||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- అరువది మూడవసర్గ.||
||"దృష్టా దేవీ న సందేహో"||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ త్రిషష్టితమస్సర్గః||
తత్త్వదీపిక
"దృష్టా దేవీ న సందేహో"
అరువది మూడవసర్గ.
"దృష్టా దేవీ న సందేహో" అంటే
"దేవిని తప్పక చూశారు , సందేహము లేదు" అని.
అది సుగ్రీవుని మాట.
అంటే హనుమ అంగదాదులు వచ్చి "సీతమ్మ కుశలము "అని చెప్పక ముందే
సుగ్రీవునికి తెలిసిపోయిందన్న మాట.
వెదకడానికి వెళ్ళిన వానరులు విజయవంతులుగా వచ్చుచున్నారు అని.
అయితే సుగ్రీవుడు ఇంకో మాట కూడా అంటాడు.
" నచాన్యేన హనూమతా"
"ఇంకెవరి చేతో కాదు. హనుమద్వారానే" అని
సీత కనపడింది. అది ఇంకెవరిద్వారోనో కాదు. హనుమంతుని ద్వారానే అని.
అది సుగ్రీవుడి కి ఎలా తెలిసిందో ఈ సర్గలో వింటాము.
మధువన ధ్వంశము ఆపలేక ,
మదాంధులైన వానరులచే కొట్టబడిన దధిముఖుడు,
ఎలాగో బయటపడి అనుచరులతో సహా సుగ్రీవుని దగ్గరకు చేరుతాడు.
దధిముఖుడు రామలక్ష్మణులు సుగ్రీవుడు ఉన్న చోటికి చేరి ,
సుగ్రీవుని పాదములపై తన శిరస్సు వుంచుతాడు
అప్పుడు ఆ వానరేంద్రుడు తన కాళ్ళమీద శిరస్సు పెట్టిన
ఆ వానరుని చూచి ఆదుర్దాగావున్న హృదయముతో ఇలా అంటాడు.
"ఓ వీరుడా లెమ్ము లెమ్ము.
ఎందుకు నా కాళ్లమీద నీవు పడ్డావు.
నీకు అభయము ఇచ్చు చున్నాను.
అన్ని విషయములు చెప్పుము." అని.
వివేకముగల దధిముఖుడు
సుగ్రీవునిచేత ఆవిధముగా అభయము ఇవ్వబడి
లేచి నిలబడి ఈ వాక్యములు చెప్పెను.
" ఓ రాజా ! ఋక్షరజసుని చేత గాని, అందుకు ముందుగాని,
వాలిచేతగాని నీ చేత గానీ అనుమతి ఇవ్వబడని
ఆ మధు వనము వానరులచేత తినబడినది".
"ఈ వనరక్షకులచేత నివారింపబడినప్పటికీ వినకుండా
ఆ వానరులు మధుభక్షణము చేసి మధుపానము కూడా చేసిరి.
వారు తాగిన పిమ్మట మిగిలినది పారవేస్తున్నారు.
ఇతరులు ఇంకా తినుచున్నారు.
వారు ఆపబడినప్పుడు కనుబొమలు ఎత్తి కోపముగా చూచుచున్నారు."
"అప్పుడు ఆ వనమునుండి నివారింపబడిన ఆవానరపుంగవులు
కోపించినవారై ఈ రక్షకులను ఎదుర్కొనిరి.
ఓ వానరేంద్ర ! అప్పుడు క్రోధముతో రక్తము నిండిన కళ్ళతో వున్న
అనేకమంది వానర వీరులు చేత
ఈ వన రక్షకులు తరిమికొట్టబడిరి".
"కొందరు చేతితో కొట్టబడిరి.
కొందరు మోకాళ్లతో తన్నబడిరి.
ఇష్టమువచ్చినట్లు కొట్టబడి వారు ఆకాశమార్గములోకి విసరబడిరి.
నీవు రాజుగా వున్నప్పుడే ఈ శూరులు ఈ విధముగా కొట్టబడిరి.
వానరులు నీ మధువనమును ధ్వంసముచేసి
ఇష్టము వచ్చినట్లు భక్షించుచున్నారు".
దధిముఖుడి ధ్యాస అంతా మధువనధ్వంశము,
మధు వన రక్షకుల మీద జరిగిన అపచారము మీదనే.
కాని వినిన సుగ్రీవుని ఆలోచనలు మధువనములో జరిగినదానికన్నా
మధువన ధ్వంసమునకు కారకులమీద పోతుంది.
జరిగినది హనుమ అంగదాదుల అధ్వర్యములో.
ఈ విధముగా విన్నవించబడుచున్న ఆ వానరాధిపుని,
మహాప్రాజ్ఞుడు శత్రువీర సంహారకుడూ అయిన లక్ష్మణుడు ఇలా అడిగెను.
" ఓ రాజా వనపాలకుడు అయిన వానరుడు ఎందుకు ఇక్కడికి వచ్చెను?
ఎందుకు దుఃఖములో ఉన్నాడు?
దేనిని గురించి చెప్పుచున్నాడు?
మహత్ముడైన లక్ష్మణునిచేత ఈ విధముగా అడగబడి
వాక్య విశారదుడైన సుగ్రీవుడు ఇట్టి వాక్యములను పలికెను.
" ఓ ఆర్యా! లక్ష్మణా! వానరవీరుడు దధిముఖుడు
దక్షిణదిశనుంచి వచ్చిన అంగదాదిప్రముఖులైన వానరుల చేత
మధువనములో మధువు భక్షించబడినది అని చెప్పుచున్నాడు".
"ఆ వచ్చిన వానరులచేత ఏవిధముగా ఆ వనమును ధ్వంసము చేయబడినదో విని
అది కృతకృత్యులుకాని వారు ఇటువంటి పని చేయరు అనిపించుచున్నది.
ఆ వానరులు ఏ విధముగా వనమును చేరుకొనినారో
దాని బట్టి ఆ వానరులు పని సాధించినవారే".
సుగ్రీవుని ఆలోచనలు వెంటవెంటనే
అసలు సంగతి దగ్గరకు వస్తాయి.
హనుమ అంగదాది వానరుల అధ్వర్యములో
జరగవలసినది కూడా జరిగినది అని.
వెంటనే సుగ్రీవుడు అంటాడు.
"దృష్టా దేవీ న సందేహో"
"వారు దేవిని తప్పక చూచిరి".
"సందేహములేదు" అని.
ఇంకెవరిచేతనో కాదు హనుమంతునిచేతనే.
ఈ కార్య సిద్ధికి హనుమంతుడిలోనే
తగిన కార్య దక్షత బుద్ధి పరాక్రమము శాస్త్రజ్ఞానము అన్నీ ప్రతిష్టించబడినాయి".
ఈ ఆలోచనలతో సంతోష భరితుడైన సుగ్రీవుడు,
లక్ష్మణునికి చెపుతాడు.
" ఓ మహాబాహో సీత నిజముగా చూడబడినది. చూడుము.
ఆ వానరులందరూ వచ్చి మధువు సేవించుచున్నారు.
ఓ పురుషులలో వృషభము వంటి వాడా !
విశ్రుతులైన వానరులు వైదేహిని చూడకుండా
వరముగా వచ్చిన దివ్యమైన వనమును ధ్వంశము చేయలేరు".
అప్పుడు రాఘవుడు, రాఘవునితో కూడిన ధర్మాత్ముడు అగు లక్ష్మణుడు
సంతోషభరితుడైన సుగ్రీవుని నోటినుంచి వచ్చిన వాక్యములను విని ఆనందభరితులైరి.
రాముడు లక్ష్మణుడు కూడా అధికముగా ప్రసన్నులైరి.
సుగ్రీవుడు దధిముఖుని ఈ వచనములను విని
సంతోషముతో మళ్ళీ వనపాలునితో ఈ వాక్యములతో సమాధానమిచ్చెను.
"కార్యసిద్ధి సాధించినవారిచేత భుజింపబడిన
ఆ వనము గురించి (విని) నాకు సంతోషము గా వున్నది.
కృత కృత్యులైనవారిచేత చేయబడిన చేయకూడని కార్యము క్షమించబడినది.
కృతార్థులైన సింహపరాక్రమము గల హనుమదాది ప్రముఖులను వెంటనే చూడాలని ,
సీతను కనుగొనుటకై చేసిన ప్రయత్నము గురించి వినాలని కోరికగా వున్నది".
ఆ వానరులరాజు సంతోషముతో నిండిన కళ్ళుకలవాడై ,
సిద్దిపొందిన ఆ రాజకుమారులను చూచి
కర్మసిద్ధి కాబోతున్నదని గ్రహించి
అంగములన్నీ సంతోషముతో పులకిరించగా
అతడు అతిశయ ఆనందము పొందెను.
ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది మూడవ సర్గ సమాప్తము.
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||