Sundarakanda Chapter 58

Hanuman recounts the events in Lanka !

Chapter 58:

Summary : Questioned by Jambavan Hanuman tells the details of his exploits in reaching Lanka, locating Sita , meeting Ravana , burning of Lanka.

For telugu Home page

click here

సుందరకాండ
ఏబది ఎనిమిదవ సర్గము

తతస్తస్య గిరేః శ్రుంగే మహేంద్రస్య మహాబలాః|
హనుమత్ప్రముఖాః ప్రీతిం హరయో జగ్మురుత్తమామ్ ||

తా|| ఆప్పుడు ఆ మహేంద్రగిరి పర్వతముయొక్క శిఖరముపైన హనుమంతుడు తదితర వానర ప్రముఖులు కలిసి మిక్కిలి సంతోషముతో నుండిరి

జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్చదనిలాత్మజమ్|
కథం దృష్టా త్వయాదేవి కథం వా తత్ర వర్తతే ||
తత్వత సర్వ మేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే
స నియుక్తతస్తేన సంప్రహృష్టతనూరుహః |
ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత ||

తా|| ఆప్పుడు జాంబవంతుడు జరిగిన కార్య వృత్తాంతమును గురించి హనుమంతుని అడిగెను." నీవు ఆ దేవిని ఎట్లు చూసితివి ? ఆమె అచట ఎట్లున్నది? ఓ మహాకపీ ఆవిషయములన్నిటినీ మాకు చెప్పుము ." ఆట్లు జాంబవంతుడు అడిగినపిమ్మట హనుమంతుడు పులకించినవాడై సీతాదేవికి శిరస్సుతో నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను.

ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ ఖమాప్లుతః |
ఉదధేర్దక్షిణం పారం కాంక్షమాణస్సమాహితః ||
గచ్చతశ్చ హి మే ఘోరం విఘ్నరూప మివాభవత్ |
కాంచనం శిఖరం దివ్యం కాంచనం నగముత్తమమ్ ||
స్థితం పంధాన మావృత్య మేనే విఘ్నం చ తం నగమ్|
ఉపసంగమ్య తం దివ్యం కాంచనం నగముత్తమమ్||
కృతామేమనసా బుద్ధిః భేత్తవ్యో అయమ్ మయేతి చ|
ప్రహతం చ మయా తస్య లాంగూలేన మహాగిరిః ||
శిఖరం సూర్య సంకాశం వ్యశీర్యత సహస్రథా |
వ్యవసాయం చ తం బుధ్వా సహోవాచ మహాగిరిః ||

తా|| నేను మహేంద్రగిరి నుంచిదక్షిణతీరము చేరుటకు ఆకాశములోకి ఎగురుట మీరు ప్రత్యక్షముగా చూచితిరిగదా ! నేను వెళ్ళుచుండగా నాకు ఒక మహా విఘ్నము ఎదురయ్యెను. అది మిక్కిలి మనోహరమైన దివ్యమైన కాంచన పర్వతము. నా దారికి అడ్డుగా నిలిచిన ఆ శిఖరమును నేను విఘ్నముగా భావించితిని. దివ్యమైన ఆ శిఖరమును సమీపించి దీనిని చేదించవలనని మనస్సులోనే భావించి, ఆ శిఖరమును నా లాంగూలముతో కొట్టితిని. ఆ దెబ్బకి అ మహాశిఖరము కింద పడి నా సాహసము గుర్తించి నాతో ఇట్లనెను.

రామస్య చ మయా సాహ్యే వర్తితవ్యమరిందమ |
రామోధర్మభృతాం శ్రేష్ఠో మహేంద్రసమవిక్రమః ||
ఏతచ్చ్రుత్వా వచస్తస్య మైనకస్య మహాత్మనః ||
కార్య మావేద్య తు గిరేః ఉద్యతం చ మనో మమ
తేన చాహమనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా ||

తా|| " శ్రీరాముడు ధర్మరక్షకులలో శ్రేష్టుడు. విక్రమములో దేవేంద్రునితో సమానుడు. ఓ శత్రుసంహారకా ! అ శ్రీరామునకు సహాయపడుట నావిధి ". ఆ మహాత్ముడైన మైనాకుని ఆ వచనములను విని , అతనికి నేను నిర్వహింపవలసిన రామకార్యము దెలిపితిని . పిమ్మట మహాకాయుడైన మైనాకుని ఆజ్ఞని అనుసరించి ముందుకు సాగుటకు ఉద్యుక్తుడైతిని.

తతః పశ్యామహం దేవీం సురసాం నాగమాతరమ్ |
సముద్రమధ్యే సా దేవీ వచనం మామభాషత ||
మమ భక్షః ప్రదిష్టస్త్వం అమరైర్హరిసత్తమ|
అతస్త్వాం భక్షయిష్యామి విహితస్త్వం చిరస్యమే ||
ఏవముక్త స్సురసయా ప్రాంజలిః ప్రణతః స్థితః|
వివర్ణవదనో భూత్వా వాక్య చేద ముదీరయమ్ ||

తా|| అప్పుడు నేను సురస అను నాగమాతను చూచితిని. సముద్రమధ్యములో ఆ దేవి నాతో ఇట్లు పలికెను. " ఓ వానరోత్తమా నిన్ను దేవతలు నాకు ఆహారముగా పంపితిరి. నీవు చాలాకాలముతరువాత లభించితివి. కనుక నిన్ను భక్షించెదను." ఈ విధముగా పలికిన ఆ సురసతో అంజలిఘటించి ప్రణామము చేసి ఇట్లు పలికితిని

కర్తుమర్హసి రామస్య సాహాయ్యం విషయేసతీ|
అథవా మైథిలీమ్ దృష్ట్వా రామం చాక్లిష్టకారణమ్||
ఆగమిష్యామి తేవక్త్రం సత్యం ప్రతిశృణోమితే |
ఏవముక్తా మయాసాతు సురసా కామరూపిణీ ||
అబ్రవీన్నాతివర్తేత కశ్చిదేష వరో మమ |
ఏవముక్తస్సురసయా దశయోజన మాయతః ||
తతోర్థగుణ విస్తారో భభూవాహం క్షణేనతు |
మత్ప్రమాణానురూపం చ వ్యాదితం తు ముఖం తయా ||

తా|| " రామునియొక్క విషయములో నీవుకూడా సహాయము చేయుట యుక్తము. లేక అసహాయశూరుడైన రాముని భార్య అగు మైథిలిని చూచి తిరిగి నీ కడకు వచ్చెదను. ఇది సత్యము " . ఈ విధముగా కామరూపిణి అగు సురసతో చెప్పితిని. అంతట " నన్నుఎవరును తప్పించుకొని పోజాలరు. ఇది నా వరము " అని ఆ సురస పలికెను. ఈ విధముగా సురస పలుకగా ఒక క్షణములో పదియోజనములు పొడవు దానిలో సగము వెడల్పుగా నా శరీరమును పెంచితిని . నా రూపమునకు అనుగుణముగా ఆమె తన నోటిని తెఱచెను.

తదృష్ట్వా వ్యాదితం త్వాస్యం హ్రస్వం హ్యకరవం వపుః |
తస్మిన్ ముహూర్తే చ పునః భభూవాంగుష్ఠమాత్రకః ||
అభి పత్యాసు తద్వక్త్రం నిర్గతోహం తతః క్షణాత్ |
అబ్రవీత్ సురసాదేవీ స్వేన రూపేణ మాం పునః ||
అర్థసిధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖమ్ |
సమానయచ వైదేహీమ్ రాఘవేణ మహాత్మనా ||

తా|| ఆది చూచి నా శరీరమును చిన్నదిగా చేసి ఆ క్షణములో అంగుష్టమాత్రుడనైతిని. అతివేగముగా ఆమె నోటిలో ప్రవేశించి తత్ క్షణమే బయటికి వచ్చితిని. పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమును దాల్చి మఱల నాతో ఇట్లు పలికెను. " ఓ వానరోత్తమా సౌమ్యుడా కార్యసిద్ధికై వెళ్ళిరమ్ము. వైదేహిని శ్రీరామునితో చేర్చుము" అని.

తతోంతరిక్షం విపులం ప్లుతోహం గరుడో యథా |
చాయామే నిగృహీతా చ న చ పశ్యామి కించన ||
తతోమే బుద్ధిరుత్పన్నా కిన్నామ గమనే మమ |
ఈదృశో విఘ్న ఉత్పన్నో రూపం యత్ర నదృశ్యతే ||
అధో భాగేన మే దృష్ఠి శోచతా పాతితా మయా |
తతోద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయామ్ ||
తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్ |
తస్య హృదయమాదాయ ప్రపతామి నభః స్థలమ్ ||

తా|| అనంతరము విశాలమైన అంతరిక్షమున గరుడు వలె ఎగిరితిని . అంతలో నాఛాయను ఎవరో గట్టిగా పట్టుకొనినట్లు కనిపించెను. కాని ఏవరూ కనపడలేదు. ఇట్లు ఆలోచించుచుండగా నాదృష్టి అధోభాగమునకు మళ్ళెను. అప్పుడు సముద్రజలమందున్న భయంకర రాక్షసి నాకు కనపడెను. అప్పుడు నా శరీరమును చిన్నదిగా చేసి క్షణములో అమెలో ప్రవేశించి ఆమె హృదయమును చీల్చి బయటికి వచ్చి ఆకాశమునకు ఎగిరితిని.

శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణైస్సహా |
రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతా హతా ||
తం హత్వా పునరేవాహం కృత్యమాత్యయికం స్మరన్ |
గత్వా చాహం మహాధ్వానాం పశ్యామి నగమండితమ్|
దక్షిణం తీరముదధేః లంకా యత్ర చ సా పురీ ||

తా|| అప్పుడు " భయంకరమైన సింహిక అను రాక్షసిని హనుమంతుడు హతమొనర్చెను" అని చారణులు పలుకుచున్న వచనములు నా చెవిలో బడెను. ఆమెను హతమొనర్చి, చేసిన కార్యమును స్మరించుచూ నేను బహు దూరము పోగా వృక్షములతో అలరాఉచున్న , లంకానగరి వున్న దక్షిణతీరమును చూచితిని.

తత్ర ప్రవిశతశ్చాపి కల్పాంత ఘనసన్నిభా|
అట్టహాసం విముంచంతీ నారీ కాప్యుత్థితా పురః ||
జిఘాం సంతీం తతస్తాంతు జ్వలదగ్ని శిరోరుహామ్|
సవ్యముష్టిప్రహారేణ పరాజిత్య సు భైరవామ్ |
ప్రదోషకాలే ప్రవిశం భీతయాహం తయోదితః ||

తా|| నేను ఆ లంకలో ప్రవేశించుచుండగా ప్రళయకాల మేఘసదృశమైన ఒక స్త్రీ అట్టహాసముచేయుచూ నా ఎదుట నిలబడెను. పిదప అగ్నిజ్వాలల వంటి కేశములుగల అ స్త్రీ నాపై దాడిచేసెను. అ భయంకరమైన రాక్షసిని ఎడమచేతితో కొట్టి పరాజించితిని. ప్రదోషకాలములో ప్రవేశించుచున్న నన్ను చూచి భయపడి ఆమె నాతో ఇట్లు పలికెను.

అహం లంకాపురీ వీర నిర్జితా విక్రమేణ తే |
యస్మాత్ తస్మాద్విజేతాసి సర్వ రక్షాంస్య శేషతః ||
తత్రాహం సర్వ రాత్రం తు విచిన్వన్ జనకాత్మజమ్ |
రావణాంతఃపురగతో నచాపశ్యం సుమధ్యమామ్||
తతస్సీతామపశ్యంతు రావణస్య నివేశనే |
శోక సాగరమాసాద్య న పారముపలక్షయే ||

తా|| " నేను లంకాపురీదేవతను. నీ పరాక్రముము చే జయింపబడితిని. నన్ను జయించిన నీవు మిగిలిన రాక్షసులను జయించెదవు" అని. అప్పుడు జానకీదేవి జాడకనుగొనుటకు ఆ రాత్రి అంతయూ వెదుకుచూ రావణ అంతఃపురమున అడుగిడితిని. అయినను ఆమె కనపడలేదు. రావణ అంతఃపురములో సీతను గానక నేను తీరములేని శోకసాగరములో పడితిని.

శోచతా చ మయా దృష్టం ప్రాకారేణ సమావృతమ్|
కాంచనేన వికృష్టేన గృహోపవనముత్తమమ్||
స ప్రాకార మవప్లుత్య పశ్యామి బహుపాదపమ్ |
అశోకవనికా మధ్యే శింశుపాపాదపో మహాన్ ||
తమారుహ్య చ పశ్యామి కాంచనం కదలీవనమ్|
అదూరే శింశుపావృక్షాత్ పశ్యామి వరవర్ణనీమ్||
ఏకవేణీధరా దీనా భర్తృచింతాపరాయణా |
భూమిశయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే||

తా|| శోకములోనున్న నాకు విశాలమైన బంగారు ప్రాకారముగల సర్వోత్త మైన ఒక గృహోపవనము కనిపించెను. అంతట నేను ఆ ప్రాకారముదాటి అనేక వృక్షములతో గల అశోకవనమును చూచితిని. ఆ అశోకవన మధ్యభాగములో ఒక పెద్ద శింశుపావృక్షము కనపడెను. ఆ చెట్టుపైకి ఎక్కి ఒక బంగారు రంగు గల కదలీ వనమును గాంచితిని. ఆ శింశుపావృక్ష సమీపమున బంగారు ఛాయగల సీతాదేవిని చూచితిని. ఆమె దీనముగా ఒకే జడతో భర్తగురించి చింతించుచూ , భూమిపై శయనించుచున్నది. ఆమె మంచు తాకిడికి వివర్ణమైన పద్మమువంటి వదనముకలది

తతో హలహలాశబ్దం కాంచీనూపుర మిశ్రితమ్|
శృణోమ్యధిక గంభీరం రావణస్య నివేశనే ||
తతో రావణదారాశ్చ రావణశ్చ మహాబలః|
తందేశం సమనుప్రాప్తా యత్ర సీతా భవత్ స్థితా ||

తా|| అప్పుడు రావణుని గృహమునుండి ఒడ్డాణముల ధ్వనులతో , కాళ్లకు కట్టిన అందెల ధ్వనులతో గూడిన గలగలధ్వనులు వినిపించెను. ఆప్పుడు మహాబలశాలి అగు రావణుడు తన భార్యలతో ఎక్కడ సీతాదేవివున్నదో అచటికి వచ్చెను..

తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితామ్ |
అవాక్చిరాః ప్రపతితో బహుమన్యస్వమామితి ||
యదిచేత్ త్వంతు దర్పానాం నాభినందసి గర్వితే|
ద్వౌ మాసానంతరం సీతే పాస్యామి రుధిరం తవ ||
ఏతత్చ్రుత్వా వచస్తస్య రావణస్య దురాత్మనః |
ఉవాచ పరమక్రుద్ధా సీతా వచనమబ్రవీత్ ||
రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః |
ఇక్ష్వాకులనాథస్య స్నుషాం దశరథస్య చ|||
అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితా తవ |
కింస్విద్వీర్యం తవానార్య యో మాం భర్తురసన్నిధౌ||
అపహృత్యాగతః పాప తేనాదృష్టో మహాత్మనా|

తా|| పరమ దుఃఖములోనున్న సీతాదేవికి దశకంఠుడైన రావణుడు శిరస్సువంచి ఇట్లనెను ." ఓ సీతా నాప్రేమను ఆదరింపుము. గర్విష్టురాలా ! ఒకవేళ అహంకారముతో నన్ను అభినందించక పోయినచో రెండు మాసముల తర్వాత నీ రక్తము తాగెదను ! ". దురాత్ముడైన రావణుడు పలికిన మాటలు విని అత్యంత క్రోధితురాలైన సీత ఉత్తమమైన వచనములతో ఇట్లు పలికెను. " ఓ రాక్షసాధమా నేను మిక్కిలి తేజోవంతుడైన శ్రీరాముని భార్యను. ఇక్ష్వాకు కులనాథుడు అయిన దశరథుని కోడలిని. మాట్లాడతగని మాటలతో మాట్లాడిన నీ నాలుక తెగి ఏలనేలపై పడదు ? నా భర్త సమీపములేనప్పుడు అ మహామహుని దృష్టి కి దూరముగా నున్నప్పుడు నన్ను అపహిరించిన నీ పరాక్రమము ఎట్టిది?

జానక్యా పరుషం వాక్యం ఏవముక్తో దశాననః |
జజ్వాల సహసా కోపాత్ చితాస్థ ఇవ పావకః ||
తతస్తాభిస్సమేతాభిః నారీభిస్స మహాబలః|
ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః ||
యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననః|
సీతామ్ నిర్భర్తృయామాసః వాక్యైః కౄరైస్సుదారుణైః ||
తృణవద్భాషితం తాసాం గణయామాస జానకీ|
గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్థకమ్ ||

తా|| జానకీ దేవియొక్క పరుషమైన వాక్యములు విని రావణుడు చితాగ్ని వలె కోపముతో మండిపడెను. అప్పుడు, కూడావచ్చిన నారీగణము రావణుని ప్రసన్నునిగాచెసికొని తమతో ఆతనిని ఆయన భవనమునకు తీసుకుపోయిరి. ఆ రావణుడు వెళ్ళిన పిమ్మట వికృతాననలైన ఆ రాక్షసస్త్రీలు అందరును కౄరమైన పరుషములైన వచనములతో సీతాదేవిని మిక్కిలి భయపెట్టసాగిరి. సీతాదేవి వారి వచనములను తృణముకింద పరిగణించెను. వారి గర్జనలు ఆమెఏడల ఏమాత్రము పనిచేయకపోయెను.

తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటా వాక్యమబ్రవీత్ |
ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి |
జనకస్యాత్మజా సాధ్వీ స్నుషా దశరథస్య చ ||
స్వప్నో హ్యద్య మయాదృష్టో దారుణో రోమహర్షణః|
రక్షసాం చ వినాశాయ భర్తురస్యా జయాయ చ ||
అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాత్ రాక్షసీగణమ్|
అభియాచామ వైదేహీమ్ ఏతద్ధి మమరోచతే ||

తా|| వారి మధ్యలో అప్పుడే లేచిన త్రిజట అను రాక్షసి ఇట్లు పలికెను." మిమ్ములను మీరే తినివేయుడు. సీతాదేవిని నశింపజేయ జాలరు. సీతాదేవి జనక మహారాజుని కూతురు. దశరథుని కోడలు. నేను దారుణమైన గగుర్పాటు కలగించు స్వప్నము చూసితిని. అది రాక్షస వినాశము శ్రీరాముని జయము సూచించుచున్నది. మనలను శ్రీరామునినుండి రక్షించుటకు ఈమెకే సాధ్యము. కనుక మనము ఈమెను వేడు కొనుటయే సముచితమని నాకనిపించుచున్నది" .

తతసా హ్రీమతీ బాలా భర్తృర్విజయ హర్షితా |
అవోచద్యది తత్ తథ్యం భవేయం శరణం హి వః ||
తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణం దశామ్|
చింతయామాస విక్రాంతో న చ మే వికృతం మనః ||
సంభాషనార్థం చ మయా జానక్యా శ్చింతితో విధిః |
ఇక్ష్వాకూణాం హి వంశస్తు తతో మమపురస్కృతః ||
శ్రుత్వాతు గదితామ్ వాచం రాజర్షిగణపూజితామ్ |
ప్రత్యభాషత మాం దేవీ భాష్పైః పిహితలోచనా ||
కస్త్వం కేన కథం చేహ ప్రాప్తో వానరపుంగవః |
కాచ రామేన తే ప్రీతిః తన్మే శంసితుమర్హసి |
తస్యాస్తద్వచనం శ్రుత్వా హ్యహమప్యబ్రవం వచః ||

తా|| అప్పుడు సీతాదేవి భర్తకు విజయము కలుగును అనుమాటకు హర్షితురాలై బిడియముతో " అదియే తథ్యమగుచో మీకు నేను అభయమిత్తును" అని పలికెను. సీతాదేవియొక్క అట్టి దారుణ దశని చూచి నేను మిక్కిలి దుఃఖాక్రాంతుడనైతిని. ఏంత ఆలోచించిననూ నామనస్సు కుదుటబడలేదు. సీతాదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయము గురించి నేను ఆలోచించితిని. ఫిమ్మట సీతాదేవికి వినపడునటుల ఇక్ష్వాకు వంశ ప్రభువుల ఔన్నత్యమును వర్ణించితిని. రాజర్షిగణ పరంపరను గూర్చి నేను చెప్పిన మాటలువినిన సీతాదేవి అశ్రుపూర్ణములైన నేత్రములతో నాతో ఇట్లు పలికెను. " ఓ వానరోత్తమా నీవు ఏవరు? నిన్ను పంపినదెవరు ? ఇఛటికి ఎట్లు వచ్చితివి ? నీకు శ్రీరామునితో మైత్రి ఎట్లు అయ్యెను ? ఈ విషయములను పూర్తిగా వివరింపుము" అని. ఆమె చెప్పిన మాటలను విని నేను ఇట్లు పలికితిని.

దేవీ రామస్య భర్తుస్తే సహాయో భీమవిక్రమః |
సుగ్రీవోనామ విక్రాంతో వానరేంద్రో మహాబలః ||
తస్య మాం విద్ధి భృత్యం త్వం శంసితు మర్హసి |
భర్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణా క్లిష్టకర్మణః ||
ఇదం చ పురుషవ్యాఘ్రః శ్రీమాన్ దాశరథిస్వయమ్|
అంగుళీయమభిజ్ఞానం ఆదాత్ తుభ్యం యశస్విని ||
తదిచ్చామి త్వయా జ్ఞప్తం దేవీం కిం కరవాణ్యహమ్|
రామలక్ష్మణయో పార్శ్వమ్ నయామి త్వాం కిముత్తరమ్||

తా|| " ఓ దేవీ సుగ్రీవుడను వానర ప్రభువు నీ భర్త అయిన శ్రీరామునకు సహాయకుడు. అతడు మహాబలసంపన్నుడు. నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను. నా పేరు హనుమంతుడు. అసహాయశూరుడు నీ భర్త అయిన శ్రీరాముడునిన్ను వెదకుటకై పంపగా నేను ఇచటికి వచ్చితిని. ఓ పూజ్యులారా శ్రీమంతుడుఅయిన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగుళీయకమును నీకు ఇవ్వమని స్వయముగా ఇచ్చెను. ఓ దేవీ నేను ఏమి చేయవలనో దయతో ఆజ్ఞాపింపుము. నేను రామలక్ష్మణులసన్నిధికి నిన్ను చేర్చగలను. నీ ఆదేశమేమి? అని.

ఏతచ్చ్రుత్వా విదిత్వా చ సీతా జనకనందినీ
ఆహ రావణముత్పాద్య రాఘవో మాం నయత్వితి ||
ప్రణమ్య శిరసా దేవీం అహమార్యామనిందితామ్|
రాఘవస్య మనోహ్లాదం అభిజ్ఞానమయాచిషమ్||
అథ మామబ్రవీత్ సీతా గృహ్యతామయముత్తమః|
మణిర్యేవ మహాబాహూ రామస్త్వాం బహుమన్యతే ||
ఇత్యుక్త్వా వరారోహా మణిప్రవర మద్భుతమ్|
ప్రాయచ్చత్ పరమోద్విగ్నా వాచా మాం సందిదేశ హా ||
యద్యన్యథా భవేదేతత్ ద్వౌమాసౌ జీవితం మమ |
న మాం ద్రక్ష్యతి కాకుత్ స్థో మ్రియే సాహ మనాధవత్ ||

తా|| సీతాదేవి నా వచనములను విని , విషయములను గ్రహించి, " రాఘవుడు రావణుని సంహరించి నన్ను కొనుపోవుట యుక్తము " అని పలికెను. పూజ్యురాలైన సీతాదేవికి ప్రణమిల్లి శ్రీరాముని మనస్సుకు ఆహ్లాదముగూర్చెడి ఆనవాలు ఇవ్వమని అర్థించితిని. అంతట సీతాదేవి " సర్వోత్కృష్టమైన ఈ చూడామణిని గ్రహింపుము. దీనిని చూసి ఆజానుబాహువుడైన ఆ స్వామి నిన్ను సాదరముగా అభినందించును" అని పలికెను. ఈ విధముగా పలికి పిమ్మట సీతాదేవి అత్యద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి కలత చెందిన మనస్సుతో నాతో మళ్ళీ సందేశవచనములను పలికెను. " ఓ వానరా ! నేను రెండు మాసములు మాత్రమే జీవించియుండునది. వెంటనే ఇచటికి రానిచో శ్రీరాముడు నన్ను చూడజాలడు. నేను ఈ రాక్షసులమధ్యలో అనాధవలె తనువును చాలింతును "

తచ్చ్రుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత |
ఉత్తరం చ మయా దృష్టం కార్య శేష మనంతరమ్||

తా|| ఆ కరుణను కలగించు దైన్య వచనములను వినగానే నాకు మిక్కిలి కోపము వచ్చెను. అప్పుడు చేయవలసిన మిగిలిన కార్యక్రమము గురించి ఆలోచించితిని

తతోవర్ధత తమేకాయః తదా పర్వత సన్నిభః|
యుద్ధకాంక్షీ వనం తచ్చవినాశయితుమారభే ||
తచ్రుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృశదుర్జయాః |
రాక్షసాః కింకరాః నామ రావణస్య మనోనుగాః||
తేషామశీతి సాహస్రం శూలముద్గరపాణినామ్ |
మయా తస్మిన్ వనోద్దేసే పరిఘేణ నిషూదితమ్||

తా|| పిమ్మట నా శరీరమును పర్వతమంతగా పెంచి యుద్ధకాంక్షతో ఆ వనమును ధ్వంసము చేయనారంభించితిని. ఆ వార్తను వినిన పిమ్మట రావణుడు తనమనస్సుని ఎరిగి ప్రవర్తించువారును దుర్జయులు అగు కింకరులు అను రాక్షసులను పంపెను. శూలములు ఇనుపగుదియలను చేతబట్టి యుద్ధమున నాతో తలపడుటకై ఎనుబదివేల రాక్షసులు ఆ ప్రదే్శమునకు వచ్చిరి. వారినందరిని నేను ఇనుప గుదియతో హతమార్చితిని.

తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినమాదిశత్ |
రాక్షసైర్బహుభిస్సార్థం ఘోర రూపైర్భయానకైః ||
తమహం బలసంపన్నం రాక్షసం రణకోవిదమ్ |
పరిఘేణాతిఘోరేణ సూదయామి సహానుగమ్||
తచ్చ్రుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలాన్||
పదాతి బలసంపన్నామ్ ప్రేషయామాస రావణః|
పరిఘేణేన తాన్ సర్వాన్ నయామి యమసాదనమ్||

తా|| అప్పుడు ప్రహస్తుని పుత్రుడైన జంబుమాలిని భయంకరులు ఘోరరూపముగల రాక్షసులతో కూడి నాతో యుద్ధము చేయుటకు ఆదేశించెను.
నేను మహాబలశాలి రణకోవిదుడైన జంబుమాలిని వాని అనుచరులను భయంకరమైన పరిఘతో హతమార్చితిని. ఆది విని రావణుడు మహాబలములతో గూడిన మంత్రి పుత్రులను వెంటనే సమరమునకు పంపెను. వారినందరిని క్షణములోనే పరిఘతో యమసదనమునకు పంపితిని.

మంత్రి పుత్రాన్ హతాన్ శ్రుత్వా సమరే లఘువిక్రమాన్|
పంచసేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః||
తానహం సహసైన్యాన్ వై సర్వానేవాభ్యసూదయమ్|
తతః పునర్దశగ్రీవః పుత్రమక్షం మహాబలమ్|
బహుభీ రాక్షసైస్సార్ధం ప్రేషయామాస రావణః||
తంతు మండోదరీపుత్రం కుమారం రణపండితమ్||
సహసా ఖం సముత్క్రాం పాదయోశ్చ గృహీతవాన్|
చర్మాసినం శతగుణం భ్రామయిత్వా వ్యపేషయమ్||

తా|| మంత్రిపుత్రులందరూ హతులైన విషయమును వినిన రావణుడు మహాశూరులైన ఇదుగురు సేనానాయకులను సైన్యములతో పంపెను. నేను ఆ సేనానాయకులను వారి సైన్యముతో కలిపి హతమార్చితిని ఆప్పుడు దశగ్రీవుడు మిక్కిలి బలశాలియూ తన పుత్రుడైన అక్షకుమారుని పెక్కుమంది రాక్షసులతో గూడి నాపై యుద్ధమునకు పంపెను. అ మండోదరీపుత్రుడు రణశూరుడు అయిన అక్షకుమారుడు డాలునూ ఖడ్గమును చేతబూని ఆకాశమునకు ఎగిరెను. నేను వెంటనే అతని పాదములు చిక్కించుకొని వానిని వందసార్లు గిరగిరా తిప్పి విసిరివేసితిని.

తమక్షమాగతం భగ్నం నిశమ్య స దశాననః |
తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణస్సుతమ్|
వ్యాదిదేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదమ్||
బ్రాహ్మణేస్త్రాణేన స తు మాం ప్రాబధ్నాచ్చాతివేగితః|
రజ్జుభిశ్చాభిబధ్నంతి తతో మాం తత్ర రాక్షసాః ||

తా|| నా చేతిలో అక్షకుమారుడు హతుడైన విషయమునువిని రావణుడు ఆ దశాననుడు క్రుద్ధుడై మహాబలశాలి యుద్ధోన్మత్తుడు అయిన ఇంద్రజిత్ అనబడెడి రెండవ పుత్రుని నా తో యుద్ధమొనర్చుటకు ఆజ్ఞాపించెను. అతడు నన్ను బ్రహ్మాస్త్రముచేత బంధించెను. అతని అనుచరులు అయిన రాక్షసులు నన్ను త్రాళ్ళతో కట్టివేసిరి.

రావణశ్చ సమీపం చ గృహీత్వా మాముపానయన్ |
దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మనా ||
పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాం చ తం వధమ్ |
తత్సర్వంచ మయాతత్ర సీతార్థమితి జల్పితమ్||
రామదూతం చ మావిద్ధి సుగ్రీవ సచివం కపిమ్|
సోహం దూత్యేన రామస్య త్వత్సకాశమిహాగతః ||
శృణు చాపి సమాదేశం యదహం బ్రవీమితే |
రాక్షసేశ హరీశస్త్వాం వాక్యమాహ సమాహితమ్||

తా|| పిదప వారు నన్ను రావణుని సమీపమునకు తీసుకువెళ్ళిరి. దుష్టుడైన రావణుడు నాతో సంభాషింపసాగెను. నా లంకాగమనమునకును ఆ రాక్షసులను వధించుటకును గల కారణములడిగెను . " ఓ రాక్షసరాజా ఆ పనులన్నింటినీ సీతాదేవి నిమిత్తమై చేసితిని . నన్ను రాముని దూతగా , సుగ్రీవుని మంత్రిగా తెలిసికొనుము. నేను రాముని దూతగా నీకడకు వచ్చితిని . ఓ రాక్షసరాజా ! సుగ్రీవుడు నీ హితముగోరి ఒక సందేశము పంపెను. శ్రద్ధగా అలకింపుము" అని చెప్పితిని.

క్షిప్రమానీయతామ్ సీతా దీయతాం రాఘవాయచ|
యావన్నహరయో వీరా నిధమంతి బలం తవ ||
ఇతి వానరరాజస్త్వాం అహేత్యభిహితో మయా |
మామైక్షత తతః క్రుద్ధః చక్షుసా ప్రహసన్నివ ||
తేన వధ్యో హమాజ్ఞప్తో రక్షసా రౌద్రకర్మణా |
మత్ప్రభావమవిజ్ఞాయ రావణేన దురాత్మనా||

తా|| "వీరులైన వానరులు మీ బలములను రూపుమాపకముందే వెంటనే సీతాదేవిని శ్రీరామునికి అప్పగింఛుము" అని వానరరాజైన సుగ్రీవుడు ఈ సందేశమును నీకు పంపెను. వెంటనే రావణుడు క్రుద్ధుడై తనచూపులతోనే నన్ను దహించునా అనునట్లు చూసెను. కౄరకర్మలను ఆచరించు వాడును, దుష్టుడైన రావణుడు నా శక్తిసామర్థ్యములు తెలియక నన్ను చంపుటకై ఆజ్ఞాపించెను.

తతో విభీషణోనామ తస్య భ్రాతామహామతిః|
తేన రాక్షసరాజో అసౌ యాచితో మమకారణాత్||
సుమహత్యపరాధేపి దూతస్యాతులవిక్రమ:|
విరూపకరణం దృష్టం నవధో అస్తీతి శాస్త్రతః ||
విభీషణేనైవ ముక్తో రావణ స్సందిదేశ తాన్|
రాక్షసానేత దేవాస్య లాంగూలమ్ దహ్యతామితి ||
తతస్తే రాక్షసా శ్శూరాః బద్ధం మామగ్నిసంవృతమ్|
అఘోషయన్ రాజమార్గే నగరద్వార మాగతః ||

తా|| అప్పుడు అతడి తమ్ముడు మంచిబుద్ధిగలవాడు అగు విభీషణుడు నా విషయమై ఇట్లు అభ్యర్థించెను. " ఓ సాటిలేని పరాక్రమము గలవాడా దూత ఎంతటి అపరాధమొనర్చిననూ అతనిని వికృతరూపునిగా చేయవచ్ఛును గాని చంపరాదు అని శాస్త్రములు చెప్పుచున్నవి" అని . విభీషణుడు అట్లు పలుకగా రావణుడు, " అది సరే చాలామంచిది. అట్లేకానిమ్ము. ఇతని వాలమునకు నిప్పంటించుడు " అని రాక్షసులను ఆదేశించెను. అంతట బంధింపబడి అగ్నిజ్వాలలమధ్య చిక్కుపడిన నన్ను నగరద్వారము కడకు తి్సుకుపోయి " ఈ వానరుని చూడుడు " అని నావిషయమును అందఱికి చాటించిరి.

తతో హం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః|
విమోచయిత్వా తం బంధం ప్రకృతిస్థః స్థితః పునః||
పుచ్చేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురామ్|
దహామ్యహ మసంభ్రాన్తో యుగాన్తాగ్ని రివ ప్రజాః||
వినష్టా జానకీ వ్యక్తం న హ్యదగ్ధః ప్రదృశ్యతే |
లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ||

తా|| పిమ్మట నేను నా బృహద్రూపమును చిన్నది గాచేసి బంధములను విడిపించికొంటిని. మరల యధాప్రకారము నాదేహము పెంచితిని . వాలాగ్ని జ్వాలలతో బుఋజులు గోపురములుగల ఆ లంకానగరమును ప్రళయాగ్ని ప్రజలను దహించునట్లు దహించివేసితిని. లంకానగరమునందు ప్రతిప్రదేశము భగ్నమైపోయెను.కనుక సీతాదేవి కూడా అగ్నిలో దగ్ధమై పొయియుండును అనిపించెను.

ఇతిశోక సమావిష్టః చింతామహముపాగతః |
అథాహం వాచ మశ్రౌషం చారణానాం శుభాక్షరామ్ ||
జానకీ న చ దగ్ధేతి విస్మయో దంత భాషితామ్ |
తతోమె బుద్ధిరుత్పనా శ్రుత్వా తామద్భుతాం గిరమ్|
అదగ్ధా జానకీ త్యేవం నిమిత్తైశ్చ్ఫలక్షితా ||

తా|| ఈ విధముగా నేను దుఃఖముతో చింతింపసాగిని. అప్పుడు చారణులు పలికిన " జానకీదేవి క్షేమముగా నున్నది" అను ఆశ్చర్యకరమైన అద్భుతమైన శుభవాక్యములను వింటిని. కనపడిన శకునములను బట్టి " జానకీదేవి దగ్ధము కాలేదు" అనియే నేను అనుకొంటిని.

పునర్దృష్ట్వా చ వైదేహీం విశ్రుష్టశ్చ తయాపునః|
తతః పర్వతమాసాద్య తత్రారిష్టమహం పునః|
ప్రతిప్లవనమారేభే యుష్మద్దర్శన కాంక్షిణః ||
రాఘవయ ప్రభావేణ భవతాం చైవ తేజసా |
సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వ మనుష్టితమ్||

తా|| మఱల సీతాదేవి దర్శనము చేసికొని అప్పుడు అరిష్టమను పర్వతమునకు చేరితిని. మిమ్ములను చూడకోరికతో పునః సముద్ర లంఘనమును ఆరంభించితిని. రాఘవుని ప్రభావమువలన మీ అనుగ్రహమువలన సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యము నెరవేర్చుటకు ఈ పనులన్నీ చేసితిని.

ఏతత్సర్వం మయా తత్ర యథావదుపపాదితమ్|
తత్ర య న్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి ||

తా|| ఈ అన్నికార్యములూ నేను అచట యధోచితముగా చేసితిని. ఇంక మిగిలియున్న కార్యములు మనము చేయవలసినది.

|