||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- నలుబదిమూడవ సర్గ ||

||"న యూయం న చ రావణః"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రిచత్వారింశస్సర్గః

తత్త్వదీపిక
"న యూయం న చ రావణః"
నలుబది మూడవ సర్గ.

"న యూయం న చ రావణః" అంటే
"మీరు వుండరు. రావణుడు కూడా వుండడు" అని.
ఇది హనుమంతుడు రాక్షస మూకలకి చెప్పిన మాట.

జయ ఘోష చేసిన హనుమంతుడు,
కింకరులను చంపడముతో ఆగడు.
జయ ఘోష చేసి, కింకరులను హతమార్చిన తరువాత
హనుమంతుడు ధ్యానములో పడెను.

'నేను వనమును భగ్నము చేసితిని
చైత్య ప్రాసాదము మాత్రము భగ్నము కాలేదు.
అందువలన నేను ఈ ప్రాసాదమును ధ్వంసము చేసెదను 'అని.
కపిశ్రేష్ఠుడు మారుతాత్మజుడగు హనుమంతుడు మనస్సులో ఇలా అలోచించి,
బలమును ప్రదర్శిస్తూ మేరుశిఖరములవలె ఎత్తుగానున్న చైత్యప్రాసాదము పైకి ఎగిరి ఎక్కెను.

ఆ మారుతాత్మజుడు తన ప్రభావముతో మహాకాయము గలవాడై
తన ధ్వని లంక అంతా మారుమోగునట్లు జబ్బలు చరిచెను.
ఆ మహత్తరమైన ధ్వనితో ఆకాశములో ఉన్న విహంగములు ,
చైత్యప్రాసాదములో ఉన్న రక్షకులు మూర్ఛితులౌతారు.
తన జయఘోష మళ్ళీ చేస్తాడు.
జయఘోష శత్రువులందరికి భయము కలిగించడానికే.

'అస్త్రవిద్యలో విదుడైన రామునికి జయము.
మహబలుడైన లక్ష్మణునికి కూడా జయము.
రాఘవునిచే పాలింపబడు సుగ్రీవునకు జయము.
శత్రుసైన్యములను హతమార్చు హనుమంతుడను నేను,
క్లిష్టకార్యములను సాధించగల కోసలేంద్రుడైన రామునికి దాసుడను.
వేలకొలది శిలలు వృక్షములు ఆయుధములగా గల నాకు,
యుద్ధములో వేయిమంది రావణులు కూడా సమానులు కారు.
రాక్షసులు అందరూ చూస్తూ ఉండగా లంకాపురిని ధ్వంసము చేసి,
మైథిలి కి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'.

హరియూధపుడు ఈ విధముగా చైత్యప్రాసాద విమానములో వుండి,
భయంకరమైన నినాదము చేసి రాక్షసులలో భయము రేకిత్తెంచెను.

హనుమంతుని ఘోషతో వందమంది చైత్య పాలులు
మహాకాయులు వివిధరకములైన ఆయుధములను
ప్రాసములను ఖడ్గములను తీసుకొని
విజృంభించి మారుతిని చుట్టు ముట్టుతారు.

వారు చిత్రవిచిత్రమైన గదలతో
బంగారుపిడిగులు కల పరిఘలతోనూ
సూర్యకిరణముల లాంటి బాణములతోనూ
వానరశ్రేష్ఠుని పై దాడిచేస్తారు.

అప్పుడు ఆ మహాబలవంతుడైన పవనాత్మజుడు
ఆ ప్రాసాదముయొక్క స్వర్ణాలంకృతమైన మూలస్తంభమును పెకలించి,
వంద అంచులు గల మహాస్తంభమును వేగముగా గిరగిరాతిప్పెను.

అప్పుడు అగ్ని ఉద్భవించెను.
ప్రాసాదము దగ్ధము అయ్యెను.
అప్పుడు మండుచున్న ఆ ప్రాసాదము చూస్తూ
ఇంద్రుడు వజ్రాయుధముతో అసురలను హతమార్చినట్లు,
హనుమంతుడు రాక్షసులను హతమార్చి ,
అంతరిక్షములో నుండి ఈ వచనములను పలికెను.

'మహాత్ముడు బలవంతుడు అయిన సుగ్రీవుని వశములో వున్న
నాలాంటి వానరేంద్రులు వేలకొలదీ సీతాన్వేషణకై పంపబడిరి.
మేము అనేకమంది భూమండలము అంతా సంచరిస్తున్నాము'.

కొందరు పది ఏనుగుల బలము కలవారు.
కొందరు దానికి పదిరెట్ల బలము కలవారున్నారు.
కొందరు వేయి ఏనుగుల బలము కలవారున్నారు.
కొందరు వరద ప్రావాహపు బలము కలవారు.
కొందరు వాయుబలము కలవారు.
మరి ఇంకొందరు అప్రమేయమైన బలము కలవారు'.

'ఇలాంటి అనేకమంది యోధులతో,
దంతములు నఖములు ఆయుధములు గా గల
వందవేలకోట్ల వానరులతో కలిసి,
అందరినీ అంతమొనర్చగల సుగ్రీవుడు ఇక్కడికి వచ్చును".

'ఇక్ష్వాకు నాధునితో బద్ద వైరము చేసికొనినందువలన,
మీరు ఉండరు.
రావణుడూ ఉండడు.
ఈ లంకాపురి కూడా వుండదు'.

ఈ జయగర్జనలతో శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై మూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||