||సుందరకాండ ||

||తత్త్వదీపిక - ఆరవ సర్గ్గ ||

||తత్త్వ దీపిక: హనుమంతుని ఐశ్వర్యము ||


||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ షష్టస్సర్గః

తత్త్వదీపిక
లక్ష్మీవాన్ - హనుమంతుడు

ఆరవ సర్గలో కథ ఇలా చెప్పవచ్చు.

సీత కనపడక పోవడముతో అతి దుఃఖముకలవాడై
హనుమంతుడు మళ్ళీ సీతాన్వేషి అయి మహావేగముతో లంకానగరములో తిరుగుతూ -
"అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్"
రాక్షసేంద్రుని నివాసము చేరెను.

ఆ భవనము "రక్షితం రాక్షసైర్ ఘోరైః".
అంటే ఘోరమైన రాక్షసులచేత,
మహత్తరమైన వనమును సింహములు రక్షించినట్లు రక్షింపబడుతున్నదట.
ఆ భవనము "ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః" ముఖ్యులు వరస్త్రీలతో నిండియున్నదట.

ఐశ్వర్యములతో విరాజిల్లుచున్న ఆ భవనము,
"లంకాభరణం ఇతి" లంకకే ఆభరణము అని మహాకపి అనుకున్నాడు.

"గృహాత్ గృహం రాక్షసానాం"
అంటే రాక్షసుల ఒక గృహమునుంచి ఇంకో గృహమునకు
సీతాన్వేషణకోసమై - "చచార" - హనుమంతుడు తిరిగెను.

అలా తిరుగుతూ "తేషాం ఋద్ధిమతాం ఋద్ధిం"
ఆ ఐశ్వర్యవంతుల ఐశ్వర్యాన్నిహనుమంతుడు చూచాడుట.
చివరికి హనుమంతుడు విభీషణుడు, కుంభకర్ణుడు అలాగే అందరి భవనములు దాటి
-"అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్-
రాక్షసేంద్రుని నివాసము చేరెను.

ఆ రావణుని భవనము అనేక రకములైన వజ్రములు రత్నములతో నిండియున్ననూ
సూర్యకిరణముల తేజస్సులాగావున్న రావణుని తేజస్సుతో విరాజిల్లెను.
అప్పుడు బంగారపు నూపురముల నాదనినాదములతో నిండిన,
మృదంగముల ధ్వనులతో నిండిన ప్రాసాదముల సముదాయములో
కుబేరభవనములాంటి రావణుని మహాగృహమును హనుమంతుడు ప్రవేశించెను.

ఈ విధముగా వాల్మీకి ఆఱవ సర్గ లో
రావణుని భవనముల అలంకారములు
రావణుని ఐశ్వర్యము విశదీకరించి వర్ణించెను.

అంత రావణుని ఐశ్వర్యము వర్ణిస్తూ వాల్మీకి-
"అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్"-
అంటూ హనుంతునికి - లక్ష్మీవాన్ -
అంటే "లక్ష్మీవంతుడు" అన్న మాట ఉపయోగిస్తాడు సర్గ మొదటిలోనే.

లంకలో ప్రవేశించినపుడు హనుమంతుడు " వృషదంశకమాత్రః".
అంటే పిల్లి అంత పరిమాణము కలవాడు అని.
ఆ పరిమాణములో వున్న హనుమంతుడు లంకలో ప్రవేశించెను.

అప్పుడు"దివి దేవపురీమ్ యథా",
అంటే అమరావతిలా వెలుగుచున్న ఆ లంకానగరములో
"ఋద్ధిమతాం తేషాం ఋద్ధిం" ఐశ్వర్యవంతులగు వారి ఐశ్వర్యము చూస్తూ వెళ్ళుతున్న,
"వృషదంశక" మాతృడైన హనుమంతుని
"లక్ష్మీవంతుడు" అని ఎందుకు అన్నాడు అన్న ప్రశ్న వస్తుంది.

ఇంకా పైగా హనుమంతుని ఐశ్వర్యము ఏమిటి? అని మనకు తోచవచ్చు.

హనుమంతునిలో ఐశ్వర్యము
అతని సాధనలలో మనకి విదితమౌతుంది.
అవి ఏవిటీ?

ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము కలవాడై
సముద్రలంఘనములో అన్ని అడ్డంకులను సునాయాసముగా దాటి లంకను చేరుట.
అది ఒక ఐశ్వర్యము

త్రికూట పర్వతముపైన వుండి హనుమంతుడు
విశ్వకర్మచే బాహ్యముగా "మనసేవ కృతాం " మనస్సులోనే నిర్మింపబడిన లంకను,
దేహము కన్న వేరైన ఆత్మ దేహమును చూడగలిగినట్లు చూడగలగడము
అది ఇంకో ఐశ్వర్యము.

ఆత్మాన్వేషణలో అహంకారమును చంపవలసినట్లు,
లంకను చేరి అహంకార రూపి అయిన లంకిణిని చంపడము.
అది ఇంకో ఐశ్వర్యము

అన్వేషణలో అనేక అపరూపమైన వస్తువులు కనబడుచున్నా,
తన మార్గము విడవకుండా అన్వేషించుచూ రావణ భవనము చేరుట.
అది కూడా ఇంకో ఐశ్వర్యము.

అత్మకంటే దేహము వేరు అను ఎరుగుట
అది ఒక ఐశ్వర్యము.

అట్టి ఆత్మను అన్వేషించుటకు శరీరములోనికి చూడ యత్నించుడము
అది కూడా ఐశ్వర్యము.

- మనస్సు దేహమునందు అదే ఆత్మ అని భ్రాంతి కలిగించుట యే దేహాత్మాభిమానమును.
దానిని ఎదిరింపగలిగిన శక్తి ఉండడమే లంకిణి సంహారము.
అది ఒక ఐశ్వర్యము.

- మనస్సును చూచి దానిని ఎరుంగుట.

అలాగ ఆత్మాన్వేషణలో అయా స్థితులను పొందిన వాడు ఐశ్వర్యవంతుడు అని అనబడును.

ఇవన్నీ హనుమంతుని సాధనలు.
ఇవన్నీ హనుమంతుని ఐశ్వర్యములు.

బాహ్యమైన రావణుని ఐశ్వర్యమును చూపిస్తూ హనుమంతుని లక్ష్మీవాన్ అని,
శ్రీమాన్ అని అనడంలో ఉద్దేశ్యము
బాహ్యమైన ఐశ్వర్యము ఐశ్వర్యము కాదని,
అంతర్గతముగా వున్న ఐశ్వర్యమే ఐశ్వర్యము అని చెప్పడానికే.

ఇక్కడ హనుమంతుని " లక్ష్మీవంతుడు" అని అనడములో వున్న ఉద్దేశము అదే.

అంతేకాదు హనుమంతునిలాగ మనము ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము కలవారమైతే,
అహంకారమును చంపగలిగినవారమైతే,
ఆత్మ దేహము వేరు అనే భావము కలవారమైతే
మనకి కూడా ఆ ఐశ్వర్యములు ఉన్నట్లే |

అదే కవి వాల్మీకి భావము.
అదే అప్పలాచార్యులవారు చెప్పిన భావము.

||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||