Sankshipta Sundarakanda - A Telugu Poem

By Padmashri Elchuri Vijayraghavrao


లంకాదహనము
Select Transliterated Telugu text in Devanagari or English


భీమ బలులైన రాక్షసులు
పీడించిననూ వెఱువక,
అచ్చట రావణాసురుని గాంచి
ఆశ్చర్య భరితుడైన హనుమ
తనలో తను
తలిచెనిట్లు

“ఏమి రూపము! ఏమి ధైర్యము!
ఏమి సత్వము! ఏమి తేజము!
సర్వ లక్షణ సంపన్నుడైన
సార్వ భౌముని సారూపష్యమిది!

అగ్రగుడు, ఈ రాక్షసేంద్రుడు
అధర్మములనుసరించని ఎడ,
అమర లోకము, ఇంద్రలోకము
లందు ప్రభువగుటకు
సమర్థుడు!”

ఆక్రోషము పొంగిపోయి
అరుణమైన కన్నులతో
మంత్రి ప్రహస్తుని జూచుచు
మందలించె లంకేశుడు

“దుష్టుడు ఈ కపి ఇచ్చట
దుమికె నెచటి నుండి?
ఏల
దుష్క్రమముగ అశోకవన
దృమములేల 'దుము' జేసెను?
ఎందుకు రాక్షస స్త్రీల
నెదిరించె
కనుగొనవలయును”

ప్రహస్తుడపుడు హనుమంతుని
ప్రశ్నించెను “వానరుడా!
వెఱువ కెంతమాత్రము. నిను
విడిపింతుము. నిజము చెప్పు

ఇంద్రునిచే పంపబడగా
ఈ నగరికి వచ్చితివా?

కుబేరునికి, యమునికి, వరుణుని
కెవ్వరికైన నీవు
చారుడ వై వచ్చి ఇచట
చోరుని వలె జొచ్చితివా?

విష్ణుదేవునికి దూతగ
విచ్చేసిన పిదప నీవు
రావణుని జయించుటకై
రాధ్ధాంతము పన్నితివా?

వానరుల కసాధ్యమైన
వజ్రదేహ తేజస్వివి!
విప్పి చెప్పు. శీఘ్రముగా
విడుదల లభియించునపుడు...

అసత్యములు పలికితివో
అసువులతో బయల్పడవు....”

అంతెఱుగని ప్రశ్నావళి
కత్యుచిత సమాధానము
లంద జేయ నిశ్చయించి,
మహాసత్వమును పొందిన
మారుతి
త్వరపడకుండా
బుద్ధిశాలి రావణునికి
శుద్ధిగల ఉత్తరువులిచ్చెను

“రాక్షసరాజా! వినుమిక!
రాముని సేవకుడను నేను...
మానవుడను గాను. కపిని.
'మారుతి' నా శుభనామము.

సుచరిత్రుడు శ్రీరాముడు
సృష్టి, స్థితి, లయల కర్త!
పంచభూత సహితమైన
ప్రపంచమును హత మొనర్చి
అట్టి లోకమును తృటిలో
అవతరింప గలడు మరల!

అతని చేత చంపదగిన
అభిజాతుడవైన నిన్ను,
శివమెత్తిన రణమున
ఆ శ్రీరాముని ఎదుట నిలిచి
బ్రహ్మ, రుద్ర, మహేంద్రులే
బ్రతికించగ లేరు సుమా!

రాముని కక్రమ మొనర్చి,
రమించి సుఖమొందు ప్రాణి
ముల్లోకములందు లేడు!
ముమ్మాటికి దుస్సాధ్యము...

అర్థ యుక్తమగు వాక్యము
లాలకించు ప్రజ్ఞుడవై
త్రికాలయుతమగు ధర్మము
తీఱుపెరిగి వర్తింపుము....

నరోత్తముడు శ్రీరాముడు
నారాయణుడని గ్రహించి
శీఘ్రమతని ధర్మపత్ని
సీత నప్పగించ తగును”

వానర వీరుడు పలికిన
వాక్కుల కతి కృద్ధుడైన
దశాననుడు హనుమంతుని
దళనమునకు ఆజ్ఞనిచ్చె!

ధరణి పుత్రి సీత కొఱకు
దౌత్యముకై ఏతెంచిన
కపీశ్వరుని వధించుటను
'కటు తరమగు అధర్మ'మని
రావణునికి అనుజుడు - రణ
రంగయోధ, విభీషణుడు,
అర్థ వంతమగు హితవును
అన్నకు తను తెలియ జెప్ప....


“కోపించక నా మాటలు
కొంచె మాలకించ దగును;
ఉచితానుచితము లెఱిగిన
ఉత్తములగు రాజేంద్రులు
నీతిగ సందేశమిచ్చు
దూత నెపుడు దండించరు”

విభీషణుని హితవాక్యము
వినిన దశాననుడప్పుడు
దేశకాలస్థితికి తగిన
ధ్యేయముతో నిట్లు పలికె

“నీవు చెప్పినది నిజమే;
నింద్యము దూతను చంపుట....
మరణ దండనమును మాని
మరియొక శిక్ష విధింతును;

కోతికి తన తోకపైన
ప్రీతి మెండుగనక, ఇతని
వాలమునకు నిప్పు బెట్టి
వానిని విడిపించెదనిక...”

హనుమంతునిపై మిక్కిలి
ఆగ్రహమొందిన అసురలు
గుడ్డ పీలికల నంటించి
గురిగ వాలమునకు జుట్టిరి!

ఎండిన ఉపవనములలో
ఎగసిపోవు అగ్ని పోలె
అతని తోకపై మంటలు
అతిశయముగ పెంపొందెను!

లాంగూలాగ్రపు మంటల
లాస్యము గని అసుర వనిత లా
వార్తను వైదేహికి
ఆప్రియముగ తెలిపిరిట్లు

“అడవిలోన నినుగాంచిన
అరుణ వదనుడైన కోతి
ఉజ్వలమగు తన వాలము
ఊరంతయు దిప్పుచుండె!!”

నియమములను పాలించెడు
నిర్మలాత్మ - సీతాదేవి
హనుమను రక్షించుటకై
అగ్నిహోత్రుని ప్రార్థించెను

“అత్మశుచిగ నే రాముని
కాదరణము జేసినచో
జ్వాల నుండి హనుమంతుని
జాగ్రతగా రక్షింపుము...

అసలు నాకు కొంచెమైన
అదృష్టమనినది యుండిన,
నిప్పులోని 'వేడి' తీసి
నీ చలవను ప్రేరింపుము....


రాముడు నిజముగా నన్ను
రాపవళ్ళు స్మరించుచో
నీ ఉష్ణోగ్రతను వీడి
నిమ్మళించి అనుగ్రహించు...”

అగ్నిహోత్రుడు, జానకి
ననుగ్రహించిన గురుతుగ
వింతలొలుకు జ్వాలలతో
విజృంభించె హనుమంతుడు!

ఆమె నూఱడించ వచ్చిన
అసుర 'సురమ' పలికెనిట్లు
“వైదేహీ! చింత వలదు;
వీరుడు సర్వ సమర్థుడు.....
ఆంజనేయుని గురించి ఆతృత
పడవలదు నీవు.....

లంకా దహన మొనర్చుచు
లంఘించె నభోవీధి నతడు!
కారు మబ్బుల వలను తెంచి
కాంతి పుంజముతో బయల్పడిన
రజనీ కరునివలె మారుతి
రమ్యముగా వెడలి వచ్చె!”

ఆ వచనములు వైదేహికి
అమిత సుఖము కలిగించెను!

సంకల్ప సిద్ధిగాంచిన
సమర యోధుడు హనుమడు
మండుతున్న లంకను గని
మదిలో బహు సంతసించె!

“లంకలోని రాకాసుల
నింకెంతో శిక్షించవలె...
నగర దుర్గమును త్వరితము
నశింపజేయవలె నిప్పుడు....
అతిసులువుగ ఈ కార్యము
నంతు జేసి సఫల మగుదు....

లాంగూ లాగ్నిని రగిల్చి
రయము భవనములను కూల్చి
తృప్తి పొందుటే నాకై
తుల్యమైన న్యాయమగును”

ఇట్లు తలచి పవనసుతుడు
ఇంచుగ మిన్నంటి, తోక
అంచున ప్రజ్వలితమైన
అగ్నిని వ్యాపింపజేసి
మేడలను తుదముట్టించుచు
మేఘ వీధి సంచరించె!

శ్రీరాముని పద ధ్యానము
సిద్ధిగ మదిలో వహించి
వాయు వేగమున మారుతి
వడివడి లంకను దహించి,
సాగరమున తోక ముంచి
సాంతము చల్లార్చి, పిదప
మనసు కొంత నొచ్చినట్లు.
మంతనములు సేయదొడగె!

“లంక నిట్లు కాల్చితినే!
లాభమేమి గనుపించెను?!
కోపించిన మనుజుడెట్టి
పాపము నైనను జేయును...
క్రూరమైన సర్పము తన
కుబుస మెట్లు త్యజించునో
కోపమట్లు త్యజించుకొనగలవాడే
పురుషుడు మరి ....

ఓర్పు లేక
కూర్చు చెదిరి
ఏ పాపము జేసితినో!
ఎడద భగ్నమగు చున్నది.....

దగ్ధమైనదీ లంక....
దహింపబడెనేమో జానకి!
ప్రయోజన రహితముగా
ప్రభు కార్యము విఫలమాయె!”

ఆంజనేయుడీ విధముగ
ఆదుర్దా పడిన వేళ
చెలిమిగ మిన్నున చరించు
చారణుల వాక్కులను వినెను

“బురుజులు, ప్రాకారములు, ద్వారములు
బూడిదయై పోయిననూ
అహో! అద్భుతము! జానకి
నగ్ని ముట్టుకొననే లేదు!
ఇంత ఆశ్చర్య సంఘటన
నింతవరకు కననే లేదు!”

శింశు పాక వృక్ష మూలమున గల
సీతా దేనిని దర్శింప వెడలి,
దరిజేరి నమస్కరించి హనుమడు
దాక్ష్యమైన వాక్కులిట్లు పలికెను

“అమ్మా! నిను క్షేమముగా వీక్షించెడు
అదృష్టము నాకు మరల కలిగెను!”
ఇట్లు నుడివి
దీవెనలు గైకొని
ఆకసమున కెగసెను
కపివర్యుడు...

****
***

||om tat sat||

___________________________________________________________________________