!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 243-244
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 24౩-244
మహావాక్య విచారము:
తత్త్వం పదాభ్యాంఅభిధీనమానయోః
బ్రహ్మాత్మనోః శోధితయోఃయదిత్థం|
శ్రుత్యా తయోః తత్త్వమసి ఇతి సమ్యక్
ఏతత్వమేవ ప్రతిపాద్యతే ముహుః||24౩||
ఐక్యం తయోః లక్షితయోః న వాచ్యయో
నిగద్యతే అన్యోన్య విరుద్ధ ధర్మిణోః |
ఖద్యోతభాన్వోరివ రాజభృత్యయోః
కూపాంబురాశ్య్ః పరమాణు మేర్వోః||244 ||
ఈ రెండు శ్లోకాలలో తత్త్వమసి అనే మహావాక్యము
గురించి గురువు చెపుతున్నాడు.
శ్లోకము 24౩:
తత్త్వం పదాభ్యాంఅభిధీనమానయోః
బ్రహ్మాత్మనోః శోధితయోఃయదిత్థం|
శ్రుత్యా తయోః తత్త్వమసి ఇతి సమ్యక్
ఏకత్వమేవ ప్రతిపాద్యతే ముహుః||24౩||
తత్త్వం పదాభ్యాం అభిధీనమానయోః
తత్త్వం పదాభ్యాం - తత్త్వంఅనబడు పదములలో
అభిధీనమానయోః - చెప్పబడుతున్న
ఇక్కడ గురువు తత్త్వం అనబడు పదములలో అంటే - తత్త్వం
అసి - అన్న పదములగురించి చెపుతున్నాడు.
తత్త్వమసి అన్న మహావాక్యములలో చెప్పబడుతున్నది -
బ్రహ్మము జీవుడు ఒకటే అని . ఇక్కడ ఆ బ్రహ్మము జీవుడి
గురించే ముందు వాక్యాలలో ( శ్లోకములో మిగిలిన మూడు
పాదాలలో) వింటాము
రెండవ పాదము:
బ్రహ్మాత్మనోః శోధితయోఃయదిత్థం|
బ్రహ్మ ఆత్మలగురించి శోధించబడిన ఏది వున్నదో అది
మూడవపాదము:
శ్రుత్యా తయోః తత్త్వమసి ఇతి సమ్యక్
శ్రుతులలో తత్త్వమసి అని బాగుగా
నాల్గొవపాదము
ఏకత్వమేవ ప్రతిపాద్యతే ముహుః|
ఏకత్వమే మళ్ళీ మళ్ళీ ప్రతిపాదించబడుతున్నది
అంటే తత్త్వమసి అన్న వాక్యములలో ఆత్మ బ్రహ్మల ఏకత్వమే
మళ్ళీ మళ్ళీ ప్రతిపాదించ బడుతున్నది.
అంటే ఇక్కడ శ్లోకతాత్పర్యము, గురువు చెపుతున్నమాట ఇది:
తత్త్వమసి అనబడు పదములలో చెప్పబడుతున్న, బ్రహ్మ
ఆత్మలగురించి శోధించబడిన ఏది వున్నదో అది,
శ్రుతులలో తత్త్వమసి అని, వాటి ఏకత్వమే మళ్ళీ
మళ్ళీ బాగుగా ప్రతిపాదించబడుతున్నది.
అంటే తత్త్వమసి అన్న మహావాక్యములో చెప్పబడుతున్నది ,
ఆత్మ బ్రహ్మ ల ఏకత్వమే.
శ్లోకము 244:
ఐక్యం తయోః లక్షితయోః న వాచ్యయో
నిగద్యతే అన్యోన్య విరుద్ధ ధర్మిణోః |
ఖద్యోతభాన్వోరివ రాజభృత్యయోః
కూపాంబురాశ్యః పరమాణు మేర్వోః||244 ||
ఐక్యం తయోః లక్షితయోః న వాచ్యయో
ఐక్యం తయోః వాటి ఏకత్వము ( ఆత్మ బ్రహ్మల
ఏకత్వము)
లక్షితయోః న వాచ్యయో - వాటి లక్షణములను అనుసరించి
చెప్పబడినది కాని ఆ మాటల అర్థము అనుసరించి కాదు.
ఇక్కడ తత్ అన్నది బ్రహ్మము గురించి. బ్రహ్మము అంటే ఈ
శ్వరుడు కదా. త్వం అన్నది జీవుడు. అతి చిన్న జీవుడు,
అత్యంత మహాత్ముడు అగు బ్రహ్మము - ఈ రెండు ఒకటి అని ఆ
మాటల అర్థము తీసుకుంటే రాదు. ఆ రెండు పదముల ( జీవుడు
బ్రహ్మము ) లక్షణము లేక అంతరార్థము వలననే వాటి ఏకత్వము
వస్తుంది.
అన్యోన్య విరుద్ధ ధర్మిణోః -
పరస్పరము విరుద్ధమగుధర్మములు కలవారగు
అంటే జీవుడు బ్రహ్మము పరస్పర విరుద్ధమైన ధర్మములు
కలవారు - అది ఎలా అందుకు అంటున్నాడు? బ్రహ్మము
సర్వంతర్యామి అని అనుకుంటాము; జీవుడు మనకి తెలిసిన
చిన్న మనిషి. బ్రహ్మము ఈశ్వరుడు అంటే నియామకుడు.
జీవుడు ఈశ్వరునిపై ఆధారపడిన , ఈస్వరునిచే నియమింపబడిన
చిన్నజీవి. అలాంటి రెందు పరస్పర ధర్మములు కల
వాటి ఏకత్వము , వారి మాటలను అనుసరించి కాదు .
వాటి లక్షణములను అనుసరించి అని.
ఖద్యోతభాన్వోరివ రాజభృత్యయోః
ఖద్యోతభాన్వోరివ - మెరుగుపురుగు సూర్యుడులాగా
రాజభృత్యయోః - రాజు రాజభటులలాగా
ముందు వాక్యములో పరస్పరవిరుద్ధ ధర్మములు కల - అన్నాడు.
ఇక్కడ పరస్పరవిరుద్ధ ధర్మములు కలవాటి ఉదాహరణలు
చెప్పుచున్నాడు . ఆ ఉదాహరణలు మెరుగుపురుగు - సూర్యుడు
; రాజు -రాజభటులు.
సూర్యుడు అత్యంతప్రకాశము కలవాడు; మెరుగుపురుగు చీకట్లో
మాత్రమే కనపడేది. వీటిలో ఐకత్యము ఎలాగ?
రాజు ఆజ్ఞలు ఇచ్చేవాడు. రాజభటుడు ఆజ్ఞలు పాలించేవాడు.
వీటిలో ఐకత్యము ఎలాగ?
కూపాంబురాశ్యః పరమాణు మేర్వోః;
కూపాంబురాశ్యః - కూపము మహాసముద్రము
పరమాణు మేర్వోః - పరమాణువు మేరుపర్వతము
బావి మహాసముద్రము , పరమాణువు మేరు పర్వతములు కూడా
పరస్పర విరుద్ధ ధర్మములు కలవి.
ఇక్కడ గురువు జీవుడు బ్రహ్మము ధర్మములద్వారా పరస్పర
విరుద్ధము . వాటి ఏకత్వము వాటి ధర్మములను అనుసరించి
కాదు . వాటి అంతరార్థము అనుసరించి అని.
అంటే వాటి ( జీవుడు బ్రహ్మముల) అంతరార్థము
గురువు ముందు శ్లోకాలలో వివరిస్తాడు.
ఈ రెండు శ్లోకాల తాత్పర్యము:
తత్వమసి అన్న మహావాక్యములో జీవ బ్రహ్మముల ఏకత్వము
ప్రతిపాదించబడినది. ఆ ఏకత్వము వాటి అంతరార్థము ద్వారా
వస్తుంది కాని, పరస్పర విరుద్ధమైన ఆ మాటల( జీవుడు
బ్రహ్మము) అర్థము ద్వారా కాదు.
ముందు శ్లోకాలలో వాటి అంతరార్థము వింటాము>
||ఓమ్ తత్ సత్||
______________________________________________________