Sankshipta Sundarakanda - A Telugu Poem

By Padmashri Elchuri Vijayraghavrao


సీతారావణ సంవాదము
Select Transliterated text in Devanagari or English

ప్రాత:కాలము...
పావన ఘడియలు...
పవనసుతుడు గనె
పంజన దృశ్యము!

షడంగ వేద విదుషులైన అసురులు
సౌమ్యముగ చేసిరి వేదఘోష!
మనోజ్ఞ మంగళవాద్య ధ్వనులతో
మహాబలుడు “దశకంఠుడు”
మేల్కొని
దాస దాసీలు స్తుతించగా, ఆ
దానవేశ్వరుడు వనమునకు జేరెను....

భూషణోత్తమ భూషితుడై
భూయిష్టమైన ప్రకాశముతో
రూపయౌవన సంపన్నుడైన
రాక్షస రాజును చూడగనే
కఠోర వాయుఘాత మొందిన
కదళీఫల వృక్షము వలె
రాజపుత్రిక సాధ్వి జానకి
రవరవము కంపించ దొడగెను...

నిత్య పతివ్రతా తపస్వినికి
నిరానందమైన దీనగతి!

మధుర భాషణలతో సీతకు
మనోభీష్టమును తెలిపె
రావణు డిట్లు

“విశాలాక్షీ! వివేకవతీ!
విమల విశృత మనోరాజ్జీ!
సుందరీ! నిను మోహించితి
ప్రియా!
అందముగ నన్నంగీకరింపుము...
భ్రాంతిని విడువుము...
భార్యవగుము...
అపహరించి నేతెచ్చిన
అతి శయ సుందరీమణుల
కగ్రేసరురాలవైన అతివవు!
నా రారాజ్జిగ నర్పించెద సర్వస్వము...

నన్నెదిరించి నిలువగల
నాధుడీ లోకమున లేడు;

జగత్సర్వమును జయించి
జనకుడు నీ పితకిచ్చెద;
విలాసవతీ! సీతా!
వినుమిక నా విన్నపమును”

గడుసరి దానవుని ముందు
గడ్డిపోచ నొకటి పెట్టి
పవిత్రమంద హాసముతో
పలికెనిట్లు సీతా దేవి

“రాక్షసా! రావణా!
రాకొట్టు అవినీతి...
సత్పురుష నియమమును
చక్కగా గమనించు...

నీ భార్య నెటుల నువు
నిరతి రక్షింతువో
పంతముగ పరులు తమ
పడతులను కాపాడుదురు...

నియతి గల మనసుతో
నీవు సత్తముడవై
నను రామునికి సమర్పించు మిక
శుభమగును....

మాట తప్పిన ఎడల
మరణమే తథ్యమగు....

వజ్రాయుధము నిన్ను
వధించక పోయినా
యముడు నినుగొనిపోక
క్షమజూపి వదిలినా,
వీరరాఘవుడు నిను
విడువడని తెలుసుకో...

కుబేర వరుణుల శరణాగతి నీ
కుళ్ళు అసువులను రక్షింప జాలదు...
ఆశనిపాత మావిర్భవించిన ఎడ
ఆగదు మహావృక్షమైనా, ఆధాటికి...

రాక్షస రాజా! నిస్సందేహము,
రాముని బారికి తాళలేవు నువు”

ప్రియదర్శిని జానకి పలికిన
పరుష వాక్యములు వినిన రావణుడు
“మైథిలీ! ఇట్టి వాగ్బర్బరతకు
మరణమే నీకు ప్రాయశ్చిత్తము...

గడువిక రెండు మాసములు ముడియగనే

కాంతా! శయనించవలెను నాతో;
పతిగా నను వరింపని ఎడల నిను
ప్రాతఃకాలము చంపి వండెదరు!”

శతృభంజనుడు రాక్షసరాజగు
రావణుడిట్లు వైదేహితో జెప్పి,
అచటి భయంకర రాక్షసస్త్రీల
నందరినీ తను ఆజ్ఞాపించెను

“రక్కసులారా! జానకి ఎదలో
రాగానురాగ మంకురించవలె;
సామ దాన భేద దండములతో
సాధించి వశము జేసుకొనుడిక”

క్రోధ భరితులై రాక్షసవనితలు
కర్మశముగ
జానకిని నిందించిరి
“పులస్త్య ప్రజాపతి వంశములో
పుట్టిన ఉత్తమోత్తముని సతివై
అనుపమ సుఖసంపదలను పొందుట
అతిఘనమని నీకేల తోచద”ని
అరమరలు తెలిపి
ఆక్రోశించిరి!

“ముల్లోకములందలి సంపదలకు
ముకుటము పట్టిన రావణేశ్వరుని
ముదముగ భర్తగ గైకొని జగమున
మురిపెముగా జీవించవలె”
ననిరి....

రాక్షసస్త్రీల తర్కము నెఱింగి
రాలిన కన్నీరు తుడిచి, జానకి
“దీనుడైనను, రాజ్యహీనుడైననుగాని
ధీమంతుడగు రాముడే నాకు
అధిపతి....

సూర్యపుత్రి సువర్చలపై
సుముఖుడైన హనుమ పోలె
రామానురాగమే
రమ్యమగు నా ఆత్మకు”

విశాలాక్షి సీతాదేవి నపుడు
వికృత రాక్షసాంగనలు పీడించగ,
శిథిల హృదయ భారము సహించుచూ
శింశుపాక వృక్షము దరి
జేరెను....

***


||om tat sat||

___________________________________________________________________________