"అంటే ఏటువంటి బుద్ధితో కర్మ బంధము వదలగలవో అట్టి
కర్మయోగము గురించి చెప్పెదను వినుము" అని కృష్ణుడు
ప్రారంభిస్తాడు. సాంఖ్యయోగముగురించి చెప్పిన తరువాత.
ఆ కర్మబంధమును వదలగల కర్మ యోగము గురించి చెపుతూ మొదటి
శ్లోకములోనే ముఖ్యమైన మాటలని చెపుతాడు.
"నేహాభి క్రమ నాశో అస్తి
ప్రత్యవాయో నవిద్యతే |
స్వల్పమపి అస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్ ||" 2:40
"ఇహ అభిక్రమ నాశః న అస్తి" అంటే ఆకర్మ యోగములో
ప్రాంభించినది విఫలమగుట లేదు
"ప్రత్యవాయో న విద్యతే" చేసిన కర్మ వలన దోషములు ఉండవు
"స్వల్పం అపి" అంటే కొంచెము చేసినా గాని గొప్పదైన
భయమునుండి రక్షించును.
అంటే కృష్ణ భగవానుడు మొట్తమొదటిలోనే ఈ కర్మ యోగము యొక్క
ప్రయోజనాలు చెప్పేశాడు అన్నమాట.
సంస్కృత భాషలో వాంగ్మయములో ఒక ఆనవాయితీ వుంది. ఏ కావ్యము
ఏ గ్రంధము చూసినా మొదటి లోనే ఆ కావ్యము ఎందుకు ఎవరికోసము
దాని ప్రయోజనాలు ఏమిటి అని విశదీకరించాలి.
ఆలాగే కృష్ణుడు కర్మయోగము గురించి విశదీకరించే ముందే దాని
ప్రయోజనములు చెప్పాడు.
నిజానికి మనందరికీ ఇది ముఖ్యమైన మాట
కర్మ యోగము వలన లాభమేమిటి అన్న మాట రావచ్చు
ముందుగా కర్మ యోగమంటే ఎదో పిచ్చాపాటి కర్మ గురించి కాదు.
అది నిష్కామ కర్మ గురించి.
నిజంగా నిష్కామ కర్మ చేసినప్పుడు భయము అన్న మాట పోతుంది.
అదే ఏదో ఆశతో కూడిన పని చేసినప్పుడు అది జరుగుతుందా?
జరగదా ? జరగకపొతే ఏమి చెయ్యాలి అన్న భావనలతో మనస్సు తికమక
పడుతుంది.
అదే ఏదో చేయకూడని పని చేసామో అప్పుడు మనము పట్టుపడతామా
అన్న భయము కూడా పడుతుంది.
కాని నిష్కామ కర్మ చేసినప్పుడు - స్వలపమపి - కొంచమే అయినా
- భయము అన్నమాట మనకుండదు.
ఎందుకు అంటే మనము ఏమీ ఆశతో చేయలేదు కాబట్టి !
నిష్కామకర్మ ప్రాంభించితే దాని కి విఫలము అనే సందర్భము
రాదు. చూసే వాళ్ళందరికీ కీ తెలుసు . మనము స్వార్థము కోసము
చేయటల్లేదు అని. అప్పుడు నిస్వార్థముగా మనము ఎంతచేసినా అది
మిగిలినవాళ్ళకి .. "ఇంతై అంతై ఇంతింతై బ్రహ్మాండముగా"
కనిపిస్తుంది.
నిష్కామ కర్మ చేసినప్పుడు ఆ కర్మ మధ్యలో ఆగిపోయినా
దోషములేదు.