Sankshipta Sundarakanda - A Telugu Poem
By Padmashri Elchuri Vijayraghavrao

జనని జానకి జాడ గనమని
జాంబవంతుడు చెప్పగానే,
శతృనాశకశౌరి హనుమడు
సిద్ధమై, తను గగన వీధిన
రావణాసుర రాచ వీడుకు
రయముగా పయనించ గోరెను
దురధిగమమై మానవాళికి
దుష్కరమైన సాగర లంఘనము
నిర్విఘ్నగతి నిర్వహించుటకు
నిజ శిర కంఠములు నిక్కించిన
వీరయోధుడు మరుత్వంతుడు
వృషభ రాజేంద్రుని వలె శోభించె!
అపుడు సూర్యమహేంద్ర పవనుల
కింపుగా బ్రహ్మా భూతములకు
అంజలి ఘటించి, అంబుధి దాటుట
కాంజనేయుడు పోవనెంచెను...
అంగద జాంబవాదులతో
అనియెనిట్లు పవనసుతుడు
“శ్రీరాముని శరము భాతి
చిందు ద్రొక్కి వాయువీధి
రావణరక్షిత లంకకు
రంహణముగ చేరి, అచట
కరుణామయి సీతమ్మను
కనుగొన లేక పోయితినో,
నాగలోక స్వర్గాదుల
నలసట నొందక చరించి
రావణ సహితముగా ఆ
లంకను పెకిలించుకొచ్చి,
ఏవిధముగనైన సరే
ఎత్తుబట్టి వెదకి తుదకు
తీరు ఱీతి సీతమ్మను
తీసుకునే మఱలివత్తు”
మహావేగ సంపన్నుడు
మనోధైర్య మహాబలుడు
గరుడునిలా కపివర్యుడు
గగన వీధి లంఘించెను!
'సునాయాసపు నభోగతికై
సూర్యదేవుడు రశ్మి నార్పెను...!
రామ కార్యపు సిద్ధి కొఱకై
రంజిల్లె నట మలయమరుత్తు...!
ఆకస వీధి నధిగమించిన
అంజనసుతుని బుషులు పొగడిరి...!
'దేవగంధర్వు లేక కంఠమున
దేదీప్యమానముగ శ్లాఘించిరి...!
“ఇక్ష్వాకు కులవేల్చు రామునికి
ఇంపెనలారు మంత్రిమారుతి;
ఆయానపు గమన శ్రమను బాపి
అతనికి విశ్రాంతినిచ్చి,
ముందుమార్గ మవలీలగా దాటి
ముందుకేగుటకు తోద్పడవలె” నను
ఆకాంక్షను, సముద్రుడు, తన
అంతర్గర్భమున దాగి అండగొనిన
మైనాకుని కిట్లు
ఆత్మీయతతో నుడివెను...
“రామ కార్యార్థమై
రయముగ నభోవీధి
ఆంజనేయుడు వెడలె,
నతడికి తోడ్పడ వలయు...
నీ శిఖరాగ్రమున క్షణము
నిలిచి విశ్రాంతి గొని
దారి సాగిపోవును. కపి
దరిజేరనున్నాడు నిన్ను”
ఇటులే చేయుట కొఱకై
ఇచ్చగించి, నిశ్చయించి
మనసారా మైనాకుడు
మారుతి కై వేచియుండి,
కనకమయపు కాంతులతో
కదనుదొక్కి శృంగమెక్కి
వానరేంద్రుని త్రోవన
వారధిలా సంధించగా,
ఇతని ఈప్సితము తెలియక,
ఇదొక విఘ్నమని తలంచి,
వాయు వేగమున మారుతి
వక్షముతో గిరిని కూల్చె!
కపివర్యుని వేగమెఱిగి
గగుర్పడిన మైనాకుడు
మానుషరూపమును దాల్చి
మందసముగ నిట్లు పలికె
“పవనసుతా! దుష్కరమైన
'పయోనిధిని లంఘించు చున్నావు!
మా ఎదలో విశ్రమించి
'మాపూజలు స్వీకరించు...
మీ దర్శన భాగ్యమే మాకు
మిక్కిలి సంప్రీతినిచ్చె....”
వాయుసుతుడు సంతుష్టుడై
వాత్సల్యము తో స్పృశించి
“అయ్యా! మీ ఆతిథ్యము
నందుకొన్నట్లే తలంపుము;
వేగముగా కార్యము నెఱ
వేర్చవలసిన సమయ మిది...
'అంతరాయమెంతైనా
ఆలసింప'నని ప్రతిజ్ఞ.....
'మార్గమథ్యమున ఆగను.
'మాన్యుడ విక సెలవిమ్మ”ని
నవ్వు ముఖముతో మారుతి
న భోవీధి కెగసిపోయె!
వీరుడు మైనాక గిరిపై
విశ్రమింపకుండుటను గాంచి
మహర్షులు, సిద్ధులు, దేవతలు
“మహా కార్యమిద”ని
నుడివిరి!
అయిననూ మహాత్ముల మది
నవతరించె అభీష్ట మొకటి!
మారుతి బల పరాక్రమములను
మరొక పరి తిలకించ దలచిరి!
సూర్య మండల సముజ్వల యగు
సురసాదేవి నాగ జనని...
“ రక్తి మ పర్వత సదృశ
రాక్షస రూపమును దాల్చి,
అఘోరమైన కోఱలతో
ఆకాశమంతటి నోరు తెఱిచి,
హద్దుమీరి, కొంతసేపు
హనుమంతుని ప్రతిఘటింపమ”ని
'సురమునులా నాగజనని
సురసను, సత్కరించి
కోరిరి!
సాగరమథ్యమున ఆమె
స్వరూపమును కురూపిలా మార్చి
మనోవేగమున నెగసిన
మారుతి నడ్డగించి పలికెను.
“హనుమా! నా కాహారముగ
అమరుల చే నొసంగ బడితివి...
నిను భక్తించెద.
శీఘ్రము నా
నోటిలోకి ప్రవేశించు”
ఎనుబది యోజనముల పొడవు పెరిగి
ఎత్తయిన ఆకసమైనదా నోరు!
కపివర్యుడు తొంబది యోజనముల
కంచుకోట వలె దేహము పెంచెను!
శత యోజనములు విస్తరించినది
శైల శ్రేణులవలె సురస నోరు!
మించు బుద్ధిబలుడు మారుతి
మిక్కిలి వేగముతో, తను
అంగుష్ట మాత్రుడై, నోటిలో
అవలీలగా జొచ్చి, తుదకు
ఆత్రముగా బైటికొచ్చి,
అంతరిక్ష వీధి కెగసి
అసుర సురస తో నిట్లనె
“దక్షపుత్రీ! నమస్సులు...
నువ్వు గోరిన రీతిగనే
నీ వదనమున జొచ్చితిని...
వంద్యుడు బ్రహ్మా నీ కిచ్చిన
వరము సత్యమాయెగదా!
వైదేహి నన్వేషించవలయు
నాకు సెలవు మరిక...”
రాహుముఖ విముక్తుడైన
రజనీకరుని భాతి
“కళ “కళ" లాడుతూ బయల్పడిన
కపివర్యుని గాంచి సురస
నిజరూపమును దాల్చి
నిర్భయముగ నిట్లు పలికె
“కపివర్యా! శుభము.... శుభము...
కార్య సిద్ధి గలుగు గాక!
సీతాదేవిని మహాత్ముడగు
శ్రీరాముని తో గలుపుము...”
“మన హనుమడు సాధించిన
మరో మహాద్భుతమిది!” అని
సకల భూతములు ప్రీతిగ
సంతసించి
ప్రస్తుతించె!
ఆకసమందెల్ల ఎడల
'హనుమంతుడు గానవచ్చె!
అతడట్లైగురుటను జూచి
అచట 'సింహక' యను రాక్షసి
తన నోటిని దెఱిచి చాచి
తనువు మేఘగర్జన జేసి,
కామరూప ధారిణియై
కపివర్యుని వెంబడించె!
రాక్షసి దేహమున జొచ్చి
రగడి నఖములను గుచ్చి
ఆయువు పట్టులను చీల్చి
ఆకసమున కెగసెయోధ!
గగ్గతిల్లి గుండెలదిరి
గతి తప్పి నీట బడెను
సింహిక!
పవనసుతుని చేతి చావు
పర బ్రహ్మ నిర్ణయించెనట!
మారుతిచే చంపబడిన
మాయల రక్కసిని గాంచి
గగన చరులైన భూతములు
గారముతో మరొక సారి
సింహకా మర్దనునితో
సింహవలోకనము చేస్తూ,
“మహాత్ముడా! నీవిపుడీ
మహాప్రాణిని హతమార్చి
ఎదురు లేని ఘనకార్యము
నింపుగ సాధించితి వయా!
నిజధైర్యము, సూక్ష్మదృష్టి,
నిశితబుద్ధి, సామర్థ్యత,
ఎవని కుండునో ఆతడు
ఎంతేని సాధింప గలడు!”
గగన చరులచే ఘనతగ
గౌరవింపబడి మారుతి
కార్య నిర్వహణ పరుడై
కదలి కదలి కడలిపైన
'నూరు యోజనముల కవల
నూత్న వనశ్రేణిగాంచె!
మహాసాగరపు తటిలో
'మలయ పర్వతాగ్రమందు
వివిధ దృమ భూషితమై
వింత వింత సొగసు లలరు
నానాలంకృత దృశ్యము
నతడు గాంచె నభము నుండి!
సాటిలేని బలవంతుడు
సముద్ర లంఘనమున దిట్ట
మహా వేగ దీపితుడగు
మహానుభావుడు మారుతి...
లవణాకరములను దాటి
లంకా నగరికి చేరెను....
***
||om tat sat||
___________________________________________________________________________
