Sankshipta Sundarakanda - A Telugu Poem

By Padmashri Elchuri Vijayraghavrao


సీతా హనుమంతుల సంభాషణము -2
Select Transliterated Telugu text in Devanagari or English


పూర్ణచంద్రముఖి జానకి
పూనికతో విని హనుమకు
తన ప్రత్యుత్తరము నిటుల
'ధర్మయుక్తముగ' నిచ్చెను

“అతడు 'నన్నే తలచిన'
అమృత వాక్యమునకు తోడు
'విరివిగ దు:ఖితుడైనట్టి'
విషపూరిత వాక్కు కలిపి
సుఖ దుఃఖములను పొత్తుగ
సూచించితివే హనుమా!!

సంవత్సర కాలమునను
సంహరించుటకు పరిమితి
క్రూరుడు రావణు డిచ్చిన
కుతంత్రమగు గడువు నుండి
పది నెలలపుడే గతించి
పక్కున రెండే మిగిలెను....

ఈలోపున రావలెనని
శ్రీరామునితో చెప్పుము

రామచంద్రుని కడకు నన్ను
రయముగ తరలించ మనిన
విభీషణుని విన్నపమును
విననే లేదా దుర్మతి!”

కన్నీటి బాప్పములు కార్చి విలపించగా
కపీశ్వరుడామెను గని
కరుణతో నిట్లనెను

“అమ్మా! నీ స్థితి నెఱింగి
అతి శీఘ్రము శ్రీరాముడు
భల్లూకపు సైన్యముతో
భండనమునకే తెంచును...

అంత దనుక వేచియుండుట
అసలనవసరము తల్లీ!
నీ దు:ఖనివారణ
నే నీక్షణమే చేయగలను;

నా కంధముపై నెక్కుము
నిన్నిపుడే గొనిపోయెద...

సముద్ర లంఘనము నందున
సంపన్నుడనగు నాపై
సందేహము వలదు. నేను
సమగ్రముగ బలిష్టుడను...

రావణ సహితముగా ఈ
లంకను నే మోయగలను”

మదిలో సంభ్రమము పొంది
మారుతి తోనిట్లు పలికె

“కపివర్యా! నీవు నన్ను
కంధముపై మోసుకొనుట
కోతి చేష్ట యని మదిలో
కొంచెము సంకోచమాయె!”

వాయుసుతుడు, బలవీరుడు
వైదేహీ వచనము విని
అవమానము జెంది, నొచ్చి,
ఆలోచించ దొడంగెను

“నా బల ప్రభావములను
నమ్మినట్లు గానరాదు;
నితాంతముగ సీతకు నా
నిజరూపము ప్రదర్శింతు”

జగజ్జేయ మానముగా
జ్వలిత ప్రజ్వలితమైన
మేరువు, మందరములవలె
మేటి పర్వతముల కాంతి

అంత కంత కతి ఘనముగ
ఆకాశము వరకు పెరిగి
విజృంభించి ప్రచండుడై
'విశ్వరూపము'ను జూపెను!!

వెల్లివిరియు ప్రళయమువలె
వెఱుపు గొలుపు వాయుసుతుని
పరికించుచు పలికె సీత
“ఆహో! ఘనుడవు వానరేంద్రా!

అద్వితీయమునీ సత్వము!
వాయు దేవుని స్ఫూర్తి,
అగ్ని వలె తేజస్సు గలిగి
అద్భుతమగు శక్తులతో
అలంకరితుడవు!

కానీ
కపివర్యా! నేనిప్పుడు
కదలివచ్చుటనుచితమగు;

నీవు దుష్ట సంహరణకు
నిజముగ సమర్థుడ వైన,
రట్టుగ నను గొని పోవుట
రాముని కీర్తికి భంగము...

పరపురుషుని దేహస్పర్శ
పతి భక్తికి విరుద్ధమగు...

దశరధ పుత్రుడు స్వయముగ
దశకంఠుని సంహరించి
'సబబుగ నను గొని పోవుట
సకల విధములుగ యుక్తము....

వానరేంద్రా! శ్రీఘ్రము
వజ్రదేహి వనచరముల
వన్నియగల సైన్యముతో
రామలక్ష్మణులు లంకకు
రావలెనని నా కోరిక....

బహుకాల వియోగ పీడ
భరించక కృశించు నాకు
పరమాత్ముని రాక వలన
'పరమానందము గలుగును...”

వాక్చతురుడైన వాతాత్మజుడు
వేడు కొనెను వైదేహితో నిట్లు.
“దయామయీ! రాముని దూతకు నీ
దర్శన భాగ్యము లభించినట్లుగ
గురుతుగ శ్రీరామునికి దెలుపుటకు
“గుర్తు' నొకటి ప్రసాదింప గోరెదను”

దేవ కన్యతో సమానురాలగు
దేవి సీత హనుమతో పలికెను
“ప్రీతిగ ఈ 'వృత్తాంతపు గురుతు'ను
ప్రియుడు శ్రీరామ చంద్రునికి తెలుపుము...

చిత్ర కూటమున కీశాన్యముగా
సిద్ధాశ్రమ మొకటి గలదు. అందున
ఒకానొక కాకి, మాంసమును గోరి
ఒద్దుగ ముక్కుతో పొడుచుటను జూచి,

అట్టి యెడ నుండి తరిమి వేయుటకు
మట్టిబెడ్డ కాకిపై విసిరితిని;
కాకి చేష్టపై కోపించుటచే
కన్నీళ్ళు ముఖముపై వ్యాపించగా,
తుడుచుకొనుట
నా నాథుడు చూచెను...

బుద్ధి బలుడు, ఉత్తముడగు
బాహుబలుడు శ్రీరాముడు
భంజకమగు చేష్టచూచి
భరించ లేని కోపము తో
దర్భాసనములో నున్న
దర్బ పుల్ల నొకటి తీసి
బ్రహ్మాస్త్రముచే దానిని
బలముగ అభిమంత్రించెను!

ఒక కాకిని చంపుటకై
వొదిలెనతడు బ్రహ్మాస్త్రము!
మహపాపిరావణాసురుని
మరి ఎందుకు క్షమించునో?!”

కరుణతో వైదేహి
కార్చినది కన్నీరు...
తేజస్వి కపివరుడు
తెఱుకువగ నిట్లనెను

“నీ వియోగ దుఃఖముచే
శ్రీరాముడు అతి విముఖుడు...
ఈ విషయము 'సత్య' మనుట
కిట శపథము చేయుచుంటి”

మదిలో గల చింత పెరిగి
మారుతితో పలికెనిట్లు
“కౌసల్యా పుత్రుడైన కోసలేంద్రుడు
శ్రీరాముని కభివాదములు దెలిపి,
అడిగెద నాతని క్షేమము...

“ఇంకొక నెలరోజులలో
ఈమె ప్రాణములు విడుచును;
దశరధ నందనా! సీత
దక్కదు. రక్షింప మనుచు
పతి దేవుడు రాముని తో
పరిపరి విధముల దెలుపుము”


ఇట్లు పలికి తన చీర కొంగులో
గట్టుకొనిన దివ్యమైన చూడామణి
'గురుతుగ' రాముని కిమ్మని జానకి
గుణవంతుడు హనుమంతుని కొసగెను...

“వానరేంద్రుడా! నా సందేశము
విని, మహా వీరుడైన నాపతి
అతి పౌరుషమగు అవికల్పముతో
నన్ను పొందుటకు జతనము సేయును”

సీత వాక్యములాలకించి
శీఘ్రముగా వాయుసుతుడు
తలను వంచి, కేలు మోడ్చి
తన ప్రత్యుత్తర మొసగెను

“కకుత్‌స్థ వంశ వీరుడు శ్రీరాముడు
కపులతో, భల్లూకములతో విరజిల్లు
సేననుగొని వచ్చి యుద్ధమున
శత్రువుల నోడించి తీరును తల్లీ!

కార్య నిర్వాహకృత నిశ్చయుడై
కదలి వచ్చునిట సుగ్రీవుడపుడు;
ఓ వైదేహీ! వెయ్‌ వేల కోట్ల
వానర వీరుల నిటకు గొనివచ్చి
అసురుల సైన్యము లంతమొనరించి
అతి శయమగు విజయము సాధింతురు!

రఘువంశాఖ్యుడు,
బంధు సహితముగ రావణ సంహారమును గావించి
అతి సుందరమగు సీతమ్మను-నిను
అయోధ్యాపురమునకు గొని పోవును...

దేవకన్యారత్నమును బోలిన
దేవి సీత హనుమతో నిట్లనెను
“హనుమా! నీ ప్రియ వాక్యములను విని
అతిసంతసమైనది నామదిలో;

మొలక లెత్తగనే తొలకఱి వానలు
ముదముగ ఫలసిద్ధి నొందించును గదా!

వాయుసుతా!
రామలక్ష్మణులనూ,
అచ్చటి వానర వీరులతో సహ
అందరినీ క్షేమమడిగితి ననవలె...
రాముని సన్నిధి చేరిన క్షణమున,
రావణాసురుని దుష్కర్మలతో
నేననుభవించు మహదు:ఖమును
నెట్టనముగ వర్ణింప గోరెదను...

సుఖముగ వెడలుము
శుభమగును గాక!”

రాకుమారి సీత ఇట్లనగా, తన
రాక సప్రయోజనమైనందుకు
సంతసించి, తనుదలచిన కార్యము
చాల వరకు నెరవేరినట్లుగని,
ఉత్తమ సంకల్పముతో నాతడు
ఉత్తర దిశ బోవ ప్రతీక్షించెను...

అటనుండి పయనమై
ఆలోచించెను హనుమ

“జయ సూచకముగ
నే జానకిని కనుగొంటి!
అయినవెన్నో పనులు
అల్పమే శేషమిక.....

ఆ కార్యసిద్ధికై
అతి చాక చక్యముగ
దండోపాయమును వాడి
దహించెద వైరులను....

రణరంగములో రావణాసురుని
బలా బలములను బాగుగ కనుగొని
అతని సహచరుల
నచట ఎదుర్కొని
అంతు తేల్చుకొని
అపుడు వెడలెదను...”

***

***

||om tat sat||

___________________________________________________________________________