Sundarakanda Chapter 62

Vanaras thrash the guards of Madhuvan !!

Chapter 62:

Summary : Hanuman tells the Vanaras to drink freely without concern;, Angada too tells the same. Vanaras too enjoying themselves thrash the guards who run away and report to Dadhimukha who is in charge of the protection force. Dadhimukha comes back to Madhuvan with all his force. He too was attacked by the intoxicated Angada without respecting his age. Then Dadhimukha gathers his followers and goes to where Sugriva is and report the matter to him.

For telugu Home page

click here

సుందరకాండ
అఱువది రెండవ సర్గము

తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానరర్షభః|
అన్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః |
అహమావారయిష్యామి యుష్మాకం పరిపంథనః ||

తా|| ఆ వానరులతో హనుమంతుడు ఇట్లనెను. " ఓ కపివరులారా మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవించుడు. మీకు అడ్డువచ్చువారిని నేను నివారించెదను.

శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగదః |
ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు ||
అవస్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా|
అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశమ్ ||

తా|| హనుమంతుని ఇట్టి వచనములను విని , వానరులలో ప్రముఖుడైన అంగదుడు ఇట్లనెను. " ఓ వానరులారా ! ప్రసన్నమైన మనస్సుతో తాగుడు. అ కార్యమైననూ కృతకృత్యుడై వచ్చిన హనుమంతుని మాటను నేను విధిగా పాటించ వలెను. అప్పుడు ఇటువంటి కార్యము తరువాత చెప్పవలసినదేమి ?"

పూజయిత్వాంగదాం సర్వే వానరా వానరర్షభమ్ |
జగ్ముర్మధువనం యత్ర నదీవేగా ఇవ దృతమ్ ||

తా|| వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి నదీ ప్రవాహము వలే ఆ మధువనమును ప్రవేశించిరి.

మధూని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్యతే |
పిబంతి సహితాస్సర్వే నిఘ్నంతిస్మ తథాపరే ||

తా|| మధువును తమబాహువులతో ద్రోణములకొలదీ =-౦౯ఊఊఊ సేవించి తమకు అడ్డువచ్చినవారిపై బలప్రయోగము చేశిరి.

యేప్యత్ర మధుపాలాస్స్యుః ప్రేష్యా దధిముఖస్యతు |
తేపి తైర్వానరైర్భీమైః ప్రతిషిద్ధా దిశో గతాః ||

తా|| దధిముఖుని అనుచరులు ఆ వానరుల బలప్రయోజనమునకి గురి అయి , వారిచే భయపెట్ట బడి, అచటినుండి నాలుగు దిశలలోనూ పలాయనము చేసిరి.

తతో దధిముఖః కృద్ధో వనపస్తత్ర వానరః |
హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్ ||
ఇహాగచ్ఛత గఛ్చామో వానరాన్ బలదర్పితాన్ |
బలేన వారయిష్యామో మధు భక్షయతో వయమ్ ||
శ్రుత్వా దధిముఖస్యేదం వచనం వానరర్షభాః |
పునర్వీరా మధువనం తేనైవ సహసా యుయుః ||

తా|| అంతట వానరుడైన దధిముఖుడు ఆ మధువనము ధ్వంస మైనది అన్న వార్తను విని , మిక్కిలి కోపము గలవాడై గాయపరచబడిన తన అనుచరులతో ఇట్లనెను." ఇట్లు రండు. బలగర్వముతో వున్న ఆ వానరుల కడకు వెళ్ళుదము.మధువులను భక్షించుచున్న వానరులను మన బలముతో నివారించెదము". అంతట వీరులైన ఆ వానరపుంగవులు దధిముఖుని మాటలువిని అతనితో కలిసి వేగముగా మధువనము చేరిరి.

అథ దృష్ఠ్వా దధిముఖం క్రుద్ధం వానరపుంగవాః |
అభ్యధావంత వేగేన హనుమత్ప్రముఖాస్తదా ||

తా|| అప్పుడు క్రోధముతో నున్న దధిముఖుని చూచి హనుమంతుడు తదితర వానరపుంగవులు అతనిని ఎదుర్కొనిరి్.

తం సవృక్షం మహబాహుమ్ అపతంతం మహాబలమ్|
ఆర్యకం ప్రాహరత్ తత్ర బాహుభ్యాం కుపితోంగదః ||
మదాంధశ్చ న వైదేనం ఆర్యకోయం మమేతి సః |
అథైనం నిష్పిపేషాశు వేగవద్వసుధాతలే ||
స సమాశ్వాస్య సహసా సంక్రుద్ధో రాజమాతులః|
వానరాన్ వారయామాస దండేన మధు మోహితాన్ ||
స కథంచిద్విముక్తస్తైః వానరైర్వానరర్షభః|
ఉవాచైకాంత మాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్ |

తా|| పిమ్మట మహాబలశాలియూ మిక్కిలి పరాక్రమము గలవాడు అగు దధిముఖుడు ఒక వృక్షమును దీసికొని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు అతనిని తన బాహువులతో కొట్టెను .మదాంధుడైన ఆ వానరుడు " ఇతడు నాకు పూజ్యుడు" అన్న విషయమును గుర్తించక అతనిని నేలపై బడద్రోసి గుమ్మెను. సుగ్రీవునకు మేన మామ అయిన ఆ దధిముఖుడు వెంటనే ఊరటచెంది పిమ్మట కోపముతో మరల దండమును చేతబట్టి మధుపానమత్తులైన వానరులను నివారించెను. వానరోత్తముడైన ఆ దధిముఖుడు ఆ అంగదాదులనుండి విముక్తుడై ఏకాంతముగా తన అనుచరులతో ఇట్లు పలికెను.

ఏతే తిష్ఠంతు గఛ్చామో భర్తానో యత్ర వానరః |
సుగ్రీవో విపులగ్రీవః సహ రామేణ తిష్ఠతః ||

తా|| " వీరినిట్లే ఉండనిండు . మనకు ప్రభువు సమయస్పూర్తి గలవాడు , కఠినముగా శాసించువాడు అగు సుగ్రీవుడు శ్రీరాముని చెంత గలడు. మనము అచటికి వెళ్ళుదము" .

నిమిషాంతర మాత్రేణ సహి ప్రాప్తో వనాలయః |
సహస్రాంశు సుతో ధీమాన్ సుగ్రీవో యత్ర వానరః ||
రామంచ లక్ష్మణం చైవ దృష్ఠ్వా సుగ్రీవమేవ చ |
సమప్రతిష్ఠాం జగతీం ఆకాశాన్నిపపాత హ ||

తా|| అనుచరులతో సహా దధిముఖుడు మరుక్షణములోనే సూర్యపుత్రుడును ధీశాలి అయిన సుగ్రీవుడు ఉన్న వన ప్రదేశమునకు చేరెను. అతడు ఆకాశమునుండియే శ్రీరామ లక్ష్మణుడు సుగ్రీవులను చూచి , అచట ఒక సమతల ప్రదేశములో అనుచరులతో సహా దిగెను.

సన్నిపత్య మహావీర్య స్సర్వైసైః పరివారితః |
హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః ||
స దీనవదనో భూత్వా కృత్వా శిరసి చాంజలిమ్ |
సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్యపీడయత్ ||

తా|| మహావీరుడు వనపాలకుల నాయకుడునూ అగు ఆ దధిముఖుడు తన అనుచరులతో సహా భూమి మీదకు దిగినపిమ్మట దీనవదనములతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదముల మీద నమస్కరించెను.

సుందరకాండ
అఱువది రెండవ సర్గము
సమాప్తము