!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 234-235

||ఓమ్ తత్ సత్||


వివేక చూడామణి  శ్లోకములు 234- 235

ముందు శ్లోకములలో బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని విన్నాము. బ్రహ్మ సత్యము అన్నమాట అథర్వణ వేదములో ( ముండకోపనిషత్తులో) చెప్పబడినది. మనకి వేదవాక్కు ప్రమాణము. జగత్తు మిథ్య అన్నమాటకి proof కావాలి.

ఇప్పుడు వచ్చే శ్లోకములో బ్రహ్మ సత్యం అన్నది నిజము (అది వేదవాక్కుకనక). మరి జగత్తు కూడా సత్యమే అయితే మనకి వచ్చే నష్టము ఏమిటి అన్న ప్రశ్న తీసుకుంటాడు గురువు. అప్పుడు ఒకవేళ జగత్తుకూడా సత్యమే అయితే, మనకి మూడు నష్టాలు ( అసత్యములు)  కలుగుతాయి అని గురువు చెపుతున్నాడు. అదే ముందు శ్లోకములో వింటాము.

శ్లోకము 233:

సత్యం యది స్యాత్ జగదాత్మనః
అనన్తత్వహానిః నిగమప్రమాణతా|
అసత్యవాదిత్వం అపి ఈశితుః స్యాత్
నైతత్త్రయం సాధుహితం మహాత్మనామ్ || 234||

సత్యం యది స్యాత్ జగత్ -
యది జగత్ సత్యం స్యాత్-
ఒకవేళ జగత్తు సత్యమైనచో;

ఆత్మనో అనన్తత్వహానిః -
అత్మయొక్క అనన్తత్వానికి హాని;

మనము వేదాలలో విన్నమాట బ్రహ్మము అంతటా వ్యాపించివున్నది. బ్రహ్మము అనంతము.  

అనన్తత్వానికి హాని అంటే ఏమిటి? ఆత్మలేక బ్రహ్మము అనంతము  అన్నమాట నిజము కాదు అని.  

మరి ఈ హాని ఎలాగ వస్తుంది ? జగము సత్యము అయితే జగత్తు నిత్యము. మనకు తెలిసిన మాట బ్రహ్మము కూడా సత్యము, బ్రహ్మము కూడా నిత్యము.  రెండు వస్తువులు  ( బ్రహ్మము జగము) సత్యము అయినప్పుడు మనకి తెలిసేమాట ఏమిటి ? - ఇక్కడ రెండు వస్తువుల మీద ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. పటము , ఘటము, రెండు వస్తువులు  నిజమే అనుకుందాము.  రెండూ నిజమైన వస్తువులు కనక,  పటము ఉన్నచోట ఘటము వుండదు. ఘటము ఉన్నచోట పటము వుండదు. అలాగే...

అలాగే జగత్తు బ్రహ్మము రెండు నిజమైతే, జగత్తు వున్నచోట బ్రహ్మము వుండదు. బ్రహ్మము ఉన్నచోట జగత్తు వుండదు. అంటే బ్రహ్మము ఒకచోట లేదు అన్నప్పుడు అది అనంతము కాదు అన్నమాట.  అదే అనన్తత్వానికి హాని అంటే.

2 నిగమప్రమాణతా -
వేదములు అప్రామాణికములు:

వేదములు అప్రాణికములు అంటే  వేదములలో చెప్పబడినమాట నిజము కాదు అని. వేదములలో బ్రహ్మము అనంతము అని చెప్పబడినది, అది అసత్యమౌతుంది

3 అసత్యవాదిత్వం అపి ఈశితుః స్యాత్ -
ఈశితుః అసత్యవాదిత్వం అపి స్యాత్ -
ఈశ్వరునికి అసత్యము పలికిన దోషము కలుగును.

ఈశ్వరుడు భగవద్గీతలో చెప్పినవి అన్నీ అసత్య మౌతాయి అని.

నైతత్త్రయం సాధుహితం మహాత్మనామ్
సాధు మహాత్మనాం ఏతత్ త్రయం న హితం-
సాధు మహాత్ములకు ఈ మూడూ హితమైనవి కావు.

శ్లోక తాత్పర్యము:

ఒకవేళ జగత్తు సత్యమైనచో, అత్మయొక్క అనన్తత్వానికి హాని, వేదములు అప్రామాణికములు, ఈశ్వరునికి అసత్యము పలికిన దోషము కలుగును. ఈ మూడూ సాధు మహాత్ములకు హితమైనవి కావు.

అందు వలన జగత్తు నిజము కాదు , జగత్తు బ్రహ్మ స్వరూపమే అని. మట్టితో చేయబడిన కుండలలో నిజముగా వున్నది మట్టి. అలాగే బ్రహ్మము ము చే సృష్టించబడిన ఈ జగత్తు కూడా బ్రహ్మ స్వరూపమే అని ,

శ్లోకము 235

ఈశ్వరో వస్తుతత్త్వజ్ఞో
నచాహం తేష్వవ స్థితః |
నచమత్ స్థాని భూతాని
ఇత్యేవమేవ వ్యచీక్లుపత్|| 235||

ఈశ్వరో వస్తుతత్త్వజ్ఞః -
వస్తుతత్త్వము తెలిసిన ఈశ్వరుడు;

న చాహం తేష్వవ స్థితః -
నేను ఆప్రాణులయందు లేను;

న చ మత్ స్థాని భూతాని-
ప్రాణులు కూడా నాయందు లేవు

ఇత్యేవమేవవ్యచీకథత్-
ఇతి ఏవం ఏవ వ్యచీక్లుపత్-
ఈ విధముగా చెప్పెను;

శ్లోకతాత్పర్యము:

వస్తుతత్త్వము తెలిసిన ఈశ్వరుడు; ’నేను ఆ ప్రాణులయందు లేను, ప్రాణులు కూడా నాయందు లేవు’ ; అని చెప్పెను.

ఇది శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మాట ( గీత9.4). ఇది గురువు ఎందుకు మనకి గుర్తు చేస్తున్నాడు అన్నది మనము విచారించ తగిన విషయము.  

గీతలో శ్లోకము ఇలా వస్తుంది

శ్లో|| మయాతతమిదం సర్వం
       జగదవ్యక్తమూర్తినా
       మత్స్థాని సర్వభూతాని
       న చాహం తేష్వవస్థితః ||( గీత 9-4) ||

        న చ మత్ స్థాని భూతాని
        పశ్యమే యోగ  మైశ్వరమ్| ( గీత 9-5)

గీతలో కృష్ణుడు

ఈ సమస్త ప్రపంచము అంతా అవ్యక్త రూపమైన నాచేత వ్యాపింపబడినది.  

’మత్ స్థాని సర్వభూతాని’ - సమస్త భూతప్రాణులు అవ్యక్తరూపము  గల నాలో ఉన్నాయి.  

న చాహం తేష్వవస్థితః  - కాని నేను ( నా వ్యక్త రూపములో)  వాటిలో లేను

అంటే, ఈ సమస్త ప్రపంచము అంతా అవ్యక్త రూపమైన నాచేత వ్యాపింపబడినది.  సమస్త భూతప్రాణులు అవ్యక్తరూపము  గల నాలో ఉన్నాయి.  కాని నేను ( నా వ్యక్త రూపములో)  వాటిలో లేను.

సమస్త ప్రాణులలో తన అంశము ఉన్నది అని కృష్ణుడు చెప్పినమాటే. మన ఆత్మలో కూడా ఉన్నది ఆ పరమాత్మే అని కూడా తెలిసినమాటే. మరి, "నేను వాటిలో లేను" అన్నమాట ఎలా కలిసి వస్తుంది?

దాని కి సమాధానము ఇది: మనము అన్నప్పుడు మనకి మన స్థూల సూక్ష్మ శరీరాలే మనము అన్న భ్రాన్తిలో వుంటాము. ఆభ్రాంతిలో మనము అనుకునే మన సూక్శ్మ శ్థూలశరీరాలతో ఆ పరమాత్మకి సంబంధము లేదు. " నేను వాటిలో లేను" అన్నప్పుడు, మన స్థూలసూక్ష్మ శరీరములలో లేడు. మనము పడే సుఖ దుఃఖాలలో ఆయనలేడు అన్నమాట.

అలాగ  ఈ శ్లోకము లో చెప్పినది అర్థము చేసుకోగలమాటే. తరువాత శ్లోకము లో ఇంకోమాట వస్తుంది.

        "న చ మత్ స్థాని భూతాని
        పశ్యమే యోగ  మైశ్వరమ్"||గీ 9-5)||

ఆ భూతములు ( భూత ప్రపంచము)  నాలో లేవు.

ముందు శ్లోకములో,-  ’మత్ స్థాని సర్వభూతాని’ - సమస్త భూతప్రాణులు అవ్యక్తరూపము  గల నాలో ఉన్నాయి అని చెప్పి; ఇక్కడ ఆ భూత ప్రపంచము నాలో లేదు అనడములో కృషుడి భావము ఏమిటి.

మయాతతమిదం సర్వం - నాచేత ఈ విశ్వమంతయూ వ్యాపింపబడినది అని చెప్పినప్పుడు అసలు భావము తనే విశ్వము - ప్రపంచము. ఇది అద్వైతభావము. ఈ అద్వైతభావములో తను ప్రపంచము వేరు కాదు. తనే ప్రపంచమైనప్పుడు తనలో ప్రపంచముండటము అసందర్భము కదా !. ఆ భూతములు నాలో లేవు అన్నది సత్యమే.

ఇదేమాటని తర్కజ్ఞానముతో (లాజిక్)  చూడవచ్చు కూడా.

భూత ప్రపంచము నిజమైతే తర్కము ఏమిటి చెపుతుంది? - తర్కములో నిజమైన రెండు వస్తువులు పటము ఘటము  చూద్దాము. నిజమైన పటములో ఘటము , నిజమైన ఘటములో పటము రెండూ  కాని పని. ఎందుకు? రెండూ నిజమైన వస్తువులు కనుక , పటము ఉన్నచోట ఘటము పెట్టలేము , ఘటము ఉన్నచోట పటము పెట్టలేము.

 అలాగే - ప్రపంచము బ్రహ్మము రెండు నిజమైతే , ఆ ప్రపంచము బ్రహ్మములో , బ్రహ్మములో ప్రపంచము కాని పని.
ఇది అవుతుంది అని ఎక్కడన్నా చెప్పబడితే - అది మిథ్యావస్థలో జరిగే పని.  

ఈ శ్లోకములో కృష్ణుడి చేత చెప్పబడిన మాట, ప్రపంచము మిథ్య అయితేనే జరిగే పని. మన వైదీక సిద్ధాంతములో ( వేదాలలో) బ్రహ్మము నిజము కనక, ప్రపంచమే మిథ్య అన్నమాట,

ఈ రెండు భగవద్గీత శ్లోకాలలో, కృష్ణుడి మాటలద్వారా మనము వినేది - బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని.

వివేక చూడామణి రెండవ శ్లోకములో - భగవద్గీతలో కృష్ణుడి మాట గుర్తుచేయడములో గల తాత్పర్యము - బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అని
 
||ఓమ్ తత్ సత్||
_____________________________________________________________________











































































































 






 








వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233

వివేక చూడామణి శ్లోకములు 234-235

Om tat sat !

 

 

 

    •