Sankshipta Sundarakanda - A Telugu Poem
By Padmashri Elchuri Vijayraghavrao

త్రిజటా స్వప్నము
Select Transliterated text in Devanagari or English
పలుపలు విధములు భయంకరముగా
పరుష వాక్యములు బలికి రక్కసులు
పరిపరి సీతను బాధించుట చే
భరించ నేరక ఆక్రందించెను....
“ 'మల మల' శోకాగ్నిలో మగ్గితినిక
మరణించుటయే మదీయ శ్రేయము;
రాక్షస యువతుల బంధనము వీడి
రాముని కడ జేరుట దుర్లభతమము.....
పాపాత్మురాల, ననార్యురాలను,
ప్రాణసఖుని విడిచి బ్రతికి యుంటినిట!
క్షమ నశించినది. నిస్సందేహము,
క్షణ కాలమైన బ్రతుకకూడ దిక.....
రాక్షసులారా! హతమార్చుడు. నను
రంపియతో ఖండించి భక్తించ
రండు! నేను సిద్ధముగ నుంటి నిట
రాముని విడిచి జీవింపజాలనిక.....
రఘుకుల తిలకుడు రాముడు నేనిట
లంకలో నుంటినని తెలిసినచో
రౌద్రుడై, ధనుర్ధరుడై జగమున
రాక్షసులే లేనట్లొనరించును....
భర్త మరణమున కసురలు నావలె
భగ్నహృదయులై ఆక్రందింతురు....”
భయంకర స్త్రీలు
జానకిని చుట్టి
పరుషముగా పలుకుచునేయుండిరి
“దుష్టురాలవగు ఓ సీతా! నిను
దుర్గతిపాలు జేసెదరు. తృటిలో
నిన్ను చంపి, నీ మాంసమును వీరు
నిరతి రుచికరముగ భక్షింతురు”
వృద్ధరాక్షసి “త్రిజట”
కృద్ధులై వర్తించు
రాకాసి వనితలను
రాకొట్టి ఇట్లనెను
“దుష్ట వనితలారా! ఈ జానకి
ద్యుతిగల జనకరాజ పుత్రిక;
దశరథ మహారాజునకు కోడలు....
భక్షించ దలతురా?!
అన్యాయము!
బదులుగ మిములను
మీరేతిని వేయుడు...
దండి నిద్రలో మేల్కొనిన నేను
దారుణమైన స్వప్నమును గంటిని...
రాక్షస వినాశ కారకమై, శ్రీ
రాముని విజయ సూచకము, ఆ కల....”
కల ఎట్టిదో
కౌతుకముగ
అసుర లాలకించ దొడగిరి
“అంబుధి మధ్యన
అదొక పర్వతము...
ఆ నగము పైన
ఆసీన సీత
సూర్య కాంతి తన అధిపతి
సూర్యుని కడ కేగినట్లు
తెల్లటి వస్త్రములు గట్టి
ఆ తెల్లటి నగము మీద
శ్రీరాముని సాన్నిధ్యము
సీతకు ప్రాప్తించిన కల !
ఐరావతమును పోలిన
అందమైన హత్తి నెక్కి
రయముగనట విహరించెడు
రామలక్ష్మణుల జూచితి !!
పావనమగు స్వర్గసీమ
పాతకులకు దుస్సాధ్యము...
అటులే రామునిపై జయ
మలవి గాదు రాక్షసులకు...
ఓ రాక్షస స్త్రీ లారా!
ఓపిక తో వినగోరెద...
ఘోర విపత్తికి గురియై
గోరుగింతయగు నిచ్చట...
నమస్కరించి, సతి సీతను
నమ్రతతో వేడుకొనుడు;
ఆదట గల జనక పుత్రి
ఆపదలను తొలగించును”
ఇట సీతాదేవి
అరణ్యరోదన....
భయంకరుడు రావణుని పలుకులకు
'భయ విహ్యలయై రక్కసుల నడుమ
నిర్జన వనమున అతి వంటరిగా
నిలిచిన బాలికవలె విలపించెను!
“అయ్యో! రాక్షసుడిచ్చిన గడువిక
అతివేగముగ ముగిసి పోవనున్నది!
ప్రబల పాతకమునకు రాజాజ్ఞగా
ప్రాతఃకాలము మరణ శిక్షగాను
చోరునివలె చెల్లచెదిరినది మది....
హా! రామా! లక్ష్మణా! సుమిత్రా!
హా! కౌసల్యా! హా! భూమాతా!
నౌక సుడిగాలిలో సాగరమున
నశించినట్లు సుడిబడినవి.
అసువులు.....”
దుర్భరమగు దుఃఖభారము వహించి
దురటిల్లుచు, రాముని ధ్యానించుచు,
శీర్ణమైన దేహముతో జానకి
శింశుపాక వృక్షము కడ కూర్చుని
పరితాపముతో మతి చలించి
పరిపరి విధముల యోజించడొడగె.
తన జడతో ఉరి పోసుకుని
తాను తరలి యముని కడకేగ వలెనట!!
చితికిన మది చిందగొని
చింతించుచు దైన్యముతో
శింశుపాక వృక్షము కడ
శీర్ణించిన వైదేహికి
“శ్రీమంతుడైన అధిపతిని
సేవించెడు భృత్యుల వలె
శుభశకునములు చుట్టముట్టి”
సుఖము కించు
కలిగించెను!
ప్రామాణికము లైన అట్టి
ప్రసిద్ధమగు సూచనలంది
దైవదత్తముగ సీతకు
ధైర్య స్థైర్యము లబ్బెను....
***
***
||om tat sat||
___________________________________________________________________________
