||సుందరకాండ ||

||తత్త్వదీపిక - తొమ్మిదవ సర్గ ||

||మనోమయ కోశములో హనుమంతుడు||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ నవమస్సర్గః

తత్త్వదీపిక
మనోమయ కోశములో హనుమంతుడు

తొమ్మిదవ సర్గలో మళ్ళీ మొదటి లోనే " అససాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్" (9.04)
అంటూ మూడో సారి ఆ లక్ష్మీవంతుడు రాక్ష సేంద్రుని నివేశనము చేరెను అని వింటాము.

ఆ రాజభవనములో రావణుని ఐశ్వర్యము వర్ణిస్తూ ,
కుబేరుడి దగ్గర , యముడి దగ్గర, వరుణుని దగ్గర వున్నఐశ్వర్యము ,
"తాదృశీ తద్విశిష్టా వా" (9.09)
అలాంటి ఐశ్వర్యము లేక అంతకన్న విశిష్టమైన ఐశ్వర్యము రావణుని వద్ద వుందిట.
అక్కడ "గంధస్త్వం", అంటే అక్కడ వున్న మంచి సువాసనలు,
బంధువులను అహ్వానించుచున్నట్లు హనుమంతుని,
"తత్ర యత్ర స రావణః" (9.21)
అంటే అక్కడ ఎక్కడ రావణుడు ఉన్నాడో అక్కడికి ఆహ్వానించాయిట.

ఆ శాలలో వైభవము చూస్తూ హనుమంతుడు
" స్వర్గోయం దేవలోకోయం" (9.31),
ఇది స్వర్గ లోకమా, దేవ లోకమా,
లేక ఇంద్రుని అమరావతి యా అని విస్మయ పడ్డాడుట.
ఆ భోగ లోకాలు ఒక దానిని మించిన ఇంకొకటివి.
అంటే అక్కడి ఐశ్వర్యము చూచి
హనుమ ఆశ్చర్యము కూడా అలాగ పెరిగినదన్నమాట.

అక్కడ "సహస్రం వర నారీణాం" (9.34)
వెయ్యిమంది శ్రేష్ఠులైన నారీమణులు,
రావణుని భార్యలు అనేక రకముల వేషములతో
అనేక రకములైన భంగిమలలో కనపడ్డారుట.

ఆ స్త్రీల సమూహములో ,అత్యుత్తమురాలైన సీత తప్ప,
రావణుని పరాక్రమముచే బలాత్కారముగా తీసుకురాబడినవారు ఎవరూ లేరు,
ఇతరులపై కామము ఉన్నవారు ఎవరూ లేరు,
పూర్వమే ఇంకొకరి ప్రియురాలిగా ఉన్నవారు ఎవరూ లేరు.
అందరూ రావణుని వాంఛించినవారే అన్నమాట.
అతని భార్యలలో అకులీనులు లేరు.
రూపము లేని వారు లేరు.
యోగ్యతలేని వారు లేరు.
ఉపచారము చేయతగని వారు లేరు.
బుద్ధిహీనులు లేరు.
ఆ కాంతలలో కామించతగని కాంతలు కూడా లేరుట.

'ఈ రాక్షస భార్యలలాగా రాఘవపత్ని కూడా ఇలాగే ఉంటే
ఇతని జన్మ శోభనమై యుండును', అని ఆ వానరోత్తముని మదిలో ఒక ఆలోచన వచ్చెను.
హనుమంతుడు వెంటనే మళ్ళీ దుఃఖిస్తూ ఇలా అనుకొన్నాడు.
" సీతాదేవి నిస్సంశయముగా సద్గుణ సంపన్నురాలు.
అయినప్పటికీ లంకాధిపతి అయిన రావణుడు
ఆమె విషయములో హీనముగా వ్యవహిరించెను.
ఎంత కష్టము" అని (9.72)

అది సుందరకాండలో తొమ్మిదవ సర్గలో జరిగిన కథ.

మొదటి లోనే " అససాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్"
అంటూ లక్ష్మీవంతుడు అంటే హనుమంతుడు రావణభవనము ప్రవేశించెను
అని మూడో సారి వింటాము.
హనుమంతుడు రావణ భవనము లో మూడవ అంతస్తు చేరెను అన్నమాట.
ఎనిమిదవ సర్గలో అత్మాన్వేషణలో పంచకోశములు దాటడము గురించి చెప్పడమైనది.
ఇప్పుడు మూడో అంతస్థులో చేరాడు అంటే
అంటే అత్మాన్వేషణలో మూడవకోశమైన మనోమయ కోశము చేరాడన్నమాట.

మొదటి సర్గలో "రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి ఇతి రావణః",
అంటే "నేను" "నాది" అని "అసత్ ప్రలాపములను " పలికించేవాడు కనక రావణుడు అని.
అలా పలికించేదే మన మనస్సు అని విన్నమాటే.
అంటే ఆ రావణుడే మనస్సు.
రావణుని రాజభవనమే మనోమయ కోశము అన్నమాట.

ఆ మనోమయ కోశమే రావణుని రాజభవనము.

ఆ రావణ భవనములో వైభవము చూస్తూ హనుమంతుడు
" స్వర్గోయం దేవలోకోయం",
అంటే ఇది స్వర్గ లోకమా దేవ లోకమా
లేక ఇంద్రుని అమరావతి యా అని విస్మయ పడ్డాడుట.

రామాయణ తిలక లో స్వర్గము అంటే "జ్యోతిష్టోమాదిక యజ్ఞ ఫలభోగ భూమిః" అని ,
అంత కన్నపెద్దది దేవలోకము, అది "వాయు వరుణాదిలోకః" అని ,
దాని కన్న పెద్దది ఇంద్రపురీ "అమరావతి" , అది ఇంద్ర లోకము అని చెపుతారు.
అంటే అవి ఒక దాని కన్నా మించిన మరొకటి అయిన భోగ లోకాలు అన్నమాట.
అంటే అక్కడి ఐశ్వర్యము చూచిన హనుమ ఆశ్చర్యము కూడా అలాగే అంచెల మీద పెరిగిందన్నమాట.
ఇది వింటూ ఉంటే మనకి తెలిసేది మనస్సు ఎలాగ బాహ్యస్వరూపములతో ఆకర్షింపబడుతుందో అని.

అలా అన్వేషణలో అక్కడ ఆ రాజభవనములో
"సహస్ర వరణారీణాం" ఉన్నారుట.
ఎలాంటి నారీమణులు?
వాళ్ళలో ఎవరూ బలాత్కారముగా తీసుకురాబడినవారులేరు.
అందరూ కులీనులే.
అందరూ కామార్తులే.
సీత మాత్రమే బలాత్కారముగా తీసుకురాబడినది అన్నమాట.

అలా అంటూవుంటే మనకి ఒకటి స్ఫురిస్తుంది.
మనస్సుకి చాలా మంచి పనులే తోచవచ్చు, అవి చేయవచ్చు కూడా.
కాని ఒక్క తప్పుడు పనితో ఆ మంచి పనుల లాభము పోతుంది.
అలాగే మనస్సు ఒక దానిమీద నిలకడగా లేనపుడు, ఆత్మాన్వేషణ కూడా అవదు అన్నమాట.

ఇక్కడ రావణుని అంతః పురములో అందరూ కులీనలే.
వారంతట వారే రావణుని పై ప్రేమతో వచ్చినా,
సీతని బలాత్కారముతో తీసుకు రావడము వలన,
రావణుని మంచిగుణములు ఎలా వృథా అయినాయో మనకి తెలుస్తుంది.

హనుమ రావణభనములో రావణుని భార్యలను చూచి,
"వారిలో ఏ ఒకత్తెను అమె కి ఇష్టము లేనిదే బలాత్కరించి ఆమెను పొందలేదు,
పరాక్రమముచే కాక కేవలము గుణములచేతనే పొందెను.
ఇంతకుముందు ఒకరిని ప్రేమించి తప్పక వచ్చినది గాని,
ఇచట వుండి వేరోకరిపై ఆసక్తి ఉన్నది గాని,
కులవతి కానిది, మర్యాద లేనిది, దాక్షిణ్యములేనిదిగాని,
విహీనస్వభావము లేనిది, కామింపతగనిది లేదు" అని అనుకొనెను.

ఇది అంతా అతిశయమైన ఐశ్వర్య దర్శనము.
విస్మయము లో నున్న హనుమంతుని భావము.
( అలా అని గోవిందరాజవిరచిత శృంగార తిలక అనబడు సుందరకాండ వ్యాఖ్యానంలో కూడా వుంది)

ఈ విధముగా రావణునిపై సాదుబుద్ధితో ఆలోచించిన హనుమంతునికి
"...
యదీదృశీ రాఘవధర్మపత్నీ|
ఇమా యథా రాక్షసరాజభార్యా
సుజాతమస్యేతి హి సాదుబుద్ధేః||9.72||

" శ్రీరాముని ధర్మపత్ని కూడా ఈ రాక్షసరాజు భార్యలెటుల ఉండిరో అట్లు ఉన్నచో
ఇతని జన్మ ( సుజాతమ్) శోభనమై యుండును" అని తోచెను.
ఈ వాక్య నిర్మాణములో అశ్లీలమైన ధ్వని వినిపిస్తుంది

ఈ ఊహలో మూడురకముల ధ్వని వచ్చుటకు వీలు ఉన్నది.

(1) "స్వయంవరమునకు ముందే రాముని పొందకుండా ఈ రావణునే పొందియున్నచో
ఈ రాక్షసరాజుల భార్యలానే ఈమె కూడా రావణునితో రమించితే
అతని జన్మ "సుజాతమ్" అంటే మంచిగా పుట్టిన జన్మ అయ్యేది" అని.
హనుమను సాదుబుద్ధి అనబడ్డాడు కాబట్టి ఈ భావము హనుమకి కలిగి యుండదు.

(2) "ఈ రాక్షస రాజు భార్యలు తమ భర్తతో ఎట్లు అనందముగా ఉన్నారో,
అట్లు మా రాముని భార్యకూడా మా రామునితో యున్నచో
ఈ రావణుని జన్మ , సీతాపహరణము లేకుండా "సుజాతమ్" అయ్యేది "
అని ఇంకొక భావము.

(3) మూడో భావము - "మా రాఘవపత్ని వీనిచే అపహరింపబడి ఈ విధముగా నెట్లున్నదో,
అట్లు వీని భార్యలు కూడా మరియొకని చే అపహరింపబడి యున్నచో
వీని జన్మకు తగిన పని ( సుజాతమ్) " అని ఇంకొక భావము.

హనుమంతుడు తలచిన తలపులో దోషము లేకున్ననూ, ఈ విధముగా దోషము స్ఫురించు టకు అవకాశమున్నది.

రావణుడు తన స్త్రీలతో ఎలా కలిసి ఉన్నాడో,
రాముడు కూడా సీతతో కలిసివున్నచో వీని ఇశ్వర్యము అవిచ్ఛిన్నమై
వీని జన్మ ధన్యమై యుండును గదా అని హనుమ అసలు భావము.

హనుమంతుడుకి కూడా
ఆ వాక్య నిర్మాణమున అశ్లీలమగు అర్థము కూడా స్ఫురించుటకు అవకాశమున్నది
అని వెంటనే స్ఫురించెను.

అప్పుడు - "పునశ్చ"- మళ్ళీవెంటనే హనుమంతుడు అనుకుంటాడు.

'పునశ్చ సో sచింతయదార్తరూపః
ధృవం విశిష్టా గుణతో హి సీతా ' ||9-73||

అలా బాధపడి " ఈ రాక్షస స్త్రీలను సీతతో పోలిక చెప్పుటకు కూడా తగదు.
వీరికంటె గుణములలో పాతి వ్రత్య ధర్మములో సీత ప్రత్యేకత గలది" అని అనుకొనెను.

" ఈ లంకేశ్వరుడు మహతపశ్శాలియై యుండియు
యుక్తానుక్తము ఆలోచించక అనార్యులు చేయవలసిన క్రూరమైన పని
ఈ మహాపతివ్రత విషయమున చేసెను!
అహా ! ఏమి ఇది !" అని బాధపడెను.

భవద్గీతలో ఒకచోట కృష్ణుడు చెపుతాడు:

"మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం కశ్చిన్మా వేత్తి తత్త్వతః"|| (గీత 7.03)

"వేలకొలది మనుష్యులలో ఒక్కడు సిద్ధికి యత్నించును.
యత్నించినవారిలో కొందరే ముందుకు సాగుదురు.
అట్లు సాగిన వారిలో ఏవరో ఒక్కడు భగవత్ స్వరూపమును ఎరుగ గలుగును"అని.

అలాగే లంకలో రావణునిచే బంధింపబడిన కొన్ని వేలమంది "వరనారీమణుల" లో
ఒక్కరికికూడా రావణునివదలి వేరొకనిని పొందవలెనను అనే కోరిక కలుగలేదు.
వేరొకడు పొందదగిన వాడు ( పరమాత్మ) ఉన్నాడని భావనయే లేక సుఖములో ఓలలాడుతున్నారు.

ఓక్క సీతమ్మ మాత్రమే రావణుని ఐశ్వర్యమును ధనమును కాదని
శ్రీరామచంద్రుని కోరుకొనును.

ఆత్మాన్వేషణ చేయవలెను అనే ఆలోచన అందరికీ స్ఫురించదు.
కొన్ని వేలమందిలో ఏ ఒక్కరికో స్ఫురించును.
అతడే ముముక్షువు.

ముముక్షువు ( మోక్షమందు కోరిక గలవాడు) అగుట
ఎంత దుర్లభమో దీనిచే తెలియబడుచున్నది.
ఈ సర్గలో ముముక్షువు కు గల అడ్డంకులు అన్నీ
ఆ రాజభవనము యొక్క వర్ణన ద్వారా ,
ఆ వరనారీమణుల వర్ణన ద్వారా విశదీకరముగా చెప్పబడినవి.

అదే అప్పలాచార్యులవారు వారి తత్త్వగీతలో చెప్పిన అంతరార్థము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది భాష్యమ్ అప్పలాచార్యులవారి తత్త్వదీపికలో మాకు తెలిసిన మాట||
||ఓమ్ తత్ సత్||