Sankshipta Sundarakanda - A Telugu Poem
By Padmashri Elchuri Vijayraghavrao

Select Transliterated Telugu text in Devanagari or English
అచ్చట లంకాపురిలో
అంతెఱగని తొట్రుపాటు!
పక్షి నినాదములు,
బలియు వృక్షభంగ స్వనములతో
పలువురి గుండెలదురుచుండ.
భయానకము ఆ దృశ్యము!
వెఱపునొంది రాకాసులు
వెళ్ళి రావణునితో జెప్పిరి
“ఓ రాజా! బలీయుడగు
వానరు డొకడిని కంటిమి!
అతడు సీతను పలకరించి
అశోకవనమునకు జేరెను...
అద్భుతమగు రూపుగలిగి
అంగ బలము గల ఆ కపి
వివిధ వన్యమృగములతో
వింతలొలుకు అందముగల
అంత: పురోద్యానవనము
నంతయు ధ్వంసము జేసెను!
ఆ వన విధ్వంసకునికి
అరిగొను శిక్షను విధించి
అట్టి వినాశము నాపుట
కాజ్ఞనీయ గోరెదము”
అంతట రావణాధీశుడు
ఆరితేరిన కింకరులను
ఆ వానరుని పట్టుకొనుట
కాజ్ఞ నొసగి పంపించెను....
పర్వతముల పెకలించెడు
బల భీముడు హనుమంతుడు
భూమిని తోకతో కొట్టి
భూకంపిత ధ్వనులు చేసె!!
మహాకాయుడై పెరుగుచు
మదించి భుజముల తట్టగ
లంక శబ్ద భరితమై
ప్రతిధ్వనించె భీషణముగ!!
“రాజవంశ ధీరులైన
రామలక్ష్మణులకు జయము!!
రాజ సుగ్రీవునకు జయము!!!
శ్రమమెఱగని కోసలపతి
శ్రీరాముని దాసుడను...
శతృహతము జేయు
వాయుపుత్రుడ,
నేనే హనుమను...
రాళ్ళు, చెట్లు, చేమలతో
రణమున పోరాడగలను!
వేయిమంది రావణులను
దూయగొట్టి హతమార్చెద!
రాకాసులు చూచుచుండ
లంకను ధ్వంస మొనరించి,
సతి సీతకు మొక్కి నేను
సమృద్ధుడనై వెడలెద...
మహాత్ముడగు శ్రీరాముని
మక్కుడు శతృవులారా!
స్వామితోడ వైరము మిము
సర్వనాశనము జేయును...
మీరుండరు!
రావణుడుండడు!
లంకాపురి వుండదు!"
ఇట్లు పలికి హనుమంతుడు
గరుత్మంతుని చేజిక్కిన
గరళ భరిత భుజగము వలె
పిడికిట ఇనుప గుదియ బట్టి
పిండి చేసె దానవులను!
కింకర సైన్యము నశించి
'కిర కిర' క్రోధాగ్ని రగిలి
యుద్ధములో సిద్ధహస్తుడైన
ప్రహస్తుని సుతునకు
హనుమను హతమార్పుటకై
ఆజ్ఞనొసగె
లంకేశుడు....
క్రూరమైన కోఱలతో
కూకరించు 'జంబుమాలి”
ప్రహస్తుని పుత్రుడు
ధీరుడు,
ప్రవేష్టమున ధనువును గొని
ప్రతిస్పర్ధకై వెడలెను...
హనుమంతుని ధాటికతడు
అసువుల నర్చించు కొనగ
రావణు డతి కృద్ధుడగుచు
రాజస మంత్రుల సుతులకు
హనుమంతుని వధముకొఱకు
ఆదేశము లందజేసె...
అవనిలోన సాటిలేని
ఆంజనేయుని పరాక్రమమున
కాగలేక వీరులైన
అసురు లెందరో హతులై,
ఇతరు లెవరు వచ్చిననూ
ఇట రణమునకు సిద్ధమగుచు
వానరోత్తముడు
తిరిగి
వనద్వారము కడకేగెను....
మహాబల పరాక్రముడగు
మారుతి, భీషణరణమున
మంత్రి పుత్రులందరినీ
మసి జేసిన వార్తలు విని,
చతురంగ బలసమేతులైన
చతురులు హతులగుట జూచి,
యుగాంతమున యముని బోలు యోధ-
మారుతి గావించిన
దుర్గతికై పరితపించి, దుష్టుడు రావణాసురుడు
తన దుఃఖము లోలోన మింగెను!
విరూపాక్ష యాపాక్షులు
విక్రమ వీరులు,
యోధులు...
దుర్ధర, ప్రఘన, దాన కర్ణులు
దురంధర సైన్యాధి పతులు....
హనుమంతుని చంపుటకై
ఆజ్ఞాపింప బడుటచే
రథ గజ తురగ పదాతులు
రయముగ గొని
యుద్ధములో
కదనుదొక్కి ఈ వీరులు
కదిలిరి హనుమను గొనుటకు...
అంతటి ఘన బలగముతో
హతమైరీ అయిదుగురూ!!
తిరిగి వనద్వారము కడ
కరిగిన హనుమంతుడపుడు
యుగాంతమున యముని బోలె
'భగ భగ' ప్రజ్వలించె
మరల!
ధురంధరులైన అయిదుగురి
దుర్మరణమును వినిన పిదప
కయ్యమునకు కాలు దువ్వి
కదను దొక్కు యోధయైన
అతిధీరుడు, అస్త్రవేత్త
అవిరళ తేజస్వియైన
ఇంద్రజిత్తు, తండ్రి యాజ్ఞ
నిచ్చగించి, తన మదిలో
'హనుమంతుని చంపుట బహు
అసాధ్యకార్యమ'ని తలంచి,
బడబానలమును గక్కెడు
బ్రహ్మాస్త్రము సంధించెను!!
బ్రహ్మాస్త్రపు బలశక్తిని
బాగుగ హనుమంతుడెఱుగు....
'శస్త్రమేదియును తనపై
శక్తి జూప జాల' దనెడు
వరమిచ్చిన సృష్టికర్త
వచనములను దలచుకొనుచు,
ఆ యానతి ననుసరించి
ఆస్త్రగతికి కించు లొంగె!
మత్తగజము వలె ఘనుడగు
మారుతిని బంధించి రాక్షసులు
రావణాధీశ్వరుని చెంతకు
'రయముగ గొని పోయి, అచట
పుంఖాను పుంఖములుగ
పున: పునః: ప్రశ్నజేసిరి
“ఎవ్వడితడు? ఎవని వాడు?
ఎందుకిటకు విచ్చేసెను?
ఇచట నితని కార్యమేమి?
ఎవరి కడకు వచ్చె” ననుచు
పలువిధముల చర్చించుచు
పవన సుతుని
పీడించిరి!
***
***
||om tat sat||
___________________________________________________________________________
