Sankshipta Sundarakanda - A Telugu Poem
By Padmashri Elchuri Vijayraghavrao

సీతాన్వేషణ
రామ కార్య నిరతుడైన
భీమబలుడు, క్షణము నిలిచి,
లక్ష్యసాధనార్థము తగు
లక్షము భావించ దొడగె
“పరమ జటిల పటిమ తోడ
పరుల కంట బడకుండా,
రాత్రి
సూక్ష్మరూపు దాల్చి
లంకాపురి జేరవలయు....
దుష్ప్రవేశ నగరిలోన
దుమికి
నిశీధినందు
సకల గృహములందు వెదకి
సందర్శింతు జానకిని”
రమ్యాలంకృతమై బహు
రత్నఖచిత వసనములతో
“సుందరి” వలె లంకాపురి
'సుదూరమున వెలుగుచుండె!
భవనాంతర దీపమాల
భవ్య భాసమాన మగుచు
చీకట్లను పారదోలి
చిందులాడె అందమచట!
'ప్రబలబలుడు పవనసుతుడు
నగరి ప్రవేశించగనే
స్వేన రూప ధారి - “లంకిణి”
హీనమైన దృక్కులతో
గర్జిస్తూ కోపిస్తూ
అగ్ర భాగమున నిల్చుని అడిగె ప్రశ్న
కపివర్యుని
“వనచరుడా! ఎవరు నీవు?
వచ్చిన పని చెప్పు త్వరగ...
నీ ప్రాణము పోక ముందు
నిజము తెలియ జెప్పు మాకు”
“ప్రేక్షణీయమైన నగరిని
ప్రేమతో వీక్షించ వచ్చితి....
మేలైన ప్రాకారములతో
మేటి నగరి గదా, లంక!
కనుల పండుగగా నేను
కన వలెనని కుతూహలము”
అంత, లంకిణి భయావహయై
అదురు సింహనాదము సల్పి
వాయు వేగమున తలపడి
వానరేంద్రుని కొట్టెను!
కదన ధ్వని ప్రతిధ్వనిగ
కపిసింహము గర్జిస్తూ
పిడిబిగించి ఎడమ చేత
పిప్పి పిప్పిగా బాదెను!!
తాళలేక దిమ్మదిరిగి
'నేలబడెను వికృత వనిత!
గర్వముడిగి కంపిస్తూ
గద్గద స్వరమున బలికెను
“ఘనశూరా! జాలిగొనుము....
కపివర్యా! కాపాడుము...
పూజ్యుడైన బ్రహ్మ నాకు
పూర్వమొక వరదాన మిచ్చె
“నిన్నొక వానర వీరుడు
నిలువున లోబరుచుకొనును...
ఏ దినమది జరిగినదో
అక్షణమున రాక్షసులకు
అమితమైన కీడు మూడు...
అదితథ్యము.... బ్రహ్మావాక్కు....
అందుకు తిరుగుడే లేదు...
నీదర్శన భాగ్యముగా
నా వరము ఫలించిన దిక
రావణరక్షిత నగరికి
రా గోరెద మహాశయా!
వాంఛిత కార్యము లన్నీ
వలయు విధి
నెఱవేర్చు కొనుము”
కామరూపమును దాల్చిన
కామిని - లంకానగరిని,
విక్రమ తేజస్వి హనుమ
విజయ వంతముగ జయించి,
నిజబాహువు శక్తి పెంచి
నిశి, ప్రాకారములు దాటి
సుగ్రీవుని హితము కొఱకు
సూటిగ నే తెంచనటకు...
శతృవు తలపై మొత్తిన
శస్త్రమువలె, కపివర్యుడు
మొట్ట మొదట ఎడమకాలు
మోపెనా ధరిత్రి మీద....
వివిధమైన ఆకృతిగల
వింత వింత భవనములను
ఒకటి వెంట మరి యొక్కటి
వెదకి వెదకి గాలించెను....
సీతా దర్శనమునకై
సీమితమైన మనస్సుతో
అందమైన సుందరాంగు లెందరినో జూచె,
కాని,
అనన్య సౌందర్యవతి
అతుల సదాచారముల ఖని,
రావణ సంహరణార్థము
రాజిల్లిన సతి “జానకి”
నెందెందు వెదకిననూ
సందర్శింప లేక పోయె!
ఊరి కోన కోనల గల
ఉద్యానము, ప్రాకారము,
ప్రహస్త, మహాపార్వ్యులుండు
ప్రభుత్వ ప్రాగారములు, మరియు
కుంభకర్ణ విభీషణుల
గృహ, శయనాగారములను,
ఆవంతయు భయము లేక
అతడింటింట వెదకెను!
మహాబలుడు మారుతిటుల
మర్మములను శోధిస్తూ
రాక్షసేంద్రుని అంత:పురమున
రాణించు మందిరములు గాంచెను...
వజ్రవైఢూర్య భరితమైన
వర వర్ణపు గవాక్షములు
వర్షబుతువు మెరుములతో
వయ్యారపు మేఘమాలలై,
వివిధ విహంగము లచ్చట
వింత శోభ నలరించెను!
ఇంద్రసభను తలదన్నిన
ఈ భవనములో మధ్యన
వజ్రఖఛిత బారులతో
అలంకరించిన విమానమును
ఆంజనేయుడు తిలకించెను!
దేవశిల్పి విశ్వకర్మ
దేదీప్యమానముగా
సృష్టికర్త బ్రహ్మకొఱకు
సృజియించిన
“పుష్పక” మది!
అనంతరము కపివర్యుడు
అద్భుత దృశ్యముగాంచెను!
నానావర్ణాంబరముల
నాణ్యమైన వేష భూషతో,
పుష్ప మాలికలు ధరించి
పుత్తడి బొమ్మలవలె మెఱిసెడి
సహస్ర వర నారీ మణుల
'సమూహమట, సుందరముగ
రత్నకంబళములపైన
రాజిల్లిన దృశ్యమది!
కులీనులా సుందరీ మణులు,
కృత్యమెఱిగిన ధర్మపత్నులు.
'సవ్యముగా రావణునికి
సర్వోప చారములు చేయుదురు.
అపేక్షించ దగని వారు
అతని భార్యలలో లేరు.
“సీతమాత మాత్రము ఈ
స్ర్రీలకన్న ఉత్తమురాలు...
దుర్‌వృత్తుడు రావణుడెంత
దుష్కృతమును సల్పెనో!” అని
పవనసుతుడు పరితపించె!
స్ఫటిక నిర్మిత రత్న భూషిత
ప్రముఖ సౌధము
శయన గృహమది....
ఇంద్ర శయనాగారమును బోలె
ఇంపైన పడక గది
రావణునిది.....
తటిల్లతల వంటి కాంతి
తనువు స్వర్ణ వర్ణ మయము,
అంత:పురమునకు రాణి
అందగత్తె “మండోదరి”.
పరాక్రముడు పవనసుతుడు
పరాకుగా గమనిస్తూ
ఆ యౌవన సంపన్నను గని
“ఆమెయే సీతియ"ని భావించి
హర్షితుడై ఉప్పొంగెను!
క్షణ భంగుర సంతసమది!
క్షతమైనది మదిలో భ్రమ”
“రామ వియోగము పొందిన
భామిని - మహాసాధ్వి సీత
ఆహార నిద్రా పానీయము లం
దాసక్తి చూపదు.....
ఈమె మండోదరి;
సీత కాదు.....”
మారుతి చింతింప
దొడగె
పతివ్రతా దర్శనమునకు
'పవనసుతుడు తహ తహ పడె!
అన్వేషణ సాగిస్తూ
ఆంజనేయుడా భవనమున
అంత:పుర లతాగృహము,
అచ్చట గల మందిరముల
నన్నిటిలో వెదకిననూ
ఆమె మాత్రమగుపడ లేదు!
'విరూపులూ, కురూపులూ,
వివిధాకృతులుండి రచట...
కాని,
సీత కానరాదు!
అనన్య సౌందర్యవతులు,
అలరారు గంధర్వ వనితలు....
కాని,
సీత కానరాదు!
పూర్ణ చంద్ర ముఖులై
సుశ్రోణులైన నాగాంగనలు...
కాని,
సీత కానరాదు!
రావణుడు దేవతలను మర్దించి
రాక్షసత్వముతో దెచ్చిన
దేవ కన్యలచట గలరు....
కాని,
సీత కానరాదు!
రతనపు జానకిని గానక
రావణుని మందిరము నుండి వెడలి
తపించిన మనస్సుతో
తనలో తను చింతించెను
“మఱల మఱల లంక యందు
మాత సీతను వెదకెదను;
నేను సీతను చూడనిదే,
పోను రిక్త హస్తుడనై....
నామూలముగ వానరులకు
నాశనము కలుగకుండు గాక...
ఎందరో మహాను భావులందరికి
నమస్కరింతు.....
శ్రీరామ లక్ష్మణులకును,
సీతా దేవికి మొక్కెద....
రుద్రునకును, ఇంద్రునకును,
యమునికి, వాయుదేవునకు,
రూఢిగ ప్రణమిల్లి నేను
రువ్వున ముందడుగు వేతు...
అదిగదిగో
దృమశోభిత
అశోకవనవాటిక! అట
వెదుకలేదు గాన, నేను
వెళ్ళి ప్రయత్నించెద” ననె...
అంత:పురి వదలి హనుమ
అశోకవనమున కేగెను.....
తరుణాంకుర పల్లవములు,
తలిరుచు పుష్పగుచ్ళములు గల
శింశుపాక వృక్ష మెక్కి
“శ్రీరాముని వియోగమున
సీత దు:ఖపీడితయై
ఒకచో నిలువక ఇటునటు
ఒందిలితో సంచరింప
తాను చూడగల” నను కొని
తాపత్రయ పడె నాతడు.....
పరిపరివిధముల చింతలు
పరి గొనిగొని పవనసుతుడు
జానకి ఆగమనమునకు
జాగ్రముగా వీక్షిస్తూ
శింశుపాక వృక్షముపై
శిరమును దశదిశలు తిప్పి
దట్టమైన లతాపుప్పదరిని దాగి
వేచి యుండె....
వనములోన సుదూరమున
ఒక యువతిని గాంచె నతడు....
మాయ రక్కసుల మధ్యన
మలిన వస్త్రములు ధరించి,
ఉపవాసముచే కృశించి
ఉత్తలపడు దీనురాలు!
శుక్లపక్ష చంద్రుని వలె
శుష్కించిన నిర్మలాత్మ!
సువ్విశాల నేత్రద్వయి
సుడిబడి మలినమై తపించు
సుదతిని చూడగనే
హనుమ
“సంతప్తురాలైన ఈమె
సతి సీతయే” నని ఊహించెను...
“శ్రీరాముని కీమె ప్రాణము...
ఈమెకు రాముడే దైవము...
మగ్నమైన మనసులతో
మహావియోగమును భరించి
ప్రభువు రాముడింతవరకు
బ్రతికి యుండు టాశ్చర్యమే!”
“జానకికై శ్రీరాముడు
జగతి ముల్లోకముల గూల్చి
తాఱు మాఱు జేసిననూ
తగునని యే దోచుచున్నది!”
సీతా దేవిని కనుగొని
సిక్తమైన ఆనంద బాప్పములతో
శ్రీరామ లక్ష్మణులకు శ్రద్ధగ
స్వీయ నమస్కృతులర్పించి
హనుమ
శింశుపాకముపై రహస్యగతి
శిరము వాల్చి పరికించు చుండె....
***
||om tat sat||
___________________________________________________________________________
