||సుందరకాండ ||

|| అరవై రెండవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో ||

|| Sarga 62 || with Slokas and meanings in Telugu

                                         

||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ  శ్లోకార్థ తత్త్వదీపికా సహిత

ద్విషష్టితమస్సర్గః||


- మధువన ధ్వంశము - 



మధువన ధ్వంశము చేయబడిన ఘట్టము వర్ణిస్తూ, కవి  ’మదాంధశ్చ న వేద’, మదముచే అంధులైన వాళ్ళకి తెలియదు అని. ఏమిటి తెలియదో ఈ సర్గలో వాల్మీకి ద్వారా వింటాము


సుందరకాండలో ఆచార్యుడిగా హనుమత్సౌందర్యము, పరమాత్మనుంచి వేరైన జీవాత్మగా సీతమ్మనుచూశాము. సుందరకాండ తత్త్వదీపిక అంటే అంతరార్థములో అది ముఖ్యమైన అంశము. అదే కాకుండా వాల్మీకి ద్వారా సుందరకాండలో మనకి చాలా సత్యాలు కనిపిస్తాయి.


అందులో ఒకటి  ఏబది ఐదవ సర్గలో హనుమ ద్వారా వాల్మీకి చెప్పినమాట. క్రోధమును అదుపులో పెట్టక పోతే ఏమిటి అవుతుంది అని. అది లంకా దహనమౌతూవుంటే హనుమంతుని ద్వారా  వింటాము. అలాగే ఇక్కడ మధువన  ధ్వంశములో కూడా మనకి కొన్ని సత్యాలు కనిపిస్తాయి. భగవంతుని దర్శనానికి పోతూ వున్న వానరులు మధువనము చూసి ఆగిపోవడము అన్నది, మన మనస్సు ఎంత చంచలమో నిరూపిస్తుంది.


అంతే కాదు, ఈ సర్గలో మరింకో సంగతి వాల్మీకి ద్వారాచూస్తాము. మదాంధులైన వానరులు, ఆర్యుడు అన్న సంగతి మరచి పోయి, దధిముఖుని క్రింద పడవేసి కొట్టడము.


సీతమ్మ అన్వేషణ  జయప్రదము గా జరిగింది. అది సీతారాముల ప్రభావము వలనే అని, హనుమ ద్వారా విన్నాము. మధువన ధ్వంశ ఘట్టములో అదంతా ఎంత సులభముగా మరచిపోతామో తెలుస్తుంది. 


ముందు హనుమ ఆ వానరులకు ఆశ్వాసన ఇస్తాడు ’ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువ్హును సేవించుడు’.  ఇంకాపైన,  ’అహమావారయిష్యామి’  - మిమ్మలిని ఎవరైన ఆపితే వాళ్ళని నే చూస్తాను అని.  హనుమంతుని  వాక్యములను వినిన అంగదుడు . ’ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు. కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో, ’అకార్యమపి కర్తవ్యం’,  అంటే చేయతగని కార్యము కూడా చేయతగును.  అప్పుడు ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు’. అని అంటాడు.


ఇలా అనడములో అంగదుడు, హనుమ, ’కృతకార్యుడు’ అయినా , అది భగవత్కృప  వలన అన్న మాట మరచిపోయాడని ధ్వని వస్తుంది. ఆ మాట మరిచిన వాడికి అహం పైకి వస్తుంది.


దక్షిణ దిశనుంచి వస్తున్న వానరుల ద్వారా మధువన ధ్వంశము అవుతోంది అని విన్న, సుగ్రీవుని మేన మామ దధిముఖుడు వాళ్ళని ఆపడానికి వస్తాడు. వచ్చి కొంత మంది వానరులను తన బలముతో ఆపుతాడు. అప్పుడు హనుమంతుడు అంగదుడు వచ్చి దధిముఖుని ఎదురుకుంటారు.


అప్పుడు అంగదుడు "అయం మమ ఆర్యకః", అంటే వీడు నాకు పెద్దవాడు అన్న సంగతి మరిచిపోయి,దధిముఖుని క్రింద పడవేసి కుమ్ముతాడు. అక్కడ వాల్మీకి అంటాడు - "మదాంధశ్చ " అంటే మదముతో అంధుడై అలాచేశాడని.


అంటే ఒక గొప్పకార్యము సాధించవలడము వలన, ఇంకో దుష్కార్యము చేయడానికి అనుమతిలేదు. ఆ గొప్పకార్యము భవత్కృపవలన జరిగిందని ఎవరు మరచి పోతారో వాళ్లలో లేచే అహం, మదము గా మారి , "ఆకార్యమును" గుర్తించలేనట్టి అంధులుగా వాళ్ళని మారుస్తుందన్నమాట. అదే ఈ సర్గలో వాల్మీకి మనకు గుర్తుచేస్తున్న సత్యము.


హనుమదంగదులు స్వామి భక్తులే అయినా, ఆ సంగతి మరచిపోయిన క్షణములో మదాంధకారములో పడతారన్నమాట. అలా పడి దధిముఖుని ఎదురుకొని క్రింద పడవేస్తారు. దధిముఖుడు ఎలాగో తప్పించుకొని పారిపోయి సుగ్రీవుని కాళ్ళ మీద పడతాడు.


ఇక అరవై రెండవ సర్గలో శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో:


||శ్లోకము 62.01||


తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానరర్షభః |

అవ్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః ||62.01||

అహమావారయిష్యామి యుష్మాకం పరిపంథినః |


స|| హరిశ్రేష్ఠః వానరర్షభః హనుమాన్ తాన్ ఉవాచ | వానరాః  యూయం అవ్యగ్రమనసః మధుసేవత || యుష్మాకం పరిపన్థినః అహం ఆవారయిష్యామి ||


||శ్లోకార్థములు||


హరిశ్రేష్ఠః వానరర్షభః - 

వానరులలో శ్రేష్ఠుడు వృషభము వంటి వాడు అగు 

హనుమాన్ తాన్ ఉవాచ - 

హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు పలికెను

వానరాః  యూయం అవ్యగ్రమనసః మధుసేవత - 

ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువ్హును సేవించుడు

యుష్మాకం పరిపన్థినః - మిమ్ములను ఆపువారిని

అహం ఆవారయిష్యామి - ఆపువారిని నేను ఆపెదను 


||శ్లోకతాత్పర్యము||


వానరులలో శ్రేష్ఠుడు వృషభము వంటి వాడు అగు హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు పలికెను. ’ఓ వానరులారా మీరు నిశ్చింతగా మధువ్హును సేవించుడు. మిమ్ములను ఆపువారిని నేను ఆపెదను’. ||62.01||


||శ్లోకము 62.02||

 

శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోఽఙ్గదః ||62.02||

ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు |


 స|| హనుమతః వాక్యం శ్రుత్వా అఙ్గదః ప్రవరః హరీణాం ప్రత్యువాచ| హరయః మధు ప్రసన్నాత్మాపిబంతు ||


||శ్లోకార్థములు||


హనుమతః వాక్యం శ్రుత్వా - 

హనుమంతుని ఈ వాక్యములను విని 

అఙ్గదః ప్రవరః - ప్రవరుడు అంగదుడు 

హరీణాం ప్రత్యువాచ - వానరులతో ఇట్లు పలికెను

హరయః మధు ప్రసన్నాత్మా పిబంతు - 

ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు


||శ్లోకతాత్పర్యము||


హనుమంతుని ఈ వాక్యములను విని ప్రవరుడు అంగదుడు వానరులతో ఇట్లు పలికెను. ’ఓ వానరులారా ! ప్రసన్నాత్ములై మధువును సేవించుడు.’ ||62.02||


||శ్లోకము 62.03||


అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా ||62.03||

అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశమ్ |


 స|| కృతకార్యస్య హనుమతః వాక్యం అకార్యం అపి అవశ్యం కర్తవ్యం | ఈదృశం పునః కిమంగ ||


||శ్లోకార్థములు||


కృతకార్యస్య హనుమతః వాక్యం - 

కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో 

అకార్యం అపి అవశ్యం కర్తవ్యం  - 

చేయతగని కార్యము కూడా చేయతగును

ఈదృశం పునః కిమంగ - 

ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు


||శ్లోకతాత్పర్యము||


’కృతకృత్యుడైన హనుమంతుని మాటలతో చేయతగని కార్యము కూడా చేయతగును. అప్పుడు ఇలాంటి కార్యమునకు చింతించ నవసరము లేదు’. ||62.03||


||శ్లోకము 62.04||


అఙ్గదస్య ముఖాచ్ఛ్రుత్వా వచనం వానరర్షభాః ||62.04||

సాధు సాధ్వితి సంహృష్టా వానరాః ప్రత్యపూజయన్ |


స|| వానరర్షభాః వానరాః అంగదస్య ముఖాత్  వచనం శ్రుత్వా సంహృష్టాః  సాధు సాధ్వితి ప్రత్యపూజయన్ ||  


||శ్లోకార్థములు||


వానరర్షభాః వానరాః - 

వానర శ్రేష్ఠులు వానరులు

అంగదస్య ముఖాత్  వచనం శ్రుత్వా- 

అంగదుని ఈ వచనములను విని 

 సంహృష్టాః  సాధు సాధ్వితి -

 సంతోషపడినవారై మంచిది మంచిది అని

 ప్రత్యపూజయన్ - అంగదుని పూజించిరి


||శ్లోకతాత్పర్యము||


వానర శ్రేష్ఠులు అంగదుని ఈ వచనములను విని సంతోషపడినవారై, మంచిది మంచిది అని, అంగదుని పూజించిరి.  ||62.04||


||శ్లోకము 62.05||


పూజయిత్వాఙ్గదం సర్వే వానరా వానరర్షభమ్ ||62.05||

జగ్ముర్మధువనం యత్ర నదీవేగ ఇవ ద్రుమమ్ |


స|| సర్వే వానరాః అంగదం పూజయిత్వా యత్ర మధువనం (తత్ర) జగ్ముః నదీ వేగః ద్రుమమ్ ఇవ ||


రామ టీకాలో - పూజయిత్వేతి|| అఙ్గదంపూజయిత్వా యత్ర మధువనం తత్ర వానరర్షభాః నదీ వేగ ఇవ జగ్ముః|


గోవిన్దరాజ టీకాలో- పూజయిత్వేతి |  జగ్ముః మధువనం ఇతి ప్రవేశ భేదవివక్షయా | యద్వా దధిముఖనివారణేన భీతానాం హనుమదఙ్గదాభ్యాం పునరనుజ్ఞాపనేన పునః జగ్ముః ఇత్యర్థః||


||శ్లోకార్థములు||


సర్వే వానరాః అంగదం పూజయిత్వా -

 ఆ వానరులందరూ అంగదుని పూజించి

యత్ర మధువనం (తత్ర) జగ్ముః - 

మధువనము ఎక్కడ కలదో అక్కడ వెళ్ళిరి

నదీ వేగః ద్రుమమ్ ఇవ - 

నదీ ప్రవాహములో  పోతున్న వృక్షముల వలె


||శ్లోకతాత్పర్యము||


ఆ వానరులందరూ అంగదుని ఆ విధముగా పూజించి, మధువనములోకి  నదీ ప్రవాహములో కొట్టుకు పోతున్న వృక్షముల వలె దిగిరి. ||62.05||


||శ్లోకము 62.06||


తే ప్రవిష్టా మధువనం పాలానాక్రమ్య వీర్యతః ||62.06||

అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం |

పపుస్సర్వే మధు తదా రసవత్ఫల మాదదుః ||62.07||


స|| మైథిలీం దృష్ట్వా శ్రుత్వా అతిసర్గాచ్చ మధువనం ప్రవిష్టాః| పాలాన్ వీర్యతః ఆక్రమ్య తదా మధుః పపుః | రసవత్ ఫలం ఆదదుః||


రామ టీకాలో - మైథిలిం దృష్ట్వా  శ్రుత్వా చ ఆగతాః సర్వే వానరాః అతి సర్గాత్ అఙ్గదనుజ్ఞాతః  శక్తితః సామర్థ్యాత్ పాలాన్ మధువనరక్షకాన్ ఆక్రమ్య మధు పపుః ఫలమాదదుశ్చ| అత్ర దర్శనం హనుమత్కర్తృకమ్ శ్రవణమ్ తు ఇతరకర్తృకం ఇతి వివేకః | సార్థ శ్లోకం ఏకాన్వయీ||


గోవిన్దరాజ టీకాలో -  వీర్యతః బలాత్| అతిసర్గాత్ అఙ్గదాభ్యనుజ్ఞానాత్ || దృష్ట్వా శ్రుత్వా చ  మైథిలీం దర్శన శ్రవణాభ్యాం చ హేతునా వనపాలానాక్రమ్య ..||


||శ్లోకార్థములు||


మైథిలీం దృష్ట్వా - మైథిలి చూడబడినది అని

 శ్రుత్వా అతిసర్గాచ్చ- విని అతిసంతోషపడి

 మధువనం ప్రవిష్టాః -మధువనం ప్రవేశించిరి

పాలాన్ వీర్యతః ఆక్రమ్య- వనపాలకులను బలముతో

 తదా మధుః పపుః  - అప్పుడు మధువును త్రాగిరి

రసవత్ ఫలం ఆదదుః- రసములు కల ఫలములను తినిరి


||శ్లోకతాత్పర్యము||


’మైథిలిని చూచితిని’ అన్న మాటవిని అత్యంత సంతోషముతో మధువనము ప్రవేశించిరి. అక్కడి వనపాలకులను తమ బలముతో అధిగమించి మధువును సేవించిరి. రసములుగల ఫలములని తినిరి. ||62.06,07||


||శ్లోకము 62.07,08||


ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్ సమాగతాన్ |

తాడయంతిస్మ శతశస్సక్తాన్ మధువనే తదా ||62.08||


స|| తదా సర్వే ఉత్పత్య సమాగతాన్  మధువనే సక్తాన్ వనపాలాన్   తతః  శతశః తాడయంతిస్మ ||


గోవిన్దరాజ టీకాలో- సక్తాన్ వనపాలనే రక్తాన్ |

తిలక టీకాలో - మధువనే సక్తా భక్షణార్థం లగ్నాః |


||శ్లోకార్థములు||


తదా సర్వే ఉత్పత్య -

 అప్పుడు వానరులందరూ ఎగిరి

సమాగతాన్  మధువనే సక్తాన్ వనపాలాన్  -

మధువన రక్షణలో ఆసక్తులై కూడివున్న వనపాలకులను

 తతః  శతశః తాడయంతిస్మ- 

అప్పుడు అనేకసార్లు కొట్టిరి


||శ్లోకతాత్పర్యము||


అక్కడ వచ్చిన వానరులందరూ ఎగిరి అక్కడి వనపాలకులను అనేక సార్లు కొట్టిరి.||62.08||


||శ్లోకము 62.09||


మధూణి ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్య తే |

పిబంతి సహితాః సర్వే నిఘ్నంతి స్మ తథా పరే || 62.09||


స|| తే సర్వే బహుభిః ద్రోణమాత్రాణి మధూని పరిగృహ్య సహితాః పిబన్తి| అపరే నిఘ్నన్తి చ ||


||శ్లోకార్థములు||


తే సర్వే బహుభిః ద్రోణమాత్రాణి-

 వారందరూ అనేకమైన దోసెడలతో  

మధూని పరిగృహ్య సహితాః పిబన్తి - 

మధువును తీసుకొని సంతోషముగా సేవించిరి

అపరే నిఘ్నన్తి చ - కొందరు వారిని వారించిరి కూడా


 ||శ్లోకతాత్పర్యము||


వారందరూ అనేకమైన దోసెడలతో  మధువును తీసుకొని సంతోషముగా సేవించిరి. కొందరు వారిని వారించిరి కూడా. ||62.09||


||శ్లోకము 62.10||

                                                                           

కేచిత్పీత్వాఽపవిధ్యంతి మధూని మధుపిఙ్గళాః |

మధూచ్ఛిష్టేన కేచిచ్చ జఘ్నురన్యోన్యముత్కటాః ||62.10||


స|| మధుపింగళాః కేచిత్ మధూని పీత్వా  మధూచ్ఛిష్టేన ఉత్కటాః అన్యోన్యం ప్రవిధ్యన్తి జగ్ముః || 


||శ్లోకార్థములు||


మధుపింగళాః కేచిత్ మధూని పీత్వా  -

వానరులు కొందరు మధువును సేవించి 

మధూచ్ఛిష్టేన ఉత్కటాః-  

ఆ మధువు పుట్టలతో మత్తెక్కి

అన్యోన్యం ప్రవిధ్యన్తి జగ్ముః - 

ఒకరినొకరు తోసుకొనుచుండిరి


||శ్లోకతాత్పర్యము||


వానరులు కొందరు మధువును సేవించి, ఆ మధువ్హుతో మత్తుపోయి, ఒకరినొకరు తోసుకొనుచుండిరి. ||62.10||


||శ్లోకము 62.11||


అపరే వృక్షమూలే తు శాఖాం గృహ్య వ్యవస్థితాః |

అత్యర్థం చ మదగ్లానాః పర్ణాన్యాస్తీర్య శేరతే ||62.11||


స|| అపరే శాఖాం గృహ్య వృక్షమూలే వ్యస్థితాః | అత్యర్థం మదగ్లానాః పర్ణాని ఆస్తీర్య శేరతే ||



||శ్లోకార్థములు||


అపరే శాఖాం గృహ్య - మరి కొందరు వృక్ష శాఖలను తీసుకొని 

వృక్షమూలే వ్యస్థితాః - వృక్షమూలములో విశ్రమించిరి

అత్యర్థం మదగ్లానాః - కొందరు తాగిన మత్తుతో 

పర్ణాని ఆస్తీర్య శేరతే - ఆకులను పరచి వాటిపై విశ్రమించిరి.


||శ్లోకతాత్పర్యము||


మరి కొందరు వృక్ష శాఖలను తీసుకొని, వృక్షమూలములో విశ్రమించిరి. కొందరు తాగిన మత్తుతో ఆకులను పరచి, వాటిపై విశ్రమించిరి. ||62.11||


||శ్లోకము 62.12||

 

ఉన్మత్తభూతాః ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్ |

క్షిపంతి చ తదాన్యోఽన్యం స్ఖలంతి చ తథాఽపరే ||62.12||


స|| మధుమత్తాః ప్లవగాః ఉన్మత్తభూతాః హృష్టవత్ అన్యోన్యం క్షిపన్తి | అపరే స్ఖలంతి చ||


||శ్లోకార్థములు||


మధుమత్తాః ప్లవగాః - 

మధువుతో మత్తెక్కిన వానరులు 

ఉన్మత్తభూతాః హృష్టవత్ - 

ఉన్మత్తులై సంతోషముతో 

అన్యోన్యం క్షిపన్తి - 

ఒకరినొకరు తోసుకొనుచుండిరి

అపరే స్ఖలంతి చ - 

మరికొందరు మధుమత్తముతో తూలుచుండిరి. 


||శ్లోకతాత్పర్యము||


మధువుతో మత్తెక్కిన వానరులు ఉన్మత్తులై సంతోషముతో ఒకరినొకరు తోసుకొనుచుండిరి. మరికొందరు మధుమత్తముతో తూలుచుండిరి. ||62.12|| 


||శ్లోకము 62.13||


కేచిత్ క్ష్వేళాం ప్రకుర్వంతి కేచిత్కూజంతి హృష్టవత్ |

హరయో మధునా మత్తః కేచిత్ సుప్తా  మహీతలే ||62.13||


స|| కేచిత్ క్ష్వేళాం ప్రకుర్వన్తి | కేచిత్ హృష్టవత్ కూజన్తి | మధునా మత్తాః కేచిత్ హరయః మహీతలే సుప్తాః ||


గోవిన్దరాజ టీకాలో- కేచిదితి || క్ష్వేళాం సింహనాదమ్ ’క్ష్వేళాతు సింహనాదం స్యాత్ ఇతి అమరః | కూజన్తి పక్షివత్  ఛాదయన్తే |


||శ్లోకార్థములు||


కేచిత్ క్ష్వేళాం ప్రకుర్వన్తి  -

కొందరు ఆనందముతో సింహనాదములు చేయుచుండిరి

కేచిత్ హృష్టవత్ కూజన్తి-

 కొందరు సంతోషముతో పక్షులవలె  కూతలు కూయుచుండిరి

మధునా మత్తాః కేచిత్ హరయః - 

మత్తెక్కిన కొందరు వానరులు

మహీతలే సుప్తాః -

 నేలమీద పడుకొని నిద్రలోకి జారుకున్నారు


||శ్లోకతాత్పర్యము||


కొందరు ఆనందముతో సింహనాదములు చేయుచుండిరి. కొందరు పక్షులవలె కూతలు కూచుచుండిరి. మధువుతో మత్తెక్కిన కొందరు నేలమీద పడుకొని నిద్రలోకి జారుకున్నారు. ||62.13||


||శ్లోకము 62.14||


కృత్వా కేచిత్ దసంత్యన్యే కేచిత్ కుర్వంతి చేతరత్ |

కృత్వా కేచిత్ వదంత్యన్యే  కేచిత్ బుధ్యంతి చేతరత్ ||62.14||


స|| కేచిత్ కృత్వా హసన్తి | అన్యే కేచిత్ ఇతరమ్ కుర్వన్తి | కేచిత్ కృత్వా వదన్తి | కేచిత్ అన్యే ఇతరత్ బుధ్యన్తి ||


||శ్లోకార్థములు||


కేచిత్ కృత్వా హసన్తి - 

కొందరు ఏదో చేసి నవ్వుచుండిరి

అన్యే కేచిత్ ఇతరమ్ కుర్వన్తి - 

ఇంకా కొందరు ఇంకేదో పని చేయుచుండిరి

కేచిత్ కృత్వా వదన్తి - 

కొందరు ఏదో చేసి చెప్పుచుండిరి

కేచిత్ అన్యే ఇతరత్ బుధ్యన్తి- 

కొందరు ఇంకేదో ఆలోచనలో ఉండిరి. 


||శ్లోకతాత్పర్యము||


కొందరు ఏదో చేసి నవ్వుచుండిరి. ఇంకా కొందరు ఇంకేదో పని చేయుచుండిరి. కొందరు ఏదో చేసి చెప్పుచుండిరి. కొందరు ఇంకేదో ఆలోచనలో ఉండిరి. ||62.14||


||శ్లోకము 62.15||


యేఽప్యత్ర మధుపాలాస్స్యుః ప్రేష్యా దధిముఖస్య తు |

తేఽపి తైర్వానరైర్భీమైః ప్రతిషిద్ధా దిశో గతాః ||62.15||


స|| అత్ర దధిముఖస్య ప్రేష్యాః మధుపాలాః యే స్యుః తే అపి భీమైః వానరైః ప్రతిషిద్ధాః దిశః గతాః ||


||శ్లోకార్థములు||


అత్ర దధిముఖస్య ప్రేష్యాః -

అక్కడ దధిముఖునిచే పంపబడిన

మధుపాలాః యే స్యుః తే అపి- 

మధువన రక్షకులు ఎవరు కలరో వారు

 భీమైః వానరైః ప్రతిషిద్ధాః- 

భీమబలముకల వానరులచేత ప్రతిఘటించబడి 

 దిశః గతాః - అన్ని దిక్కులలో పారి పోయిరి 


||శ్లోకతాత్పర్యము||


అక్కడ దధిముఖునిచే పంపబడిన మధువన రక్షకులు, భీమబలము కల వానరులచేత ప్రతిఘటించబడి, వారు అన్ని దిక్కులలో పారి పోయిరి. ||62.15||


||శ్లోకము 62.16||


జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం ప్రదర్శితాః |

అబ్రువన్ పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః ||62.16||


స|| జానుభిః ప్రకృష్టాః దేవమార్గం  ప్రదర్శితాః | పరమోద్విగ్నాః దధిముఖం గత్వా వచః అబ్రువన్ ||


||శ్లోకార్థములు||


జానుభిః ప్రకృష్టాః - కాళ్ళతో లాగబడి 

దేవమార్గం  ప్రదర్శితాః  - 

ఆకాశమార్గములో కి విసరబడిరి

పరమోద్విగ్నాః దధిముఖం గత్వా - 

అతి దుఃఖితులై దధిముఖునివద్దకు

వచః అబ్రువన్ - ఇట్లు పలికితిరి


||శ్లోకతాత్పర్యము||


వారు కాళ్ళతో లాగబడి ఆకాశమార్గములో కి విసరబడిరి. వారు అతి దుఃఖితులై దధిముఖునివద్దకు పోయి ఇట్లు పలికితిరి. ||62.16||


||శ్లోకము 62.17||


హనుమతా దత్తవరైర్హతం  మధువనం బలాత్ |

వయం చ జానుభిః కృష్టా దేవమార్గం చ దర్శితాః ||62.17||


స|| హనుమతా దత్తవరైర్హతం వయం చ మధువనం జానుభిః బలాత్ కృష్టా దేవమార్గం చ దర్శితాః ||


రామ టీకాలో - జానుభేరితి || జానుభిః జానుగ్రహణైః ప్రఘృష్టాః ఆకృష్టా అనన్తరం దేవమార్గం ఆకాశం దర్శితాః ప్రక్షేపేణ ప్రాపితాః ఇత్యర్థః | అతఏవ పరమోద్విగ్నాః కేచిత్ రక్షకాః దధిముఖం గత్వా ప్రాప్య హనుమతా దత్తః వరః యథేఛ్ఛం  మూలఫలాది స్వీకారో యేభ్యః తైః మధువనం వినాశితం , వయం చ జానుభిర్ ఘృష్టాః సన్తః దేవమార్గం ప్రదర్శితా ఇతి వచః అబ్రువన్ || 


||శ్లోకార్థములు||


హనుమతా దత్తవరైః వయం హతం -

హనుమంతునిచేత అనుమతింపబడిన వానరులచేత మేము హతులమైతిమి

చ మధువనం - 

మధువనము కూడా ధ్వంసమయ్యెను

జానుభిః బలాత్ కృష్టా - 

మా కాళ్ళు  బలవంతముగా పట్టుకొనబడి 

దేవమార్గం చ దర్శితాః - 

దేవమార్గము చూపబడిన వారము


||శ్లోకతాత్పర్యము||


’హనుమంతునిచేత అనుమతింపబడిన వానరులచేత మేము హతులమైతిమి. మధువనము ధ్వంసమయ్యెను. మా కాళ్ళు పట్టుకొనబడి, దేవమార్గము చూపబడిన వారము’. ||62.17||


||శ్లోకము 62.18||


తతో దధిముఖః క్రుద్ధో వనపస్తత్ర వానరః |

హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్ ||62.18||


స|| తతః తత్ర  దధిముఖః వానరః కృద్ధః మధువనం హతం (ఇతి) శ్రుత్వా హరీణ్ సాన్త్వయామాస ||


||శ్లోకార్థములు||


తతః తత్ర  దధిముఖః వానరః -

 అప్పుడు అక్కడ వానరుడగు దధిముఖుడు 

మధువనం హతం (ఇతి) శ్రుత్వా  కృద్ధః - 

మధువనము ధ్వంసమైనట్లు విని కోపము కలవాడై

హరీణ్ సాన్త్వయామాస - వానరులను ఓదార్చెను


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు వానరుడగు దధిముఖుడు మధువనము ధ్వంసమైనట్లు విని,  వచ్చిన వానరులను ఓదార్చెను. || 62.18||


||శ్లోకము 62.19||


ఇహాగచ్ఛత గచ్ఛామో వానరాన్ బలదర్పితాన్ |

బలేన వారయిష్యామో మధు భక్షయతో వయమ్ || 62.19||


స||ఇహ ఆగచ్ఛత | గచ్చామః వయం బలదర్పితాన్ మధుభక్షయతః వానరాన్ బలేన వారయిష్యామః ||


||శ్లోకార్థములు||


ఇహ ఆగచ్ఛత - ఇక్కడకు రండు

గచ్చామః వయం - మనము వెళ్ళెదము

బలదర్పితాన్ మధుభక్షయతః వానరాన్ - 

బలదర్పముతో వీగుతున్న మధుభక్షకులగు వానరులను 

బలేన వారయిష్యామః - 

బలప్రయోగముతో వారించుదము


||శ్లోకతాత్పర్యము||


’రండు. మనము బలదర్పముతో వీగుతున్న మధుభక్షకులగు వానరులను బలప్రయోగముతో వారించుదము’. || 62.19||


||శ్లోకము 62.20||


శ్రుత్వా దధిముఖ స్యేదం వచనం వానరర్షభాః |

పునర్వీరా మధువనం తేనైవ సహసా యుయుః ||62.20||


స|| వానరర్షభాః దధిముఖస్య ఇదం వచనం శ్రుత్వా సహసా తేనైవ పునః మధువనం యయుః ||


||శ్లోకార్థములు||


వానరర్షభాః - వానర వీరులు

దధిముఖస్య ఇదం వచనం శ్రుత్వా -

 ఆ దధిముఖుని ఈ వచనములను విని 

సహసా తేనైవ పునః- వెంటనే మళ్ళీ అదే

మధువనం యయుః - మధువనము చేరిరి


||శ్లోకతాత్పర్యము||


’ఆ దధిముఖుని వచనములను వినిన వానరులు వెంటనే  మళ్ళీ మధువనము వెళ్ళిరి’. ||62.20||


||శ్లోకము 62.21||


మధ్యే చైషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుమ్ |

సమభ్యధావత్ వేగేన తే చ సర్వే ప్లవంగమాః ||62.21||


స|| ఏషాం మధ్యే  తరసా దధిముఖః  తరుం ప్రగృహ్య వేగేన సమభ్యధావత్  తే సర్వే ప్లవంగమాః చ || 


||శ్లోకార్థములు||


ఏషాం మధ్యే  తరసా - వీటి మధ్యలో బలముగల

దధిముఖః  తరుం ప్రగృహ్య - 

దధిముఖుడు ఒక వృక్షమును పెకలించి తీసుకొని 

వేగేన సమభ్యధావత్  - వేగముగా వెళ్ళెను

తే సర్వే ప్లవంగమాః చ - అందరూ వానరులు కూడా


||శ్లోకతాత్పర్యము||


ఈ మధ్యలో దధిముఖుడు, ఒక వృక్షమును పెకలించి తీసుకొని వేగముగా వెళ్ళెను. అతని వెంట అందరూ వానరులు కూడా వెళ్ళిరి . ||62.21||


||శ్లోకము 62.22||


తే శిలాః పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాః |

గృహీత్వాభ్యగమన్ క్రుద్ధా యత్ర తే కపికుంజరాః ||62.22||


స|| తే వానరాః క్రుద్ధాః శిలాః పాదపాంశ్చ పర్వతాంశ్చ గృహీత్వా తే కపికుంజరాః యత్ర  తత్ర అభ్యగమన్ ||



||శ్లోకార్థములు||


తే క్రుద్ధాః వానరాః - ఆ కుపితులైన వనరక్షకులు  

శిలాః పాదపాంశ్చ - రాళ్లను చెట్లనూ 

పర్వతాంశ్చ గృహీత్వా - కొండలను పట్టుకొని

తే కపికుంజరాః యత్ర - ఆ కపికుంజరులు ఎక్కడ కలరో

 తత్ర అభ్యగమన్- అక్కడికి వెళ్ళిరి


||శ్లోకతాత్పర్యము||


ఆ వనరక్షకులు కుపితులై రాళ్లను చెట్లనూ కొండలను  తీసుకొని,  దక్షిణ దిశనుంచి వచ్చిన కపికుంజరులు ఉన్నచోటికి పోయిరి. ||62.22||


||శ్లోకము 62.23||


తే స్వామివచనం వీరా హృదయేష్యవసజ్య తత్ |

త్వరయా హ్యభ్యధావంత సాలతాల శిలాయుధాః ||62.23||


స|| వీరాః తే తత్ స్వామివచనం హృదయేషు అవస్జ్య సాలతాలశిలాయుధాః త్వరయా అభ్యధావన్త||


||శ్లోకార్థములు||


వీరాః తే తత్ స్వామివచనం - 

వీరులైన వనపాలకులు తమ నాయకుని మాటలను 

హృదయేషు అవస్జ్య- 

మనస్సులో ఉంచుకొని

 సాలతాలశిలాయుధాః - 

తాటిచెట్లను శిలలనూ అయుధములు గా పట్టుకొని

త్వరయా అభ్యధావన్త - త్వరగా అనుసరించిరి


||శ్లోకతాత్పర్యము||


వీరులైన వనపాలకులు తమ నాయకుడైన దధిముఖుని అనుసరిస్తూ తాటిచెట్లను శిలలనూ అయుధములు గా పట్టుకొని అనుసరించిరి. ||62.23|| 


||శ్లోకము 62.24||


వృక్షస్థాంచ తలస్థాంచ వానరాన్ బలదర్పితాన్ |

అభ్యక్రామం స్తతో వీరాః పాలాస్తత్ర సహస్రశః ||62.24||


స|| తతః వీరాః పాలాః సహస్రశః వృక్షాస్థాంశ్చ తలాస్థాంశ్చ బలదర్పితాన్ వానరాన్ అభ్యక్రమన్ ||


||శ్లోకార్థములు||


తతః వీరాః పాలాః సహస్రశః - 

ఆ వీరులైన వేలకొలదీ వనపాలకులు 

వృక్షాస్థాంశ్చ తలాస్థాంశ్చ - 

చెట్లమీద చెట్లకిందా 

బలదర్పితాన్ వానరాన్ - 

బలదర్పముతో వీగుచున్న వానరులను

అభ్యక్రమన్ - ఎదుర్కొనిరి


||శ్లోకతాత్పర్యము||


ఆ వీరులైన వనపాలకులు, చెట్లమీద చెట్లకిందా బలదర్పముతో వీగుచున్న వానరులను ఎదుర్కొనిరి. ||62.24||


||శ్లోకము 62.25||


అథ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానరపుంగవాః |

అభ్యధావంత వేగేన హనుమత్ప్రముఖాః తదా ||62.25||


స|| అథ హనుమత్ప్రముఖాః వానరపుంగవాః తదా దధిముఖం క్రుద్ధం దృష్ట్వా వేగేన అభ్యధావంత ||

 

||శ్లోకార్థములు||


అథ హనుమత్ప్రముఖాః వానరపుంగవాః - 

హనుమదాది వానర  ప్రముఖులు 

తదా దధిముఖం క్రుద్ధం దృష్ట్వా - 

అప్పుడు క్రోధముతో వచ్చిన దధిముఖుని చూచి 

వేగేన అభ్యధావంత - వేగముగా పరుగెత్తుకోని వచ్చిరి


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు క్రోధముతో వచ్చిన దధిముఖుని చూచి, హనుమదాది ప్రముఖులు వెంటనే పరుగెత్తుకోని వచ్చిరి. ||62.25||


||శ్లోకము 62.26||


తం సవృక్షం మహాబాహుం అపతంతం మహాబలమ్ |

ఆర్యకం ప్రాహరత్తత్ర బాహుభ్యాం కుపితోఽఙ్గదః ||62.26||


స|| కుపితః అంగదః సవృక్షం మహాబాహుం మహాబలం ఆపతంతం  తం ఆర్యకమ్ తత్ర బాహుభ్యాం ప్రాహరత్ ||


||శ్లోకార్థములు||


కుపితః అంగదః - కోపముతో అంగదుడు

మహాబాహుం మహాబలం - 

మహాబాహువులు కల మహా బలము కల

సవృక్షం ఆపతంతం - 

వృక్షముచేత బట్టుకొని  వచ్చిన 

 తం ఆర్యకమ్ తత్ర బాహుభ్యాం-

 గౌరవించతగిన ఆయనను తన బాహువులతో

 ప్రాహరత్ - పట్టుకొనెను


||శ్లోకతాత్పర్యము||


వృక్షముచేత బట్టుకొని  వచ్చిన మహాబలుడు అగు దధిముఖుని చూచి అంగదుడు, గౌరవించదగిన వానిని, కోపముతో తన బాహువులతో పట్టుకొనెను. ||62.26||


||శ్లోకము 62.27||


మదాంధశ్చన వేదైన మార్యకోఽయం మమేతి సః |

అథైనం నిష్పిపేషాశు వేగేవత్ వసుధాతలే ||62.27||


స|| సః మదాంధస్య అయమ్ మమ ఆర్యకః ఇతి ఏనం న వేద |  అథ ఏనం వసుధాతలే వేగవత్  ఆశు నిష్పిపేష || 


||శ్లోకార్థములు||


సః మదాంధస్య -మదాంధునికి

అయమ్ మమ ఆర్యకః - ఇతడు తన నా పెద్దవాడు

ఇతి ఏనం న వేద  - అని తెలిసికొనలేకపోయను

అథ ఏనం వసుధాతలే - అప్పుడు అతనిని భూమి మీద

వేగవత్  ఆశు నిష్పిపేష - వేగముగా వెంటనే పడవేసెను. 


||శ్లోకతాత్పర్యము||


అతడు( అంగదుడు)  మదాంధుడై, ’ఇతడు తన నా పెద్దవాడు’ అని తెలిసికొనలేకపోయాడు. అప్పుడు అయనని ( దధిముఖుని) వేగముగా భూమిమీద పడవేసెను. ||62.27||


||శ్లోకము 62.28||


స భగ్న బాహూరుభుజో విహ్వలః శోణితోక్షితః |

ముమోహ సహసా వీరో ముహూర్తం కపికుంజరః ||62.28||


స|| భగ్నబాహూరుభుజః శోణితోక్షితః విహ్వలః సః వీరః కపికుంజరః సహసా ముహూర్తం ముమోహ ||


||శ్లోకార్థములు||


భగ్నబాహూరుభుజః - విరిగిన బాహువులు భుజములు ఊరువులు కల 

శోణితోక్షితః విహ్వలః - కొట్టబడిన రక్తముతో తడిసిన 

సః వీరః కపికుంజరః - ఆ వీరుడు కపికుంజరుడు

సహసా ముహూర్తం ముమోహ- వెంటనే ఒక క్షణము  మూర్ఛపోయెను


||శ్లోకతాత్పర్యము||      


విరిగిన బాహువులు, భుజములు, ఊరువులు కల, రక్తముతో తడిసిన ఆ వీరుడు కపికుంజరుడు క్షణకాలము మూర్ఛపోయెను. ||62.28||


||శ్లోకము 62.29||


స సమాశ్వాస సహసా సంక్రుద్ధో రాజమాతులః |

వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్ ||62.29||


స|| రాజమాతులః సః సహసా సమాశ్వస్య సంక్రుద్ధః మధుమోహితాన్ వానరాన్ దణ్డేన వారయామాస ||


||శ్లోకార్థములు||


రాజమాతులః సః - 

రాజుయొక్క మేన మామ అయిన దధిముఖుడు 

సహసా సమాశ్వస్య సంక్రుద్ధః - 

వెంటనే తేరుకొని కోపముతో 

మధుమోహితాన్ వానరాన్- 

మధు ప్రియులైన వానరులను 

 దణ్డేన వారయామాస - 

దండముతో నివారించసాగెను.


||శ్లోకతాత్పర్యము||


రాజుయొక్క మేన మామ అయిన దధిముఖుడు, వెంటనే తేరుకొని, కోపముతో ఉగ్రుడై దండముతో వానరులను చెదరగొట్టసాగెను. ||62.29||


||శ్లోకము 62.30||


స కథంచిత్ విముక్తః తైః వానరైర్వానరర్షభః |

ఉవాచైకాంత మాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్ ||62.30||


స|| తైః వానరైః కథంచిత్ విముక్తః సః వానరర్షభః ఏకాన్తం ఆశ్రిత్య సముపాగతాన్ స్వాన్ భృత్యాన్ ఉవాచ ||


||శ్లోకార్థములు||


తైః వానరైః కథంచిత్ విముక్తః- 

ఆ వానరులనుంచి ఎలాగో బయటపడి 

 సః వానరర్షభః ఏకాన్తం ఆశ్రిత్య  - 

ఆ వానర ముఖ్యుడు ఏకాంతప్రదేశము అశ్రయించి

సముపాగతాన్ స్వాన్ భృత్యాన్ ఉవాచ - 

తన అనుచరులతో ఇట్లు చెప్పెను


||శ్లోకతాత్పర్యము||


ఆ వానరులనుంచి ఎలాగో బయటపడి, ఆ వానర ముఖ్యుడు ఏకాంత ప్రదేశములో తన అనుచరులతో ఇట్లు చెప్పెను. ||62.30||


||శ్లోకము 62.31||


ఏతే తిష్ఠంతు గచ్ఛామో భర్తానో యత్ర వానరః |

సుగ్రీవో విపులగ్రీవః సహ రామేణ తిష్ఠతి ||62.31||


స|| ఏతే తిష్ఠన్తు నః భర్తా వానరః విపులగ్రీవః సుగ్రీవః యత్ర రామేణ సహ తిష్ఠతి (తత్ర) గచ్ఛామః || 


||శ్లోకార్థములు||


ఏతే తిష్ఠన్తు - వాళ్ళను అక్కడే ఉండనిద్దాము

 నః భర్తా వానరః విపులగ్రీవః సుగ్రీవః - మనము వానర మహరాజు సుగ్రీవుడు 

యత్ర రామేణ సహ తిష్ఠతి - రామునితో సహా ఎక్కడవుండునో 

(తత్ర) గచ్ఛామః- అచటికి వెళ్ళుదము


||శ్లోకతాత్పర్యము||


’వాళ్ళను అక్కడే ఉండనిద్దాము. మనము వానర మహరాజు సుగ్రీవుడు రామునితో సహా ఎక్కడవుండునో అచటికి వెళ్ళుదము.’ ||62.31||


||శ్లోకము 62.32||


సర్వం చైవాంగదే దోషం శ్రావయిష్యామి  పార్థివే |

అమర్షీ వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్ ||62.32||


స|| అంగదే సర్వం దోషం పార్థివే శ్రావయిష్యామి | వచనం శ్రుత్వా అమర్షివానరాన్ ఘాతయిష్యతి ||


||శ్లోకార్థములు||


అంగదే సర్వం దోషం - అంగదుని  అన్ని దోషములు 

పార్థివే శ్రావయిష్యామి - మహరాజునకి వినిపించెదము

వచనం శ్రుత్వా - ఆ మాటలు విని 

అమర్షివానరాన్ ఘాతయిష్యతి - మహారాజు ఆ వానరులను దండించును


||శ్లోకతాత్పర్యము||


’అంగదుని  దోషములు అన్ని మహరాజునకు వినిపించెదము. ఆ మాటలు విని మహారాజు ఆ వానరులను దండించును’. ||62.32||


||శ్లోకము 62.33||


ఇష్టం మధువనం హ్యేతత్ సుగ్రీవస్య మహాత్మనః |

పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదమ్ ||62.33||


స|| పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదమ్ ఏతత్ మధువనం మహాత్మనః పార్థివస్య  హి ||


||శ్లోకార్థములు||


పితృపైతామహం దివ్యం - పితృపైతామహుల దివ్యమైన 

 దేవైరపి దురాసదమ్ - దేవతలకు సైతము అందుబాటులో లేని 

ఏతత్ మధువనం - ఈ మధువనము 

మహాత్మనః పార్థివస్య  హి - మహాత్ముడైన మహరాజుది కదా


||శ్లోకతాత్పర్యము||


’పితృపైతామహుల దివ్యమైన మధువనము దేవతలకు సైతము అందుబాటులో లేని ఆ మధువనము మహాత్ముడైన మహరాజుది’. ||62.33||


||శ్లోకము 62.34||


స వానరన్ ఇమాన్ సర్వాన్ మధులుభ్దాన్ గతాయుషః |

ఘాతయిష్యంతి దండేన సుగ్రీవః ససుహృజ్జనాన్ ||62.34||


స|| సః సుగ్రీవః మధులుబ్ధాన్ గతాయుషః స సుహృత్‍జ్జనాన్ ఇమాన్ సర్వాన్ వానరాన్ ఘాతయిష్యతి ||


||శ్లోకార్థములు||


సః సుగ్రీవః - ఆ సుగ్రీవుడు 

మధులుబ్ధాన్ గతాయుషః- దురాశకలిగిన అయుస్సు మూడి

 స సుహృత్‍జ్జనాన్ - వారి మిత్రులకు 

ఇమాన్ సర్వాన్ వానరాన్ - ఈ వానరులకు అందరికీ

 ఘాతయిష్యతి - దండనము విధించును


||శ్లోకతాత్పర్యము||


’ఆ సుగ్రీవుడు, మధువుమీద దురాశకలిగిన, అయుస్సు మూడిన వానరులకు, వారి మిత్రులు అందరికి  దండన విధించును.’ ||62.34||


||శ్లోకము 62.35||


వధ్యా హ్యేతే దురాత్మనో నృపజ్ఞా పరిభావినః |

అమర్ష ప్రభవో రోషః సఫలో నో భవిష్యతి ||62.35||


స|| ఏతే దురాత్మనః నృపజ్ఞాపరిభావినః వధ్యాః  హి | అమర్షప్రభవః నః రోషః సఫలః భవిష్యతి||


గోవిన్దరాజ టీకాలో - అమర్షప్రభవః అక్షమాజన్యః |


||శ్లోకార్థములు||


ఏతే దురాత్మనః - ఈ దురాత్ములు 

నృపజ్ఞాపరిభావినః వధ్యాః  హి   - 

నృపాజ్ఞని ఉల్లంఘించినవారు వధార్హులే

అమర్షప్రభవః - సహించలేని

నః రోషః సఫలః భవిష్యతి - 

మన రోషమునకు సఫలము కూరును


||శ్లోకతాత్పర్యము||


’ఈ దురాత్ములు నృపాజ్ఞని ఉల్లంఘించినవారు వధార్హులే. సహించలేని మన రోషమునకు సఫలము కూరును’. ||62.35||


||శ్లోకము 62.36||


ఏవముక్త్వా దధిముకో వనపాలాన్ మహాబలః |

జగామ సహసోత్పత్య వనపాలైః సమన్వితః ||62.36||


స|| మహాబలః దధిముఖః  వనపాలాన్ ఏవం ఉక్త్వా సహసా వనపాలైః సమన్వితః ఉత్పత్య జగామ||


||శ్లోకార్థములు||


మహాబలః దధిముఖః  - మహబలుడైన దధిముఖుడు 

వనపాలాన్ ఏవం ఉక్త్వా - వలపాలకులకు ఈ విధముగా చెప్పి 

సహసా వనపాలైః సమన్వితః - వెంటనే వనపాలకులతో కూడి 

ఉత్పత్య జగామ - అకాశములోకి ఎగిరి వెళ్ళెను


||శ్లోకతాత్పర్యము||


మహబలుడైన దధిముఖుడు వలపాలకులకు ఈ విధముగా చెప్పి వెంటనే వనపాలకులతో కూడి అకాశములోకి ఎగిరి వెళ్ళెను.  ||62.36||


||శ్లోకము 62.37||


నిమిషాంతరమాత్రేణ సహి ప్రాప్తో వనాలయః |

సహస్రాంశుసుతో ధీమాన్ సుగ్రీవో యత్ర వానరః ||62.37||


స|| సః వనాలయః సహస్రాంశు సుతః ధీమాన్ సుగ్రీవః వానరః యత్ర (తత్ర) నిమిషాన్తరమాత్రేణ ప్రాప్తః |


||శ్లోకార్థములు||


సః వనాలయః - ఆ వనాలయుడు

సహస్రాంశు సుతః ధీమాన్ సుగ్రీవః వానరః- 

సహస్రాక్షుని పుత్రుడు ధీమంతుడైన వానరుడు సుగ్రీవుడు

యత్ర (తత్ర) నిమిషాన్తరమాత్రేణ ప్రాప్తః - 

ఎక్కడ వుండెనో అక్కడికి ఒక నిమిషమాత్రములో చేరెను


||శ్లోకతాత్పర్యము||


ఒక నిమిషమాత్రములో, ఆ సహస్రకిరణములు గల వాని పుత్రుడు ధీమంతుడు అగు సుగ్రీవుని వద్దకు చేరెను. ||62.37||


||శ్లోకము 62.38||


రామం చ లక్ష్మణం చైవ దృష్ట్వా సుగ్రీవ మేవ చ |

సమప్రతిష్ఠాం జగతీం ఆకాశాన్ నిపపాత హ ||62.38||


స|| రామం చ లక్ష్మణం చ ఏవ సుగ్రీవం ఏవ చ దృష్ట్వా ఆకాశాత్ సమప్రతిష్ఠాం జగతీం నిపపాత||


||శ్లోకార్థములు||


రామం చ లక్ష్మణం చ ఏవ  - రాముని లక్ష్మణులను  

సుగ్రీవం ఏవ చ దృష్ట్వా - సుగ్రీవుని కూడా చూచి 

ఆకాశాత్ సమప్రతిష్ఠాం - ఆకాశములో నుంచి  సమతలమైన 

జగతీం నిపపాత- ప్రదేశములో దిగెను


||శ్లోకతాత్పర్యము||


రాముని లక్ష్మణుని సుగ్రీవులను చూచి ఆకాశములో నుంచి  సమతల ప్రదేశములో దిగెను. ||62.38|| 


||శ్లోకము 62.39,40||


సన్నిపత్య మహావీర్యః సర్వైః తైః పరివారితః |

హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః ||62.39||

స దీనవదనో భూత్వా కృత్వా శిరసి చాంజలిమ్ |

సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్యపీడయత్ ||62.40|| 


స|| సర్వైః తైః పాలైః పరివారితః పాలానామ్ పరమేశ్వరః హరిః మహావీర్యః దధిముఖః దీనవదనః శిరసి అంజలిమ్  కృత్వా  సన్నిపత్య సుగ్రీవస్య శుభే చరణౌ మూర్ధ్నా ప్రత్యపీడయత్ ||


||శ్లోకార్థములు||


సర్వైః తైః పాలైః పరివారితః - ఆ ఆందరి వనపాలకులతో కలిసి 

పాలానామ్ పరమేశ్వరః - వనపాలకుల అధిపతి 

హరిః మహావీర్యః దధిముఖః - 

వానరుడు మహాబలవంతుడు అయిన  దధిముఖుని 

దీనవదనః శిరసి అంజలిమ్  కృత్వా - 

దీనవదనముతో శిరస్సుతో అంజలి ఘటించి

సన్నిపత్య సుగ్రీవస్యశుభే చరణౌ - 

సుగ్రీవుని సమీపించి అతని శుభ చరణములపై 

మూర్ధ్నా ప్రత్యపీడయత్ - తన తలను పెట్టెను


||శ్లోకతాత్పర్యము||


ఆ ఆందరి వనపాలకులతో కలిసి, ఆ వనపాలకుల అధిపతి మహాబలవంతుడు అయిన  దధిముఖుడు, దీనవదనముతో శిరస్సుతో అంజలి ఘటించి, సుగ్రీవుని సమీపించి అతని శుభ చరణములపై తన తలను పెట్టెను. ||62.39,40||


అలా దధిముఖుడు మధువనము ధ్వంశము చేయబడినది అని వారాధీశుడు సుగ్రివునితో చెప్పడానికి , రామ లక్ష్మణులతో, సుగ్రీవుడున్న ప్రదేశానికి చేరతాడు.ఈ శ్లోకముతో అరువది రెండవ సర్గ సమాప్తము అవుతుంది.

 

సుందరకాండలో రెండువనములు  అశోక వనము  మధువనము  ధ్వంశము చేయబడతాయి. ఈ రెండు వనముల ధ్వంశములో ఇంకో ధ్వని వస్తుంది అంటారు అప్పలాచార్యులవారు. అది జీవాత్మ పరమాత్మల కలయిక మీద.


జీవులు పాపఫలములు పుణ్యఫలముల వలయములో వుంటారు. పుణ్యఫలములు చేసినవారు స్వర్గలోకము వెళ్ళి , ఆ పుణ్యఫలములు క్షీణించేవరకు  సర్గలోకములో భోగములు అనుభవించి  ,మళ్ళీ  మనుష్య లోకములో జన్మించి పాపఫలములను అంటే పాపములకు తగిన దుఃఖములను భూలోకములో అనుభవించి, పాపపుణ్యములను రెండింటినీ అధిగమించి,  జీవాత్మ పరమాత్మల కలయిక పొందేగాకా అంటే జన్మరాహిత్యము పొందేదాక పాపపుణ్యముల జరామరణ వలయములో చిక్కుకు పోతారు. 


పాపపుణ్యములు రెండింటినీ నాశనము చేయటమే ఈ రెండు వనముల ధ్వంశము సూచిస్తుంది అంటారు అప్పలాచార్యులవారు. 


ఈ రెండూ సముద్రానికి దక్షిణ ఉత్తర తీరములలో ఉన్నాయి. రెండూ భోగ స్థానములే. ఈ లోకములో అనుభవించే సుఖములు లంకలో కనిపిస్తాయి. శరీరమును పొంది ఆ కామక్రోధములతో కూడిన  సుఖములను అనుభవించుట పాప ఫలము. స్వర్గాది లోకములలో భోగములను అనుభవించుట పుణ్య ఫలము. ఈ రెండిటినీ ధ్వంశము చేశినపుడే భగవత్ సాన్నిధ్యము కలుగుతుంది.


ఇక్కడ రెండు వనములను ధ్వంశము చేసి, హనుమ రాముని చేరుట , పుణ్యపాపములను రెండింటిని ధ్వంశము చేసి భగవంతుని పొందుటను సూచిస్తుంది అని.


ఈ మాటతో శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది రెండవ సర్గ సమాప్తము.  


 ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే 

చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్

శ్రీమత్సుందరకాండే ద్విషష్టితమస్సర్గః ||


||ఓమ్ తత్ సత్||