!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 238
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 238
ముందు శ్లోకములలో ...
బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని విన్నాము. బ్రహ్మ
సత్యము అన్నమాట అథర్వణ వేదములో ( ముండకోపనిషత్తులో)
చెప్పబడినది.
బ్రహ్మ సత్యం అన్నది నిజము (అది వేదవాక్కుకనక). మరి
జగత్తు కూడా సత్యమే మనకి మూడు నష్టాలు (
అసత్యములు) కలుగుతాయి అని గురువు
చెపుతున్నాడు. ఆ నష్టాలు జరగ కూడని పని కనుక, జగత్తు
సత్యము కాదు అని చెప్పి - గురువు - కృష్ణభగవానుడు
అదే మాట ( జగత్తు మిథ్య అని) గీతలో చెప్పాడు
అని కూడా వింటాము.
విశ్వము నిజమైతే గాఢనిద్రలో కూడా ప్రపంచము
కనపడవలెను. ఏ కారణము వలన చూడబడుటలేదో , అందువలన అది
స్వప్నము వలె అసత్యము. మిథ్యామాత్రమే. ( ఇది గురువు
చెప్పినమాట)
షుషుప్తిలో ప్రపంచము కనపడలేదు కాబట్టి , ప్రపంచము
అనిత్యము అనడానికి తర్కజ్ఞానము ద్వారా కష్టమే
అనిపించవచ్చు. కాని ఈ మాట ఒకసారి పరిశీలిద్దాము.
నిద్రలో కల వస్తుంది. అదే కల నిద్రనుంచి లేవగానే
మారుతుంది. ఏదైతే నిద్రావస్థనుంచి జాగ్రదావస్థలో
మారుతుందో, అది మార్పులేనిది కాదు. అలా మారుతూ
వున్నది, నిత్యము కాదు. నిత్యము కానిది సత్యము కాదు.
అంటే కల సత్యముకాదు. కల మిథ్య మాత్రమే.
అలాగే, ప్రపంచము.
మెలకువగా వున్నప్పుడు జాగ్రదావస్థలో ప్రపంచము అంటే
మనగది, మనమంచము, మనస్నేహితులూ, మనపరిసరాలు చూస్తాము.
నిద్రలో చూసిన స్వప్నములో మనము మరెన్నో విషయాలు,
ఎక్కడికో వెళ్ళినట్లు, ఎవరితోనో మాట్లాడి నట్లు,
ఇంకో ప్రపంచాన్ని చూస్తాము. అంటే
జాగ్రదావస్థలో చూచే ప్రపంచము, నిద్రలో చూచే ప్రపంచము
భిన్నము అన్నమాట. అంటే మనము చూచే ప్రపంచము మన
శరీరావస్థమీద ఆధారపడివున్నది అన్నమాట. అంటే మనము
చూచే ప్రపంచము మార్పులేని నిత్యము కాదు. అంటే
ప్రపంచము నిత్యము కాదు.
నిత్యము కాని ప్రపంచము సత్యము కాదు. అది కూడా
స్వప్నము వలె మిథ్యయే. ఇది గురువు ఆలోచన.
అయితే ఆత్మ నిత్యము , సత్యము అని ఎలాగ అన్నాము? అది
గుర్తు తెచ్చుకోడానికి ఒకమారు పరిశీలిద్దాము.
మనకి ఆత్మవిషయములో ఈ మాట విన్నాము. జాగ్రత్
స్వప్నావస్థలలో, ఆత్మ సాక్షిలా వుంది. ఆ మాట మనకు
అర్థమైంది. గాఢనిద్రలో మన బుద్ధి మొదలగు
మనోవ్యాపారములు నిద్రపోయినా, నిద్ర లేవగానే మనకి,
"ఆహా చాలామంచి నిద్రవచ్చింది" అని తెలుస్తుంది.
మంచి నిద్రవచ్చింది అని ఎవరికి తెలిసింది? మనలో
వున్న ఆత్మకి తెలిసింది.
ఎలాతెలిసింది అంటే, అన్ని వ్యాపారములు ( బుద్ధి
మొదలగునవి) నిద్రలో వుంటే, తను నిశ్చలముగా
సాక్షిగా వుంది కాబట్టి, అన్ని వ్యాపారములకి తెలివి
వచ్చినప్పుడు, మళ్ళీ మన ఆత్మద్వారా , ఆహా నిద్రలో
అన్నీ కులాసాగా నిద్రపోయి , నాకు ఏమీ తెలియనంత
నిద్రపట్టినది అని అంటాము, వింటాము
కూడా.
అంటే మన నిద్రలో ఆ ఆత్మ అలాగే కాపలా వుంది అన్నమాట.
అంటే మనకి అర్థమైనది, ఆత్మ మూడూ అవస్థలలో మెలకువగా
సాక్షిలా వున్నది అన్నమాట. అలా అన్ని అవస్థలలో
వున్నది కాబట్టి అది నిత్యము . అదే సత్యము.
ఆత్మ నిత్యము అన్నది, షుషుప్తి దశలో కూడా షుషుప్తి
దశని గ్రహించినది కాబట్టి , నిశ్చలమైన ఆత్మ నిత్యము
అని మనకి తెలిసింది. మరి నిత్యమైనది సత్యము కదా.
అదే విధముగా ప్రపంచము నిత్యముకాదు
మిధ్యామాత్రమే అని గురువు చెపుతాడు.
ఈ జగత్తు మిథ్యా అన్న విచారణలో ఆఖరి శ్లోకము విందాము
.
శ్లోకము 238:
భ్రాన్తస్య యత్ భ్రమతః ప్రతీతమ్
బ్రహ్మైవ తత్తత్ రజతం హి శుక్తిః |
ఇదంతయా బ్రహ్మ సదైవ రూప్యతే
త్వారోపితం బ్రహ్మణి నామ మాత్రమ్ ||
భ్రాన్తస్య యత్ భ్రమతః ప్రతీతమ్-
భ్రాంతి చెందినవానికి ఏది భ్రమవలన కనపడుచున్నదో
బ్రహ్మైవ తత్తత్ - అది బ్రహ్మము మాత్రమే
బ్రహ్మము అధిష్టానమైన, బ్రహ్మము మీద అరోపింపబడిన
వస్తువు మాత్రమే కనుక అది బ్రహ్మమే. ( తాడు మీదా
అరోపింపబడిన పాము, భ్రమపోయిన తరువాత మిగిలిన తాడు
లాగ)
రజతం హి శుక్తిః - ముత్యపుచిప్పలో భాసించుచున్న
వెండి ముత్యపు చిప్పయే కదా !
అంటే - భ్రాంతి చెందినవానికి ఏది భ్రమవలన
కనపడుచున్నదో, అది బ్రహ్మము మాత్రమే ;
ముత్యపుచిప్పలో భాసించుచున్న వెండి ముత్యపు చిప్పయే
కదా !
ఇదంతయా బ్రహ్మ సదైవ రూప్యతే
త్వారోపితం బ్రహ్మణి నామ మాత్రమ్ ||
ఇదం తయా రూప్యతే బ్రహ్మ సత్ ఏవ
ఇంకోరూపముగా కనపడుచున్న (ప్రపంచము) సదౄపమైన బ్రహ్మమే
బ్రహ్మణి అరోపితతం తు నామమాత్రమ్-
బ్రహ్మము మీద ఆరోపింపబడినది పేరుమాత్రమే
ఇంకోరూపముగా కనపడుచున్న ప్రపంచము, బ్రహ్మము మీద
అరోపింపబడిన పేరు మాత్రమే, అది సదౄపమైన బ్రహ్మము
మాత్రమే.
శ్లోకతాత్పర్యము:
భ్రాంతి చెందినవానికి ఏది భ్రమవలన కనపడుచున్నదో, అది
బ్రహ్మము మాత్రమే ; ముత్యపుచిప్పలో భాసించుచున్న
వెండి ముత్యపు చిప్పయే కదా ! ఇంకోరూపముగా కనపడుచున్న
ప్రపంచము, బ్రహ్మము మీద అరోపింపబడిన పేరు మాత్రమే,
అది సదౄపమైన బ్రహ్మము మాత్రమే.
ఇప్పటిదాకా గత నాలుగు ఐదు శ్లోకాలలో చెప్పినది,
ఒకమాటు మళ్ళీ మననము చేద్దాము.
- భ్రమలో కనపడినది భ్రమతొలగి పోగానే దాని
నిజస్వరూపము బయట పడుతుంది. అది ఎలాగా అంటే
దూరమునుంచి పాము అని భ్రమలో అనుకున్నది , దగ్గరకు
రాగానే ఆ భ్రమ పోయి అది తాదు అని తెలిసినట్లు
- నిద్రలో( స్వప్నావస్థలో) కనపడిన కల నిద్రపోగానే (
జాగ్రదావస్థలో) మాయమౌతుంది, అది సత్యముకాదు ; అలాగ
శరీరావస్థలలో మారేది సత్యము కాదు నిత్యము కాదు.
-జాగ్రదావస్థలో నేను అన్నీ చూస్తున్నాను అని
మొట్టికాయవేసి చెప్పే సాక్షి మన అంతరాత్మ. అదే ఆత్మ.
మనము నిద్రలో కలకన్నాము అని నిద్రలేచినతరువాత చెప్పే
సాక్షి కూడా మన ఆత్మ యే. షుషుప్తి దశలో, మంచి గాఢ
నిద్రతరువాత లేచి, నేను చాలాబాగా నిద్రపోయాను అని
మనకి చెప్పేది కూడా ఆ షుషుప్తిలో సాక్షిలావున్న మన
మనస్సే. అంటే అన్ని శరీర అవస్థలలో సాక్షి లా నిలబడిన
మన ఆత్మ నిత్యము అది సత్యము.
- అంటే గురువు చెపుతున్న సూత్రము అన్ని అవస్థలలో
మార్పులేనిది - అంటే మారకుండా నిలబడేది - అది
నిత్యము; అది సత్యము. అలామారకుండా ఏమన్నా వుంటుందా
అన్న మాట - ఆత్మ అన్ని అవస్థలలో వున్నది అని
కూడా నిరూపించాడు.
- అదే సూత్రము అనుసరించి ప్రపంచము నిత్యము కాదు ,
అంటే సత్యము కాదు అని చూపిస్తాడు గురువు.
- మన జాగ్రదావస్తలో మన ప్రపంచము చూస్తాము. మనగది ,
మన వాతావరణము మిత్రులు శత్రువులు వుంటారు. మన
స్వప్నావస్థలో అందరూ మారిపోతారు. మనము ఎక్కడేక్కడికో
వెళ్ళివస్తాము. మనము చేయలేని పనిలన్నీ చేసుకు
వస్తాము. అంటె మనౌ స్వప్నములో చూచే ప్రపంచము
జాగ్రదావస్థలో చూచే ప్రపంచము ఒకటి కాదు. అలాగ
"శరీరావస్థమీద మారే ప్రపంచము నిత్యము కాదు, సత్యము
కాదు " ; అంటే ప్రపంచము నిత్యము కాదు , సత్యముకాదు
- నిత్యము కానిది సత్యము కానిది మిథ్యయే.
ఇది గత నాలుగు శ్లోకాలలో విన్నమాట.
ఈ మాటతో జగత్తు మిథ్య అన్న చిచారణ ముగుస్తుంది.
ఇక ముందు వచ్చే నాలుగు శ్లోకాలలో బ్రహ్మము గురించి
గురువు చెపుతాడు.
||ఓమ్ తత్ సత్||
||ఓమ్ తత్ సత్||