||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- నలుబది తొమ్మిదవ సర్గ||
||"విస్మయం పరమం గత్వా !"!||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ ఏకోనపంచాశస్సర్గః||
తత్త్వదీపిక
విస్మయం పరమం గత్వా !
నలుబది తొమ్మిదవ సర్గ
"విస్మయం పరమం గత్వా".. అంటే ఎంతో ఆశ్చర్యపడి .. అని
రాజ సభలోకి తీసుకు రాబడిన హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడన్నమాట.
ఎప్పుడన్నా అనుకొనబడినది చూస్తే ఆశ్చర్యపోతాము.
రాజసభలోకి తీసుకురాబడిన హనుమ చూచినది రావణుని.
ఆ రావణుడు ఎలా వున్నాడో ఈ సర్గలో వింటాము.
ఆ రావణుడు మేలిమి బంగారముతో చేయబడి
ముత్యములచే పొదగబడిన కిరీటమును ధరించి యుండెను.
వజ్రములతో మణులతో కూడిన మనసా నిర్మితమైన
చిత్రవిచిత్రమైన ఆభరణములను ధరించి భాసించు చుండెను.
అతి మూల్యమైన పట్టు వస్త్రములను ధరించి ,
ఎఱ్ఱని చందనము రాసుకొని
విచిత్రమైన అనేక రకముల ఆభరణములవంటి బొమ్మలు రాసికొని ఉన్నవాడు.
ఆ రావణుడు దర్శనీయమైన భయము కలిగించు ఎఱ్ఱని కళ్లతో,
వెలుగుతూవున్న వాడి దంతములతో,
వేలాడుతూ వున్న పెదవులతో వున్నవాడు.
రావణుడు పది తలలవాడు.
ఎలాంటి పది తలలు?
కౄరమృగములతో నిండిన మందరపర్వత శిఖరములవలె నున్న పది తలలు.
ఆ పది తలలతో విరాజిల్లు తున్నవాడుట.
మహత్తరమైన ఔజస్సు కలవాడుట.
అలాంటి వీరుని హనుమ చూచెను.
రావణుని వర్ణన ఇంకా సాగుతుంది.
నల్లని కాటుక పర్వతములావున్న అతని వక్షః స్థలముపై వున్న ముత్యాలహారములు
పూర్ణచంద్రుని లాగా ప్రకాసిస్తున్నాయిట.
ఆ రావణుడు ఎగురుతున్న కొంగల నేపథ్యములో వున్న నల్లని మేఘముల వలె నుండెను.
ఉత్తమచందన పూతలతో అలరారుతున్న ఆ రావణుని బాహువులు
కేయూరములతో కట్టబడి ఇదు తలలు గల సర్పముల వలె వున్నాయిట.
ఆ రావణుడు, రత్నములతో పొదగబడిన రత్నకంబళము మీద వున్న,
ఉత్తమమైన ఆసనము మీద కూర్చుని ఉండెను.
అలంకరింపబడిన అత్యంత సుందరీమణులు
వింజామరలు చేతిలో పుచ్చుకొని వీచుచూ అతనిని సేవిస్తున్నారు.
మంత్రాంగములో సిద్ధులైన మంత్రులు తత్వజ్ఞులు
దుర్ధరుడు ప్రహసుడు మహాపార్శ్వుడు నికుంభుడు,
అనబడే నలుగురు బలదర్పిత రాక్షసులు మంత్రులు చేత పరివేష్టింపబడిన రావణుడు,
నాలుగు సముద్రములతో ఆవృతమైవున్న భూమండలము వలె భాసించుచుండెను.
శుభము కోరు బంధువులు మంత్రులు ఇతర రాక్షసులచే పరివేష్టితుడైన రావణుడు
సురలచేత సేవింపబడు సురేశ్వరుని వలె కానరావచ్చెను.
అతి తేజస్సుకల రావణుడు సమున్నత సింహాసనము మీద కూర్చుని
మేరు శిఖరము మీద నున్న జలముతో నిండిన మేఘము వలె కానరావచ్చెనట.
అలా కనిపిస్తున్న రావణుని,
ఒక పక్క రాక్షసులచేత పీడింపబడుతున్నప్పటికీ
హనుమంతుడు అతి విస్మయముతో చూశాడుట.
'విస్మయం పరమం గత్వా ' అంటే,
అలా అతి విస్మయములో పడి
ఆ హనుమంతుడు తేజస్సుతో వెలిగిపోతున్న రాక్షసాధిపతిని చూచి
అతని తేజస్సుతో మోహపడి మనస్సులో అలోచించసాగెను.
' అహా ఈ రాక్షసాధిపతికి ఏమి రూపము ! ఏమి ధైర్యము ! ఏమి సత్త్వము ! ఏమి కాంతి !
ఈ రాక్షసరాజు సర్వ లక్షణములు కలవాడు కదా !
ఇతని అధర్మము బలీయముగా లేకున్నచో
ఈ రాక్షసాధిపతి ఇంద్రుని సురలోకముకూడా పాలించువాడయ్యెడివాడు.
కౄరమైన కర్మలతో లోకనిందితమైన ఇతని కర్మల వలన
అమరులు దానవులు వున్న లోకములన్నీభయపడుతున్నాయి.
ఈ కృద్ధుడు ఒక్కడే లోకములను ప్రళయములో ముంచెత్తగలడు'.
అలాగ రాక్షసరాజు యొక్క అమిత ప్రభావము చూచి
బుద్ధిమంతుడైన హనుమంతుడు అనేక విధములుగా ఆలోచించసాగెను.
ఇది ఈ సర్గలో జరిగిన కథ
ఈ విధముగా హనుమంతుడు చూచినవెంటనే మనస్సు చలించి
లేక ఆశ్చర్యపోయి మెచ్చుకొని ఆ తరువాత వచ్చిన ఆలోచనలతో
తన మార్గము లో సాగిపోవడము చాలాసార్లు చూస్తాము.
సుందరకాండలో మొదటలోనే వింటాము
త్రికూట శిఖరముపై వున్న లంకానగరము అమరావతిలావున్నదని.
అలాగే లంకానగరములో సీతాన్వేషణలో వున్న హనుమ లంకానగరము చూచి
ఇది స్వర్గమా దేవలోకమా అని ఆశ్చర్యపోయాడని.
రావణుని భార్యలను చూస్తూ వారందరిలో అతనిపై ప్రేమలేనివారు ఎవ్వరూ లేరు అని,
బలాత్కారముగా పొందబడినవారు ఎవరూ లేరని వింటాము.
రావణుని అనేక విధములుగా పొగడడము వింటాము.
రావణుని తేజస్సు పరాక్రమము గురించి వింటాము.
పొగిడిన ప్రతిచోటా "అయ్యో ఈ ( సీతాపహరణ) అధర్మానికి వడికట్ట కుండా ఉంటే,
ఆ రావణుడు సురలోకానికి కూడా అధిపతి అయివుండేవాడు" అని కూడా వింటాము.
అంటే వాల్మీకి మనకి చెపుతున్నది
ఎన్ని సుకృతాలు చేసినా
ఒక అధర్మము చేస్తే
దాని ఫలితము అనుభవించవలసినదే,
అని మారు మారు చెపుతున్నాడన్నమాట.
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైతొమ్మిదవ సర్గ సమాప్తము.
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||