||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- అరవదియవ సర్గ||
||"తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం"||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ షష్టితమస్సర్గః||
తత్త్వదీపిక
అరవదియవ సర్గ.
"తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం".
"తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం" అంటే
"మీరు కార్యసిద్ధి అలా అయ్యేటట్లు చూడుడు" అని.
కార్యసిద్ధి అయ్యేలా అంటే ఎలాగ?
"యథాతు రామస్య మతిః"
విశిష్టమైన రాముని మనస్సులో ఎలాగ వుందో అలా అయ్యేటట్లు చూడాలి అని.
ఇవి జాంబవంతుని మాటలు.
హనుమంతుడు సీతమ్మ చెప్పిన మాట మరచిపోయి,
మనందరము రావణుని వధించగలశక్తి వున్నవాళ్ళమే,
ఆ పని చేసి సీతమ్మని తీసుకుని రాముని దగ్గరకు వెళ్ళితే మంచిది అని చెప్పి,
మళ్ళీ చివరికి మీరు ఆలోచించండి అని వదిలేస్తాడు.
అంగదుడు ఆ మాట పట్టుకొని,
హనుమంతుడు చెప్పినట్లు
మనము సీతమ్మని తీసుకొని మరీ వెళ్ళుదాము అని అంటాడు.
అంగదుడు రాజకుమారుడు.
అతని మాట తీయడము కష్టము.
వివేచనాశక్తి కల హరిసత్తముడు జాంబవంతుడు.
జాంబవంతుడికి ఎలా కథ జరిపించాలో తెలుసు.
అందుకని రాజకుమారుడికి నీవు చెప్పింది సబబే అని సమర్థిస్తూ,
జాంబవంతుడు అందరికీ అసలు మాట గుర్తు తీసుకువస్తాడు.
ఇదంతా రాముని ప్రేరణ వలన జరుగుతోంది.
ఇప్పుడు కూడా ఆయన మనస్సులో ఏముందో తెలిసికొని,
అప్పుడే భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమము చేయతగును అని.
ఇదే ఈ సర్గలో మనము వాల్మీకి ద్వారా వినే కథ.
ఇక అది విందాము.
హనుమంతునియొక్క
"మనము మిగిలిన కార్యక్రమము గురించి చూడవలెను'
అన్న ఆ వచనములను విని వాలిపుత్రుడు అంగదుడు ఇట్లు పలికెను.
'ఓ వానరులారా మనచేత చూడబడినా కాని,
ఆ సీతాదేవి లేకుండా
మహత్ముడైన రాఘవుని సమీపమునకు పోవుట యుక్తముకాదు'.
'ప్రఖ్యాతి చెందిన మీ అందరిచేత,
"దేవిని చూచితిమి కాని తీసుకురాలేదు"
అని చెప్పుట అయుక్తము అని తోచుచున్నది'.
'ఓ హరిసత్తములారా ! అమరులైన సురలు, దైత్యులలో ఎవరునూ
ఎగురకల వానరులకు సమానులు కారు.
పరాక్రమము లో కూడా సమానులు కారు'.
'రాక్షస సమూహములతో కలిపి లంకను జయించి ,
యుద్ధములో రావణుని హతమార్చి ,
సీతను తీసుకొని కార్యము సిద్ధించుకొని ఆనందోత్సాహములతో వెళ్ళుదాము.
ఆ రాక్షసులలో హనుమంతుడే చాలామందిని హతమార్చెను.
ఇక మిగిలిన కర్తవ్యము జానకిని తీసుకు వచ్చుటయే' అని.
'రామలక్ష్మణుల మధ్య సీతమ్మను చేర్చుదాము.
ఇన్నిమాటలు ఎందుకు?
మిగిలిన వానరుల అవసరములేదు.
మనమే వెళ్ళి ఆ రాక్షసపుంగవులను హతమార్చి,
లక్ష్మణ సుగ్రీవులతో కూడి ఆ రాఘవుని దర్శించుదాము'.
వాలి కుమారుడైన అంగదుని సంకల్పము తో కూడిన ఈ మాటలు విని,
వివేచనాశక్తి కల హరిసత్తముడు జాంబవంతుడు సంతోషపడినవాడై
అంగదునితో ఈ అర్థవంతమైన మాటలు చెప్పెను.
"ఓ మహా కపి సత్తమా ! నీవు చెప్పుచున్న అట్టి ఆలోచన సముచితము కాదు.
మనము దక్షిణ దిశలో అన్వేషణకు పంపబడిన వారము.
ఆమెను తీసుకు రమ్మని ధీమంతుడైన రాముడు గాని కపిరాజు కాని చెప్పలేదు.
మనము జయించి సీతను తీసుకు పోవుట వారికి నచ్చక పోవచ్చు.
రాజ సింహుడైన రాఘవుడు స్వయముగా
సీతతో విజయము సాధించెదనని ప్రతిజ్ఞ చేసినవాడు.
ఆ మాటకి విరుద్ధముగా వానర ముఖ్యులు ఎలా చేయగలరు?
అలా చేసిన కర్మ విఫలమగును ,
దానితో సంతోషము కూడా వుండదు.
చూపించిన ధైర్య సాహసములు వృథా అగును.'
'అందుకని మనము అందరము
రామలక్ష్మణులు ఎక్కడ వున్నారో అక్కడికి వెళ్ళి,
మహాతేజోవంతులైన రామలక్ష్మణు లకు సుగ్రీవునకు
చేసిన కార్యము నివేదించెదము.'
'ఓ రాజపుత్రా ! నీ సూచన సముచితమైనప్పటికీ
నా బుద్ధి అంగీకరించుట లేదు.
రాముని మనస్సు ఎలావున్నదో తెలిసికొని
ఆ విధముగా కార్యసిద్ధి కలిగించుటకు విధానము చూడతగినది' అని.
ఆ జాంబవంతుని వచనములతో వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువదియవ సర్గ సమాప్తము
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||