||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువది తొమ్మిదవ సర్గ ||

||శుభాం నిమిత్తాని !||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకోనత్రింశస్సర్గః

తత్త్వదీపిక
శుభాం నిమిత్తాని !

ముందు సర్గలో - 'రామానుజం లక్ష్మణపూర్వజం" అంటూ,
రామలక్ష్మణులను తలచుకుంటూ,
మూఢురాలై వారిద్దరినీ చేతులారా దూరము చేసుకున్నానని,
అందుకనే కష్టాలలో వున్నట్లు భావించి,
ఆ వియోగము భరించలేక యముడుదగ్గరకు పోవాలని సీత విలపించింది.

జీవునకు ఇద్దరు రక్షకులు.
ఆ రక్షకులు భగవంతుడు ఆచార్యుడు .
ఆచార్యుడు భగవంతులను ఇద్దరినీ దూరము చేసుకున్న జీవుడు ఎలా విలపిస్తాడో,
సీత అలా విలపించింది.
సీతకు రామ లక్ష్మణులు ఆచార్య భగవత్స్వరూపులు.

ఇక సీత కష్టాలలోనుంచి బయటపడుతుంది అని సూచిస్తూ,
ఈ సర్గ మొదటిశ్లోకములోనే -
'శుభాం నిమిత్తాని శుభాని భేజిరే'
అంటూ కవి , శుభ శకునములు వర్ణిస్తాడు.

ఆ శుభ శకునము లు ఏమిటీ అంటే,
అవి "వామమరాలపక్ష్మ" ఎడమ కన్ను అదిరిందిట.
రామ బాహువులలో సేదతీర్చుకున్న ఆమె ఎడమభుజము, " వామ భుజశ్చ", అదిరిందిట.
ఆమె ఎడమ తొడకూడా అదిరిందిట.
నిలబడియున్న సీత బంగారురంగుకల చీర కొద్దిగా జారిందిట.
వీటితో ఆవిడకి "రామం పురస్తాత్ స్థితం ఆచక్షే"
రాముడే ముందునిలుచున్నాడా అన్నట్లు అనిపించిందిట.

ఈ శకునాలు ముందు సిద్ధులచేత చెప్పబడినాయిట.
ఈ శకునాలతో సీత రాహుముఖమునుండి బయటపడిన చంద్రుడు లాగ కనిపించిందట.

అంటే దీనితో సీతమ్మ దుఃఖము అంతమగుచున్నది అని ధ్వని.
ఇప్పటి దాకా దాగి వున్న హనుమ బయటకు వచ్చే సమయము వచ్చింది అని కూడా ధ్వని.
సీతా విలాపము, రాక్షసీ తర్జనము, త్రిజటా స్వప్న వృత్తాంతము అన్నీ విన్న హనుమ,
సీతముందుకు వచ్చే సమయము ఆసన్నమైనది అన్నమాట.

ఉపనిషత్తులలో వినే గురుశిష్య సంభాషణలలో మనకి తెలిసేది
గురువు శిష్యులకు బ్రహ్మజ్ఞానము ఉపదేశించే ముందర
శిష్యులు ఆ ఉపదేశానికి తగినవారా అని పరిక్షించి,
పిమ్మట అర్హత వున్నవారికే గురువు దగ్గరనుంచి ఆ ఉపదేశము లభిస్తుంది.

తగిన శిష్యుడు అంటే, ఆ శిష్యునికి ఐదు లక్షణములు ఉండాలిట. అవి:

1 అనన్య సాధ్యత్వము
2 ఆర్తి
3అధ్యవసాయము
4 ఆదరము
5 అసూయ లేకుండుట

రాముడే తప్ప ఇతరులను పొందవలెనను కోరిక లేక,
ఐశ్వర్యమును గాని ధనముకాని కాంక్షింపక,
సీతమ్మ రామునే ధ్యానిస్తూ వుంది.
అందుచేత,

1 ఆమె తన సాధ్యాంతరముల మీద ఆసక్తి లేక
భగవంతుడే రాముడే పొందదగినవాడని నిశ్చయముతో వుండెను.
అదే మొదటి లక్షణము. అదే అనన్యసాధ్యత్వము

2 దైన్యముతో నిరాహారత్వముతో నేలపై శయనించుట అనేది
ఆమె ఆర్తిని తెలుపుతుంది.
ఇది రెండవ లక్షణము.

3 రాముని పొందనిచో ప్రాణములు కూడా విడువడానికి సిద్ధపడడము ఆమె అధ్యవసాయము.
ఇది మూడవ లక్షణము.

4 రామకథను హనుమంతుడు వినిపించినపుడు ఆదరముతో వినును.
ఇది నాలుగొవ లక్షణము.

5 రాముడు తనని అలక్ష్యము చేసినట్లు అనిపించినా
రామునిగుణముపై అసూయ ఏర్పడలేదు.
రాముని గుణములను ఎల్లపుడూ తలచుచునే ఉండెను.
ఇది ఐదవ లక్షణము.

ఇవి ఐదు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ,
సీత ఆచార్యుని ఉపదేశము వినడానికి తగిన స్థితిలో ఉన్నదన్నమాట.

అలాగ ఆచార్యుని రూపములో హనుమ ముందుకు వచ్చే సమయము వచ్చినది అన్నమాట.

ఇది మనము ఇరువది తొమ్మిదవ సర్గలో వినే మాట.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది తొమ్మిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||