!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 245-246
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 245-246
మహావాక్య విచారము: 243 నుంచి 251 వరకు ఎనిమిది
శ్లోకాలలో గురువు తత్వమసి అన్న మహావాక్యము
విశదీకరిస్తాడు.
ముందు రెండు శ్లోకాలలో విన్నది:
తత్వమసి అన్న మహావాక్యములో జీవ బ్రహ్మముల ఏకత్వము
ప్రతిపాదించబడినది. ఆ ఏకత్వము వాటి అంతరార్థము ద్వారా
వస్తుంది కాని, పరస్పర విరుద్ధమైన ,
మెరుగుపురుగు - సూర్యుడు ; రాజు -రాజభటులు ;
పరమాణువు-మందరపర్వతము; కూపము-మహాసముద్రము లాంటి మాటల
అర్థము ద్వారా కాదు అని
పరస్పరవిరుద్ధమని చెప్పబడిన ఉదాహరణలు ఒకమాటు మనము
చూడవచ్చు.
రాజు రాజభటులు వేరే వేరేగా కనపడినా, రాజ్యము
లేని రాజు , బల్లెము లేని భటుడు చూస్తే
వారిద్దరూ ఒకటే కదా.
అలాగే మందరపర్వతము మీద పరమాణు శక్తి ఉపయోగిస్తే
మిగిలేది పరమాణువులే కదా. బావి ( కూపము) లోంచి
ఒక బిందె నీళ్ళు మహాసముద్రములోని బిందె నీళ్ళు
తీసుకుంటే , మను చూసే నీరు ఒకటె కదా. అంటే వాటి
లక్షణాలలో వాటి ఏకత్వము కనిపిస్తుంది. అదే మాటని
గురువు మనకి తార్కికముగా ముందు శ్లోకాలలో
ఉపదేశిస్తాడు.
ఇక 245-246 శ్లోకములు.
తయోవిరోధోఽయమ్ ఉపాధికల్పితః
న వాస్తవః కశ్చిత్ ఉపాధిరేషః|
ఈశస్య మాయా మహదాది కారణమ్
జీవస్య కార్యం శృణు పంచకోశః||245||
మొదటి పాదము:
తయోవిరోధోఽయమ్ ఉపాధికల్పితః -
తయోః అయం విరోధః ఉపాధికల్పితః
ఆ రెండిటి విరోధము వాటి ఉపాధి వలననే>
ఉపాధి అంటే పేరు లేక ప్రత్యేకత. ఆ రెండిటికి గల
విరోధము వాటికి మనము ఇచ్చిన పేరు వలననే. రాజు
అనగానే రాజరికము కట్టబెడతాము. భటుడు అనగానే శూలము
ఇచ్చి నిలబడమంటాము. ఈశ్వరుడు అనగానే లేచి సాష్టాంగ
నమస్కారము పెడతాము - జీవుడు అనగానే మనమే
అనుకుంటాము. అంటే ఆ రెండిటి విరోధము వాటి
కి వున్న పేరువలన ప్రత్యేకత వలననే.
రెండవపాదము
న వాస్తవః కశ్చిత్ - యదార్థమైన విరోధము లేదు:
ఆ రెండిటికి యదార్థమైన విరోధము లేదు. వాటి ఉపాధి
బట్టీ వాటి విరోధము కల్పించబడినది. ఈ మాట రాజుగారు
భటులవిషయములో సులభముగా అర్థము అవుతుంది. రాజు్కి
రాజ్యము లేకపోతే, భటుడికి శూలము తీసేస్తే - ఇద్దరికి
దర్భాసనము పంచ ఇస్తే ఇద్దరూ ఒకటే. ఇది సులభముగా
కనిపించినా , బ్రహ్మము ఆత్మల ఉపాధి మీద ఆలోచన కొంచెము
కష్టముగా కనిపించవచ్చు - అది విందాము.
ఉపాధిః ఏషః - వీటి ( జీవ బ్రహ్మల) ఉపాధి (
వినుము)
ఇక జీవబ్రహ్మల ఉపాధి గురించి వింటాము
ఈశస్య మాయా మహదాది కారణమ్ :
మహాతత్త్వము అహంకారము మొదలగు వాటితో కూడిన జగత్తుకి
కారణ మైన మాయ, ఈశ్వరుని ఉపాధి.
ఈశ్వరుడు నియామకుడు , చేయించేవాడు, అన్నిటికి
(జగత్తుకి) కారణ భూతుడు - కారణభూతుడు కనక కారణము
ఆయన ఉపాధి. "కారణోపాధీశ్వరః" అంటారు
జీవస్య కార్యం శృణు పంచకోశః -
జీవుడి ఉపాధి కార్యరూపమైన పంచకోశములు.
శ్రుతులలో కార్యోపాధిరయం జీవః అని అంటారు -
జీవుడి ఉపాధి కార్యము అని. ఉపాధి అంటే పేరు ప్రత్యేకత
అన్న అర్థములో జీవుడి ప్రత్యేకత పంచకోశములు.
జీవుడు పంచకోశములమూట.
శ్లోకతాత్పర్యము:
ఆ రెండిటి విరోధము వాటి ఉపాధి వలననే; యదార్థమైన
విరోధము లేదు; మహాతత్త్వము అహంకారము మొదలగు వాటితో
కూడిన జగత్తుకి కారణ మైన మాయ, ఈశ్వరుని ఉపాధి; జీవుడి
ఉపాధి కార్యరూపమైన పంచకోశములు
కార్యము కారణము అన్నమాటలు - ఇంగ్లీషులో Cause &
Effect ; కారణము అంటే Cause ; కార్యము అంటే Effect;
ఈశ్వరుడు జగత్తుకి కారణము. జీవుడు సృష్టిలో జరిగిన
కార్యము. ఆ కార్యమే పంచకోశముల మూట అయిన జీవుడు
ఇక రెండిటికి సామరస్యము ఎలా అన్నది ముందు శ్లోకములో:
శ్లోకము 246;
ఏతావుపాధీ పరజీవయోః తయోః
సమ్యక్ నిరాసే న పరో న జీవః |
రాజ్యం నరేన్ద్రస్య భటస్య ఖేటకః
తయో రపొహే న భటో న రాజా ||246||
ఏతావుపాధీ పరజీవయోః తయోః-
పరమాత్మ జీవుల వారి ఈ ఉపాధిని
పరమాత్మ ఉపాధి మాయ, జీవుడి ఉపాధి పంచకోశములు. ఆ
ఉపాధిని ఏమి చెయ్యాలో చెపుతున్నాడు గురువు
రెండవపాదములో - అది ముఖ్యమైన మాట.
రెండవపాదము:
సమ్యక్ నిరాసే న పరో న జీవః
నిజంగా తీసేస్తే పరమాత్మాలేడు జీవుడు లేడు
పరమాత్మ జీవుల ఉపాధి తీసేస్తే, జీవుడు లేడు పరమాత్మా
లేడు. తీసేస్తే మిగిలినది ఒకటే అనడము కొంచెము కష్టము
అనిపించవచ్చు. అందుకని గురువు మూడు నాల్గొవ పాదములలో
మనకి తెలిసిన ఉదాహరణ చెపుతాడు,
మూడు నాల్గొవ పాదములు :
రాజ్యం నరేన్ద్రస్య భటస్య ఖేటకః
రాజు యొక్క రాజ్యము, భటుడి ఆయుధము
తయో రపొహే న భటో న రాజా
వాటిని తొలగిస్తే భటుడు లేడు రాజు లేడు.
రాజుగారు భటులలో, రాజు గారి
రాజ్యము, భటుడి ఆయుధము, తొలగిస్తే భటుడు
లేడు రాజు లేడు.
పరస్పరవిరుద్ధ ధర్మములు కల రాజు భటులలో వారి ఉపాధి
తొలగిస్తే మిగిలినది ఇద్దరు మనుష్యులు మాత్రమే అదే
వారి ఏకత్వము.
అలాగే ఈశ్వరుడి మాయ, జీవుడి పంచకోశములు తొలగిస్తే
మిగిలేది బ్రహ్మమే
ఇదివరకు విన్న శ్లోకములలో - అంటే జరిగిన గురు
శిష్యుల సంభాషణలో - ఒకచోట - గురువు ఒకొక్క కోశము తీసి
ఏమి మిగిలింది అని అడుగుతాడు. చివరికి
అన్నికోశములు తొలగించినతరువాత - గురువు అడిగితే
శిష్యుడు ఇక ఏమి లేదు మరి ఆత్మ ఎక్కడ అని అడగడము
విన్నాము. అప్పుడు గురువు అన్ని తొలగించగా మిగిలిన
శూన్యమును గ్రహించ గలిగినది ఎదో అదే నీ ఆత్మ అని
గురువు శిష్యుడికి చెపుతాడు.
అదే విధముగా , ఇక్కడ కూడా అని ముందు శ్లోకములో
వింటాము.
||ఓమ్ తత్ సత్||
ఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃఃః
శ్లోకములు 243 - 244:
తత్త్వం పదాభ్యాంఅభిధీనమానయోః
బ్రహ్మాత్మనోః శోధితయోఃయదిత్థం|
శ్రుత్యా తయోః తత్త్వమసి ఇతి సమ్యక్
ఏతత్వమేవ ప్రతిపాద్యతే ముహుః||24౩||
ఐక్యం తయోః లక్షితయోః న వాచ్యయో
నిగద్యతే అన్యోన్య విరుద్ధ ధర్మిణోః |
ఖద్యోతభాన్వోరివ రాజభృత్యయోః
కూపాంబురాశ్య్ః పరమాణు మేర్వోః||244 ||
ఈ రెండు శ్లోకాలలో తత్త్వమసి అనే మహావాక్యము
గురించి గురువు చెపుతున్నాడు.
శ్లోకము 24౩:
తత్త్వం పదాభ్యాంఅభిధీనమానయోః
బ్రహ్మాత్మనోః శోధితయోఃయదిత్థం|
శ్రుత్యా తయోః తత్త్వమసి ఇతి సమ్యక్
ఏకత్వమేవ ప్రతిపాద్యతే ముహుః||24౩||
తత్త్వం పదాభ్యాం అభిధీనమానయోః
తత్త్వం పదాభ్యాం - తత్త్వంఅనబడు పదములలో
అభిధీనమానయోః - చెప్పబడుతున్న
ఇక్కడ గురువు తత్త్వం అనబడు పదములలో అంటే - తత్త్వం
అసి - అన్న పదములగురించి చెపుతున్నాడు.
తత్త్వమసి అన్న మహావాక్యములలో చెప్పబడుతున్నది -
బ్రహ్మము జీవుడు ఒకటే అని . ఇక్కడ ఆ బ్రహ్మము జీవుడి
గురించే ముందు వాక్యాలలో ( శ్లోకములో మిగిలిన మూడు
పాదాలలో) వింటాము
రెండవ పాదము:
బ్రహ్మాత్మనోః శోధితయోఃయదిత్థం|
బ్రహ్మ ఆత్మలగురించి శోధించబడిన ఏది వున్నదో అది
మూడవపాదము:
శ్రుత్యా తయోః తత్త్వమసి ఇతి సమ్యక్
శ్రుతులలో తత్త్వమసి అని బాగుగా
నాల్గొవపాదము
ఏకత్వమేవ ప్రతిపాద్యతే ముహుః|
ఏకత్వమే మళ్ళీ మళ్ళీ ప్రతిపాదించబడుతున్నది
అంటే తత్త్వమసి అన్న వాక్యములలో ఆత్మ బ్రహ్మల ఏకత్వమే
మళ్ళీ మళ్ళీ ప్రతిపాదించ బడుతున్నది.
అంటే ఇక్కడ శ్లోకతాత్పర్యము, గురువు చెపుతున్నమాట ఇది:
తత్త్వమసి అనబడు పదములలో చెప్పబడుతున్న, బ్రహ్మ
ఆత్మలగురించి పరిశోధించి అర్థము చేసుకొనబడినది
ఏది వున్నదో అది, శ్రుతులలో తత్త్వమసి అని, వాటి
ఏకత్వమే మళ్ళీ మళ్ళీ బాగుగా ప్రతిపాదించబడుతున్నది.
బ్రహ్మము గురించి ఆత్మ గురించి తెలిసికొనబడినది అవి
రెండు ఓకటే అని. "అహం బ్రహ్మాస్మి" లాగా " తత్ త్వం
అసి" అన్నది కూడా వినినమాటలే. అదే బ్రహ్మ ఆత్మ (
జీవాత్మల) ఏకత్వము . ఆ ఏకత్వము ఎలా వచ్చింది
అన్నది గురువు ముందు ఏడు శ్లోకాలలో
విశదీకరిస్తాడు ( ఋజువు చేస్తాడు)
అంటే తత్త్వమసి అన్న మహావాక్యములో చెప్పబడుతున్నది ,
ఆత్మ బ్రహ్మ ల ఏకత్వమే.
శ్లోకము 244:
ఐక్యం తయోః లక్షితయోః న వాచ్యయో
నిగద్యతే అన్యోన్య విరుద్ధ ధర్మిణోః |
ఖద్యోతభాన్వోరివ రాజభృత్యయోః
కూపాంబురాశ్యః పరమాణు మేర్వోః||244 ||
ఐక్యం తయోః లక్షితయోః న వాచ్యయో
ఐక్యం తయోః వాటి ఏకత్వము ( ఆత్మ బ్రహ్మల
ఏకత్వము)
లక్షితయోః న వాచ్యయో - వాటి లక్షణములను అనుసరించి
చెప్పబడినది కాని ఆ మాటల అర్థము అనుసరించి కాదు.
ఇక్కడ తత్ అన్నది బ్రహ్మము గురించి. బ్రహ్మము అంటే
ఈశ్వరుడు కదా. త్వం అన్నది జీవుడు. అతి చిన్న జీవుడు,
అత్యంత మహాత్ముడు అగు బ్రహ్మము - ఈ రెండు ఒకటి అని ఆ
మాటల అర్థము తీసుకుంటే రాదు. ఆ రెండు పదముల ( జీవుడు
బ్రహ్మము ) లక్షణములు లేక అంతరార్థము వలననే వాటి
ఏకత్వము వస్తుంది.
అన్యోన్య విరుద్ధ ధర్మిణోః -
పరస్పరము విరుద్ధమగుధర్మములు కలవారగు
అంటే జీవుడు బ్రహ్మము పరస్పర విరుద్ధమైన ధర్మములు
కలవారు - అది ఎలా అందుకు అంటున్నాడు? బ్రహ్మము
సర్వంతర్యామి అని మన ఆలోచన ; జీవుడు మనకి తెలిసిన
మనలాంటి చిన్న మనిషి.
బ్రహ్మము ఈశ్వరుడు, అంటే నియామకుడు. జీవుడు ఈశ్వరునిపై
ఆధారపడిన , ఈశ్వరునిచే నియమింపబడిన చిన్నజీవి.
అంటే రెండు పరస్పర విరుద్ధ ధర్మములు కలవి
వాటి ఏకత్వము , వాటి పరస్పర విరుద్ధ ధర్మములు
కల మాటలను అనుసరించి కాదు . (వాటి
లక్షణములను అనుసరించి అని తరువాత చెపుతాడు).
అలాగ పరస్పర విరుద్ధ లక్షణములు కల వాటి ఉదాహరణలు
గ్రురువు ఇక్కడ మళ్ళీ చెపుతాడు ముందు శ్లోకములో.
ఆ ఉదాహరణలు ;
ఖద్యోతభాన్వోరివ రాజభృత్యయోః
ఖద్యోతభాన్వోరివ - మెరుగుపురుగు సూర్యుడులాగా
రాజభృత్యయోః - రాజు రాజభటులలాగా
ఆ ఉదాహరణలు మెరుగుపురుగు - సూర్యుడు ; రాజు -రాజభటులు.
సూర్యుడు అత్యంతప్రకాశము కలవాడు; మెరుగుపురుగు చీకట్లో
మాత్రమే కనపడేది. వీటిలో ఏకత్యము ఎలాగ?
రాజు ఆజ్ఞలు ఇచ్చేవాడు. రాజభటుడు ఆజ్ఞలు పాలించేవాడు.
వీటిలో ఐకత్యము ఎలాగ?
కూపాంబురాశ్యః పరమాణు మేర్వోః;
కూపాంబురాశ్యః - కూపము, మహాసముద్రము
పరమాణు మేర్వోః - పరమాణువు, మేరుపర్వతము
కూపము అంటే బావి. మహాసముద్రము ; పరమాణువు - మేరు
పర్వతములు కూడా పరస్పర విరుద్ధ ధర్మములు కలవి.
ఇక్కడ గురువు, జీవుడు బ్రహ్మము ధర్మములద్వారా పరస్పర
విరుద్ధము . వాటి ఏకత్వము వాటి ధర్మములను అనుసరించి
కాదు . వాటి అంతరార్థము అనుసరించి అని.
అంటే వాటి ( జీవుడు బ్రహ్మముల) అంతరార్థము
గురువు ముందు శ్లోకాలలో వివరిస్తాడు.
ఈ రెండు శ్లోకాల తాత్పర్యము:
తత్వమసి అన్న మహావాక్యములో జీవ బ్రహ్మముల ఏకత్వము
ప్రతిపాదించబడినది. ఆ ఏకత్వము వాటి అంతరార్థము ద్వారా
వస్తుంది కాని, పరస్పర విరుద్ధమైన ,
మెరుగుపురుగు - సూర్యుడు ; రాజు -రాజభటులు ;
పరమాణువు-మందరపర్వతము; కూపము-మహాసముద్రము లాంటి మాటల
అర్థము ద్వారా కాదు.
ముందు శ్లోకాలలో వాటి అంతరార్థము వింటాము.
||ఓమ్ తత్ సత్||
______________________________________________________