకుమారుడు వీరుడు విషపూరితమైన మూడు బాణములను కపి శిరస్సు పై ప్రయోగించెను." ||47.14||

||శ్లోకము 47.15||

స తైః శరైర్మూర్థ్ని సమం నిపాతితైః
క్షరన్నసృద్దిగ్ధ వివృత్తలోచనః|
నవోదితాదిత్యనిభః శరాంశుమాన్
వ్యరాజతాదిత్య ఇవాంశుమాలికః||47.15||

స|| సమం మూర్ధ్ని నిపాతితైః తైః శరైః క్షరన్ అసృగ్ధితవివృత్తలోచనః నవోదితాదిత్యనిభః శరాంశుమాన్ సః అంశుమాలికః ఆదిత్య ఇవ వ్యరాజత||

|| శ్లోకార్థములు||

సమం మూర్ధ్ని నిపాతితైః -
ఒకే క్షణములో తలపై పడిన
తైః శరైః క్షరన్ -
ఆ శరములతో కొట్టబడి
అసృగ్ధితవివృత్తలోచనః -
కారుచున్నరక్తధారతో తడిసిన కళ్ళుకల (ఆ వానరుడు)
నవోదితాదిత్యనిభః శరాంశుమాన్ -
శరములే కిరణముల లాగా కొత్తగా ఉదయించిన సూర్యుని వలె
సః అంశుమాలికః ఆదిత్య ఇవ వ్యరాజత -
కిరణములే మాలలా గల సూర్యునివలె విరాజిల్లెను

||శ్లోకతాత్పర్యము||

"ఒకే క్షణములో తలపై పడిన, ఆ శరములతో కొట్టబడి , కారుచున్నరక్తధారతో తడిసిన కళ్ళుకల ఆ వానరుడు, ఆ శరములే కిరణముల లాగా కొత్తగా ఉదయించిన సూర్యుని వలె, కిరణములే మాలలా గల సూర్యునివలె విరాజిల్లెను." ||47.15||

||శ్లోకము 47.16||

తతః స పింగాధిపమంత్రిసత్తమః
సమీక్ష్య తం రాజవరాత్మజం రణే|
ఉదగ్ర చిత్రాయుధ చిత్రకార్ముకమ్
జహర్ష చాపూర్య చాహవోన్ముఖః||47.16||

స|| తతః సః పింగాధిపమంత్రిసత్తమః ఉదగ్ర చిత్రాయుధ కార్ముకం తం రాజవరాత్మజం సమీక్ష్య అహవః ఉన్ముఖః అపూర్యత చ ||

|| శ్లోకార్థములు||

తతః సః పింగాధిపమంత్రిసత్తమః -
అప్పుడు వానరాధిపతి మంత్రిసత్తముడు అయిన హనుమంతుడు
ఉదగ్ర చిత్రాయుధ కార్ముకం -
వివిధమైన అయుధములతోనూ చిత్రమైన ధనస్సుతోనూ ఉన్న
తం రాజవరాత్మజం సమీక్ష్య -
ఆ రాజుయొక్క వరిష్ట పుత్రుని చూచి
అహవః ఉన్ముఖః అపూర్యత చ -
యుద్ధమునకు తయారు అయ్యెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు వానరాధిపతి మంత్రిసత్తముడు అయిన హనుమంతుడు, వివిధమైన అయుధములతోనూ చిత్రమైన ధనస్సుతోనూ ఉన్న ఆ రాజుయొక్క వరిష్ట పుత్రుని చూచి యుద్ధమునకు తయారు అయ్యెను."||47.16||

||శ్లోకము 47.17||

స మందరాగ్రస్థ మివాంశుమాలికో
వివృద్ధకోపా బలవీర్యసంయుతః|
కుమారమక్షం సబలం స వాహనమ్
దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా||47.17||

స|| మందరాగ్రస్థః ఇవ బలవీర్యసంయుతః సః వివృద్ధకోపః సబలం సవాహనం కుమారం అక్షం తదా నేత్రాగ్నిమరీచిభిః దదాహ||

|| శ్లోకార్థములు||

మందరాగ్రస్థః ఇవ -
మందరపర్వతము పై కూర్చునినవాని వలె
బలవీర్యసంయుతః సః వివృద్ధకోపః -
బలము వీర్యము కల మరింతపెరిగిన కోపము కల
సబలం సవాహనం కుమారం అక్షం -
బలములతో వాహనములతో వున్నఅక్షకుమారుని
తదా నేత్రాగ్నిమరీచిభిః దదాహ-
తన కళ్లలో ఉన్న అగ్నితో దహించివేయునా అన్నట్లు చూచెను

||శ్లోకతాత్పర్యము||

"మందరపర్వతము పై కూర్చునినవాని వలె బలము వీర్యము కల మరింతపెరిగిన కోపము కల ఆ వానరుడు, బలములతో వాహనములతో వున్న ఆ అక్షకుమారుని తనకళ్లలో ఉన్న అగ్నితో దహించివేయునా అన్నట్లు చూచెను." ||47.17||

||శ్లోకము 47.18||

తతస్స బాణాసన చిత్రకార్ముకః
శర ప్రవర్షో యుధి రాక్షసాంబుదః|
శరాన్ ముమోచాశు హరీశ్వరాచలే
వలాహకో వృష్టి మివాsచలోత్తమే||47.18||

స|| తతః బాణాసన చిత్రకార్ముకః శరప్రవర్షః సః రాక్షసాంబుదః యుధి ఆశు హరీశ్వరాచలే వలాహకః అచలోత్తమే వృష్టిం ఇవ శరాన్ ముమోచ||

|| శ్లోకార్థములు||

తతః బాణాసన చిత్రకార్ముకః -
ఆ బాణములు కల చిత్రమైన ధనస్సుతో
శరప్రవర్షః - శరపరంపరను
సః రాక్షసాంబుదః -
ఆ మేఘములవంటి రాక్షసుడు
యుధి ఆశు హరీశ్వరాచలే -
యుద్ధములో త్వరగా పర్వతములాంటి హనుమపై
వలాహకః అచలోత్తమే వృష్టిం ఇవ -
మేఘములు పర్వవతము మీద కురిపించిన వాన వలె
శరాన్ ముమోచ - బాణములను కురిపించెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ బాణములు కల చిత్రమైన ధనస్సుతో శరపరంపరను, ఆ వానరోత్తమునిపై అక్షకుమారుడు నీటితో నిండిన మేఘములు సమున్నత పర్వతముపై వర్షము కురిపించునట్లు కురిపించెను."||47.18||

||శ్లోకము 47.19||

తతః కపిస్తం రణచండవిక్రమమ్
విరుద్ధతేజో బలవీర్యసంయుతమ్|
కుమారమక్షం ప్రసమీక్ష్య సంయుగే
ననాద హర్షాత్ ఘనతుల్యవిక్రమః||47.19||

స|| తతః కపిః రణచండవిక్రమమ్ విరుద్ధతేజోబలవీర్య సంయుతం ఘనతుల్యవిక్రమమ్ తం కుమారం అక్షం ప్రసమీక్ష్య హర్షాత్ ననాద||

|| శ్లోకార్థములు||

తతః రణచండవిక్రమమ్ -
ఆ యుద్ధములో ప్రచండ విక్రమము గల
విరుద్ధతేజోబలవీర్య సంయుతం -
అత్యంత తేజోబలములతో కూడిన
ఘనతుల్యవిక్రమమ్ -
మేఘములతో సమానమైన పరాక్రమము గల
తం కుమారం అక్షం ప్రసమీక్ష్య -
ఆ అక్షకుమారుని చూచి
కపిః హర్షాత్ ననాద -
ఆ వానరుడు ఆనందముతో గర్జించెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ యుద్ధములో ప్రచండ విక్రమము గల అమిత పరాక్రమము గల వానరుడు, మేఘములతో సమానమైన పరాక్రమము గల ఆ అక్షుని చూచి ఆనందముతో గర్జించెను." ||47.19||

||శ్లోకము 47.20||

స బాలభావాద్యుధి వీర్యదర్పితః
ప్రవృత్తమన్యుః క్షతజోపమేక్షణః|
సమాససాదాప్రతిమం కపిం రణే
గజో మహాకూపమివావృతం తృణైః||47.20||

స|| సః బాలభావాత్ యుధి వీర్యదర్పితః ప్రవృద్ధమన్యుః క్షతజోపమేక్షణః సః రణే అప్రతిమం కపిం గజః తృణైః ఆవృతం మహాకూపం ఇవ సమాససాద||

|| శ్లోకార్థములు||

సః బాలభావాత్ -
ఆ అక్షుడు బాలుని భావముతో
యుధి వీర్యదర్పితః -
యుద్ధములో గర్వముతో,
ప్రవృద్ధమన్యుః క్షతజోపమేక్షణః -
కోపముతో తన కళ్ళను ఎర్రచేస్తూ
సః రణే అప్రతిమం కపిం -
రణములో అప్రతిమమైన వానరుని వైపు
గజః తృణైః ఆవృతం మహాకూపం ఇవ -
గడ్డితో కప్పబడిన మహాకూపమును దాటుతున్న ఏనుగ వలె
సమాససాద -
ముందుకుదూసుకు పోయెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ అక్షుడు బాలుని భావముతో యుద్ధములో గర్వముతో, కోపముతో తన కళ్ళను ఎర్రచేస్తూ రణములో అప్రతిమమైన వానరుని వైపు గడ్డితో కప్పబడిన మహాకూపమును దాటుతున్న ఏనుగ వలె ముందుకుదూసుకు పోయెను." ||47.20||

||శ్లోకము 47.21||

స తేన బాణైః ప్రసభం నిపాతితైః
చకార నాదం ఘననాదనిస్స్వనః|
సముత్పపాతాశు నభస్సమారుతిః
భుజోరువిక్షేపణ ఘోరదర్శనః||47.21||

స|| సః తేన ప్రసభం నిపాతితైః బాణైః ఘననాదనిఃస్వనః నాదం చకార | సః మారుతిః భుజోరువిక్షేపణ ఘోరదర్శనః ఆశు నభః సముత్పపాత||

|| శ్లోకార్థములు||

సః తేన ప్రసభం నిపాతితైః బాణైః -
ఆ వానరుడు శరవేగముతో వచ్చుచున్నఅతని బాణములతో కోట్టబడి
ఘననాదనిఃస్వనః నాదం చకార -
మేఘనాదము కల వాడు మహత్తరమైన నాదము చేసెను
సః మారుతిః భుజోరువిక్షేపణ ఘోరదర్శనః -
ఆమారుతి భుజములు తొడలు చరుస్తూ ఘోరమైన రూపముతో
ఆశు నభః సముత్పపాత -
వెంటనే ఆకాశములోకి ఎగిరెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుడు అతని బాణములతో కోట్టబడి మహత్తరమైన నాదము చేసెను. ఆమారుతి భుజములు తొడలు చరుస్తూ ఘోరమైన రూపముతో ఆకాశములోకి ఎగిరెను." ||47.21||

||శ్లోకము 47.22||

సముత్పతంతం సమభిద్రవద్బలీ
స రాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ |
రథీ రథిశ్రేష్ఠతమః కిరన్ శరైః
పయోధరః శైలమివాశ్మ వృష్టిభిః||47.22||

స|| బలీ రాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ రథీ రథశ్రేష్ఠతమః సః పయోధరః అశ్మవృష్టిభిః శైలం ఇవ శరైః కిరణ్ ఉత్పతంతం సమభిద్రవత్ ||

|| శ్లోకార్థములు||

బలీ రాక్షసానాం ప్రవరః -
బలముగల, రాక్షసులలో ప్రవరుడు
ప్రతాపవాన్ రథీ రథశ్రేష్ఠతమః -
ప్రతాపము గలవాడు, రథములో ఉన్నవాడు, రథికులలో శ్రేష్ఠుడు అయిన ఆరాక్షసుడు
సః పయోధరః అశ్మవృష్టిభిః శైలం ఇవ -
మేఘములు పర్వతముపై వర్షము కురిపించిన రీతి
శరైః కిరణ్ ఉత్పతంతం సమభిద్రవత్ -
బాణములను ప్రయోగించుచూ పైకి లేచిన వానరుని వెంటాడెను

||శ్లోకతాత్పర్యము||

"బలముగల రాక్షసులలో ప్రవరుడు ప్రతాపము గలవాడు రథములో ఉన్నవాడు రథికులలో శ్రేష్ఠుడు అయిన ఆరాక్షసుడు మేఘములు పర్వతముపై వర్షము కురిపించిన రీతి బాణములను ప్రయోగించుచూ పైకి లేచిన వానరుని వెంటాడెను." ||47.22||

||శ్లోకము 47.23||

స తాన్ శరాం స్తస్య హరిర్విమోక్షయన్
చచార వీరః పథి వాయు సేవితే|
శరాంతరే మారుతవద్వినిష్పతన్
మనోజనః సంయతి చండవిక్రమః||47.23||

స|| మనోజవః సంయతి చండవిక్రమః వీరః సః హరిః మారుతవత్ వినిష్పతన్ తస్య శరాన్ విమోక్షయన్ వాయుసేవితే పథి చచార||

|| శ్లోకార్థములు||

మనోజవః సంయతి చండవిక్రమః వీరః -
మనస్సుతో సమానమైన వేగముకల యుద్ధములో ప్రచండ విక్రమము కల వీరుడు అగు
సః హరిః మారుతవత్ వినిష్పతన్ -
ఆ వానరుడు, వాయువు వలె తిరుగుతూ
తస్య శరాన్ విమోక్షయన్ -
అతని బాణములను తప్పించుకుంటూ
వాయుసేవితే పథి చచార -
ఆకాశ మార్గములలో తిరిగెను

||శ్లోకతాత్పర్యము||

"మనస్సుతో సమానమైన వేగముకల యుద్ధములో ప్రచండ విక్రమము కల వీరుడు అగు ఆ వానరుడు, వాయువు వలె తిరుగుతూ అతని బాణములను తప్పించుకుంటూ ఆకాశమున తిరిగెను."||47.23||

||శ్లోకము 47.24||

త మాత్త బాణాసన మాహవోన్ముఖం
ఖ మాస్తృణంతం నిశిఖైః శరోత్తమైః|
అవైక్షతాక్షం బహుమాన చక్షుసా
జగామ చింతాం చ స మారుతాత్మజః||47.24||

స|| స మారుతాత్మజః ఆత్తబాణాసనం అహవోన్ముఖం విశిఖైః శరోత్తమైః ఖం ఆస్తృణాంతం తం అక్షం బహుమానచక్షుసా అవైక్షత చింతాం చ జగామ||

|| శ్లోకార్థములు||

స మారుతాత్మజః - ఆ మారుతాత్మజుడు
ఆత్తబాణాసనం అహవోన్ముఖం -
రణోన్ముఖుడై ఒకే ధనస్సు చేత పట్టుకొని
విశిఖైః శరోత్తమైః ఖం ఆస్తృణాంతం -
ఉత్తమమైన బాణముల తో ఆకాశము అంతా నింపుతున్న
తం అక్షం బహుమానచక్షుసా అవైక్షత -
ఆ అక్షుని గౌరవభావముతో చూచెను (చూచి)
చింతాం చ జగామ - ఆలోచించసాగెను

||శ్లోకతాత్పర్యము||

" ఆ మారుతాత్మజుడు రణోన్ముఖుడై ఒకే ధారగా నిశితమైన ఉత్తమమైన బాణముల తో ఆకాశము అంతా నింపుతున్న ఆ అక్షుని గౌరవభావముతో చూస్తూ ఆలోచించసాగెను." ||47.24||

||శ్లోకము 47.25||

తతః శరైర్భిన్నభుజాంతరః కపిః
కుమారవీరేణ మహత్మనా నదన్|
మహాభుజః కర్మవిశేషతత్త్వవిత్
విచింతయామాస రణే పరాక్రమమ్||47.25||

స|| తతః మహభుజః కర్మవిశేషతత్త్వవిత్ కపిః మహాత్మనా కుమారవీరేణ భిన్నభుజాంతరః నదన్ రణే పరాక్రమం విచింతయామాస||

|| శ్లోకార్థములు||

తతః మహభుజః -
అప్పుడు మహాభుజములు కల
కర్మవిశేషతత్త్వవిత్ కపిః -
విశేషకర్మల జ్ఞానముకల ఆ వానరుడు
మహాత్మనా కుమారవీరేణ భిన్నభుజాంతరః -
ఆ కుమారవీరునిచే గాయపడిన భుజాంతరముకలవాడు
నదన్ రణే పరాక్రమం విచింతయామాస -
యుద్ధములో గర్జన చేయుచూ అలోచింపసాగెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు మహాభుజములు కల విశేషకర్మల జ్ఞానముకల ఆ వానరుడు ఆ కుమారవీరునిచే గాయపడిన భుజాంతరముకలవాడు గర్జన చేయుచూ అలోచింపసాగెను."||47.25||

||శ్లోకము 47.26||

అబాలవద్బాలదివాకర ప్రభః
కరోత్యయం కర్మ మహాన్ మహాబలః|
న చాస్య సర్వాహవకర్మశోభినః
ప్రమాపనే మే మతిరత్ర జాయతే||26||

స|| బాలదివాకరప్రభః మహాబలః అయం అబాలవత్ మహత్ కర్మ కరోతి| అత్ర సర్వాహవకర్మశోభినః అస్య ప్రమాపణే మే మతిః న చ జాయతే||

|| శ్లోకార్థములు||

బాలదివాకరప్రభః మహాబలః అయం -
బాలదివాకరుని తేజస్సు కలవాడు , మహాబలుడు అయిన వాడు
అబాలవత్ మహత్ కర్మ కరోతి -
అరితేరిన వానివలె మహత్తరమైన యుద్ధము చేయుచున్నాడు
అత్ర సర్వాహవకర్మశోభినః -
యుద్ధకర్మలను అన్నింటితోనూ శోభిస్తున్న
అస్య ప్రమాపణే మే మతిః న చ జాయతే -
ఇతనిని హతమార్చుటకు నాకు మనస్కరించుటలేదు

||శ్లోకతాత్పర్యము||

"బాలదివాకరుని తేజస్సు కలవాడు అయిన ఈ బాలకుడు అరితేరిన వానివలె మహత్తరమైన యుద్ధము చేయుచున్నాడు. యుద్ధకర్మలను అన్నింటితోనూ శోభిస్తున్న ఇతనిని హతమార్చుటకు నాకు మనస్కరించుటలేదు". ||47.26||

||శ్లోకము 47.27||

అయం మహాత్మా చ మహాంశ్చవీర్యత
స్సమాహితశ్చాతిసహశ్చ సంయుగే|
అసంశయం కర్మగుణోదయాదయం
సనాగయక్షైర్మునిభిశ్చ పూజితః||47.27||

స|| అయం మహాత్మా చ వీర్యతః చ మహాన్ సమాహితః సంయుగే అతిసహః | అయం అసంశయమ్ కర్మగుణోదయాత్ సనాగయక్షైః మునిభిః చ పూజితః||

|| శ్లోకార్థములు||

అయం మహాత్మా చ - ఇతడు మహాత్ముడు
వీర్యతః చ మహాన్ - వీరత్వములో మహాత్ముడు
సమాహితః సంయుగే అతిసహః -
యుద్ధములో సహనము వివేకము గలవాడు.
అయం అసంశయమ్ కర్మగుణోదయాత్ -
ఇతడు తన గుణములతో అశంసయముగా
సనాగయక్షైః మునిభిః చ పూజితః -
యక్షులకు దేవతలకు పూజనీయుడు

||శ్లోకతాత్పర్యము||

"ఇతడు మహాత్ముడు. వీరత్వములో మహాత్ముడు. యుద్ధములో సహనము వివేకము గలవాడు. ఇతడు తన గుణములతో అశంసయముగా నాగులకు యక్షులకు దేవతలకు పూజనీయుడు." ||47.27||

||శ్లోకము 47.28||

పరాక్రమోత్సాహవివృద్ధమానసః
సమీక్షతే మాం ప్రముఖాగ్రతః స్థితః|
పరాక్రమో హ్యస్య మనాంసి కంపయేత్
సురాసురాణామపి శీఘ్రగామినః||47.28||

స|| పరాక్రమోత్సాహ వివృద్ధమానసః ప్రముఖాగ్రతః స్థితః మామ్ సమీక్షతే శీఘ్రగామినః అస్య పరాక్రమః సురః అసురాణాం మనాంసి అపి ప్రకంపయేత్ ||

|| శ్లోకార్థములు||

పరాక్రమోత్సాహ వివృద్ధమానసః -
పరాక్రమోత్సాహములతో పెరుగుతున్న మనసు కలవాడై
ప్రముఖాగ్రతః స్థితః -
నాముందు నిలచి
మామ్ సమీక్షతే -
నన్ను ధైర్యముగా చూచుచున్నాడు
శీఘ్రగామినః అస్య పరాక్రమః -
శీఘ్రముగా చలనము కల ఈ ధీరుని పరాక్రమము
సురః అసురాణాం అపి -
సురులు అసురులకు కూడా
మనాంసి ప్రకంపయేత్ -
మనస్సులో భీతి కలిగించును

||శ్లోకతాత్పర్యము||

"పరాక్రమోత్సాహములతో పెరుగుతున్న మనసు కలవాడై నాముందు నిలచి నన్ను ధైర్యముగా చూచుచున్నాడు. శీఘ్రముగా చలనము కల ఈ ధీరుని పరాక్రమము సురులు అసురుల మనస్సులో భీతి కలిగించును". ||47.28||

||శ్లోకము 47.29||

న ఖల్వయం నాభిభవేదుపేక్షితః
పరాక్రమో హ్యస్యరణేవివర్ధతే|
ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే
న వర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః||47.29||

స|| అయం న ఉపేక్షితః నాభిభవేత్ న ఖలు రణే అస్య పరాక్రమః వర్ధతే హి | అద్య ప్రమాపణం త్వేవ మమ రోచతే | వర్ధమానః అగ్నిః ఉపేక్షితుం న క్షమః||

|| శ్లోకార్థములు||

అయం న ఉపేక్షితః నాభిభవేత్ -
ఇతనిని ఉపేక్షించరాదు
న ఖలు రణే అస్య పరాక్రమః వర్ధతే హి -
నన్నుఈ రణములో అతిక్రమించకపోయినా ఇతని పరాక్రమము వర్ధిల్లు చున్నది
అద్య ప్రమాపణం త్వేవ మమ రోచతే -
ఇప్పుడు ఇతనిని తుదముట్టించడమే మంచిదని నాకు తోచుచున్నది
వర్ధమానః అగ్నిః ఉపేక్షితుం న క్షమః -
పెరుగుతున్న మంటలను ఉపేక్షించుట కూడని పని

||శ్లోకతాత్పర్యము||

"ఇతనిని ఉపేక్షించరాదు. నన్నుఈ రణములో అతిక్రమించకపోయినా ఇతని పరాక్రమము వర్ధిల్లు చున్నది. ఇప్పుడు ఇతనిని తుదముట్టించడమే మంచిదని నాకు తోచుచున్నది. పెరుగుతున్న మంటలను ఉపేక్షించుట కూడని పని." ||47.29||

||శ్లోకము 47.30||

ఇతి ప్రవేగం తు పరస్య తర్కయన్
స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ |
చకారవేగం తు మహాబలః తదా
మతిం చ చక్రేఽస్య వధే మహాకపిః||47.30||

స|| వీర్యవాన్ మహాబలః మహాకపిః ఇతి పరస్య ప్రవేగం చింతయన్ స్వకర్మయోగం చ విధాయ తథా వేగం చకార| అస్య వధే మతిం చ చక్రే||

|| శ్లోకార్థములు||

వీర్యవాన్ మహాబలః మహాకపిః-
వీరుడైన మహాబలుడు మహాకపి
ఇతి పరస్య ప్రవేగం చింతయన్ -
అతని దూకుడిగురించి ఆలోచించి
స్వకర్మయోగం చ విధాయ -
తను చేయవలసిన కార్యమును నిశ్చయించుకొని
తథా వేగం చకార -
వేగముగా ముందుకు సాగెను
అస్య వధే మతిం చ చక్రే -
మనస్సులో అతనిని వధించుటకు నిశ్చయించుకొనెను

||శ్లోకతాత్పర్యము||

" వీరుడైన మహాబలుడు మహాకపి ఇలాగ అతని దూకుడిగురించి అలోచించి తను చేయవలసిన కార్యమును నిశ్చయించుకొని వేగముగా ముందుకు సాగెను. మనస్సులో అతనిని వధించుటకు నిశ్చయించుకొనెను."||47.30||

||శ్లోకము 47.31||

స తస్య తా నష్టహయాన్ మహాజవాన్
సమాహితాన్ భారసహాన్ వివర్తనే|
జఘాన వీరః పథి వాయుసేవితే
తలప్రహారైః పవనాత్మజః కపిః||47.31||

స|| వీరః పవనాత్మజః సః కపిః వాయుసేవితే పథి మహాజవాన్ సమాహితాన్ నివర్తనే భారసహాన్ తాన్ అష్ట హయాన్ తలప్రహారైః జఘాన||

|| శ్లోకార్థములు||

వీరః పవనాత్మజః సః కపిః -
వీరుడు పవనాత్మజుడు అగు ఆ కపిసత్తముడు
వాయుసేవితే పథి మహాజవాన్ -
వాయువు సంచరించు మార్గములో పోవు
సమాహితాన్ నివర్తనే భారసహాన్ -
రథమును తిప్పగల మహత్తరమైన భారములను మోయగల
తాన్ అష్ట హయాన్ తలప్రహారైః జఘాన -
ఆ ఎనిమిది అశ్వములను తన చేతితో కొట్టెను

||శ్లోకతాత్పర్యము||

"వీరుడు పవనాత్మజుడు అగు ఆ కపిసత్తముడు, వాయువు సంచరించు మార్గములో పోవు, రథమును తిప్పగల మహత్తరమైన భారములను మోయగల ఆ ఎనిమిది అశ్వములను తన చేతితో కొట్టెను." ||47.31||

||శ్లోకము 47.32||

తతః తలేనాభిహతో మహారథః
స తస్య పింగాధిపమంత్రిసత్తమః|
ప్రభఘ్ననీడః పరిముక్తకూబరః
పపాత భూమౌ హతవాజిరంబరాత్||47.32||

స|| తతః తలేన అభిహితః పింగాధిపమంత్రినిర్జితః తస్య మహారథః ప్రభఘ్ననీడః పరిముక్తకూబరః హతవాజిభిః అంబరాత్ భూమౌ పపాత||

|| శ్లోకార్థములు||

తతః తలేన అభిహితః -
అప్పుడు చేతితో కొట్టబడిన
పింగాధిపమంత్రినిర్జితః -
పింగాధిపతి మంత్రిచేత జయించబడి
తస్య మహారథః ప్రభఘ్ననీడః -
విరిగిన మహా రథముయొక్క కప్పు
పరిముక్తకూబరః హతవాజిభిః -
ముక్కలు ముక్కలుగా అయిన కూబరము, చనిపోయిన గుఱ్ఱములతొ సహా
అంబరాత్ భూమౌ పపాత -
అకాశమునుండి భూమి మీద పడిపోయెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు చేతితో కొట్టబడిన పింగాధిపతి మంత్రిచేత జయించబడి విరిగిన మహా రథముయొక్క కప్పు కూబరము ముక్కలు ముక్కలుగా చనిపోయిన గుఱ్ఱములతొ సహా భూమి మీద పడిపోయెను."||47.32||

||శ్లోకము 47.33||

స తం పరిత్యజ్య మహారథో రథం
స కార్ముకః ఖడ్గధరః ఖ ముత్సహన్|
తపోభియోగాదృషిరుగ్రవీర్యవాన్
విహాయ దేహం మరుతామివాలయమ్||47.33||

స||మహారథ సః రథం పరిత్యజ్య సకార్ముకః ఖడ్గధరః ఖం ఉత్పతన్ ఉగ్రవీర్యవాన్ దేహం విహాయ తపోభియోగాత్ మారుతం ఆలయం ఋషిః ఇవ||

|| శ్లోకార్థములు||

మహారథ సః రథం పరిత్యజ్య -
ఆ మహారథుడగు అతడు రధమును పరిత్యజించి
ఉగ్రవీర్యవాన్ సకార్ముకః -
ఉగ్ర వీరుడు తన ధనస్సుతోనూ
ఖడ్గధరః ఖం ఉత్పతన్ -
ఖడ్గముతోనూ అకాశములోకి ఎగిరెను
దేహం విహాయ తపోభియోగాత్ -
తపశ్శక్తితో దేహము వదిలి
మారుతం ఆలయం ఋషిః ఇవ -
అకాశమార్గమున పోవు ఋషులవలె

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహారథి రధమును పరిత్యజించి తన ధనస్సుతోనూ ఖడ్గముతోనూ ఉగ్రుడైన ఆ మహావీరుడు, తపశ్శక్తితో దేహము వదిలి అకాశమార్గమున పోవు ఋషులవలె అకాశములోకి ఎగిరెను."||47.33||

||శ్లోకము 47.34||

తతః కపిస్తం ప్రచరంతమంబరే
పతత్రి రాజానిలసిద్ధసేవితే|
సమేతయ తం మారుతతుల్య విక్రమః
క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం||47.34||

స||తతః మారుతితుల్యవిక్రమః కపిః పతత్రి రాజానిలసిద్ధసేవితే అంబరే విచరంతం తం సమేత్య క్రమేణ తం పాదయోః దృఢం జగ్రాహ||

|| శ్లోకార్థములు||

తతః మారుతితుల్యవిక్రమః కపిః -
అప్పుడు మారుతితో సమానమైన శక్తి కల వానరోత్తముడు
పతత్రి రాజానిలసిద్ధసేవితే -
సిద్ధులు గరుత్మంతుడు వాయువుల చే సేవించబడు
అంబరే విచరంతం తం సమేత్య -
ఆకాశములో తిరుగుచున్న ఆ అక్షుని సమీపించి
క్రమేణ తం పాదయోః దృఢం జగ్రాహ -
క్రమముగా వాని పాదములు గట్టిగా పట్టుకొనెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు మారుతితో సమానమైన శక్తి కల వానరోత్తముడు సిద్ధులు గరుత్మంతుడు వాయువునకు సంచారయోగ్యమైన ఆకాశములో తిరుగుచున్న ఆ అక్షుని సమీపించి వాని పాదములు గట్టిగా పట్టుకొనెను." ||47.34||

||శ్లోకము 47.35||

స తం సమావిధ్య సహశ్రసః కపిః
మహోరగం గృహ్య ఇవాండజేశ్వరః|
ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో
మహీతలే సంయతి వానరోత్తమః||47.35||

స|| పితృతుల్యవిక్రమః వానరోత్తమః సః కపిః అండజేశ్వరః మహోరగం గృహ్యైవ తం సంయతి సహశ్రసః సమావిధ్య వేగాత్ మహీతలే ముమోచ||

|| శ్లోకార్థములు||

పితృతుల్యవిక్రమః వానరోత్తమః సః కపిః -
ఇంద్రునితో సమానమైన పరాక్రమము గల వానరోత్తముడు అగు ఆ కపివరుడు
అండజేశ్వరః మహోరగం గృహ్యైవ -
మహాసర్పమును గరుత్మంతుడు చేజిక్కుంచికొనినట్లు
తం సంయతి సహశ్రసః సమావిధ్య -
ఆ అక్షకుమారుని పట్టుకొని వేయిసార్లు గిరగిరా తిప్పి
వేగాత్ మహీతలే ముమోచ -
వేగముగా భూమిపై పడవేసెను

||శ్లోకతాత్పర్యము||

"ఇంద్రునితో సమానమైన పరాక్రమము గల వానరోత్తముడు అగు ఆ కపివరుడు, మహాసర్పమును గరుత్మంతుడు చేజిక్కుంచికొనినట్లు, ఆ అక్షకుమారుని పట్టుకొని వేయిసార్లు గిరగిరా తిప్పి భూమిపై పడవేసెను." ||47.35||

||శ్లోకము 47.36||

సభగ్న బాహూరుకటీశిరోధరః
క్షరన్నసృజ్నిర్మథితాస్థిలోచనః|
సంభగ్నసంధిః ప్రవికీర్ణబంధనో
హతః క్షితౌ వాయుసుతేన రాక్షసః||47.36||

స|| స రాక్షసః భగ్నబాహు ఉరు కటీ శిరోధరః అసృక్ క్షరన్ నిర్మథితాస్థిలోచనః సంభగ్నసంధిఃప్రవికీర్ణబంధనః వాయుసుతేన క్షితౌ హతః||

|| శ్లోకార్థములు||

స రాక్షసః భగ్నబాహు ఉరు కటీ శిరోధరః-
ఆ రాక్షసుడు భగ్నమైన బాహువులు కలవాడై, తొడలు కటిప్రదేశము విరిగిపోయినవాడై
అసృక్ క్షరన్ నిర్మథితాస్థిలోచనః -
రక్తధారలతో కళ్ళు ఊడిపోయి
సంభగ్నసంధిః ప్రవికీర్ణబంధనః -
ఎముకలు విరిగిపోయి, కీళ్ళు ఊడిపోయి
వాయుసుతేన క్షితౌ హతః-
భూమిపై పడి వాయుసుతుని చేత హతమార్చబడినవాడయ్యను

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షసుడు భగ్నమైన బాహువులు కలవాడై, తొడలు కటిప్రదేశము విరిగిపోయినవాడై, ఎముకలు విరిగిపోయి, కీళ్ళు ఊడిపోయి భూమిపై పడి వాయుసుతుని చేత హతమార్చబడినవాడయ్యను." ||47.36||

||శ్లోకము 47.37||

మహాకపిర్భూమితలే నిపీడ్య తం
చకార రక్షోధిపతేర్మహత్ భయమ్|
మహర్షిభిశ్చక్రచరైర్మహావ్రతైః
సమేత్య భూతైశ్చ సయక్షపన్నగైః||47.37||
సురేశ్చసేంద్రైర్భృశజాత విస్మయైః
హతే కుమారే స కపిర్నిరీక్షితః|

స|| మహాకపిః తం భూమితలే నిపీడ్య రక్షోధిపతేః మహత్ భయం చకార | కుమారే హతే సః కపిః భృశజాతవిస్మయైః చక్రచరైః మహావ్రతైః మహర్షిభిః స యక్షపన్నగైః భూతైశ్చ స ఇంద్రైః సురైశ్చ సమేత్య నిరీక్షితః ||

|| శ్లోకార్థములు||

మహాకపిః తం భూమితలే నిపీడ్య -
ఆ మహాకపి వానిని భూమిమీద పడవేసి
రక్షోధిపతేః మహత్ భయం చకార -
ఆ రాక్షసాధిపతికి మహత్తరమైన భయము కలిగించెను.
కుమారే హతే - ఆ కుమారుడు హతమార్చబడగా
చక్రచరైః మహావ్రతైః మహర్షిభిః స -
ఆకాశములో తిరుగువారు మహావ్రతములు చేయు మహర్షులు
యక్షపన్నగైః భూతైశ్చ -
యక్షులు పన్నగులు సమస్త భూతములు
స ఇంద్రైః సురైశ్చ సమేత్య -
ఇంద్రుడుతో కూడిన సురలు కూడా కలిసి
భృశజాతవిస్మయైః సః కపిః నిరీక్షితః -
ఆశ్చర్యచకితులై ఆ వానరుని చూచిరి''

||శ్లోక తాత్పర్యము||

"ఆ మహాకపి వానిని భూమిమీద పడవేసి, ఆ రాక్షసాధిపతికి మహత్తరమైన భయము కలిగించెను. ఆ వానరోత్తముని చేత ఆ కుమారుడు హతమార్చబడగా చూచిన, ఆకాశములో తిరుగు మహావ్రతములు చేయు మహర్షులు, యక్షులు పన్నగులు సమస్త భూతములు ఇంద్రుడుతో కూడిన సురలు ఎంతో ఆశ్చర్యచకితులైరి."||47.37||

||శ్లోకము 47.38||

నిహత్య తం వజ్రిసుతోపమప్రభం
కుమారమక్షం క్షతజోపమేక్షణమ్
తమేవ వీరోభి జగామ తోరణం
కృతః క్షణః కాల ఇవా ప్రజాక్షయే|| 47.38||

స||వీరః వజ్రిసుతోపమప్రభం క్షతజోపమేక్షణం తం అక్షం నిహత్య ప్రజాక్షయే కృతక్షణః కాలః ఇవ తం తోరణమేవ అభిజగామ||

|| శ్లోకార్థములు||

వీరః వజ్రిసుతోపమప్రభం -
ఇంద్రుని కొడుకుతూ సమానమైన తేజస్సుకలవాడు
క్షతజోపమేక్షణం తం అక్షం నిహత్య -
రక్తవర్ణనేత్రములు గలవాడు అయిన ఆ అక్షకుమారుని హతమార్చి
ప్రజాక్షయే కృతక్షణః కాలః ఇవ -
ప్రళయకాలములో ప్రజలను అంతమొందించు కాలునివలె
తం తోరణమేవ అభిజగామ-
( హనుమ) అశోకవన తోరణముపై మరల ఎక్కి కూర్చొనెను

||శ్లోకతాత్పర్యము||

"ఇంద్రుని కొడుకుతూ సమానమైన తేజస్సుకలవాడు రక్తవర్ణనేత్రములు గలవాడు అయిన ఆ అక్షకుమారుని హతమార్చిన హనుమంతుడు, ప్రళయకాలములో ప్రజలను అంతమొందించు కాలునివలె, అశోకవన తోరణముపై మరల ఎక్కి కూర్చొనెను."||47.38,39||

అంటే ఆ మహాకపి అక్షుని భూమిమీద పడవేసి, 'చకార రక్షోధిపతేర్మహత్ భయమ్' - ఆ రాక్షసాధిపతి అయిన రావణునికి మహత్తరమైన భయము కలిగించెను అన్నమాట. ఆ మాట తో నలభై ఏడవ సర్గ సమాప్తమౌతుంది.

అంటే సీతమ్మ దర్శనము అయి తిరుగు ముఖము పట్టబోతూ, సామదాన బేద దండో పాయములలో దండో పాయము ఉపయోగించి,

"హతప్రవీరా హి రణే హి రాక్షసాః
కథంచి దీయుర్యది హాద్య మార్దవమ్|"

అంటే 'యుద్ధములో రాక్షసులను కొందరిని చంపినచో వారు మెత్తపడుదురు"
అని ఆలోచించిన హనుమ, వాళ్ళని మెత్తపడునట్లు చేయడమే కాక, ఆ రాక్షసాధిపతి కి భయము కూడా కలిగించి తన కార్యము సాధించాడన్నమాట.

అదే హనుమంతుని ఘనత.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తచత్త్వారింశస్సర్గః ||

||om tat sat||

 

 

 

 

 

 

 

 

7