||సుందరకాండ ||

|| అరవై నాలుగవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో ||

|| Sarga 64 || with Slokas and meanings in Telugu

                                         

||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ  శ్లోకార్థ తత్త్వదీపికా సహిత

 చతుష్షష్టితమస్సర్గః||


- ’నియతాం అక్షతామ్ దేవీం’ -


’నియతాం అక్షతామ్ దేవీం’, ఇది ఈ సర్గలో ముఖ్యమైన మాట.  ’నియతాం’, అంటే నియమబద్ధురాలైన, అంటే తన శీలము కాపాడుకున్న అని. ’అక్షతామ్’, అంటే క్షీణించకుండా క్షేమముగా వున్నఅని. అంటే సీతమ్మ తన శీలముతో క్షేమముగా వున్నది అన్నమాట. 


ఇది హనుమ మాట. రాములవారికి చెప్పిన మాట. హనుమ ఆ మూడు మాటలలో అతి ముఖ్యమైన మాట చెపుతాడు. జీవిస్తున్న సీతను చూచాను అంటే, ఆ సీత రాముని కొఱకే వుందా , లేదా అన్నమాట గురించి మళ్ళీ విశదీకరించాలి. పతివ్రత అయిన సీతను చూశాను అంటే అమె జీవిస్తోంది అని ధ్వని వుంది. కాని హనుమ చెప్పిన మాట సందేహానికి తావు లేకుండా చెప్పిన మాట.


అదే ఈ సర్గలో ముఖ్యమైన మాట.  నిజానికి అది ఈ సర్గలోనే కాదు సుందరకాండలోనే ముఖ్యమైన మాట.


’తతో రావణ నీతాయాః’, అంటూ సీతాన్వేషణ కి హనుమ బయలుదేరినప్పుటినుంచి  రామలక్ష్మణ సుగ్రీవులతో సహ అందరూ వేచి వున్నది ఈ మాట కొఱకే. హనుమ ఈ మాట రాములవారికి చెప్పి తన జన్మ సార్ధకము చేసుకున్నాడు. ఆ హనుమ చెప్పిన మాట, ’అమృతోపమం’, అంటే అమృతముతో సమానమైన మాట. ఈ మాట విన్న రామలక్ష్మణులు సంతోషము గురించి ఇలా వింటాము. ’బహుమానేన మహతా హనుమంత మవైక్షతా’, రాములవారు హనుమంతుని ఆదరభావముతో నిండిన కళ్ళతో చూశాడుట.


ఇంకో మాట.


హనుమ వానరులకు లంకలో జరిగినది చెప్పేముందు, సీత వుండే దిశలో నమస్కరించి మరీ మొదలెడతాడు. అలాగ సుందరకాండ పారాయణచేసేవారు ఈ పాదము అంటే, ’నియతాం ఆక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్’, అని చదివినప్పుడు, ఒక్కమారు మనస్సులో నైనా, ప్రత్యక్షముగా నైనా పరమాత్ముడికి నమస్కారము చెప్పుకుంటారు. ఇది ఒక ముఖ్యమైన మాట.


ఇక అరవై నాలుగొవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో. 


||శ్లోకము 64.01||


సుగ్రీవైణేవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః |

రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాఽభ్యవాదయత్ ||64.01||


స||  హృష్ఠః సుగ్రీవేణ ఏవం ఉక్తః తు దధిముఖః రాఘవం లక్ష్మణం చ సుగ్రీవం  అభ్యవాదయత్ ||


||శ్లోకార్థములు||


హృష్ఠః సుగ్రీవేణ - 

ఆనంద భరితుడైన సుగ్రీవునిచే

ఏవం ఉక్తః తు దధిముఖః - 

ఆ విధముగా  చెప్ప బడిన దధిముఖుడు

 రాఘవం లక్ష్మణం చ సుగ్రీవం - 

రాముడు లక్ష్మణుడు అలాగే సుగ్రీవునకు 

 అభ్యవాదయత్ - అభివాదము చేసెను. 


||శ్లోకతాత్పర్యము||


ఆ విధముగా ఆనంద భరితుడైన, సుగ్రీవునిచే చెప్ప బడిన దధిముఖుడు,  రాముడు లక్ష్మణుడు అలాగే సుగ్రీవునకు అభివాదము చేసెను. ||64.01||


||శ్లోకము 64.02||


స ప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ |

వానరైస్సహితైః శూరైః దివమేవోత్పపాత హ ||64.02||


స|| సః మహాబలౌ రాఘవౌ సుగ్రీవం చ ప్రణమ్య శూరైః వానరైః సహితః దివమేవ ఉత్పపాత|| ||శ్లోకార్థములు||


సః మహాబలౌ రాఘవౌ సుగ్రీవం చ - 

అతడు రామలక్ష్మణులకు సుగ్రీవునకు రామలక్ష్మణులకు సుగ్రీవునకు 

ప్రణమ్య -  ప్రణమిల్లి 

శూరైః వానరైః సహితః - వానర శూరులతో కూడి

దివమేవ ఉత్పపాత -అకాశములోకి ఎగిరెను


||శ్లోకతాత్పర్యము||


ఆ దధిముఖుడు రామలక్ష్మణులకు సుగ్రీవునకు ప్రణమిల్లి తన సహచరులగు ఇతర వానరులతో కలిసి అకాశములోకి ఎగిరెను. ||64.02||


||శ్లోకము 64.03||


స యథైవాఽగతః పూర్వం తథైవ త్వరితం గతః |

నిపత్య గగనాద్భూమౌ తద్వనం ప్రవివేశ హ ||64.03||


స|| సః పూర్వం యథా ఆగతః తథైవ త్వరితం గతః గగనాత్ భూమౌ నిపత్య తత్ వనం ప్రవివేశ హ || 


|శ్లోకార్థములు||


సః పూర్వం యథా ఆగతః - 

అప్పుడు అతడు పూర్వము ఏ విధముగా వచ్చెనో 

తథైవ త్వరితం గతః - ఆ విధముగనే త్వరగా వెళ్ళి

గగనాత్ భూమౌ నిపత్య - ఆకాశమునుండి భూమి మీద దిగి 

తత్ వనం ప్రవివేశ హ  - ఆ మధువనమును ప్రవేశించెను.


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు అతడు పూర్వము ఏవిధముగా వచ్చెనో ఆ విధముగనే త్వరగా వెళ్ళి ఆకాశమునుండి భూమి మీద దిగి ఆ మధువనమును ప్రవేశించెను. ||64.03||


||శ్లోకము 64.04||


స ప్రవిష్టో మధువనం దదర్శ హరియూథపాన్ |

విమదాన్ ఉత్థితాన్ సర్వాన్ మేహమానాన్ మధూదకమ్ ||64.04||


స|| సః మధువనం ప్రవిష్టః విమదాన్ మధూదకం మేహమానాన్ ఉత్థితాన్ సర్వాన్ హరియూథపాన్ దదర్శ||


||శ్లోకార్థములు||


సః మధువనం ప్రవిష్టః - 

అతడు మధువనము ప్రవేశించి 

విమదాన్ మధూదకం మేహమానాన్ -

మత్తుతొలగి మధూదకము పోగా - 

ఉత్థితాన్ సర్వాన్ హరియూథపాన్ - 

లేచివున్నవానర గణములను 

 దదర్శ- చూచెను


||శ్లోకతాత్పర్యము||


అతడు మధువనము ప్రవేశించి మత్తుతొలగి మధూదకము పోగా లేచివున్నవానర గణములను చూచెను. ||64.04||


||శ్లోకము 64.05||


స తానుపాగమద్వీరో బద్ద్వా కరపుటాంజలిమ్ |

ఉవాచ వచనం శ్ల‍‍క్ష్‍ణ మిదం హృష్టవదంగదమ్ ||64.05||


స|| సః ఉపాగమత్ వీరః అంగదం కరపుటాంజలిమ్ బద్ధ్వా హృష్టవత్  ఇదం శ్ల‍క్ష‍ణం వచనం ఉవాచ|| 


||శ్లోకార్థములు||


సః హృష్టవత్ ఉపాగమత్ - 

అతడు సంతోషముగా తిరిగివచ్చినవాడై 

వీరః అంగదం కరపుటాంజలిమ్ బద్ధ్వా- 

వీరుడైన అంగదునకు చేతులు జోడించి 

ఇదం శ్ల‍క్ష‍ణం వచనం ఉవాచ - 

మృదువైన మాటలతో ఇట్లు పలికెను


||శ్లోకతాత్పర్యము||


అతడు తిరిగివచ్చినవాడై వీరుడైన అంగదునకు చేతులు జోడించి  మృదువైన మాటలతో ఇట్లు పలికెను. ||64.05||


||శ్లోకము 64.06||


సౌమ్యరోషో న కర్తవ్యో యదేతత్పరివారితం |

అజ్ఞానాద్రక్షిభిః క్రోధాత్ భవంతః ప్రతిషేధితాః ||64.06||


స|| సౌమ్య భవన్తః రోషః న కర్తవ్యః | ఏతత్ యత్ పరివారితం రక్షిభిః అజ్ఞానాత్ క్రోధాత్ ప్రతిషేధితాః |


రామ టీకాలో - హే సౌమ్య అజ్ఞానాత్ భవత్ సంపాదిత కార్య విషయక జ్ఞాన అభావాత్ రక్షిభిః భవన్తః ప్రతిషేధితాః  అతః యదేభిః పరివారణమ్ ఏతత్కరణకనివారణం తత్ సంస్మృత్య ఇతి శేషః రోషో న కర్తవ్యః | 


||శ్లోకార్థములు||


సౌమ్య భవన్తః రోషః న కర్తవ్యః - 

ఓ సౌమ్యుడా నీకు రోషము వలదు

 ఏతత్ యత్ పరివారితం రక్షిభిః - 

రక్షకులచేత  జరిగిన అడ్డగించబడడము

అజ్ఞానాత్ క్రోధాత్ ప్రతిషేధితాః - 

ఆజ్ఞానము వలన, క్రోధము వలన అడ్దగించబడడమైనది


||శ్లోకతాత్పర్యము||


'ఓ సౌమ్యుడా నీకు రోషము వలదు. రక్షకులచేత అడ్డగించబడడము ఆజ్ఞానము వలన, క్రోధము వలన జరిగినది'. ||64.06||


||శ్లోకము 64.07||


యువరాజః త్వమీశశ్చ వనస్యాస్య మహాబలః |

మౌర్ఖాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హతి ||64.07||


స|| మహాబలః త్వం యువరాజః అస్య వనస్య ఈశశ్చ | మౌర్ఖాత్ పూర్వం కృతం దోషః భవాన్ క్షంతుం అర్హతి||


తిలక టీకాలో - యథా సుగ్రీవః హరిగణేశ్వరః త్వమపి హరి గణానాం ఈశ్వరః ఇత్యర్థః|


|శ్లోకార్థములు||


మహాబలః త్వం యువరాజః -

 ఓ మహాబలుడా నీవు యువరాజువు

అస్య వనస్య ఈశశ్చ - ఈ వనమునకు అధిపతివి

మౌర్ఖాత్ పూర్వం కృతం దోషః- 

మూర్ఖత్వముతో పూర్వము చేసిన దోషమును 

 భవాన్ క్షంతుం అర్హతి - 

క్షమించుటకు నీవు తగినవాడవు


||శ్లోకతాత్పర్యము||


’ఓ మహాబలము కలవాడా నీవు యువరాజువు. ఈ వనమునకు అధిపతివి. మూర్ఖత్వముతో పూర్వము చేసిన దోషమును క్షమించుటకు నీవే తగినవాడవు.’ ||64.07||


||శ్లోకము 64.08||


అఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ |

ఇహోపయాతం సర్వేషాం ఏతేషాం వనచారిణామ్ ||64.08||


స|| అనఘా !  మయా గత్వా  తవ పితృవ్యస్య సర్వేషాం ఏతేషాం వనచారిణం ఇహ ఉపాయాతం అఖ్యాతమ్ హి ||


||శ్లోకార్థములు||


అనఘా   మయా గత్వా  - ఓ అనఘా, నేను వెళ్ళి 

తవ పితృవ్యస్య - నీ పినతండ్రికి 

సర్వేషాం ఏతేషాం వనచారిణం - ఈ వానరులందరూ 

ఇహ ఉపాయాతం అఖ్యాతమ్ హి - ఇక్కడికి వచ్చితిరని చెప్పితిని


||శ్లోకతాత్పర్యము||


'ఓ అనఘా ! నేను వెళ్ళి నీ పినతండ్రికి ఈ వానరులందరూ ఇక్కడికి వచ్చితిరని చెప్పితిని.' ||64.08|| 


||శ్లోకము 64.09||


స త్వ దాగమనం శ్రుత్వా సహైభిర్హరియూధపైః |

ప్రహృష్టో నతు రుష్టోఽసౌ వనం శ్రుత్వా ప్రధర్షితమ్ ||64.09||

ప్రహృష్టో మాం పితృవ్యస్తే  సుగ్రీవో వానరేశ్వరః |


స|| సః త్వత్ ఆగమనం శ్రుత్వా ప్రహృష్టః | తే పితృవ్యః వానరేశ్వరః సుగ్రీవః  అసౌ వనం ప్రధర్షితం శ్రుత్వా న తు రుష్టః|| 


||శ్లోకార్థములు||


సః త్వత్ ఆగమనం శ్రుత్వా ప్రహృష్టః - 

అతడు మీఆగమనము విని సంతోషభరితుడాయెను. 

 తే పితృవ్యః వానరేశ్వరః సుగ్రీవః - 

నీ పినతండ్రి వానరేశ్వరుడు అగు సుగ్రీవుడు

 అసౌ వనం ప్రధర్షితం శ్రుత్వా - 

ఈ వనము ధ్వంసము అయినది అని విని

న తు రుష్టః - కోపగించుకోలేదు


||శ్లోకతాత్పర్యము||


’అతడు మీ ఆగమనము విని సంతోషభరితుడాయెను. నీ పినతండ్రి వానరేశ్వరుడు అగు సుగ్రీవుడు ఈ వనము ధ్వంసము అయినది అని విని కోపగించుకోలేదు.’ 


||శ్లోకము 64.10||


శీఘ్రం ప్రేషయ సర్వాం తాన్ ఇతి హోవాచ పార్థివః ||64.10||


స|| తాన్ సర్వాం శీఘ్రం ప్రేషయ ఇతి పార్థివః మాం ఉవాచ||


||శ్లోకార్థములు||


తాన్ సర్వాం శీఘ్రం ప్రేషయ ఇతి - 

వారిని అందరినీ శీఘ్రముగా అక్కడికి పంపమని 

పార్థివః మాం ఉవాచ - రాజు నాతో  చెప్పెను.


||శ్లోకతాత్పర్యము||


’ మీ అందరినీ శీఘ్రముగా అక్కడికి పంపమని ఆ రాజు నాతో  చెప్పెను.’ ||64.10||


||శ్లోకము 64.11||


శ్రుత్వా దధిముఖస్యేదం  వచనం శ్ల‌క్ష‍ణమఙ్గదః |

అబ్రవీత్తాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్య విశారదః ||64.11||


స|| దధిముఖస్య ఇదం శ్లక్షణం వచనం శ్రుత్వా అంగదః వాక్య విశారదః  హరిశ్రేష్టః  తాన్ అబ్రవీత్ ||


||శ్లోకార్థములు||


దధిముఖస్య ఇదం - దధిముఖుని ఈ 

 శ్లక్షణం వచనం శ్రుత్వా - 

నమ్రతతో పలుకబడిన మాటలను విని

అంగదః వాక్య విశారదః  హరిశ్రేష్టః - 

వాక్య విశారదుడైన  వానరశేష్ఠుడు అగు అంగదుడు 

 తాన్ అబ్రవీత్ - ఇతర వానరులతో ఇట్లు పలికెను


||శ్లోకతాత్పర్యము||


దధిముఖుని ఈ నమ్రతతో పలుకబడిన మాటలను విని, వాక్య విశారదుడైన  వానరశేష్ఠుడు అగు అంగదుడు ఇతర వానరులతో ఇట్లు పలికెను. ||64.11||


||శ్లోకము 64.12||


శంకేశ్రుతోఽయం వృత్తాంతో రామేణ హరియుథపాః |

తత్ క్షణం నేహ న స్థ్సాతుం కృతే కార్యే పరంతపాః ||64.12||


స|| పరంతపాః హరియూథపాః అయం వృత్తాంతః రామేణ శ్రుతః శంకే | తత్ కార్యే కృతే ఇహ స్థాతుం నః న క్షమమ్||


గోవిన్దరాజ టీకాలో- శఙ్క ఇతి | అయం వృత్తాంతః అస్మద్ ఆగమనవృత్తాన్తః రామేణ శ్రుతః |||శ్లోకార్థములు||


పరంతపాః హరియూథపాః -

శత్రువులను తపింపచేయువారా, వానర వీరులారా 

అయం వృత్తాంతః రామేణ శ్రుతః శంకే - 

ఈ వృత్తాంతము అంతా రామునిచే వినబడెను అని అనుకుంటాను .

శంకే తత్ కార్యే కృతే - ఆ కార్యము చేసిన పిమ్మట

ఇహ స్థాతుం నః న క్షమమ్ - 

ఇక్కడ వుండడము తగినది కాదు


||శ్లోకతాత్పర్యము||


’శత్రువులను తపింపచేయువారా, వానర వీరులారా ! ఈ వృత్తాంతము అంతా రామునిచే వినబడెను అని అనుకుంటాను. ఆ కార్యము చేసి ఇక్కడ వుండిపోవడము తగినది కాదు’.||64.12||


||శ్లోకము 64.13||


పీత్వా మధు యథాకామం విశ్రాంతా వనచారిణః |

కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః ||64.13||


స||వనచారిణః యథాకామం మధు పీత్వా విశ్రాన్తాః కిం శేషం | మే గురు  సుగ్రీవః యత్ర తత్ర గమనమ్||


గోవిన్దరాజ టీకాలో- కిం శేషం , న కించిదపి శిష్టం ఇత్యర్థః | కింతు మే గురుః యత్ర వర్తతే తత్ర గమనమేవ శేషం ఇత్యర్థః|


||శ్లోకార్థములు||


వనచారిణః యథాకామం మధు పీత్వా-

 ఓ వనచరులారా ! కావలిసినట్లు మధువును తాగి 

 విశ్రాన్తాః కిం శేషం  - 

విశ్రాంతి తీసు కొనిన మనకి మిగిలినది కార్యము  ఏమి?

మే గురు  సుగ్రీవః యత్ర - 

నాగురువు సుగ్రీవుడు ఎక్కడవుండునో 

తత్ర గమనమ్ - అక్కడికి పోయెదము


||శ్లోకతాత్పర్యము||


’ఓ వనచరులారా ! కావలిసినట్లు మధువును తాగి విశ్రాంతి తీసు కొనిన మనకు, మిగిలిన కార్యము  ఏమి? నాగురువు సుగ్రీవుడు ఎక్కడవుండునో అక్కడికి పోయెదము’. ||64.13||


||శ్లోకము 64.14||


సర్వే యథా మాం వక్ష్యంతే సమేత్య హరియూథపాః |

తథాఽస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహమ్ ||64.14||


స|| సర్వే హరియూథపః సమేత్య మామ్ యథా వక్ష్యన్తి తథా కర్తా అస్మి కర్తవ్యే అహం భవద్భిః పరవాన్||


||శ్లోకార్థములు||


సర్వే హరియూథపః సమేత్య - వానరయోధులందరూ కలిసి 

మామ్ యథా వక్ష్యన్తి - నాకు ఏమి చెప్పెదరో 

తథా కర్తా అస్మి కర్తవ్యే - ఆ విధముగానే  చేసెదను

అహం భవద్భిః పరవాన్ - నేను మీ అధీనములో ఉన్నవాడిని


||శ్లోకతాత్పర్యము||


’వానరయోధులందరూ కలిసి మనకర్తవ్యము గురించి నాకు ఏమి చెప్పెదరో నేను ఆవిధముగా చేసెదను. నేను మీ అధీనములో ఉన్నవాడిని’. ||64.14||


||శ్లోకము 64.15||


నాజ్ఞాపయితు మీశోఽహం యువరాజోఽస్మి యద్యపి |

అయుక్తం కృతకర్మాణో యూయం ధర్షయితుం మయా ||64.15||


స|| అహం యువరాజః అస్మి | యద్యపి కృతకర్మానః ఆజ్ఞాపయితుం న ఈశః | యుయం మయా ధర్షయితుం అయుక్తం||


||శ్లోకార్థములు||


అహం యువరాజః అస్మి  - నేను యువరాజునే

యద్యపి కృతకర్మానః ఆజ్ఞాపయితుం న ఈశః  - 

కాని కృతకృత్యులైన మిమ్మలను ఆజ్ఞాపించుటకు తగినవాడను కాను

యుయం మయా ధర్షయితుం అయుక్తం - 

నాచేత మీరు అజ్ఞాపించబడుట యుక్తము కాదు


||శ్లోకతాత్పర్యము||


’నేను యువరాజునే. కాని కృతకృత్యులైన మిమ్మలను ఆజ్ఞాపించుటకు తగినవాడను కాను. నాచేత మీరు అజ్ఞాపించబడుట యుక్తము కాదు’. ||64.15||  


||శ్లోకము 64.16||


బ్రువతశ్చాంగదస్యైవం శ్రుత్వా వచనమవ్యయమ్ |

ప్రహృష్టో మనసో వాక్యమిదమూచుర్వనౌకసః ||64.16||


స||  వనౌకసః ఏవం బ్రువతః  అంగదస్య ఏవం అవ్యయం వచనం శ్రుత్వా , ప్రహృష్ట మనసః వాక్యం ఇదం ఊచుః|| 


||శ్లోకార్థములు||


వనౌకసః ఏవం బ్రువతః  - 

వానరులు ఈ విధముగా చెప్పబడి

అంగదస్య ఏవం అవ్యయం వచనం శ్రుత్వా - 

అంగదుని  అవ్యయమైన మాటలను విని 

ప్రహృష్ట మనసః - సంతోషమైన మనస్సు కలవారై 

వాక్యం ఇదం ఊచుః - 

ఈ మాటలు పలికిరి


||శ్లోకతాత్పర్యము||


ఈ విధముగా చెప్పబడిన అంగదుని  అవ్యయమైన మాటలను విని ఆ వానరులందరూ సంతోషపడినవారై ఈ వాక్యములను చెప్పితిరి. ||64.16||


||శ్లోకము 64.17||


ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుః సన్ వానరర్షభ |

ఐశ్వర్యమదమత్తో హి సర్వోఽహమితి మన్యతే ||64.17||


స||  వానరరర్షభ రాజన్ ఏవం కః వక్ష్యతి | ప్రభుః ఇశ్వర్య మదమత్తో హి సర్వః అహం ఇతి మన్యతే |

 

||శ్లోకార్థములు||


 వానరరర్షభ రాజన్- 

ఓ వానరోత్తమా! రాజా 

 ఏవం కః వక్ష్యతి  - 

ఇటువంటి మాటలు ఎవరు చెప్పెదరు?

ప్రభుః ఇశ్వర్య మదమత్తో హి- 

ప్రభువులు ఐశ్వర్య మదమత్తముతో కూడిన వారు కదా

 సర్వః అహం ఇతి మన్యతే - 

సర్వము తామే అని భావిస్తారు


||శ్లోకతాత్పర్యము||


" ఓ వానరోత్తమా! రాజా !  ఇటువంటి మాటలు ఎవరు చెప్పెదరు? ప్రభువులు ఐశ్వర్య మదమత్తముతో సర్వము తామే అని భావిస్తారు". ||64.17||


||శ్లోకము 64.18||


తవ చేదం సుసదృశం వాక్యం నాన్యస్య కస్యచిత్ |

సన్నతిర్హి తవాఖ్యాతి భవిష్యత్ శుభయోగ్యతామ్ ||64.18||


స|| ఇదం వాక్యం సుసదృశం అన్యస్య కస్యచిత్ న | తవ సన్నతిః భవిష్యత్ శుభ యోగ్యతామ్ ఆఖ్యాతి ||


||శ్లోకార్థములు||


ఇదం వాక్యం సుసదృశం - 

ఈ వాక్యములు నీకే తగును 

అన్యస్య కస్యచిత్ న - 

ఇంకెవరూ ఇలా చెప్పలేరు

తవ సన్నతిః - నీ నమ్రత 

భవిష్యత్ శుభ యోగ్యతామ్ ఆఖ్యాతి - 

భవిష్యత్తులో కలుగు శుభయోగమును సూచించున్నవి


||శ్లోకతాత్పర్యము||


’ఈ వాక్యములు నీకే తగును , ఇంకెవరూ ఇలా చెప్పలేరు. నీ నమ్రత  భవిష్యత్తులో కలుగు శుభయోగమును సూచించున్నవి.' ||64.18||


||శ్లోకము 64.19||


సర్వే వయమపి ప్రాప్తాః తత్ర గంతుం కృతక్షణాః |

స యత్ర హరివీరాణాం సుగ్రీవః పతిరవ్యయః ||64.19||


స|| సర్వే వయం అపి ప్రాప్తాః యత్ర హరవీరాణాం అవ్యయః పతిః సుగ్రీవః తత్ర గంతుం కృతక్షణాః ||


||శ్లోకార్థములు||


సర్వే వయం అపి ప్రాప్తాః - 

మేము అందరము  కూడా

యత్ర హరవీరాణాం అవ్యయః పతిః సుగ్రీవః - 

ఎక్కడ వానరుల అవ్యయమైన అధిపతి సుగ్రీవుడు  ( వున్నాడో)

తత్ర గంతుం కృతక్షణాః  - 

అచటికి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాము


||శ్లోకతాత్పర్యము||


'మేము అందరము వానరుల అవ్యయమైన అధిపతి సుగ్రీవుడు వున్న చోటుకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాము'. ||64.19||


||శ్లోకము 64.20||


త్వయా హ్యనుక్తైః  హరిభిర్నైవ శక్యం పదాత్పదమ్ |

క్వచిత్ గంతుం హరిశ్రేష్ఠ బ్రూమః సత్యమిదం తు తే ||64.20||


స|| హరిశ్రేష్ఠ త్వయా అనుక్తైః హరిభిః పదాత్ పదం క్వచిత్ గన్తుం న శక్యం | సత్యం ఇదం తే బ్రూమః||


||శ్లోకార్థములు||


హరిశ్రేష్ఠ త్వయా అనుక్తైః - 

ఓ వానరోత్తమా నీచేత ఆదేశించ బడకుండా 

హరిభిః పదాత్ పదం క్వచిత్ గన్తుం న శక్యం - 

వానరులకు  ఒక్క అడుగుకూడా ముందుకు వేయుటకు శక్యము కాదు

 సత్యం ఇదం తే బ్రూమః-

 నీకు సత్యముగా చెప్పుచున్నాము


||శ్లోకతాత్పర్యము||


'ఓ వానరోత్తమా నీచేత ఆదేశించ బడకుండా ఈ వానరులకు ఒక్క అడుగుకూడా ముందుకు వేయుటకు శక్యము కాదు. నీకు సత్యముగా చెప్పుచున్నాము'. ||64.20||


||శ్లోకము 64.21||


ఏవం తు వదతామ్ శేషాం అఙ్గదః ప్రత్యువాచ హ |

బాఢం గచ్చామ ఇత్యుక్తా ఖం ఉత్పేతుర్మహాబలాః ||64.21||


స|| తేషామ్ ఇదం వదతాం అంగదః బాడం గచ్ఛామ (ఇతి) ప్రత్యువాచ హ| ఇతి ఉక్త్వా మహాబలాః ఖం ఉత్పేతుః ||


గోవిన్దరాజ టీకాలో - బాడం ఇతి అంగీకారే | ఇతి శబ్దః|


||శ్లోకార్థములు||


తేషామ్ ఇదం వదతాం - 

వానరులు ఈవిధముగా పలుకగానే 

అంగదః బాడం గచ్ఛామ - 

అంగదుడు వెంటనే బయలుదేరుదాము

(ఇతి) ప్రత్యువాచ హ - అని వారికి చెప్పెను

ఇతి ఉక్త్వా మహాబలాః ఖం ఉత్పేతుః- 

ఇలా చెప్పి ఆ మహబలులు ఆకాశములోకి ఎగిరిరి


||శ్లోకతాత్పర్యము||


వానరులు ఈవిధముగా పలుకగానే అంగదుడు వెంటనే బయలుదేరుదాము అని వారికి చెప్పెను. ఇలా చెప్పి ఆ మహబలము కలవారు, ఆకాశములోకి ఎగిరిరి. ||64.21||


||శ్లోకము 64.22||


ఉత్పతంతమనూత్పేతుః సర్వే తే హరియూథపాః |

కృత్వాకాశం నిరాకాశం యంత్రోత్ క్షిప్తా ఇవాచలాః ||64.22||


స|| సర్వే తే హరియూథపాః యన్త్రోక్షిప్తాః అచలాః ఇవ  ఆకాశం నిరాకాశం కృత్వా ఉత్పతంతం అనూత్పేతుః ||


||శ్లోకార్థములు||


సర్వే తే హరియూథపాః - 

ఆ హరియూథపులు అందరూ

యన్త్రోక్షిప్తాః అచలాః ఇవ  - 

యంత్రములోనుంచి విసరబడిన అచలమైన రాళ్లవలె

ఆకాశం నిరాకాశం కృత్వా - ఆకాశమును కప్పివేస్తూ 

ఉత్పతంతం అనూత్పేతుః - ఆకాశములోకి లేచిరి


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు ఆ హరియూథపులు యంత్రములోనుంచి విసరబడిన, అచలమైన రాళ్లవలె  ఆకాశమును కప్పివేస్తూ, ఆకాశములోకి లేచిరి. ||64.22||


||శ్లోకము 64.23||


తేఽమ్బరం సహసోత్పత్య వేగవంతః ప్లవఙ్గమాః |

నినదంతో మహానాదం ఘనా వాతేరితా యథా ||64.23||


స|| వేగవన్తః తే ప్లవంగమః అంబరం ఉత్పత్య  వాతేరితా ఘనాః ఇవ మహానాదం నినదన్తః ||


||శ్లోకార్థములు||


వేగవన్తః తే ప్లవంగమః - వేగవంతులైన ఆ వానరప్లవంగములు 

అంబరం ఉత్పత్య  - ఆకాశములోకి లేచి 

వాతేరితా ఘనాః ఇవ - నీటితో నిండిన మేఘములవలె

మహానాదం నినదన్తః - మహానాదము చేసిరి


||శ్లోకతాత్పర్యము||


వేగవంతులైన ఆ వానరప్లవంగములు ఆకాశములోకి లేచి నీటితో నిండిన మేఘములవలె మహానాదము చేసిరి.||64.23||


||శ్లోకము 64.24||


అఙ్గదే సమనుప్రాప్తే సుగ్రీవో వానరాధిపః |

ఉవాచ శోకోపహతం రామం కమలలోచనమ్ ||64.24||


స||అంగదః అనుప్రాప్తే వానరాధిపః సుగ్రీవః శోకోపహతం కమలలోచనం ఉవాచ||


||శ్లోకార్థములు||


అంగదః అనుప్రాప్తే - 

అంగదుడు సమీపించు ముందర 

వానరాధిపః సుగ్రీవః- 

ఆ వానరాధిపుడు అగు సుగ్రీవుడు 

శోకోపహతం కమలలోచనం ఉవాచ- 

శోకములో మునిగియున్న కమలలోచనునితో ఇట్లు పలికెను.


||శ్లోకతాత్పర్యము||


అంగదుడు సమీపించు ముందర ఆ వానరాధిపుడు అగు సుగ్రీవుడు శోకములో మునిగియున్న కమలలోచనుడు అగు రామునితో ఇట్లు పలికెను.||64.24|| 


||శ్లోకము 64.25||


సమాశ్వసిహి భద్రం తే దృష్టా దేవీ న సంశయః |

నాగంతు మిహ శక్యం తైః అతీతే సమయే హి నః ||64.25||


స|| సమాశ్వసిహి | తే భద్రం | దేవీ దృష్టా న సంశయః | తైః సమయే అతీతే  ఇహ నః ఆగన్తుం న శక్యం  ||


||శ్లోకార్థములు||


సమాశ్వసిహి  - దుఃఖమునుంచి తేరుకొనుము 

తే భద్రం  - నీకు శుభము అగు గాక

దేవీ దృష్టా న సంశయః  - 

దేవి చూడబడినది. సంశయము లేదు

తైః సమయే అతీతే  -   

గడువు దాటిన ఈ సమయములో

ఇహ నః ఆగన్తుం న శక్యం  - 

ఇక్కడికి మనవద్దకు రావడము అశక్యము


||శ్లోకతాత్పర్యము||


 ’దుఃఖమునుంచి తేరుకొనుము .నీకు శుభము అగు గాక. దేవి చూడబడినది. సంశయము లేదు.( అట్లు కానిచో)  గడువు దాటిన ఈ సమయములో ( వానరులకు) ఇక్కడికి రావడము అశక్యము.’ ||64.25||


||శ్లోకము 64.26||


న మత్సకాశ మాగచ్ఛేత్ కృత్యే హి వినిపాతితే |

యువరాజో మహాబాహుః ప్లవతాం ప్రవరోఽఙ్గదః ||64.26||


స|| యువరాజః మహాబాహుః ప్లవతాం ప్రవరః అంగదః కృత్యే వినిపాతితే మత్సకాసం న ఆగచ్ఛేత్||


||శ్లోకార్థములు||


యువరాజః మహాబాహుః- యువరాజు మహాబాహువులు కలవాడు 

 ప్లవతాం ప్రవరః అంగదః - వానరశ్రేష్ఠుడూ అయిన అంగదుడు

 కృత్యే వినిపాతితే - కార్యము సాధించకుండా 

మత్సకాసం న ఆగచ్ఛేత్ - నా ముందుకు రాడు


||శ్లోకతాత్పర్యము||


’యువరాజు మహాబాహువులుకలవాడు వానరశ్రేష్ఠుడూ అయిన అంగదుడు కార్యము సాధించకుండా నా ముందుకు రాడు.’||64.26||


||శ్లోకము 64.27||


యద్యప్యకృతకృత్యానాం ఈదృశః స్యాదుపక్రమః |

భవేత్ స దీనవదనో భ్రాంత విప్లుతమానసః ||64.27||


స|| అకృతకృత్యానాం ఉపక్రమః ఈదృశః యద్యపి స్యాత్ సః దీనవదనః భ్రాన్తవిప్లుతమానసః భవేత్||


||శ్లోకార్థములు||


అకృతకృత్యానాం ఉపక్రమః - 

కృతకృత్యులు కానివారి పద్దతి   

ఈదృశః యద్యపి స్యాత్ - వారు ఈ విధముగా వుండెదరు 

సః దీనవదనః భ్రాన్తవిప్లుతమానసః భవేత్- 

అతడు   దీనవదనముతో భ్రాంత చిత్తుడై వుండును.


||శ్లోకతాత్పర్యము||


'కృతకృత్యులు కానివారు అయినచో, వారు ఈ విధముగా వుండరు.  అతడు దీనవదనముతో భ్రాంత చిత్తుడై వుండును'.||64.27||  


||శ్లోకము 64.28||


పితృపైతామహం  చైతత్ పూర్వకైరభిరక్షితమ్ |

న మే మధువనం హన్యాదహృష్టః ప్లవగేశ్వరః ||64.28||

కౌసల్యా సుప్రజా రామ సమాశ్వసి హి సువ్రత |


స|| ప్లవగేశ్వరః అహృష్టః పితృపైతామహం పూర్వకైః అభిరక్షితం మే మధువనం న హన్యాత్ | కౌసల్యా సుప్రజాః సువ్రత రామ సమాశ్వసిహి||


రామటీకాలో - దేవీ దృష్టా తత్రాపి హనుమతైవ  అత ఏవ కౌసల్యా సుప్రజా  శోభనపుత్రవతీ అస్తీతి శేషః |అతః సమాశ్వసిహి|


||శ్లోకార్థములు||


ప్లవగేశ్వరః అహృష్టః - 

ఆ ప్లవగేశ్వరుడు సంతోషము లేని వాడు అయితే 

పితృపైతామహం పూర్వకైః అభిరక్షితం -

 పితృలు పితామహులచే  పూర్వము రక్షించ బడిన

మే మధువనం న హన్యాత్ - 

ఆ మధువనమును ధ్వంసము చేయడు

కౌసల్యా సుప్రజాః సువ్రత రామ - 

ఓ కౌసల్యాదేవికి ఆనందము కలిగించు రామా 

సమాశ్వసిహి - కనుక ఊరడిల్లుము


||శ్లోకతాత్పర్యము||


ఆ ప్లవగేశ్వరుడు సంతోషము లేని వాడు అయితే పితృలు పితామహులచే  పూర్వము రక్షించ బడిన ఆ మధువనమును ధ్వంసము చేయడు. కనుక , ఓ కౌసల్యాదేవికి ఆనందము కలిగించు రామా, ఊరడిల్లుము. ||64.28||


||శ్లోకము 64.29||


దృష్టా దేవీ న సందేహో న చాన్యేన హనూమతా ||64.29||

న హ్యన్యః కర్మణో హేతుః సాధనేఽస్య హనూమతః |


స||  దేవీ దృష్టా | న సందేహః | న చ అన్యేన | హనుమతా | అస్య కర్మణః సాధనే హేతుః హనూమతః|| 


||శ్లోకార్థములు||


దేవీ దృష్టా  న సందేహః - 

దేవి చూడబడినది. అందులో సందేహము లేదు

న చ అన్యేన హనుమతా  - 

ఇంకెవరిచేతనో కాదు. హనుమంతుని చేతనే

అస్య కర్మణః సాధనే హేతుః హనూమతః- 

ఈ పని సాధించుటకు కారణము హనుమంతుడే


||శ్లోకతాత్పర్యము||


'దేవి చూడబడినది. అందులో సందేహము లేదు. ఇంకెవరిచేతనో కాదు. హనుమంతునిచేతనే. ఈ పని సాధించుటకు కారణము హనుమంతుడే'. ||64.29|| 


||శ్లోకము 64.30||


హనూమతి హి సిద్ధిశ్చ మతిశ్చ మతిసత్తమ ||64.30||

వ్యవసాయశ్చ వీర్యం చ సూర్యే తేజ ఇవ ద్రువమ్ |


స|| మతిసత్తమ హనూమతి సూర్యేః తేజః ఇవ సిద్ధిశ్చ మతిశ్చ వ్యవసాయశ్చ వీర్యం చ ధృవం||||శ్లోకార్థములు||


మతిసత్తమ హనూమతి - ఓ మతిసత్తమా!  హనుమంతునిలో

సూర్యేః తేజః ఇవ - సూర్యునిలో తేజము వలె 

సిద్ధిశ్చ మతిశ్చ - కార్యదక్షత బుద్ధి 

వ్యవసాయశ్చ వీర్యం చ ధృవం- 

నిరంతరము ప్రయత్నము చేయగల సామర్థ్యము, పరాక్రమము వెలిసి ఉన్నాయి


||శ్లోకతాత్పర్యము||


'ఓ మతిసత్తమా! సూర్యునిలో తేజము వలె హనుమంతునిలో కార్యదక్షత బుద్ధి నిరంతరము ప్రయత్నము చేయగల సామర్థ్యము, పరాక్రమము వెలిసి ఉన్నాయి.' ||64.30|| 


||శ్లోకము 64.31||

 

జాంబవాన్యత్ర నేతాస్యాదంగదశ్చ బలేశ్వరః ||64.31||

హనుమాంశ్చాప్యథిష్ఠాతా న తస్య  గతిరన్యథా |


స||  యత్ర నేతా జాంబవాన్ స్యాత్ మహాబలః అంగదశ్చ హనుమాంశ్చ అధిష్ఠాతా తస్య గతిః అన్యథా ( న భవేత్)||


తిలక టీకాలో - అధిష్టాతా కార్యకరణోద్యోగవాన్ |


||శ్లోకార్థములు||


యత్ర నేతా జాంబవాన్ స్యాత్- 

ఎక్కడ జాంబవంతుడు నేత్రుత్వము వహించునో 

మహాబలః అంగదశ్చ - 

మహాబలముకల అంగదుడు ఉండునో

హనుమాంశ్చ అధిష్ఠాతా - 

హనుమంతుడు  కార్యము చేయుటలో వుండునో 

తస్య గతిః న అన్యథా - దానిఫలితము వేరుగా వుండదు


||శ్లోకతాత్పర్యము||


'ఎక్కడ జాంబవంతుడు నేత్రుత్వము వహించునో, మహాబలముకల అంగదుడు ఉండునో, హనుమంతుడు  కార్యము చేయు అధిష్టానములో వుండునో, దానిఫలితము వేరుగా వుండదు.' ||64.31||


||శ్లోకము 64.32||


మాభూశ్చింతా సమాయుక్తః సంప్రత్యమితవిక్రమః ||64.32||


స|| అమితవిక్రమః సంప్రతి చిన్తా సమాయుక్తః మాభూః |  


||శ్లోకార్థములు||


అమితవిక్రమః - ఓ అమితమైన పరాక్రమము కలవాడా 

సంప్రతి - ఈ సమయములో  

చిన్తా సమాయుక్తః మాభూః- చింతా యుక్తుడవు కాకుము


||శ్లోకతాత్పర్యము||


'ఓ అమితమైన పరాక్రమము కలవాడా ఈ సమయములో  చింతా యుక్తుడవు కాకుము.' ||64.32||


||శ్లోకము 64.33||


తతః కిలకిలాశబ్దం శుశ్రావాసన్నమంబరే |

హనుమత్కర్మ దృప్తానాం నర్దతాం కాననౌకసామ్ ||64.33|| 

కిష్కింధాముపయాతానాం సిద్ధిం కథయతా మివ |


స||తతః హనుమత్కర్మ దృప్తానాం నర్ధతామ్ సిద్ధిం కథయతాం ఇవ కిష్కింధాం ఉపాయాతానాం కాననౌకసాం అంబరే ఆసన్నం  కిలకిలాశబ్దం శుశ్రావ||


||శ్లోకార్థములు||


తతః హనుమత్కర్మ దృప్తానాం-

 అప్పుడు హనుమంతుడు సాధించిన దుస్సాధ్యమైన కార్యమునకు గర్వించి

 నర్ధతామ్ సిద్ధిం కథయతాం ఇవ -

 తమ కార్యసిద్ధిని ప్రకటిస్తున్నారా అన్నట్లు 

 కిష్కింధాం ఉపాయాతానాం- 

కిష్కింధకు చేరుతున్న 

 కాననౌకసాం కిలకిలాశబ్దం -

 వానరుల కిలకిలారావములు 

అంబరే ఆసన్నం  శుశ్రావ- 

ఆకాశములో మారుమోగుతూ వినవచ్చెను


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు హనుమంతుడు సాధించిన దుస్సాధ్యమైన కార్యమునకు గర్వించి , తమ కార్యసిద్ధిని ప్రకటిస్తున్నారా అన్నట్లు కిష్కింధకు చేరుతున్న వానరుల కిలకిలారావములు ఆకాశములో మారుమోగుతున్న శబ్దము వినవచ్చెను.


||శ్లోకము 64.34||


తతః శ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః ||64.34||

అయతాంచితలాంగూలః సోఽభవద్దృష్టమానసః |


స|| తతః స కపిసత్తమః కపీనామ్ తం నినాదం శ్రుత్వా అయతాంచిత లాంగూలః హృష్టమానసః అభవత్||


||శ్లోకార్థములు||


తతః స కపిసత్తమః - 

అప్పుడు ఆ కపిసత్తముడు 

కపీనామ్ తం నినాదం శ్రుత్వా - 

వానరులయొక్క ఆ నినాదము విని 

అయతాంచిత లాంగూలః - 

తన తోకను నిటారుగా ఎత్తి 

 హృష్టమానసః అభవత్ - 

సంతోషముతో నిండిన మనస్సు కలవాడయ్యెను.


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు ఆ కపిసత్తముడు వానరులయొక్క ఆ నినాదము విని తన తోకను నిటారుగా ఎత్తి సంతోషముతో నిండిన మనస్సు కలవాడయ్యెను. ||64.34||


||శ్లోకము 64.35||


అజగ్ముస్తేఽపి హరయో రామదర్శనకాంక్షిణః ||64.35||

అఙ్గదం పురతః కృత్వా హనూమంతం చ వానరమ్ |


స|| తే హరయః కపిః అంగదం వానరం హనూమంతం పురతః కృత్వా రామదర్శనకాంక్షిణః ఆజగ్ముః||||శ్లోకార్థములు||


తే హరయః - ఆ వానరులు 

కపిః అంగదం వానరం హనూమంతం -

 అంగదుని హనుమంతుని 

 పురతః కృత్వా - ముందర ఉంచుకొని 

రామదర్శనకాంక్షిణః ఆజగ్ముః - 

రామదర్శన కాంక్షతో అచటికి చేరిరి


||శ్లోకతాత్పర్యము||


ఆ వానరులు అంగదుని హనుమంతుని ముందర ఉంచుకొని రామదర్శన కాంక్షతో అచటికి చేరిరి. ||64.35||


||శ్లోకము 64.36||


తే అఙ్గద ప్రముఖావీరాః ప్రహృష్టాశ్చ ముదాన్వితః ||64.36||

నిపేతుర్హరిరాజస్య సమీపే రాఘవస్య చ |


స|| అంగదప్రముఖాః తే వీరాః ప్రహృష్టశ్చ ముదా అన్వితాః హరిరాజస్య రాఘవస్య చ సమీపే నిపేతుః ||


||శ్లోకార్థములు||


అంగదప్రముఖాః తే వీరాః-  

అంగదప్రముఖులు ఆ వీరులు 

ప్రహృష్టశ్చ ముదా అన్వితాః - 

ఆనంద సంతోషములతో

హరిరాజస్య రాఘవస్య చ - 

వానరాధిపతి కి రాఘవునకు 

సమీపే నిపేతుః - 

సమీపములో దిగిరి


||శ్లోకతాత్పర్యము||


అంగదప్రముఖులు వీరులు సంతోషముతో వానరాధిపతి కి రాఘవునకు సమీపములో దిగిరి.||64.36||


||శ్లోకము 64.37||


హనుమాంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసా తతః ||64.37||

నియతామక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్ |


స|| తతః మహాబాహుః హనుమాన్ ప్రణమ్య దేవీం నియతాం అక్షతాం రాఘవాయ న్యవేదయత్||


రామ టీకాలో - నియతాం పాతివ్రత్యసంపన్నామ్ అక్షతాం శరీరేణ కుశలినీం |


||శ్లోకార్థములు||


తతః మహాబాహుః - 

అప్పుడు మహాబాహువులు  కల 

హనుమాన్ ప్రణమ్య - 

హనుమంతుడు నమస్కరించి 

దేవీం నియతాం అక్షతాం - 

దేవి నియమబద్ధురాలై క్షేమముగా ఉన్నది

రాఘవాయ న్యవేదయత్- 

దేవి నియమబద్ధురాలై క్షేమముగా ఉన్నది


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు మహాబాహువులు  కల హనుమంతుడు నమస్కరించి " దేవి నియమబద్ధురాలై క్షేమముగా ఉన్నది" దేవి నియమబద్ధురాలై క్షేమముగా ఉన్నది. ||64.37||


’నియతామక్షతాం దేవీ’, ఈ మాట  అంటే నియమబద్ధురాలైన, అంటే తన శీలము కాపాడుకున్న క్షీణించకుండా  క్షేమముగా వున్నది అని.  


హనుమ ఆ మూడు మాటలలో అతి ముఖ్యమైన మాట చెపుతాడు. జీవిస్తున్న సీతను చూచాను అంటే, ఆ సీత రాముని కొఱకే వుందా అన్నమాట గురించి మళ్ళీ విశదీకరించాలి. పతివ్రత అయిన సీతను చూశాను అంటే అమె జీవిస్తోంది అని ధ్వని కూడా వుంది. హనుమ చెప్పిన మాట సందేహానికి తావు లేకుండా చెప్పిన మాట.


అదే ఈ సర్గలో ముఖ్యమైన మాట.  నిజానికి అది ఈ సర్గలోనే కాదు సుందరకాండలోనే ముఖ్యమైన మాట. సీతాన్వేషణ కి హనుమ బయలుదేరినప్పుటినుంచి  రామలక్ష్మణ సుగ్రీవులతో సహ అందరూ వేచి వున్నది ఈ మాట కొఱకే. హనుమ ఈ మాట రాములవారికి చెప్పి తన జన్మ సార్ధకము చేసుకున్నాడు. 

 

||శ్లోకము 64.38||


దృష్టా దేవీతి హనుమద్వదనాత్ అమృతోపమం |

ఆకర్ణ్య వచనం రామో హర్షంఆప సలక్ష్మణః ||64.38||


స|| సలక్ష్మణః రామః హనుమత్ వదనాత్ అమృతోపపం దృష్టా దేవీ ఇతి వచనం ఆకర్ణ్య హర్షం ఆప||


||శ్లోకార్థములు||


సలక్ష్మణః రామః - 

లక్ష్మణునితో కూడిన రాముడు 

హనుమత్ వదనాత్ అమృతోపపం - 

హనుమంతుని వదనమునుండి అమృతము తో సమానమైన

దృష్టా దేవీ ఇతి వచనం - 

’సీతను చూచితిమ’ అన్న మాటలను

ఆకర్ణ్య హర్షం ఆప - 

విని అత్యానందము పొందెను


||శ్లోకతాత్పర్యము||


లక్ష్మణునితో కూడిన రాముడు హనుమంతుని వదనమునుండి అమృతము తో సమానమైన "సీతను చూచితిమి " అన్న మాటలను విని అత్యానందము పొందెను. ||64.38||


||శ్లోకము 64.39||


నిశ్చితార్థః తతః తస్మిన్ సుగ్రీవః పవనాత్మజే ||64.39||

లక్ష్మణః ప్రీతిమాన్ ప్రీతం బహుమనాదవైక్షత |’


స|| తతః లక్ష్మణః తస్మిన్ పవనాత్మజే నిశ్చితార్థం ప్రీతం సుగ్రీవం బహుమానాత్ అవైక్షత||||శ్లోకార్థములు||


తతః లక్ష్మణః - అప్పుడు లక్ష్మణుడు 

తస్మిన్ పవనాత్మజే - ఆ పవనాత్మజునిపై 

నిశ్చితార్థం ప్రీతం సుగ్రీవం - నమ్మకము చూపిన సుగ్రీవుని

బహుమానాత్ అవైక్షత - అతి గౌరవముతో చూచెను


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు లక్ష్మణుడు ఆ పవనాత్మజునిపై నమ్మకము చూపిన సుగ్రీవుని అతి గౌరవముతో చూచెను. ||64.39||


||శ్లోకము 64.40||


ప్రీత్యా రమమాణోఽథ రాఘవః పరవీరహ ||

బహుమానేన మహతా హనుమంత మవైక్షతా ||64.40||


స|| పరవీరహ రాఘవః రమమాణః ఉపేతః మహతా బహుమానేన హనుమన్తం అవైక్షత||


||శ్లోకార్థములు||


పరవీరహ రాఘవః - శత్రువీరసంహారకుడైన రాముడు 

రమమాణః ఉపేతః - అమితమైన ఆనందములో ఓలలాడితూ

మహతా బహుమానేన - అత్యంత ఆదరభావముతో 

 హనుమన్తం అవైక్షత - హనుమంతుని సాదరముగా చూచెను


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు శత్రువీరసంహారకుడైన రాముడు అమితమైన ఆనందములో ఓలలాడితూ అత్యంత ఆదరభావముతో హనుమంతుని సాదరముగా చూచెను.||64.40||


శ్రీరాములవారు, మాట్లాడకపోయినా , ప్రత్యక్షముగా కనపడిన సర్గ ఇది. అతిదుఃఖములో వున్న, తన దురదృష్టమును నిందించుకోంటూ, తన దుఃఖాగ్ని ఎలాంటిది అంటే, అది అగ్నిని కూడా దహించేది అని చెప్పిన రాములవారు, అమితమైన ఆనందములో ఓలలాడుతూ, అత్యంత ఆదరభావముతో హనుమంతుని సాదరముగా చూచెను అన్నమాటతో , సుందరకాండలో రాములవారి శోకము కూడా శాంతి పొందినది అని తెలుస్తుంది. అదే సుందరకాండ మొదలెట్టినప్పటికి అంతమయ్యేటప్పటికీ గల మార్పు.  


ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది నాలుగవ సర్గ సమాప్తము


 ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే 

చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్

శ్రీమత్సుందరకాండే చతుష్షష్టితమస్సర్గః ||


||ఓమ్ తత్ సత్||