||సుందరకాండ ||

|| అరవైయవ  సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 60 || with Slokas and meanings in Telugu

                                                       ||ఓమ్ తత్ సత్||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ  శ్లోకార్థ తత్త్వదీపికా సహిత

 షష్టితమస్సర్గః||


- "యథాతు రామస్య మతిః" - 


’తథా భవాన్ పశ్యతు  కార్యసిద్ధిం’,  అంటే  ’మీరు కార్యసిద్ధి అలా అయ్యేటట్లు చూడుడు’ అని. కార్యసిద్ధి అయ్యేలా అంటే ఎలాగ? ; ’యథాతు రామస్య మతిః’ - విశిష్టమైన రాముని మనస్సులో ఎలాగ వుందో  అలా అయ్యేటట్లు చూడాలి అని. ఇవి జాంబవంతుని మాటలు. జాంబవంతుడు వివేచనాశక్తి కల హరిసత్తముడు. 


హనుమంతుడు సీతమ్మ చెప్పిన మాట మరచిపోయి,  మనందరము రావణుని వధించగలశక్తి వున్నవాళ్ళమే, ఆ పని చేసి, సీతమ్మని తీసుకుని రాముని దగ్గరకు వెళ్ళితే  మంచిది అని చెప్పి, మళ్ళీ చివరికి మీరు ఆలోచించండి అని వదిలేస్తాడు.


అంగదుడు ఆ మాట పట్టుకొని, హనుమంతుడు చెప్పినట్లు  మనము సీతమ్మని తీసుకొని మరీ వెళ్ళుదాము అని అంటాడు. అంగదుడు రాజకుమారుడు. అతని మాట తోసిపుచ్చడము కష్టము.


వివేచనాశక్తి కల హరిసత్తముడు జాంబవంతుడు. జాంబవంతుడికి ఎలా కథ జరిపించాలో తెలుసు. అందుకని రాజకుమారుడికి నీవు చెప్పింది సబబే అని సమర్థిస్తూ, అందరికీ అసలు ఇది రామకార్యము అనే మాట గుర్తు తీసుకువస్తాడు.


ఇదంతా రాముని ప్రేరణ వలన జరుగుతోంది. ఇప్పుడు కూడా ఆయన మనస్సులో ఏముందో తెలిసికొని, అప్పుడే భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమము చేయతగును అని. అది అందరికీ సమ్మతమే.


ఇదే ఈ సర్గలో మనము వాల్మీకి ద్వారా వినే కథ.


ఇక  అరవయ్యవ సర్గ లో శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.


||శ్లోకము 60.01||


తస్య తద్వచనం శ్రుత్వా వాలిసూనురభాషత |

అయుక్తం తు వినా దేవీం  దృష్టవద్భిశ్చ వానరాః ||60.01||

సమీపం గన్తుమస్మాభీ రాఘవస్య మహాత్మనః |


స|| తస్య హనుమతస్య తత్ వచనం శ్రుత్వా వాలి సూనుః అభాషత || వానరాః దృష్టవద్భిః అస్మాభిః దేవీ వినా మహాత్మనః రాఘవస్య సమీపం గంతుం అయుక్తం తు||


||శ్లోకార్థములు||


తస్య హనుమతస్య తత్ వచనం శ్రుత్వా - 

హనుమంతునియొక్క ఆ వచనములను విని

వాలి సూనుః అభాషత - వాలిపుత్రుడు ఇట్లు పలికెను

వానరాః దృష్టవద్భిః అస్మాభిః - 

వానరులారా చూడబడిన మనచేత 

దేవీ వినా మహాత్మనః రాఘవస్య సమీపం - 

ఆ సీతాదేవి లేకుండా మహత్ముడైన రాఘవుని సమీపమునకు

గంతుం అయుక్తం తు - 

పోవుట యుక్తముకాదు


||శ్లోక తాత్పర్యము||


హనుమంతునియొక్క ఆ వచనములను విని వాలిపుత్రుడు ఇట్లు పలికెను. ’ఓ వానరులారా మనచేత చూడబడినా కాని, ఆ సీతాదేవి లేకుండా మహత్ముడైన రాఘవుని సమీపమునకు పోవుట యుక్తముకాదు’. ||60.01||


||శ్లోకము 60.02||


దృష్టాదేవీ న చాఽఽనీతా ఇతి తత్ర నివేదనమ్ ||60.02||

అయుక్తమివ పశ్యామి భవద్భిః ఖ్యాతవిక్రమైః |


స|| ఖ్యాతవిక్రమైః భవద్భిః దేవీ దృష్టా న ఆనీతా చ ఇతి తత్ర నివేదితుం అయుక్తం ఇవ పశ్యామి ||


||శ్లోకార్థములు||


ఖ్యాతవిక్రమైః భవద్భిః -

 ప్రఖ్యాతి చెందిన మీ అందరిచేత

దేవీ దృష్టా న ఆనీతా చ - 

దేవి ని చూచితిమి కాని తీసుకురాలేదు

ఇతి తత్ర నివేదితుం - 

అని అక్కడ చెప్పుట 

అయుక్తం ఇవ పశ్యామి - 

యుక్తము కాదు అని తోచుచున్నది


||శ్లోక తాత్పర్యము||


’ప్రఖ్యాతి చెందిన మీ అందరిచేత, దేవిని చూచితిమి కాని తీసుకురాలేదు అని చెప్పుట అయుక్తము అని తోచుచున్నది’. ||60.02||


||శ్లోకము 60.03||


న హి నః ప్లవనే కశ్చిన్నాపి కశ్చిత్పరాక్రమే |

తుల్యః సామరదైత్యేషు లోకేషు హరిసత్తమాః ||60.03||


స॥ హరిసత్తమాః అమర దైత్యేషు లోకేషు  నః  ప్లవనే కశ్చిన్  తుల్యః న | పరాక్రమే అపి కశ్చిన్ న |

||శ్లోకార్థములు||


హరిసత్తమాః అమర దైత్యేషు లోకేషు - 

ఓ వానరోత్తములారా దేవతలూ దైత్యులూ కూడిన లోకాలలో

నః  ప్లవనే కశ్చిన్  తుల్యః న - 

అకాశసంచారములో  మనతో సమానులు లేరు

పరాక్రమే అపి కశ్చిన్ న- 

పరాక్రమములో కూడా ఎవరు లేరు


||శ్లోక తాత్పర్యము||


’ఓ వానరోత్తములారా, అకాశసంచారములో గాని పరాక్రమము లో గాని దేవతలూ దైత్యులూ కూడిన లోకాలలో మనతో సమానులు ఎవరూ లేరు’. ||60.03||


||శ్లోకము 60.04||


జిత్వా లంకాం సరక్షౌఘాం హత్వా తం రావణం రణే |

సీతామాదాయ గఛ్ఛామః సిద్ధార్థా హృష్టమానసా ||60.04||


స॥ రణే తం రావణం హత్వా సరక్షౌఘాం లంకాం జిత్వా సీతామాదాయ సిద్ధార్థా హృష్టమానసా గఛ్ఛామః॥


||శ్లోకార్థములు||


రణే తం రావణం హత్వా - 

యుద్ధములో రావణుని హతమార్చి

సరక్షౌఘాం లంకాం జిత్వా - 

రాక్షస సమూహములతో కలిపి లంకను జయించి

సీతామాదాయ - సీతను తీసుకొని 

సిద్ధార్థా హృష్టమానసా గఛ్ఛామః - 

కార్యము సిద్ధించుకొని ఆనందోత్సాహములతో వెళ్ళుదాము


||శ్లోక తాత్పర్యము||


’రాక్షస సమూహములతో కలిపి లంకను జయించి, యుద్ధములో రావణుని హతమార్చి, సీతను తీసుకొని కార్యము సిద్ధించుకొని ఆనందోత్సాహములతో వెళ్ళుదాము’. ||60.04||

 

||శ్లోకము 60.05||


తేష్వేవం  హత వీరేషు రాక్షసేషు హనూమతా |

కిమన్యదత్రకర్తవ్యం గృహీత్వా యామ జానకీం ||60.05||


స॥ హనూమతా హత వీరేషు రాక్షసేషు జానకీం గృహీత్వా రామ సమీపం యాక్షాన్యత్ అత్ర కిం కర్తవ్యం॥


రామతిలకలో - తేష్వేతి॥ హనూమతా హతశేషేషు రాక్షశేషు సత్సు జానకీం గృహీత్వా యామ రామ సమీపం యామః, అన్యత్ ఇతో భిన్నమ్ అత్ర  అస్మిన్ సమయే కింకర్తవ్యం,  ఇదమేవ కర్తవ్యం ఇత్యర్థః॥


||శ్లోకార్థములు||


హనూమతా హత వీరేషు రాక్షసేషు - 

హనుమ రాక్షసులలో వీరులను హతమార్చెను

జానకీం గృహీత్వా - జానకిని తీసుకొని

రామ సమీపం యామ -

రాముని వద్దకు పోవుటకన్న

అన్యత్ అత్ర కిం కర్తవ్యం- 

అక్కడ కర్తవ్యము ఏమి కలదు


||శ్లోక తాత్పర్యము||


’వారిలోనే అనేక మైన రాక్షస వీరులను హనుమంతుడు హతమార్చాడు. జానకీ దేవిని తోడ్కొని రావడము తప్ప, అక్కడ మిగిలిన కార్యక్రమము ఏమి వుంది?’  ||60.05||


||శ్లోకము 60.06||


రామలక్ష్మణయోర్మధ్యే న్యస్యామ జనకాత్మజామ్ |

కింవ్యలీకైస్తు తాన్ సర్వాన్ వానరాన్ వానరర్షభాన్ ||60.06||


స॥ జనకాత్మజామ్ రామలక్ష్మణయోర్మధ్యే న్యస్యామ । తాన్ సర్వాన్ వానరాన్ వానరర్షభాన్ కింవ్యలీకైస్తు ॥


రామ టీకాలో -  జనకాత్మజామ్ రామలక్ష్మణయోర్మధ్యే న్యస్యామ సంస్థాపయామ । వానరర్షభాన్ సర్వాన్ ప్రతి వ్యలీకైః అప్రియైః రామాదికర్త్రుక ఔదాసీన్యవచనైః కిం, న కిమపి ఇత్యర్థః॥


||శ్లోకార్థములు||


జనకాత్మజామ్ - జనకాత్మజను 

రామలక్ష్మణయోర్మధ్యే న్యస్యామ - 

రామలక్ష్మణుల మధ్య చేర్చుదాము

తాన్ సర్వాన్ వానరాన్ వానరర్షభాన్ - 

ఆ వానరులను వానరోత్తములను అందరిని 

కింవ్యలీకైస్తు - ఎందుకు కష్టపెట్టడము


||శ్లోక తాత్పర్యము||


’రామలక్ష్మణుల మధ్య సీతమ్మను చేర్చుదాము. ఆ వానరులను వానరోత్తములను అందరిని ఎందుకు కష్టపెట్టడము’. ||60.06||


అంటే సుగ్రీవాదులను కష్టపెట్టకుండా చేయతగిన పని అని భావము.


||శ్లోకము 60.07||


వయమేవ హి గత్వా తాన్ హత్వా రాక్షసపుంగవాన్ |

రాఘవం ద్రష్టుమర్హామః సుగ్రీవం సహ లక్ష్మణమ్ ||60.07||


స॥ వయమేవ తాన్ హత్వా రాక్షసపుంగవాన్ హి గత్వా సుగ్రీవం లక్ష్మణమ్ సహ రాఘవం ద్రష్టుమర్హామః ॥


||శ్లోకార్థములు||


వయమేవ గత్వా తాన్ హత్వా రాక్షసపుంగవాన్ - 

మనమే వెళ్ళి ఆ రాక్షసపుంగవులను  హతమార్చి

సుగ్రీవం లక్ష్మణమ్ సహ రాఘవం - 

సుగ్రీవ లక్ష్మణులతో కూడిన రాముని  

ద్రష్టుమర్హామః- చూచుటకు తగును


||శ్లోక తాత్పర్యము||


’మనమే వెళ్ళి ఆ రాక్షసపుంగవులను  హతమార్చి, లక్ష్మణ సుగ్రీవులతో కూడిన  రాఘవుని దర్శించుదాము’. ||60.07|| 


||శ్లోకము 60.08||


తమేవం కృతసంకల్పం జామ్బవాన్ హరిసత్తమః |

ఉవాచ పరమప్రీతో వాక్యమర్థవదర్థవిత్ ||60.08||


స॥ ఏవం కృతసంకల్పం తం జామ్బవాన్ హరిసత్తమః పరమప్రీతః అర్థవిత్ వాక్యం ఉవాచ॥


||శ్లోకార్థములు||


ఏవం కృతసంకల్పం తం - 

ఈ విధముగా సంకల్పించిన వానిని

జామ్బవాన్ హరిసత్తమః - 

హరిసత్తముడైన జాంబవంతుడు

పరమప్రీతః అర్థవిత్ వాక్యం -  

పరమ ప్రీతితోపార్థముతో కూడిన మాటలతో

ఉవాచ - ఇట్లు పలికెను


||శ్లోక తాత్పర్యము||


’ఈ విధముగా సంకల్పించిన హరిసత్తమునికి , పరమప్రీతితో అర్థవంతమైన మాటలతో జాంబవంతుడు పలికెను’. ||60.08||


||శ్లోకము 60.09||


నైషా బుద్ధిర్మహాబుద్ధే మహాకపేమహాకపే |

విచేతుం వయమాజ్ఞప్తా దక్షిణాం దిశముత్తమామ్ ||60.09||


స॥ మహాబుద్ధే మహాకపే న ఏషా బుద్ధిః। వయం దక్షిణాం దిశముత్తమామ్ విచేతుం ఇతి ఆజ్ఞప్తా॥


రామ టీకాలో - నేత్యాదిభిః || యతః దక్షిణాం దిశం విచేతుం ఏవ వయం ఆజ్ఞప్తాః నానేతుం సీతాం ఇతి శేషః,  అతః యత్బ్రవీషి  తద్విషయణీ ఏషా బుద్ధిః నిశ్చయః న కర్తవ్యేతి శేషః ।


||శ్లోకార్థములు||


మహాబుద్ధే మహాకపే - మహాబుద్దిగల కపి సత్తమా

న ఏషా బుద్ధిః - అట్టి ఆలోచన కూడదు

వయం దక్షిణాం దిశముత్తమామ్ - మనము దక్షిణ దిశలో 

విచేతుం ఇతి ఆజ్ఞప్తా- అన్వేషణకు పంపబడిన వారము


||శ్లోక తాత్పర్యము||


’ఓ మహా కపి సత్తమా !  నీవు చెప్పుచున్న అట్టి ఆలోచన  సముచితము కాదు.  మనము దక్షిణ దిశలో అన్వేషణకు పంపబడిన వారము’. ||60.09||


ఇక్కడ జాంబవంతుడు , అట్టి ఆలోచన అంటే సీతమ్మవారిని తీసుకువచ్చి రామ దర్శనము చేద్దాము అన్నమాట సముచితము కాదు  అని అంటాడు.


||శ్లోకము 60.10||


నానేతుం కపిరాజేన నైవ రామేణ ధీమతా |

కథంచిన్నిర్జితాం సీతాం అస్మాభిర్నాభిరోచయేత్ ||60.10||


స॥ సీతాం నానేతుం కపిరాజేన ధీమతా రామేణ న ఏవం ( కథితా) । కథంచిత్  అస్మాభిః నిర్జితామ్ ( తథాపి) న అభిరోచయేత్ ।


||శ్లోకార్థములు||


సీతాం అనేతుం - 

సీతను తీసుకురమ్మని

కపిరాజేన ధీమతా రామేణ న ఏవం ( కథితా) - 

కపిరాజు చేతగాని ధీమంతుడైన రామునిచేతగాని చెప్పబడలేదు

కథంచిత్  అస్మాభిః నిర్జితామ్- 

ఒకవేళ మనచేత విజయము సాధింపబడిననూ  

( తథాపి) న అభిరోచయేత్ - నచ్చకపోవచ్చు


||శ్లోక తాత్పర్యము||


’ఆమెను తీసుకు రమ్మని ధీమంతుడైన రాముడు గాని కపిరాజుకాని చెప్పలేదు.

 మనము జయించి సీతను తీసుకు పోవుట వారికి నచ్చక పోవచ్చు’. ||60.11||


||శ్లోకము 60.11||


రాఘవో నృపశార్దూలః కులం వ్యపదిశన్ స్వకమ్ |

ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రతః ||60.11||

సర్వేషాం కపిముఖ్యానాం కథం మిథ్యా కరిష్యతి |


స॥ నృపశార్దూలః రాఘవో స్వకమ్ కులం వ్యపదిశన్ । స్వయం రాజా సీతా విజయం సర్వేషాం కపిముఖ్యానాం అగ్రతః ప్రతిజ్ఞాయ కథం మిథ్యా కరిష్యతి ॥


తిలక టీకాలో - అగ్రతః కపిముఖ్యానాం అగ్రతః।


రామ టీకాలో- ప్రతిజ్ఞాయేతి॥ కపిముఖ్యానాం అగ్రతః స్వకం స్వసంపాద్యం సీతావిజయం సీతాహేతుక స్వకర్త్రుక రావణ పరాభవ పూర్వకస్వోత్కర్షప్రాప్తిం  ప్రతిజ్ఞాయ, మిథ్యా కథం కరిష్యతి , న కరిష్యతి ఇత్యర్థః। అస్య తస్య రామస్య తుష్టిః న భవేత్। అతః కృతం అపి కర్మ విఫలం భవేత్।|


||శ్లోకార్థములు||


నృపశార్దూలః - రాజసింహుడు

రాఘవో స్వకమ్ కులం వ్యపదిశన్ - 

రాఘవుడు తన వంశముపై ప్రతిజ్ఞచేసి

స్వయం రాజా సీతా విజయం - 

స్వయముగా సీతను తీసుకువచ్చి విజయము సాధించెదనని

సర్వేషాం కపిముఖ్యానాం అగ్రతః ప్రతిజ్ఞాయ-  

వానరముఖ్యులు అందరి ముందు ప్రతిజ్ఞ చేసి 

కథం మిథ్యా కరిష్యతి - అది ఎట్లు సాధించగలడు


||శ్లోక తాత్పర్యము||


’రాజ సింహుడైన రాఘవుడు స్వయముగా సీతను తీసుకువచ్చి విజయము సాధించెదనని వానరముఖ్యులు అందరి ముందు ప్రతిజ్ఞ చేసి, అది ఎట్లు సాధించగలడు’. ||60.11||


||శ్లోకము 60.12||


విఫలం కర్మ చ కృతం భవేత్ తుష్టిర్న తస్య చ |

వృథా చ దర్శితం వీర్యం భవేద్వానరపుంగవాః ||60.12||


స॥  కృతం కర్మ చ విఫలం భవేత్। తస్య తుష్టిః న చ | వానరపుంగవాః దర్శితం వీర్యం వృథా చ భవేత్ ।


||శ్లోకార్థములు||


కృతం కర్మ చ విఫలం భవేత్ - 

చేసిన కర్మవిఫలమగును

తస్య తుష్టిః న చ - 

రాఘవునకు దానితో సంతోషము కూడా వుండదు

వానరపుంగవాః దర్శితం వీర్యం - 

వానర పుంగవులచే చూపేట్టబడిన సాహసము 

వృథా చ భవేత్- వృథా అగును


||శ్లోక తాత్పర్యము||


’చేసిన కర్మవిఫలమగును , దానితో సంతోషము కూడా వుండదు. వానరపుంగవులచే  చూపించిన ధైర్య సాహసము వృథా అగును’. ||60.12||


||శ్లోకము 60.13||


తస్మాద్గచ్ఛామ వై సర్వే యత్ర రామః స లక్ష్మణః |

సుగ్రీవశ్చ మహాతేజాః కార్యస్య నివేదనే  ||60.13||


స॥ తస్మాత్ వై సర్వే కార్యస్య నివేదనే యత్ర రామః స లక్ష్మణః సుగ్రీవశ్చ మహాతేజాః (తత్ర) గఛ్ఛామః॥


||శ్లోకార్థములు||


తస్మాత్ వై సర్వే - 

అందువలన మనము అందరము

కార్యస్య నివేదనే - 

చేసిన కార్యము నివేదించుటకు

యత్ర రామః స లక్ష్మణః సుగ్రీవశ్చ మహాతేజాః - 

రామ లక్ష్మణు సుగ్రీవులు ఎక్కడ వున్నారో 

(తత్ర) గఛ్ఛామః - 

అక్కడికి వెళ్ళెదము


||శ్లోక తాత్పర్యము||


’అందుకని మనము అందరము రామలక్ష్మణులు ఎక్కడ వున్నారో అక్కడికి వెళ్ళి, మహాతేజోవంతులైన  రామలక్ష్మణులకు సుగ్రీవునకు చేసిన కార్యము నివేదించెదము’. ||60.13||


||శ్లోకము 60.14||


న తావదేషా మతిరక్షమానో 

యథా భవాన్పశ్యతి రాజపుత్త్ర |

యథా తు రామస్య మతిర్నివిష్టా

తథా భవాన్పశ్యతు కార్యసిద్ధిమ్ ||60.14||


స॥  రాజపుత్ర యథా భవాన్పశ్యతి ఏషా మతిః నః న అక్షమా। యథా తు రామస్య మతిః నివిష్టా తథా కార్యసిద్ధిం భవాన్ పశ్యతు॥


తిలక టీకాలో -  అథ జామ్బవాన్ అంగద క్రోథపరిహారాయ తన్మతం బహుమాన్య సుహృత్ భావేన నివర్తయతి  - నతావత్ ఇతి। హేరాజపుత్ర యథా భవాన్ పశ్యతి విచారయతి ఏషా మతిః నః  అస్మాకం  అక్షమా న, కిన్తు యుక్తైవ। యథా రామస్య మతిః నిర్విష్టా అవస్థితా తథా కార్యసిద్ధిం భవాన్ పశ్యతు ఇత్యర్థః॥ 


గోవిన్దరాజ టీకాలో- అథ జాంబవాన్ అంగదవాక్యం బహు మన్యమానః సుహృత్ భావేన ప్రతిషేదతి - న తావత్ ఇతి। అక్షమా అయుక్తా నకింతు యుక్తేవైతి ఇత్యర్థః।  యద్యపి సమ్యగుక్తం సమర్థైశ్చాపి రామాజ్ఞానుసారేణ కర్తవ్యం  న స్వాతన్త్ర్యేణ ఇత్యర్థః॥


||శ్లోకార్థములు||


రాజపుత్ర యథా భవాన్పశ్యతి - ఓ రాజపుత్రా నీవు ఏ విధముగా చూచితివో 

ఏషా మతిః నః న అక్షమా - అట్టి విచారణ మనకు యుక్తము కానిది కాదు

యథా తు రామస్య మతిః నివిష్టా - ఏ విధముగా రాముని మనస్సు వున్నదో 

తథా కార్యసిద్ధిం భవాన్ పశ్యతు - ఆ విధముగా కార్యసిద్ధి అగునట్లు నీవు చేయుము


రాజపుత్ర యథా భవాన్పశ్యతి -

 ఓ రాజపుత్రా నీవు ఏది చూచితివో 

ఏషా మతిః నః న అక్షమా -

 అది అయుక్తము కాదు 

యథా తు రామస్య మతిః నివిష్టా - 

రాముని మనస్సులో ఏమి వున్నదో 

తథా కార్యసిద్ధిం భవాన్ పశ్యతు - 

ఆ విధముగా కార్యము జరుగుటకు నీవు చూడుము 


||శ్లోక తాత్పర్యము||


’ఓ రాజపుత్రా ! నీ సూచన సముచితమైనప్పటికీ నా బుద్ధి అంగీకరించుట లేదు. రాముని మనస్సు ఎలావున్నదో తెలిసికొని ఆవిధముగా  కార్యసిద్ధి కలిగించుటకు విధానము చూడతగినది’. ||60.14||


సబబైన ఆ జాంబవంతుని వచనములతో  శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువదియవ సర్గ సమాప్తము.


 ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే 

చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్

శ్రీమత్సుందరకాండే షష్టితమస్సర్గః ||