||సుందరకాండ ||
||ఏభై మూడవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||
|| Sarga 53 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ త్రిపంచాశస్సర్గః ||
ఏభయ్ మూడవ సర్గలో మనకి వినబడే మాట, 'శీతో భవ'
'శీతో భవ' అంటే 'చల్లబడు గాక' అని. ఎవరు ? 'హనూమతః' ; అంటే'హనుమంతుడు చల్లబడుగాక", అని.
ఇది సీతమ్మవారి ప్రార్థన.
ఈ ప్రార్థన సాధారణ ప్రార్థన కాదు. తన శక్తి నంతా ఉపయోగించి చేస్తున్న ప్రార్థన.
'యద్యతి పతి శుశ్రూషా' -
అంటే 'నేనే పతికి శుశ్రూష చేసినదానినైతే! '.
'యద్యస్తి చరితం తప" -
అంటే 'నేను చేసిన తపము యొక్క బలమున్నచో !'.
'యది చాస్తేకపత్నీత్వం' -
అంటే" నేనే పతివ్రతని అయితే!'.
'యది వాభాగ్యశేషో మే' -
అంటే' నాకు భాగ్యము మిగిలి ఉన్నచో'!
'శీతో భవ హనుమతః' -
హనుమంతుడు చల్లబడుగాక అని.
అంటే సీతమ్మ తన శక్తులన్నీ దావా పెట్టి, హనుమంతుడు చల్లబడుగాక అని అగ్ని దేవుడికి ప్రార్థన చేస్తోందన్నమాట. అంటే ఎంత దుఃఖములో ఉన్నా తన శక్తిని తనకై ఉపయోగించని సీతమ్మ, తనని ఆదుకోడానికి రామ దూతగా వచ్చిన , రామనామాంకిత అంగుళీయకము తనకు ఇచ్చిన, హనుమ కష్టములలో ఉన్నాడని అని విని, తన శక్తిని దావా పెట్టి హుతాశనుని ప్రార్థించిందన్నమాట
ఇలా సీతమ్మ తన శక్తులన్ని ఉపయోగించవలసి వచ్చిన కథ ఎలాజరిగిందో మనము ఈ సర్గలో వింటాము.
ఇక ఈ సర్గలోని శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.
||శ్లోకము 53.01||
తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః |
దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్ ||53.01||
స|| దశగ్రీవః మహాబలః తస్య తద్వచనం దేశకాలహితం వాక్యం శ్రుత్వా భ్రాతురుః ఉత్తరం అబ్రవీత్ ||
|| శ్లోకార్థములు||
దశగ్రీవః మహాబలః -
మహాబలుడైన దశగ్రీవుడు
తస్య తద్వచనం -
అతని ఆ మాటలు
దేశకాలహితం వాక్యం శ్రుత్వా -
దేశకాలానుగుణమైన హితవాక్యములను విని
భ్రాతురుః ఉత్తరం అబ్రవీత్-
తమ్మునికి ప్రత్యుత్తరమిచ్చెను
|| శ్లోక తాత్పర్యము||
మహాబలుడైన దశగ్రీవుడు దేశకాలానుగుణమైన తమ్ముని హితవాక్యములను విని అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. ||53.01||
||శ్లోకము 53.02||
సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హితా |
అవశ్యం తు వధా దన్యః క్రియతా మస్యనిగ్రహః ||53.02||
స|| భవతా సమ్యక్ ఉక్తం దూత వధ్యా విగర్హితా | అస్య నిగ్రహః వధాత్ అన్యః అవశ్యం క్రియతాం ||
|| శ్లోకార్థములు||
భవతా సమ్యక్ ఉక్తం -
నీ చేత సముచితముగా చెప్పబడినది
దూత వధ్యా విగర్హితా -
దూత వధ గర్హితము
అస్య నిగ్రహః వధాత్ -
ఇతనిని వధించుటకన్న
అన్యః అవశ్యం క్రియతాం -
ఇతర దండన తప్పక విధించాలి
|| శ్లోక తాత్పర్యము ||
'దూత వధ గర్హితము అని నీ చేత సముచితముగా చెప్పబడినది. ఇతనిని వధించుటకన్న ఇతర దండన తప్పక విధించాలి.' ||53.02||
క్రిందటి సర్గలో, 'న దూత వధ్యా' , అంటే దూతలను వధింపరాదు అని చెప్పిన విభీషణుని హిత వాక్యములను ముందు తోసిపుచ్చినా, రావణుడు చివరికి తన సమ్మతము చూపిస్తాడు.
||శ్లోకము 53.03||
కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణమ్ |
తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్ఛతు ||53.03||
స|| కపీనాం భూషణం లాంగూలం ఇష్టం భవతి | తత్ అస్య ( లాంగూలం) దీప్యతాం | తేన దగ్ధేన శీఘ్రం గచ్ఛతు ||
|| శ్లోకార్థములు||
కపీనాం లాంగూలం భూషణం -
వానరులకు వారి లాంగూలమే భూషణము
ఇష్టం భవతి - వారికి ఇష్టము
తత్ అస్య ( లాంగూలం) దీప్యతాం -
అందువలన అతని లాంగూలము కాల్చబడుగాక
తేన దగ్ధేన శీఘ్రం గచ్ఛతు -
ఆ తోక దగ్ధముకాగానే అతడు శీఘ్రముగా వెళ్ళుగాక
|| శ్లోక తాత్పర్యము||
'వానరులకు వారి లాంగూలమే భూషణము ఇష్టము. అందువలన అతని లాంగూలము కాల్చబడుగాక'. ||53.03||
||శ్లోకము 53.04||
తతః పశ్యం త్విమం దీనం అంగవైరూప్యకర్శితమ్ |
సమిత్ర జ్ఞాతయః సర్వే బాన్ధవాః ససుహృత్ జనాః ||53.04||
స|| తతః ఇమం అంగవైరూప్యకర్శితం దీనం జ్ఞాతయః సర్వే బాంధవాః సమిత్ర ససుహృత్ పశ్యం ||
|| శ్లోకార్థములు||
తతః ఇమం - అప్పుడు ఆ
అంగవైరూప్యకర్శితం దీనం -
అంగవైకల్యముతో దీన స్థితిలో నున్న
ఇమం జ్ఞాతయః సర్వే సమిత్ర బాంధవాః -
అతనిని బంధుమిత్రులు అందరూ
ససుహృత్ పశ్యం - ఆప్తులు చూచెదరు
|| శ్లోక తాత్పర్యము||
'అప్పుడు ఆ అంగవైకల్యముతో దీన స్థితిలో నున్న అతనిని బంధుమిత్రులు ఆప్తులు చూచెదరు'. ||53.04||
||శ్లోకము 53.05||
ఆజ్ఞాపయత్ రాక్షసేంద్రః పురం సర్వం స చత్వరమ్ |
లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరిణీయతామ్ ||53.05||
స|| రాక్షసేంద్రః ఆజ్ఞాపయత్ లాంగూలేన ప్రదీప్తేన ( అయం ) రక్షోభిః సర్వం పురం స చత్వరం పరిణీయతాం ||
|| శ్లోకార్థములు||
రాక్షసేంద్రః ఆజ్ఞాపయత్ -
రాక్షసరాజు ఆజ్ఞాపించెను
లాంగూలేన ప్రదీప్తేన ( అయం )-
మండుతున్న లాంగూలముతో (ఇతడు)
రక్షోభిః సర్వం పురం -
రాక్షసులచే పురమంతయూ
స చత్వరం పరిణీయతాం -
నాలుగు వీధులలోనూ ఊరేగింప బడుగాక'
|| శ్లోక తాత్పర్యము||
'మండుతున్న లాంగూలముతో ఇతడు నగరమంతా నాలుగు వీధులలోనూ రాక్షసులచే ఊరేగింప బడుగాక' అని రాక్షసరాజు ఆజ్ఞాపించెను'. ||53.05||
||శ్లోకము 53.06||
తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితాః |
వేష్టయన్తి స్మ లాంగూలం జీర్ణైః కార్పాసజైః పటైః ||53.06||
స|| తస్య తత్ వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్శితాః తస్య లాంగూలం జీర్ణైః కార్పాసజైః పటైః వేష్టయంతి స్మ ||
|| శ్లోకార్థములు||
తస్య తత్ వచనం శ్రుత్వా -
ఆ రాజుయొక్క ఆ వచనములను విని
రాక్షసాః కోపకర్శితాః - కోపోద్రిక్తులై ఉన్న రాక్షసులు
తస్య లాంగూలం జీర్ణైః కార్పాసజైః పటైః -
అతని లాంగూలమునకు పాతబడిన నూలు బట్టలు
వేష్టయంతి స్మ - కట్టసాగిరి
|| శ్లోక తాత్పర్యము||
ఆ రాజుయొక్క ఆ వచనములను వినిన కోపోద్రిక్తులై ఉన్న రాక్షసులు హనుమంతుని లాంగూలమునకు పాతబడిన నూలు బట్టలు కట్టసాగిరి. ||53.06||
||శ్లోకము 53.07||
సంవేష్ట్యమానే లాంగూలే వ్యవర్థత మహాకపిః |
శుష్క మిన్దనమాసాద్య వనేష్వివ హుతాశనః ||53.07||
స||లాంగూలే సంవేష్ట్యమానే మహాకపిః వ్యవర్ధత (యథా)వనేషు శుష్కం ఇంధనం ఆసాద్య హుతాశనః ఇవ ||
|| శ్లోకార్థములు||
లాంగూలే సంవేష్ట్యమానే -
లాంగులము అలా కట్టబడుతున్నప్పుడు
మహాకపిః వ్యవర్ధత -
హనుమంతుడు తన దేహమును పెద్దదిగా చేసెను
(యథా)వనేషు శుష్కం - ఎండిన వనములో
ఇంధనం ఆసాద్య హుతాశనః ఇవ -
ఇంధనముతో పెరిగిన అగ్నివలె
|| శ్లోక తాత్పర్యము||
లాంగులము అలా కట్టబడుతున్నప్పుడు హనుమంతుడు వనములో మోడువారి ఎండినచెట్లు అగ్ని దహించునఫుడు పెరిగిన రీతిగా తన దేహమును పెద్దదిగా చేసెను. ||53.07||
||శ్లోకము 53.08||
తైలేన పరిషిచ్యాథ తేఽగ్నిం తత్రాభ్యపాతయన్ |
లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాం స్తా నపాతయత్ ||53.08||
రోషామర్షా పరీతాత్మా బాలసూర్య సమాననః |
స|| అథ తే తైలేన పరిషిచ్యతత్ర అగ్నిమ్ అభ్యపాతయన్ | బాలసూర్య సమాననః రోషామర్షపరీతాత్మా ప్రదీప్తేన లాంగూలేన తాన్ రాక్షసాన్ అపాతయత్ ||
|| శ్లోకార్థములు||
అథ తే తైలేన పరిషిచ్య -
ఆ రాక్షసులు తోకను తైలము తో తడిపి
తత్ర అగ్నిమ్ అభ్యపాతయన్ -
అక్కడ నిప్పు అట్టించిరి
బాలసూర్య సమాననః -
బాల సూర్యునితో సమానముగావున్న
రోషామర్షపరీతాత్మా - కోపోద్రిక్తుడైన ( ఆ హనుమ)
ప్రదీప్తేన లాంగూలేన -
ఆ మండుతున్న లాంగూలముతో
తాన్ రాక్షసాన్ అపాతయత్ -
ఆ రాక్షసులను కొట్టెను.
|| శ్లోక తాత్పర్యము||
ఆ రాక్షసులు తోకను తైలము తో తడిపి నిప్పు అట్టించిరి. బాల సూర్యునితో సమానముగా భాసిస్తున్న హనుమంతుడు ఆ మండుతున్న లాంగూలముతో రాక్షసులను కొట్టెను. ||53.08||
||శ్లోకము 53.09||
లాంగూలం సంప్రదీప్తం తు ద్రష్టుం తస్య హనూమతః ||53.09||
సహ స్త్రీ బాలవృద్ధాశ్చ జగ్ముః ప్రీతా నిశాచరాః |
స|| తస్య హనూమతః లాంగూలమ్ ప్రదీప్తం తం ద్రష్టుం ప్రీతాః నిశాచరాః బాలవృద్ధాశ్చ సహ స్త్రీ జగ్ముః ||
|| శ్లోకార్థములు||
తస్య హనూమతః లాంగూలమ్ ప్రదీప్తం - ప్రజ్వరిల్లుతున్నహనుమంతుని తోక
తం ద్రష్టుం ప్రీతాః నిశాచరాః -
చూచుటకు సంతోషపడిన రాక్షసులు
బాలవృద్ధాశ్చ సహ స్త్రీ జగ్ముః -
బాలురు స్త్రీలు వృద్ధులు అచటికి వచ్చిరి
|| శ్లోక తాత్పర్యము||
ప్రజ్వరిల్లుతున్నహనుమంతుని తోక చూచుటకు సంతోషపడిన రాక్షసులు బాలురు స్త్రీలు వృద్ధులు అచటికి వచ్చిరి. ||53.09||
||శ్లోకము 53.10||
స భూయ సంగతైః క్రూరైః రాక్షసైః హరిసత్తమః ||53.10||
నిబద్ధః కృతవాన్ వీరః తత్కాలసదృశీం మతిమ్ |
స|| సంగతైః క్రూరైః రాక్షసైః భూయః నిబద్ధః సః వీరః హరిసత్తమః తత్కాల సదృశీం మతిం కృతవాన్ ||
|| శ్లోకార్థములు||
సంగతైః క్రూరైః రాక్షసైః -
కౄరులైన రాక్షసులందరి చేత
భూయః నిబద్ధః సః వీరః -
మరల బంధింపబడిన ఆ వీరుడు
హరిసత్తమః తత్కాల సదృశీం -
హనుమంతుడు తదనుసారముగా
మతిం కృతవాన్ - ఇట్లు ఆలోచించెను.
|| శ్లోక తాత్పర్యము||
కౄరులైన రాక్షసులందరి చేత మరల బంధింపబడిన హనుమంతుడు తదనుసారముగా ఇట్లు ఆలోచించెను. ||53.10||
||శ్లోకము 53.11||
కామం ఖలు నమే శక్తా నిబద్ధాస్యాపి రాక్షసాః ||53.11|
ఛిత్వాపాశాన్ సముత్పత్య హన్యామహం ఇమాన్పునః |
స||రక్షసాః నిబద్ధస్యాపి మే న శక్తాః కామం ఖలు | అహం పునః పాశాన్ ఛిత్వాసముత్పాత్య ఇమాన్ హన్యామ్||
గోవిన్దరాజ టీకాలో -న మే శక్తాః న మే పర్యాప్తా ఇత్యర్థః | మమ నిగ్రహే న సమర్థః ఇతి తావత్ |
|| శ్లోకార్థములు||
నిబద్ధస్యాపి రక్షసాః -
బంధింపబడినప్పటికీ ఈ రాక్షసులు
మే న శక్తాః కామం ఖలు -
నాకు శక్తిలో వీరు సమానులు కారు
అహం పునః పాశాన్ ఛిత్వా -
నేను మరల పాశములను ఛేదించి
సముత్పాత్య ఇమాన్ హన్యామ్-
వీరందరిని హతమార్చగలను.
|| శ్లోక తాత్పర్యము||
'ఈ రాక్షసులచేత బంధింపబడినప్పటికీ నాకు శక్తిలో వీరు సమానులు కారు. నేను మరల పాశములను ఛేదించి వీరందరిని హతమార్చగలను'. ||53.11||
||శ్లోకము 53.12||
యది భర్తుర్హితార్థాయ చరన్తం భర్తృశాసనాత్ ||53.12||
బధ్నన్యేతే దురాత్మానో న తు మే నిష్కృతిః కృతా|
స|| భర్తుః హితార్థాయ చరంతం ఏతే దురాత్మనః భర్తృశాసనాత్ బధ్నంతి యది మే నికృతిః న కృతా ||
గోవిన్దరాజ టీకాలో - భర్తృ హితార్థాయ రామ హితార్థాయ|చరంతం ప్రవర్తమానం మామ్ ఇతి శేషః |
|| శ్లోకార్థములు||
భర్తుః హితార్థాయ చరంతం -
రాజుయొక్క హితము కొరి తిరుగుచున్న
యది మే నికృతిః న కృతా -
నేను బయట పడినచో నా కార్యము చేయని వాడనగుదును
ఏతే దురాత్మనః - ఈ దురాత్ములు
భర్తృశాసనాత్ బధ్నంతి -
వారి రాజు అదేశముతో బంధించితిరి
|| శ్లోక తాత్పర్యము||
'అలా చేసినచో నా రాజుయొక్క హితము కొరి తిరుగుచున్ననేను నా విధిని నిర్వర్తించడములో విఫలము కావచ్చు. నన్ను ఈ రాక్షసులు వారి రాజు అదేశముతో బంధించితిరి'. ||53.12||
||శ్లోకము 53.13, 14||
సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానా మహం యుధి ||53.13||
కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేఽహ మీదృశం |
లంకా చారయితవ్యా వై పునరేవ భవదితి ||53.14||
స||యుధి అహం సర్వేషాంఏవ రాక్షసానాం పర్యాప్తః | కింతు రామస్య ప్రీత్యర్థం అహం ఈదృశమ్ లంకా పునరేవ చారయితవ్యా భవేత్ | ఇతి విషహిష్యే ||
గోవిన్దరాజ టీకాలో - రామస్య ప్రీత్యర్థం విషహిష్యే |
|| శ్లోకార్థములు||
యుధి అహం - యుద్ధములో నేను
సర్వేషాం ఏవ రాక్షసానాం పర్యాప్తః -
ఈ రాక్షసులందరికీ నేను ఒక్కడినే చాలు
కింతు రామస్య ప్రీత్యర్థం -
కాని రాముని ప్రీతికొఱకై
అహం ఈదృశమ్ లంకా -
నేను ఈ విధముగా లంకానగరము
పునరేవ చారయితవ్యా భవేత్ -
మళ్ళీ చూడడము అగును
ఇతి విషహిష్యే - అని భరించెదను
|| శ్లోక తాత్పర్యము||
'యుద్ధములో ఈ రాక్షసులందరికీ నేను ఒక్కడినే చాలు. కాని రాముని ప్రీతికై నేను ఈ విధముగా మరల లంకను మళ్ళీ చూడడము అగును'. ||53.13,14||
||శ్లోకము 53.15||
రాత్రౌన హి సుదృష్టా మే దుర్గకర్మ విధానతః |
అవశ్యమేవ ద్రష్టవ్యా మయా లంకా నిశాక్షయే ||53.15||
స|| లంకా దుర్గకర్మవిహానతః రాత్రౌ సుదృష్టా న హి నిశాక్షయే మయా | అవశ్యమేవ ద్రష్టవ్యా ||
|| శ్లోకార్థములు||
లంకా దుర్గకర్మవిహానతః -
లంకా దుర్గరక్షణా విధములను
రాత్రౌ సుదృష్టా న హి -
రాత్రి ] బాగుగా పరిశీలించలేదు
నిశాక్షయే మయా -
ఈ రాత్రి లోపల
అవశ్యమేవ ద్రష్టవ్యా-
నేను తప్పక చూడవలెను
|| శ్లోక తాత్పర్యము||
'లంకా దుర్గరక్షణా విధములను రాత్రి తిరుగుచూ బాగుగా పరిశీలించలేదు. అది తప్పక చూడవలెను'. ||53.15||
||శ్లోకము 53.16||
కామం బద్ధస్య మే భూయః పుచ్ఛస్యోద్దీపమనేన చ |
పీడాం కుర్వన్తు రక్షాంసి న మేఽస్తి మనసః శ్రమః ||53.16||
స|| భూయః బద్ధస్య మే పుచ్ఛస్య ఉద్దీపనేన రక్షాంసి కామం పీడాం కుర్వంతు | మే మనసః శ్రమః నాస్తి ||
|| శ్లోకార్థములు||
భూయః బద్ధస్య మే -
మళ్ళీ బంధించబడిన నా
పుచ్ఛస్య ఉద్దీపనేన -
లాంగూలము మండిస్తూ
రక్షాంసి కామం పీడాం కుర్వంతు -
రాక్షసులు తప్పక బాధించెదరు
మే మనసః శ్రమః నాస్తి-
అది నామనస్సుకు శ్రమ కాదు
|| శ్లోక తాత్పర్యము||
'మళ్ళీ బంధించబడిన నా లాంగూలము మండిస్తూ రాక్షసులు తప్పక బాధించెదరు. అది నామనస్సుకు శ్రమ కాదు'. ||53.16||
||శ్లోకము 53.17||
తతః తే సంవృతాకారం సత్త్వవన్తం మహాకపిం |
పరిగృహ్య యయుర్హృష్టా రాక్షసాః కపికుంజరమ్ ||53.17||
స|| తతః తే రాక్షసాః హృష్టాః సంవృతాకారం సత్త్వవంతం కపికుంజరం మహాకపిం పరిగృహ్య యయుః ||
గోవిన్దరాజ టీకాలో- సంవృతాకారం గూఢస్వభావం
|| శ్లోకార్థములు||
తతః తే రాక్షసాః హృష్టాః -
అప్పుడు ఆ రాక్షసులు సంతోషముతో
సంవృతాకారం సత్త్వవంతం -
వశుడైనట్లు ప్రవర్తిస్తున్న
కపికుంజరం మహాకపిం -
ఆ మహబలవంతుడగు హనుమంతుని
పరిగృహ్య యయుః - తీసుకొని వెళ్ళిరి
|| శ్లోక తాత్పర్యము||
అప్పుడు ఆ రాక్షసులు, వశుడైనట్లు ప్రవర్తిస్తున్న, ఆ మహబలవంతుడగు హనుమంతుని తీసుకొని వెళ్ళిరి. ||53.17||
||శ్లోకము 53.18||
శంఖ భేరీనినాదైః తం ఘోషయన్తః స్వకర్మభిః |
రాక్షసాః క్రూరకర్మాణః చారయన్తి స్మ తాం పురీమ్ ||53.18||
స|| క్రూరకర్మణః రాక్షసాః తం శంఖభేరీనినాదైశ్చ స్వకర్మభిః ఘోషయంతః తాం పురీం చారయంతి స్మ ||
|| శ్లోకార్థములు||
క్రూరకర్మణః రాక్షసాః తం -
క్రూరకర్మణులైన రాక్షసులు ఆ హనుమంతుని
శంఖభేరీనినాదైశ్చ స్వకర్మభిః ఘోషయంతః -
శంఖముల భేరీల నినాదముతో తమ గొప్పతనము చాటుకుంటూ
తాం పురీం చారయంతి స్మ-
ఆ నగరములో తిరుగుచుండిరి
|| శ్లోక తాత్పర్యము||
క్రూరకర్మణులైన రాక్షసులు ఆ హనుమంతుని శంఖముల భేరీల నినాదముతో తమ గొప్పతనము చాటుకుంటూ ఆ నగరములో తిరుగుచుండిరి. ||53.18||
||శ్లోకము 53.19||
అన్వీయమానో రక్షోభి ర్యయౌ సుఖమరిన్దమః |
హనుమాంశ్చారయామాస రాక్షసానాం మహపురీం ||53.19||
స|| అరిందమః హనుమాన్ రక్షోభిః అన్వీయమానః సుఖం యయౌ| రాక్షసానాం మహపురీం చారయామాస ||
|| శ్లోకార్థములు||
అరిందమః హనుమాన్ -
శత్రుమర్దనుడగు హనుమంతుడు
రక్షోభిః అన్వీయమానః -
రాక్షసులచే తిప్పబడుచూ
సుఖం యయౌ - సుఖమును పొందెను
రాక్షసానాం మహపురీం చారయామాస -
ఆ మహా నగరమంతా చూచుచూ
|| శ్లోక తాత్పర్యము||
శత్రుమర్దనుడగు హనుమంతుడు రాక్షసులచే తిప్పబడుచూ ఆ మహా నగరమంతా చూచుచూ సుఖమును పొందెను. ||53.19||
||శ్లోకము 53.20||
అథాపశ్యత్ విమానాని విచిత్రాణి మహాకపిః |
సంవృతాన్ భూమిభాగాంశ్చ సువిభక్తాంశ్చ చత్వరాన్ ||53.20||
స|| అథ మహాకపిః విచిత్రాణి విమానాని సంవృతాన్ భూమిభాగాంశ్చ సువిభక్తాన్ చత్వారాన్ అపశ్యత్ ||
|| శ్లోకార్థములు||
అథ మహాకపిః - అప్పుడు అ మహాకపి
విచిత్రాణి విమానాని -
విచిత్రమైన భవనములను
సంవృతాన్ భూమిభాగాంశ్చ -
గోప్యమైన భూమి భాగములను
సువిభక్తాన్ చత్వారాన్ అపశ్యత్ -
చక్కగా తీర్చిదిద్దినట్లున్న రాజమార్గములను చూచెను"
|| శ్లోక తాత్పర్యము||
అప్పుడు అ మహాకపి విచిత్రమైన భవనములను గోప్యమైన భూమి భాగములను, చక్కగా తీర్చిదిద్దినట్లున్న రాజమార్గములను చూచెను. ||53.20||
||శ్లోకము 53.21||
వీధీశ్చ గృహసంబాధాః కపిః శృంగాటకాని చ |
తథా రథ్యోపరథ్యాశ్చ తథైవ గృహకాన్తరాన్ ||53.21||
గృహాశ్చ మేఘసంకాశాన్ దదర్శ పవనాత్మజః |
స|| పవనాత్మజః కపిః గృహసంబాధాః వీథిః శృంగాటకాని చ తథా రథ్యోపరథ్యాశ్చ తథైవచ చ గృహకాంతరాన్ మేఘసంకాసాన్ గృహాంశ్చ దదర్శ ||
|| శ్లోకార్థములు||
పవనాత్మజః కపిః -
పవనాత్మజుడు అయిన వానరుడు
గృహసంబాధాః వీథిః -
గృహములతో కిక్కిరిసి ఉన్న వీధులను
శృంగాటకాని చ - ఎత్తైన భవనములను
తథా రథ్యోపరథ్యాశ్చ-
రాజమార్గములను చిన్న వీధులను
తథైవచ చ గృహకాంతరాన్ మేఘసంకాసాన్ గృహాంశ్చ -
మేఘములను అందుకునుచుట్లు ఉన్న ఎత్తైన గృహములను చూచెను
దదర్శ- చూచెను
|| శ్లోక తాత్పర్యము||
పవనాత్మజుడు గృహములతో కిక్కిరిసిఉన్న వీధులను అలాగే విశాలమైన రాజమార్గములను,ఎత్తైన భవనములను, చిన్న ఇళ్ళను, మేఘములను అందుకునుచుట్లు ఉన్న ఎత్తైన గృహములను చూచెను. ||53.21||
||శ్లోకము 53.22||
చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైవ చ ||53.22||
ఘోషయన్తి కపిం సర్వే చారీక ఇతి రాక్షసాః |
స|| సర్వే రక్షసాః చత్వరేషు చతుష్కేషు తథైవ చ రాజమార్గే కపిం చారీకః ఇతి ఘోషయంతి ||
|| శ్లోకార్థములు||
సర్వే రక్షసాః - ఆ రాక్షసులందరూ
చత్వరేషు చతుష్కేషు -
నాలుగు వీధులు కలిసే చోటులోను, నాలుగుస్థంభములు కల మంటపాల వద్ద
తథైవ చ రాజమార్గే చ -
అలాగే రాజ మార్గములలో
కపిం చారీకః ఇతి ఘోషయంతి-
వానరుడు చారుడు అని ఘోషిస్తూ ( తీసుకుపోయిరి)
|| శ్లోక తాత్పర్యము||
ఆ రాక్షసులందరూ నాలుగు వీధులు కలిసే చోటులోను, నాలుగుస్థంభములు కల మంటపాల వద్ద ఆ వానరుని, లంకలో ప్రవేశించిన చారుడు అని ప్రకటిస్తూ పోయిరి. ||53.22||
||శ్లోకము 53.23||
స్త్రీబాల వృద్ధా నిర్జగ్ముః తత్ర తత్ర కుతూహలాత్ ||53.23||
తం ప్రదీపితలాంగూలం హనుమన్తం దిదృక్షవః |
స|| ప్రదీపితలాంగూలం తం హనూమంతం దిదృక్షవః స్త్రీబాలవృద్ధాః తత్ర తత్ర కుతూహలాత్ నిర్జగ్ముః ||
|| శ్లోకార్థములు||
ప్రదీపితలాంగూలం తం -
మండుతున్న తోకతో ఉన్న ఆ
హనూమంతం దిదృక్షవః -
హనుమంతుని చూచుటకు
స్త్రీబాలవృద్ధాః తత్ర తత్ర -
స్త్రీలు బాలులూ వృద్ధులూ అక్కడక్కడ
కుతూహలాత్ నిర్జగ్ముః -
కుతూహలము కొద్దీ చేరిరి
|| శ్లోక తాత్పర్యము||
మండుతున్న తోకతో ఉన్న ఆ హనుమంతుని చూచుటకు కుతూహలము కొద్దీ స్త్రీలు బాలులూ వృద్ధులూ అచటికి చేరిరి. ||53.23||
||శ్లోకము 53.24||
దీప్యమానే తతః తస్య లాంగూలాగ్రే హనూమతః ||53.24||
రాక్షస్య స్తా విరూపాక్ష్యః శంసుర్దేవావ్యాస్తదప్రియమ్ |
స|| తతః తత్ర హనూమతః లాంగూలాగ్రే దీప్యమానే విరూపాక్ష్యః తాః రాక్షస్యః దేవ్యాః అప్రియం తత్ శంసుః ||
|| శ్లోకార్థములు||
తతః తత్ర హనూమతః -
అప్పుడు అక్కడ హనుమంతుని
లాంగూలాగ్రే దీప్యమానే -
తోకకు నిప్పంటింపబడినప్పుడు
విరూపాక్ష్యః తాః రాక్షస్యః -
విరూపమైన కళ్ళుగల ఆ రాక్షసస్త్రీలు
దేవ్యాః అప్రియం తత్ శంసుః-
దేవికి అప్రియమైన మాట చెప్పిరి
|| శ్లోక తాత్పర్యము||
అప్పుడు హనుమంతుని తోకకు నిప్పంటింపబడినది అను అప్రియమైన మాటలను ఆ దేవికి వినిపించిరి. ||53.24||
||శ్లోకము 53.25||
యస్త్వయా కృత సంవాదః సీతే తామ్రముఖః కపిః ||53.25||
లాంగూలేన ప్రదీప్తేన స ఏష పరిణీయతే |
స|| సీతే యః తామ్రముఖః కపిః త్వయా కృతసంవాదః స ఏషః ప్రదీప్తేన లాంగూలేన పరిణీయతే ||
|| శ్లోకార్థములు||
సీతే యః తామ్రముఖః కపిః -
ఓ సీతా ఆ ఎర్రని ముఖముకల వానరుడు
త్వయా కృతసంవాదః - నీతో మాట్లాడినవాడు
స ఏషః ప్రదీప్తేన లాంగూలేన -
అతడు లాంగూలము అంటించబడినవాడై
పరిణీయతే - తిప్పబడుచున్నవాడు
|| శ్లోక తాత్పర్యము||
ఓ సీతా నీతో మాట్లాడిన ఎర్రని ముఖముకల వానరుడు లాంగూలము అంటించబడినవాడై నగరములో తిప్పబడుచున్నవాడు' అని. ||53.25||
||శ్లోకము 53.26||
శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమమ్ ||53.26||
వైదేహీ శోక సంతప్తా హూతాశనముపాగమత్ |
స|| వైదేహీ ఆత్మాపహరణోపమం క్రూరం తత్ వచనం శ్రుత్వా శోకసంతప్తా హుతాశనం ఉపాగమత్ ||
|| శ్లోకార్థములు||
వైదేహీ ఆత్మాపహరణోపమం -
సీత తను అపహరింపబడినట్టి మాటతో సమానమైన
క్రూరం తత్ వచనం శ్రుత్వా -
ఆ క్రూర వచనములను విని
శోకసంతప్తా హుతాశనం ఉపాగమత్ -
శోకము తో నిండినదై అగ్నికుండము వద్దకు చేరెను
|| శ్లోక తాత్పర్యము||
సీత తను అపహరింపబడినట్టి మాటతో సమానమైన, ఆ క్రూర వచనములను విని, శోకము తో నిండినదై అగ్నికుండము వద్దకు చేరెను. ||53.26||
||శ్లోకము 53.27||
మంగళాభిముఖీ తస్య సా తదాఽఽసీన్మహాకపేః ||
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ ||53.27||
స|| తదా సా మహాకపేః తస్య మంగళాభిముఖీ ఆసీత్ | విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ ఉపతస్థే ||
|| శ్లోకార్థములు||
తదా సా మహాకపేః -
అప్పుడు ఆమె ఆ వానరునికి
తస్య మంగళాభిముఖీ ఆసీత్ -
అతనియొక్క మంగళము కొఱకై
విశాలాక్షీ ప్రయతా -
ఆ విశాలాక్షి తన మనస్సులో
హవ్యవాహనమ్ ఉపతస్థే-
అగ్నిదేవుని ప్రార్థించెను
|| శ్లోక తాత్పర్యము||
అప్పుడు ఆమె ఆ వానరునికి మంగళము జరగవలఎనని తలచి, ఆ విశాలాక్షి తన మనస్సులో అగ్నిదేవుని ప్రార్థించెను. ||53.27||
||శ్లోకము 53.28||
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః|
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవతు హనూమతః||53.28||
స|| పతిశుశ్రూషా అస్తి యది తపః చరితం అస్తి యది ఏకపత్నీత్వం అస్తి చ యది త్వం హనూమతః శీతః భవ||
|| శ్లోకార్థములు||
పతిశుశ్రూషా అస్తి యది -
నేను పతిసేవాపరాయణురాలను అయితే
తపః చరితం అస్తి యది -
తపస్సు చేసినదానను అయితే
ఏకపత్నీత్వం అస్తి చ యది-
పతివ్రతను అయితే
త్వం హనూమతః శీతః భవ -
ఓ అగ్నిదేవా నీవు హనుమంతుని పై చల్లగా ఉండుము
|| శ్లోక తాత్పర్యము||
'నేను పతిసేవాపరాయణురాలను అయితే, తపస్సు చేసినదానను అయితే, పతివ్రతను అయితే, ఓ అగ్నిదేవా నీవు హనుమంతుని పై చల్లగా ఉండుము'. ||53.28||
||శ్లోకము 53.29||
యదికించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః |
యది వా భాగ్యశేషో మే శీతో భవతు హనూమతః ||53.29||
స|| ధీమతః తస్య మయి కించిత్ అనుక్రోశః అస్తి యది మే భాగ్య శేషః యది వా హనూమతః శీతః భవ ||
|| శ్లోకార్థములు||
ధీమతః తస్య - ధీమంతుడైన ఆయనికి
మయి కించిత్ అనుక్రోశః అస్తి -
నాపై కించిత్తు దయ ఉన్నా
యది మే భాగ్య శేషః -
నాకు ఏమైన భాగ్యము ఉన్నా
యది వా హనూమతః శీతః భవ -
హనుమంతుని చల్లగా చూడుము
|| శ్లోక తాత్పర్యము||
'ధీమంతుడైన ఆయనికి నాపై కించిత్తు దయ ఉన్న , నాకు ఏమైన భాగ్యము ఉన్నా, హనుమంతుని చల్లగా చూడుము'. ||53.29||
||శ్లోకము 53.30||
యది మాం వృత్తి సంపన్నాం తత్సమాగమ లాలసాం |
స విజానాతి ధర్మాత్మా శీతో భవతు హనూమతః ||53.30||
స|| ధర్మాత్మా సః మామ్ వృత్తసంపన్నాం తత్సమాగమలాలసాం విజానతే యది హనూమతః శీతః భవ ||
|| శ్లోకార్థములు||
ధర్మాత్మా సః - ధర్మాత్ముడైన అతడు
మామ్ వృత్తసంపన్నాం -
నన్ను పతివ్రతగానూ
తత్సమాగమలాలసాం విజానతే యది-
తన సమాగమునకై వేచి ఉన్నదానిని గా భావిస్తే
హనూమతః శీతః భవ -
హనుమంతుడు చల్లగా వుండుగాక
|| శ్లోక తాత్పర్యము||
'ధర్మాత్ముడైన అతడు నన్ను పతివ్రతగానూ తన సమాగమునకై వేచి ఉన్నదానిని గా భావిస్తే, ఓ అగ్నిదేవా హనుమంతుని పై చల్లగా చూడుము'. ||53.30||
ఈ నాలుగు శ్లోకాలలో సీతమ్మ హనుమంతుని కోసము ప్రార్థన చేస్తుంది. అంటే ఎంత దుఃఖములో ఉన్నా తన శక్తిని తనకై ఉపయోగించని సీతమ్మ, హనుమ కష్టములలో ఉన్నాడని అని భావించి, తన శక్తిని దావా పెట్టి హుతాశనుని ప్రార్థించిందన్నమాట. ఆప్రార్థన వినతగినది.
' నేను పతిసేవాపరాయణురాలను అయితే, తపస్సు చేసినదానను అయితే, పతివ్రతను అయితే, ఓ అగ్నిదేవా నీవు హనుమంతుని పై చల్లగా ఉండుము. ధీమంతుడైన ఆయనికి నాపై కించిత్తు దయ ఉన్న , నాకు ఏమైన భాగ్యము ఉన్నా, హనుమంతుని చల్లగా చూడుము. ధర్మాత్ముడైన అతడు నన్ను పతివ్రతగానూ తన సమాగమునకై వేచి ఉన్నదానిని గా భావిస్తే, ఓ అగ్నిదేవా హనుమంతుని పై చల్లగా చూడుము. ఆర్యుడు సత్యసంధుడూ అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసాగరమునుంచి నన్ను రక్షించువాడైతే, ఓ అగ్నిదేవా హనుమంతునిపై చల్లగా చూడుము'.
ఈ ప్రార్థన గురించి మళ్ళీ సర్గ చివరిలో విశ్లేషిస్తాము.
||శ్లోకము 53.31||
యది మాం తారయేదార్యః సుగ్రీవః సత్యసంగరః |
అస్మాదుఃఖామ్బుసంరోధాత్ శీతో భవ హనూమతః ||53.31||
స|| ఆర్యః సత్యసంగరః సుగ్రీవః అస్మాత్ దూఖామ్బు సంరోధాత్ మాం తారయేత్ యది హనూమతః శీతః భవ ||
|| శ్లోకార్థములు||
ఆర్యః సత్యసంగరః సుగ్రీవః -
ఆర్యుడు సత్యసంధుడూ అయిన సుగ్రీవుడు
అస్మాత్ దూఖామ్బు సంరోధాత్ -
నన్ను ఈ దుఃఖసాగరమునుంచి
మాం తారయేత్ యది-
నన్ను రక్షించువాడైతే,
హనూమతః శీతః భవ -
హనుమంతుడు చల్లగా వుండుగాక
|| శ్లోక తాత్పర్యము||
'ఆర్యుడు సత్యసంధుడూ అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసాగరమునుంచి నన్ను రక్షించువాడైతే, ఓ అగ్నిదేవా హనుమంతునిపై చల్లగా చూడుము'. ||53.31||
||శ్లోకము 53.32||
తతః తీక్ష్‍ణార్చి రవ్యగ్రః ప్రదక్షిణశిఖో నలః |
జజ్వాల మృగశాబాక్ష్యా శ్శంసన్నివ శివం కపేః ||53.32||
స|| తతః అనలః మృగశాబాక్ష్యాః కపేః శివం శంసన్నివ తీక్ష్ణార్చిః ప్రదక్షిణశిఖః అవ్యగ్రః జజ్వాల ||
|| శ్లోకార్థములు||
తతః అనలః -
ఆ హుతాశనములో ఉన్న అనలుడు
మృగశాబాక్ష్యాః కపేః శివం శంసన్నివ -
మృగశాబాక్షికి కపి యొక్క క్షేమము తెలియచేస్తున్నాడా అన్నట్లు
తీక్ష్ణార్చిః ప్రదక్షిణశిఖః -
తీక్ష్ణముగా కదలుచున్న అగ్నిజ్వాలశిఖలతో
అవ్యగ్రః జజ్వాల-
అగ్ని జ్వాలలు ప్రజ్వలించెను
|| శ్లోక తాత్పర్యము||
ఆ హుతాశనములో ఉన్న అనలుడు మృగశాబాక్షికి కపి యొక్క క్షేమము తెలియచేస్తున్నాడా అన్నట్లు అప్పుడు తీక్ష్ణముగా ప్రజ్వలించెను. ||53.32||
||శ్లోకము 53.33||
హనుమజ్జనకశ్చాపి పుచ్ఛానలయుతోఽనిలః |
వవౌ స్వాస్థ్యకరో దేవ్యాః ప్రాలేయానిలశీతలః ||53.33||
స|| హనుమత్ జనకః అనిలః పుచ్ఛానలయుతః దేవ్యాః స్వాస్థ్యకరః ప్రాలేయానిలశీతలః వవౌ ||
|| శ్లోకార్థములు||
హనుమత్ జనకః -
హనుమంతుని జనకుడు
పుచ్ఛానలయుతః అనిలః-
తోకపైనున్న అగ్నికి
దేవ్యాః స్వాస్థ్యకరః -
దేవియొక్క స్వాస్థతకై చేసిన ప్రార్థన విన్నట్లు
ప్రాలేయానిలశీతలః వవౌ-
చల్లగా శీతలముగా వీచెను
|| శ్లోక తాత్పర్యము||
తోకపై అగ్నికి తోడుగా వీచు హనుమంతుని జనకుడు దేవియొక్క స్వాస్థతకై చేసిన ప్రార్థన విన్నట్లుగా చల్లగా శీతలముగా వీచెను. ||53.33||
||శ్లోకము 53.34||
దహ్యమానే చ లాంగూలే చింతయామాస వానరః ||53.34||
ప్రదీప్తోఽగ్నిరయం కస్మాన్నమాం దహతి సర్వతః |
స||లాంగూలే దహ్యమానే వానరః చింతయామాస| సర్వతః ప్రదీప్తః అయం అగ్నిః మామ్ కస్మాత్ న దహతి ||
|| శ్లోకార్థములు||
లాంగూలే దహ్యమానే -
ఆ లాంగూలము మండుచుండగా
వానరః చింతయామాస -
వానరుడు చింతించ సాగెను.
సర్వతః ప్రదీప్తః అయం అగ్నిః -
అన్నిచోట్లా ప్రదీపిస్తున్న ఈ అగ్ని
మామ్ కస్మాత్ న దహతి -
నన్ను ఎందుకు దహించుటలేదు
|| శ్లోక తాత్పర్యము||
ఆ లాంగూలము మండుచుండగా వానరుడు చింతించ సాగెను. ' 'ప్రదీపిస్తున్న ఈ అగ్ని నన్నుఅంతా ఎందుకు దహించుటలేదు?' ||53.34||
||శ్లోకము 53.35||
దృశ్యతే చ మహాజ్వాలః కరోతి న చ మే రుజమ్ ||53.35||
శిశిరస్యేవసంపాతో లాంగూలాగ్రేప్రతిష్టితః |
స|| మహాజ్వాలః దృశ్యతే మే రుజం న కరోతి చ లాంగూలాగ్రే శిశిరస్య సంఘాతః ప్రతిష్టితః ఇవ ||
|| శ్లోకార్థములు||
మహాజ్వాలః దృశ్యతే మే -
మహాజ్వాలలతో కనిపిస్తున్న ఈ అగ్నినన్ను
రుజం న కరోతి చ -
మహాజ్వాలలతో కనిపిస్తున్న ఈ అగ్ని
లాంగూలాగ్రే శిశిరస్య సంఘాతః -
లాంగూలము చివర మంచుముక్క
ప్రతిష్టితః ఇవ - పెట్టినట్లు ఉన్నది
|| శ్లోక తాత్పర్యము||
'మహాజ్వాలలతో కనిపిస్తున్న ఈ అగ్ని నన్ను కొంచెము కూడా బాధించుటలేదు. ఇంకా ( మండుతున్న) లాంగూలము చివర మంచుముక్క పట్టినట్లు ఉన్నది'. ||53.35||
||శ్లోకము 53.36||
అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతా మయా ||53.36||
రామప్రభావాదాశ్చర్యం పర్వతః సరితాం పతౌ |
స|| అథవా యత్ ప్లవతా మయా రామప్రభావాత్ పర్వతః సరితాం పతౌ ఆశ్చర్యం దృష్టం తత్ ఇదం వ్యక్తమ్ ||
|| శ్లోకార్థములు||
అథవా యత్ ప్లవతా మయా-
లేక నేను సముద్రలంఘనము చేస్తున్నప్పుడు
రామప్రభావాత్ -
రాముని ప్రభావము వలన
పర్వతః సరితాం పతౌ -
సముద్రమునుంచి పైకి వచ్చిన పర్వతము
ఆశ్చర్యం దృష్టం -
ఆశ్చర్యముగా కనపడినది
తత్ ఇదం వ్యక్తమ్ -
ఇప్పుడు అది వ్యక్తమౌతున్నది
|| శ్లోక తాత్పర్యము||
'లేక నేను సముద్రలంఘనము చేస్తున్నప్పుడు, రాముని ప్రభావము వలన సముద్రమునుంచి పైకి వచ్చిన పర్వతము, ఆశ్చర్యముగా కనపడినది. ఇప్పుడు అది వ్యక్తమౌతున్నది.' ||53.36||
||శ్లోకము 53.37||
యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః ||53.37||
రామార్థం సంభ్రమస్తాదృక్కిమగ్నిర్నకరిష్యతి |
స||సముద్రస్య ధీమతః మైనాకస్య రామార్థం తాదృక్ సంభ్రమః యది అగ్నిః కిం న కరిష్యతి ||
|| శ్లోకార్థములు||
సముద్రస్య ధీమతః మైనాకస్య -
సముద్రునకు ధీమంతుడైన మైనాకునకు
రామార్థం తాదృక్ సంభ్రమః యది -
రామునికోసము అట్టి ఆదరణ ఉన్నప్పుడు
అగ్నిః కిం న కరిష్యతి -
అగ్నిఎందుకు ఉండకోడదు
|| శ్లోక తాత్పర్యము||
'లేక నేను ఎగురుతూ వున్నప్పుడు రాముని ప్రభావముతో సాగరములోనున్న పర్వతము ఆదరించినట్లు ఆవిధముగా అగ్ని ఎందుకు చెయ్యడు?' ||53.37||
||శ్లోకము 53.38||
సీతాయాశ్చానృశం స్యేన తేజసా రాఘవస్య చ ||53.38||
పితుశ్చ మమ సఖ్యేన న మాం దహతి పావకః |
స|| సీతాయాః అనృశంస్యేన రాఘవస్య తేజసా మమపితుః సఖ్యేన పావకః మామ్ న దహతి ||
|| శ్లోకార్థములు||
సీతాయాః అనృశంస్యేన -
సీతాదేవి యొక్క అనుగ్రహము వలన
రాఘవస్య తేజసా -
రాముని తేజస్సు వల
మమపితుః సఖ్యేన -
నా తండ్రి వాయుదేవుని స్నేహము వలన
పావకః మామ్ న దహతి-
అగ్ని దేవుడు నన్ను దహించకుండా ఉన్నాడు
|| శ్లోక తాత్పర్యము||
'సీతాదేవి యొక్క అనుగ్రహము వలన, రాముని తేజస్సు వల, నా తండ్రి వాయుదేవుని స్నేహము వలన అగ్ని దేవుడు నన్ను దహించకుండా ఉన్నాడు'. ||53.38||
||శ్లోకము 53.39||
భూయః స చింతయామాస ముహూర్తం కపికుంజరః ||53.39||
ఉత్పపాతాథ వేగేన ననాద చ మహాకపిః |
స|| కపికుంజరః సః మహాకపిః భూయః చింతయామాస | అథ వేగేన ఉత్పపాద ననాద చ||
|| శ్లోకార్థములు||
కపికుంజరః సః మహాకపిః -
ఆ కపికుంజరుడు అయిన మహాకపి
భూయః చింతయామాస -
మరల చితించసాగెను
అథ వేగేన ఉత్పపాద ననాద చ-
అప్పుడు వేగముతో పైకెగిరి నాదము చేసెను
|| శ్లోక తాత్పర్యము||
ఆ కపికుంజరుడు మరల చితించసాగెను. వేగముతో పైకెగిరి నాదము చేసెను. ||53.39||
||శ్లోకము 53.40||
పురద్వారం తతః శ్రీమాన్ శైలశృంగమివోన్నతమ్ ||53.40||
విభక్తరక్షస్సంభాధ మాససాదానిలాత్మజః |
స|| తతః శ్రీమాన్ అనిలాత్మజః శైలశృంగమివ ఉన్నతం విభక్తరక్షః సంబాధామ్ పురద్వారం ఆససాద ||
|| శ్లోకార్థములు||
తతః శ్రీమాన్ అనిలాత్మజః -
అప్పుడు ఆ అనిలాత్మజుడు
విభక్తరక్షః సంబాధామ్ -
రాక్షసబంధములనుంచి విడివడి
శైలశృంగమివ ఉన్నతం -
పర్వత శిఖరముమల్లె ఎత్తుగా వున్న
పురద్వారం ఆససాద-
నగర ద్వారము చేరెను
|| శ్లోక తాత్పర్యము||
అప్పుడు ఆ అనిలాత్మజుడు రాక్షసులనుంచి విడివడి పర్వత శిఖరముమల్లె నున్న నగర ద్వారము చేరెను. ||53.40||
||శ్లోకము 53.41||
స భూత్వా శైలసంకాశః క్షణేన పునరాత్మవాన్ ||53.41||
హ్రస్వతాం పరమాం ప్రాప్తోబన్దనాన్యవశాతయత్ |
స|| ఆత్మవాన్ సః శైలసంకాశః భూత్వా క్షణేన హ్రస్వతాం ప్రాప్తః బన్ధనాని అవశాతయత్||
|| శ్లోకార్థములు||
సః శైలసంకాశః -
పర్వత రూపముగల అతడు
ఆత్మవాన్ భూత్వా-
తన స్వరూపము పొంది
క్షణేన హ్రస్వతాం ప్రాప్తః -
క్షణములో చిన్నరూపము కలవాడయ్యెను
బన్ధనాని అవశాతయత్ -
బంధములనుంచి విడివడెను
|| శ్లోక తాత్పర్యము||'
తన పర్వత రూపము వీడి క్షణములో చిన్న రూపము పొంది తన బంధములనుంచి విడివడెను. ||53.41||
||శ్లోకము 53.42||
విముక్తాశ్చాభవత్ శ్రీమాన్ పునః పర్వతసన్నిభః ||53.42||
వీక్షమాణాశ్చ దదృశే పరిఘం తోరణాశ్రితమ్ |
స||శ్రీమాన్ విముక్తశ్చ పునః పర్వతసన్నిభః అభవత్| వీక్షమాణశ్చ తోరణాశ్రితం పరిఘం దదర్శ ||
|| శ్లోకార్థములు||
శ్రీమాన్ విముక్తశ్చ -
హనుమంతుడు అలా విముక్తుడై
పునః పర్వతసన్నిభః అభవత్ -
మరల పర్వతాకారము పొందెను
వీక్షమాణశ్చ తోరణాశ్రితం పరిఘం దదర్శ -
తోరణాశ్రితుడై అటు ఇటూ వీక్షించి అక్కడ ఉన్న పరిఘను చూచెను
|| శ్లోక తాత్పర్యము||
హనుమంతుడు అలా విముక్తుడై మరల పర్వతాకారము పొందెను. అ హనుమంతుడు తోరణాశ్రితుడై అటు ఇటూ వీక్షించి అక్కడ ఉన్న పరిఘను చూచెను. ||53.42||
||శ్లోకము 53.43||
స తం గృహ్య మహాబాహుః కాలాయస పరిష్కృతమ్ ||53.43||
రక్షిణస్తాన్ పునః సర్వాన్ సూదయామాస మారుతిః |
స|| మహాబాహుః సః మారుతిః కాలాయసపరిష్కృతం తం పునః గృహ్య సర్వాన్ తాన్ రక్షిణః సూదయామాస ||
|| శ్లోకార్థములు||
మహాబాహుః సః మారుతిః -
మహాబాహువు అయిన ఆ మారుతి
కాలాయసపరిష్కృతం -
ఆ ఇనుముతో చేయబడిన పరిఘను
తం పునః గృహ్య -
పరిఘను మరల తీసుకొని
తాన్ సర్వాన్ రక్షిణః సూదయామాస -
ఆ రక్షకులందరినీ హతమార్చసాగెను''
|| శ్లోక తాత్పర్యము||
మహాబాహువు అయిన ఆ మారుతి ఆ ఇనుముతో చేయబడిన పరిఘను తీసుకొని ఆ రక్షకులందరినీ హతమార్చెను. ||53.43||
||శ్లోకము 53.44||
సతాన్ నిహత్వా రణచణ్డవిక్రమః
సమీక్షమాణః పునరేవ లంకామ్ |
ప్రదీప్తలాంగూలకృతార్చిమాలీ
ప్రకాశతాఽఽదిత్య ఇవార్చిమాలీ ||53.44||
స|| రణచండవిక్రమః సః తాన్ నిహత్వా పునరేవ లంకాం సమీక్షమానః ప్రదీప్తలాంగూలకృతార్చిమాలీ అర్చిమాలీ అదిత్య ఇవ ప్రకాశత ||
|| శ్లోకార్థములు||
రణచండవిక్రమః -
రణములో చండ విక్రముడైన
సః తాన్ నిహత్వా -
ఆ హనుమంతుడు వారిని హతమార్చి
పునరేవ లంకాం సమీక్షమానః -
మళ్ళీ లంకను చూస్తూ
ప్రదీప్తలాంగూలకృతార్చిమాలీ -
మండుతూ ఉన్న లాంగూలమే మాలగా కలవాడు
అర్చిమాలీ అదిత్య ఇవ ప్రకాశత -
కిరణములతో భాసించు సూర్యుని వలె భాసించెను
|| శ్లోక తాత్పర్యము||
రణములో చండ విక్రముడైన ఆ హనుమంతుడు వారిని హతమార్చి మళ్ళీ లంకను చూస్తూ మండుతూ ఉన్న లాంగూలము కల ఆ హనుమంతుడు అనేక కిరణములతో భాసించు సూర్యుని వలె భాసించెను. ||53.44||
ఈ సర్గలో ముఖ్యమైన ఘట్టము సీతమ్మవారి ప్రార్థన.
ఇక్కడ సీతమ్మగారి ప్రార్థన కొంచెము ఆలోచించతగినది.
ఆ ప్రార్థన ముందర సీతా హనుమంతుల సంబంధము విచారిద్దాము.
సుందరకాండ మొదటిలోనే హనుమంతుడు జీవాత్మ పరమాత్మల కలయికకు కారకుడగు ఆచార్య స్వరూపముగా విన్నాము. ఆచార్య స్వరూపములో జీవాత్మకి గురువుగా ప్రవర్తిస్తూ, మరో మార్గములో ఉన్న జీవాత్మని అన్వేషించి, ఆ అన్వేషణలో జీవాత్మను శిష్య రూపములో పరిక్షించి. శిష్యునిలో వుండవలసిన లక్షణములు పరిశీలించి,అన్వేషణలో అన్వేషింపబడిన జీవాత్మను శిష్యునిగా గ్రహించి, అ శిష్యరూపములో వున్న జీవాత్మకి ఆచార్యరూపములో ఉన్న తనపై నమ్మకము కలిగించి, తద్వార ఆచార్యుడు జీవాత్మ పరమాత్మలు ఏకము అవడానికి కారణమౌతాడు.
ఈ కథనములో హనుమంతుడు, ఆచార్యస్వరూపములోనూ, సీతమ్మ శిష్య స్వరూపములోనూ కనిపిస్తారు.
ఆచార్యుడు భగవానుడు శిష్యరూపములో వున్న జీవునకు రక్షకులు. మోహముచే వారిని ఇద్దరినీ వదలుకొనిన శిష్యుడు, లేక జీవుడు, బంధనమున బడును.
గురువును భగవత్ సంబంధముతోనూ , భగవంతుని ఆచార్య సంబంధముతో చూడవలెను. ఆచార్యుని ప్రసాదించినవాడు కనక భగవంతుడు శిష్యునకు ఆరాధ్యుడు. అట్టి భగవానుని చేరుటకు సాయపడెడి వాడు ఆచార్యుడు, కనక శిష్యునకు ఆచార్యుడు సేవింపతగినవాడు.
ఇక్కడ హనుమ యొక్క లాంగూలము దహింపబడుతున్నప్పుడు, హనుమ శక్తి కలిగియూ ఆ వేడిని సహించుటకు నిశ్చయించుకొని ఊరకఉండెను.
కాని సీతమ్మ ఓర్వలేక తనప్రాణములే పోయినట్లు బాధపడి, అగ్నిహోత్రుని ప్రతిజ్ఞలతో ప్రార్థించి చల్లబరచెను.
శిష్యాచార్యులలో, శిష్యుడు ఆచార్యుడు, ఒకరితో నొకరు ఎట్టిసంబంధము కలిగు యుండవలెనో ఈ సన్నివేశము విశదము చేస్తుంది,
శిష్యుని ఆత్మ రక్షణకి ఆచార్యుడు బాధ్యత వహింపవలెను. గురు సన్నిధిలో ఉన్న శిష్యుడు తన రక్షణకై చింతింప అవసరము లేదు.
భగవదనుగ్రహముచే జ్ఞానానుష్ఠానములు కల ఆచార్యుడు లభించిన పిమ్మట, తనకేమి లోటులేదని, భగవత్ప్రాప్తి తథ్యమనే ధైర్యముతో నుండవలెను. భగవత్ప్రాప్తికై ఆర్తితో తన ప్రయత్నములో ఉండుట తప్ప వేరొక ప్రయత్నము చేయరాదు.
అలాగ సీతమ్మ రామునిపై బాధ్యతవేసి రావణుని చంపుటకు తన శక్తిని వినియోగింపలేదు. ఆమె పాతివ్రత్య మహిమ కలది. ఆ పాతివ్రత్య మహిమతోరావణుని దహింపగల శక్తి కలది. హనుమ మాటలు విని, రాముడే వచ్చి తనను రక్షించునని ధైర్యముతో ఉండెను.
కాని ఇక్కడ హనుమను రక్షించుటకు తన పాతివ్రత్య మహిమ ఉపయోగించెను.
గురువు అనుగ్రహములో ఉన్న శిష్యుడు ,గురువు యొక్క శరీరము పదిలముగా ఉండునట్లు చూచుకొనవలెను. గురువు శరీరములో ఉన్నంతకాలము గురువు శిష్యుని రక్షించు చుండును. అందుచే శిష్యుడు గురువు రక్షణకు తన శక్తిని వినియోగింపవలెను. అందుచే శిష్య స్వరూపములో ఉన్న సీత హనుమద్రక్షణకై తన శక్తిని వినియోగించెను.
భగవదనుగ్రహము పొంది, భగవదాజ్ఞచే జీవనము సాగిస్తున్న ఆచార్యుడు, శరీరము ప్రధానముగా భావింపరాదు. భగవంతుని ప్రీతికై కష్టములు సహించుటకైననూ సిద్ధపడి యుండవలెను. అవసరమైతే భగవంతుడే రక్షించునని ఉండవలెను. ఇదే మనము హనుమంతునిలో చూస్తాము. హనుమ రాక్షసులు తనను బాధపెడుతున్నావారికి వశుడైనట్లు గా ప్రవర్తిస్తూ,
లంకానగరమంతా రామకార్యార్థము రాక్షసుల బందీగా మళ్ళీ తిరిగెను.
ఈ విధముగా గురువు శిష్యులు తమ రక్షణ విషయములో
ఎట్లు ప్రవర్తింపవలెనో అన్నమాట హనుమంతుడు సీత తమ ప్రవర్తనలతో నిరూపిస్తారు.
సీతమ్మ చెప్పిన నాలుగు ప్రార్థనా శ్లోకములు ప్రధానమైనవి.
యద్యసి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః|
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవతు హనూమతః||28||
యదికించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః|
యది వా భాగ్యశేషో మే శీతో భవతు హనూమతః||29||
యది మాం వృత్తి సంపన్నాం తత్సమాగమ లాలసాం|
స విజానాతి ధర్మాత్మా శీతో భవతు హనూమతః||30||
యది మాం తారయేదార్యః సుగ్రీవః సత్యసంగరః|
అస్మాదుఃఖామ్బుసంరోధాత్ శీతో భవ హనూమతః||31||
ఈ నాలుగు శ్లోకాలు శాంతిని ప్రదానము చేసే శ్లోకాలు.
ఇంకోమాట.
రాముని దూత హనుమ. హనుమ పట్టుకొనబడి రావణుని ముందరకు తీసుకురాబడతాడు. అప్పుడు మనము రావణుడు ఎలా వ్యవహరించాడో చూశాము.
ఇలాంటి సన్నివేశం మళ్ళీ యుద్ధకాండలో రాముడి సమక్షములో జరుగుతుంది. వానరసేనతో రాముడు సాగరము దాటి లంకానగరానికి చేరుతాడు. అప్పుడు వానరసైన్యము గురించి తెలుసు కోడానికి, రావణుడు శుక సారణులు అనే చారులు ఇద్దరిని పంపిస్తాడు. వానర శిబిరాలలో తిరుగుతున్న ఆ చారులిద్దరినీ విభీషణుడు పట్టుకొని రాముని ముందరకు తీసుకువస్తాడు.అప్పుడు రాముడు చెప్పిన మాట వినతగ్గది.
"న్యస్త శస్త్రౌ గృహీతౌ వా
న దూతౌ వధం అర్హతః"
అంటే "శస్త్రములను విసర్జించిన లేక పట్టుకొనబడిన దూతలను వధించ రాదు"అని.
రాముడు ఈ మాట విభీషణునికి చెప్పి,ఆ దూతలను వారికి కావలసిన సమాచారము సేకరించారా అని అడుగుతాడు.
పైగా వారికి ఇంకా కావలసిన సమాచారము వుంటే,
అది చూపించి మరీ వదలమని విభీషణునికి ఆదేశమిస్తాడు.
అది రాముని ఆజ్ఞ
రావణుని ఆజ్ఞ, రాముని ఆజ్ఞ విచారింపతగినవి. రావణుడు కూడా రాముడి లాగ వేదములన్నీ చదివినవాడని వింటాము.
కాని ఈ ఆజ్ఞల ద్వారా మనకి విదితము అయ్యేది, రావణుడు ధర్మాధర్మములే కాక దయా దాక్షిణ్యము కూడా లేనివాడు అని విదితమౌతుంది.
ఇదే ఏబది మూడవ సర్గ లో మనము వినే కథ.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రిపంచాశస్సర్గః ||
|| ఓమ్ తత్ సత్||