||సుందరకాండ ||

||తత్త్వదీపిక ||

||రెండవ సర్గ - లంకానగర ప్రవేశము. ||


||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ ద్వితీయ సర్గః

తత్త్వ దీపిక- నూరేళ్ళు ఆయుస్సు !

రెండవ సర్గ టూకీగా చెప్పాలి అంటే హనుమంతుడు లంకచేరి త్రికూట పర్వత శిఖరముపై వాలి లంకను చూస్తాడు.అది చాలా అందముగా వుంది అమరావతిలావుంది. దాని రక్షణ చాలా కట్టుదిట్టముగా వుంది. ఇలాంటి నగరములోకి తను సుగ్రీవుడు, అంగదుడు నీలుడు తప్ప ఇంక ఎవరు ప్రవేశించగలరు అని ఆలోచినలో పడి , మళ్ళీ అదంతా ముందు సీతమ్మని కనుగొని తరువాత ఆలోచిద్దాము అనుకొని ఆ ఆలోచన అప్పటికి ఆపుతాడు. అప్పుడు మళ్ళీ తను ఏవిధముగా సీతాన్వేషణ అరంభించాలి అని అలోచించి తనను అతి చిన్నరూపములో మార్చుకొని లంకలో కి ప్రవేశిస్తాడు. అప్పుడు హనుమకి సాయము చేస్తున్నాడా ఆట్లు చంద్రుడు ఆకాశములో ప్రకాశిస్తున్నాడు. అది రెండవ సర్గలో కథ.

సుందరకాండలో సీతమ్మ కనపడే దాక హనుమంతుడు తన అలోచనలన్నీ మనకు వినపడేలానే చర్చిస్తాడు. ఓక్క లంకిణిని మినహాయించి సుందరకాండలో హనుమంతుడి కి సీతకనపడే దాకా ఇంకెవరి తోనూ మాట్లాడే అవకాశములేదు. అందుకనే వాల్మీకి హనుమంతుని అలోచనలకు మాటలు తగిలించి మనకు వినపడేలా చేస్తాడు. సుందరకాండలో హనుమంతుని ప్రతిమాట వినతగ్గదే. అందుకే ఈ కాండని సుందరకాండ అని అంటారు కూడా.

లంకలో దిగిన తర్వాత హనుమంతుడు "అనిశ్వసన్ కపిః నతత్ర గ్లానిం అధిగచ్ఛతి" .
అంటే ఆ నూరుయోజనాల సముద్రము దాటినా ఆ హనుమంతుడు అలసిపోయి గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేస్తూ సముద్రపు ఒడ్డుమీద కూలపడలేదు. పైగా అలసటపొందిన వానిలా కూడా లేడట.

అదే మాట హనుమంతుడు తనలో తానే అనుకుంటాడు. " నేను ఈ విధముగా ఎన్నో నూరు యోజనములు వెళ్ళగలవాడిని. నూరు యోజనముల సముద్రము దాటుట ఎంతపని?" అని.

ధ్యానయాత్రలో ఉన్నవాడు నూట ఎనిమిది సార్లు మంత్రము చదివి అలసట పోడు. అట్టివాడు ఇంకా ఎన్నో వందల సార్లు మంత్రముపై ధ్యానము చేయగలవాడు. అత్మాన్వేషణలో ఉన్న వానికి అలసట అన్నమాట ఉండదు. హనుమంతుడు నూరు యోజనముల సముద్రము దాటికూడా అలసటపోలేదు.

అంటే ఇక్కడ మనకి వినపడే మాట ఏమిటి?
ఆత్మాన్వేషణలో సాధకుడు అలసట పడడము అన్నమాట ఉండదు.
అదేకాదు అత్మాన్వేషణ అన్నది ఎవరు చేస్తారు?
అలా చేయాలని కోరిక ఉన్నవాళ్ళే చేస్తారు.
అది డిగ్రీ అందుకోనే పరీక్ష పాసవడానికి కాదు.
మనసారా ఆ అనుభూతి పొందుదామనే ఆశతో వున్నవారు , అదే కోరికతో చేస్తారు.
ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక కోసము ఎన్ని కష్టాలైన భరించగలరు.

ఆప్పుడు వచ్చే కష్టాలు, కష్టాలు లాగానే ఉండవు.
ఇష్టములేనిదే కష్టము అని మనము విన్నమాటే.
అంటే ఇష్టము ఉంటే కష్టము అని పించదు.
అదే ఇది.

ఇక్కడ సముద్రము "శత" యోజనములు అంటాడు కవి. ఇంకోచోట సీతమ్మవారు " ఏతి జీవంత మానందో నరం వర్ష శతాదపి" నరుడు "శత" సంవత్సరాలు జీవిస్తే తప్పక ఆనందము తప్పక దొరుకుతుంది అని అంటుంది. మనిషి ఆయుస్సు నూరు సంవత్సరాలు అని కూడా వింటాము. అలా నూరు అన్నమాట చాలా సార్లు వస్తుంది.

అప్పలా చార్యులు గారు చెప్పేది ఇలా చెప్పబడే నూరు అన్నది ఒక సంఖ్యమాత్రమే కాదు అని.
నూరు అన్న సంఖ్యద్వారా తత్త్వ స్వరూపము విశదీకరించబడినది అని.
తత్త్వ స్వరూపము ఏమిటి?
అసలు తత్త్వములు మూడు
- భగవత్ తత్త్వము
- జీవ తత్త్వము
- ప్రకృతి తత్త్వము

ఇందులో భగవత్ తత్త్వము ప్రధానము. జీవ తత్వము ప్రకృతి తత్త్వము భగవత్ తత్త్వము పై ఆధారపడి యుంటాయి. కారణావస్థలో మూడూ ఉంటాయి. జీవ ప్రకృతి తత్త్వములతో కూడిన భగవత్ తత్త్వమే ఈ జగత్తునకు కారణము.

నూరులో ఒకటి ప్రధానము. సాధారణముగా సున్నలు అప్రధానములు. అ సున్నలు తమలో తామే విలువ లేనివి. కాని ఒకటితో కలిసినప్పుడు వాటికి విలువ ఉంటుంది. ఇక్కడ భగవత్ తత్త్వము ఒకటి ని సూచించును . జీవ తత్త్వము ప్రకృతి తత్త్వము సున్నాలని సూచించును. అలాగ నూరు సంఖ్య ప్రకృతి జీవ తత్త్వములతో కూడిన భగవత్ తత్త్వమును సూచించును.

నూరేళ్ళు దాటుట యే తత్త్వజ్ఞానము కలుగుట.
నూరుయోజనములు దాటుటయే తత్త్వ జ్ఞానము కలుగుట

దీనిని సూచించుటకే మనవాళ్ళు ఆయుర్దాయము నూరేళ్ళనిరి. బ్రహ్మకైననూ దేవతలకైనను నూరేళ్ళే ఆయుర్దాయము. అనగా తత్త్వజ్ఞానము కలుగు వరకే శరీర సంబంధము. శరీరము తో సంబంధము కలిగియుండుటయే ఆయుర్దాయము. తత్త్వజ్ఞానమును ఎరుగుటయే నూరేళ్ళు నిండుట. అదే నూరు యోజనములు దాటుట.

హనుమంతుడు కూడా నూరు యోజనములు దాటి మహాపురుషుల స్థితి పొందాడన్నమాట.

ఇంక లంకావర్ణన చూద్దాము.

హనుమ ఆ త్రికూట పర్వత శిఖరమునుండి చూస్తున్నాడుట లంకానగరమును.

ఆ నగరము సర్వఋతువులతో వుండే పుష్పములతో,
పద్మములతో కలువలతో నిండిన సరస్సులతో,
ఆకాశమునంటే మిద్దెలతో అమరావతిని మించి పోతూ,
విశ్వకర్మచే "మనసేవ కృతాం లంకాం" అంటూ మనసా చేయబడినదా అన్నట్లు వుందిట.
ఆనగరము చుట్టూ బంగారపు ప్రాకారము కూడా వుందిట.
ఆ లంక భోగములకు స్థానము.

ఆ లంకానగరము రక్షణకు అనేకమంది రథ గజ తురగ ములపై ఉన్న రాక్షస మహాయోధులు,
అనేక రకములైన ఆయుధాలను ధరించిన పాదచారులు కూడా తయారుగా వున్నారుట.

ఇక్కడ లంక అంటే మనశరీరమే .
మన శరీరము కూడా విశ్వకర్మ యగు పరమాత్మునిచే మనసా నిర్మింపబడినది.
మనశరీరము కూడా భోగములకు స్థానము.
శరీరములోని ఇంద్రియాలే మిద్దెలూ మేడలు సరోవరములూ మున్నగునవి.
మన శరీరములో కూడా వున్న అసురములూ రాక్షసప్రవృత్తులూ, భగవన్నామ సంకీర్తన , భగవద్విషయములపై చింతన లోపలకి రాకుండావుండాలి అని చాలా అప్రమత్తతో ఉంటాయి.

అధ్యాత్మిక చింతన లాంటి విషయములు,
ప్రపంచ విషయ వాహిలో మునిగి పోతున్న తనకి తగినవి కావని ,
అవి పనిలేని వారకే అని అనిపించే మనోవాక్కులే రథ గజ తురగములపై ఉన్న రాక్షస మహాయోధులు.

మన చుట్టూకూడా విషయ వాంఛలు విషయ భోగములూ అనబడే బంగారు ప్రాకారము ఉంది.
అధ్యాత్మ చింతన లోకి రావాలంటే వీటన్నిటినీ జయించి రావాలి అన్నమాట.

ఇటువంటి కోటలోకి సీతాన్వేషణ లేక అత్మాన్వేషణ కి ఎవరు రాగలరు?

హనుమంతుడు చెపుతాడు
1 అంగదుడు 2 నీలుడు 3 హనుమ 4 సుగ్రీవుడు అని.

మొదటివాడు అంగదుడు.

అంగదుడు విడమరిస్తే , అం అంటే భవంతుని , గద అంటే కీర్తించువాడు అని అర్థము.
అంగదుడు అంటే నామ సంకీర్తన చేయువాడు అన్నమాట.
ఆధ్యాత్మిక మార్గము చేపట్టాలి అంటే ముందు గా చెయవలసిన పని నామ సంకీర్తనమే.
అలా నామసంకీర్తన చేస్తూ వుంటే మనస్సు భోగములనుంచి తిరిగి భవంతుని పథములో పోతుంది.
అ తరువాతే చిత్తశుద్ధి , ధ్యానము మొదలగునవి వస్తాయి.

రెండవ వాడు నీలుడు. నీలుడు అగ్నిహోత్రుని పుత్రుడు.

శరీరములో ఉన్న ఆత్మ తత్త్వము దర్శించుటకు ముందు చేసిన పాపములు ప్రతిబంధకములుగా వుంటాయి.
తపస్సు యజ్ఞము దానము అను నటువంటి కర్మలే, ఆ పాపముల వలన మనసులో సమకూడిన మాలిన్యమును పోగొట్టి పవిత్రము చేయును.
ఆ కర్మలే నీలుడు.
ఆ నీలుడు అగ్నిహోత్రుని అనుగ్రహము పొందినవాడు కనక లంకలో కి ప్రవేశించకలడు.

మూడవ వాడు హనుమ.

హనుమ అనగా వాయుపుత్రుడు.
వాయువు తో కూడినది ఉఛ్వాస నిఃశ్వాసములు.
ఆ ఉఛ్వాస నిఃశ్వాసములతో కూడినదే మంత్రము.
ధ్యానము మంత్రోచ్ఛారణచేతనే ఆత్మ భగవద్దర్శనము అగును.
ఆ మంత్రమే మనకు శరీరమనే లంకలో ఆత్మాన్వేషణకి భగవత్ దర్శనానికి కావలసినది.
ఆ హనుమే లంకలో ప్రవేశింపగలవాడు.

నాలుగవ వాడు సుగ్రీవుడు.

సుగ్రీవుడు వేదాధ్యయనసంపన్నుడు.
ఇంద్రియములకు గోచరము కాని అత్మ పరమాత్మల ను ఎరిగించునది వేదము.
దానిని అధ్యయనము చేసినచో భగవద్దర్శనము కలుగును.
అ వేదాధ్యనము చేసిన సుగ్రీవుడే లంకలో ప్రవేశింపగలవాడు.

హనుమ ఈ నలుగురికే లంకానగరములో కి ప్రవేశింపగల శక్తి కలదు అని అంటాడు.

అంటే శరీరములో మరుగుపడియున్న ఆత్మను తెలుకోడానికి (1) నామ సంకీర్తనము (2) తపో యజ్ఞదానాది కర్మలు (3) మంత్రజపము లేక ధ్యానము (4) వేదాధ్యయనము అనే నాలుగూ కావలసిన సాధనములు అని.

ఇంక మిగిలినది లంకలో ఎప్పుడు ఎట్లా ప్రవేశించవలెను అనే హనుమ ఆలోచన.

రాత్రివేళ కనీకనపడని రూపములో ప్రవేశించవలెను అని భావము.

మరి రాత్రివేళ నిశాచరులు మేలుకువగా ఉంటారు కదా అని అనిపించవచ్చు.

నిశాచరులు అంటే అంధకారములో తిరుగువారు అని.
అంధకారము అంటే చీకటే అని కాదు.
అజ్ఞానము కూడా అంధకారమే.
నిశాచరులు అంటే అజ్ఞానములో రమించే వారనమాట.
ఆ అజ్ఞానములోనే రాక్షస ప్రవృత్తులు అధికముగా ప్రజ్వరిల్లు తాయి.
ఆజ్ఞాన అంధకారములో అజ్ఞానముచే కప్పబడి ఆత్మ అదృశ్యముగా వున్నప్పుడు వీర విహారము చేసేవారే నిశాచరులు.

అలా అందరూ అజ్ఞానమనే అంధకారములో మునిగియున్నప్పుడు హనుమంతుడు సీతాన్వేషణ మొదలెడతాడు.
ఆలా అన్వేషణ మొదలెడడానికి తన స్వరూపము వదిలి

"వృషదంశకమాత్రః సన్ భభూవాద్భుత దర్శనః|

ఒక పిల్లి అంతటి వాడై అద్భుతమైన దర్శనము కలవాడయ్యెను.
చీకటిలో మనకి కనపడని వస్తువులు చూడకల శక్తి పిల్లికి వుంది.
అంటే హనుమంతుడు కూడ అటువంటి శక్తి కలవాడయ్యెను ఆన్నమాట.
ఆజ్ఞానము అనే అంధకారములో ఎవరికీ కనపడని ఆత్మాన్వేషణ కి దానిని చూడ గలశక్తితో హనుమ బయలు దేరాడన్నమాట.

అలా బయలు దేరినప్పుడు చంద్రుడు ఆకాశములో ప్రకాశిస్తున్నాడుట.
అది హనుమంతుడి సాయము చేస్తునాడా ఆన్నట్లు వుందని అంటాడు వాల్మీకి.
నిష్కామ కర్మ చేసేవారికి అందరూ వెంటనే సహాయపడతారు అని మనము భగవద్గీతలో విన్నమాటే.
అదే చంద్రుడు చేయుచున్నది.

||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||