Sankshipta Sundarakanda - A Telugu Poem
By Padmashri Elchuri Vijayraghavrao

Select Transliterated text in Devanagari or English
పరాక్రముడు పవనసుతుడు
సావధానుడైనందున
రాత్రి త్రిజట” గనిన కలలు,
రాకాసుల కృత్రిమములు,
సాధ్వి సీత వృత్తాంతము,
సాంతముగా గమనించెను...
“ప్రాత: కాలమునకు ముందుగనే
సీతమ్మ తల్లి నూఱడించవలె...
మల్లడించు తన దీనస్తితిలో
మరణించ గలదు
నిస్సందేహము...."
మారుతి మది
మండ్రాట మొందినది...
వైదేహిని గూర్చి అతడు
వై విధముల నూహించుచు,
మనోజ్ఞమగు వర్ణనతో
మాత సీత వినునట్లుగ
మధుర వాక్యములు పలికెను;
రాముడు 'తెలుపవలె' నన్న
రమ్యమైన వృత్తాంత చయనమిది
“దశరధ మహారాజు ఘనుడు...
ధర్మ మెఱింగిన భూవతి....
పుణ్యమూర్తి. కీర్తి పరుడు....
పురి పుచ్చులు లేని దిట్ట...
రథ గజ తురగ పదాతుల
రక్షకుడగు మహారాజు...
ఆ దశరధ రాజేంద్రునికి
అనుగు పుత్రుడే రాముడు...
ధనుర్వేత్త... చంద్రముఖుడు...
ధర్మజ్ఞుడు శ్రీరాముడు...
తండ్రి యాజ్ఞ ననుసరించి,
తను, సీతా లక్ష్మణులను
వెంట గొనుచు, వేదనతో
వెడలివచ్చె వనవాటిక...
ఆ కీకారణ్యమందు.
అతి వికృత రూపులతో
అఘోరములు సల్పుచున్న
అసురుల హతమార్చుట, విని,
రామునిపై కృధితుడైన
రావణాసురుడు, దుష్టుడు
మాయామృగ వేషములో
మాత సీత నపహరించె!
ఆ మహా పతివ్రతకై
అంతులేని దుఃఖముతో
వనమంతయు వెదకు చుండ
వానరులరాజు సుగ్రీవుని తో
వాత్సల్యము పెంపొందెను....
శతృ నగరముల శకలము జేసెడు
శార్యపరాక్రముడగు శ్రీరాముడు,
వాలిని సంహరించి ఆ రాజ్యము
వానరేణ్యుడగు సుగ్రీవుని
కొసంగె....
విశాలాక్షి సీత కొఱకు
విక్కుగ సాగరము దాటి
'రాముడు జానకి గురుతుకు
రంగు రూపు తెలిపిన విధి,
కాంతి వంతమగు యువతిని
కాననమున నిట గంటిని!”
మారుతి పలికిన
పలుకులు విని విని
మానిని జానకి
అచ్చెరు వొందెను!
శిరోజములు సర్ది
మోముపైకెత్తి
శింశుపాక వృక్షముపై
జూచెను!
మెఱుపులాంటి దేహముపై
మెఱియు ధవళ వస్త్రములతో
దృమముపైన గల హనుమను
జూచి జానకి చలించెను!
బృహస్పతికి, ఇంద్రునకును,
బ్రహ్మకు, అగ్ని దేవునకు,
నమస్కారము లొనరించి
నమ్రతతో ప్రార్థించెను
“వానర వర్యుడు చెప్పిన
వార్తలు సత్యమగును గాక!”
అరుణ వర్ణ ముఖపద్మము,
అవిరళ తేజస్సు తోడ
వాయుసుతుడు వృక్షము దిగి
వందనములు సమర్పించి,
వందించుచునిట్లు పలికె
“అమ్మా! దేవతవలె నీ
వతిశయ సౌందర్యవతివి!
రుద్రగణమొ, మరుదగణమొ
రుచిరమైన వసుగణమో,
ఏజాతికి చెందెదవో
ఎఱుక దెలుప ప్రార్ధించుదు...
దుష్టరావణుని చఱలో
దుఃఖితయగు
జానకివా?
నిర్మల ముఖ సౌందర్యము
నిగుడించిన ధైర్యముతో,
వనవాసావస్థ యందు
వగచు రాఘవేంద్రుని సతి
సీతమ్మవు నీవే” నని
స్థిరమైనది నా మదిలో”
పతిదేవుని ప్రసక్తి విని
బహు సంతస మొందె సీత...
ఆ వృక్షము కడ నిలిచిన
'హనుమతోడ
నిట్లు పలికె...
"థూర్తుడు రావణుడు నన్ను
దుండగించి అపహరించె...
ద్వి మాసపు గడువు నిచ్చి
తదుపరి హతమార్చ నెంచె...
ఆదుష్కరముకు మిన్నడి
అసువులు విడిచెదను నేను”
వైదేహీ కరుణహృదయ
వైక్షబ్యము నెఱిగి, నొచ్చి,
వానరాధిపతి హనుమడు
వైనముగా నిట్లు పలికె
“శ్రీరాముని సందేశము
శిరమునొగ్గి వచ్చితినిట;
మీ క్షేమము నెఱుగుటకై
మిగుల వేచియుండె స్వామి”
రామదూత హనుమంతుని
రాకకు సంభ్రమమునొంది
అంజన సుతునిపై అపుడు
అద్భుతమగు ప్రీతి గలిగి
ఆప్యాయతతో నిరువురు
అనువుగ సంభాషించిరి....
“వానరోత్తమా! వినుమిక;
వరదుడైన శ్రీరాముని
వార్త నాకు పరమ ప్రియము....
ఆ రాముని గుణ వర్ణన
నాలకింప మనసాయెను”
మారుతాత్మజుడప్పుడు
మాత సీత మది గ్రహించి
కర్ణానంద భరితమైన
కబుర్లతో ముదితపరిచె
“సూర్యుని తేజస్సు గలిగి
చంద్రుని వలె చాతురికుడు...
మన్మధ సౌందర్యము గల
మహారధుడు శ్రీరాముడు...
ఈ వియోగ దుఃఖముచే
మిగుల పరితపించుచుండె....
నీ క్షేమము నెఱుగ గోరి
నన్నిట దూతగా పంపెను...
వాన రేణ్యుడు సుగ్రీవుని
వద్ద మంత్రిని;
హనుమను;
సముద్రలంఘనము జేసి
సందర్శించితి లంకను”
శ్రీరామ చంద్రుని వార్తవిని
సీత మధురముగ నిట్లనెను
“రాముడెచట సంధించెను?
లక్ష్మణు నెట్లెరుంగుదువు?
మానవ మాతృలతో ఈ
వానర సమాగమ మెట్టిది?
రామ లక్ష్మణుల గుణగణ
లక్షణములు వర్ణింపుము.....
హనుమా! నీ సమాధాన
మతిశయ వుపశమనమిచ్చు”
యథాతథము
క్రమరీతిని,
బదులు పలికె
హనుమంతుడు
“కమనీయ సౌందర్యము గల
కమల పత్రాక్షుడతడు...
రూపదాక్షిణ్యములతో
రూపొందిన బుద్ధిబలుడు...
సూర్యుని వలె సుతేజస్వి...
భూదేవికి గల సహనము...
బుద్ధియందు బృహస్పతి
ఇంద్రునివలె యశోధనుడు...
జీవలోక రక్షకుడు....
బంధుజనుల భగవంతుడు...
బ్రహ్మక్షత్రియాదులకు
ధర్మపాలనావతంసుడు...
వేద వేదాంగ పారంగతుడై
వెల్లివిరియు గుణసాగరు డాతడు...
సత్య ధర్మ సమధర్మ పాలకుడు...
సకల సంపదల నార్జన చేయుచు
పాత్ర దానమెఱిగి విరివిగా
పరులకు ధన దానముల నొసంగును...
దేశ కాల పరిస్థితు లన్నిటి
ధ్యేయ మెఱిగి వర్తించును...
బహుజన ప్రీతి గణించిన
పరమ పావనుడు రాముడు!
లక్ష్మణునకు శ్రీరాముని
లక్షణములే ప్రాప్తించినవి....
పావని కౌసల్య యొసంగిన
పాయస భాగపు మూలముగా
సువర్ణ దేహ కాంతితో పుట్టిన
సుమిత్రానందనుడు
లక్ష్మణుడు...
శ్యామల వర్ణుడై మెఱియు
రాముని కతిప్రియ అనుజుడు...
అత్యంత కుతూహలముతో
ఆ పురుషోత్తములు నిన్ను
వెదకి వెదకి యత్నించెడు
వేళ మమ్ముగనిరి నిచట!
రామునితో సుగ్రీవుని
రమ్య సమాగమము జరిగి,
వానరేంద్రుని ఆజ్ఞనుగొని
వానర శ్రేష్ట లెందరో నిను
వెదకుటకై పంపబడిరి.....
మాతా! సీతా! తమతో
'మరల మరల విన్నవింతు...
వాయుసుతుడగు హనుమను;
వానరుడగు సుగ్రీవుని మంత్రిని;
రామలక్ష్మణుల దూతనై నేను
రాగల్లితి మీసమక్షమున....
వైదేహీ! మీ విశ్వాసార్థము
వర్ణించితి రాఘవుని ఘన కీర్త...
రాముడు శీఘ్రమేతెంచి
రక్షించి, తిరిగి గొనిపోవును
మిము....”
ఆ కధనము విని ఉపశమన మొంది
అతి సంభ్రమముగ జానకీ దేవి
అతనిని రామదూతగా గ్రహించి
ఆనంద బాప్పములు విడిచినది!
మహాభాగయైన సీతాదేవితో
మారుతాత్మజుడపుడిట్లనెను
“వచ్చితి. వానర దూతను.
తెచ్చితి గైకొను మిదుగో,
నామముతో చెందుగొనిన
శ్రీరాముని శుభ ముద్రిక!”
మేను పులకరింపజేయు
మేలైన శుభముద్రిక గొని
రాముని పొందినట్లే భావించి
భామిని బహుసంతసించెను!
పవనసుతుని గొనియాడుచు
పలు విధముల ప్రశ్నించెను
“కాకుత్‌స్థుడైన రాముడు
కుశలముగా నున్న ఎడల
ప్రళయాగ్ని రగిల్చి, కృథితుడై
పృధివినేల దగ్ధము చేయడు?
ఆజ్ఞ పాలనారతుడై
అతడు రాజ్యమును త్యజించి
వనమునకు నన్ను గైకొని
వచ్చినపుడు దుఃఖించలేదు...
అట్టి రాముడిప్పుడు నా
అపహరణ వియోగము సహించి
దు:ఖముతో లొంగిపోక
ధైర్యముతో నుండెగదా!”
వీరుడైన హనుమంతుడు
విని ప్రణతిగ శిరము నొగ్గి
ప్రత్యుత్తర మొసంగెను
“అమ్మా! శీఘ్రముగ వెడలి
అతనికి నీ వార్త నిత్తు....
భల్లూక వానరాదులతో
బలిష్టమైన సేనను గొని
రామచంద్రుడిక లంకకు
రయముగ రాదలచినాడు...
పరి క్లేశపూరితుడై
పరిపరి 'సీతా!' యనుచూ
నిరతము నిను దలచి తలచి
నిను గనుటకు యత్నించును”
***
***
||om tat sat||
___________________________________________________________________________
