||సుందరకాండ ||
||తత్త్వదీపిక ||
||తత్త్వ దీపిక: లంకిణిని జయించుట.
||
||ఓం తత్ సత్||
సుందరకాండ.
అథ తృతీయ సర్గః
తత్త్వ దీపిక: లంకిణిని జయించుట
మూడవ సర్గ లో జరిగిన కథ ఇది.
హనుమంతుడు లంకానగరములో ప్రవేశించి
దాని రక్షణగురించి చూచి ఆశ్చర్యపడి ముందుకు పోతూ ఉంటే
లంకిణి హనుమంతునిని అడ్డగించి అడుగుతుంది.
"ఓ వనాలయా నీవు ఎవరు ?
ఏకారణము వలన ఇక్కడికి వచ్చినావు?
నీవు ప్రాణాలు ధరించి వున్నసమయములో యధార్థము చెప్పుము".
అప్పుడు హనుమంతుడు ఆమె తో
"నీవు ఏవరవు?
ఎందుకొరకు నన్నుఆపి భయపెట్టుచున్నావు?"
అని తిరుగు ప్రశ్నలు వేస్తాడు.
అప్పుడు లంకిణి ,
"నేను మహాత్ముడగు రాక్షస రాజు ఆజ్ఞ మీద దుర్ధర్షమైన ఈ నగరమును రక్షించుచున్నాను.
నన్ను కాదని నీకు ఈ నగరము ప్రవేశించుటకు శక్యము కాదు.
నేను స్వయముగా లంకా నగరపు లంకిణిని.
ఈ నగరమును అన్నివైపులనుంచి రక్షించుచున్నాను.
ఇది నీకు చెప్పుచున్నాను."
అప్పుడు హనుమంతుడు లంకిణి యొక్క ఆమాటలు విని
ఆమెకి ఎదురుగా పర్వతాకారములో నిలబడి ఇట్లు పలికెను.]
"బురుజులు ప్రాకారములు గల ఈ లంకానగరము చూచుటకై ఇచ్చటికి వచ్చిన వాడను.
నాకు చాలా కుతూహలముగా వున్నది.
ఇక్కడి వనములు ఉద్యానవనములు ముఖ్యమైన గృహములు అన్ని చూచుటకు వచ్చినవాడను."
అప్పుడు ఆ కామరూపిణి మళ్ళీ,
"ఓ దుర్బుద్ధిగలవాడా !
వానరులలో అధముడా !
నన్ను జయించకుండా
రాక్షసేంద్రునిచే పాలింపబడు ఈ నగరము చూచుటకు నీకు శక్యము కాదు." అని పలికెను.
అప్పుడు హనుమంతుడు ఆ రాక్షసితో .
" ఓ మంగళప్రదముగా నున్నదానా !
ఈ నగరము చూచి వచ్చిన విధముగనే పోయెదను" అని పలికెను.
అప్పుడు ఆ లంకిణి భయంకరమైన నాదము చేసి
వేగముగా వానరశ్రేష్ఠుని కొట్టసాగెను.
అప్పుడు ఆ హనుమంతుడు తన ఎడమ చేతి పిడికిటతో ఆమెను కొట్టెను.
ఆ దెబ్బతో లంకిణి వెంటనే భూమిమీద పడిపోయి హనుమంతునితో ఇట్లు పలికెను.
" ఓ ప్లవంగమా! నేను స్వయముగా లంకానగరి లంకిణిని.
నేను నీ పరాక్రమముచేత జయించబడిన దానను.
ఓ హరీశ్వరా పూర్వము స్వయంభువే నాకు వరము ఇచ్చెను.
ఇది తథ్యము నీవు వినుము.
"ఏప్పుడు నువ్వు ఒక వానరుని పరాక్రమము చేత జయింపబడుదువో
అప్పుడు రాక్షసులకు కీడు కలుగును అని గ్రహించుము"అని.
ఓ సౌమ్యుడా నీ దర్శనము చేత ఆ సమయము వచ్చినదని గ్రహించుచున్నాను.
స్వయంభువు మాట సత్యము.
దానికి తిరుగులేదు.
దురాత్ముడైన రావణుని కారణముగా రాక్షసులందరికీ వినాశము కలుగనున్నది.
ఓ హరిశ్రేష్ట ! కనుక ఈ రావణపాలిత లంకానగరము ప్రవేశించి
ఏమి ఏమి కార్యములు చేయదలచినావో ఆ కార్యములన్నీ చేసుకొనుము".అని
అది మూడవసర్గలో కథ.
దీనిలో ముఖ్యము లంకిణీ హనుమత్సంవాదము.
ఆత్మ అంటే దేహము కంటే వేరు అన్న మాట తెలియజేయకుండా చేసేది
మనలో వుండే అహంకారము.
దేహాత్మాభిమానము .
దేహము నేనే ఆత్మ అనుకుంటూ ఉండడమే దేహాత్మాభిమానము.
ఇది ఉన్నంత వరకు ఆత్మ అన్వేషణ జరగదు.
మనసుకి శక్తి తగ్గదు.
ఇక్కడ హనుమకు ఎదురుగా లంకయే "నేను" అంటూ లేచినది.
అలాగ నిలచినది ఈ దేహము అనెడి లంకను కాపాడే రాక్షసి.
"అహం రాక్షసరాజస్య" అంటూ,
అలాగే " అహం హి నగరీ లంకా" అంటూ.
ఈమె యే "అహం" అని చెప్పడము కోసము,
"అహం" అన్నశబ్దము రెండు సార్లు ప్రయోగించ బడినది.
ఆత్మకాని దేహమును ఆత్మ అనుకోవడమే అహంకారము.
ఆ అహంకారము ఉన్నంతకాలము అత్మాన్వేషణ జరగదు.
దానిని జయించియే లోనకు వెళ్ళవలెను.
దానిని జయించిననాడు రావణుడు రావణ రక్షకులు నశిస్తారు.
అప్పుడు మనస్సులోని రాక్షస చిత్తవృత్తులు నశించును.
సీతమ్మ దర్శనమగును.
ఆత్మాన్వేషణము చేయవలెనని కోరిక గల సాధకుడు
ముందుగా వశపరచు కొనవలసినది
ఈ దేహాత్మాభిమానము అనే అహంకారమునే.
లంకిణీ హనుమత్సంవాదములో కొన్ని మాటలు విన్నతగ్గవి.
లంకిణి అంటుంది- "కస్త్వం ? కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ?"
"నీవెవడవు? ఓ వనాలయ నీవేపని మీద ఇఛటికి వచ్చితివి?అని.
"వనాలయ" అంటే వనములలో ఉండువాడా అని.
కాని వనాలయ శబ్దములో హనుమ బ్రహ్మ నిష్ఠుడని ధ్వనించుచున్నది.
వనము= బ్రహ్మము అని.
ఉపనిషత్తులలో "బ్రహ్మ వనం బ్రహ్మ సవృక్ష ఆసీత్" అని,
బ్రహ్మమును వనముగా నిరూపింపబడినది.
ఈ వనము నందు వశించువాడు కనక "వనాలయుడనబడెను".
హనుమ తిరిగి -" కా త్వం ? విరూపనయనా?" - అంటాడు.
"వికృతములగు నేత్రములు కలదానా నీవు ఎవ్వతెవు?" అని.
అందు ఆమెయే మాయ.- ప్రకృతి అనబడే అజ్ఞానమని సూచించును.
విరూపమను మాయారూపమును - నయనా=పొందించునది అని.
అదే ప్రకృతి.
ఆత్మకాని దేహమునందు దేహమునకు తనే ఆత్మ అనే బుద్ధిని కలిగించునది మాయ.
అట్టి మాయచే కలుగు దేహాత్మభ్రాంతియే లంక అని ధ్వనించినది.
ఆ దేహాత్మ భ్రాంతియే హనుమను కూడా ఎదిరించెను.
మహాపురుషులను కూడా మాయ ఎదిరిస్తుంది.
కాని వారు దానిని జయించి లోనకి వెళ్ళుతారు.
మనము దానికి లోబడి అన్వేషణలోకి పోలేము.
ఈ విధముగా ఇక్కడ లంకిణిని జయించడములో
పురుషుడు అహంకారము దేహాభిమానమును జయించి
ఆత్మాన్వేషణలో పోవడము సూచితమైనది.
||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||