||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువది నాలుగవ సర్గ ||

|| దీనుడైనా రాజ్యహీనుడైనా !||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుర్వింశస్సర్గః

తత్వదీపిక
దీనుడైనా రాజ్యహీనుడైనా !

ఇరువది నాలుగొవ సర్గలో కూడా,
సామదాన భేద దండో పాయములను ఉపయోగించి
సీతాదేవిని లొంగపరుచుకొమ్మని ఆజ్ఞాపించిన రావణుని ఆజ్ఞ ప్రకారముగా,
ఆ రాక్షస్త్రీలు సీతను చుట్టుముట్టి ఎన్నోవిధములుగా చెప్పడము కొనసాగుతుంది .

"మనుష్యజాతిలో వుండి మనుష్యుడికే భార్యగా వుండడము,
- "బహుమన్యసే" - గొప్పదనుకుంటున్నావు"
"ప్రత్యాహర మనోరామాత్"- "రాముడిని మనస్సులోంచి తొలగించుకో"

ఇవి ఆ రాక్షసస్త్రీల మాటలు.

ఇక్కడ ఇంకో ధ్వని వస్తుంది.
అది రాముడు సీత మనుష్యజాతివారని.
రామాయణము మానవ జన్మ ధరించినవారి కథ అని .

రామాయణములో బాలకాండలో మొదటిశ్లోకాలలో
మనము వాల్మీకి నారదుల సంభాషణలో విన్నది కూడా ఇదే .
వాల్మీకి అడిగిన ప్రశ్న- ఈ లోకములో ( చెప్పిన) పదహారులక్షణములు కలవాడు ఎవరు? అని.
మనుష్యజాతి లోనే పుట్టి,
ఎన్నో ఉపద్రవములను ఎదురుకొని,
ధర్మాచరణమే ప్రధానముగా ప్రవర్తించిన మనుష్యుడు ,
ఆ పదహారుగుణములు కలవాడు,
ఇక్ష్వాకు కులములో జన్మించిన రాముడు అని నారదుని సమాధానము.
అలాగ రామాయణము మనుష్య జాతి వారి కథ అని మనకి వాల్మీకి మళ్ళీమళ్ళీ చెపుతూవుంటాడు.

రాక్షస స్త్రీలు చెప్పేది - ఆ "త్రైలోక్య వసు భోక్తారమ్"
ముల్లోకాల ఐశ్వరము అనుభవించే రావణుని వరించు అని.

దానికి సీత చెప్పిన సమాధానము వినతగినది.
మననము చేయ తగినది.

"దీనో వా రాజ్యహీనో వా"
దీనుడైనా సరే రాజ్యహీనుడైనా సరే,
ఆయనే నా భర్త - ఆయనే నాగురువు.

అంతేకాదు అలా భర్తను అనుసరించే భార్యలందరి గురించి సీత చెపుతుంది.

సువర్చల సూర్యుని అనుసరించినట్లు,
మహాపతివ్రతలైన శచి శక్రుని,
అరుంధతి వశిష్ఠుని,
రోహిణి చంద్రుని,
లోపముద్ర అగస్త్యుని,
సుకన్య చ్యవనుని,
సావిత్రి సత్యవంతుని అనుసరించినటులనే,
తను కూడా రాముని అనుసరిస్తాను అని.

ఈ మాటలలో సీత పాతివ్రత్యము మనకి కనిపిస్తుంది.

రావణునిచే ఆజ్ఞాపింపబడిన ఆ రాక్షస స్త్రీలు సీత మాటలు విని,
క్రోధమూర్ఛితులై పరుషమైన వాక్యములతో మళ్ళీ భయపెడతారు.
సీతాదేవిని బెదిరిస్తున్న ఆ రాక్షసస్త్రీల మాటలను
శింశుపావృక్షములో దాగి యున్న ఆ హనుమంతుడు మౌనముగా వింటాడు.

వణికిపోతున్న ఆ సీతను చుట్టుముట్టి కోపముతో,
రాక్షస స్త్రీలు మళ్ళీ మళ్ళీ భయపెట్టసాగిరి.

క్రోధములో ఉన్నఆ రాక్షసస్త్రీలు తమ గొడ్రాళ్లను తీసుకొని
ఇలా అరుంధతి రోహిణీ, లోపాముద్రల గురించి మాట్లాడే సీత
"రాక్షసాధిపతి అగు రావణుని భర్తగా పొందుటకు అర్హురాలు కాదు,"అని అనుకుంటారు.

అప్పుడు భయంకరమైన రూపముగల
వికృతమైన ఉదరముకల వినత అను పేరుగల రాక్షసి సీతతో ఇట్లు పలికెను.

"ఓ సీతా నీ భర్తపై ప్రేమ చూపించావు.
అది చాలు.
ప్రతీది అతిగా చేస్తే అది కష్టాలకి దారితీయును.
మైథిలీ ! సంతోషిస్తున్నాను.
నువ్వు నీ మానుష విధిని నిర్వర్తించావు.
నీకు మంగళమగు గాక.
ఇప్పుడు మేము చెప్పిన మాటలు వినుము.
రాక్షసులందరికి రాజు, విక్రాంతుడు, రూపవంతుడు ఇంద్రుడు దేవేంద్రుడు లాగ త్యాగశీలుడు,
అందరికీ ప్రియదర్శనుడు అయిన రావణుని భర్తగా పొందుము.
మనుష్యుడు కృపణుడు అయిన రాముని వదిలి రావణుని ఆశ్రయించుము. "

ఇలా అంతా రావణుని మీద పొగడతలు చెప్పి,
"ఏతదుక్తం చ మే వాక్యం
యదిత్వం న కరిష్యసి"
అంటే "ఇలా నేను చెప్పిన మాటలు విని నీవు చేయకపోయినచో,

"అస్మిన్ ముహూర్తే సర్వాః త్వాం
భక్షయిష్యామహే వయం|| "
"ఈ క్షణములో మేము నిన్ను భక్షించెదము".అని

ఆ సంభాషణలలో వికట ,చండోదరి, ప్రఘస, అజాముఖి, శూర్పణఖ అనే రాక్షస స్త్రీలు,
సీతాదేవికి అన్నిరకాల మాటలు చెప్పి ,
సీత మనసుమారదు అని తెలిసికొని ,
వాళ్ళు ఏవిధముగా తృప్తి చెందవచ్చు అనే అలోచనలో పడతారు.

ఒక రాక్షసి సీత హృదయము , ప్లీహము అంతరములు శిరస్సు తినడానికి కోరిక వెల్లడిస్తుంది.

ఇంకొక రాక్షసి ఆమెను ఖండించి సమానముగా ముక్కలు చేసి తిందాము అని అంటుంది

మరింకొక రాక్షసి సర్వ శోకవినాశిని అగు సురాపానీయము తీసుకురావడము మంచిది అని అంటుంది.

మనుష్య మాంసము తిని, సురాపానీయము చేసి, నికుంభనిలా నృత్యము చేద్దాము అని ఇంకొకరి ఆలోచన.

ఈ విధముగా భయపెట్ట బడిన సీత ధైర్యము కోల్పోయి విలపింపసాగెను అని రాస్తారు వాల్మీకి.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది నాలుగవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||