తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

 

 


|| ఓమ్ తత్ సత్ ||

చిన్నప్పటి రోజులలో సాయంకాలపు ప్రార్థన

చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నప్పుడు
మనస్సులో చాలా అంశాలు చేరుతాయి.
ఆ అంశాల్లో ఒక ముఖ్యమైన అంశము సాయంకాలపు ప్రార్థన.

ప్రార్థన విషయములో చిన్నప్పుడు అంటే మేము కాకినాడలో వున్నప్పటి మాటలు.
కాకినాడలో మా నాన్నగారు పోస్టుమాస్టరు.
కాకినాడ పోర్టు స్టేషను దగ్గర పోస్టుఆఫీసు, దానికి అనుకునే మా ఇల్లు వుండేవి.
అది విశాలమైన ఇల్లు.
మా దొడ్డి ఒక తపోవనములా వుండేది. ఆ దొడ్లో రెండు మామిడి చెట్లు అందులో ఒకటి కలెక్టరు మామిడి కాయ చెట్టు, అలాగే రెండు బాదం చెట్లు , ఒక ఉసిరి చెట్టు , ఒక జామకాయ చెట్టు, ఒక నేరేడు పండు చెట్టు వుండేవి.
అది ఒక తపోవనమే.
దానికి తగినట్లే ఆ విశాలమైన ఇంట్లో దేముడికి ఒక గది ఉండేది.

చిన్నప్పుడు స్కూలునుంచి వచ్చి పుస్తకాలు పక్కనపెట్టి ,
కాళ్ళూ చేతులూ కడుక్కొని తయారయ్యే సరికి ,
అమ్మ వంటచేయడము, దీపము పెట్టడము అయ్యేది.
భోజనాల ముందర పిల్లలు అందరమూ దేముడి గదిలో దూరి ప్రార్థన చేసే వాళ్ళము.
ప్రార్థన అంటే పాటలు శ్లోకాలు పాడడము అన్నమాట.
ఆ చిన్నతనములో నాకు ప్రార్థనాభావము కన్నఆ శ్లోకాలమీదా పాటలమీద ఇష్టము ఎక్కువ వుండేది.
ఆ శ్లోకాలు పాటలు ఇప్పటికీ మదిలో మెలుగుతో వుంటాయి.
ఇప్పుడు కూడా ఇద్దరు కాని ముగ్గురు పిల్లలము కలిస్తే ఆ శ్లోకాలు చదువుతాము.
అలాగే పాటలు కూడా పాడుతాము.
ఆ పాటలు ఎలా పాడాము అన్న మాట లేనే లేదు.
గొంతెత్తి పాడడమే.
అ చిన్నప్పటి పాటలలో తునకలు ఇవి;

- "దేవగణములలో యే దేముడవని నిన్ను .."
- "రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని..."
- "పావన గుణ రామా హరే ...".
- "శ్రీరామ నామ మంత్రపఠనా సేయవే మనసా.."
- "ఆనందమనియేటి ఆభరణములు తొడిగి ..."

వీటితో పాటు కొన్ని శ్లోకాలు చదివే వాళ్ళము కూడా అవే ఇవి.

వెంకటేశ ప్రపత్తి , "కమలాకుచ చూచుక కుంకమతో నియతా..."
"లింగాష్టకము.."
"చంద్రశేఖరాష్టకము.."

కాలప్రవేణా ఇంకా చాలా శ్లోకాలు మా లిస్టులో చేరాయి అందులో కొన్ని "గంగాస్తుతి", "బిల్వాష్టకము" మొదలైనవి. ఇప్పటి లిస్టు లో శ్లోకాలు ఇవి.

- భజగోవిందం
- చంద్రశేఖరాష్టకమ్
- లింగాష్టకమ్
- బిల్వాష్టకమ్
- శివ స్తుతి
- శివ పంచాక్షరీస్తోత్రమ్
- గంగాస్తోత్రమ్
- గణేషపంచరత్నమాల
- నవగ్రహస్తోత్రమ్
- లఘున్యాసమ్

కాలకర్మ వశాత్తు ఈ మధ్య ముగ్గురు అక్కలూ, నేనూ ఇంకా అక్కయ్యల పిల్లలలు, అందరము ఒక చోట చేరాము.
అప్పుడు మళ్ళీ చిన్నప్పటి ప్రార్థనా శ్లోకాలు పాటలూ మననం చేశాము.
అలా పాడినప్పుడు మనస్సు ఆ చిన్నప్పటి ప్రదేశాలన్నీ తిరిగి వచ్చేది.
ఆ సమయములో నా దగ్గర పాటల/ శ్లోకాల పుస్తకములు లేవు.
అందుకని నేను నా కంటిచెక్కలో( iPad లో) అన్నీ వెదికి,
ఆ లింకు పట్టుకొని ఆ శ్లోకాలు చదివాను.
అప్పుడు అనిపించింది.
ఇవన్ని మన వెబ్ సైటులో ఉంటే ఎంత బాగుండేది అని.
వెంటనే ఆ కార్యక్రమము పెట్టుకొని ఆ పాటలు శ్లోకాలు ఈ పేజీలలో అందిస్తున్నాము.

ఇవన్ని నిస్సందేహముగా మానందము కోసము చేయబడినవే.

ఇవి మీకు కూడా ఆనందము కలిగిస్తాయి అని ఆశిస్తూ,

భవదీయులు
కాసరబాద వర్గము
(kasarabada.org)

||ఓమ్ తత్ సత్||