||సుందరకాండ. ||

||తత్త్వదీపిక -పన్నెండవ సర్గ ||

||హనుమంతుని నిర్వేదము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ద్వాదశస్సర్గః

తత్త్వదీపిక
హనుమంతుని నిర్వేదము

పన్నెండవ సర్గలో కథ ఇలా చెప్పవచ్చును

ఆ మారుతి ఆ భవనములలో సీతను వెదకవలెనను ఉత్సాహముతో
లతాగృహములు, చిత్రగృహములు , రాత్రిభవనములు అన్నీచూచెను.
కాని , "న చేవ తాం పశ్యతి" కాని ఆ మాతను మాత్రము చూడలేక పోతాడు.

అప్పుడు ఆ మహాకపి ఆలోచనలో పడి డెను.
మైథిలి వెతుకుతూ "నాకు సీతా దర్శనము దొరకుటలేదు"
."ధృవం హి సీతా మ్రియతే" అంటే సీత తప్పక ఆమె మరణించిఉండవచ్చు అని.
కాని సీతను చూడకుండా , ఆ పురుషకార్యము సాధించకుండా,
"న మే అస్తి సుగ్రీవ సమీపగా గతిః"
అంటే సుగ్రీవునకు సమీపముగా వెళ్ళకూడదు.
మళ్ళీ తన అన్వేషణ గురించి అలోచిస్తూ
"వృథా జాతో మమ శ్రమః", నా శ్రమ వృధా అయింది" అని అనుకుంటాడు.

ఆ ఆలోచనలోనే ఇంకా
" కాలాఅవధి దాటిపోయినతరువాత ఆ జానకిని కనుగొనక ఏమి చెప్పెదను?
వారు తప్పక ప్రాయోపవేశము చేసెదరు.
సముద్రమును దాటి వచ్చిన నన్ను వృద్ధుడు జాంబవంతుడు అంగదుడు తక్కిన వానరులు ఏమి అంటారు?"
అనుకుంటాడు.
హనుమంతుడు తన అలోచనారీతిలో నిరుత్సాహము గమనించి ,
వెంటనే ఒక లౌకిక విషయము గుర్తు తెచ్చుకుంటాడు.

"నిర్వేదము లేకుండుటమే శ్రియమునకు కారణము.
నిర్వేదము లేకుండుట పరమ సుఖము.
నిర్వేదము లేకుండా ఉన్నవాడు అన్ని ప్రయత్నములలోనూ సఫలుడు అగును.
నిర్వేదము లేకుండా జీవుడు కర్మచేసినచో అది సఫలము అగును"అని.

ఈ మాట గ్రహించి ,
అది తనకి అన్వయము చేసికుంటూ మళ్ళీ హనుమంతుడు ఒక నిశ్చయానికి వస్తాడు.
"అందువలన నిర్వేదము లేకుండా ఉత్తమమైన ప్రయత్నము చేసెదను.
మళ్ళీ చూడబడని రావణ పాలిత దేశమును చూచెదను" అని.

అలా ఆలోచించి " భూయోపి విచేతుముపచక్రమే"
అంటే మళ్ళీ వెదకడము మొదలెట్టాడు హనుమంతుడు.
మళ్ళీ అన్ని చోటలా "ప్రవిశన్ నిష్పతం చాపి" అంటే ప్రవేశించి బయటికి వచ్చి,
అలాగే "ప్రపతన్ ఉత్పతన్ అపి" అంటే కిందకి దిగి , పైకి ఎక్కి
సీతాదేవి కోసము మళ్ళీ మళ్ళీ వెదికాడన్నమాట.

కాని ఆ వైదేహి ఎక్కడా కనపడకపోతే
"శోకోపహతచేతసః" దుఃఖముతో నిండిన మనస్సు కలవాడై ,
"చింతాం ఉపజగామ" అంటే మళ్ళీ దీర్ఘాలోచనలో పడతాడన్నమాట.

ఇది పన్నెండవ సర్గ లో జరిగిన కథ.

తత్త్వ దీపిక:

ఈ సర్గలో ఎంత ఎన్నిచోట్ల వెదికినా సీత కనపడకపోవటము చేత, "వృథా జాతో మమ శ్రమ" అంటే తన శ్రమ వ్యర్థమాయేనా అన్నవిషయముపై దిగులు పడుతాడు హనుమంతుడు.

లౌకికమగు కార్యములలో కృషి వ్యర్థమైన కాని, ఉత్సాహముతో ముందుకు పోతూ పనిచేయాలి అని చెప్పడము అవుతుంది. అదే ఈ సర్గలో ముఖ్యమైన అంతరార్థము. అదే మాట హనుమంతుని ద్వారా వింటాము.

అనిర్వేదః శ్రియోమూలం
అనిర్వేదః పరం సుఖం|
అనిర్వేదో హి సతతం
సర్వార్థేషు ప్రవర్తకః||

"దిగులు పడకుండా ఉత్సాహము కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమమైన సుఖము. ఉత్సాహమే సర్వార్థములయందు మానవుని ప్రవర్తింపచేయును"

వాల్మీకి రామాయణములో ఆ కాలమునకు అనుగుణముగా లౌకికముగా అందరికి తెలియవలసిన విషయాలు కూడా మనకి కవి ద్వారా తెలుస్తాయి. ఆ లౌకిక విషయాలలో ఇది ఒక మాట. ఇలా అనుకొనిన హనుమంతుడు, ఆ మాటని తన స్థితికి అన్వయించుకుంటూ ఇంకా ఇలా అంటాడు.

"కరోతి సఫలం జంతోః కర్మ యత్ కరోతి సః|
తస్మాత్ అనిర్వేద కృతం యత్నంచేష్టేహముత్తమం"||

"మనము చేయు ఏ పని అయినను ఉత్సాహమే ఫలవంతముగా చేయును. అందుకని ఉత్సాహముతో మరల ప్రయత్నించెదను" అని అనుకొని హనుమంతుడు మళ్ళీ సీతాన్వేషణలో పడతాడు.

ఇందులో మనకు తెలియ చేయబడిన మాట, " శ్రమ సఫలము కాక పోయినా , మనస్సు దిగజారిపోకుండా ఉత్సాహము తో మళ్ళీ ప్రయత్నము చేయాలి" అని.

లౌకికమగు కార్యములలో కృషి ఒకసారి భంగమైననూ మరల ఉత్సాహముతో ఎలా ప్రయత్నము చేయాలో అలాగే ఆత్మాన్వేషణలో కూడా ప్రయత్నము మానకముందుకు సాగుచుండవలెను.

వేలకొలదీ ముముక్షువులలో ఎవరికో ఒకరికే ఆత్మాన్వేషణలో ఆత్మజ్ఞానము కలుగుతుంది.
ఆ అత్మాన్వేషణ లో అనేక అడ్డంకులు వస్తాయి.
ఆ అడ్డంకులతో నిరుత్సాహపడి ఆగిపోయినవారు, అదే నిరుత్సాహముతో ముందుకు పోయినవారు కూడా ఉండవచ్చు.
అత్మాన్వేషణలో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగాలి.
అది కూడా ఉత్సాహముతో ముందుకు సాగాలి.
నిర్వేదముతో నిరుత్సాహముతో చేసే పని ముందుకు సాగే పని కాదు.

అదే ఈ సర్గలో మనము వినే ముఖ్యమైన మాట..


||ఓమ్ తత్ సత్||
|| ఇది భాష్యమ్ అప్పలాచార్యులవారి తత్త్వదీపికలో మాకు తెలిసిన మాట||
||ఓమ్ తత్ సత్||