Sundarakanda Chapter 64

Hanuman tells SriRama that

Sita is safe

Chapter 64: Summary Dadhimukha then returns to Madhuvana and conveys to the Vanaras that Sugriva wants them to return immediately. The Vanaras led by Hanuman and Angada immediately reach the Prasravana mountain to meet SriRama. Hanuman then informs SriRama that Sita is safe !

For telugu Home page

click here


సుందరాకాండ
అఱువది నాలుగవ సర్గము

సుగ్రీవేణైవ ముక్తస్తు హృష్టో దధిముఖః కపిః |
రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చాభ్యవాదయత్ ||

తా|| వానరుడైన దధిముఖుడు సంతోషపడినవాడై సుగ్రీవుని ఆజ్ఞని పొంది రామలక్ష్మణులకు సుగ్రీవునకు నమస్కరించెను.

స యథైవాగతః పూర్వం తథైవ త్వరితం గతః |
నిపత్య గగనాద్భూమౌ తద్వనం ప్రవివేశ హ ||

తా|| ఆ దధిముఖుడు పూర్వము ఏవిధముగా వచ్చెనో అదేవిధముగా తిరిగి వేగముగా పయనించి గగనమునుంచి భూమిపైదిగి మధువనమును ప్రవేశించెను.

స తానుపాగమద్వీరో బధ్వా కరపుటాంజలిమ్ |
ఉవాచ వచనం శ్లక్షమ్ ఇదం హృష్టవదంగదమ్ ||

తా|| ఆ వీరుడు ఆ వానరులసమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదుమధుర వచనములతో ఇట్లు పలికెను

మౌర్ఖాత్పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతు మర్హతి |
యథైవ హి పితా తేభూత్ పూర్వం హరిగణేశ్వరః ||
త్వథా త్వమపి సుగ్రీవో నాన్యస్తు హరిసత్తమః |
ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ |
ఇహోపయానం సర్వేషామ్ ఏతేషాం వనచారిణామ్ ||
ప్రహృష్టో న తురుష్టో సౌ వనం శృత్వా ప్రధర్షితమ్ |
ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో వానరేశ్వరః ||
శీఘ్రం ప్రేషయ సర్వాం స్తాన్ ఇతిహోవాచ పార్థివః|
శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్షమంగదః ||

తా|| " మూర్ఖత్వమువలన పూర్వము తప్పుచేసితిమి. నీవు మాదోషములను మన్నింపుము ఇదివరలో మీతండ్రివలెనే ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానరగణములకు ప్రభువులు. ఓ పుణ్యపురుషా ! నేను నీ తండ్రిసమానుడైన సుగ్రీవుని కడకు వెళ్ళి మీరందరూ ఇచ్చతికి వచ్చినట్లు తెలిపితిని. ఆ విషయమును విని అతడెంతయు సంతసించెను. మధువనము ధ్వంసమైన వార్త వినియూ తండ్రిసమానుడైన సుగ్రీవుడు కోపగించలేదు. ఆ ప్రభువు వాఱినందరినీ ఇఛటికి పంపుము అని నన్ను ఆదేశించెను "

అబ్రవీత్ తాన్ హరిశ్రేష్టో వాక్యం వాక్య విశారదః |||
పీత్వా మధు యథా కామం విశ్రాంతా వనచారిణః|
కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః ||
బ్రువతశ్చాంగదస్యైనం శ్రుత్వా వచనముత్తమమ్ |
ప్రహృష్టమనసో వాక్యం ఇద మూచుర్వనౌకసః ||
సర్వే వయమపి ప్రాప్తాః తత్ర గంతుం కృతక్షణాః |
స యత్ర హరివీరాణాం సుగ్రీవః పతిరవ్యయః||

తా|| వానరప్రముఖుడు మాట్లాడుటలో నేర్పరి అయిన అంగడు తనసహచరులతో ఇట్లు పలికెను " వానరులందరూ యదేఛ్చగా మధువును సేవించి విశ్రమించినారు. ఇంక మిగిలినది మన గురువైన సుగ్రీవుడున్న ప్రదేశమునకు పోవుటయే" అని. అంగదుడు వచించిన ఈ మాటలను విని వానరులందరూ సంతుష్టులై ఇట్లు చెప్పిరి. "మేమందరముకూడా వానరయోధులకు ప్రభువైన సుగ్రీవుడు ఎచ్చట ఉండెనో అచటికి పోవుటకు వేచియున్నాము "

ఏవం తు వదతాం తేషామ్ అంగదః ప్రత్యభాషత |
బాఢం గచ్చామ ఇత్యుక్త్వా ఖముత్పేర్మహాబలాః ||

తా|| ఆ వానరులందరూ ఇట్లు పలుకగా అంగదుడు " సరే వెళ్ళుదము" అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఆ బలశాలులందరూ ఉమ్మడిగా ఆకశమునకు ఎగిరిరి .

అంగదే సమనుప్రాప్తే సుగ్రీవో వానరాధిపః |
ఉవాచ శోకోపహతం రామం రామం కమలలోచనమ్ |
సమాశ్వసిహి భద్రం తే దృష్టా దేవీ న సంశయః ||
కౌసల్యా సుప్రజా రామ సమాశ్వసిహ సువ్రత |
దృష్ట్వా దేవీ న సందేహో న చాన్యేన హనూమతా ||
జాబవాన్ యత్ర నేతాస్యాత్ అంగదశ్చ బలేశ్వరః |
హనుమాం శ్చాప్యధిష్ఠాతా న తస్య గతి రన్యథా ||

తా|| అంగదాదులు తమను సమీపించుచుండగా చూచి వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతా విరహకారణముగా మిక్కిలి దుఃఖములోనున్న శ్రీరామునితో ఇట్లనెను. " ఓ రామా ! సీతాదేవి కనపడినది . సందేహములేదు. ఊరడిల్లుము. నీకు భద్రమగును . కౌసల్యమాతకు ఆనందము గూర్చు , నిష్టాపరాయణుడగు ఓ రామా ! ఊరడిల్లుము . సీతాదేవి కనపడినది దానికి సందేహములేదు. చూచినది మరెవ్వరూ కాదు హనుమంతుడే అగును. మహావీరుడైన జాంబవంతుడు మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వము వహించునపుడు వాయుపుత్రుడైన హనుమంతుడు పర్యవేక్షించునప్పుడు ఏకార్యమైననూ సఫలమే అగును ! "

తతః కిల కిలా శబ్దం శుశ్రావసన్నమంబరే ||
హనుమత్కర్మదృప్తానాం వర్ధతాం కాననౌకసామ్ |
కిష్కింధముపయాతానాం సిద్ధిం కథయతామివ ||
తతశ్శ్రుత్వా నినాదం తం కపీనామ్ కపిసత్తమః |
అయతాంచిత లాంగూలః సో భవత్ హృష్టమానసః ||

తా|| అప్పుడు ఆకాశములో కిలకిలాశబ్దము వినపడెను. ఆ శబ్దము హనుమంతుడు సాధించిన సఫలమైన కార్యముచే గర్వించుచూ తమ కార్యసిద్ధిని ప్రకటించుచున్నారా అనునట్లుండెను. అప్పుడు వానరప్రభువైన సుగ్రీవుడు కపీశ్వరుల శబ్దములను విని తన వాలమును నిటారుగా పైకెత్తి తన ఆనందమును ప్రకటించెను

తే అంగద ప్రముఖావీరాః ప్రహృష్టాశ్చ ముదాన్వితాః |
నిపేతుర్హరిరాజస్య సమీపే రాఘవస్య చ ||

తా|| మహావీరులైన అంగదాది ప్రముఖులు ఆనందముతో ఉప్పొంగిపోవుచూ కపిరాజైన సుగ్రీవుడు పురుషోత్తముడైన శ్రీరాముడూ ఉన్నప్రదేశమున దిగిరి !!

హనుమాంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసా తతః |
నియతా మక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్ ||
దృష్టా దేవీతి హనుమద్వదనాదమృతోపమమ్ |
ఆకర్ణ్య వచనం రామో హర్షమాస స లక్ష్మణః ||

తా|| మహాబాహువుడైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమొనర్చి ' సీతామహాసాధ్వి క్షేమముగా నున్నది' అని శ్రీరామునకు నివేదించెను. 'కనుగొంటిని సీతమ్మని ' అను అమృతతుల్యమైన మాటలను హనుమంతుని నోటవిని రామలక్ష్మణులు మహదానంద భరితులైరి

ప్రీత్యా చ రమమాణో అథ రాఘవః పరవీరహా |
బహుమానేన మహతా హనూమంత మవైక్షతా ||

తా|| శతృవీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషముతో ఉప్పొంగిపోయి అత్యంత గౌరవభావముతో హనుమంతుని వీక్షించెను !!

సుందరాకాండ
అఱువది నాలుగవ సర్గము
సమాప్తము