||సుందరకాండ ||
||ఏభైయవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||
|| Sarga 50 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ పంచాశస్సర్గః||
"దూతోహమితి విజ్ఞేయో " అంటే నేను దూతను అని తెలిసికొనుము అని. ఎవరి దూత ? 'రాఘవస్య అమిత తేజశః'.'అమిత తేజోమయుడైన రాముని దూతను' అని.
ఇది హనుమంతుని మాట.
రావణుని కలిసివెళ్ళుదాము అని నిశ్చయించుకొనిన హనుమ , ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి లొంగి, రాజసభకు చేరి, రావణునికి రాఘవుని దూతను అంటూ తన స్వరూపము వివరిస్తాడన్నమాట. అదే ఈ సర్గలో వింటాము.
ఇక ఏభయ్యవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.
||శ్లోకము 50.01||
తముద్వీక్ష్య మహాబాహుః పింగాక్షం పురతః స్థితమ్ |
కోపేన మహతాssవిష్టో రావణో లోకరావణః ||50.01||
శంకాహృతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసా వృతమ్ |
స|| మహాబాహుః లోకరావణః సః రావణః పురతః స్థితం మహాబాహుం పింగాక్షం మహతా కోపేన ఆవిష్టః స తేజసా వృతం కపీంద్రం ఉద్దీక్ష్య శంకాహృతాత్మా దధ్యౌ||
తిలక టీకాలో - తేజసా వృత్తం। దృష్ట్వేతి శేషః।
||శ్లోకార్థములు||
మహాబాహుః లోకరావణః -
మహాబాహువులుకల లోకకంటకుడు అయిన
సః రావణః మహతా కోపేన ఆవిష్టః -
మహత్తరమైన కోపము కలవాడై,
పురతః స్థితం మహాబాహుం పింగాక్షం -
ముందు నుంచుని ఉన్న మహబాహువులుకల, పింగాక్షములు కల
స తేజసా వృతం కపీంద్రం ఉద్దీక్ష్య-
తన తేజస్సుతో వెలిగిపోతున్న వానరేన్ద్రుని పరికించి
శంకాహృతాత్మా దధ్యౌ-
శంకలతో నిండిన హృదయము కలవాడై చింతించ సాగెను
||శ్లోకతాత్పర్యము||
"మహాబాహువులుకల లోకకంటకుడు అయిన ఆ రావణుడు మహత్తరమైన కోపము కలవాడై,ముందు నుంచుని ఉన్న, పింగాక్షములు కల, తన తేజస్సుతో వెలిగిపోతున్న వానరేన్ద్రుని పరికించి, శంకలతో నిండిన హృదయము కలవాడై చింతించ సాగెను." ||50.01||
లోకకంటకుడు అయిన ఆ రావణుడు, ముందు నుంచుని ఉన్నమహబాహువులుకల ఆ వానరుని మహత్తరమైన కోపము తో చూస్తాడు.
అలా చూచినప్పుడు ఆ వానరేంద్రుని తేజస్సుతో, రావణుని మనస్సులో శంకలు రేకెత్తుతాయి. ఏమిటి అవి?
"పూర్వము కైలాసమును కదిలించినపుడు ఎవరిచేత శపింపబడితినో, ఆ భగవాన్ నంది సాక్షాత్తు ఇక్కడికి వచ్చెనా? లేక ఇతడు వానరరూపము లోవచ్చిన బాణాసురుడా ఏమి?"అని.
ఇవి రావణుని మనస్సులో ఉన్న శంకలు. దేవతలను ఓడించినట్లు ఎన్ని ప్రగల్భాలు పలికినా తనపై విజయము సాధించే వారెక్కడో ఉన్నారేమో అని భయము మనస్సులో ఉంటుంది.
కాని రాజుగా తన శంకలు అందరికి తెలియకూడదు. అందుకని మళ్ళీ సద్దుకొని క్రోధముతో నిండిన కళ్ళు కలవాడై మంత్రిసత్తముడు అగు ప్రహస్తునితో కాలానుగుణముగా అర్థవంతముగా రావణుడు ఈ మాటలు చెపుతాడు.
||శ్లోకము 50.02,03||
కిమ్ ఏష భగవాన్ నందీ భవేత్ సాక్షాత్ ఇహాగతః||50.02||
యేనశప్తోఽస్మి కైలాసే మయా సంచాలితా పురా|
సోఽయం వానరమూర్తిః స్యాత్ కింసిద్బాణోఽపివాఽసురః||50.03||
స|| ఏషః పురా మయా కైలాసే సంచాలితే యేన శప్తః అస్మి భగవాన్ సాక్షాత్ ఇహ ఆగతః నందీ భవేత్ కిం? | సః అయం వానరమూర్తిః మహాసురః బాణః స్యాత్ కింస్విత్ ||
||శ్లోకార్థములు||
ఏషః - ఇతడు
పురా మయా కైలాసే సంచాలితే -
పూర్వము నాచేత కైలాసమును కదిలింపబడినపుడు
యేన శప్తః అస్మి - ఎవరిచేత శపింపబడితినో
భగవాన్ నందీ సాక్షాత్ ఇహ ఆగతః భవేత్ కిం? -
అ భగవాన్ నంది సాక్షాత్తు ఇక్కడికి వచ్చెనా ఏమి?
సః అయం వానరమూర్తిః - ఇతడు వానర రూలపములో
మహాసురః బాణః స్యాత్ కింస్విత్ - వచ్చిన బాణాసురుడా ఏమి?
||శ్లోకతాత్పర్యము||
"పూర్వము కైలాసమును కదిలించినపుడు ఎవరిచేత శపింపబడితినో అ భగవాన్ నంది సాక్షాత్తు ఇక్కడికి వచ్చెనా? లేక ఇతడు వానరరూపము లోవచ్చిన బాణాసురుడా ఏమి?" ||50.02,03||
||శ్లోకము 50.4||
స రాజా రోషతామ్రాక్షః ప్రహస్తం మంత్రిసత్తమమ్|
కాలయుక్తమువాచేదం వచో విపుల మర్థవత్ ||50.04||
స|| సః రాజా రోషతామ్రాక్షః మంత్రిసత్తమం ప్రహస్తం కాలయుక్తం అర్థవిత్ అవిపులమ్ ఇదం వచః ఉవాచ||
||శ్లోకార్థములు||
సః రాజా రోషతామ్రాక్షః -
అప్పుడు ఆ రాజు క్రోధముతో నిండిన కళ్ళు కలవాడై
మంత్రిసత్తమం ప్రహస్తం -
మంత్రిసత్తముడు అగు ప్రహస్తునితో
కాలయుక్తం అవిపులమ్ అర్థవిత్ -
కాలానుగుణముగా క్లుప్తముగా అర్థవంతముగా
ఇదం వచః ఉవాచ - ఈ వచనములను పలికెను
||శ్లోకతాత్పర్యము||
"అప్పుడు ఆ రాజు క్రోధముతో నిండిన కళ్ళు కలవాడై మంత్రిసత్తముడు అగు ప్రహస్తునితో కాలానుగుణముగా అర్థవంతముగా క్లుప్తముగా ఈ వచనములను పలికెను."||50.04||
||శ్లోకము 50.05||
దురాత్మా పృచ్ఛ్యతామేష కుతః కిం వాఽస్య కారణమ్|
వనభంగే చ కోఽస్యార్థో రాక్షసీనాం చ తర్జనే||50.05||
స|| ఏష దురాత్మా పృచ్ఛతాం కుతః కిం వా అస్య కారణం వనభంగే చ రాక్షసీనాం తర్జనే చ | అస్య అర్థః కః| '
||శ్లోకార్థములు||
ఏష దురాత్మా పృచ్ఛతాం -
ఈ దురాత్ముని అడుగుడు
కుతః కిం వా అస్య కారణం-
ఎక్కడనుంచి దీనికి కారణమేమి ?
వనభంగే చ రాక్షసీనాం తర్జనే చ -
వనధ్వంసము , రాక్షసస్త్రీలను భయపెట్టుటకు
అర్థః కః - అర్థమేమి?
||శ్లోకతాత్పర్యము||
"ఈ దురాత్ముని అడుగుడు. ఎక్కడనుంచి ( వచ్చెను) దీనికి కారణమేమి? వనధ్వంసము , రాక్షసస్త్రీలను భయపెట్టుటలో అర్థమేమి? " ||50.05||
||శ్లోకము 50.06||
మత్పురీ మప్రధృష్యాం వాఽఽగమనే కిం ప్రయోజనమ్|
అయోధనే వా కిం కార్యం పృచ్ఛ్యతా మేష దుర్మతిః||50.06||
స|| పృచ్ఛ్యతా మేష దుర్మతిః అప్రధృష్యాం మత్పురీం ఆగమనే కిం ప్రయోజనమ్| అయోధనే వా కిం కార్యం|
||శ్లోకార్థములు||
ఏష దుర్మతిః పృచ్ఛ్యతాం -
ఈ దుర్మతిని అడుగుడు
అప్రధృష్యాం మత్పురీం ఆగమనే కిం ప్రయోజనమ్ -
దుర్భేధ్యమైన నా నగరమునకు రావడములో ఇతని ప్రయోజనమేమి
అయోధనే వా కిం కార్యం -
యుద్ధము చేయుటలో ఉద్దేశ్యమేమి?
||శ్లోకతాత్పర్యము||
"దుర్భేధ్యమైన నా నగరమునకు రావడములో ఇతని ప్రయోజనమేమి? యుద్ధము చేయుటలో ఉద్దేశ్యమేమి?"||50.06||
||శ్లోకము 50.07||
రావణస్య వచశ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ |
సమాశ్వసిహి భద్రం తే న భీః కర్యా త్వయాకపే||50.07||
స|| రావణస్య వచః శ్రుత్వా ప్రహస్తః వాక్యం అబ్రవీత్ | హే కపే భద్రం తే |త్వయా భీః న కార్యా |సమాశ్వసిహి||
||శ్లోకార్థములు||
రావణస్య వచః శ్రుత్వా -
రావణుని మాటలను విని
ప్రహస్తః వాక్యం అబ్రవీత్ -
ప్రహస్తుడు ఇట్లు పలికెను
హే కపే భద్రం తే -
ఓ వానరా, నీకు క్షేమము అగుగాక
త్వయా భీః న కార్యా -
నీకు భయపడవలదు
సమాశ్వసిహి -
ఆశ్వాసమివ్వబడిది
||శ్లోకతాత్పర్యము||
"రావణుని మాటలను విని ప్రహస్తుడు ఇట్లు పలికెను. ' ఓ వానరా ! నీకు క్షేమము అగుగాక. భయపడవలదు. నీకు ఆశ్వాసమివ్వబడిది." ||50.07||
||శ్లోకము 50.08||
యది తావత్ త్వం ఇంద్రేణ ప్రేషితో రావణాలయమ్|
తత్ త్వమాఖ్యాహి మాభూత్తే భయం వానర మోక్ష్యసే||50.08||
స|| వానర త్వం ఇంద్రేణ రావణాలయం ప్రేషితః యది తావత్ తత్ త్వం ఆఖ్యాహి | భయం మాభూత్ | మోక్ష్యసే|
||శ్లోకార్థములు||
వానర త్వం ఇంద్రేణ -
ఓ వానరా నీవు ఇంద్రునిచేత
రావణాలయం ప్రేషితః -
రావణాలయమునకు పంపబడినచో
యది తావత్ తత్ త్వం ఆఖ్యాహి -
అది నీవు చెప్పుము
భయం మాభూత్ -
భయపడకుము
మోక్ష్యసే-
మోక్షము పోందెదవు
||శ్లోకతాత్పర్యము||
"ఓ వానరా ఇంద్రునిచే త ఈ రావణాలయమునకు పంపబడినచో అది చెప్పుము. భయపడకుము. నీవు బంధము నుంచి మోక్షము పోందెదవు." ||50.08||
||శ్లోకము 50.09||
యది వైశ్రవణస్య త్వం యమస్య వరుణస్య చ|
చార రూప మిదం కృత్వా ప్రవిష్టో నః పురీమిమామ్||50.09||
విష్ణునా ప్రేషితోపి వా దూతో విజయకాంక్షిణా|
స|| ఇదం చారరూపమ్ కృత్వా నః ఇమాం పురీం ప్రవిష్టః త్వం వైశ్రవణస్య యమస్య వరుణస్య చ విజయకాంక్షిణా విష్ణునా దూతః ప్రేషితః వా అపి ( ఆఖ్యాహి)||
||శ్లోకార్థములు||
ఇదం చారరూపమ్ కృత్వా -
ఈ చారుని రూపములో
నః ఇమాం పురీం ప్రవిష్టః త్వం -
మా ఈ నగరమును ప్రవేశించిన నీవు
వైశ్రవణస్య యమస్య వరుణస్య చ -
కుబేరుని లేక యముని లేక వరుణుని
విజయకాంక్షిణా విష్ణునా దూతః ప్రేషితః వా అపి-
లేక విజయముకోరి విష్ణువు చేత పంపబడిన దూతవా ?
||శ్లోకతాత్పర్యము||
"ఈ చారుని రూపములో ఈ నగరమును ప్రవేశించిన నీవు, కుబేరుని లేక యముని లేక వరుణుని దూతవా ? లేక విజయముకోరి విష్ణువు చేత పంపబడిన దూతవా?"||50.09||
||శ్లోకము 50.10||
న హి తే వానరం తేజో రూపమాత్రం తు వానరమ్||50.10||
తత్త్వతః కథయస్వాద్యతతో వానర మోక్ష్యసే|
స||వానరః తే రూపమాత్రం తు | తేజః వానరః న హి | అద్య తత్త్వతః కథయస్వ | తతః మోక్ష్యసే||
||శ్లోకార్థములు||
వానరః తే రూపమాత్రం తు -
నీవు రూపమునకు మాత్రము వానరుడవు
తేజః వానరః న హి -
తేజస్సుతో వానరుడవు కావు
అద్య తత్త్వతః కథయస్వ -
ఇప్పుడు నీ నిజము చెప్పుము. కాగలవు
తతః మోక్ష్యసే - అప్పుడు బంధవిముక్తుడవు
||శ్లోకతాత్పర్యము||
"నీవు రూపమునకు మాత్రము వానరుడవు. తేజస్సుతో వానరుడవు కావు. ఇప్పుడు నీ నిజము చెప్పుము. అప్పుడు బంధవిముక్తుడవు కాగలవు." ||50.10||
||శ్లోకము 50.11||
అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితమ్||50.11||
అథవా యన్నిమిత్తం తే ప్రవేశో రావణాలయే|
స||తవ అనృతం వదతః జీవితం దుర్లభం| అథవా రావణాలయే తే ప్రవేశః యన్నిమిత్తః||
||శ్లోకార్థములు||
తవ అనృతం వదతః -
నీవు అబద్ధము చెప్పినచో
జీవితం దుర్లభం -
జీవించుట దుర్లభము
అథవా రావణాలయే -
లేక రావణాలయము
తే ప్రవేశః యన్నిమిత్తః -
నీ ప్రవేశము ఎందుకొరకు?
||శ్లోకతాత్పర్యము||
"నీవు అబద్ధము చెప్పినచో జీవించుట దుర్లభము. రావణాలయము నీ ప్రవేశము ఎందుకొరకు?" ||50.11||
||శ్లోకము 50.12||
ఏవముక్తో హరిశ్రేష్ఠః తదా రక్షోగణేశ్వరమ్||50.12||
అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా|
ధనదేన న మేశఖ్యం విష్ణునా నాస్మి చోదితః||50.13||
జాతిరేవ మమ త్వేషా వానరోఽహ మిహాగతః|
స|| ఏవం ఉక్తః హరిశ్రేష్ఠః తదా రక్షోగణేశ్వరం అబ్రవీత్ | శక్రస్య యమస్య వరుణస్య న అస్మి | మే ధనదేన సఖ్యం న| విష్ణునా చోదితః న | ఏషా మమ జాతిరేవ | అహం వానరః ఇహ ఆగతః||
రామ టీకాలో - ఏషా వానరత్వ రూపైవ మమ జాతిః।అత ఏవ వానర ఏవాహం దర్శనం దుర్లభం తస్య రాక్షసేన్ద్రస్య తవ దర్శనార్థం ఇహ ఆగతః। అత ఏవ రాక్షస రాజస్య దర్శనార్థే వనం వినాసితమ్ ।
||శ్లోకార్థములు||
ఏవం ఉక్తః హరిశ్రేష్ఠః - ఈ విధముగా అడగబడిన వానరోత్తముడు
తదా రక్షోగణేశ్వరం అబ్రవీత్-
ఆ రాక్షసగణముల అధిపతికి ఇట్లు చెప్పెను
శక్రస్య యమస్య వరుణస్య న అస్మి -
నేను ఇంద్రుని యముని వరుణుని వాడను కాను
మే ధనదేన సఖ్యం న -
నేను కుబేరుని సఖ్యుడను కాను
విష్ణునా చోదితః న -
విష్ణువుచేత పంపబడిన వాడను కాను
ఏషా మమ జాతిరేవ -
నేను జాతి రూపముగా వానరుడనే
అహం వానరః ఇహ ఆగతః -
నేను వానరుడను ఇక్కడికి వచ్చినవాడను.
||శ్లోకతాత్పర్యము||
" ఈ విధముగా అడగబడిన వానరోత్తముడు ఆ రాక్షసగణముల అధిపతికి ఇట్లు చెప్పెను. 'నేను ఇంద్రుని యముని వరుణుని వాడను కాను. నేను కుబేరుని సఖ్యుడను కాను. విష్ణువుచేత పంపబడిన వాడను కాను. నేను జాతి రూపముగా వానరుడనే. నేను వానరుడను ఇక్కడికి వచ్చినవాడను'. ||50.12,13||
||శ్లోకము 50.14||
దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా ||50.14||
వనం రాక్షస రాజస్య దర్శనార్థే వినాశితం |
స|| రాక్షసేంద్రస్య దర్శనే దుర్లభే మయా తత్ ఇదం వనం రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం ||
||శ్లోకార్థములు||
రాక్షసేంద్రస్య దర్శనే దుర్లభే -
రాక్షసేంద్రుని దర్శనము దుర్లభము
మయా తత్ ఇదం వనం -
అందువలన ఈ వనము
రాక్షసరాజస్య దర్శనార్థే వినాశితం -
రాక్షసరాజుయొక్క దర్శనార్థము నాశనము చేయబడినది
||శ్లోకతాత్పర్యము||
"రాక్షసేంద్రుని దర్శనము దుర్లభము. అందువలన రాక్షసరాజుయొక్క దర్శనార్థము ఈ వనమును నాశనము చేసితిని." ||50.14||
||శ్లోకము 50.15||
తతస్తే రాక్షసాః ప్రాప్తా బలినో యుద్ధకాంక్షిణః||50.15||
రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధామయారణే|
స|| తతః బలినః తే రాక్షసాః యుద్ధకాంక్షిణః ప్రాప్తాః దేహస్య రక్షనార్థం తు మయా రణే ప్రతియుద్ధాః||
||శ్లోకార్థములు||
తతః బలినః తే రాక్షసాః -
అప్పుడు బలవంతులైన ఆ రాక్షసులు
యుద్ధకాంక్షిణః ప్రాప్తాః -
యుద్ధకాంక్షతో తలపడిరి
దేహస్య రక్షనార్థం తు -
దేహరక్షణ కోసము
మయా రణే ప్రతియుద్ధాః -
నేను యుద్ధము చేసితిని.
||శ్లోకతాత్పర్యము||
"అప్పుడు బలవంతులైన రాక్షసులు యుద్ధకాంక్షతో తలపడిరి. దేహరక్షణార్థము నేను యుద్ధము చేసితిని." ||50.15||
||శ్లోకము 50.16||
అస్త్రపాశై ర్నశక్యోఽహం బద్ధుం దేవాసురైరపి||50.16||
పితామహా దేవ వరో మమాప్యేష్యోఽభ్యుపాగతః|
స|| అహం దేవాసురైరపి అస్త్రపాశైః బద్ధం న శక్యః | ఏషః వరః పితామహాదేవ అభ్యుపాగతః||
||శ్లోకార్థములు||
అహం దేవాసురైరపి -
దేవాసురలకు కూడా నేను
అస్త్రపాశైః బద్ధం న శక్యః -
అస్త్రములచేత బంధింపడ జానను
ఏషః పితామహాదేవ -
ఇది బ్రహ్మదేవుడు
వరః అభ్యుపాగతః -
నా కిచ్చిన వరము
||శ్లోకతాత్పర్యము||
"నేను దేవాసురలకు కూడా అస్త్రములతో బంధింప శక్యము కాదు. ఇది బ్రహ్మదేవుడు నా కిచ్చిన వరము." ||50.16||
||శ్లోకము 50.17,18||
రాజానం ద్రష్టుకామేన మయాస్త్ర మనువర్తితమ్||50.17||
విముక్తో హ్యహ మస్త్రేణ రాక్షసైస్త్వభిపీడితః|
కేనచిద్రాజకార్యేణ సంప్రాప్తోఽస్మి తవాన్తికమ్||50.18||
స|| రాజానం ద్రష్టుకామేన మయా అస్త్రం అనువర్తితం రాక్షసైః అభిపీడితః తు అహం అస్త్రేణ విముక్తో హి కేనాచిత్ రాజకార్యేణ తవ అన్తికం సంప్రాప్తః అస్మి||
||శ్లోకార్థములు||
రాజానం ద్రష్టుకామేన -
రాజుని చూచు కోరికతో
రాక్షసైః అభిపీడితః తు -
రాక్షసులచే పీడింపబడినప్పటికీ
అహం అస్త్రేణ విముక్తో హి -
నేను అస్త్రమునుండి విముక్తుడైననూ
మయా అస్త్రం అనువర్తితం -
నేను బ్రహ్మాస్త్రమునకు లొంగిపోతిని
కేనాచిత్ రాజకార్యేణ -
ఒక రాజకార్యముతో
తవ అన్తికం సంప్రాప్తః అస్మి-
నీ దర్శనము సంపాదించితిని
||శ్లోకతాత్పర్యము||
"రాక్షసరాజుని చూచు కోరికతో, రాక్షసులచే పీడింపబడినప్పటికీ అస్త్రమునుండి విముక్తుడైననూ నేను బ్రహ్మాస్త్రమునకు లొంగిపోతిని. ఓక ముఖ్య రాజకార్యముతో నీ దర్శనము సంపాదించితిని".||50.17,18||
||శ్లోకము 50.19||
దూతోహమితి విజ్ఞేయో రాఘవ స్యామితౌ జసః|
శ్రూయతాం చాపి వచనం మమ పథ్య మిదం ప్రభో||50.19||
స|| అహం అమిత తేజసః రాఘవస్య దూతః ఇతి విజ్ఞేయః |ప్రభో ఇదం మమ పథ్యం వచనం శ్రూయతాం చాపి||
||శ్లోకార్థములు||
అహం అమిత తేజసః రాఘవస్య దూతః-
నేను అమిత తేజస్సు కల రాఘవుని దూతగా
ఇతి విజ్ఞేయః - అని తెలిసి కొనుము
ప్రభో ఇదం మమ పథ్యం వచనం -
ఓ ప్రభో నేను చెప్పే హితవచనములను
శ్రూయతాం చాపి - కూడా వినుము
||శ్లోకతాత్పర్యము||
"నేను అమిత తేజస్సు కల రాఘవుని దూతను అని తెలిసి కొనుము. ఓ ప్రభో నేను చెప్పే హితవచనములను కూడా వినుము". ||50.19||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచాశస్సర్గః ||
||ఓమ్ తత్ సత్||
'