||సుందరకాండ. ||
||తత్త్వదీపిక-నలుబది ఓకటవ సర్గ ||
||"ప్రమదాననః బభంజ ప్రమదావనం"!||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ ఏకచత్వారింశస్సర్గః
తత్త్వదీపిక
నలుబది ఒకటవ సర్గ
"ప్రమదాననః బభంజ ప్రమదావనం"
ఈ సర్గలో శీర్షిక "ప్రమదాననః బభంజ ప్రమదావనం"అని.
ప్రమదాననః - అంటే ప్రమదను ( సీతను ) రక్షించే వాడు ,
ప్రమదావనం - అంటే ఆ (రాక్షసరాజు యొక్క) ప్రమదావనమును,
బభంజ అంటే నాశనము చేశాడుట.
అదీ ఈ సర్గ ప్రాధాన్యత.
అంటే ఇక్కడ కథ ఒక మళుపు మళ్ళుతోంది అన్నమాట.
ఇప్పుడు ఒక్కమాటు ఇప్పటిదాకా జరిగినది అవలోకనం చేద్దాము.
నలుబదియవ సర్గలో,
'దిశం హ్యుదీశం మనసా జగామ',
అంటే ( హనుమంతుడు) మనస్సులో ఉత్తరదిశకువెళ్ళిపోయాడు అని
సీతా అన్వేషణ పూర్తిచేసికొని వెనక్కి వెళ్ళుతున్నట్లు వింటాము.
మొదటి సర్గలో 'తతోరావణ నీతాయాః సీతాయాః శతృకర్శనః' అని చదివినప్పుడు,
'రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః' అంటే,
రావణుడు అంటే ఎవరో కాదోయ్ ,
మన చేత అసత్ ప్రలాపములు పలికించి చేయించే మనస్సేనోయ్ అని,
సీతాయాః పదం అన్వేష్టుం అంటే
నాగటి చాలులో దొరికినదాని అన్వేషణలో వెళ్ళడానికి అని,
అంటే కర్మక్షేత్రములో బుద్ధిచే తవ్వగా దొరకబడు
ఆత్మను అన్వేషించడానికి అని విన్నాము.
వెతకడానికి వెళ్ళింది ఎవరు ? శతృకర్శనుడు,
అంటే ఆచార్యుడు ( హనుమ) బయలుదేరాడు అని విన్నాము.
అంటే ఆ ఆచార్యుడు జీవాత్మ పరమాత్మ కలయిక కోసము
ఆత్మాన్వేషణలో బయలుదేరాడన్నమాట.
ముముక్షువు అంటే మోక్షముపై కోరిక గల జీవుడు.
అలాంటి ముముక్షువు మోక్షమార్గములో పోవడానికి ఆచార్య సన్నిధిలో చేరాలి.
ఆచార్య సన్నిధిలో చేరిన ముముక్షువును
ఆచార్యుడు వెంటనే శిష్యుడుగా స్వీకరించడు.
ముముక్షువు ఆచార్యుని సన్నిధిలో ఇతర వ్యామోహములను వదిలి,
భగవంతుడే రక్ష అని భగవంతునిపై వ్యామోహము కలవాడై ఉన్నప్పుడు,
ఆచార్యుడు ముముక్షువుని శిష్యుడుగా స్వీకరించును.
స్వీకరించి మంత్రము ఉపదేశించును,
భగవత్ప్రాప్తికై మార్గము చూపించును.
భగవదనుగ్రహము లేకుండా భగవత్ప్రాపి జరగదు.
అందుకని భగవదనుగ్రహము పొందిన ఆచార్యుడే భగవత్ప్రాప్తికి మార్గము చూపించును.
దీనిలో ఆచార్యుడు చేయు కార్యము ఇంకా కొంచెము వివరముగా చూద్దాము.
ఇక్కడ ఆచార్యుడు భగదనుగ్రహము పొంది,
వాని ఆజ్ఞచే సంసారమున ప్రవేశించి,
భగవత్ప్రాప్తికై తపించుచూ, బంధములో నున్న జీవుని అన్వేషించి ,
ఆ జీవుని పరీక్షించి,
భగవత్కథా ప్రసంగములచే ఆనందమును కలిగించి,
భగవంతునిపై కోరిక కలిగించి,
తన స్వరూపమును జీవునకు దర్శింపచేసి,
భగత్ప్రాపికై మంత్రమును ఒసంగి,
ధైర్యమును కలిగించి,
భగవత్ప్రాప్తికి అడ్దంకులను తొలగించి,
మరల భగవానునికి జీవుని భగవ్త్ప్రాప్తికై గల వ్యామోహమును విన్నవించి,
జీవుని రక్షింపచేయును .
ఇదే ఆచార్యుడు చేయు కార్యక్రమము.
ఈ విధానము మనసులో ఉంచుకొని
మొదటి సర్గలో మొదటి శ్లోకములో చదివిన ఆచార్యుని అన్వేషణ
ఎలా జరిగిందో చూద్దాము.
ఇక్కడ హనుమంతుడు ఆచార్య స్వరూపములో ఉన్నాడు.
హనుమంతుడు భగవదనుగ్రహముతో అంటే
రామానుగ్రహముతో ఆనవాలుగా అంగుళీయకము తీసుకొని,
రాముని ఆజ్ఞతో, అంటే భగవంతుని ఆజ్ఞతో సీతాన్వేషణకి బయలుదేరుతాడు.
అశోకవనములో రాముని వియోగముతో శోకములో వున్న సీతను చూస్తాడు.
సీతను శింశుపా వృక్షముపై వుండి పరిశీలిస్తాడు.
సీతలో అనన్యసాధ్యత్వము అంటే రాముడే తన రక్షకుడు అనే నమ్మకము,
నిరాహారముతో దైన్యముతో రామును కోసము తపించడము,
రాముని పొందనిచో ప్రాణత్యాగమునకు సిద్ధపడడము,
రాముని పై ఆదరాభిమానముల తో
తనలోనే ఎదో తప్పులున్నాయి అని అనుకోడము చూస్తాడు.
ఇది అంతా హనుమ ఆచార్యుడు శిష్యుని పరీక్షించినట్లు, సీతమ్మని చూస్తాడు.
గురువు శిష్యునిలో భగవత్కథా ప్రసంగములతో ఆనందము కలిగించినట్లు
హనుమ రామకథా గానముతో సీతలో ఆనందము కలిగిస్తాడు.
రాముని దివ్యమంగళ స్వరూపమును ఆత్మ గుణములను వర్ణించి,
గురువు శిష్యునిలో విశ్వాసము కలిగించినట్లు,
సీతలో హనుమ నమ్మకము కలిగిస్తాడు.
అలా నమ్మకము కలిగించిన శిష్యునకు
జ్ఞానోపదేశానికి గురువు మంత్రము చెప్పినట్లు
సీతకు నమ్మకము కలిగించి
కరవిభూషణమైన రామనామాంకిత అంగుళీయకము సమర్పిస్తాడు.
ఆ అంగుళీయకమే మంత్రము.
ఆ అంగుళీయకమును కరవిభూషణము అంటాడు కవి
కరము పనిచేయుటకు సాయపడునది.
భగవంతుడి కర విభూషణములో కరము అంటే వినపడే ధ్వని జగద్రక్షణ.
భగవంతుడే రక్షకుడు అనే ఆర్తి,
ఆ భగవంతునిపై భారమునుంచుట ,
ఆ మంత్రముద్వారా లభించును.
ఆ మంత్రము మననము చేయుచున్నచో
మానసికముగా భగవంతుడే కనపడినట్లే అగును.
అంగుళీయకము తీసుకున్న సీతకి
రాముడే ప్రత్యక్షముగా వున్నాడా అని అనిపించిందిట.
అంగుళీయకముతో విశ్వాసమేర్పడిన సీత,
హనుమ అడుగగా తన చూడామణి
అంటే కేశభూషణమును రామునకు గుర్తుగా ఇస్తుంది.
దీని అర్థము అప్పలా చార్యులు గారు ఇలా చెపుతారు.
భగవంతుడే రక్షకుడు అనే నమ్మకము కలిగించు మంత్రము
అచార్యుడి ద్వారా ముముక్షువు కు లభిస్తుంది.
ఆ మంత్రము లభించిన ముముక్షువుకు మంత్రమననము ద్వారా,
విషయవస్తువులపై వ్యామోహము పోయి ,
భగవంతునిపై వ్యామోహము కలగాలి.
అదే గురువుద్వారా భగవంతునికి తెలియజేయవలసినది.
ఆ భగవంతునిపై వ్యామోహము తెలియజేయడానికే
తన చూడామణి అంటే కేశభూషణము ఇస్తుంది సీత.
స్త్రీ యొక్క కేశపాశములే పురుషునకు వ్యామోహము కలిగించును.
ఇతర విషయములపై వ్యామోహము లేదని
సూచించడానికే కేశములు తీసివేయుట ఆచారమైనది.
భగవత్ సన్నిధిని కేశములు సమర్పించుట
ఇతర విషయములపై వ్యామోహము విడుచుటయే.
విషయములపై వ్యామోహము ఆత్మను బంధనములలో ఉంచును.
భగవంతునిపై వ్యామోహము ఆత్మకే అందము.
కేశభూషణము ద్వారా సీతమ్మ పంపిన సందేశము
తనకు గల భగవంతునిపై వ్యామోహమే.
సీతమ్మ కాకాసుర వృత్తాంతము కూడా అభిజ్ఞానము గా చెప్పినది.
కాకాసుర వృత్తాంతము ద్వారా తను కూడా శరణాగత ననీ,
శరణాగత రక్షణము కాకాసురును యందు ప్రదర్శించిన స్వామి ,
తనను ఉపేక్షించ తగదు అని నివేదించెను.
రాముడు మనశ్శిలతో బొట్టు సరిదిద్దిన వృత్తాంతము చెప్పి,
భగవత్ అనురాగము భక్తి భగవత్ దత్తమే కాని
తన యత్నముచే లభించినది కాదు
అని సూచించినట్లు ధ్వనిస్తుంది.
ఈ విషయాలన్నిటితో కలిపి,
మోక్షము కోరు జీవుడు అంటే ముముక్షువు
ప్రవర్తింపవలసిన విధానము సూచింపబడినది
ఇందులో గురువు శిష్యుని పరీక్షించు విధానముకూడా సూచింపబడినది.
అలాగే గురువు పై నమ్మకము కుదిరే వఱకు శిష్యుడుకూడా గురువును వరింపడు.
గురువు యొక్క జ్ఞానవైభవమును వారి ఆచరణచే తాను గుర్తించి ,
అప్పుడు గురువు గా వరించును , వరింపవలెను కూడా.
ఇక్కడ సీత కూడా ముందు సీత రావణుడా అని అనుమానించెను.
హనుమ దివ్యమంగళ విగ్రహమును గుణములను కీర్తించి
సీతమ్మ కు నమ్మకము కలిగించును.
ఆ పైన రామనామాంకిత అంగుళీయకముతో
తన స్వస్వరూపము దర్శింపజేయును.
ఇట్లు ఆచార్యస్వరూపము నెఱింగి శిష్యుడు వరింపవలెను అని
సీత ఆచరణ మనకు సూచిస్తుంది.
ఆచార్యుడికి ఎంత జ్ఞానమున్ననూ అహంకారము ఉండరాదు.
అహంకారమున్నచో ఎంత జ్ఞానమున్ననూ ఆ జ్ఞానము,
విషము కలిసిన ద్రాక్షరసము వలె అనుపయుక్తము అగును.
అందుచే ఆచార్యుడు అహంకార రహితుడై వుండవలెను.
హనుమ తన అహంకార రహిత్వము రెండు చోట్ల చూపిస్తాడు.
మొదట సీతను రామునితో ఐక్యము చేయుటకు
ఆ క్షణమే తనే సీతను తీసుకొని వెళ్ళగలనని ప్రతిపాదించినప్పుడు,
సీత నవ్వి ఆ ప్రతిపాదనను తిరస్కరించి,
ఈ ప్రతిపాదన నీ కపిత్వము సూచిస్తోంది అని అన్నప్పుడు.
సీత అలా అన్నప్పుడు హనుమ కించపడలేదు.
తనపై నమ్మకము లేదని గ్రహించిన హనుమ
తన స్వస్వరూపమును సీతకి చూపిస్తాడు.
నమ్మకము కలిగిస్తాడు.
ఆ తరువాత రెండోసారి సీత
తన సహచరుల సామర్థ్యము అనుమానిస్తూ అడిగిన ప్రశ్నకి,
"మా వానరసైన్యములో అందరూ నా కన్న గొప్పవారే కాని,
నా కన్నతక్కువవారు లేరు" అని అంటాడు.
ఇది కూడా హనుమయొక్క నిరహంకారము సూచిస్తుంది.
ఇలాగ సీతా హనుమంతుల సంభాషణ లో
శిష్యాచార్య సంబంధము ఎలా వుండాలో స్పష్టముగా కనిపిస్తుంది మనకి.
రామదూతగా హనుమ చేసిన మహాద్భుతమైన వృత్తాంతము సుందరకాండలో వింటాము.
హనుమ సీతారాముల భక్తుడుగా మనకి దర్శనమిస్తాడు.
అలాగే సీతా దేవి భగవంతునికి దూరమై , బంధములలో ఇరుక్కుని,
భగవత్ప్రాపికై తపించు ముముక్షువగు జీవుడు ఎలా ప్రవర్తించాలో మనకి చూపిస్తుంది.
పతివ్రతయైన స్త్రీ భర్తకు దూరముగా వున్నప్పుడు ఎలా ప్రవర్తించవలెనో,
ఆ కాలపు పాతివ్రత్య మహిమ ఎలా వుండేదో
సుందరకాండలో సీత మనకి చూపిస్తుంది .
సుందరకాండలో జీవితముకు ఆవశ్యకమగు విషయములను
ఇలా బాహ్య అంతరార్థములతో మనము చూస్తాము.
ఇది ఇప్పటిదాకా జరిగిన కథ.
ఇంతవఱకు అన్వేషణ దర్శనము అయ్యాయి.
ఇక మిగిలినది విరోధి నిరసనము.
ఇక నలభై ఒకటవ సర్గలో ముందు కథనము చూద్దాము.
సీత అనుమతి తీసుకున్న హనుమ కొంచెము దూరము పోయి
తన కర్తవ్యము ఆలోచించసాగెను.
"సీతమ్మ"ను చూచితిని కార్యము అంతయూ పూర్తి అయినది.
ఇక కొద్ది కార్యక్రమమే మిగిలినది"
"ఇక నేను రాక్షసుల బలము పరిక్షింప వలెను"
" వీరి వద్ద సామ దాన భేద దండములు పనికి రావు".
"దండమునే ఉపయోగింపవలెను"
"రాక్షస బలాబలములను, రావణుని హృదయమును ఎఱుగుటకు పరాక్రమమే మార్గము"
"యుద్ధములో కొందరురాక్షసులను చంపినచో వారు మెత్తపడుదురు"
"చేయవలసిన పనులు చేయుచూ ఎవరు మరికొన్ని పనులను ఎక్కువగా చేయునో ,
అట్టివాడు కార్యమును చేయగల సమర్థుడు"
"మొదటి కార్యము చెడకుండా మరికొన్ని పనులు సాధించుటకార్యసాధకుని లక్షణము"
ఇలా ఆలోచిస్తూ రావణుని హృదయములో ఏమున్నదో కనుగొనుటకు
రావణుని చేరవలయును అని ఆలోచించి,
రావణుని చేరుటకు అశోకవన ధ్వంశమే
ఒక ఉపాయము అని నిశ్చయించుకుంటాడు.
వెంటనే భీమపరాక్రమము గల హనుమ,
పెనుగాలివలె చెట్లను వూపి కూలదోసెను.
అశోకవన ధ్వంస కార్యములో లతాగృహములు చిత్రగృహములు పాడుచేయబడినవి
శిలా గృహములు కూలద్రొయబడినవి.
మహోరగములు క్రూర మృగములు పీడింపబడినవి.
చెట్లు కూలపడగా ఆ చెట్లమీద పక్షుల అరుపులతో అశోకవనము మారుమోగింది.
కవి అంటాడు "ప్రమదాననః బభంజ ప్రమదావనం".
అంటే ప్రమదాననుడు అంటే సీతా రక్షకుడగు హనుమ
రావణ ప్రమదావనమును ధ్వంశము చేసెను అని.
అప్పుడు ఆ ప్రమదావనుడు అంటే సీతా రక్షకుడగు హనుమ
ప్రమదావన తోరణమును ఎక్కి,
ప్రమదావన రక్షకులతో యుద్ధానికి సిద్ధముగా కూర్చుంటాడు.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలుబది ఒకటవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||