||సుందరకాండ. ||
||తత్త్వదీపిక-పంతొమ్మిదవ సర్గ||
||అశోకవనములో సీత||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ ఏకోనవింశస్సర్గః
తత్త్వదీపిక
రావణాసురుడు అశోకవనములో ప్రవేశిస్తాడు.
అప్పుడు సీత ఎలావున్నది అన్నది
వాల్మీకి అనేక విధములుగా వర్ణిస్తాడు.
ఈ వర్ణనలో పరమాత్మకోసము తపిస్తున్న జీవాత్మ
ఎలా వుంటుందో అది మనకి కనిపిస్తుంది.
ఇక్కడ బాహ్యార్థము అంతరార్థము ఒకటిలానే ఉంటాయి.
అప్పుడు అదేసమయములో రాక్షసాధిపుడగు రావణుని చూచి
రూపయౌవ్వన సంపదలు కల దోషరహిత రాజపుత్రి,
ఉత్తమమైన భూషణములతో భూషింపబడిన ఆ వైదేహి,
పెనుగాలిలో ఊగులాడె అరటి చెట్టులా వణికి పోయెను.
ఆ ఉత్తమమైన వర్ణము కల విశాలాక్షి తన తొడలతో ఉదరమును,
బాహువులతో స్తనములను కప్పుకొని కూర్చుని విలపింపసాగెను.
ఆ దశగ్రీవుడు కూడా రాక్షసీ గణములచేత రక్షింపబడుచున్న
అత్యంత దుఃఖములో సాగరమధ్యములో చిక్కుకొని ఉన్న నావ లాగ ఉన్న సీతను చూచెను.
ఆ అశోకవనములో భూమి మీద కూర్చుని ఉన్నఆ సీత,
విరగకొట్టి భూమి మీద పడవేసిన చెట్టు కొమ్మలవలె వుండెను.
మలినమాలిన్యములతో కప్పబడినా సుందరముగా వున్న సీత,
ఆభరణములు ధరింపగలదైననూ ఆభరణములు లేక
ఆమె బురదలోని తామరతూడు వలె ప్రకాశించకుండా ప్రకాశించుచున్నట్లు వున్నది.
సంకల్పమనే హయములద్వారా తన మనో రథముపై
రాజసింహుడు విదితాత్ముడగు శ్రీరాముని సమీపమునకు చేరుచున్నదా అన్నట్లు ఉండెను.
ఆమె శుష్కించిపోయి రోదించుచూ,
ఒక్క రామునే ధ్యానించుచూ,
దుఃఖముయొక్క అంతు తెలియని స్థితిలో ఉండెను.
ఆవిధముగా కట్టువడి కూర్చుని ఉన్న ఆ సీత,
చుట్టచుట్టుకొనియున్న పన్నగేంద్రుని వధువువలె ,
గ్రహముల పొగలలో చిక్కుకొని ఉన్న రోహిణి వలె నున్నది.
ధార్మిక ఆచారవతీ శీలమైన కులములో జన్మించి
సంస్కారవంతమైన కులములో ప్రవేశించినప్పటికి,
అమె ఇప్పుడు దుష్కులములో జన్మించిన స్త్రీవలె కనపడుతున్నది.
ఆమె అపవాదములతో పాతివేయబడిన కీర్తివలె నున్నది.
మననము లేనందు వలన ఉపయోగింపబడని విద్యవలె నున్నది.
ఆమె సన్నపడిన మహాకీర్తివలె,
అవమానింపబడిన శ్రద్ధవలె,
పూజద్రవ్యములు లేని పూజవలె,
నిష్ఫలమైన ఆశవలె ఉన్నది.
ఆ దుఃఖములో వున్న సీత,
వస్తుంది అనుకున్న లబ్ది ధ్వంసమైనట్లు వున్నది.
శిరసావహింపబడని ఆజ్ఞవలె నున్నది.
అపాతకాలములో జ్వలిస్తున్న దిశవలె నున్నది.
నిర్వర్తింపబడని పూజవలె నున్నది.
ధ్వంసించబడిన లతలవలె నున్నది.
శూరులు పోయిన సేనవలె నున్నది.
చీకటిచే ఆవరింపబడిన కాంతి వలెనున్నది.
ఎండి పోయిన నదివలె నున్నది.
అపవిత్రమైన వేదికవలె నున్నది.
శమించిన అగ్ని జ్వాలవలె నున్నది.
రాహువుచే మింగబడిన పూర్ణచంద్రుని వలె నున్నది..
ఆమె, గజముల తొండములతో ధ్వంసింపబడిన తామరలు కల,
భయపడిన పక్షులతో ఆవరింపబడిన తామరకొలను లోని పద్మిని వలె నున్నది.
పతిశోకముతో దుఃఖములో నున్న సీత,
నీరు పక్కకి మరలించబడి శుష్కించిన నది వలె నున్నది ,
కృష్ణపక్షములో నున్న రాత్రివలె నున్నది.
సుకుమారి , సందరమైన అవయవములు గలది,
రత్నగర్భమైన గృహములలో నివశించతగినది అయిన ఆ సీత,
పెకలింపబడి ఎండవేడికి తపించిపోయిన తామరపూవులా వున్నది.
ఆమె పట్టుకోబడి స్తంభమునకు కట్టబడి
గజరాజునుంచి విడివడిన గజరాజు వధువు వలె
అతి దుఃఖముతో నిట్టూర్చుచున్నది.
అప్రయత్నముగా పోడుగైన ఒక జడతో శోభించుచున్న ఆమె,
వర్షాకాలపు చివరిలో నల్లని వృక్షములబారుతో వున్న భూమిలా శోభిస్తున్నది.
ఉపవాసములతో శోకముతో ధ్యానముతో భయముతో
క్షీణించి కృశించి దీనముగానున్న ఆ సీత
తపమే ధనముగా స్వల్పాహారముతో ఉన్నది.
దుఃఖములో వున్న దేవతవలె వున్న సీత అంజలిఘటించి
రాఘవునిచేత రావణ పరాభవము కోరుచున్నదా అన్నట్లు వున్నది.
రోదించుచున్న దోషములేని,
చక్కని కనురెప్పలు గల ,
కొనలందు ఎరుపుదనముగల,
తెల్లని విశాలనేత్రములు కల ,
ఎల్లప్పుడూ రామునే ధ్యానించుచున్న,
ఆ సీతను ప్రలోభించుటకు రావణుడు
తన చావును కోరుకుంటున్నట్లు ప్రయత్నము చేయును.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో పంతొమ్మిదవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||