!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 239-242
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి~ శ్లోకములు 239-240 -241-242
అతః పరమ్ బ్రహ్మ సదద్వితీయం
విశుద్ధ విజ్ఞాన ఘనం నిరంజనమ్|
ప్రశాన్తం ఆద్యన్తవిహీనం అక్రియం
నిరన్తరానన్దరస స్వరూపమ్||239||
నిరస్తమాయకృత సర్వభేదమ్
నిత్యం ధృవమ్ నిష్కలమ్ అప్రమేయమ్
అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయమ్
జ్యోతిః స్వయం కించిదిదం చకాస్తి||240||
అతః - అందువలన
అంటే ముందు శ్లోకాలలో విన్న జగత్తు మిథ్య అని
ధృవీకరించబడడము అయినది. ఆ ధృవీకరణలో మనము విన్నమాటలు -
మట్టితో చేయబడిన వివిధ ఆకృతిగల కుండలు మట్టి మాత్రమే.
అలాగే బ్రహ్మము మీద అరోపింపబడిన జగత్తు
నామమాత్రమే. జగత్తు అంతా బ్రహ్మమే. బ్రహ్మము తప్ప వేరే
పదార్థము లేదు. మనకు ఏదేది కనపడుతున్నదో అది అంతా
బ్రహ్మ స్వరూపమే ..
అందువలన .. ఇక బ్రహ్మము గురించి వింటాము.
నిత్యము ఉండే సదౄపమైన బ్రహ్మ స్వభావము 25 రకములగా
నాలుగు ( 239-240 -241-242 ) శ్లోకాలలో చెప్పబడుతుంది
ఆ ఇరవై ఐదు రకముల స్వభావము క్రింద వివరిద్దాము
పరమ్ బ్రహ్మ సత్ -
ఉత్కృష్ఠమైన బ్రహ్మము ఎల్లప్పుడు వుండునది, అది
ఎలాంటిది అన్న మాటలు (25) ఇక విందాము
1 అద్వితీయం - అద్వితీయమైనది.
బ్రహ్మ సత్ అంటే బ్రహ్మ సత్యము - సత్యము అన్నది
సర్వావస్థలలో వుండేది ; అది అద్వితీయమైనది . ఇక
రెండవది ఏదన్నా వుంటే అది కూడా బ్రహ్మస్వరూపమే. ఒకవేళ
రెండవది జగత్తు , అది బ్రహ్మము కన్నా భిన్నమైనది అంటే
వచ్చే మూడు నష్టాలగురించి విన్నాము. అది విని జగత్తు,
బ్రహ్మము కన్నా భిన్నము కాదు అని నిశ్చయానికి వచ్చాము.
ఇంకేమన్నా వున్నాగాని అది కూడా జగత్తులాగానే భిన్నము
కాదు అన్న నిశ్చయానికి వస్తాము. కనుక ఇక రెండవది లేదు.
అంటే అది అద్వితీయము
రెండవపాదము .. "విశుద్ధ విజ్ఞాన ఘనం నిరంజనమ్"
2 విశుద్ధ విజ్ఞాన ఘనం -
పరిశుద్ధమైన జ్ఞానరూపమైనది - ఇది విషయజ్ఞానము
కాదు , నిర్విషయజ్ఞానము. ఇది విజ్ఞాన సారం. అంటే అన్ని
జ్ఞానాలకి అదే మూల జ్ఞానము.
3 నిరంజనమ్ - అజ్ఞాన స్పర్శ లేనిది.
మూడవ పాదము .."ప్రశాన్తం ఆద్యన్తవిహీనం అక్రియం"
4 ప్రశాన్తం -
శాంతికి కూడా సాక్షిగా నిలబడేది, పరిణామము లేని
ప్రశాంతి. అఖండ శాంతిమయం.
5 ఆద్యన్తవిహీనం -
తుది మొదలు లేనిది. చావు పుట్టుకలు లేనిది.
6 అక్రియం - క్రియాశూన్యమైనది
నాల్గొవపాదము - "నిరన్తరానన్దరస స్వరూపమ్"
7 నిరన్తరానన్దరస స్వరూపమ్ -
సచ్చిదానంద స్వరూపము కలది, అవిచ్ఛినమైన ఆనంద స్వరూపము
కలది. పూర్వజన్మ కృత ఫలస్వరూపమైన ఆనందము కాదు. ఇది
స్వతహాగా జనించిన ఆనందము.
శ్లోక(239)తాత్పర్యము: ఇక్కడదాకా విన్న బ్రహ్మ
స్వరూపము
బ్రహ్మము పరిశుద్ధమైనది అజ్ఞాన స్పర్శ లేని
నిర్విషయజ్ఞాన రూపమైనది ; బ్రహ్మము పరిణామము లేనిది,
తుది మొదలు లేనిది. క్రియాశూన్యమైనది; అవిచ్ఛినమైన
ఆనంద స్వరూపము కలది.
శ్లోకము 240
నిరస్తమాయకృత సర్వభేదమ్
నిత్యం సుఖం నిష్కలమ్ అప్రమేయమ్
అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయమ్
జ్యోతిః స్వయం కించిదిదం చకాస్తి||240||
మొదటి పాదము:
8 నిరస్త మాయకృత సర్వభేదమ్ -
మాయచేత కల్పింపబడిన సమస్తభేదములు లేనిది. అంతా
బ్రహ్మమే అయినప్పుడు మనకి కనపడే భేదాలన్నీ మాయ వలన
కనపడేవే.
రెండవపాదము:
నిత్యం సుఖమ్ నిష్కలమ్ అప్రమేయమ్
9 నిత్యం - ఎల్లప్పుడు వుండునది;
10 సుఖం -
కష్టాలకి అతీతము ; పరిపూర్ణమైన సంతోషము;
11 నిష్కలమ్ - అవయవములు లేనిది
12 అప్రమేయమ్ - మనోవృత్తికి గోచరము కానిది ,
కొలతలేనిది
మూడవపాదము ..అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయమ్
13 అరూపం -
రూపము లేనిది - న చక్షుసా గృహ్యతే అని వేదాలలో -
అంటే కంటికి కనపడనది - రూపము లేదు కాబట్టి
14 అవ్యక్తమ్ -
వ్యక్తము కానిది ; రూపము లేదు కాబట్టి , దానిని
వాక్కుతో కూడా గోచరము కానిది. అదే అవ్యక్తము అంటే
15 అనాఖ్యమ్ -
నామ శూన్యమైనది. ఒక పదము వాడినప్పుడు ఆ పదము జాతి
గురించో , గుణము గురించో క్రియ గురించో
విశదీకరిస్తుంది. వాటన్నిటితో సంబంధము లేని దానికి
నామము వుండదు.
16 అవ్యయమ్ - క్షయము లేనిది - క్షీణించనిది. బ్రహ్మ
స్వరూపము ( అదే ఆత్మ) మార్పులేనిది. క్షీణించనిది.
అదే అక్షయము. అదే అవ్యయము.
నాల్గొవపాదము.. జ్యోతిః స్వయం కించిదిదం చకాస్తి
17 జ్యోతిః స్వయం - స్వయం ప్రకాశమైనది
తాత్పర్యము ( శ్లోకము 240):
మాయచేత కల్పింపబడిన సమస్తభేదములు లేనిది; ఎల్లప్పుడు
వుండునది ; స్థిర మైనది - క్రియారహితము కనుక ;
అవయవములు లేనిది ; మనోవృత్తికి గోచరము కానిది ; రూపము
లేనిది ; వ్యక్తము కానిది ; నామ శూన్యమైనది ;
క్షయము లేనిది - క్షీణించనిది ; స్వయం
ప్రకాశమైనది; అట్టి ఈ బ్రహ్మము
ప్రకాశించుచున్నది.
శ్లోకము 241
జ్ఞాతృజ్ఞానజ్ఞేయశూన్యం
అనన్తం నిర్వికల్పమ్
కేవలాఖండచిన్మాత్రం
పరం తత్త్వం విదుః బుధాః||241||
18 జ్ఞాతృజ్ఞానజ్ఞేయశూన్యం - తెలిసికొనువాడు ,
తెలిసికొనతగినది , తెలివి అన్నమాటలకి అతీతం.
ఈ మూడూ మాటలను త్రిపుటి అంటారు. ఒకటి సత్యము
అన్నప్పుడు అది సర్వ అవస్థలలో మార్పులేనిది.
అన్ని అవస్థలలో మార్పులేనిది ఈ త్రిపుటికి అతీతము.
రెండవపాదము .. "అనన్తం నిర్వికల్పమ్"
19 అనన్తం - అంతులేనిది
20 నిర్వికల్పమ్ - వికల్పము లేనిది. భేదములు
లేనిది.
అంతాబ్రహ్మమే అయినప్పుడు కనపడె భేదాలు మాయాకల్పితములు.
అందువలన భేదములు లేనిది. అదే నిర్వికల్పము ( వికల్పము
లేనిది, భేదములు లేనిది)
మూడవపాదము
21 & 22 కేవలాఖండచిన్మాత్రం - పరి శుద్ధ
పరిపూర్ణ జ్ఞాన సారము
నాల్గొవపాదము - పరం తత్త్వం విదుః బుధాః-
అట్టి పరతత్వమును పండితులు తెలిసికొనుచున్నారు.
శ్లోకము 241 తాత్పర్యము:
తెలిసికొనువాడు , తెలిసికొనతగినది , తెలివి అన్నమాటలకి
అతీతం;అంతులేనిది; వికల్పము లేనిది అంటే భేదములు
లేనిది; పరి శుద్ధ పరిపూర్ణ జ్ఞాన సారము అయినది
అగు అట్టి పరతత్వమును పండితులు
తెలిసికొనుచున్నారు
||శ్లోకము 242||
అహేయమనుపాదేయం
మనోవాచామగోచరమ్|
అప్రమేయమనాద్యంతమ్
బ్రహ్మపూర్ణమహం మహః||242||
మొదటి పాదము లో .. అహేయం అనుపాదేయం
23 అహేయం విడిచిపెట్టడానికి వీలు కానిది.
వస్తువు కాదు కనక. వస్తువు కాని దానిని విడిచిపెట్టడము
సాధ్యము కాదు
24 అనుపాదేయం - తీసికొనబడలేనిది - తీసుకునేదికాదు;
వస్తువు కాదు కనక. వస్తువు కాని దానిని తీసికొనడము
సాధ్యము కాదు.
రెండవపాదము - మనోవాచామగోచరమ్
25 మనోవాచామగోచరమ్ - మనసుకు మాటకు అతీతము
- అగోచరము.
యతోవాచా నివర్తన్తే అని వేదాలలో విన్నమాట ఇది.
అప్రమేయమనాద్యంతమ్ -
అప్రమేయము , ఆది అంతములు లేనిది
బ్రహ్మ పూర్ణమహమ్ మహః -
అట్టి బ్రహ్మ పరిపూర్ణమైనది అదే మహత్తరమైన ఆత్మ
శ్లోక (242) తాత్పర్యము:
విడిచిపెట్టడానికి వీలు కానిది. వస్తువు కాదు
కనక. వస్తువు కాని దానిని విడిచిపెట్టడము సాధ్యము
కాదు. తీసికొనబడలేనిది - తీసుకునేదికాదు; వస్తువు కాదు
కనక. వస్తువు కాని దానిని తీసికొనడము సాధ్యము కాదు.
మనసుకు మాటకు అతీతము - అగోచరము; అప్రమేయము , ఆది
అంతములు లేనిది ;
అట్టి బ్రహ్మ పరిపూర్ణమైనది అదే మహత్తరమైన ఆత్మ
ఈ నాలుగు శ్లోకాలలో , బ్రహ్మ స్వరూపము ఇరవై ఐదు
రకములగా విశ్లేషించబడినది.
|| ఓమ్ తత్ సత్||
||ఓమ్ తత్ సత్||